అలనాటి అపురూపాలు – 214

0
11

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

ఆధ్యాత్మికత రంగం నుంచి సినీరంగంలోకి:

భారతదేశంలో జన్మించి అమెరికాలో స్థిరపడిన ఆధ్యాత్మికవేత్త అఖయ్ కుమార్ మొజుందార్. ఎ.కె. మొజుందార్‍గా ప్రసిద్ధికెక్కిన ఈయన ఓ అసాధారణమైన యోగి. బక్క పలచని శరీరం, గుచ్చినట్లు చూసే కళ్ళు గల మొజుందార్ ఎటువంటి మంత్ర తంత్రాలను అభ్యసించలేదు, ఆ కాలంలోని ఇతర యోగులు, గురువులు చేసినట్లుగా ప్రాచీన ప్రాచ్య విజ్ఞానాన్ని బోధించలేదు. ఆనాటి ప్రముఖ పాత్రికేయుడు ఫ్రెడరిక్ లైబ్ వ్రాసినట్లుగా, ఆయన “తన వేళ్లతో తాకడం ద్వారా ఉత్పన్నమయ్యే విశ్వ కిరణాలతో ప్రజలను స్వస్థపరిచారు”.

యూనివర్సల్ మెస్సియానిక్ మెసేజ్ అని పిలవబడిన ఆయన విలక్షణమైన తాత్వికత, పలు పురాతన గ్రంథాల సారాల మేళవింపు. అది సానుకూల ఆలోచనను బోధించే వారి ఉపన్యాసాలకు, మత గ్రంథాల నుండి సేకరించిన గుహ్యమైన బోధనకు ఆధారమైంది. 1910 దశాబ్దంలోనూ, 1920లలో కొన్ని సంవత్సరాల పాటు, ఆయన బోధనలు హాలీవుడ్ ప్రముఖుల లోనూ, లాస్ ఏంజిల్స్ ఉన్నత వర్గాలలోనూ ప్రాచుర్యం పొందాయి.

లైబ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొజుందర్‍కు దక్కిన జనాదరణకు కారణం ఆయన నిత్యత్వం. లైబ్ ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఆర్థిక మాంద్యం కాలంలో (1929-1933) అతనికి పనిలేకుండా పోయేసరికి, ఇతర విషయాలపై వ్రాసాడు. తన 1939 పుస్తకం ‘Sight Unseen: A Journalist Among the Occult’ లో, మోజుందార్ యవ్వనపు ఊటను కనుగొన్నారని లైబ్ పేర్కొన్నాడు. అతను మొజుందార్‌ను మొదటిసారిగా 1925లో కలిశాడు. వారి తదుపరి సమావేశంలో, ఎనిమిదేళ్ల తర్వాత, మొజుందార్ గతంలో కంటే చిన్నవాడిగా కనిపించారట.

అయితే ఈ నిత్యత్వపు అనుభవానికీ, మాయతో సంబంధం లేదు. ఇది మొజుందార్ జీవితంలోని ఇతర అంశాల మాదిరిగానే సత్యానికి అనుకూలమైన మలుపు. మొజుందార్ రచనలు, వారి శిష్యుల ప్రకారం ఆయన పుట్టిన సంవత్సరం 1864, అయితే ancestry.comలో అధికారిక రికార్డులు, 17 ఏళ్ళు తగ్గించి, 1881గా పేర్కొన్నాయి.

ఆ కాలపు వార్తాపత్రికలు ఆయన్ని తరచుగా ప్రిన్స్ లేదా భారతీయ రాజా అని సంబోధించేవి, ఫలితంగా ఆయనకు లభించే అసాధారణ గౌరవానికి ‘పై మెరుగు’ లభించింది. ఆయన తండ్రి బెంగాలీ న్యాయవాది. ఎనిమిది మంది తోబుట్టువులలో అందరికంటే చిన్నవారైన మొజుందార్ కలకత్తా సమీపంలోని ఓ గ్రామంలో ప్రారంభ సంవత్సరాలు గడిపారు. కానీ మోజుందార్ చెప్పిన కథనం ప్రకారం, వారి తల్లి ఆయన ఆధ్యాత్మిక ఆసక్తిని ప్రారంభంలోనే గుర్తించారట, అందుకే ‘అఖయ్ కుమార్’ అనే పేరు పెట్టారట, దీని అర్థం ‘దేవుని కుమారుడు’. ఈ కథనం ప్రకారం, ఆయన 16 ఏళ్ళ వయస్సులో ఇల్లు వదిలి, చైనా, జపాన్‍లలో సంచరించి, చివరికి 1903లో Seattle చేరుకున్నారు. క్రీస్తు జన్మస్థలమైన బెత్లెహెం గుండా ప్రయాణించినట్లు కూడా పేర్కొన్నారు.

తొలి పరివర్తనలు:

Seattle నగరానికి చేరుకున్నాక, అమెరికాలో తన ప్రారంభ సంవత్సరాల్లో, మోజుందార్ ఓ స్వీడిష్ కుటుంబంతో కొంతకాలం నివసించారు. ఈ కాలంలో కొత్త జీవన విధానాన్ని అలవర్చుకున్నారు, ఆంగ్లంపై పట్టుని పెంచుకున్నారు, క్రైస్తవ మతంపై అవగాహనను కల్పించుకున్నారు. Seattle నగరంలో వృద్ధి చెందుతున్న థియోసఫీ ఉద్యమంలో చేరారు. తర్వాత, స్వతంత్ర ఉపన్యాసకుడిగా, బోధకుడిగా ఆయన జీవితం ప్రారంభమైంది. 1908 నుండి, అతను బహిరంగ వేదికల పైనా, ఒరెగాన్‌లోని బెల్లింగ్‌హామ్‌లోని స్టేట్ నార్మల్ స్కూల్ వంటి సంస్థల లోనూ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు.

అయితే అప్పటికి బోధన ఆయన ఎంపిక కాదు. 1905 నాటి రస్సో-జపనీస్ యుద్ధం గురించి నివేదికలు రాస్తూ ఒకప్పుడు తనను తాను యుద్ధ విలేఖరిగా అభివర్ణించుకున్నారు. ఒక స్థానిక వార్తాపత్రికకి రాసిన ఒక కథనంలో, ఆధునికీకరణ కోసం జపాన్ చేస్తున్న కృషి గురించి, భారతదేశం వంటి దేశాలకు ఎలా ఆదర్శమో రాశారు.

1910 తర్వాత, ఆయన తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. దేశంలో విస్తృతంగా పర్యటించి, – స్పోకేన్, వాషింగ్టన్, బుట్టే, మోంటానా వంటి నగరాల్లో ప్రసంగాలు చేశారు. ఆయన తన బోధనను ‘క్రిస్టియన్ యోగా’ అని అనేవారు. మనస్సుని నియంత్రించడం, ఇంకా బైబిల్ ఆధారంగా ఉపన్యాసాల విలక్షణమైన కలయిక ఆ బోధన. ఇది Spokane లో కొద్దిపాటి అనుచరులను పొందడానికి, క్రిస్టియన్ యోగా మంత్లీ పేరుతో ఒక పత్రికని ప్రచురించడానికి వీలు కల్పించింది. న్యూ థాట్ మూవ్‌మెంట్ అనే ఛత్రఛాయ కింద అమెరికాలో విస్తృతమైన సమూహాలు, చర్చిలు ఉద్యమాలు నిర్వహిస్తున్న కాలం అది. వీటిలో న్యూ ఏజ్ మిస్టిసిజమ్, ఇండివిడ్యువలిజం, మెస్మరిజం వంటి విభిన్న సమూహాలు ఉన్నాయి.

పౌరసత్వంకై పోరాటం:

అమెరికా పౌరసత్వం కోసం చేసిన ప్రయత్నాల కారణంగా Spokane లో మొజుందార్ మరో రకంగా ప్రసిద్ధికెక్కారు. చైనీస్, జపనీస్‌లను దూరంగా ఉంచడానికి ఉద్దేశించిన మినహాయింపు చట్టాలతో అమెరికన్ రాజకీయాల్లో అది చాలా కష్టమైన సమయం. జాతిసాంకర్యానికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేయడానికి, విదేశీయులు భూమిపై యాజమాన్యం హక్కులు కలిగి ఉండకుండా నిరోధించడానికి పలు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

అయితే మొజుందార్ చెప్పుకున్నట్టు, అమెరికా పౌరసత్వం పొందిన మొదటి భారతీయుడు ఆయన కాదు. 1909లో, టాటా గ్రూప్‌ కోసం పత్తి కొనుగోలు చేసే, పార్సీ వలసదారు అయిన భికాజీ బల్సారాకు 1790 నాటి నాచురలైజేషన్ యాక్ట్ ప్రకారం ‘స్వేచ్ఛ’,’తెలుపు’ నిబంధనలను వర్తింపజేసి న్యూయార్క్‌లోని ‘సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్’ పౌరసత్వాన్ని మంజూరు చేసింది. నిజానికి ఇరాన్ నుండి వచ్చిన పార్సీలు, ఆర్యన్ మూలాలనబడే యూరోపియన్ వలసదారుల వలె కాకేసియన్‌లు అన్న ఆ కాలంలోని జాతివాద ఆలోచన ఆధారంగా బల్సారా వాదనలను కోర్టు అంగీకరించింది. నిజానికి బల్సారా కన్నా చాలా ఏళ్ళ ముందు, లాస్ ఏంజిల్స్‌కు చెందిన పార్సీ సోరాబ్జీ ఎడుల్జీ 1890లో పౌరసత్వం పొందారు.

ఒక ఉన్నత-కుల భారతీయుడిగా తాను కూడా కాకేసియన్ నని వాదించి, మోజుందార్ 1913లో శాన్ ఫ్రాన్సిస్కోలోని తొమ్మిదవ సర్క్యూట్ కోర్టు నుండి పౌరసత్వం పొందారు. ఒక అమెరికన్‌గా, అతను మొదటి ప్రపంచ యుద్ధం చివరిలో సైన్యంలోకి వెళ్ళాల్సి వచ్చింది.

అయితే, 1923లో, ఆయన పౌరసత్వం, అనేక ఇతర భారతీయుల పౌరసత్వం, సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయబడింది. యుఎస్ వర్సెస్ భగత్ సింగ్ థింద్ కేసులో “జాతి యొక్క సాధారణ అవగాహన” ప్రకారం, దక్షిణ ఆసియన్లు స్వేచ్ఛగా మరియు తెల్లగా లేరని తీర్పు చెప్పింది. మోజుందార్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత పౌరసత్వాన్ని తిరిగి పొందారు, 1950లో మళ్లీ దరఖాస్తు చేసినప్పుడు, 1946 లూస్-సెల్లర్ చట్టం ప్రకారం “రెసిడెంట్ ఎలైన్స్” పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించారు.

సినీరంగంలోకి ప్రవేశం:

1920ల మధ్యకాలంలో, మోజుందార్ లాస్ ఏంజెల్స్‌లో నివసించేవారు. తన ఆధ్యాత్మిక ఆలోచనలను వివరించే చిత్రంపై పని చేస్తున్నారు. ‘బియాండ్ ది వీల్’ అనేది సన్యాసిగా మారడానికి తన రాజ్యాన్ని త్యజించిన యువరాజు కథ చిత్రీకరణలో ఉంది. ఇందులో యువరాజు రామదాస్ పాత్రలో నటించడానికి మోజుందార్ తనను తాను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ఆనాటి ప్రసిద్ధ నటీనటులు కాథరిన్ మెక్‌గ్యురే, విలియం బోయిడ్, డోరిస్ మెక్‌క్లూర్ ఉన్నారు. మోజుందార్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే రాయడమే కాకుండా దానికి సహ-దర్శకత్వం వహించారు, దాంతో అమెరికాలో మొదటి భారతీయ చిత్రనిర్మాతగా నిలిచారు. ‘బియాండ్ ది వీల్’ 1924లో శాన్ ఫ్రాన్సిస్కోలోని టివోలీ థియేటర్‌లో ‘ప్రిన్స్ ఆఫ్ ఇండియా’గా ప్రదర్శించబడింది. అది ఇప్పుడు అలభ్యం.

వివాదాలు:

తరువాతి సంవత్సరాలలో, మోజుందార్ ఒక ధనిక వితంతువు ఆస్తిపాస్తుల విషయంలో వేసిన కేసు వల్ల అపఖ్యాతిని పాలయ్యారు. 1930లలో, మొజుందార్ తన యునైటెడ్ మెస్సియానిక్ చర్చి కోసం ఒక పెద్ద లెక్చర్ హాల్, ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో లాస్ ఏంజిల్స్‌కు తూర్పున ఉన్న శాన్ బెర్నార్డినో పర్వతాలలో క్రెస్ట్‌లైన్‌లో అనేక ఎకరాల ప్రాచీనమైన అటవీ భూమిని కొనుగోలు చేశారు. ఆలయ గోపురం తాజ్ మహల్ తరహాలో నిర్మించబడి మైళ్ల దూరం వరకు కనిపించేది, ఇది సందర్శకులను, ప్రయాణికులను ఆకట్టుకునేది.

మొజుందార్ గారి యునైటెడ్ మెస్సియానిక్ చర్చికి ఉన్న అనేక మంది దాతలలో Minnie Splane ఒకరు, చమురు వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఆర్జించిన Mignon Splane భార్య ఆమె. సందేహాస్పదమైన స్కీమ్‌ల ద్వారా ఆమె కుటుంబ ధనాన్ని పోగొట్టుకుంటోందని ఆమె పిల్లలు లాస్ ఏంజెల్స్ కోర్టులో ఆమెపై కేసు వేశారు. 1940లో, న్యాయమూర్తి Minnie Splane – మోసగాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారారని పేర్కొంటూ ఆమెను ఆమె కుమారుని సంరక్షణలో ఉంచమని తీర్పు చెప్పారు. మొజుందార్ ఆలయ సముదాయం, పిల్లర్స్ ఆఫ్ గాడ్ అని పిలువబడే ఒక యాంఫిథియేటర్‌తో సహా అసంపూర్తిగా ఉండిపోయింది.

దాంతో, చేసేదేం లేక, ఆ ప్రాంగణాన్ని వేసవిలో యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్‌కు వేసవి శిబిరంగా అద్దెకు ఇచ్చుకున్నారు మొజుందార్. దానిని క్యాంప్ మొజుందార్ అని పిలిచేవారు. ఆయన జీవితాంతం లాస్ ఏంజిల్స్‌లో గడిపారు, 1953లో శాన్ డియాగోలో మరణించారు. ‘మత విజ్ఞానం’ అని పిలవబడే తన స్వంత ఉద్యమాన్ని స్థాపించిన ఎర్నెస్ట్ హోమ్స్ – మొజుందార్ స్మారక చిహ్నం వద్ద అధికారికంగా క్రతువు నిర్వహించడం ద్వారా మొజుందార్ నిగూఢమైన మతవిధానంలో అనుచరులను కలిగి ఉన్నారని స్పష్టమవుతుంది. మోజుందార్ నిర్మించిన వింత భవనాలు – టెంపుల్ ఆఫ్ క్రైస్ట్, పిల్లర్స్ ఆఫ్ గాడ్ – ఇప్పటికీ క్రెస్ట్‌లైన్‌లో ఉన్నాయి. అవిప్పుడు దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఒక చిన్న మత సమూహం ఆధీనంలో ఉన్నాయి.

కొన్ని సంవత్సరాల క్రితం, మొజుందార్ యొక్క మళ్ళీ హఠాత్తుగా వెలుగులోకి వచ్చాయి, ఆయన పుస్తకాలు, రచనలు కొన్ని ఆయన పేరుతో ఉన్న ఓ వెబ్‌సైట్‌లో కనిపించాయి. 2018లో, అఖయ్ మొజుందార్‌ను Spokane ‘హిస్టారిక్ హాల్ ఆఫ్ నేమ్‌’ లోకి చేర్చారు – కారణాలేవయినా, ‘క్రిస్టియన్ యోగా’ అనే విచిత్రమైన ప్రచారం, పౌరసత్వం కోసం దృఢమైన తపన కోసం గుర్తుండిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here