అలనాటి అపురూపాలు – 217

0
13

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

సౌండ్ రికార్డిస్ట్ బద్రీ నాథ్ శర్మ:

బి.ఎన్. శర్మగా గుర్తింపు పొందిన బద్రీ నాథ్ శర్మ ప్రముఖ సౌండ్ రికార్డిస్ట్. ఆయన దాదాపు ఐదు దశాబ్దాల పాటు హిందీ చలనచిత్ర పరిశ్రమలో పనిచేశారు. హిందీ సినిమాల్లోని కొన్ని అతిపెద్ద మ్యూజికల్ హిట్‌లతో అనుబంధం కలిగి ఉన్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన కుమారుడు సంజీవ్ శర్మ మాట్లాడుతూ, తమ తండ్రి వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా చూసేవారనీ, ఆ రెండిటీ మధ్య తేడా ఉండాలని ఆయన కోరుకునేవారని చెప్పారు. “నేను స్టూడియోకి వెళ్లాలనుకుంటే, నాన్న నన్ను రానిచ్చేవారు కాదు. ఆయన వృత్తి జీవితంలో నేను బయటి వ్యక్తిని మరి” చెప్పారు సంజీవ్.

అడ్వర్టైజింగ్ ఫిల్మ్ నిర్మాత అయిన సంజీవ్ శర్మ – తమ తండ్రిగారితో పనిచేసిన పలువురు వ్యక్తులను కలిశారు. వారి ద్వారా ఆయనకు తన తండ్రి గురించి మరింత సమాచారం దొరికేది. ‘ది కపిల్ శర్మ షో’ కార్యక్రమంలో గాయకుడు అమిత్ కుమార్ – దిగ్గజ గాయకుడు కిషోర్ కుమార్ గురించి, బద్రీ నాథ్ శర్మ గురించి మాట్లాడిన క్లిప్పింగ్ సంజీవ్ సేకరించారు. కిషోర్ కుమార్ – క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఓం ప్రకాశ్ తోనూ, హాస్య నటుడు సుందర్ తోనూ, సంగీత దర్శకుడు సి. రామచంద్ర తోనూ, సౌండ్ రికార్డిస్ట్ బద్రీ నాథ్ శర్మ తోను సన్నిహితంగా ఉండేవారట. ఈ మిత్రులంతా ఓ గ్రూపులా ఏర్పడి తరచూ కలుస్తూ, సరదా గడిపేవారట. వీళ్ళందరికి గజక్ (చిక్కీ) అనే మిఠాయి ఇష్టమట. అయితే తనకీ విషయం తెలియదనీ, నాన్నెప్పుడూ చెప్పలేదని సంజీవ్ అన్నారు.

ఒక వైద్యుని కుమారుడైన, బద్రీ నాథ్ శర్మ 1919లో ఢిల్లీలో జన్మించారు. ఆయన బొంబాయికి వచ్చిన కారణాలు, ఆ నగరానికి వచ్చిన ఖచ్చితమైన సంవత్సరం విషయంలో అస్పష్టత ఉంది. తన తండ్రి 1940ల ప్రారంభంలో బొంబాయికి వచ్చి ఉండవచ్చని సంజీవ్ శర్మ ఊహించారు. “ఎప్పుడు చేరారో తెలియదు కానీ, నాన్న ఇక్కడి జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు, అక్కడ సౌండ్ ఇంజినీరింగ్ నేర్చుకున్నారు” – చెప్పారు సంజీవ్. దక్షిణ బొంబాయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ క్యాంపస్‌లో ఉన్న అబ్దుల్లా ఫజల్‌బోయ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రస్తావిస్తున్నారు సంజీవ్ శర్మ. సెయింట్ జేవియర్స్ కళాశాల సహకారంతో 1937లో ప్రసిద్ధ నిర్మాత ఎం.ఎ. ఫజల్‌భోయ్ ప్రారంభించిన ఈ సంస్థ తొలినాళ్ళలో రేడియో ఇంజనీర్లకు, సినిమా ప్రొజెక్షనిస్టులకు శిక్షణా స్థలంగా పనిచేసింది. 1941 నాటికి, ఇది తన పరిధిని విస్తరించి సౌండ్ రికార్డింగ్‌తో సహా ఏడు వేర్వేరు స్వల్పకాలిక కోర్సులను అందించసాగింది.

40ల నాటి ఫిల్మిండియా పత్రిక – పాత సంచికలు పరిశ్రమలో బద్రీ నాథ్ శర్మ గారి పురోగతిని గుర్తించడంలో సహాయపడతాయి. బారీ బాత్ (1944), టూటే తారే (1948), బతోహి (విడుదల కాలేదు), నిస్బాత్ (1949), నయీ రీత్ (1949) వంటి చిత్రాలకు బద్రీ నాథ్ శర్మ ఆడియోగ్రాఫర్‌గా పని చేశారు.

బాంబే సౌండ్ సర్వీసెస్‌లో 1973 నుండి 1991 వరకు బద్రీ నాథ్ శర్మకు సహాయకుడిగా ఉన్న యోగేష్ సక్సేనా – తన బాస్ – కొన్నిసార్లు – ఆడియో రికార్డింగ్ ప్రారంభ దశలో ఉన్న కాలం గురించి, సాంకేతికత ప్రాథమిక దశలో ఉన్న పాత రోజుల గురించి మాట్లాడేవారని చెప్పారు. అప్పటో షూటింగ్ సెట్‌లోనే రికార్డింగ్‌లు జరిగేవి, రికార్డిస్ట్ బయట ఉంచిన సౌండ్ వ్యాన్‌లోని పరికరాలతో రికార్డు చేసేవారు. ధ్వనిపై నియంత్రణ నామమాత్రంగా ఉన్నందున, రికార్డింగ్‌లు తరచుగా రాత్రిళ్ళు నిశ్శబ్దంలో జరిగేవి.

ఫిల్మిండియా జనవరి 1948 సంచికలో, ఎం అండ్ టి స్టూడియోస్ ఏర్పాటు గురించి తెలియజేసే ఒక చిన్న వార్త ఉంది. ఆ అక్షరాలు బులియన్ మార్కెట్ వ్యాపారులు, సినీ ఫైనాన్షియర్‌లు అయిన మఖన్‌లాల్ మరియు తివారీ లను సూచిస్తాయి. “నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన యొక్క వివిధ రంగాలలో ఈ సంస్థ అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు సిద్ధం చేస్తోంది” అని పత్రిక పేర్కొంది. ఎం అండ్ టి వారి పెట్టుబడులలో ‘కృష్ణా,  క్యాపిటోల్’ సినిమాలను కొనుగోలు చేయడం కూడా ఉంది. ఈ కంపెనీ అంధేరిలోని హింద్ స్టూడియోస్‌ను కూడా కొనుగోలు చేసి, దానిని పూర్తిగా పునరుద్ధరించిందని ఆ వార్త తెలిపింది.

కొత్త సంస్థ చేసిన నియామకాలలో బద్రీ నాథ్ శర్మని, ఎం అండ్ టి వారి ‘తొలి సమర్పణ’లో ‘డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీ’ గా పేర్కొన్నారు, అది దేవ్ ఆనంద్ గారితో ప్రారంభించిన ‘నమూనా’ (1949) అనే చిత్రం. ఎం అండ్ టి వారి ల్యాండ్ మార్క్ చిత్రం ‘అల్‍బెలా’ (1951)లో, బద్రీ నాథ్ శర్మ సాంగ్ రికార్డిస్ట్‌గా పని చేశారు.

కొంతకాలం తర్వాత, బద్రీ నాథ్ శర్మ రికార్డింగ్ స్టూడియోకి మారారు, తరువాతి మూడు దశాబ్దాలు, లేదా అంతకంటే ఎక్కువ కాలం అది వారి నివాసంగా మారింది. బాంబే సౌండ్ సర్వీసెస్ – బాంబే ఫిల్మ్ లాబొరేటరీస్‌లో భాగంగా ఉంది, ఇది దక్షిణ-మధ్య బొంబాయిలోని దాదర్‌లో ఉన్న ఫిల్మ్ ప్రాసెసింగ్ సెంటర్. సుప్రసిద్ధ బాంబే ల్యాబ్స్, 40వ దశకంలో కార్యకలాపాలు ప్రారంభించింది, అయితే తరువాతి దశాబ్దంలో దీనిని కొత్త యాజమాన్యం స్వాధీనం చేసుకుంది.

ప్రస్తుతం ఎనభై ఏళ్ల వయసులో ఉన్న హోసి వాడియా, ఇది ఒక్క యజమానిది కాదని, యాజమాన్యం చిన్న వాటాదారుల సమూహమని చెప్పారు – ఇందులో వారి తండ్రి ఆర్.హెచ్. వాడియా, ‘అంగ్రేజీ మీడియం’ దర్శకుడు హోమీ అదజానియా తాతగారైన దారాబ్‌షా అదజానియా ఉండేవారు. వీరు ప్రాసెసింగ్ ల్యాబ్, సౌండ్ స్టూడియో వ్యవహారాలను చూసుకునేవారు.

బద్రీ నాథ్ శర్మ సారథ్యంలో, బాంబే సౌండ్ సర్వీసెస్ ప్రముఖ సౌండ్ స్టూడియోలలో ఒకటిగా మారింది, నిర్మాతలకు ఆడియో పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాల మొత్తం శ్రేణిని అందించింది. 50వ, 60వ దశకాలలో, బద్రీ నాథ్ శర్మ – మధుమతి (1958), అనురాధ (1960), బర్సాత్ కీ రాత్ (1960), షాహీద్ (1965) వంటి చిత్రాల ల్యాండ్‌మార్క్ పాటలను రికార్డ్ చేశారు. ఆయన మొఘల్-ఎ-ఆజం (1960), భువన్ షోమ్ (1969) వంటి విభిన్న చిత్రాలకు మిక్సింగ్ ఇంజనీర్‌గా కూడా గుర్తింపు పొందారు.

హోసి వాడియా మాట్లాడుతూ – 1970లో, బొంబాయి ల్యాబ్స్‌లో కలర్ ప్రాసెసింగ్ ప్రవేశపెట్టబడిందనీ, మొత్తం స్టూడియో పునరుద్ధరించబడిందని చెప్పారు. సౌండ్ స్టూడియోను మూడవ అంతస్తుకు మార్చారు, ఇది 80-100 మంది సంగీతకారులు సౌకర్యవంతంగా కలిసి పనిచేయగలిగే పెద్ద ప్రదేశం. కొత్తగా ఆర్‍సిఎ త్రీ-ట్రాక్ రికార్డర్ కూడా ఏర్పాటయింది. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్లు అయిన యోగేష్ సక్సేనా మరియు సతీష్ గుప్తా ఈ పునరుద్ధరణ తర్వాత బాంబే సౌండ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్లుగా చేరారు. సక్సేనా, ఇప్పుడు పదవీ విరమణ చేసి, బెంగళూరులో నివసిస్తున్నారు. పెద్ద గాయకులు, దర్శకులు, నిర్మాతలతో కలిసి ఒకే గదిలో ఉండటం వల్ల తాను మొదట్లో బెదిరిపోయాననీ, బద్రీ నాథ్ శర్మ వాళ్లతో సాధారణంగా, దృఢంగా వ్యవహరించడం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు సక్సేనా.

ఇప్పుడు కొంత కాలం ముంబై, కొంత కాలం ఆగ్రాలోనూ గడుపుతున్న సతీష్ గుప్తా, తనకు బాంబే సౌండ్ సర్వీసెస్‌లో ఉద్యోగం రావడానికి సహాయపడింది స్టూడియో సర్కిల్‌లలో ప్రసిద్ధి చెందిన అనుభవజ్ఞుడైన మెయింటెనెన్స్ ఇంజనీర్ అయిన జో డిసౌజా అని చెప్పారు. రాజ్ కపూర్ గారి ఆర్‌కె స్టూడియోస్‌లో మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా ప్రారంభించిన గుప్తా అప్పట్లో ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఆడియో-విజువల్ ఇంజనీర్‌గా పని చేసేవారు, ప్రొజెక్టర్‌తో వివిధ పట్టణాలు మరియు గ్రామాలకు వెళ్లి ‘మెడికల్ ఫిల్మ్‌లు’ చూపించే ఉద్యోగం. గుప్తా పిరికివాడు, మృదుస్వభావి. బద్రీ నాథ్ శర్మ గారి ఖ్యాతి గురించి కొందరు ఆయనను హెచ్చరించారట. గుప్తా శర్మ గారి దగ్గర 17 సంవత్సరాలు పని చేసారు. “ఒకరు శ్రద్ధగా పనిచేసినంత కాలం, తప్పులు చేయనంత కాలం, భయపడాల్సిన పనిలేదు” అని నొక్కి చెప్పారు.

ఈ విషయంలో యోగేష్ సక్సేనా – సతీష్ గుప్తాతో ఏకీభవించారు. శర్మగారు పని విషయంలో ఎంతో కఠినంగా ఉండేవారనీ అన్నారు. “ఆయన కరకుగా ఉండేవారు, సంగీతకారులు అజాగ్రత్తగా ఉంటే సహించేవారు కాదు.”

సంగీతకారులు లేదా గాయకులు లేదా రికార్డిస్ట్ నుండి లేదా సాంకేతిక లోపం వల్ల – చిన్న పొరపాటు దొర్లినా – మొత్తం పాటను మళ్లీ రికార్డ్ చేయవలసి ఉంటుందని సక్సేనా, గుప్తా ఇద్దరూ అన్నారు. కాబట్టి రికార్డిస్ట్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రిహార్సల్స్ ‘ఎలా రికార్డ్ చేయాలనే దాని గురించి మానసికంగా సిద్ధపడటానికి’ రికార్డిస్ట్‌కి వీలు కల్పించేవని అన్నారు సక్సేనా.

లతా మంగేష్కర్‍కీ, బద్రీనాథ్ శర్మకి మధ్య వివాదం గురించి తనకి పెద్దగా తెలియదని సంజీవ్ శర్మ అన్నారు. అందుకు కారణమేమిటో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఎట్టకేలకూ, వారిద్దరి మధ్య ఆశా భోస్లే రాజీ కుదర్చడంతో, ఇద్దరు మళ్ళీ కలిసి పనిచేశారు.

2009లో, తన 80వ పుట్టినరోజు సందర్భంగా రికార్డ్ చేసిన ఒక అరుదైన టెలివిజన్ ఇంటర్వ్యూలో, అమీర్ ఖాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా లతా మంగేష్కర్, ‘ఏ దిల్-ఎ-నాదన్‌’ను ఎంపిక చేసుకున్నారు. ‘రజియా సుల్తాన్’ (1983) సినిమాలో ఆమె పాడిన మరపురాని పాట అది. ఈ పాటను బి. ఎన్. శర్మ రికార్డ్ చేశారు. నిజానికి, ‘రజియా సుల్తాన్’ సినిమా బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ శర్మ గారి సుదీర్ఘ కెరీర్‌లో ఉన్నతమైన వాటిలో ఒకటిగా గుర్తించబడతాయి. మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో బద్రీ నాథ్ శర్మ తన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయితో ఆ దశాబ్దాన్ని ముగించారు.

బద్రీ నాథ్ శర్మ ఫిబ్రవరి 1, 1991న గుండెపోటుతో మరణించారు. ఆయన చివరి వరకు పనిచేస్తూనే ఉన్నారు. సల్మాన్ ఖాన్-కరిష్మా కపూర్-నటించిన ‘నిశ్చయ్’, ఆయన చివరి ప్రాజెక్ట్‌లలో ఒకటి, చాలా రోజుల తర్వాత ప్రముఖ స్వరకర్త ఓపి నయ్యర్ – తిరిగి సంగీతం అందించిన సినిమా ఇది.

బద్రీ నాథ్ శర్మ ఆకస్మిక మరణం తర్వాత, గుల్షన్ కుమార్ యాజమాన్యంలోని T-సిరీస్‌లో చేరాల్సిన సతీష్ గుప్తా – కొంత కాలం ఆగారు. చివరికి అక్టోబర్ 1991లో ఆ సంస్థకి మారారు గుప్తా.

మరుసటి సంవత్సరం, సబర్బన్ అంధేరిలో కొత్తగా ప్రారంభించబడిన గోల్డెన్ చారియట్ స్టూడియోలో చీఫ్ రికార్డిస్ట్‌గా ఉండాలనే ప్రతిపాదనను గుప్తా అంగీకరించారు. దక్షిణ మరియు దక్షిణ-మధ్య బొంబాయిలో స్థాపించబడిన సౌండ్ స్టూడియోల కారణంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ శివారు ప్రాంతాల్లోని కొత్త, చిన్న స్టూడియోలకు చెందిన నిర్ణయాత్మక మార్పులో తానూ ఓ భాగం అవుతున్నానని సతీష్ గుప్తాకి అప్పట్లో తెలియదు.

యోగేష్ సక్సేనా బాంబే సౌండ్ సర్వీసెస్‌లో పని చేస్తూనే ఉన్నారు. ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) గొప్ప హిట్ అయినప్పటికీ, క్రమంగా, వ్యాపారం మందగించడం ప్రారంభమైంది. “మేము కొన్ని సంవత్సరాలు పాటు కొనసాగాము, కానీ స్టూడియోను నడపడం ఇక సాధ్యం కాలేదు.” అన్నారు హోసి వాడియా.

చివరకు 1997లో బాంబే సౌండ్ సర్వీసెస్ మూతబడింది. యోగేష్ సక్సేనా సబర్బన్ జుహులో సన్నీ సూపర్ సౌండ్‌లో చేరారు. స్టూడియో షూటింగ్ స్థలంగా మార్చబడింది. 2004లో, అది కూడా మూతబడింది, ఆ స్థలాన్ని రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు కొనుక్కున్నారు. ప్రస్తుతం అక్కడ బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here