అలనాటి అపురూపాలు – 205

0
11

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

గీత రచయిత యోగేశ్

సినీరంగంలో ఎందరో ప్రతిభావంతులున్నారు. అయితే అందరికీ ప్రవేశం అంత సులువుగా లభించలేదన్నది వాస్తవం. కొందరు త్వరగా నిరాశపడి, తమ ఆశల్ని వదిలేసుకుంటే, కొందరు ఎంత ఆలస్యమైనా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. ఒక్కోసారి అదృష్టం ఏదో ఓ రూపంలో ఎదురై అవకాశంగా మారుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని సినీప్రవేశం కావించి, రాణించి నిలదొక్కుకున్నవారు ఎందరో. అటువంటి ప్రతిభావంతుడైన గీత రచయిత గురించి కార్తీక్ సెహగల్ – నేషనల్ హెరాల్డ్ కోసం మే 2020లో వ్రాసిన ఒక కథనాన్ని చదువుదాం.

***

60వ దశకంలో, సినిమాల్లో ఉపాధి దొరక్క, ఓ ఫర్నిచర్ షాప్‌లో ఉద్యోగంలో చేరారు యోగేష్. తన ప్రాణ స్నేహితుడికి ఈ విషయం తెలిసిపోతుందేమోనని ఆందోళన చెందారు, ‘ఎట్టి పరిస్థితుల్లోనూ’ తన విషయాన్ని రహస్యంగా ఉంచాలని ఆ షాప్ యజమానిని అభ్యర్థించారు. అయితే, యోగేష్ ప్రాణ స్నేహితుడు సత్తు (సత్య ప్రకాష్)కి ఆ రహస్యం తెలిసిపోయింది. సత్తు షాప్ బయట నిలబడి తనని చూడడం గమనించిన యోగేష్ వణికిపోయారు. షాప్ బయట సత్తు యోగేష్‌ను హత్తుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాంటి ఉద్యోగాలను వదిలిపెట్టి, రచనల పైనే దృష్టి పెట్టమని కోరారు. తాను ఎంత ప్రయత్నించినా సినిమాల్లో అవకాశం రావడం లేదు, ఇకపై వస్తుందని అనుకోలేదు యోగేష్. సత్తు మాత్రం తన మిత్రుడు ఖచ్చితంగా గీత రచయిత అవుతాడని నమ్మారు.

“అతను నాపై గొప్ప నమ్మకం కలిగి ఉన్నాడు,” అని యోగేష్ చెప్పారు.

సత్తు వైఖరి యోగేష్‌లో అయోమయం కలిగించింది. వారి మధ్య రక్తసంబంధమేదీ లేదు. అయితే, వారు బాల్యంలో లక్నోలోని పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అక్కడ యోగేష్ 5వ తరగతిలో పదాలను వల్లించడం, వాటిని ఉపయోగించడం సత్తు గమనించారు.

ఆ ఫర్నీచర్ షాప్ బయట సత్తు తనను కౌగిలించుకున్నప్పుడు, యోగేష్ ఆశ్చర్యపోయారు. “నన్ను కౌగిలించుకుంటున్న ఈ వ్యక్తి ఎవరు? ఇతన్ని నా దగ్గరకు ఎవరు పంపారు? ఇతను నన్ను ఎందుకు అంతలా ప్రేమిస్తున్నాడు? అతని హృదయం నా కోసం ఎందుకు బాధపడుతుంది?” లాంటి ఆలోచనలు – ‘ఆనంద్’ సినిమాలోని ఈ ప్రసిద్ధ పంక్తులను వ్రాయడానికి దారితీశాయి:

“కహీఁ తో యే దిల్ కభీ మిల్ నహీ పాతే

కహీఁ సే నికల్ ఆయే యే జన్మోంకే నాతే

హై మీఠీ ఉల్‌ఝన్, బైరీ అప్నా మన్

అప్నా హీ హోకే కే సహే దర్ద్ పరాయె”

(కొందరితో ఈ హృదయం కలవదు, కొందరు ఎన్నో జన్మల బంధంలా ఎక్కడ్నించో వచ్చి కలుస్తారు. ఇదో తీయని సందిగ్ధత, మన మనస్సే శత్రువు, మనదే అయినా, ఇతరుల బాధనూ సహిస్తుంది)

ఈ పాటలోని ప్రతి చరణంలో గంభీరమైన భావం తొణికిసలాడుతుంది. ఈ సినిమాతో యోగేష్‍కి సినీపరిశ్రమలో స్థానం లభించింది. ఆయన సరళమైన పదాలతో, లోతైన ఆలోచనలను వ్యక్తం చేసే రచయిత.

‘ఆనంద్’ సినిమా లోనిదే మరో పాటని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది:

“జిందగీ కైసీ హై పహేలీ హై

కభీ యే హసాయే కభీ యే రులాయే”

(జీవితం ఓ ప్రహేళిక. ఒక్కోసారి మనల్ని నవ్విస్తుంది, ఒక్కోసారి ఏడిపిస్తుంది).

ఈ సినిమాకి ముందుగా పాటలు, సంగీతం సమకూర్చుకుని తరువాత షూటింగ్ చేశారట. సినిమాలో ఈ పాటని చేర్చేందుకు గాను రాజేష్ ఖన్నాపై బీచ్‍లో చిత్రీకరించారు.

యోగేష్‍కి క్రమంగా అవకాశాలు రాసాగాయి. సత్తు ఎంతగానో సంతోషించారు. యోగేష్ తాను రాసిన ఎన్నో గీతాలను పాడి వినిపించి ఆయన అభిప్రాయం అడిగేవారు.

అయితే, ఓ సమస్య ఎప్పుడూ ఉండేది. జీవితం నుండి గ్రహించిన పాఠాలను – సరళమైన పదాలతో అర్థవంతమైన సినిమా సాహిత్యంగా రూపొందించగలరు యోగేష్. అయితే ఆయనకు సినీ రాజకీయాలు నప్పలేదు. “నేను చాలా సాదాసీదా మనిషిని అని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు” అని ఆయన నిక్కచ్చిగా చెప్పేవారు.

నిర్మాతలు తరచుగా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించేవారు, పారితోషికం బకాయిలు సమయానికి చెల్లించేవారు కాదు. ఓ సమస్యాత్మక నిర్మాత, తన అహాన్ని చల్లార్చుకోడానికి ఒక పాట కోసం పంక్తుల తర్వాత పంక్తులు వ్రాసేలా చేసాడు. యోగేష్ కూడా తనకు చేతనైనంత సేపు పట్టుదలతో రాశారట. కానీ తర్వాత, నిర్మాత జులుంతో విసుగు చెంది మధ్యలో వెళ్లిపోయారట.

మరొక సందర్భంలో, ఒక దిగ్గజ సంగీత దర్శకుడు అవకాశాల కోసం బొంబాయి వచ్చారు. యోగేష్ ఆయనని నిర్మాతల కార్యాలయాలకు తీసుకువెళ్ళి  పరిచయం చేశారు. ఆ దిగ్గజ స్వరకర్తకు అవకాశాలు దొరికిన తరువాత, యోగేష్‌ను, ఆయన ఫోన్ కాల్స్‌నీ ఏ మాత్రం పట్టించుకోలేదు.

యోగేష్ నిరాడంబరత గురించి ఆయన స్నేహితులు ఆయన్ని హెచ్చరించారు. ఇతరుల పట్ల మరీ అంత మంచిగా ఉండవద్దనీ, అంత సహాయాలు చేయనక్కరలేదని అన్నారు. కానీ యోగేష్ తన పద్ధతిని మానుకోలేదు. తన బాటలోనే నడిచారు. ఓ సినిమా ప్రాజెక్టులో – తనతో పాటుగా మరో గీత రచయితకి చోటివ్వడంలో ఆయనకి ఏ ఇబ్బందీ ఉండేది కాదు. మిగతావారిలా, రచ్చ చేసేవారు కాదు.

“చెడు మార్గంలో వెళ్లకూడదనేదే నిర్ణయం – అది సంస్కారం,” అంటూ తన ఆలోచనా విధానంపై స్పష్టతనిస్తూ – నేషనల్ హెరాల్డ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నారు యోగేష్. “అవకాశాలు ఉన్నప్పటికీ నేను చెడు మార్గంలో వెళ్లలేదని నమ్మకంగా చెప్పగలను,” అన్నారాయన.

తన ప్రవర్తన ఎలా ఉన్నదనేదే ఆయనకి ముఖ్యం. అన్యాయంగా చేయలేకపోయారు, అవసరమైనవారికి సహాయం చేయకుండా ఉండలేకపోయారు.

మీరు సినిమా పరిశ్రమకు పనికొస్తారా అని అడిగిన ప్రశ్నకు జవాబుగా, ఈ రంగంలోకి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని; పరిశ్రమ వ్యక్తులను వెంటాడడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయవద్దని చెప్పారాయన.

ఆయన తన అనుభవం నుండి మాట్లాడుతున్నారు. ఎందుకంటే, ‘ఆనంద్’, తరువాత, ‘రజనీగంధ’ సినిమాతో విజయం సాధించినప్పటికీ, యోగేష్‌కి అంత సులభంగా పని దొరకలేదు.

నేను ఒక కళాశాలలో ఫిల్మ్ కోర్సులో నా పని గురించి చెప్పాను, అక్కడ విద్యార్థులు యోగేష్ సాహిత్యాన్ని ఇష్టపడ్డారు. ఈ పదాలు ఏ యువతకైనా ఎందుకు నచ్చవు?

“నా జానే క్యూఁ హోతా హై యే జిందగీ సాథ్,

అచానక్ యే మన్, కిసీ కే జానే కే బాద్,

కరే ఫిర్ ఉస్కీ యాద్,

ఛోటీ ఛోటీ సీ బాత్”

(మనకెందుకిలా అవుతుంది – చెప్పు, మనకి అత్యంత ఆత్మీయులైన వారు హఠాత్తుగా మనల్ని వీడినప్పుడు, మన హృదయంలో వాళ్ళ జ్ఞాపకాలు – చిన్న చిన్న సంగతులు)

ప్రస్తుతం రాజ్యమేలుతున్న సినిమా సంస్కృతి గురించి మాట్లాడుకున్నాం. ఆధునిక సంగీతం యొక్క 24×7 లభ్యతకు చాలా అలవాటు పడ్డామని నా అభిప్రాయాన్ని చెప్పాను. ‘మేము ఎంచుకోము లేదా ఎన్నుకోము. మాకు ఇవ్వబడింది, కాబట్టి తీసుకుంటాం’ అని ఆయనతో అన్నాను. ‘మన కోసం సమయం కేటాయించి ఎంచుకుంటే ఎన్నో పాత పాటల సాహిత్యం, సంగీతం మనకు నచ్చుతాయి’ అని అన్నప్పుడు..

యోగేష్‌లో ఆసక్తి – “ఏమైంది నేటి సంగీతానికి? మెలోడీలు ఎక్కడ?” అన్నారు.

తాను ఇష్టపడే, తనిని గౌరవించే, తనితో పని చేయాలనుకున్న (కానీ అలా జరగలేదు) కొంతమంది సంగీత దర్శకుల పేర్లను చెప్పారు యోగేష్. అయితే, సాంకేతిక పురోగతి – మెరుగైన సంగీతానికి దారితీయలేదని, అది సాహిత్యం నాణ్యతను కూడా ప్రభావితం చేసిందని ఆయన ఖచ్చితంగా చెప్పారు.

అతను తాను రాసిన కొన్ని పాటలను హమ్ చేసారు. ఒకదాన్ని రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. వెంటనే ఒక విద్యార్థి ఆయన్ని గుర్తించి, నాకు మెసేజ్ పంపాడు – “నేను వారిని కలవాలనుకుంటున్నాను.” అని.

తర్వాత మా సంభాషణ – సుమారుగా రెండేళ్ళ క్రితం మరణించిన శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి పైకి మళ్ళింది.

“ఆయన చనిపోయిన మరు నిమిషంలో, వార్తా ఛానెల్‌లు వారి కవిత్వమంతా గుర్తుచేసుకున్నాయి; వాళ్ళు దానిని టీవీలో నాన్‌స్టాప్‌గా ప్లే చేశారు. ఆయన మరణానికి ముందు – వారాలు, నెలలు మరియు సంవత్సరాల్లో వీళ్లంతా ఎక్కడ ఉన్నారు?” అని అడిగారు యోగేష్.

నన్ను ఆయన వివరాలు అడిగితే – ప్రచురణ సంస్థలు/ఛానెల్స్ తరచుగా సంస్మరణలను ముందుగానే రూపొందిస్తాయి. ప్రముఖులు మరణించగానే, వాటిని త్వరగా బయటకు తీయడానికి పోటీపడతాయని చెప్పాను.

“నాకూ అలాగే అవుతుంది. అందరికీ అదే జరుగుతుంది,” అన్నారు యోగేష్.

జర్నలిజం గురించి మాట్లాడుకుంటూ మేము వారి టెర్రస్ మీదకి వెళ్ళాం. ఒక చిన్న ప్రదేశాన్ని చూపించి – అక్కడ కూర్చుని ఎన్నో పాటలు రాశానని చెప్పారు. చాలా మంది పాత్రికేయులు వచ్చి ఆయనని కలిసినా, ఈ చోటు చూపించమని ఎవరూ అడగలేదట. తమ వృత్తిని అమితంగా ఇష్టపడేవారికి ఇలాంటి సంగతులు చాలా ఉపయుక్తంగా ఉంటాయని చెప్పాను. అలాంటివి యోగేష్ గారికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి.

పేరు చెప్పగానే ఆయనని గుర్తు పట్టకపోవచ్చు కానీ ఆయన పాటలు మాత్రం గుర్తుంటాయి. కథక్ డ్యాన్సర్, సైకాలజీ విద్యార్థిని శ్రేయా పండిట్ అలాంటి శ్రోతలలో ఒకరు. ఆమెకు 20 ఏళ్లు, యోగేష్ పాటలు చాలా ఇష్టం. నేటి యువ శ్రోతల గురించి ఆమె ఒక విషయాన్ని చెప్పింది: “వారు ఎప్పుడూ లోతులకి వెళ్ళరు, వాళ్ళ సంబంధాలు చాలా వరకు కృత్రిమం. అందుకే, వారు మంచి పాటలోని పదాల గాంభీర్యాన్ని అనుభవించలేరు.”

సారహీనత గురించి, ఆధునిక సంబంధాల గురించి నేను ఆయనని అడిగితే, పూర్తిగా సమాధానం ఇవ్వలేదు. ఆయన అలసిపోయారని, వారికి విరామం కావాలని నేను అనుకున్నాను. నిరంతరంగా ఉన్న తన కంటి సమస్య గురించి ఒక లైన్ చెప్పినప్పుడు, నా ప్రశ్నకు సూక్ష్మంగా సమాధానం ఇచ్చినప్పుడు – నేను మనసులో ఏమనుకున్నానో అవే మాటలు ఆయన నోటివెంట వచ్చాయి: “చూడాల్సినవన్నీ చూసేశాను.”

సినిమాలు, వేదాంతం సంగతులు ఆపి, కాసేపు మేడ మీద నడిచాము. నవ్వుతూ, కబుర్లు చెప్పుకున్నాము. నేను కొన్ని ఫోటోలు తీశాను. అప్పుడే నాలో ఒక ఆలోచన కలిగింది: ‘సినిమా ప్రపంచంలోకి రావాలనుకునే ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. వారి స్వభావం, జనాలతో కలవలేని వారి అసమర్థత కారణంగా వారికి అవకాశం లభించదు. బహుశా యోగేష్ అదృష్టవంతుడే కావచ్చు, ఆయనకి మద్దతుగా ఒక గొప్ప స్నేహితుడు ఉన్నాడు’.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here