అలనాటి అపురూపాలు – 201

0
11

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

భారతీయ సినీ ప్రముఖుల గురించి తెలుసుకునే క్రమంలో – ప్రముఖ స్వరకర్త అనిల్ బిస్వాస్ గురించి, వారి మొదటి భార్య, నటి ఆశాలత గురించి తెలుసుకుందాం.

స్వరకర్త అనిల్ బిస్వాస్:

మాస్టర్ అనిల్ బిస్వాస్ గొప్ప స్వరకర్త. హిందీ సినీ సంగీతపు మార్గదర్శక స్వరకర్తలలో ఒకరు. అనిల్ బిస్వాస్‍గా పిలవబడే ఆయన పూర్తి పేరు అనిల్ కృష్ణ బిస్వాస్. హిందీ సినిమాల సంగీత ధోరణులను పునర్నిర్వచించిన ఘనత అనిల్ బిస్వాస్‌కి దక్కుతుంది. పాట రూపంపై, నిర్మాణంపై విజయవంతంగా ప్రయోగాలు చేసి – శాస్త్రీయ, జానపద సంగీతాలను పాశ్చాత్య సంగీతంతో మేళవించి సింఫనీ, ఆర్కెస్ట్రా, కంటాటా వంటివి అందించారు. ‘కిస్మత్’ (1943), ‘జ్వార్ భాటా’ (1944) వంటి చిత్రాలతో బిశ్వాస్ భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.

తూర్పు బెంగాల్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) లోని బారిసాల్‌లో 7 జూలై 1914న జన్మించిన అనిల్ కె బిస్వాస్‌పై చిన్నతనం నుండి పడవ పాటలు, భతియాలీ, ఇంకా బౌల్‌ జానపద పాటల ప్రభావం ఉంది. ఆయన శిక్షణ పొందిన తబలా వాయిద్యకారుడు. శ్యామ సంగీతం, కీర్తనలు పాడేవారు. ఆ కాలంలో ఔత్సాహిక థియేటర్ ప్రొడక్షన్స్‌లో కూడా నటించారు. 1930లో, బిస్వాస్ కోల్‌కతాకు వెళ్లి మెగాఫోన్ కంపెనీలో పనిచేశారు, అక్కడ ఆయనకి ఒక్కో పాట స్వరపరిచినందుకు 5 రూపాయలు దక్కాయి. కానీ ఆయన స్వరపరిచిన పాటలు ఏవీ విడుదల కాలేదు. తరువాత, రంగ్ మహల్ థియేటర్‌లో చేరారు, అక్కడ ఆయన నటుడిగా, గాయకుడిగా, సహాయక స్వరకర్తగా పనిచేశారు. ఖయాల్, దాద్రా, ఠుమ్రీ వంటి సంగీత సంప్రదాయాలను వినియోగించారు, గాయకుడిగా తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నారు.

1934లో, బిశ్వాస్ బొంబాయికి వెళ్లి కుమార్ మూవీటోన్‌లో చేరారు, కానీ వెంటనే ఈస్టర్న్ ఆర్ట్ సిండికేట్‌కి మారారు. అక్కడ ఆయన అనేక సినిమా ప్రాజెక్టులలో పనిచేశారు. ‘బాలహత్య’ (1935), ‘భారత్ కీ బేటీ’ (1935) వంటి చిత్రాలలో పాటలను అందించడానికి అవకాశం పొందారు. అతను ‘ధరమ్ కీ దేవి’ (1935) సినిమాతో పూర్తిస్థాయి సంగీత స్వరకర్తగా రంగప్రవేశం చేసారు. ఈ కాలంలో బిశ్వాస్ అనేక ప్రాజెక్ట్‌లలో పనిచేసినప్పటికీ, మెహబూబ్ ఖాన్ గారి ‘జాగీర్దార్’ (1937) హిందీ చిత్రాలలో సంగీత స్వరకర్తగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. తదనంతరం, ఆయన మెహబూబ్ ఖాన్ కోసం ‘ఔరత్’ (1940), ‘బహెన్’ (1941), ‘రోటీ’ (1942) చిత్రాలకు సంగీతం అందించారు. 1942లో, బిశ్వాస్ బాంబే టాకీస్‌లో చేరారు. ‘కిస్మత్’ (1943), ‘జ్వార్ భాటా’ (1944), ‘మిలన్’ (1946) వంటి అనేక ఇతర ప్రతిష్ఠాత్మక చిత్రాలకు పనిచేశారు. 1947లో, స్టూడియో వ్యవస్థ పతనం కావడం, మరింత సౌకర్యవంతమైన పంపిణీదారుల ఆధారిత వ్యవస్థల పెరుగుదల వల్ల బిస్వాస్‌ బాంబే టాకీస్‌ను విడిచిపెట్టారు. తరువాత ‘అభిమాన్’ (1957), ‘పరదేశి’ (1957) చిత్రాలకు పనిచేశాడు, కానీ 1960ల నాటికి ఆయన తన మకాం ఢిల్లీకి మార్చారు.

బిస్వాస్ స్వదేశీ సంగీత వాయిద్యాలతో ఆర్కెస్ట్రాను ఉపయోగించి చేసిన స్వరకల్పనలలోని వినూత్న ప్రయోగాలకు బాగా గుర్తుండిపోతారు. ‘రోటీ’ (1942)తో,  భారతీయ చలనచిత్ర పాటతో పాశ్చాత్య పద్ధతుల యొక్క వినూత్న సమ్మేళనాన్ని ఉపయోగించారు. ‘హమ్‌దర్ద్’ (1953)లోని ‘రుతీ ఆయే, రీతు సఖి రే’ పాటలో రాగ్ మాలాతో ప్రయోగాలు చేసిన మొదటి సంగీత దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. చలనచిత్ర సంగీతంలో గజల్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చిన స్వరకర్తాలలో బిశ్వాస్ ఒకరు. ఆయన ప్రముఖ గాయకుడు తలత్ మహమూద్‌తో సహా అనేక మంది గాయకులను, కళాకారులను పరిచయం చేశారు.

 

తన కెరీర్ చివరి దశలో, బిశ్వాస్ ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేశారు, ప్రభుత్వ ప్రసారాలు, చలనచిత్ర కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. 1963లో ఆల్ ఇండియా రేడియోలో నేషనల్ ఆర్కెస్ట్రా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 80వ దశకంలో ‘హమ్ లోగ్’, ‘బైసాఖి’, ‘ఫిర్ వహీ తలాష్’ వంటి ప్రముఖ షోలలో దూరదర్శన్‌తో కలిసి పనిచేశారు.

బిశ్వాస్ 1980, 90 దశకాలలో అనేక డాక్యుమెంటరీ ప్రాజెక్ట్‌లలో ఫిల్మ్స్ డివిజన్‌తో చాలా సన్నిహితంగా పనిచేశారు. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి రెండు సంవత్సరాల పాటు  వైస్-ఛాన్సలర్‌గా వ్యవహరించారు. 1986లో, బిశ్వాస్ కళారంగానికి చేసిన కృషికి సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.

అనిల్ బిస్వాస్ మే 31, 2003న 88 సంవత్సరాల వయస్సులో ఢిల్లీలో మరణించారు. ఆయన పనిచేసిన చివరి చిత్రం ‘ఛోటీ ఛోటీ బాతేఁ’ (1965).


నటి ఆశాలత:

స్వరకర్త అనిల్ బిస్వాస్ మొదటి భార్య ఆశాలతా బిస్వాస్. ఆమె అక్టోబర్ 17, 1917న జన్మించారు. ఆమె అసలు పేరు మెహరున్నిసా. ఆమె 1935లో విడుదలైన ‘ఆజాదీ’, ‘సజీవ్ మూర్తి’, ‘సతి తోరల్’ అనే మూడు చిత్రాల కోసం శక్తి మూవీటోన్‌లో చేరినప్పుడు తన పేరును ఆశాలతగా మార్చుకున్నారు.

1940లు, 1950లలో హిందీ సినిమా ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిన ఆశాలత లక్స్ సబ్బుని ప్రచారం చేసే ఆకర్షణీయమైన తారలలో ఒకరు. ఆమె బాంబే టాకీస్ (చార్ అంఖేఁ, 1944) ప్రభాత్ ఫిల్మ్స్ (స్వర్ణ భూమి, 1944) వంటి ప్రముఖ స్టూడియోలతో  పనిచేశారు.

ఆశాలతా బిస్వాస్ తన భర్తతో పాటు ‘వెరైటీ పిక్చర్స్’ బ్యానర్‌పై ‘లాడ్లీ’ (1949), ‘లాజవాబ్’ (1950), ‘హమ్‌దర్ద్’ (1953) వంటి చిత్రాలను నిర్మించారు. వారు 1954లో విడాకులు తీసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత అనిల్ బిస్వాస్ 1950లలో కొన్ని చిత్రాలకు పాడిన మీనా కపూర్‌ను వివాహం చేసుకున్నారు.

 

ఆశాలతా బిస్వాస్ 26 మే 1992న మరణించారు. ఆమె కుటుంబం సినిమా వారసత్వాన్ని కొనసాగించింది; ఆమె కుమారుడు ఉత్పల్ బిస్వాస్ ‘షహెన్‌షా’ (1988), ‘మై ఆజాద్ హూఁ’ (1993) వంటి చిత్రాలకు సంగీతం అందించగా, ఆమె మనవరాలు పరోమితా వోహ్రా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా మారారు.

~

ఆశాలత నటించిన చిత్రాల జాబితా:

  • 1965 శ్రీమాన్ ఫంటూష్
  • 1955 అంధేర్ నగరీ చౌపట్ రాజా
  • 1954 బాజూబంద్
  • 1953 హమ్‍దర్ద్
  • 1953 మెహమాన్
  • 1951 బడీ బహూ
  • 1950 లాజవాబ్
  • 1949 లాడ్లీ
  • 1947 జాలిమ్
  • 1945 బీస్వీ-సడీ
  • 1944 స్వర్ణ భూమి
  • 1944 చార్ అంఖేఁ
  • 1942 సచ్చా సప్నా
  • 1942 సుఖీ జీవన్
  • 1941 మధుసూదన్
  • 1940 షంషేర్‌బాజ్
  • 1940 రంగీలా జవాన్
  • 1940 ఆజ్ కీ దునియా
  • 1940 దీపక్
  • 1940 జిందగీ
  • 1940 దేశ్ భక్త్
  • 1940 సుహాగ్
  • 1940 గీత
  • 1939 బ్రాందీ కి బోతల్
  • 1938 జ్వాలా
  • 1937 బుల్‌డాగ్
  • 1937 మహాగీత్
  • 1937 ఇన్‌సాఫ్
  • 1937 ప్రేమ్‌వీర్
  • 1936 పియా కీ జోగన్
  • 1936 షేర్ కా పంజా
  • 1936 మన్మోహన్
  • 1936 సజీవ్ మూర్తి
  • 1935 ఆజాదీ
  • 1935 సతి తోరల్

~

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here