అలనాటి అపురూపాలు – 208

0
12

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

ఐశ్య్వర్యం నుంచి కటిక పేదరికం వరకూ – నటి మీనా షోరే

‘లారా లప్ప గర్ల్’ గా ప్రసిద్ధికెక్కిన నటి మీనా షోరేది విచిత్రమైన గాథ. కెరీర్ ఉచ్చస్థితిలో ఉండగా the heart throb of India అని జనాలు అభిమానంగా పిలుచుకున్న ఈ నటి – తన సోదరి కుమార్తెల వివాహం చేయడానికి గాను 1980లలో పాకిస్తాన్‍లో సినీ కార్యక్రమాలలో భిక్షాటన చేయవలసి రావడం ఆమె దుస్థితిని తెలుపుతుంది.

మీనా అసలు పేరు ఖుర్షీద్ జెహాన్‌. 1921లో ఫిరోజ్‌పూర్‌లో ఒక చిన్న గ్రామీణ కుటుంబంలో నలుగురు సంతానంలో రెండవ బిడ్డగా జన్మించారు. ఆమె తండ్రి ముల్తాన్‌లో ఉండేవారు, కానీ ఆయన తన వ్యసనాల కారణంగా, ఆ ఊర్లో తమ కుటుంబానికి ఉన్న భూమిని పోగొట్టుకున్నారు. లాహోర్‌లో అద్దకం వ్యాపారం చేశారు, కానీ అది కూడా విఫలమైంది. ఆయన తన భార్యను దారుణంగా కొట్టేవారు. మీనా అక్క, వజీర్ బేగం, పెళ్లి చేసుకుని బొంబాయికి మారారు, ఆమె తనతో పాటు తల్లిని, మీనాని కూడా బొంబాయికి తీసుకువచ్చారు.

మీనాకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. కానీ తన తండ్రికి ఇవేమీ ఇష్టం ఉండవని ఆమెకు తెలుసు. ఓ నేస్తం సహాయంతో, మీనా నాటకాలలోకి వచ్చారు. అయితే, 12 ఏళ్ళ వయస్సులో  లైలా మజ్ను కథ ఆధారంగా ప్రదర్శిస్తున్న నాటకంలో ‘లైలా’ పాత్రను పోషిస్తూ వేదిక మీద ఉండగా ఆమె తండ్రికి పట్టుబడ్డారు, ప్రదర్శన మధ్యలో ఆమెను వేదికపై నుండి ఇంటికి లాక్కుపోయారాయన. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. మీనాకు కలకత్తాలో నెలకు 350 రూపాయలకు రంగస్థలంపై పని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, ఆయన పశ్చాత్తాపం చెందారు. కానీ ఆమె తండ్రి ఆమెకి వివాహం చేయాలని ప్రయత్నించడంతో ఆమె కుటుంబం తిరిగి లాహోర్‌కు మరలింది. కానీ మీనా పెళ్ళికి నిరాకరించి, తిరిగి బొంబాయికి వచ్చారు. బొంబాయిలో, మీనా, సోహ్రబ్ మోదీ గారి ‘సికందర్’ (1941) సినిమా ముహూర్తం షాట్‌కు తన బావతో కలిసి వెళ్ళారు. ఆమె సౌందర్యానికి ఆకర్షితులైన్న మోదీ, ఆమెకు సినిమాలో సహాయక పాత్ర ఇచ్చి, ఆమెతో ప్రత్యేకంగా నెలకు 650 రూపాయల పారితోషికంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమెకు మీనా అనే పేరు కూడా పెట్టారు. ‘సికందర్’ చాలా ఆడింది, మీనాకి మార్గం సుగమమైంది. ‘ఫిర్ మిలేంగే’ (1942), ‘పృథ్వీ వల్లభ్’ (1943) సినిమాల్లో మోదీ ఆమెకు రెండవ నాయిక పాత్రలు ఇచ్చారు. ‘పృథ్వీ వల్లభ్’ లో, ఆమె అల్ నాసిర్ సరసన నటించారు, తరువాతి రోజుల్లో ఆయనని వివాహం చేసుకున్నారు. ఇతర మహిళలతో నాసిర్ సంబంధాల కారణంగా ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. మీనాకి ఇది రెండో పెళ్లి. ఆమె అంతకుముందు 1941లో మరో నటుడు జహుర్ రాజాను వివాహం చేసుకున్నారు.

లాహోర్‌కు చెందిన చిత్రనిర్మాత రూప్ కె షోరే – తన తదుపరి చిత్రం ‘షాలిమార్’ (1946) కోసం నాయిక కోసం బొంబాయి వచ్చినప్పుడు మీనా ఆయనని మొదటిసారి కలిశారు. ఈ సినిమాలో మీనాను హీరోయిన్‌గా అనుకున్నా, సోహ్రాబ్ మోదీ కాంట్రాక్ట్ అడ్డు వచ్చింది. అలాగే, మెహబూబ్ ఖాన్ గారి ‘హుమాయున్’ (1945) సినిమా చేయకుండా ఈ ఒప్పందం అడ్డుకుంది. ఇంకా, లాహోర్ పర్యటనలో, ఆమె నిర్మాత దల్సుఖ్ పంచోలీని కలిసి, ‘షహర్ సే దూర్’ (1946), ‘ఆర్సీ’ (1947) అనే రెండు చిత్రాలకు సంతకం చేశారు. వెంటనే సోహ్రాబ్ మోదీ కోర్టులో ఆమె పై కేసు వేసి రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తన నిరక్షరాస్యతను ఉపయోగించుకుని, మోదీ తనను మూడేళ్లపాటు వర్తించేలా కాంట్రాక్టు రాయించారని మీనా చెప్పారు. వాస్తవానికి కాంట్రాక్ట్ ఒక సంవత్సరం మాత్రమే ఉండాలి. తనను విడుదల చేసేందుకు మోదీ రూ. 60,000 డిమాండ్ చేశారని, మోదీ భార్య మెహతాబ్ సహాయం కోరగా, చివరకు రూ.30,000తో విషయం సద్దుమణిగిందని ఆమె తెలిపారు. ఈ ఒప్పందం నుంచి వైదొలగానే, మీనా లాహోర్‌కు తిరిగి వచ్చి ‘షహర్ సే దూర్’, ‘ఆర్సీ’ లలో నటించి తన ఒప్పంద బాధ్యతలను నెరవేర్చుకున్నారు. మీనా లాహోర్‌లో నటించిన చివరి చిత్రం ‘పత్‍ఝడ్’ (1948). దేశ విభజన తరువాత, ఆమె బొంబాయికి వచ్చి, ‘యాక్ట్రెస్’ (1948), ‘దుఖియారీ’ (1948) వంటి చిత్రాలలో నటించారు. ఈ కాలంలో, విభజన తరువాత రూప్ కె షోరే కూడా భారతదేశానికి వెళ్లారని ఆమె విన్నారు. లాహోర్‌లో ఆయన స్టూడియోని తగలబెట్టారు, ఆయన బొంబాయిలో ఆర్థికంగా కష్టపడ్డారు. మీనా, నటుడు కరణ్ దేవాన్ కలిసి భారతదేశంలో రూప్ గారి మొదటి చిత్రం ‘చమన్’ (1948)ని పంజాబీ భాషలో రూపొందించడంలో సహాయం చేసారు. వినోద్ సంగీతం అందించిన ఈ చిత్రం లతా మంగేష్కర్ తన గాత్రాన్ని అందించిన మొట్టమొదటి పంజాబీ చిత్రం. ఈ సినిమాలో లత పాడిన ‘గలియాఁ చే ఫిర్దే ధోలా ​​నిక్కే నిక్కే బాల్ వే’, ‘చాన్ కిత్తే గుజారే-ఎ-రాత్ వే’ వంటి పాటలకు చక్కని ప్రశంసలు దక్కాయి. రూప్ కె షోరే గారి ‘ఏక్ థీ లర్కీ’ (1949)తో మోతీలాల్‌తో కలిసి నటించిన మీనా తన స్క్రీన్ కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. కామెడీ థ్రిల్లర్ అయిన ఈ చిత్రంలో, ఒక హత్యను చూసిన తర్వాత పరారీలో ఉన్న ఒక అమ్మాయిగా నటించారు మీనా. ఆమె లోని కొత్త కోణాన్ని ప్రదర్శించి, ఆమె హాస్య ప్రతిభను చాటింది ఈ సినిమా. అయితే అన్నింటికి మించి ‘లారా లప్పా లారా లప్పా’ పాటకు లభించిన ప్రజాదరణ సినిమా విజయానికి ప్రధాన కారణమైంది. ఈ పాట దేశంలోని ప్రతి మూలన హమ్ చేయబడింది, మీనాకి ‘లారా లప్పా గర్ల్!’గా గుర్తింపు తెచ్చింది. ఆమె తరువాత – రూప్ కె షోరేని పెళ్ళి చేసుకుని మీనా షోరే అయ్యారు.

‘ఏక్ థీ లర్కీ’ తర్వాత, మీనా చాలా స్థిరంగా సినిమాలు చేశారు, ఎక్కువగా రూప్ కె షోరేతో. కానీ ఏ సినిమా కూడా ‘ఏక్ థీ లర్కీ’ అంత విజయవంతం కాలేదు. అయితే మోతీలాల్ తో షోరేలు తీసిన, ‘ఏక్ దో తీన్’ (1953) హిట్ అయి వారికి విజయాన్నిచ్చింది. 1950ల మధ్య నాటికి, ఆమె ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆమె కెరీర్ క్షీణించడం స్పష్టంగా తెలిసింది.

ఈ సమయంలో, షోరేలను పాకిస్తాన్‌కు వచ్చి ఓ సినిమా చేయమని ఆహ్వానం అందింది. ఫలితమే ‘మిస్ 56’ (1956) చిత్రం. ఇది మీనా షోరే, సంతోష్ కుమార్, అస్లాం పర్వేజ్, షమీమ్ అరా, జరీఫ్ మరియు చార్లీ నటించిన ఒక అసంబద్ధమైన హాస్య చిత్రం. దీనికి జి.ఎ. చిస్తీ సంగీతం అందించారు. ఐ.ఎస్. జోహార్ రచించిన ఈ చిత్రం కథానాయికపై ఆధారపడిన కామెడీ. మీనా హాస్య ప్రతిభపై ఎక్కువగా ఆధారపడింది. ఈ చిత్రంలో మీనా జీప్‌లో వెళ్తున్న విలన్‌లను ఒంటెపై వెంబడించడం, భారీ విగ్గు, పెట్టుడు ముక్కుతో ఒక ఫ్రెంచ్ మహిళను అనుకరించడం వంటివి ప్రత్యేక ఆకర్షణలు! సినిమా యావరేజ్‌గా ఆడినప్పటికీ, లాహోర్‌కు తిరిగి వచ్చిన మీనాకు విపరీతమైన ప్రశంసలు లభించాయి. ఆమె తన భర్తని వదిలి పాకిస్తాన్‌కు మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు.

మీనా – పాకిస్తాన్‌లో అత్యంత విజయవంతమైన చిత్రం ‘సర్ఫరోష్’ (1956)లో సబిహా ఖనుమ్, సంతోష్ కుమార్‌లతో కలిసి నటించారు. ఇది ‘మిస్ 1956’కి ముందు విడుదలైంది. మీనా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ చిత్రంలో యువరాణి పాత్రలో నటించడానికి ఆమె సంతకం చేశారు, కానీ తర్వాత ఆ పాత్ర సబిహాకి దక్కింది, మీనాని బందిపోటు రాణిగా ‘చిన్న’ పాత్రను పోషించమని అడిగారు. తాను సినిమా నుండి తప్పుకున్నానని, అయితే దర్శకుడు అన్వర్ కెమాల్ పాషా, వారి తండ్రి విజ్ఞప్తి మేరకు ఆ సినిమాలో నటించానని చెప్పారు మీనా. అయినప్పటికీ, ఆమె ఆ చిత్రంలో బలమైన ప్రభావాన్ని చూపారు. చిత్రంలోని ఉత్తమమైన పాట – జుబైదా ఖానుమ్ పాడిన ‘తేరీ ఉల్ఫత్ మే సనమ్’ పాట మీనాపై చిత్రీకరించారు. లక్స్ సబ్బు కోసం మోడలింగ్ చేసిన మొదటి పాకిస్తానీ నటి కూడా మీనానే, తద్వారా ‘లక్స్ లేడీ ఆఫ్ పాకిస్తాన్’ అయ్యారు.

అయితే ‘అఖ్రీ నిషాన్’ (1958)తో పాటు పాకిస్తాన్‌లో ఆమె తదుపరి చిత్రాలతో – బాక్సాఫీస్ వద్ద తన ముద్ర వేయలేకపోయారు. దాంతో ఆమెకి సపోర్టింగ్ లేదా నెగిటివ్ పాత్రలు రావడం మొదలయింది, ఆమె ప్రాధాన్యత సన్నగిల్లింది. నిజానికి, ఏప్రిల్ 22, 1960 తేదీ నాటి స్క్రీన్ సంచికలో ఆమె అమర్‌నాథ్ సరసన పంజాబీ చిత్రం ‘మై జట్టి పంజాబ్ దీ’లో నటించడానికి భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. సర్దుల్ క్వాత్రా సంగీతం అందించిన ఈ చిత్రానికి హెచ్ఎస్ క్వాత్రా దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ మీనా దురదృష్టం ఈ సినిమా ఆగిపోయింది.

తిరిగి పాకిస్తాన్‌లో, ఆమె ‘మోసెకర్’ (1962)లో వ్యాంప్‌గా, ‘ఖామోష్ రహో’ (1964)లో వేశ్యాగృహ నిర్వాహకురాలిగా ముద్ర వేసినప్పటికీ, మంచి పాత్రలు మాత్రం చాలా అరుదయ్యాయి. త్వరలోనే ఆమె చిన్న సహాయ పాత్రలకు మళ్ళాల్సి వచ్చింది. ‘జమాలో’ (1962)లో తనతో నటించిన అసద్‌తో జరిగిన స్వల్పకాలిక వివాహం ఆమెకు వినాశకరంగా మారింది. బహుశా, ఆమె చేసిన చివరి పాత్రలలో ప్రాచుర్యం పొందినది పంజాబీ చిత్రం ‘జిగ్రీ యార్’ (1967)లోని పాత్ర కావచ్చు. ఈ సినిమాలో, జీనత్‌తో ఆమె చేసిన కామెడీ ట్రాక్ బాగా ప్రాచుర్యం పొందింది. ‘హమ్‌రాజ్’ (1967)లో ఆమె ఓ నెగటివ్ రోల్‍లో గవర్నెస్‌‌గా నటించారు. ఆ తర్వాత, చాలా సినిమాల్లో చిన్నా చితాకా వేషాలు వేశారు. షబ్నం-వహీద్ మురాద్ నటించిన ‘నిషానీ’ (1979) మీనా చివరి చిత్రం.

మీనా తన జీవితంలో చివరి సంవత్సరాలు పాకిస్తాన్‌లో కడు పేదరికంలో గడిపారు. డబ్బు దాచుకోకపోయినందున లాహోర్‌లోని మోహ్ని రోడ్‌లోని రెండు గదుల్లో నివసించే స్థాయికి దిగజారారు. ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరు. పాకిస్తాన్ ఆర్ట్స్ కౌన్సిల్, కొన్నిసార్లు రోటరీ క్లబ్ ద్వారా చెల్లించే చిన్న స్టైఫండ్‌తో జీవించారు. ఎదిగే పచ్చని మొక్కలతో నిండిన తోటలో ఎండిపోయిన చెట్టుగా ఆమె తనను తాను పోల్చుకున్నారు. ఎండిన చెట్టుని ప్రతి ఒక్కరూ కూల్చేసి కాల్చేసేవారే!

విస్మృతికి గురైన మీనా షోరే 1989లో ఒంటరిగా మరణించారు. ఓ స్వచ్ఛంద సంస్థ డబ్బుతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకి అతి తక్కువమంది హాజరవడం విచారకరం.


సౌండ్ రికార్డింగ్‌లో అనన్య ప్రతిభ – మీనూ కత్రక్

1950లు, 60లలో హిందీ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ సౌండ్ రికార్డిస్ట్‌గా పేరుపొందారు మీనూ కత్రక్. తారాదేవ్ లోని ఫేమస్ స్టూడియోస్ వారి చీఫ్ సౌండ్ రికార్డిస్ట్‌గా, హిందీ సినిమాలలోని కొన్ని మరపురాని మధురమైన పాటల వెనుక ఉన్న వ్యక్తి మీనూ కత్రక్. సంగీత దర్శకులు మదన్ మోహన్, శంకర్-జైకిషన్‌లకు ఇష్టమైన మీనూ కత్రక్ ఆధ్వర్యంలోనే ఫేమస్ స్టూడియోస్ చలనచిత్ర పరిశ్రమలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంది.

మంచి ఆదరణ పొందిన ‘మేళా’ (1948) చిత్రంతో ప్రారంభించిన మీనూ, ‘బర్సాత్’ (1949), ‘ఆవారా’ (1951), ‘ఆహ్’ (1953), ‘బూట్ పోలిష్’ (1954), ‘జాగ్తే రహో’ (1956)వంటి హిట్‌లతో తన ఖ్యాతిని పెంచుకున్నారు. రాజ్ కపూర్‌తో, మీనూకున్న సాన్నిహిత్యం 1970ల తొలిరోజుల వరకూ కొనసాగింది. 50వ దశకం చివరి భాగంలో మీనూ ‘న్యూ ఢిల్లీ’ (1956), ‘నయా దౌర్’ (1957), ‘కాలాపానీ’ (1958), ‘యాహుది’ (1958), ‘హౌరా బ్రిడ్జ్’ (1958), ‘డిల్లీ కా థగ్’ (1958) వంటి చిత్రాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

60వ దశకంలో ‘సాహిబ్ బీవీ ఔర్ గులాం’ (1962), ‘వో కౌన్ థీ’ (1964), ‘కశ్మీర్ కి కలీ’ (1964), ‘తీస్రీ కసమ్’ (1966), ‘తీస్రీ మంజిల్’ (1966), ‘జువెల్ థీఫ్’ (1967), ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్’ (1967) వంటి హిట్ చిత్రాలకు పని చేసి వాటి విజయంలో తన వంతు పాత్ర పోషించారు మీనూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here