అలనాటి అపురూపాలు – 202

1
11

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

అలనాటి బాలీవుడ్ విఫల, సఫల ప్రేమలు

సినీతారల మధ్య ప్రేమలు, పెళ్ళిళ్ళూ సాధారణమే. ప్రేమించుకుని, ఒకరినొకరు ఇష్టపడ్డాకా, పెద్దల వల్లో, లేదా అప్పటికే వివాహం అయి ఉండడం వల్లో – కొన్ని ప్రేమలు పెళ్ళి దాక వెళ్ళవు. మరికొందరు తమవాళ్లని ఎదిరించో/ఒప్పించో – తాను ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకుని (అది రెండో పెళ్ళి కూడా కావచ్చు) తమ ప్రేమని ఫలింపజేసుకున్నారు. అలాంటి రెండు జంటల గురించి..

పరిశ్రమను  కుదిపేసిన రాజ్ కపూర్ – నర్గిస్ ప్రేమాయణం:

సినిమాల్లో నటిస్తూ, తమ తోటివారితో ప్రేమ సంబంధాలు ఏర్పరచుకునే  నటీనటుల కథలు బాలీవుడ్‍కి కొత్త కాదు. సినిమా మేగజైన్ల ‘గాసిప్ కాలమ్స్’ అన్నీ అటువంటి వార్తలే ఉండేవి. కొన్ని ప్రేమలు పెళ్ళితో ముగిస్తే, మరికొన్ని వివాహబంధంలోకి అడుగిడలేక ప్రేమికులకు హృదయవేదనని మిగిల్చాయి. అటువంటి ఒక ప్రేమకథ అలనాటి దిగ్గజాలు రాజ్ కపూర్, నర్గిస్ లది.

రాజ్ కపూర్ కుమారుడు రిషీ కపూర్ తన ఆత్మకథ ‘ఖుల్లం ఖుల్లా’లో వారి ప్రేమ వ్యవహారం గురించి చెబుతూ – “అప్పట్లో ఆయన ప్రేమలో ఉన్నారు, అయితే దురదృష్టవశాత్తు, ఆవిడ మా అమ్మ కాదు. ఆయన ప్రేయసి – ఆయన నటించిన ఆగ్ (1948), బర్సాత్ (1949), ఆవారా (1951) వంటి కొన్ని గొప్ప హిట్ సినిమాల నాయిక.” అని రాశారు.

మహబూబ్ ఖాన్ దర్శకత్వంలో ‘అందాజ్’ (1949) సినిమా షూటింగులో రాజ్, నర్గిస్ ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకున్నారని అంటారు. అప్పటికే నర్గిస్ గొప్పగా విజయవంతమైన హీరోయిన్. ఆమె ఖాతాలో 8 సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఆమెకి 20 ఏళ్ళు కాగా, రాజ్‌కి 22 ఏళ్ళు. నర్గిస్ సౌందర్యానికి ఆకర్షితులైన రాజ్ ఆమె పట్ల ప్రేమను పెంచుకున్నారు. నర్గిస్ కూడా రాజ్‍ని ఇష్టపడ్డారు. రాజ్ మీద ఇష్టంతో, నర్గిస్ ఆయన సినిమాలకి నిధులు సమకూర్చారని వార్తలొచ్చాయి. ఎన్నో మధుర క్షణాలు కలిసి గడిపిన్నప్పటికీ వారి బంధం సుఖాంతం కాలేదు, ఎందుకంటే రాజ్‌కి అప్పటికే కృష్ణ రాజ్ కపూర్‍తో వివాహమై, ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు.

పెళ్ళి చేసుకోలేకపోయినా, నర్గిస్ రాజ్‍తో తన బంధాన్ని వదులుకోవాలనుకోలేదట. నిపుణులైన లాయర్లతో మాట్లాడి రాజ్‍ని పెళ్ళి చేసుకునేందుకు గల అవకాశాలను అన్వేషించారట. ఎలాగైనా శ్రీమతి రాజ్ కపూర్ అనిపించుకోవాలని నర్గిస్ భావించారట, కాని ఆమె పట్ల విధి ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. కొన్నాళ్ల తరువాత, తమ బంధాన్ని నిలుపుకోడానికి తాను మాత్రమే ప్రయత్నిస్తున్నానీ, రాజ్ వదిలేసినట్టు నర్గిస్‍కి అనిపించిందట. పైగా రాజ్ కపూర్ సినిమాల్లో తనకు లభిస్తున్న పాత్రల పట్ల విసిగిపోయిన నర్గిస్, రాజ్‍కి చెప్పకుండా ‘మదర్ ఇండియా’ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ‘మదర్ ఇండియా’ షూటింగ్‍లో, సెట్‍లో అగ్నిప్రమాదం జరుగగా, సహనటుడు సునీల్ దత్ నర్గిస్‍ను రక్షించారు. సునీల్ దత్ ఈ సాహసోపేత చర్య తరువాత వారిద్దరూ ప్రేమలో పడి, 1958లో వివాహం చేసుకున్నారు.

~

నిలిచిన బంధం – ధర్మేంద్ర, హేమ మాలిని:

వెండితెరపై జంటగా ప్రేక్షకులని అలరించి, నిజ జీవితంలో కూడా ప్రేమలో పడి, దంపతులై, కాలపరీక్షకి తట్టుకుని నిలిచిన నటీనటులలో ధర్మేంద్ర-హేమ మాలినిలది విజయగాథ.

ధర్మేంద్ర, హేమ మాలిని తొలిసారిగా 1970లో ‘తు హసీన్ మై జవాన్’ చిత్రం షూటింగులో కలిశారు. ఆ సినిమాకి నాయికా నాయకులైన వీరిద్దరూ సెట్‍లో ఒకరిపై ఒకరు అభిమానం పెంచుకున్నారు. సినిమా పూర్తయ్యేసరికి ప్రేమలో మునిగిపోయారు. గతంలో ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్‍కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో – తాను తొలిసారిగా ధర్మేంద్రని చూసిన క్షణమే ఆయనని తన భాగస్వామిగా నిర్ణయించుకున్నాననీ, జీవితమంతా ఆయనతోనేనని నిశ్చయించుకున్నానని తెలిపారు. వారిది తొలిచూపు ప్రేమ అయినప్పటికీ – పెళ్ళి గురించి ఇద్దరికీ అనుమానాలుండేవట. ఎందుకంటే ధర్మేంద్రకి అప్పటికే ప్రకాశ్ కౌర్‍తో వివాహమైన్ సన్నీ, బాబీ, విజేత, అజేత అనే నలుగురు పిల్లలున్నారు. అయితే, హేమ మాలిన పట్ల ఆయన ప్రేమకి ఇవేవీ అడ్డం కాలేదట.

అయితే సంజీవ్ కుమార్, జితేంద్ర లాంటి వాళ్ళు పెళ్లి చేసుకుందామని హేమ మాలినిని అడిగారనీ, ఆమె తిరస్కరించారన్న వార్తలూ వెలువడ్డాయి.

ధర్మేంద్రకి అప్పటికే పెళ్ళయి ఉండడంతో హేమ మాలిని తండ్రి వారి వివాహానికి అంగీకరించలేదు. అయితే తమ వివాహం ఎవరినీ బాధించడకూడదని తాను తలచినట్టు హేమ డెక్కన్ క్రానికల్‍ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే – తాను వారి జీవితాల్లోకి చొరబడినట్లు – ధర్మేంద్ర మొదటి భార్య, పిల్లలు ఎన్నడూ భావించలేదని హేమ అన్నారు. తాను ధర్మేంద్రని పెళ్ళి చేసుకున్నప్పటికీ, ఆయనని ఆయన మొదటి కుటుంబం నుంచి దూరం చేయలేదని ఆమె చెప్పారు.

 

రెండు వైపుల నుంచి కుటుంబాల అంగీకారం లేకపోయినా, ఐదేళ్ళు ప్రేమించుకున్న తరువాత, 1980లో ధర్మేంద్ర, హేమమాలిని వివాహం చేసుకున్నారు. అయితే, ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ విడాకులకు అంగీకరించకపోవడంతో, హిందూ వివాహ చట్టం ప్రకారం ఆయన రెండో పెళ్ళి చేసుకోకూడదు. అందుకని, హేమతో వివాహానికి ముందు ఆయన రహస్యంగా ఇస్లాంలోకి మారారని అంటారు. వీరిద్దరూ అయ్యంగార్ పద్ధతిలో పెళ్ళి చేసుకున్నారు.

2 నవంబర్ 1981 నాడు ఈ దంపతులకు తొలి సంతానంగా ఈషా జన్మించింది. నాలుగేళ్ళ తరువాత, 28 జూలై 1985 నాడు ఈ దంపతులకు అహానా అనే కుమార్తెకు అమ్మానాన్నలయ్యారు. వీరి జీవితాలు సజావుగా సాగాయి. ప్రస్తుతం ఈశా, అహానాలు పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ధర్మేంద్ర మొదటి భార్య పిల్లలు, రెండో భార్య పిల్లలు సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వీరు బహిరంగంగా కలిసి కనబడటం తక్కువే కానీ, అలా కనబడినప్పుడు అందరి దృష్టీ వారి మీదే ఉంటుందనేది వాస్తవం!


గాయని మీనా కపూర్:

మీనా కపూర్ హిందీ చిత్రాలలో ప్రముఖ నేపథ్య గాయని. ప్రధానంగా 1940 – 1950లలో పాడారు. ఆమె తండ్రి బిక్రమ్ కపూర్‌ 30వ దశకంలో ప్రసిద్ధులైన నటుడు కావడం వల్ల, పిసి బారువా (కెఎల్ సైగల్ గారి ‘దేవదాస్’ దర్శకుడు) దగ్గరి బంధువు కావడం వల్ల మీనా సినిమాలకు కొత్తేమీ కాదు.

మీనా కపూర్‌ను 40వ దశకంలో మొదట గుర్తించింది స్వరకర్త నిను ముజుందార్. ఆమె ఒక అత్యుత్తమ గాయని అని ఆయన భావించారు, అయితే మొదట విడుదలైన ఆమె ట్రాక్ – ‘ఆఠ్ దిన్’ (1946) చిత్రానికి ఎస్.డి. బర్మన్ సంగీతం అందించారు. దాంతో, గాయనిగా మీనా ప్రతిభ వికసించింది. ఆమె 11 సంవత్సరాల వయస్సులో నేపథ్య గానం పాడారు. మీనా కపూర్ తన మొట్టమొదటి పాటను రికార్డ్ చేసినది నిను ముజుందార్ గారి కోసం అయినప్పటికీ, మొదటి విడుదలైన ఆమె ట్రాక్ – ‘ఆఠ్ దిన్’ (1946) చిత్రానికి ఎస్.డి. బర్మన్ సంగీతం అందించారు.

మరుసటి సంవత్సరంలో, ఆమె ‘షెహనాయ్‌’లో ‘ఆనా మేరీ జాన్ మేరీ జాన్ సండే కే సండే’ అనే మరపురాని పాటను పాడారు. ఈ పాటను సి రామచంద్ర స్వరపరిచారు. మీనా కపూర్ 1948లో ‘అనోఖా ప్యార్’ సినిమా కోసం పాటలు రికార్డింగ్ చేస్తున్నప్పుడు అనిల్ బిస్వాస్‌ను కలిశారు. ఇద్దరూ 1959లో పెళ్లి చేసుకున్నారు.

మీనా కపూర్ తన స్వల్పకాలిక కెరీర్‌లో 100 కంటే ఎక్కువ పాటలు పాడారు. ‘ఏ దిల్ మేరీ వఫా మే’ (అనోఖా ప్యార్, 1948), ‘కుచ్ ఔర్ జమానా కెహతా హై’ (ఛోటీ ఛోటీ బాతేన్, 1965), ‘భీగీ భీగీ రాత్ ఆయీ’ (మెహమాన్, 1953) వంటివి ఆమె ఇతర ప్రసిద్ధ పాటలలో కొన్ని.

ఆమె 1959లో సంగీత దర్శకుడు అనిల్ బిస్వాస్‌ను వివాహం చేసుకుని ఆయన రెండవ భార్య అయ్యారు.

అనిల్ బిస్వాస్ తరువాతి కాలంలో హిందీ సినీ రంగాన్ని వదిలి మార్చి 1963లో ఆల్ ఇండియా రేడియో (AIR)లో నేషనల్ ఆర్కెస్ట్రా డైరెక్టర్‌గా మారడంతో, ఆమె కూడా ఢిల్లీకి మారు. ఈ దంపతులకు పిల్లలు లేరు.

ఆమె కోల్‌కతాలోని తన ఇంట్లో 23 నవంబర్ 2017 గురువారం తెల్లవారుజామున మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here