అలనాటి అపురూపాలు – 218

0
11

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

సినీ దిగ్గజం సోహ్రాబ్ మోడీ:

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని దిగ్గజాలలో సోహ్రాబ్ మోడీ అగ్రగణ్యులు. ఉపఖండపు చరిత్రలోని వివిధ దశలను – ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక ప్రారంభ దశలకు – స్పష్టమైన కథారూపం కల్పించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఘనుడు. ఆయన గంభీరమైన స్వరాన్ని వినడానికే జనాలు సినిమా థియేటర్లకు వచ్చేవాళ్ళని చెప్పడం అతిశయోక్తి కాదు.

సోహ్రాబ్ మోడీ పేరు చెప్పగానే కొన్ని సినిమాల్లో ఆయన ధరించిన పాత్రలు కళ్ళ ముందు మెదులుతాయి. మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలం నాటి ‘పుకార్’ (1931)లో రాజ్‌పుత్ కులీనుడు సంగ్రామ్ సింగ్‌గా, ‘సికందర్’ (1941)లో రాజా పురుషోత్తముడిగా, ‘పృథ్వీ వల్లభ్’ (1943)లో పర్మార్ రాజుగా, ‘ఝాన్సీ కీ రాణి’ (1952)లో రాణి లక్ష్మీబాయికి రాజగురువుగా, ‘యాహుది’ (1958)లో యూదు ఎజ్రాను తీవ్రంగా హింసించిన వ్యక్తిగా, సోహ్రాబ్ మోడీ తన గంభీరమైన ఆకారం, అపూర్వమైన అభినయ కౌశలం, ఉరుముల వంటి ఉచ్చారణతో వెండితెరపై తన ప్రతిభని ప్రదర్శించారు.

1938లో మొదటిసారి, 1958లో రెండోసారి వేర్వేర్ నటీనటులతో తీసిన ‘జైలర్’ అనే సినిమాలో ఆయన దయాళువు, హేతుబద్ధమైన వ్యక్తి నుంచి దేశీయ నిరంకుశుడిగా మారడాన్ని అత్యంత వైవిధ్యంగా నటించి చూపారు.

2 నవంబర్ 1897 నాడు జన్మించిన సోహ్రాబ్ మెర్వాంజీ మోడీ, 1980వ దశకం మధ్య వరకూ నటించారు. ‘రజియా సుల్తానా’ (1983) సినిమాలో హేమ మాలినికి తెలివైన, శూరుడైన వజీర్‍గా అద్భుతంగా నటించారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాత మరియు దర్శకుడిగా కూడా భారతీయ చిత్రాలపై తన తిరుగులేని ముద్రను వేశారు. ఆయనను తరచూ హాలీవుడ్‍కి చెందిన DW గ్రిఫిత్స్, సెసిల్ బి. డిమిల్లే వంటి వారితో పోల్చేవారు.

మూకీల యుగం క్షీణించి, టాకీల యుగం పుంజుకుంటున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ – హిందీ సినిమాలకు సాంప్రదాయంగా నిలిచిన – సంభాషణలు, పాటలు, ఘర్షణలకు – పార్సీ నాటకరంగపు అద్భుతమైన తళుకుబెళుకులను జోడించారు సోహ్రాబ్. అయితే, తన సమకాలీనుడైన వి. శాంతారామ్ లాగా, సినిమాల శక్తిని గ్రహించి, సామాజిక సమస్యలపై శక్తివంతమైన సందేశాన్ని అందించారు.

1930లలో కూడా, సోహ్రాబ్ మోడీ తన మినర్వా మూవీటోన్ బ్యానర్‌లో తీసిన సినిమాలు – మద్యపానం, హిందూ మహిళలకు విడాకులు తీసుకునే హక్కు వంటి సమస్యలను చర్చించాయి, అయితే అక్కడితో ఆగలేదు; అక్రమ ప్రేమ, అశ్లీలత, పితృస్వామ్యం వంటి నిషేధిత విషయాలపైకి, ఇంకా, కొత్త సమసమాజంలో సంప్రదాయం, సాంఘిక హోదాలు చూపే నిరర్థక ప్రభావం మీదకి వెళ్లాయి.

కానీ, ఆయన ఒక రకమైన చలనచిత్రాలకే పరిమితం కాలేదు, ఎందుకంటే ఆయన ప్రయోగాలు చారిత్రక ఇతిహాసాల నుండి ‘రాజ్ హత్’ (1956), ‘నౌషర్వాన్-ఇ-ఆదిల్’ (1957) వంటి భారీ కాస్ట్యూమ్ చిత్రాల వరకు అనేక శైలులకు విస్తరించాయి. ‘నరసింహ అవతార్’ (1949) వంటి మతపరమైన చిత్రాలు – జీవన్‌ను నారద మునిగా చూపించని కొన్ని చిత్రాలలో ఒకటి; ఇంకా, క్లాసిక్ నవలలకు సినీరూపం కల్పించి – ఉదాహరణకి విక్టర్ హ్యూగో ‘లెస్ మిజరబుల్స్ ఆధారంగా తీసిన ‘కుందన్’ (1955) – తీసినవి విభిన్నమైనవి.

వీటన్నిటి మధ్యా, ‘మీర్జా గాలిబ్’ (1954)తో ప్రజా చైతన్యం కోసం తపించిన గొప్ప భారతీయ కవులలో ఒకరి చిత్రాన్ని సృష్టించే అదృష్టం ఆయనకి దక్కింది, ఈ సినిమాలో సురయ్య స్వరం – గాలిబ్ కవితలకు మరపురాని వివరణను అందించాయి – అవి సొగసుగా-కొరియోగ్రఫీ చేయబడిన “ఆహ్ కో చాహియే ఏక్ ఉమర్”, “నుక్తా చీన్ హై”, లేదా “యే నా థీ హమారీ ఖిస్మత్” వంటివి కావచ్చు, లేదా మొహమ్మద్ రఫీతో పాడిన ఎవర్ గ్రీన్ “దిల్-ఎ-నాదాన్ తుజే హువా క్యా హై” అన్న పాట కావచ్చు – సినిమాకి ఆదరణ లభించిడంలో దోహదపడ్డాయి.

అనారోగ్యం వల్ల, వృద్ధాప్యం కారణంగా అతని శక్తివంతమైన స్వరం బలహీనపడినప్పటికీ, 1984లో మరణించే వరకు, సోహ్రాబ్ మోడీ సినిమాలకి పనిచేస్తూనే ఉన్నారు. ఆయన భార్య – సహనటి – మెహతాబ్ ఒకసారి చెప్పినట్లుగా, ఆయనకి సినిమా నిర్మాణం తప్ప ఇతర అభిరుచులు లేవు.

అయితే ఇందులో కూడా, ఆయనకి తనవైన చమత్కారాలున్నాయి. చిత్రనిర్మాత కమల్ అమ్రోహి, ‘పుకార్’తో స్క్రిప్ట్ రైటర్‌గా హిందీ చిత్రాల్లోకి ప్రవేశించి, కథను రూపొందించడానికి సోహ్రాబ్ మోడీతో అపాయింట్‌మెంట్ తీసుకున్నారట. యుక్తవయస్సులో ఉన్న ఆ యువకుడిని చూసి సోహ్రాబ్ ఆశ్చర్యపోయారట, కానీ మర్యాదపూర్వకంగా కథ వినసాగారట. అమ్రోహి కథ చెప్పే తీరుతో ఆసక్తి పెరిగిన, మరింత శ్రద్ధగా వింటున్నారట. చివరకు, తన డెస్క్ డ్రాయర్ తెరిచి, అందులో ఉన్న హల్వా డబ్బా తీసి అమ్రోహికి అందించి తినమన్నారట.

ఏం జరుగుతోందో అర్థం కాని అమ్రోహి, ఆ డబ్బా అందుకుని హల్వా తింటున్న సమయంలో సోహ్రాబ్ మోడీ పక్క గదిలోకి వెళ్లి అమ్రోహి కోసం ఒక ఒప్పందాన్ని టైప్ చేశారు. హల్వాను పంచుకునే అలవాటు సోహ్రాబ్ మోడీ యొక్క పూర్తి ఆమోదాన్ని సూచిస్తుందని – వారి సిబ్బంది ద్వారా అమ్రోహి తరువాత తెలుసుకున్నారు.

ఐతే, నటుడిగా సోహ్రాబ్ మోడీ ప్రభావం గొప్పది. తన శక్తివంతమైన స్వరంతో ఆయన తనదైన ముద్ర వేశారు. ‘సికందర్’లో టైటిల్ రోల్‌కు – గ్రీకు యువరాజుల రూపురేఖలకు పూర్తిగా సరిపోయే పృథ్వీరాజ్ కపూర్‌తో మల్లయుద్ధం లోనూ; ‘పృథ్వీ వల్లభ్’లో అహంకారి దుర్గా ఖోటేతో పోటీగా నటించడంలోనూ తన ప్రతిభ చూపారు. ‘యాహూది’ చిత్రంలో తన పాత్ర ద్వారా -రోమన్ చక్రవర్తి పాత్రధారి మురాద్‌ను, లిడియా పాత్రధారి మీనా కుమారిని, ప్రిన్స్ మార్కస్ పాత్రధారి దిలీప్ కుమార్‍ని వెనక్కి నెట్టారు. ‘రజియా సుల్తాన్’లో బాల్బన్ (అజిత్) వంటి పాత్రల మరింత ఆవేశపూరితంగా, బాహాటంగా మాట్లాడే పెద్దల శ్రేణిని సంతృప్తిపరిచారు.

ఓ కథ ప్రకారం, సోహ్రాబ్ మోడీ తన తాజా చిత్రానికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకుందామని బొంబాయిలో ఓ థియేటర్‌కి వెళ్ళారు. ప్రేక్షకులతో పాటు సినిమా చూస్తుండగా, కళ్ళు మూసుకుని కూర్చున్న వ్యక్తిని చూశారు. దాంతో చిరాకు పడి, అతన్ని బయటకు పంపించి అతని టిక్కెట్ డబ్బును వాపసు చేయమని ఒక సహాయకుడికి చెప్పారు సోహ్రాబ్. ఆ సహాయకుడు తిరిగి వచ్చి – ఆ వ్యక్తి అంధుడని, కేవలం సోహ్రాబ్ మోడీ మాటలు వినడానికే వచ్చాడని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు.

ఇంతకంటే గొప్ప నివాళి ఏముంటుంది?

***

సోహ్రాబ్ మోడీని ప్రత్యేకంగా నిలిపిన పది లక్షణాల గురించి తెలుసుకుందాం:

నటన:

అగ్రగామి నటుడు, దర్శకనిర్మాత సోహ్రాబ్ బాలీవుడ్ యొక్క ప్రారంభ రోజులలో వెండితెరకు వైభవాన్ని కల్పించారు, ఆయన చిత్రాలలో నిషిద్ధ అంశాలుగా భావించబడే పలు సమస్యలను పరిష్కరించారు, ఇది అభివృద్ధి చెందుతున్న పరిశ్రమను వేగంగా ఎదగడంలో సహాయపడింది. జనవరి 28, 1984న తన 86వ ఏట తుదిశ్వాస విడిచే వరకు ఆయన సినిమానే శ్వాసించారు.

మార్గదర్శి:

1897లో బొంబాయిలో [ఇప్పుడు ముంబై] జన్మించారు, భారతదేశంలో సినిమా సామర్థ్యాన్ని గ్రహించిన వారిలో మొదటి వ్యక్తి. మూకీ యుగం ప్రారంభ రోజులలో తన సోదరుడితో కలిసి ట్రావెలింగ్ ఎగ్జిబిటర్ అయ్యారు. 16 ఏళ్లు వచ్చేసరికి, తొలిసారిగా కదిలే చిత్రాలను చూస్తున్న ప్రేక్షకుల కోసం సినిమాలను ప్రదర్శించారు సోహ్రాబ్.

రంగస్థల అభినేత:

భారతీయ సినిమా తొలినాళ్లలో నటన నుంచి దర్శకత్వం వరకు ఏదైనా సినిమా చేసిన చాలా మందికి ఆ రంగంలో ఇంతకు ముందు అనుభవం లేదు. సోహ్రాబ్ మోడీ ఒక థియేటర్ కంపెనీని స్థాపించి భారతదేశం అంతటా విలియం షేక్‌స్పియర్ క్లాసిక్స్‌తో సహా అత్యంత సవాలుతో కూడిన నాటకాలను ప్రదర్శించారు. 1935లో, ఆయన తన మొదటి చలనచిత్ర సంస్థను ప్రారంభించారు. ‘ఖూన్ కా ఖూన్’ (1935)ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఇది హామ్లెట్ నాటకం చలనచిత్ర అనుకరణ. ఇందులో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, పరిశ్రమలోని ఇతరులకు భిన్నంగా ఉండేవారు మోడీ. తరువాత 1862 నాటి విక్టర్ హ్యూగో  ఐకానిక్ నవల, ‘లెస్ మిజరబుల్స్’ ని, ‘కుందన్’ (1955) అనే సినిమా తీసి హిట్ చేశారు.

మూవీ మొఘల్:

బాలీవుడ్ లెజెండ్ సోహ్రాబ్ 1936లో ‘మినర్వా మూవీటోన్‌ని స్థాపించారు, ఇది హిందీ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన, మార్గనిర్దేశం చేసిన చలనచిత్ర నిర్మాణ సంస్థ లలో ఒకటిగా నిలిచింది. మూడు గొప్ప చారిత్రిక సినిమాలు – పుకార్ (1939), సికందర్ (1941), పృథ్వీ వల్లభ్ (1943) లతో ఆయన తమ సంస్థను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళారు. ఈ సంస్థ గొప్ప ప్రతిభావంతులను అందించింది, భారతదేశంలో సినిమా పరిధులను విస్తరింపజేసింది, నిషేధిత అంశాలను అధిగమించవచ్చని నిరూపించింది, సినీ నిర్మాణ ప్రమాణాలను పెంచింది.

అంతర్జాతీయత:

విదేశాలకు వెళ్లిన తొలి భారతీయ సినీ ప్రముఖుల్లో సోహ్రాబ్ మోడో ఒకరు. ఆయన తన సినిమాలకు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులను ఉపయోగించారు, పాశ్చాత్య సాంకేతికతలను పరిచయం చేశారు, భారతదేశంలో టెక్నికలర్ చలనచిత్రంలో పని ప్రారంభించిన తొలి వ్యక్తి. 1960లో బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలోకి ఆహ్వానించబడిన మొట్టమొదటి భారతీయుడు.

ప్రతిభకి పట్టం:

సోహ్రాబ్ మోడీ దూరదృష్టి కలిగిన వ్యక్తి. తన కెరీర్‌లో చాలా మంది ప్రతిభావంతులైన కళాకారులను తెరపైన, తెర వెనుకా పరిచయం చేశారు. పెద్దగా తెలియని నటీనటులని స్టార్‍లుగా మార్చారు. ఆమె తొలి విడుదల కానప్పటికీ, తన చిత్రం ‘దౌలత్’ (1949) కోసం నటి మధుబాలతో ఒప్పందం చేసుకున్న మొదటి వ్యక్తి ఆయనే. దిగ్గజ నటి నసీమ్ బానుకు కథానాయికగా తొలి అవకాశం ఇచ్చి, తన సరసన ఎన్నో చిత్రాలలో నటింపజేశారు. ‘మహల్’ (1949), ‘పాకీజా’ (1972) వంటి ఆల్-టైమ్ క్లాసిక్‌లను రూపొందించడానికి ముందు, చిత్రనిర్మాత కమల్ అమ్రోహి 1930ల చివరలో సోహ్రాబ్ మోడీ గారి మినర్వా మూవీటోన్ బ్యానర్‌లో తన కెరీర్‌ను కథా రచయితగా ప్రారంభించారు.

ధైర్యశాలి:

భారతీయ చలనచిత్ర ప్రేక్షకులకు షేక్స్‌పియర్‌ను పరిచయం చేసినా లేదా ప్రాజెక్ట్‌లలో కళ్లు చెదిరేలా డబ్బును పెట్టుబడిగా పెట్టినా, సోహ్రాబ్ మోడీ తన సమకాలీనుల కంటే చాలా ధైర్యంగా ఉండేవారు. వివాహేతర సంబంధాలతో వ్యవహరించిన ‘జైలర్’ (1938), ‘భరోసా’ (1940) వంటి చిత్రాలతో చాలా సాంప్రదాయిక యుగంలో నిషేధాలను ఎదుర్కోవడానికి కూడా ఆయన భయపడలేదు.

స్త్రీ శక్తి:

ఆయన చిత్రం ‘ఝాన్సీ కీ రాణి’ (1953) ఆ సమయంలో వాణిజ్యపరంగా పరాజయం పాలైనప్పటికీ, అనేక కారణాల వల్ల ఇది ఒక మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. మహిళా కథానాయికతో తీసిన అతి పెద్ద సినిమా ఇది. భారతదేశపు వారియర్ క్వీన్ గురించిన ఈ చిత్రం –  తాను నిర్మించిన చిత్రాలలో శక్తివంతమైన స్త్రీ పాత్రలను ప్రదర్శించడమే వారి ధోరణిని కొనసాగించింది.

ప్రేరణ:

దేనికీ వెనుకంజ వేసే స్వభావం కాదు సోహ్రాబ్ మోడీది. ఏదైనా సాధ్యమేనని నమ్మేవారు. ఇది హిందీ సినిమా ప్రారంభ రోజులలో ఆయన చేసిన భారీ-స్థాయి సినిమాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఝాన్సీ కీ రాణి’ సినిమా ఆ సమయంలో బాలీవుడ్‌లో పరాజయం పాలై ఆర్థికంగా భారీగా నష్టపోయినా, ఆయన వెనక్కి తగ్గలేదు. తదుపరి చిత్రం ‘మీర్జా గాలిబ్’ (1954) అత్యంత ప్రశంసలు పొందడమే కాదు, 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రం బహుమతిని గెలుచుకున్న మొదటి హిందీ-భాషా చిత్రంగా నిలిచింది.

బహుముఖ ప్రజ్ఞ:

సోహ్రాబ్ మోడీ – నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చలనచిత్ర రంగంలోని అన్ని విభాగలలో విశిష్టమైన ప్రతిభ కనబరిచారు. సినిమా రంగాన్ని గొప్పగా ఉపయోగించుకుని, అద్భుతమైన పనిని వదిలివెళ్ళారు. 1980లో భారతీయ సినిమా యొక్క అత్యున్నత గౌరవం – దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందిన 10వ గ్రహీత అయ్యారు.

1984లో క్యాన్సర్‍తో బాధపడుతూ మరణించడానికి కొన్నిరోజుల ముందు కూడా, మరొక చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన చేశారు. ఆయన భార్య, నటి మెహతాబ్ – ఆయనకి సినిమా నిర్మాణం తప్ప ఇతర అభిరుచులు లేవని అనడం – ఆయన సాధించినదాన్ని ఉత్తమరీతిలో క్లుప్తంగా చెప్పినట్లే అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here