అలనాటి అపురూపాలు – 200

0
13

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

భారతీయ సినీ దిగ్గజం – సినిమాటోగ్రాఫర్ వి.కె. మూర్తి:

నవంబర్ 26, 1923న జన్మించిన శ్రీ మూర్తి, బెంగళూరు నగరంలోని శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూ‍ట్‌లో మొదటి బ్యాచ్‌లో (1943-46) సినిమాటోగ్రఫీలో డిప్లొమా చేశారు. ఆయనకి సంగీతమంటే చాలా ఇష్టం. సినిమాల్లో నటుడవ్వాలని అనుకున్నారు, కానీ సినిమాటోగ్రఫీని ఎంచుకుని విశేషంగా రాణించారు.

సినిమాలకు సంబంధించి కనీస పరిజ్ఞానం ఉన్న సాధారణ ప్రేక్షకులకు కూడా, వి.కె. మూర్తి అనే పేరు దర్శకుడు, నటుడైన గురుదత్ తోనూ; గురుదత్ దర్శకత్వం వహించిన ప్రసిద్ధ చిత్రాలైన ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ఇంకా ఆయన నిర్మించిన ‘సాహిబ్, బీబీ ఔర్ గులాం’ వంటి చిత్రాలకు పర్యాయపదంగా ఉంటుందని తెలుసు. అయితే సినిమా చిత్రీకరణపై అవగాహన ఉన్నవారికి – సినిమాటోగ్రాఫర్ అయిన మూర్తి ‘కాగజ్ కే ఫూల్’ చిత్రంలోని ‘వక్త్ నే కియా, క్యా హసీన్ సితమ్’ స్టూడియోలోని కాంతిపుంజాన్ని రెండు అద్దాలను తాకి నేలపై పడేలా ఎలా చేశారో – అర్థమవుతుంది. నిజానికి, ప్రసిద్ధి చెందిన వెంటాడే, కవితాత్మక చిత్రాలతో ఉండే గురుదత్ సినిమాల ‘సొగసు’, వి.కె. మూర్తి లేకుండా సాధ్యమయ్యేది కాదు.

తన ప్రతిభని, గురుదత్‍ ఎలా గుర్తించారో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మూర్తి.

నవకేతన్ సంస్థకోసం గురుదత్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘బాజీ’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆ సినిమా ఛాయాగ్రాహకులు వి. రాత్రా గారి వద్ద  అసిస్టెంటుగా ఉన్నారు మూర్తి. ఓ షాట్ కెమెరా పాన్‌ను అద్దంలోని ప్రతిబింబం నుండి దేవ్ ఆనంద్‌కి చూపుతుంది, మరో సన్నివేశంలో క్లబ్‌లో గీతా బాలి, కోరస్ బృందంలోని అమ్మాయిలు ‘సునో గజార్ క్యా గయే’ పాటకి నృత్యం చేస్తున్నప్పుడు అక్కడి గచ్చుని చూపుతారు. ఈ రెండు షాట్‌లలో కెమెరా అద్భుతమైన పనితీరు గురుదత్‌ను ఆకట్టుకుంది. వెంటనే తన తదుపరి చిత్రం ‘జాల్‌’కి సినెమాటోగ్రాఫర్‍గా మూర్తిని తీసుకున్నారు. ఆ చిత్రంలో కాంతి, నీడను ఉపయోగించడంలో మూర్తి ప్రతిభ – ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాసిరకం ప్రింట్‌లలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి నుండి, మూర్తి గురుదత్ సినిమాటోగ్రాఫర్ అయిపోయారు, అంతే కాక ప్రమోద్ చక్రవర్తి దర్శకత్వంలో గురుదత్ నటించిన ‘12 ఓ క్లాక్’ వంటి బయటి ప్రాజెక్ట్‌లలో కూడా పనిచేశారు.

గురుదత్, మూర్తి మధ్య సహకారం ఉన్నప్పటికీ, అభిప్రాయ భేదాలూ ఉండేవి. నస్రీన్ మున్నీ కబీర్ రచించిన ‘కాన్వర్సేషన్స్ విత్ వహీదా రెహ్మాన్‌’ అనే పుస్తకంలో – వారిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నప్పటికీ, చాలా వాదించుకునేవారని చెప్పారు వహీదా. “గురుదత్‌ గారు తాను కోరుకున్న షాట్‌ను మూర్తికి వివరించి, షాట్‌ను ఒకేసారి సిద్ధం చేయాలనుకున్నారు,” అని చెప్పారు వహీదా. “అయితే ఆ షాట్స్ ఎప్పుడూ సరళమైనవి కావు – అవి తరచుగా సంక్లిష్టమైన కోణాలు, ట్రాలీ కదలికలు, క్లోజప్‌లు, మిడ్ షాట్‌లు మొదలైనవి కలిగి ఉండేవి” తెలిపారు వహీదా. ఫలితంగా అసహనానికి గురైన గురుదత్ తన సినిమాటోగ్రాఫర్‌ని విసిగించడంతో ఆయన తాను చేస్తున్న పనిని వివరించారు. అప్పుడప్పుడు దర్శకుడు సెట్ నుండి వాకౌట్ చేసేవారు. మూర్తిని కూడా ఇంటర్వ్యూ చేసిన కబీర్ “ఆయన నిజాయితీపరులు, అద్భుతమైన వ్యక్తి, తెలివైనవారు, సూటిగా వ్యవహరించేవారు. ఆయనది బలమైన వ్యక్తిత్వం. లైటింగ్‌తో ప్రయోగాలు చేయాలనుకున్నారు. ‘కాగజ్ కే ఫూల్’ చిత్రంలోని ‘వక్త్ నే కియా, క్యా హసీన్ సితమ్’ పాటలోని లైటింగ్ పూర్తిగా మూర్తి గారి తెలివితేటల ఫలితం. ఆయన గురుదత్‌కి ‘కళ్ళ’ వంటి వారు” అన్నారు.

కానీ తుది ఫలితం ఎల్లప్పుడూ విలువైనదే. వెలుతురు ఎలా పడుతుందనే దాని గురించి తన గాఢమైన అవగాహనతో, మూర్తి ‘చియరోస్కురో ఎఫెక్ట్‌’ను అందించడానికి సెట్‌ను తరచుగా వెలుగుతో నింపేవారు. గురుదత్ చేసిన మొదటి నోయర్ చిత్రాలైన ‘జాల్’, ‘ఆర్ పార్’, ‘సి.ఐ.డి.’ (గురుదత్ కంపెనీలో రాజ్ ఖోస్లా దర్శకత్వం) వంటి వాటిలో ఈ ఎఫెక్ట్ చాలా కీలకమైనది. ‘సి.ఐ.డి.’ చిత్రంలో, దేవ్ ఆనంద్ మొదట – క్రైమ్ బాస్ నుంచి, ఆ తరువాత పోలీసుల నుంచి దాక్కునే, సన్నివేశాల సీక్వెన్స్ – తొలినాటి జర్మన్ ఎక్స్‌ప్రెషనిస్ట్, ఇంకా హాలీవుడ్ క్రైమ్ చిత్రాలను గుర్తుకు తెస్తుంది, ఇది పాత్ర వేటాడబడుతున్న అనుభూతిని ప్రతిబింబిస్తుంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ సినిమాలోని స్విమ్మింగ్ పూల్ సన్నివేశం వంటి సంతోషకరమైన, అవుట్‌డోర్ షాట్‌లలో కూడా, గురుదత్‌తో పలుమార్లు చర్చించి, మూర్తి వినూత్నమైన ట్రాలీ షాట్‌లను ఉపయోగించారు. అయితే ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’ (తొలి భారతీయ సినిమాస్కోప్‌ చలనచిత్రం), ‘సాహిబ్, బీబీ మరియు గులాం’ అనేవి నిస్సందేహంగా వారి మూడు కళాఖండాలు. ఇవి గురుదత్ ప్రధాన పాత్రల వేదన మరియు ఒంటరితనం బాగా ప్రతిబింబిస్తాయి. కవి విజయ్, దర్శకుడు సురేష్ సిన్హా, నిర్లక్ష్యం చేయబడిన గృహిణి, చిన్న కోడలిగా మీనా కుమారి పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘ప్యాసా’లో, తన మరణాన్ని స్మరించుకునే ఒక ఫంక్షన్‌కి విజయ్ వచ్చే షాట్, అమరవీరుడి శిలువను ప్రస్తావిస్తూ, వెనుక కాంతితో తలుపుకు ఎదురుగా ఫ్రేమ్ చేయబడినట్లు చూపిస్తుంది. ‘కాగజ్ కే ఫూల్‌’లో విఫల దర్శకుడు, అతనికి ఒకప్పడు ఇష్టమైన వ్యక్తి, హీరోయిన్ అయిన వేశ్య మధ్య పెరుగుతున్న దూరాన్ని అందంగా చూపించారు, ‘సాహిబ్‌, బీబీ ఔర్ గులాం’ చిత్రంలో మీనా కుమారి క్రమంగా మద్యానికి బానిసవడం, నిరాశలోకి జారుకోవడం లైట్ అండ్ షేడ్ ఎఫెక్ట్ ద్వారా గొప్పగా చూపారు. ‘కాగజ్ కే ఫూల్‌’, ‘సాహిబ్‌, బీబీ ఔర్ గులాం’ చిత్రాలకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా మూర్తి ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు.

ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన మొదటి సినిమాటోగ్రాఫర్ శ్రీ మూర్తి. భారతీయ సినీరంగానికి అందించిన సేవలకు 2005లో ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ’ వారి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.

~

వి.కె. మూర్తి గారి నుండి ప్రేరణ పొందిన ఇతర సినిమాటోగ్రాఫర్‌లు వారి గురించి ఏమన్నారో చూద్దాం.

~

గోవింద్ నిహలానీ (సినిమాటోగ్రాఫర్ & ఫిల్మ్ మేకర్)

60వ దశకం ప్రారంభంలో నేను సినిమాటోగ్రఫీ అభ్యసించిన బెంగళూరులోని శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లో వి.కె. మూర్తి గురించి మొదటిసారి విన్నాను. ఆయన అదే ఇన్‍స్టిట్యూట్ నుండి పట్టభద్రుడయ్యారు, అప్పటికే ప్యాసా (1957) చేసి ప్రసిద్ధులయ్యారు. ఆ సినిమా తర్వాత ఇన్‌స్టిట్యూట్‌లోని ప్రతి విద్యార్థి ఊహల్లోకి ఆయన నిలిచారు. అప్పుడే ఆయనకు అసిస్టెంట్‌గా మారాలని నిర్ణయించుకున్నాను. ప్రమోద్ చక్రవర్తి దర్శకత్వంలో ‘జిద్ది’ (1948) సినిమా చేస్తున్నప్పుడు ముంబైలో వారిని కలిశాను. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే అది ఆయన వల్లే. మాది కెమెరామెన్, అతని సహాయకుడి సంబంధం కాదు, గురుశిష్యుల సంబంధం. సినిమా కథ అనేది దర్శకుడి దృష్టి అని వారు ఎప్పుడూ నమ్మేవారు, దానిని ప్రేక్షకుల కోసం తిరిగి సృష్టించడానికి ఆయన ప్రయత్నించారు. మూర్తి సినిమాలను ఎన్నడూ కేవలం చిత్రాల పరంపరగా చూడలేదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ ఒక ఉద్దేశంతో ఉంటాయని అంటారు. అదే నేను వారి నుంచి నేర్చుకున్న అతి పెద్ద పాఠం. ఆయన భయంలేని ఆవిష్కర్త.

భారతీయ చలనచిత్రంలో మైలురాయి చిత్రాలుగా పరిగణించబడే ‘కాగజ్ కే ఫూల్’ (1959), ‘చౌదవీ కా చాంద్’ (1961) వంటి చిత్రాలలో కనిపించే ఫోటోగ్రఫీ, మహా అద్భుతం, అంతే.

మనోజ్ కుమార్ (నటుడు-దర్శకుడు)

వి.కె. మూర్తి మౌనంగా పనిచేసేవారు. మేము ‘కల్‍యుగ్ ఔర్ రామాయణ్’ (1987) సినిమాకి కలిసి పనిచేసినప్పుడు, ఆయన సెట్స్‌లో ఎవరితోనూ జోక్యం చేసుకోలేదు. ఆయనకి సహాయకులు కూడా అవసరం లేదు. లైట్ స్పాట్‌లను సరిదిద్దడం, లైటింగ్‌ని సర్దుబాటు చేయడం ఆయనే చేసుకుని, తిరిగి వచ్చి కెమెరాను స్వయంగా నిర్వహించారు. తక్కువగా మాట్లాడే వ్యక్తి, చేతల మనిషి. అంకితభావం, ఏకాగ్రత వారి పనిలో కనిపించింది. నేటికి కూడా, ‘కాగజ్ కే ఫూల్’, ‘ప్యాసా’ సినిమాలలో వారు సృష్టించిన చిత్రాల కోసం ఆయన్ని గుర్తుంచుకుంటారు. 2008లో, ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించారు. రెండు నెలలకు ఒకసారైనా మాట్లాడుకునేవాళ్లం. ఆయన మరణంతో సినీరంగంలో ఒక ముఖ్యమైన యుగపు మరో రత్నాన్ని కోల్పోయింది.

శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ (ఫిల్మ్ మేకర్)

నా జీవితంలో నేను కలిసిన – క్రమశిక్షణ కలిగిన వ్యక్తుల్లో వి.కె మూర్తి ఒకరు. ఆయన గురించి అంతగా తెలియని మరో విషయం ఏమిటంటే, ఆయన వీణను అద్భుతంగా వాయించేవారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడిన ఏకైక సినిమాటోగ్రాఫర్. నలుపు, తెలుపు చిత్రాలలో తన అద్భుతమైన పనికి ప్రసిద్ధి చెందారు. ‘కాగజ్ కే ఫూల్’ చిత్రంలోని ‘వక్త్ నే కియా’ అనే పాట – చిత్రీకరించిన అత్యంత చర్చనీయాంశమైన సన్నివేశాలలో ఒకటి. వెలుతురులో నిలబడిన వహీదా రెహమాన్ నటించిన ఈ పాట మూర్తిగారి గొప్పతనాన్ని వెల్లడించింది. ‘ప్యాసా’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ (1962) వంటి చిత్రాలలో గురుదత్ దృష్టిని సెల్యులాయిడ్‌పై అద్భుతంగా అనువదించారు మూర్తి. గురుదత్ కలర్‌లో షూట్ చేయాలనుకున్నప్పుడు, UK లోని ‘గన్స్ ఆఫ్ నవరోన్’ (1961) బృందంతో కొంత సమయం గడపడానికి మూర్తిని పంపారు.

మెథడికల్ ఫిల్మ్ లైటింగ్ వారసత్వాన్ని విడిచివెళ్ళారు మూర్తి.

నేను వారిపై ఒక డాక్యుమెంటరీ తీయాలనుకున్నాను. వారితో చాలా సమయం గడిపాను – సినిమాలు, వారి పని, కెమెరాలు, ఇంకా షాట్‌ల గురించి మాట్లాడాను. అయినప్పటికీ, మేమా డాక్యుమెంటరీని చాలా వరకు చిత్రీకరించలేకపోయాము. ఇక అది ఎప్పటికీ పూర్తి కాదన్నది నా అతిపెద్ద బాధ. మనం ఆయన సినిమాలను పునరుద్ధరించాలి, తద్వారా ప్రస్తుత తరం వారు ఆయన పనిని అధ్యయనం చేయగలరు.

~

వారి గొప్పతనం గురించి మరింత అర్థం చేసుకోవడానికి ఈ లింక్‌లను చూడండి –

https://www.youtube.com/watch?v=4JqBqHXODlc

https://www.youtube.com/watch?v=iAzPI9kuWQM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here