అలనాటి అపురూపాలు- 188

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

‘సంతోషీ మా’గా గుర్తింపు పొందిన అనితా గుహ

అనితా గుహ హిందీ చలన చిత్రాలలో పౌరాణిక పాత్రలను పోషించడంలో ప్రసిద్ధికెక్కిన నటి. ఆమె 1932లో కోల్‌కతాలో జన్మించారు. పదిహేనేళ్ల వయసులో, ఒక అందాల పోటీలో పాల్గొనేందుకు ముంబైకి వెళ్ళారు, తరువాత అక్కడే ఉండి సినీ పరిశ్రమలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

బెంగాలీ చిత్రం ‘బన్షేర్ కెల్లా’ (1953)తో ఆమె మొదటి సినిమా. రెండు సంవత్సరాల తరువాత, ఆమె తన మొదటి హిందీ చిత్రం ‘టాంగేవాలీ’ (1955)లో నటించారు. ‘శారద’ (1957) వంటి చిత్రాలతో, తర్వాతి ఐదేళ్లలో స్థిరంగా ప్రజాదరణ పొందారు. ‘సంపూర్ణ్ రామాయణ్’ (1961) చిత్రంలో పోషించిన సీత పాత్ర ఆమె విజయాన్ని మరింత పెంచింది. కొన్నేళ్ల తరువాత, ఆమె ‘ఆరాధన’ (1969) సినిమాలో రాజేష్ ఖన్నా పెంపుడు తల్లి పాత్రలో నటించారు, తన నటనకు మంచి ప్రశంసలు పొందారు.

అనిత ప్రసిద్ధ నటుడు మాణిక్ దత్‌ను వివాహం చేసుకున్నారు. మాలా సిన్హా, హెలెన్‌తో సహా తన సమకాలీన నటీమణులతో స్నేహాన్ని పెంచుకున్నారు.

అయితే, అనితా గుహ టైటిల్ పాత్ర పోషించిన పౌరాణిక చిత్రం ‘జై సంతోషి మా’ (1975) ఆమెకెంతో పేరు తెచ్చింది. ఈ సినిమాలో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించారు. లో-బడ్జెట్‌తో రూపొందించినా, పెద్ద స్టార్‍లు లేకపోయినా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్యంగా ఉత్సాహభరితమైన స్పందన లభించింది, 1975లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి, ప్రధాన నటి అనితా గుహకి ప్రేక్షకుల నుంచి అమితమైన గౌరవం లభించింది. కొందరు ప్రేక్షకులు థియేటర్లలోకి రాకముందే తమ షూలను కూడా తీసివేసేవారు, గౌరవసూచకంగా! ఆ రోజుల్లో, సరిగ్గా తినడానికి కూడా సమయం లేనంత తీరిక లేని షెడ్యూల్ ఉండేదామెకి. స్వయంగా ఆ దేవత యొక్క భక్తురాలు కానప్పటికీ, ఈ చిత్రంలో నటించడాన్ని ఒక పవిత్ర అనుభవంగా భావించారు అనిత. ఈ సినిమాలో తన పాత్ర చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఆమె ఉపవాసం ఉన్నారు.

‘కవి కాళిదాస్’ (1959), ‘కృష్ణ కృష్ణ’ (1986) అనే సినిమాలతో సహా అనితా గుహ అనేక ఇతర పౌరాణిక చిత్రాలలో నటించారు. అయినా ‘జై సంతోషి మా’ (1975), ‘సంపూర్ణ్ రామాయణ్’ (1961) అనే రెండు సినిమాలు ఆమెకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగిన కెరీర్‌లో అరవైకి పైగా చిత్రాలలో నటించారు అనితా గుహ.

అనితా గుహా, మాణిక్ దత్ దంపతులకు పిల్లలు పుట్టలేదు. అందువల్ల తరువాతి కాలంలో ఓ పాపని దత్తత తీసుకున్నారు. భర్త మరణం తరువాత, ఆమె ముంబైలో ఒంటరిగా నివసించారు. అనితా గుహ నటి ప్రేమ నారాయణ్‌కి పెద్దమ్మ. ప్రేమ అనురాధ గుహ సోదరి కుమార్తె.

చిన్నతనంలో, పాఠశాలలో చదివే రోజులలో, అనితా గుహ ముఖానికి మేకప్ చేసుకోడానికి చాలా ఇష్టపడేవారు. టాల్కమ్ పౌడర్‌ను చాలా మందంగా రాసుకుని, లిప్‌స్టిక్‌ను పూసుకునేవారు. కళ్లకు దట్టంగా కాటుక పెట్టుకునేవారు. ఈ విషయంలో ఆమెకి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మందలించినా, ఆమె పట్టించుకోలేదట. బాధాకరమైన విషయం ఏంటంటే, చివరి రోజుల్లో ఆమె ముఖంపై తెల్లటి మచ్చలు వచ్చాయట. వాటిని కవర్ చేయడానికి ఆమె హెవీ మేకప్‌ని వాడారు. అయితే కొద్ది రోజులకే – చిన్నతనంలో తాను అమితంగా ఇష్టపడిన మేకప్‌ను ఆమె అసహ్యించుకోవడం ప్రారంభించారు.

ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో జూన్ 20, 2007న మరణించారు. ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “జనాలు నా అసలు పేరు మర్చిపోయారు.. నేటికి కూడా నేను వీధుల్లోకి వెడితే నన్ను ‘సంతోషి మా’ అని పిలుస్తుంటారు” అంటూ ‘సంతోషి మా’ పాత్ర తన దైనందిన జీవితంలో చూపిన శాశ్వత ప్రభావాన్ని గురించి చెప్పారు.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here