అలనాటి అపురూపాలు – 209

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

స్వరకర్త గులామ్ మహమ్మద్

సినీ పరిశ్రమలో అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంతో ప్రతిభావంతుడై, నౌషాద్ కన్నా 15 ఏళ్ళు సీనియర్ అయిన గులామ్ మహమ్మద్‌కు తొలి అవకాశం 1937లో ‘బాంకే సిపాహి’ చిత్రంతో వచ్చింది. వాస్తవానికి నౌషాద్ కష్టాలలో ఉన్నప్పుడు ఆయనని ఉస్తాద్ ఝండే ఖాన్‍కు పరిచయం చేసి, ఆర్గాన్ ప్లేయర్‍గా అవకాశం కల్పించింది గులామ్ మహమ్మదే. కానీ విధివశాత్తు, నౌషాద్ వద్దే సహయకుడిగా అనేక సినిమాలకు పనిచేశారు గులామ్ మహమ్మద్. నౌషాద్ కుడిభుజం అయ్యారు. ‘పాకీజా’ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోడానికి ప్రధాన కారణం గులామ్ మహమ్మద్ అందించిన బాణీలే అనడంలో సందేహం లేదు.

గులామ్ మహమ్మద్ 1905లో బికనీర్‌లోని నాల్ గ్రామంలో జన్మించారు. వారి తండ్రి నబీ బక్ష్, ప్రముఖ తబలా వాద్యకారుడు. కుమారుడికి సంగీతంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు; ఢోలక్, తబలా, పఖావాజ్‌లలో వాయించడం నేర్పారు. గులామ్ మహమ్మద్ జోధ్‌పూర్-బికనేర్ థియేట్రికల్ కంపెనీలోనూ, లాహోర్‌లోని న్యూ ఆల్ఫోర్డ్ థియేటర్ కంపెనీలోనూ పనిచేశారు. హైదరాబాద్‌కు చెందిన ఉస్తాద్ రసూల్ ఖాన్ నుండి – మట్కా, డఫ్, ఖంజీరా మరియు చిమ్టా వంటి వాయిద్యాలలో తన నైపుణ్యాలను మెరుగుపర్చడానికి అధునాతన శిక్షణ పొందారు.

గులామ్ 1924లో అవకాశాలను అన్వేషిస్తూ బొంబాయి వచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ళ అనంతరం సరోజ్ మూవీటోన్ వారి ‘రాజా భర్తృహరి’ సినిమాలో తబలా వాయించే అవకాశం పొందారు. త్వరలోనే, ఆయన  పెర్కుషనిస్ట్ వాద్యకారుడిగా ఖ్యాతిని పొందారు, తరువాతి సంవత్సరాలలో, అనిల్ బిస్వాస్‌తో కలిసి పనిచేసే అవకాశం పొందారు. నౌషాద్‌తో వారి స్నేహం జీవితకాలం కొనసాగింది. నౌషాద్ స్వతంత్ర సంగీత దర్శకులయ్యాక గులామ్‌ని అసిస్టెంట్‌గా తీసుకున్నారు. వారు సంజోగ్ (1943) నుండి ఆన్ (1952) వరకు అనేక చిత్రాలకు కలిసి పనిచేశారు, ఎన్నో గొప్ప పాటలకు జీవం పోశారు.

‘మేరా ఖ్వాబ్’ (1943) విడుదలతో గులామ్ తన తొలి విజయాన్ని రుచి చూశారు. 1947లో, గులామ్ పి.ఎన్. అరోరా గారి ‘డోలీ’ సినిమాకి సంగీతం అందించారు, ఈ చిత్రంలో శంషాద్ బేగం పాడిన ‘అంగ్నా మే బోలే కాగా రే’ పాట చాలా ప్రజాదరణ పొందింది. తరువాత కాలంలో అరోరా, గులామ్ మహమ్మద్‍లు 10 చిత్రాలకు కలిసి పని చేశారు. కానీ ప్రశంసనీయమైన స్వరకర్తగా గులామ్ సంగీత ప్రయాణానికి బాట వేసిన చిత్రం ‘కాజల్’. ఈ సినిమాలో ఆయన స్వరపరిచి సురయ్య పాడిన ‘దిన్ పే దిన్ బీతే జాయే’ పాట అమితమైన ఆదరణ పొందింది.

‘గృహస్థి’, ‘పగ్డి’ చిత్రాలకు ఆయన అందించిన సంగీతం దేశంలో సంచలనం సృష్టించింది. ‘గృహస్థి’లో, శంషాద్ బేగం -ముఖేష్ ఆలపించిన ‘తేరే నాజ్ ఉఠానే కో’ అనే యుగళగీతంలో గులామ్ డోలక్ నైపుణ్యం అసామాన్యం. శంషాద్ బేగం ఆలపించిన ‘వాహ్ రే దునియా వా రే జమానే’ అత్యంత ప్రజాదరణ పొందిన మరొక పాట. ‘పగ్డి’ సినిమాలో, ‘ఏక్ తీర్ చలానే వాలే నే’ (ముఖేష్-సితార) వేగంగా సాగుతూ ప్రేక్షకులకు ఆకట్టుకుంది.

1949లో రెండు మ్యూజికల్ హిట్‌లు వచ్చాయి – అందాజ్ (నౌషాద్), బర్సాత్ (శంకర్ జైకిషన్). అదే ఏడాది గులామ్ సంగీతం అందించిన ‘పారస్‌’ కూడా విడుదలైంది. ఈ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఇస్ దర్ద్ కీ మారీ దునియా’, ‘బర్దార్ యే దునియా’, ‘దిల్ కా సహారా చూటే నా’ అనే పాటలు; మహమ్మద్ రఫీ పాడిన రెండు సోలోలు, ‘దిల్ కి లగీ నే హమ్‍కో’, ‘దిల్ లేకే చుప్నే వాలే’ – అత్యంత ప్రజాదరణ పొందాయి. గులామ్ ఈ పాటల్లో తన ట్రేడ్‌మార్క్ మట్కా రిథమ్‌ను ఉపయోగించారు. ‘పారస్’ కూడా అందాజ్, బర్సత్‌లతో పాటు ఆ ఏటి గొప్ప మ్యూజికల్ హిట్‍లలో ఒకటిగా నిలిచింది.

పి.ఎన్. అరోరా దర్శకత్వంలో – మధుబాల, రెహ్మాన్, కరణ్ దివాన్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘పర్‍దేశ్’ చిత్రానికి గులామ్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలలో అడుగడుగునా గులామ్ ముద్ర గోచరిస్తుంది. రఫీ-లతా యుగళగీతం, ‘అంఖియా మిలా కే జరా బాత్ కరో జీ’; శంషాద్ బేగం పాడిన ‘మేరే ఘుంఘర్ వాలే బాల్’, ‘ఏక్ రూత్ ఆయే ఏక్ రూత్ గయే’; లత పాడిన సోలో పాటలు – ‘ఓ జీ ధీరే ధీరే చలే రంజ్ దే కర్’, ‘రాత్ హై తారోం భరీ’ అమిత ప్రజాదరణ పొందాయి.

‘శీషా’ సినిమాకి గులామ్ చక్కని స్వరాలందించారు, ఇందులో లతా మంగేష్కర్ ‘ఖుషీ దిల్ సే హఁసీ హోఠోం సే’, ‘జవానీ కే రాస్తే మే ఆజ్ మేరా దిల్ హై’ అనే చిరస్మరణీయమైన మెలోడీలను పాడారు. ‘గౌహర్’ (1953) చిత్రంలో, గులామ్ సుధా మల్హోత్రా కోసం ‘అవాజ్ దే రహా హై కోయి అస్మాన్ సే’, ‘చలే గయే తుమ్ సూనీ బహర్ కర్ కే’ అనే రెండు గజల్స్‌ను స్వరపరిచారు. ఆమె ఈ గజల్స్‌ను అత్యంత అనుభూతితో ఆలపించారు. ఈ సినిమా కోసం ఆశా భోంస్లే తొలిసారిగా గులామ్ గారితో పనిచేశారు, మహమ్మద్ రఫీతో కలిసి ‘ధీరే ధీరే మేరా దిల్ లే కే చలే’ అనే యుగళగీతం పాడారు.

జయంత్ దేశాయ్ తీసిన ‘హజార్ రాతేఁ’ కోసం గులామ్ కొన్ని శ్రావ్యమైన పాటలు అందించారు. శంషాద్ బేగం పాడిన ‘ఠండీ హవా మే జియా డోలే’, ‘మత్‍వాలీ నజర్ హో డాలీ’ ‘ఆయే హై రాత్ ఖిలీ చాంద్‌నీ’ అనే సోలో పాటలు, ‘మేరే దిల్ కే ముసాఫిర్‌ఖానే మే’, ‘తుమ్ మేరీ కహానీ క్యా జానో’ వంటి యుగళగీతాలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి.

గులామ్ 1953లో ఐదు చిత్రాలకు సంగీతం అందించారు – ఇందులో షమ్మీ కపూర్ నటించిన రెండు చిత్రాలు ఉన్నాయి. ‘రేల్ కా డిబ్బా’ సినిమాలో శంషాద్ బేగం రఫీ ఆలపించిన ‘లే దే మోహే బల్మా, ఆస్మానీ చుడియాఁ’ అనే యుగళగీతం, ఆశా పాడిన సోలో, ‘భగవాన్ తేరీ దునియా మే ఇన్సాన్ నహీన్ హై’ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ‘లైలా మజ్ను’ సినిమా కోసం గులామ్ రెండు అమర గీతాలను స్వరపరిచారు. అవి: తలత్-లత పాడిన ‘ఆస్మాన్ వాలే తేరీ దునియా సే దిల్ భార్ గయా’, ఇంకా తలత్ పాడిన సోలో, ‘చల్ దియా కారవాన్ లుట్ గయే హమ్ యహాఁ’. ‘ఏ సనమ్ యే జిందగీ’ (శంషాద్), ‘యాద్ తేరీ జిందగీ కే సాథ్’ (ఆశా) కూడా గొప్ప పాటలు.

ఎ.ఆర్. కర్దార్ తీసిన ‘దిల్-ఎ-నాదన్’ (1953) చిత్రంలో గాయకుడు తలత్‌ కథానాయకుడు. గులామ్‍కి ఇష్టమైన లత, రఫీలు ఈ చిత్రంలో పాడలేదు. నటీమణులు శ్యామా, పీస్ కన్వాల్ కోసం సుధా మల్హోత్రా, జగ్జిత్ కౌర్‌లతో పాడించారు గులామ్. తలత్ పాడిన బెస్ట్ సోలో పాటలు ఈ సినిమాలోవే అనడం అతిశయోక్తి కాదు. ‘యే రాత్ సుహానీ రాత్ నహీఁ’, ‘జో ఖుషీ సే ఛోట్ ఖాయే’, ‘జిందగీ దేనెవాలే సున్’ తలత్‍కి పేరు తెచ్చాయి. తలత్, సుధ, జగ్జిత్‌ కలిసి పాడిన ‘మొహబ్బత్ కీ ధున్ బెకరారోం సే పూఛో’ అనే పాట విశిష్టమైనది. ఇంకా ఈ చిత్రంలో శంషాద్ పాడిన ‘ఏ దిల్ నా సతా ముఝ్‍కో’ పాట కూడా హిట్ అయింది.

ఒక రకంగా చెప్పాలంటే, కమల్ అమ్రోహి డ్రీమ్ ప్రాజెక్ట్ – ‘పాకీజా’కు స్వరాలందించడానికి గులామ్‌కి మార్గం సుగమం చేసింది ‘మీర్జా గాలిబ్’ సినిమాకి ఆయన అందించిన సంగీతం. ‘మీర్జా గాలిబ్‌’ సినిమా చూశాకా, కమల్ అమ్రోహి మనసు మార్చుకున్నారు. తన సినిమా ‘పాకీజా’ కోసం ముందు – ‘అనార్కలి’ చిత్ర విజయంతో ఆకాశంలో తేలిపోతున్న సి రామచంద్రను అనుకున్నారు. కానీ గులామ్‌‍కి అవకాశమిచ్చారు.

ఈ మధ్యలో, గులామ్ ‘సితార’ చిత్రానికి సంగీతం సమకూర్చారు, ఇందులో లత ‘జమునా కే పార్ కోయి బన్సీ బజాయే’, ‘చందా ధీరే సే ఆ’ వంటి అద్భుతమైన పాటలు పాడారు. లత పాడిన  ‘తక్‌దీర్ కి గర్దిష్ క్యా కమ్ థీ’ అనే గజల్ సూపర్‌హిట్ అయింది, కానీ దురదృష్టవశాత్తు, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది.

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా, గులామ్ అందించిన మరో క్లాసిక్ – తలత్-సురయ్య నటించిన ‘మాలిక్’ (1958) చిత్రం. ఇందులో వాళ్లిద్దరూ ‘మన్ ధీరే ధీరే గయే రే’ అనే చిరస్మరణీయమైన పాటని పాడారు. సురయ్య చివరి చిత్రం ‘షామా’ (1961) లో గులామ్ అద్భుతమైన బాణీలను అందించారు. కొత్తగా పరిచయం అయిన హీరో విజయ్ దత్ సరసన నిమ్మీ నటించారు.

‘పాకీజా’ కోసం గులామ్ ఆణిముత్యాల్లాంటి 15 బాణీలను స్వరపరిచారు, అయితే విడుదలైన చిత్రంలో ఆరు మాత్రమే ఉపయోగించారు. అన్ని పాటలు చాలా బాగున్నాయి, మిగిలిన పాటలతో ‘పాకీజా రంగ్ బ రంగ్’ అనే ఆడియో డిస్క్‌ని తీసుకొచ్చింది హెచ్.ఎం.వి. సంస్థ. ఈ సినిమా పాటల కోసం గులామ్ తన హృదయాన్ని అర్పించారు. నిజానికి ఈ సినిమా కోసం తన ప్రజ్ఞాపాటవాలని సంపూర్ణంగా వినియోగించారు. ఆయన అభిమాన సారంగి తాంత్రికుడు పండిట్ రామ్ నారాయణ్ – లత పాడిన ‘సారే రాహ్ చల్తే చల్తే’ పాటలో కావలసిన ప్రభావాన్ని రాబట్టడానికి 21 టేక్స్ ఇచ్చారు. గులామ్ తన శాస్త్రీయ సంగీత నేపథ్యాన్ని ఈ పాటలలో ఉపయోగించారు – రాగ్ కళ్యాణ్‌లో ‘మౌసమ్ హై ఆషికానా’, రాగ్ పహాడీలో ‘చలో దిల్ దార్ చలో’ అనే పాటలు అందించారు. ఈ సినిమాలోని సాంప్రదాయ పాట ‘ఇన్హీ లోగోం నే లే లీనా దుపట్టా మేరా’ (దీనిని స్వరకర్త గోవింద్ రామ్ 1940 లలో తన రెండు చిత్రాలలో ఉపయోగించారు) కి కొత్త వివరణ ఇచ్చారు గులామ్.

‘మహల్’ చిత్రంలో తను స్వరపరిచిన ‘ఆయేగా ఆనేవాలా’ పాట విజయాన్ని చూడలేకపోయిన ఖేమ్‌చంద్ ప్రకాష్ లాగా, ‘పాకీజా’ సినిమా విజయాన్ని చూసే అదృష్టం గులామ్‍కు దక్కలేదు. ఆ సినిమా పూర్తి కావడానికి ఒక దశాబ్దం పట్టింది. గులామ్ అప్పటికే రిహార్సల్ చేసిన రెండు పాటలు మినహా అన్ని పాటలను రికార్డ్ చేశారు. గులామ్ మరణానంతరం, ఈ రెండు పాటలను నౌషాద్ రికార్డ్ చేశారు, సినిమాకి నేపథ్య సంగీతం అందించారు.

అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తర్వాత మార్చి 17, 1968న గులామ్ మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here