అలనాటి అపురూపాలు- 193

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

హాలీవుడ్ నటి లానా టర్నర్, ఆమె కుమార్తె చెరిల్ క్రేన్:

అందాల హాలీవుడ్ తార లానా టర్నర్ జీవితం – ఆమె కుమార్తె చెరిల్ క్రేన్ కారణంగా – 1958లో ఓ మలుపు తిరిగింది.

ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ, టర్నర్ తన ప్రేమ జీవితం కారణంగా సినీ కెరీర్‍లో ఎన్నో పతనాలు చూశారు. దాదాపు 17 ఏళ్ళ పాటు ఎం.జి.ఎం. సంస్థలో స్టార్‍గా వెలుగొందిన టర్నర్ సినిమాల్లోనే కాకుండా టీవీ రంగంలోనూ రాణించారు. The Postman Always Rings Twice (1946), Peyton Place (1957) వంటి సినిమాల్లోని ఆమె పోషించిన పాత్రలు ఆమెని ప్రేక్షకులకి చిరపరిచితురాలిని చేశాయి. అయితే కాలం అన్నిసార్లూ కలిసి రాదు. ఆమెకి వరుస ఫ్లాప్స్ వచ్చాయి. ఎంజిఎం.తో కాంట్రాక్ట్ ముగిసింది. టివీ ప్రవేశం, పైగా థియేటర్ చైన్ సిస్టమ్‍పై అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వల్ల హాలీవుడ్ ఎన్నో నష్టాలకు గురయింది. టర్నర్ కెరీర్ ముగింపుకి వచ్చింది. ‘నైట్‌క్లబ్ క్వీన్’గా పేరు గాంచిన టర్నర్ – చాలా మందితో ప్రేమలో పడ్డారు. ఏడుగురిని వివాహం చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలనేది ఆమె స్వభావం. రెండో భర్త స్టీవ్ క్రేన్‍కీ, టర్నర్‍కి చెరిల్ క్రేన్ అనే కూతురు ఉంది. చెరిల్ మాత్రం తల్లిలా పార్టీ గర్ల్ కాదు. కూతురిని టర్నర్ ఎప్పుడూ పర్యవేక్షణలో ఉంచేవారు.

 

టర్నర్ తన నాల్గవ భర్త లెక్స్ బార్కర్‍కి విడాకులిచ్చాకా, ఆమెకి జాన్ స్టోంపనాటో పరిచయం అయ్యాడు. అప్పుడామె వయసు 38. స్టోంపనాటో ఆమెని ప్రేమిస్తున్నానని చెప్పి పూలు పంపేవాడు. తనకో గిఫ్ట్ షాప్ ఉందని, తానో వ్యాపారవేత్తననీ, తన వయసు 43 సంవత్సరాలని స్టోంపనాటో టర్నర్‍కి చెప్పాడు. తనకి పరిచయం ఉన్నవారికి స్టోంపనాటో బాగా తెలిసినవాడై ఉండడం వల్ల, అందగాడు కావడం వల్ల టర్నర్ అతని ప్రతిపాదనకి అంగీకరించారు. ఆమె దురదృష్టం, ఆమె ఉమ్మడి మిత్రులను అతడి గురించి అడగలేదు. హాలీవుడ్‍లోని కొందరు మిత్రులకు స్టోంపనాటోని పరిచియం చేయగా, వారు అతను కరడుగట్టిన నేరస్థులతో పని చేస్తాడని గుర్తించారు. వాళ్ళు చెప్పిందే నిజమైంది. స్టోంపనాటో నేరస్థులతో కలిసి పనిచేయడమే కాకుండా, లాస్ ఏంజిలిస్ లోని గాంగ్‍స్టర్ మికీ కోహెన్‍‍కి బాడీగార్డ్‌గా పనిచేశాడని తెలుస్తుంది. టర్నర్ అతడిని నిలదీస్తే, “చెప్పేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు” అన్నాడట. స్టోంపనాటో మోసం చేసినా, టర్నర్ మాత్రం అతనికో అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంలో ఉన్నారు.

 

ఆరు నెలల పాటు డేటింగ్ చేశాకా, టర్నర్ తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ హాలీవుడ్‍లో సౌకర్యాలను పొందాడు స్టోంపనాటో. అంతే కాదు, సినిమాల్లో తనకీ అవకాశాలు కల్పించమని, ముఖ్యంగా నిర్మాతని చేయమని టర్నర్‍ని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. కానీ టర్నర్‍ లొంగలేదు. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా ఉంచడం ఆమెకి తెలుసు. అందువల్ల అతన్ని తన పనిలో జోక్యం చేసుకోనివ్వలేదు. గాంగ్‍స్టర్ నేపథ్యం ఉన్న స్టోంపనాటో – టర్నర్‍ని శారీరికంగా వేధించాడు. సూటిపోటి మాటలతో మానసికంగా హింసించాడు. పైగా, Another time Another Place అనే సినిమాలో తోటి నటుడైన సీన్ కానరీతో ఆమెకి సంబంధం ఉందన్న పుకార్లను విన్నాడు. దాంతో, షూటింగ్ జరుగుతున్న ఇంగ్లండ్‍కు వెళ్ళి ఆమెతో గొడవపడ్డాడు. సీన్ కానరీని కూడా బెదిరించే ప్రయత్నం చేయగా, ఆయన స్టోంపనాటోని లొంగదీసుకుని, పోలీసులకి అప్పజెప్పారు.

 

తర్వాత కొంత కాలానికి టర్నర్ – స్టోంపనాటోలు రాజీపడి కలిసి ఉండసాగారు. చెరిల్‍కి స్టోంపనాటో పరిచయమయ్యేటప్పటికి ఆమె వయసు 13 ఏళ్ళు. అమ్మ మాజీ భర్తల్లా స్టోంపనాటో చెరిల్‍తో మంచిగా మాట్లాడలేదు. అంటీ ముట్టనట్టుగానే ఉండేవాడు. అయితే రొవెనా అనే మగ అరేబియన్ గుర్రాన్ని చెరిల్‍కి కానుకగా ఇచ్చాడు.

తనని నిర్మాతని చేయమన్న అతని కోరిక మళ్ళీ తలెత్తింది. టర్నర్ కాదన్నారు. ఈసారి వేధింపులు తీవ్రతరమయ్యాయి. టర్నర్, స్టోంపనాటో మెక్సికోకి వెళ్ళి కొన్ని రోజులు సరదాగా గడిపారు. అదే సమయంలో టర్నర్‍కి కెరీర్‍కి ఊపొచ్చేలా – Peyton Place సినిమాకి ఉత్తమ నటిగా ఆస్కార్‍ అవార్డులకి నామినేట్ అయ్యారు. ఆ వేడుకకి తన తల్లిని, కుమార్తెని తీసుకువెళ్తానని టర్నర్ చెప్పడంతో స్టోంపనాటోకి కోపం వచ్చింది. హింసాత్మకంగా మారిపోయాడు. పోలీసులకి చెప్పమని చెరిల్ తల్లిని కోరినా, టర్నర్ – ఒప్పుకోలేదు.

 

అయితే 4 ఏప్రిల్ 1958 నాడు బెవర్లీ హిల్స్ లోని టర్నర్ ఇంటికి వచ్చాడు స్టోంపనాటో. అదే సమయంలో బోర్డింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది చెరిల్. ఆ రాత్రి తన తల్లి, స్టోంపనాటో – తల్లి బెడ్ రూమ్‍లో గొడవ పడడం వింది చెరిల్. స్టోంపనాటో తల్లిని విపరీతంగా భయపెట్టడం వింది. టర్నర్ అమ్మకీ, చెరిల్‍కీ ప్రమాదం కల్పిస్తానని బెదిరించాడు స్టోంపనాటో. ఇవన్నీ వింటున్న చెరిల్ వంటింట్లోకి వెళ్ళి ఓ చాకుని తెచ్చుకుంది. వెళ్ళి ఆ గది ముందు నిల్చుంది. గదిలో గొడవ పెద్దదై, టర్నర్ తలుపు తీసుకుని పరిగెత్తుకు వచ్చి, కూతురు వెనకాల దాక్కుంది. ఆమెని వెంటాడుతూ వస్తున్న స్టోంపనాటో- చెరిలో చేతిలోని చాకుని చూసుకోలేదు. అది అతని పొట్టలోకి బలంగా దిగింది. అనూహ్యమైన ఆ ఘటనకి అతను బిత్తరపోయాడు. మెల్లిగా చాకుని బయటకి లాగాడు. కానీ అప్పటికే నష్టం జరిగి పోయింది. ఆ గాయం గట్టిదై నేల కూలాడు, అతనికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. తల్లీకూతుర్లు ఇద్దరూ బాగా భయపడిపోయారు. తాను చేసిన పని అర్థమయ్యాకా, చెరిల్ చాకుని కిందపడేసింది. “నన్ను క్షమించు అమ్మా” అని అంది. కానీ టర్నర్ మాత్రం స్టోంపనాటోకి కృత్రిమ శ్వాస అందించాలని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. స్టోంపనాటో చనిపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితులలో, చెరిల్ గబగబా పరుగెత్తుకెళ్ళి తన తండ్రి స్టీవ్ క్రేన్‍కి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పింది.

ఈ వార్త బయటకి పొక్కి హాలీవుడ్ లోనే కాకుండా, నేర ప్రపంచంలోనూ సంచలనానికి కారణమయ్యింది. నేరం తన మీద వేసుకోవాలని టర్నర్ ప్రయత్నించినా, కుదరలేదు. చెరిల్‍ని రెండు వారాల పాటు జువైనెల్ హాల్‍కి తరలించారు, పెద్దలపై విచారణ జరిపారు. స్టోంపనాటో చనిపోవడానికి సీన్ కానరీ కూడా ఒక కారణమని (సీన్‍ని ఇష్టపడడం వల్లే టర్నర్, స్టోంపనాటోని కాదనుకుందని అని) నమ్మిన గాంగ్‍స్టర్ మికీ కోహెన్ సీన్ కానరీ అంతు తేల్చాలని భావించడంతో సీన్ కానరీ అజ్ఞాతంలోకి వెళ్ళారు. దాంతో ఆయనకి ఓ సినిమా అవకాశం పోయింది. తన మాజీ బాడీగార్డ్‌ని చంపినవాళ్ళపై పగ తీర్చుకోవాలనుకున్న మికీ కోహెన్ – స్టోంపనాటో ఇంటిలోకి ప్రవేశించి టర్నర్ – స్టోంపనాటోకి రాసిన కొన్ని ప్రేమలేఖలను సంపాదించి – వాటిని వార్తాపత్రికల్లో ప్రచురింపజేశాడు. టర్నర్‍ని ఇరకాటంలో పెట్టాడు.

కోర్టులో కేసు నడిచింది. వాదోపవాదాలు సాగాయి. కేసు కొన్ని రోజులు సాగాకా, ఈ నేరాన్ని justifiable homicide గా పరిగణించి కోర్టు చెరిల్‍ని విడుదల చేసింది. చెరిల్ బాధ్యతని కోర్టు ఆమె అమ్మమ్మకి అప్పజెప్పింది.

కానీ జరిగిన ఈ సంఘటన చెరిల్‍పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రెస్ వాళ్ళు నిరంతరం ఆమెపై నిఘా ఉంచడం, న్యాయపోరాటానికి టర్నర్ ఆస్తులన్నీ కరిగిపోవడం వంటివి పరిస్థితిని దిగజార్చాయి. పైగా చెరిల్ పెరుగుతున్న కొద్దీ – ఆమె ఎవరి దగ్గర ఉండాలన్న విషయంలో తల్లికీ, తండ్రికీ గొడవలు ముదరడం ఆమెని మరింత బాధించింది. అయితే ఆమెకి 18 ఏళ్ళు నిండడంతో స్వేచ్ఛ పొంది, తన బతుకు తాను బతకాలనుకుంది. తాగుడికి, విచ్చలవిడితనానికి అలవాటు పడింది. తనని తీవ్రంగా వేధిస్తున్న గతాన్ని మర్చిపోయేందుకు – ఒకసారి తన అల్మారాలో ఉన్న ఏవో మాత్రల్ని అధిక మొత్తంలో మింగేసింది చెరిల్. మర్నాడు మెలకువ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉందామె. హఠాత్తుగా జీవితం పట్ల ఆమెకి ఆశ కలిగింది. తల్లికి కబురు చేసి సాయం కోరింది. కూతురి సుఖం కోరుకున్న టర్నర్ ఆమెని క్షమించి దగ్గరకు తీసింది. కానీ గతం చెరిల్‍ని వెంటాడింది. Abuse, నిర్లక్ష్యం, హత్యానేరం వంటివి ఆమెను క్రుంగదీశాయి. తను జీవించడం కష్టమని భావించింది చెరిల్. కానీ తల్లి ప్రేమ, తన పట్టుదల – ఆమెకో మార్గం చూపాయి. కష్టపడి తన జీవితాన్ని సరిదిద్దుకుంది చెరిల్. చిన్న చిన్న ఉద్యోగాలెన్నో చేసింది. చివరికి తన తండ్రికి చెందిన చైన్ రెస్టారెంట్‌లలో హోస్టెస్‍గా చేసింది. కార్నెల్ యూనివర్సిటీలో హాస్పిటాలిటీ కోర్స్ చేసింది. తండ్రితో 15 ఏళ్ళు పని చేశాకా, అథ్లెట్, మోడల్ అయిన ‘జోష్’ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆమె జీవితంలో కష్టకాలం ముగిసింది. “మనల్ని మనం అంగీకరిస్తే, జనాలు కూడ మనల్ని ఆమోదిస్తారన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇది నా స్వీయానుభవం” అని చెప్పింది చెరిల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here