అలనాటి అపురూపాలు – 195

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

చక్కని నటి, సౌందర్యరాశి వీణ:

భారతీయ వెండితెరపై అత్యంత అందమైన మహిళ ఎవరని పోటీ వస్తే – అది నిస్సందేహంగా ఇద్దరు నటీమణులు – వీణ, నసీమ్‌ లకే పరిమితం అవుతుంది. పైగా ఫలితం దాదాపుగా సమానంగా ఉంటుంది.

వీణ బలూచిస్తాన్ లోని క్వెట్టాలో (నేటి పాకిస్తాన్) జన్మించారు. వీణాకుమారి అనే పేరుతోనూ చిరపరిచితురాలైన ఈమె అసలు పేరు తాజౌర్ సుల్తానా. ఒకానొక సమయంలో వీరి కుటుంబం లాహోర్‍కి తరలి వెళ్ళి అక్కడ నివసించింది.

ఆమె సౌందర్యం ఎంత గొప్పగా ఉండేదంటే – సర్వశక్తిమంతుడైన భగవంతుడు ఆమెను సృష్టించినప్పుడు చాలా సమయాన్ని వెచ్చించి ఉంటాడని భావిస్తారు. పునరుజ్జీవనోద్యమ కాలపు శిల్పి చెక్కిన కళాకృతిలా ఆమె రూపురేఖలుంటాయి: పరిపూర్ణ నాసిక, ఎత్తైన నుదురు, గులాబీ-రేకల్లాంటి పెదవులు, నిర్మలమైన కళ్ళు! రాజరికం ఉట్టిపడే ఆమె రూపం చుట్టూ ఉన్నవారిలో ఆత్మన్యూనతా భావాన్ని కలిగించేది. తగినంత పొడవు, హుందాతనంతో వీణ భారతీయ రాణిలా అనిపించేవారు.

అందమైన ముఖారవిందానికి తోడుగా అద్భుతమైన స్వరంతో, సంభాషణలు పలికే విశిష్టమైన తీరుతో ఆమె అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఆమె వదనంలో ప్రత్యేకంగా కనిపించేది – ఆకర్షించే నవ్వు. ఆ నవ్వు వల్ల ఆమె ముఖానికే అందం వచ్చేది.

బొంబాయి సినీలోకంలో తారలకు రకరకాల పేర్లుండేవి. మధుబాలను ‘వీనస్ ఆఫ్ ది ఇండియన్ స్క్రీన్’ అని, సైరా బానుని ‘బ్యూటీ క్వీన్’ అని, హేమ మాలినిని ‘డ్రీమ్ గర్ల్’ అని, వీణను ‘మోనాలిసా’ అని పిలిచేవారు.

సౌందర్యవతులను సాధారణంగా రగులుతున్న అగ్నిపర్వతాలుగా పేర్కొంటారు కానీ వీణ మాత్రం ఒక మంచుకొండ లాంటి వారు. ఆమెది టచ్-మీ-నాట్ రకం. యవ్వనదశలో ఆమె రెండు కనుబొమ్మల మధ్య గీత ఒకటి ఏర్పడింది. వీణ నుదురు చిట్లించినప్పుడల్లా అది చాలా స్పష్టంగా కనిపించేది. ఆమె వదనంలోని కాంతి చాలా శక్తివంతమైనది కావడంతో, చుట్టూ ఉన్నవారు కొద్దిగా ఒత్తిడికి గురయ్యేవారు.

వీణది రాజసం ఉట్టిపడే రూపం. ఆమె అందం వరం కాకపోగా, శాపమయ్యింది. అంత అందంతో ఆమె సాధారణ హిందూ కుటుంబపు కోడలి పాత్రలకి ఎన్నటికీ నప్పలేదు, అలాగే పల్లెటూరి యువతి పాత్రను పోషించలేకపోయారు. ఈ రెండు రకాల పాత్రలు లేకుండా హిందీ సినిమా మనుగడ సాగించలేదు.

వీణ పోషించిన విజయవంతమైన పాత్రలన్నీ రాజరికపు పాత్రలు, లేదా పూర్తిగా అహంకారపు, క్రూర పాత్రలు. వ్యక్తిగతంగా ఆమె అత్యంత మర్యాదగల, స్నేహపూర్వక, దయగల మహిళల్లో ఒకరు. ఆమెకు ఎప్పుడూ తానో ‘స్టార్’ అనే గర్వం లేదు. ఆ రోజుల్లో చాలామంది హీరోహోరోయిన్‍లకి ఎఫైర్స్ ఉన్నాయని పుకార్లు వినబడుతుండేవి (ఇది ఒక రకంగా వాళ్ల సినిమాలకు ఉపకరించే ప్రచారం). కానీ అటువంటి వాటికి వీణ ఒక మినహాయింపు. బహుశా ఆమెకి రావల్సినంత పేరు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చని అంటారు

నటుడు – హీరో అయిన అల్ నసీర్‌ను వీణ 1947లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు జన్మించారు. అల్ నసీర్ భోపాల్‌కి చెందిన రాజకుటుంబానికి చెందినవారు. ఆయనకు అప్పటికే నటి మీనా షోరే తోనూ, మనోరమతోనూ పెళ్ళిళ్లు అయ్యాయి. వీణా, అల్ నసీర్ ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలలో నటించారు. కానీ ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి. అల్ నసీర్ 1957లో ధనుర్వాతం కారణంగా మృతి చెందారు. వారిద్దరూ చూడచక్కని జోడీ. వారి పిల్లలు కూడా అందమైన వాళ్ళు. మరి వాళ్ళు సినిమాల్లోకి ఎందుకు రాలేదో ఎవరికీ తెలియదు. కొన్నేళ్ల క్రితం అల్ నసీర్ ఒక పులిని కాల్చి చంపి తన వేటను చూడడానికి విలేఖరులను ఆహ్వానించారట. కొంతమంది జర్నలిస్టులు మృతి చెందిన పులిని చూడకుండా, అందమైన ఆడపులి వీణ రూపానికి మంత్రముగ్ధులయ్యారట.

1941లో 16 ఏళ్ల వీణ అమృత్‌సర్‌లోని ఒక కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండేవారు. ఆమె తన ఫొటోని లాహోర్‌లోని ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థకి పంపారు. ఆ సంస్థ నిర్మిస్తున్న ‘గవంధి’ (పంజాబీ చిత్రం) చిత్రంలో హీరోయిన్‍గా ఎంపికయ్యారు. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే, మరో పంజాబీ చిత్రంలో నాయికగా ఎంపికయ్యారు, ఈ సినిమాలో నేటి ప్రముఖ నిర్మాత ఎస్. డి. నారంగ్ హీరో.

వీణ సినిమా రంగ ప్రవేశాన్ని ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఆ రోజుల్లో సినీ కెరీర్‌ను పరువు తక్కువగా భావించేవారు సమాజంలోని ఉన్నతవర్గాలవారు. కళాశాల అధికారులు కూడా వీణ తమ కాలేజీలో మళ్ళీ చదివేందుకు నిరాకరించారు. కానీ ఆమె దృఢంగా నిశ్చయించుకున్నారు, తనకు వ్యతిరేకంగా ఉన్న అసమానతలకు భయపడలేదు. దివంగత మజర్ ఖాన్ తన చిత్రం ‘యాద్’లో నటించేందుకు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో వీణ బొంబాయికి వచ్చారు. ‘యాద్’ ఇంకా షూటింగ్‍లో ఉండగానే మెహబూబ్ ఆమెను ‘నజ్మా’లో ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు.

‘నజ్మా’లో ఆమె నవాబ్ కూతురి పాత్రను పోషించింది. ఆ పాత్ర ఆమె ప్రతిభను వెలికితీసింది. అందం, ప్రతిభ ఆమెను రాత్రికి రాత్రే టాప్ ర్యాంక్ స్టార్‌గా మార్చేశాయి. ‘యాద్’ విజయవంతమైంది కానీ ‘నజ్మా’ చాలా కేంద్రాలలో జూబ్లీలను జరుపుకుని సూపర్ హిట్ అయ్యింది.

‘నజ్మా’ విజయం తరువాత మెహబూబ్ ఆమెను మరో సినిమాకి తీసుకున్నారు. అశోక్ కుమార్, నర్గీస్‌లతో కలిసి వీణ నటించిన ‘హుమాయున్’ (1945) చిరస్మరణీయమైన చిత్రమైంది. ధైర్యవంతులైన రాజపుత్ర యువరాణి పాత్రలో వీణ నటన ఆవేశపూరితంగా ఉండి మరపురానిదిగా మిగిలింది. అశోక్ కుమార్, నర్గీస్ పూర్తిగా వీణ ఛాయలో ఉండిపోయారు (వీణ నటనా ప్రావీణ్యం ముందు తరచూ ఆమె సహనటుల ప్రతిభ మరుగునపడేది). ‘హుమాయున్’ చిత్రం గొప్ప విజయం సాధించడంతో మజర్ ఖాన్ తన ‘పెహ్లీ నజర్’ చిత్రం కోసం వీణని ఎంచుకున్నారు, ఇందులో ఆమె మోతీలాల్ సరసన శృంగార ప్రధాన పాత్ర పోషించారు.

1949లో తన భర్త అల్ నసీర్ సరసన ‘బీవీ’ అనే చిత్రంలో నటించారు. 1950లో, ఆమె  ‘కాశ్మీర్’ అనే సినిమాలో మరోసారి అల్ నసీర్‌తో కలిసి నటించారు. అదే సంవత్సరం వీణ కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ చిత్రం విడుదలైంది. మేరీ కొరెల్లీ ‘వెండెట్టా’ ఆధారంగా  రూపొందించిన ‘అఫ్సానా’లో నటించారు వీణ. ఇది, దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న బి.ఆర్. చోప్రా – హిచ్‌కాక్ స్టైల్‌లో తీసిన మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమాలో వీణ, అశోక్ కుమార్, కులదీప్ కౌర్, ప్రాణ్ – తదితరులంతా గొప్పగా నటించారు. ‘అఫ్సానా’ సూపర్ హిట్ అయింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘అఫ్సానా’ దిలీప్ కుమార్, షర్మిలా ఠాగూర్, బిందు, ప్రేమ్ చోప్రా నటించగా ‘దాస్తాన్’ పేరుతో పునర్నిర్మించబడింది. ప్రధాన జంట నీరసమైన, నిరుత్సాహకరమైన ప్రదర్శన కారణంగా ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది.

అయితే వీణ్ కెరీర్‌లో అత్యుత్తమ పాత్ర ఎ. ఆర్. కర్దార్ తీసిన ‘దాస్తాన్’. హిందీ సినిమాలలో ఇంత చక్కటి పాత్రను ఇంత పరిపూర్ణంగా ఎవరూ నటించలేదని అంటారు. పూర్తిగా నెగటివ్ పాత్రలో, వీణ తన తమ్ముళ్ల జీవితాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ కుతంత్రాలు నడిపే అక్కగా నటించారు. సోదరులిద్దరూ ఒకే అమ్మాయిని.. తమ ఇంట్లో పెరిగిన అనాథ (సురయ్య)ని ప్రేమిస్తారు. వీణ ఆ ప్రేమికుల (రాజ్, సురయ్య) కలలను భగ్నం చేస్తారు. సురయ్య ఆత్మహత్య చేసుకుంటుంది. సోదరులు తమ పూర్వీకుల ఇంటిని విడిచిపెట్టి, ఇక ఎన్నడూ తిరిగి రామని శపథం చేస్తారు. వీణ అందరికీ దూరంగా ఉండి, తన అహంకారం, గౌరవం చెక్కుచెదరకుండా విశాలమైన భవనంలో జీవితాంతం ఒంటరిగా కాలం గడుపుతారు.

ఈ పాత్రకు వీణ తెచ్చిన అత్యున్నత హుందాతనం, హిందీని ఆంగ్లీకరించిన యాసతో మాట్లాడటం హుందాతనం అని భావించే నేటితరం తారలకు గుణపాఠం కావాలి. ఈ సినిమాలో వీణ దాదాపు ప్రతి వాక్యంలో ‘బద్‍తమీజ్’ అనే పదాన్ని చాలా ఘాటుగా ప్రయోగించారు, దాంతో ప్రేక్షకులు ఈ ప్రతికూల పాత్రపై తమ ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ బిగ్గరగా తిట్టడం ప్రారంభించారు. ‘దాస్తాన్’ అనేది ఎం.జి.ఎం. వారి ‘ఎంచాన్‌మెంట్’ కు అనుకరణ, కానీ అసలు సినిమా కంటే ‘దాస్తాన్’ చాలా మెరుగ్గా ఉంది.

వీణ బాగా నటించిన మరో చిత్రం ఎస్.కె. ఓఝా గారి ‘నాజ్’. విదేశీ లొకేషన్లలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ సినిమాలలో ఒకటి.

‘దాస్తాన్’ తర్వాత, వీణకు సహాయక పాత్రలే లభించాయి. మన నిర్మాతల ధోరణి ఇలాగే ఉంటుంది – ఒకసారి ఒక నాయిక ఒక క్యారెక్టర్ రోల్ చేస్తే ఆమె హీరోయిన్‌గా నటించడానికి అనర్హురాలిగా పరిగణిస్తారు. అప్పటికి వీణ వయసు ఇంకా ముప్పై ఏళ్లలోపే. ఆమె సౌందర్యం పూర్తిగా వికసించే సమయంలో రెండవ నాయిక పాత్రలు పోషించాల్సి రావడం అనూహ్యం.

‘అమర్ సింగ్ రాథోర్’ (1957) చిత్రంలో వీణ ముంతాజ్ మహల్‌గా నటించగా, అల్ నసీర్ షాజహాన్ పాత్ర పోషించారు. ‘మేరా సలామ్’ (బీనా రాయ్- భరత్ భూషణ్ నటించిన చిత్రం)లో ఈ భార్యాభర్తలు జహంగీర్ – నూర్జహాన్ పాత్రలలో నటించారు. ‘హలాకు’లో మీనా కుమారి, అజిత్ ప్రధాన పాత్రలలో; ప్రాణ్ క్రూరుడైన విలన్‍గా, వీణ ఆ క్రూరుడి ధర్మపత్నిగా నటించారు. ఆ తర్వాత గురుదత్ ‘కాగజ్ కే ఫూల్’ వచ్చింది. దీనిలో సినీ దర్శకుడు (గురుదత్)ని వివాహం చేసుకున్న కోటీశ్వరుని కుమార్తెగా వీణ నటించారు. సినిమాలతో అతని అనుబంధాన్ని ఇష్టపడని భార్యగా, ఆమె పాత్ర తన భర్త జీవితాన్ని ప్రత్యక్ష నరకం చేస్తుంది, చివరికి అతన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ‘దాస్తాన్’ తరువాత మరోసారి, వీణ, ద్వేషపూరిత పాత్ర పోషణకి, ప్రేక్షకుల నుండి శాపనార్థాలు పొందారు. ‘కాగజ్ కే ఫూల్’ అత్యంత అద్భుతమైన చలనచిత్రాలలో ఒకటైనప్పటికీ, నటీనటులంతా గొప్ప ప్రదర్శన కనబరిచినప్పటికీ, బాక్స్ ఆఫీస్‌కు అవసరమైన ‘చీప్ జిమ్మిక్స్’ లేని కారణంగా దారుణంగా ఫ్లాప్ అయింది.

ఇంతకు ముందు వీణ ఒకసారి నూర్జహాన్‌గా నటించారు, కానీ అది చాలా తక్కువ పాత్ర. 1963లో, నదియాద్‌వాలా తీసిన ‘తాజ్ మహల్’లో ఆమె మరోసారి నూర్జహాన్ పాత్రను పోషించారు. బీనా రాయ్, ప్రదీప్ కుమార్‍లు ముంతాజ్ – షాజహాన్‌ పాత్రలలో నాయికానాయకులుగా ఉన్నప్పటికీ, సినిమాలో వీణ పాత్ర ఆధిపత్యం చలాయించింది. జిత్తులమారి సామ్రాజ్ఞిగా మద్యానికి బానిసైన తన భర్త జహంగీర్ అధికారం వెనుక ఉన్న నిజమైన శక్తిగా నిలుస్తారు. అతని మరణానంతరం ఆమె అల్లుడు షర్యార్‌కు అనుకూలంగా సింహాసనాన్ని సాధించుకోవాలని పథకం వేస్తారు. గంభీరమైన వ్యక్తిత్వానికి, సంభాషణలను అద్భుతంగా పలికే శైలి వల్ల వీణ, సినిమాలోని ప్రధాన పాత్రల కంటే ప్రభావం చూపారు. ఇది ఆమె మొదటి కలర్ సినిమా, రంగులలో ఆమె సౌందర్యం ద్విగుణీకృతమైంది.

ఫిల్మ్‌ఫేర్‌ పత్రికలో రాసిన ఓ సరదా వ్యాసంలో, ఒక రచయిత – తారలకు ఇవ్వాల్సిన బహుమతుల జాబితాను రూపొందించాడు. వీణ కోసం, ‘ఒక పోర్టబుల్ సింహాసనం’ ఎంచుకున్నాడాయన. అదెంతో సరైన కానుక. కొంతమంది సేవ చేయడానికి, మరికొందరు పాలించడానికి జన్మిస్తారని అంటారు – వీణ ఖచ్చితంగా రెండవ వర్గంలోకి వస్తారు. ‘ఛోటీసీ ములాకత్’ సినిమాలో, వీణ (చిన్నప్పటి వైజయంతికి తల్లిగా), సంప్రదాయాలకు దూరంగా ఉండే అత్యంత అధునాతన మహిళగా నటించారు. సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్‌ లలో ఆమె చాలా అందంగా కనిపించారు, దాంతో వైజయంతిమాల, శశికళ అప్రధానంగా కనిపించారు. ఆ తర్వాత వీణకు ‘సన్నాటా’ అనే మిస్టరీ థ్రిల్లర్‌లో అద్భుతమైన పాత్ర లభించింది. తన పాత్రను ఉన్నతంగా పోషించారు వీణ.

ఆ తర్వాత ఎన్నో ‘అమ్మ’ పాత్రలు వచ్చినా వాటిలో ఇమడలేకపోయారామె. ఎందుకంటే ఆమె గంభీరమైన రూపం, ఎప్పటికీ ముసలితనం తెలియని ఇమేజ్ ‘అమ్మ’ పాత్రలకి అంతగా నప్పేది కాదు.

‘ఆశీర్వాద్’ సినిమాలో వీణ తనకి బాలా అలవాటైన పాత్ర పోషించారు – తన జమీ లోని పేద ప్రజలపై దౌర్జన్యం చేసే జమీందార్ యొక్క హృదయం లేని కుమార్తెగా నటించారు. చివరికి ఆమె ఆగడాలు భరించలేక ఆమె భర్త (అశోక్ కుమార్) ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా చిత్రంలో. దీంట్లో వీణ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

ఆమె ‘పాకీజా’ చిత్రంలో సాహిబ్ జాన్ అత్తగా – ‘వేశ్య’ (కోఠేవాలీ) పాత్రలో చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించారు. చిత్రం క్లైమాక్స్‌లో సాహిబ్ జాన్ తండ్రి (అశోక్ కుమార్) తన సొంత కూతురు తన స్వంత ఇంట్లో డ్యాన్స్ చేయడం చూస్తున్నాడని `కోఠేవాలీ’ హెచ్చరించినప్పుడు, ఆ పాత్రలో వీణ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. ఎన్నో ఏళ్ల క్రితం చిత్రీకరించిన ‘పాకీజా’ సన్నివేశాలు వీణను చాలా అందంగా చూపించాయి.

సినిమాలు విరమించుకున్న 21 సంవత్సరాలకి వీణ 2004లో 78 ఏళ్ళ వయసులో సుదీర్ఘ అనారోగ్యం కారణంగా బొంబాయిలో మరణించారు. 41 సంవత్సరాల (1942 – 1983) కెరీర్‍లో ఆమె 70కి పైగా సినిమాలలో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here