అలనాటి అపురూపాలు – 196

0
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం గురించి ఆశా పారేఖ్:

తన 80వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు, అక్టోబర్, 2022లో, ప్రముఖ నటి ఆశా పారేఖ్‌కు ఢిల్లీలో భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. ఒక నెల తర్వాత, గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఆమెకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. ఆమె నటించిన ‘తీస్రీ మంజిల్’, ‘దో బదన్’, ‘కటీ పతంగ్‌’ సినిమాలను ప్రదర్శించారు.

“ఇది అద్భుతమైన సంవత్సరం, ఎందుకంటే నేను ఇవన్నీ ఊహించలేదు. ఈ సంతోషకరమైన ఆశ్చర్యాలకు నేను భారత ప్రభుత్వానికి, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు ఆశా.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో వేదికపై ఉన్నప్పుడు, తన గుండె వేగంగా కొట్టుకుందని ఆశా చెప్పారు. “ఇది చాలా బావుంది, కానీ నేను అలసిపోయాను, మరొక అవార్డును అందుకోవడానికి నేను బోస్టన్ వెళ్ళాను, అక్కడి నుండి నేరుగా ఇక్కడికే వచ్చాను. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది చాలా ప్రతిష్ఠాత్మకమైన గౌరవం, అందుకే ఈ వార్తని జీర్ణించుకోడానికి కొంత సమయం పట్టింది. నేను జీవించి ఉన్నంత కాలం ఈ పురస్కారం దక్కినందుకు గౌరవంగా భావిస్తాను. నా తల్లిదండ్రులు ఉండి ఉంటే, ముఖ్యంగా మా అమ్మ, చాలా గర్వించేవారు. వారు నన్ను ఎప్పుడూ ఓ ‘స్టార్’లా భావించక, నా కాళ్ళు నేల మీదే ఉండేలా చూశారు” తెలిపారామె.

ఆశా పారేఖ్‍ని తలచుకోగానే సాధారణంగా ఆమె చేసిన నృత్యాలు, అభినయించిన పాటలే గుర్తొస్తాయి. అయితే ‘కటీ పతంగ్’ వంటి సినిమాలలో చిరస్మరణీయ నటనను ప్రదర్శించారు, ఈ చిత్రానికి ఆమెకు ‘ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు’ దక్కింది. “శక్తి దా (సామంతా) అద్భుతమైన దర్శకుడు. ఆ సినిమాలోని నా పాత్ర బాగా రావడానికి నేను చాలా కృషి చేశాను. ప్రేమ్ చోప్రా నా గదిలోకి దౌర్జన్యంగా చొరబడినప్పుడు నేను అతనిని బెదిరించే సన్నివేశం నిజంగా ఓ సవాలు” అని చెబుతూ ఆశా ఆ సినిమా షూటింగ్‍ని గుర్తుచేసుకున్నారు.

‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత అయిన ఆశా, బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన ‘మా’ అనే సినిమాలో బాలనటిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. తొలిసారే ప్రేక్షకుల ముందు వేదికపై ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చిందనీ, కెమెరా గురించి ఆలోచించలేదని తెలిపారు.

ఆశా – నాసిర్ హుస్సేన్ తీసిన ‘దిల్ దేకే దేఖోతో’ చిత్రంతో ప్రధాన పాత్రలకు మారారు, ఈ సినిమాలో షమ్మీ కపూర్ సరసన నటించారు. తదుపరి కాలంలో వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి నటించారు. వీటిల్లో అత్యంత ప్రజాదరణ పొందినది ‘తీస్రీ మంజిల్’. ఆర్‌డి బర్మన్ సంగీతం, విజయ్ ఆనంద్ దర్శకత్వం, షమ్మీ కపూర్, ఆశాల నటన ఆ సినిమా విజయానికి కారణాలు. “షమ్మీ కపూర్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా నచ్చింది. నేను ఆయనతో నా కెరీర్‌ని ప్రారంభించాను కాబట్టి చాలా సాన్నిహిత్యం ఉంది, తెర మీద మా జోడీ బాగుండేది” అన్నారు ఆశా పారేఖ్. ఆమె గురువు, నాసిర్ హుస్సేన్, ఆమెను హీరోయిన్‍గా వెండితెరకి పరిచయం చేయడమే కాకుండా, తన  సినిమాలు అన్నింటిలోనూ 1971లో వచ్చిన ‘కారవాఁ’ వరకు ప్రధాన పాత్రగా అవకాశాలిచ్చారు. “నేను ఆయన నుండి చాలా నేర్చుకున్నాను, ఓ టీవీ సీరియల్‍కి (జ్యోతి) దర్శకత్వం వహించే నమ్మకాన్ని ఆయన నాకు ఇచ్చారు. మహేష్‌భట్‌కి కూడా ఓ సినిమాకి దర్శకత్వం వహించాల్సి ఉంది, కానీ కుదరలేదు. నేను నటినే కాదు, దర్శకురాలిని, నిర్మాతని, పంపిణీదారుని కూడా. అన్నింటికంటే ముఖ్యంగా నేను చిత్ర పరిశ్రమకు నా వంతు సేవలు అందించాను” అని ఆమె పేర్కొన్నారు.

 

ఆశా పారేఖ్ వరుసగా మూడు పర్యాయాలు, ఆరు సంవత్సరాల పాటు సినీ మరియు టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. “దుర్గా ఖోటే తర్వాత, CINTAA ప్రారంభం నుండి దానితో అనుబంధం కలిగి ఉన్న మహిళలలో నాకు ముందు లేదా తర్వాత మరొక మహిళ లేరు. నా హయాంలో, మేము ప్రభుత్వం నుండి భూమిని పొందాము, సంస్థ కార్యాలయాన్ని మహాలక్ష్మిలోని ఫేమస్ స్టూడియో నుండి అంధేరీస్ లింక్ రోడ్‌కి మార్చాము” అని ఆమె తెలిపారు. ఆమె సినీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు కోశాధికారిగా కూడా ఉన్నారు, ఈ హోదాలో ఉన్న ఏకైక మహిళ ఆశానే. దిలీప్ కుమార్, సునీల్ దత్, మిథున్ చక్రవర్తి, దారా సింగ్, అమ్రిష్ పూరి వంటి నటులతో కలిసి ఈ ట్రస్ట్ కోసం పనిచేశారామె. “సెన్సార్ బోర్డ్ మొదటి మహిళా చైర్‌పర్సన్ కూడా నేనే. 80 ఏళ్ల వయసులో కూడా నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్ఫేర్ ట్రస్ట్ సెక్రటరీని. మేము వైద్య సహాయం అవసరమైన వారికి, పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం అందిస్తాము. ఎన్నో విషయలలో నాకు చాలా మొదటివి ఉన్నాయి, కానీ చాలా మందికి తెలియదు లేదా వాటి గురించి మాట్లాడరు. సినిమా పరిశ్రమకు వెలుపల కూడా, నేను చాలా సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాను” అని బిసిజె జనరల్ హాస్పిటల్ మరియు ఆశా పారేఖ్ రీసెర్చ్ సెంటర్‌ను స్థాపించిన ఆశా గుర్తుచేశారు.

ఈ రోజు హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో ఆమెను అడిగితే, ఆవిడ చాలా హేతుబద్ధంగా, “నిర్మాత దర్శకులు కథ ప్రాముఖ్యతను మరచిపోయారని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రేక్షకులు దానిని గ్రహించారు, పరిస్థితులు మెరుగుపడాలి. ‘దృశ్యం 2’ బాగానే ఉంది, అలాగే ‘ఊంఛాయి’, OTT చాలా మంది మంచి నటీనటులకు బ్రేక్‌ ఇస్తోంది” అన్నారు.

సినిమా లేదా వెబ్ సిరీస్‌ని నిర్మించడానికి లేదా దర్శకత్వం వహించడానికి ఏదైనా ఆలోచన ఉందా? అని అడిగితే, “లేదు, ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను, ఇంతకు ముందు వరకు తీరిక లేకుండా పని చేశాను. నేను నా స్నేహితులతో లంచ్‌కి వెళ్లాలనుకుంటున్నాను, సినిమాలు చూడాలనుకుంటున్నాను, ప్రయాణాలు చేయాలనుకుంటున్నాను” అని నవ్వుతూ చెప్పారు.

ఇటీవల ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆశా పారేఖ్ తన జీవితంలో ప్రేమ గురించి, వివాహం గురించి మాట్లాడారు. “నేను నటించిన ‘ది హిట్ గర్ల్‌’ చిత్రీకరణ సమయంలో నేను నాసిర్ హుస్సేన్‌ని ఇష్టపడుతున్నట్లు అనిపించింది, కానీ ఆయన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం, వారి పిల్లలను బాధపెట్టడం నాకిష్టం లేకపోయింది. ఆ అభిమానాన్ని నా వరకే పరిమితం చేసుకోవడం చాలా సరళంగా, సంతృప్తికరంగా ఉంది” అని ‘వెర్వ్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశా చెప్పారు. “తప్పుగా అనుకోవద్దు, నేను పెళ్ళి వద్దనుకోలేదు. నిజానికి, నా పెళ్ళి కోసం మా అమ్మ చాలా ప్రయత్నాలు చేసింది, ముందుగానే పెళ్ళికూతురికి ఇవ్వాల్సిన సరంజామా అంతా సిద్ధం చేసింది, నేను కొందరిని చూశాను, కానీ వారు నాకు సరైన జోడీ అనిపించలేదు” అన్నారు ఆశా. “కొన్నళ్ళకి, నన్ను వధువుగా చూడాలనే తన కోరికను మా అమ్మ కూడా వదులుకుంది, ఎందుకంటే నా జాతకం ఎవరికి  చూపించినా నా వివాహం విజయవంతం కాదనే చెప్పారట. ఇలాంటివి నేను నమ్మను, కానీ అది నాకు కొంత శాంతిని కలిగించింది” చెప్పారామె.

అదే ఇంటర్వ్యూలో, నేటి తరం ప్రేమను ఎలా చూస్తుందన్న విషయంపై ఆశా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

“నేడు, జనాలు ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో, అంతే తొందరగా దాన్నుంచి బయటపడుతున్నారు. సహనం లోపించి అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం మానేశారు. పెళ్ళంటే అంటే అన్నీ సుఖాలే ఉండవు; తరచూ మీ భాగస్వామి కోరికలను గౌరవించాలి, ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. నేటి యువతీయువకులు చాలా వేగంగా ఒత్తిడికి గురవుతున్నారని నేను భావిస్తున్నాను. చిన్న చిన్న సమస్యలకే బంధాన్ని తెంచుకుంటున్నారు, అలా కాకూడదు” అన్నారు ఆశా.

***

ఇదీ జీవితం పట్ల ఆశా పారేఖ్ దృక్పథం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here