అలనాటి అపురూపాలు-22

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

పాకిస్తానీ ఫిల్మ్ ఇండస్ట్రీ సృష్టికర్త అబ్దుర్ రషీద్ కర్దార్:

అవిభక్త భారతదేశంలో – దేశంలోని ఎన్నో ప్రాంతాలలో సినీ పరిశ్రమని స్థాపించిన వారెందరో ఉన్నారు. బ్రిటీష్ ఇండియాలోని లాహోర్ ప్రాంతలో సినీ పరిశ్రమ నెలకొనేలా చేసింది అబ్దుర్ రషీద్ కర్దార్.

మూకీ సినిమాల శకంలో లాహోర్ ఫిల్మ్ ఇండస్ట్రీ (తరువాత పాకిస్తానీ ఫిల్మ్ ఇండస్ట్రీ) స్థాపనకు కారకులు ఎ. ఆర్. కర్దార్. తరువాతి కాలంలో ఈయన ఎన్నో సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించారు. నౌషాద్ గొప్ప సంగీతం అందించిన దర్ద్ (1947), దిల్లగి (1949), దులారీ (1949), దాస్తాన్ (1950), జాదూ (1951) వంటివి ఈయన సినిమాలే.

అబ్దుర్ రషీద్ కర్దార్ (1904–1989) భారతీయ నటుడు, నిర్మాత, దర్శకుడు. బ్రిటీష్ ఇండియాలోని లాహోర్‌లో భాటీ గెట్ ప్రాంతంలో సినీ పరిశ్రమను నెలకొల్పిన ఘనత ఈయనదే. ఈయన కర్దార్ అరెయిన్ కుటుంబానికి చెందినవారు. కర్దార్ అనేది ఇరాన్, అఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ లలో ఒక ఇంటిపేరు. అరెయిన్ (రయీన్ అని కూడా వ్యవహరిస్తారు) పంజాబ్ ప్రాంతంలో ఒక వ్యవసాయ తెగ. దీనికి రాజకీయమైన గుర్తింపు, సంస్థాగత నిర్మాణం ఉంది. ఈ తెగవారు ఎక్కువగా నేటి పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ ప్రాంతాలలోనూ, కొద్దిగా భారత పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ ఉన్నారు. 1920 తొలినాళ్ళలో కర్దార్ ఒక ఆర్ట్ స్కాలర్ గానూ, కాలిగ్రాఫిస్ట్‌గానూ పని చేస్తూ విదేశీ చిత్రాలకు పోస్టర్లు రూపొందిస్తూ, వార్తాపత్రికలకు వార్తలు వ్రాసిస్తూ ఉండేవారు. ఈ వృత్తి వల్ల ఆయన దేశవ్యాప్తంగా ఎందరో నిర్మాత, దర్శకులని కలిసే అవకాశం పొందారు. విదేశీ చిత్రాల డిస్ట్రిబ్యూటర్ల కోసం పోస్టర్లపై పనిచేస్తున్న కర్దార్‌కి విజయ్ భట్ ‘హీర్ రాంఝా’ అవకాశమిచ్చారు.

1924లో తొలి మూకీ సినిమా ‘ది డాటర్స్ ఆఫ్ టుడే’ లాహోర్‌లో విడుదలైంది. ఆ సమయంలో నగరంలో కేవలం తొమ్మిదే థియేటర్లు పని చేస్తున్నాయి. అప్పట్లో ఆ థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు హాలీవుడ్ లేదా లండన్‌లో నిర్మించిన సినిమాలే కాకుండా బొంబాయి లేదా కలకత్తాలో తీసినవి కూడా ఉండేవి. ‘ది డాటర్స్ ఆఫ్ టుడే’ చిత్రం నార్త్-వెస్ట్రన్ రైల్వే లో పనిచేసిన మాజీ అధికారి జి.కె. మెహతా మానసపుత్రిక. ఈ ప్రాజెక్టు కోసమే ఆయన లండన్ నుంచి ఒక కెమెరాను దిగుమతి చేసుకున్నారు. ఈ ప్రాజెక్టులో తనకి సహాయంగా సహాయ దర్శకుడిగా ఉండమని ఆయన కర్దార్‌ని కోరారు, చివరికి ఈ సినిమాలో ఒక నటుడిగా కర్దార్‍ని నటింపజేశారు. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడు కర్దార్ స్నేహితుడు, తోటి కాలిగ్రాఫిస్ట్ మహమ్మద్ ఇస్మాయిల్ తరచుగా కర్దార్‍ వెంట వచ్చేవారు. ఈ సినిమాని బ్రాడ్‌లా హాల్ సమీపంలో నగరంలోని తొలి ఓపెన్ స్టూడియోలో చిత్రీకరించారు. కొన్ని దేశీయ చిత్రాల చిత్రీకరణ కొన్ని స్టూడియోలలో ప్రారంభమైనప్పటికీ, ఆర్థికపరమైన కారణాల వల్ల ఆగిపోయాయి. ఈ సినిమా పూర్తయ్యాక, చాలా కాలం వరకు నటుడిగా కర్దార్‌కి అవకాశాలు రాలేదు. భాటీ గెట్ ప్రాంతం నుంచి వచ్చిన కర్దార్‌కు ఆ ప్రాంతం కవులకు, రచయితలకు నెలవని తెలుసు. అక్కడ సినీ పరిశ్రమకి భవిష్యత్తు ఉంటుందని ఆయన ఊహించారు. 1928లో ఇక చేయడానికి ఏమీ లేకపోయేసరికి కర్దార్, ఇస్మాయిల్ తమ కున్నదంతా అమ్మేసి, ఒక స్టూడియో నిర్మాణం చేయాలనుకున్నారు. ‘యునైటెడ్ ప్లేయర్స్ కార్పోరేషన్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థని లాహోర్‌లో స్థాపించాలనుకున్నారు. ఎన్నో స్థలాలను అన్వేషించి, చివరగా రావి రోడ్‌లో తమ సంస్థని స్థాపించారు. అయితే ఆ ప్రాంతంలో వెలుతురు సరిగా లేకపోవడం వల్ల, స్టూడియో స్థాపించిన తర్వాత వారు ఇబ్బందులు ఎదుర్కున్నారు. పగటి పూట మాత్రమే షూటింగులు జరిపే అవకాశం ఉండేది. పైగా, సమీపంలోనే ‘రావి ఫారెస్ట్’, మొఘల్ చక్రవర్తి జహంగీరు, ఆయన భార్య నూర్జహాన్‌ల సమాధులు ఉండడం మరొకొన్ని ఆటంకాలకి కారణమయ్యాయి. స్టూడియోలో పనిచేసే బృందాల టాంగాలపై ప్రయాణించేవనీ, గుర్రపు బళ్ళలో గుంతల రోడ్లపై ప్రయాణిస్తూ ఉండగా పరికరాలు పోగొట్టుకునేవారని చెబుతారు. పని పరిస్థితులు ఎంత మౌలికంగా ఉన్నా, ఎంత ముతకగా ఉన్నా కర్దార్ మాత్రం తన పనిపై, ఆశలపై నమ్మకాన్ని కోల్పోలేదు. 1930లో తన నిర్మాణ సంస్థ పేరిట తొలి చిత్రం నిర్మించారు. ‘హుస్న్ కా డాకూ’ (మిస్టీరియస్ ఈగల్) అనే ఈ చిత్రం ద్వారా కర్దార్ తొలిసారిగా దర్శకుడయ్యారు. అంతేకాదు గుల్జార్ బేగం సరసన ప్రధాన పాత్రలో నటించారు. ఆయన స్నేహితుడు ఇస్మాయిల్ సహాయక పాత్రలో నటించారు. ఈ సినిమాలో అమెరికన్ నటుడు ఐరిస్ క్రాఫోర్డ్ కూడా నటించడం విశేషం. ఈ సినిమా థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడినప్పటికీ, లాహోర్‌ని సినీ పరిశ్రమకి నెలవుగా మార్చడంలో విజయం సాధించింది. ఇక ఏ సినిమాలోను నటించకూడడని నిర్ణయించుకుని కర్దార్ దర్శకత్వంపై దృష్టి నిలిపారు. దీని తరువాత ఈ స్టూడియో నుంచి ‘సర్ఫరోష్’ (బ్రేవ్ హార్ట్) అనే సినిమా విడుదలైంది. ఇందులో గుల్ హమీద్ ప్రధాన పాత్ర పోషించారు. మిగతా నటీనటులంతా దాదాపుగా ముందు సినిమాలోని వారే. ఈ సినిమా కొంత జనాకర్షణని పొందడమే కాకుండా, దేశంలోని ఇతర సినీ నిర్మాణ సంస్థలు దీనిని గుర్తించేలా చేయగలిగింది. లాహోర్ లోని Brandreth Road నివాసి అయిన రూప్ లాల్ షోరి తమ ప్రాంతంలో సినీ పరిశ్రమ నెలకొనడం గురించి విని తన సొంతూరుకి తిరిగి వచ్చారు. ఆయన తరువాత ‘కిస్మత్ కే హేర్ ఫేర్’ (లైఫ్ ఆఫ్టర్ డెత్) అనే సినిమా నిర్మించారు. దీంతో నాటి ఇతర సినీ పరిశ్రమల మాదిరిగానే లాహోర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి పేరు వచ్చింది. కర్దార్ 1930లో కలకత్తాకి వెళ్ళి ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీలో చేరారు. వారికి తొమ్మిది సినిమాలు తీశారు. 1937లో ఈ కంపెనీ మూత పడడంతో, బొంబాయి వెళ్ళి (తార్‌దేవ్ లోని) ఫిల్మ్ సిటీలో చేరారు. ఇక్కడ, ఈ కంపెనీ కోసం ‘బాఘ్‌బన్’ అనే సినిమా తీశారు. బిమ్లా కుమారి, బి. నంద్రేకర్, ఇంకా సితారా దేవి నటించిన ఈ సినిమాకి గోహర్ స్వర్ణ పతకం లభించింది.

తరువాత, 1937 చివరలో ఆయన రంజీత్ మూవీటోన్ సంస్థకి మారి, వాళ్ళకి మూడు సినిమాలు తీశారు. అక్కడ్నించి సిర్కో ప్రొడక్షన్స్ లిమిటెడ్‌లో చేరారు. అయితే ఒక ఏడాదికే ఆ సంస్థ మూతపడడంతో తానే ఆ సంస్థని కొనుగోలు చేసి ‘కర్దార్ ప్రొడక్షన్స్’ స్థాపించారు. అదే ప్రాంగణంలో ఆయన కర్దార్ స్టూడియోస్ కూడా స్థాపించారు. 1940 నుంచి కర్దార్ ప్రొడక్షన్స్ సంస్థ పేరిట చిత్రాలను నిర్మించసాగారు. ఆ రోజులలో అన్ని వసతులు ఉన్న స్టూడియోలలో కర్దార్ స్టూడియోస్ ఒకటి. ఎయిర్ కండీషన్డ్ మేకప్ రూమ్స్ ఉన్న తొలి స్టూడియో ఇదే. 1946లో కె. ఎల్. సైగల్ ప్రధాన పాత్ర పోషించిన, నౌషాద్ సంగీతం అందించిన ‘షాజహాన్’ సినిమాతో తొలి వాణిజ్య విజయాన్ని అందుకున్నారు కర్దార్. ఈ సినిమాలోని అన్ని పాటలు హిట్ కావడంతో దీన్ని ఒక ‘మాస్టర్‌పీస్’గా భావించారు.

1947లో దేశ విభజన జరగడంతో, కర్దార్ తన బావగారు మహబూబ్ ఖాన్‌తో కలిసి పాకిస్తాన్ విడిచిపెట్టారు. అయితే మిహిర్ బోస్ చెప్పారని చెప్పిన బన్నీ రూబెన్స్ ప్రకారం వీరు భారతదేశానికి రావడానికి కారణమేదీ లేదు. కర్దార్ తిరిగి సినిమాలపై దృష్టి సారించి ‘దర్ద్’ (1947) సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సురయ్యా నటించగా, నౌషాద్ సంగీతం అందించారు. తరువాత రొమాంటిక్ ట్రాజెడీ ‘దిల్లగి’ (1949) తీశారు. ఇది బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. Wuthering Heights (1939) అనే సినిమా నుండి ప్రేరణ పొందిన కర్దార్, దాని ఆధారంగా ‘దిల్ దియా దర్ద్ లియా’ (1966) తీశారు. ‘దిల్లగి’కి సౌషాద్ అందించిన సంగీతం ప్రజాదరణ పొందింది, ముఖ్యంగా సురయ్యా పాడిన పాట ‘తు మేరా చాంద్’! ‘దులారీ’ (1949)లో కూడా పాటలు జనాదరణ పొందాయి, రఫీ పాడిన ‘సుహానీ రాత్ ఢల్ చుకీ’ అనే పాట జనాల నోళ్ళలో నానింది. గీతా బాలి, మధుబాల, సురేష్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం.

Enchantment అనే సినిమా ఆధారంగా ట్రాజిక్ మెలోడ్రామా ‘దాస్తాన్’ (1950) నిర్మించారు. వాణిజ్యపరంగా ఘన విజయం సాధించిన సినిమాలో ఒకటిగా దీన్ని చెబుతారు. ‘జాదూ’ (1951), ‘దీవానా’ (1952)ల తరువాత నౌషాద్‌కి, కర్దార్‌కి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ‘దిల్-ఏ-నాదాన్’ (1953)కి గులాం మొహమ్మద్ సంగీతం అందించారు. ‘దిల్ దియా దర్ద్ లియా’ (1966) కి ముందు మరో మూడు సినిమాలు తీశారు, కానీ ఈ సినిమా నుంచి మళ్ళీ నౌషాద్‌తో కలిసి పనిచేశారు. కర్దార్ చివరి సినిమా ‘మేరే సర్తాజ్’ (1975).

 

హిందీ చిత్ర పరిశ్రమకు ఆయన ఎందరో కళాకారులని అందించారు, వారంతా తమ తమ రంగాలలో ఉన్నత స్థానాలకు చేరారు – ఉదాహరణకి నౌషాద్, మజ్రూహ్ సుల్తాన్‌పురీ, సురయ్యా. దిగ్గజ గాయకుడు మహమ్మద్ రఫీకి తొలి హిట్ పాట కర్దార్ దర్శకత్వం వహించిన ‘దులారీ’ (1949) సినిమాలోని ‘సుహానీ రాత్ ఢల్ చుకీ’ అనే పాట! ఆయన ‘కర్దార్-కోలినోస్ కంటెస్ట్’ ప్రారంభించి, ఎందరినో గుర్తించి పరిశ్రమకి అందించారు. చాంద్ ఉస్మాని, మహేంద్ర కపూర్ ఇందుకు ఉదాహరణలు.

***

తన తండ్రి గురించి యాస్మిన్ (ఎ.ఆర్.కర్దార్ కూతురు) మరిన్ని వివరాలు అందించారు. ఆమె మాటల్లోనే….

“జ్ఞాపకాల బాటలో నడుస్తూ, నాన్నతో గడిపిన ఉత్తమమైన కాలాన్ని గుర్తు చేసుకుంటే నాకు గతవ్యామోహం కలుగుతుంది. అవన్నీ కాయితం మీద పెట్టడం కష్టమనిపిస్తుంది. ఆయన ఇంకెవరికీ లభించనంత ఓ గొప్ప, అద్భుతమైన తండ్రి. మా అమ్మ శ్రీమతి బహర్ అక్తర్ సుల్తానా కర్దార్ నాన్నకి జీవితకాలపు ప్రేరణ. వాళ్ళ పెళ్ళి లాహోర్ (పాకిస్తాన్)లో జరిగింది, వాళ్ళది ప్రేమ వివాహం. ఓ అద్భుతమైన ప్రణయగాథ లాంటిది వాళ్ళ కథ. నాన్నతో ఎలా ప్రేమలో పడిందో అమ్మ చెప్తుంటే నాకు కన్నీళ్ళొచ్చేవి. ఆ రోజులో పర్దా పద్ధతి ఉండేది, నాన్న వాళ్ళుండే ప్రాంతంలోనే తామూ ఉండేవారమని అమ్మ చెప్పింది. నాన్న ఆ వీధిలోంచి వెళ్ళేడప్పుడు అమ్మ కిటికీ వద్దకి పరిగెత్తి, కర్టెన్ వెనుకనుంచి చూసేదట. ఆయనలో రాచఠీవి ఉట్టిపడేదని, గుర్రంపై వెడుతుంటే – ఆ దృశ్యం ఆకట్టుకునేదని చెప్పింది. తరువాత వాళ్ళు పెళ్ళి చేసుకోడం, హాయిగా జీవితం గడపడం అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ సుప్రసిద్ధ క్రికెటర్ హఫీజ్ కర్దార్ (ఎ.హెచ్.కర్దార్) మా నాన్నకి సవతి తమ్ముడు. సర్దార్ అక్తర్ మా అమ్మ సోదరి, అంతే కాదు దర్శక నిర్మాత మెహబూబ్ ఖాన్‌కి రెండో భార్య. కొడుకుని ఇంజనీరుగా చూడాలనుకున్న తాతగారి ఆకాంక్షలకి భిన్నంగా నాన్న 1930లో ఇండియాకి వచ్చేశారు. నాన్న 1930లో కలకత్తాకి వెళ్ళి ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీలో చేరారు. వాళ్ళకి సుమారు 7 సినిమాలు తీశారు. కలకత్తా ఆరేడేళ్ళు ఉన్నారు. 1937లో ఆ కంపెనీ మూత పడడంతో, బొంబాయి వెళ్ళి (తార్‌దేవ్ లోని) ఫిల్మ్ సిటీలో చేరారు. ఇక్కడ, ఈ కంపెనీ కోసం ‘బాఘ్‌బన్’ అనే ఒకే ఒక్క సినిమా తీశారు. విమల కుమారి, నంద్రేకర్, ఇంకా సితారా దేవి నటించిన ఈ సినిమాకి గోహర్ స్వర్ణ పతకం లభించింది. తరువాత, 1937 చివరలో నాన్న రంజీత్ మూవీటోన్ సంస్థకి మారారు, వాళ్ళతో మూడు సినిమాలు తీశారు. అక్కడ్నించి సిర్కో ప్రొడక్షన్స్ లిమిటెడ్ లో చేరారు. అయితే ఒక ఏడాదికే ఆ సంస్థ ఖాయిలా పడడంతో తానే ఆ సంస్థని కొనుగోలు చేసి ‘కర్దార్ ప్రొడక్షన్స్’ స్థాపించారు. అదే ప్రాంగణంలో ఆయన కర్దార్ స్టూడియోస్ కూడా స్థాపించారు. 1940 నుంచి నాన్న కర్దార్ ప్రొడక్షన్స్ సంస్థ పేరిట చిత్రాలను నిర్మించసాగారు. సినిమా నిర్మాణంలోని అన్ని ప్రక్రియల్లోనూ – స్క్రిప్ట్ నుంచి ఎడిటింగ్ వరకూ – అన్నింటిలోనూ నాన్నకి అద్భుతమైన అవగాహన ఉండేది. ఆయన ‘ఎ’ క్లాస్ పెయింటర్. గొప్ప ఫొటోగ్రాఫర్. నాన్న వద్ద ఎన్నో కెమెరాలు, లెన్సులు ఉండేవి. ఆయన ఎంతో క్రమశిక్షణ కలవారు, గొప్ప జ్ఞాని. ఆయనని అందరూ ఎంతో గౌరవంగా చూసేవారు. పాతకాలం వ్యక్తులు ఆయనను ‘మియాజీ’ అనేవారు.

ఆ రోజులలో అన్ని వసతులు ఉన్న స్టూడియోలలో కర్దార్ స్టూడియోస్ ఒకటి. ఎయిర్ కండీషన్డ్ మేకప్ రూమ్స్ ఉన్న తొలి స్టూడియో అదే. నాన్న నటుడు – దర్శకుడు. ఆయన తన సినిమాలు జర్మన్ స్థాయి ఖచ్చితత్వంతో తీసేవారు. ఆయన చాలా ఖచ్చితమైన మనిషి. ఆర్టిస్టుల నుంచి తనకేం కావాలో బాగా తెలుసు, వాళ్ళ నుంచి అదెలా రాబట్టుకోవాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఆ రోజులలో సినిమాలు రెండు లేదా మూడు నెలలలో పూర్తయ్యేవి, స్టార్ నటీనటులు షూటింగులకి ఆలస్యంగా వచ్చే దాఖలాలు లేవు.

ఇంకెం చెప్పను ఆయన గురించి? ఆయన గురించి ఎంత మాట్లాడితే, అంతగా రాయాలనిపిస్తుంది. ఓ తండ్రిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో యజమానిగా, ముఖ్యంగా నాకు తెల్సి భూమి మీద జీవించిన… అద్భుతమైన మంచి మనిషిగా ఆయన గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది…”

***

మెరైన్ డ్రైవ్‌లో నివసించిన కర్దార్ 85 ఏళ్ళ వయసులో 22 నవంబర్ 1989 నాడు మహరాష్ట్రలోని ముంబైలో స్వర్గస్థులయ్యారు.


భారత సినీకళాకారుల రష్యా పర్యటన:

1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొద్దిరోజులకే, ఎన్నో చర్చల తర్వాత, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ యు.ఎస్.ఎస్.ఆర్. పక్షం వహించగా, సోవియట్ ప్రజల కోసం బాలీవుడ్ సినిమాలు డబ్బింగ్ అవసాగాయి లేదా సబ్ టైటిల్స్‌తో అక్కడ విడుదల అవసాగాయి. దేవానంద్ ‘రాహీ’, రాజ్ కపూర్ ‘ఆవారా’ చెరో 800 ప్రింట్లతో సోవియట్ యూనియన్‌లో 15 రిపబ్లిక్‍లలోని అన్ని భాషలలోనూ విడుదలయ్యాయి. ‘ఆవారా’ రష్యన్ భాషలోకి డబ్ అయి Brodiaga (the Vagabond) పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా టైటిల్ సాంగ్ ఒక మోజులా, ఆ దేశాన్ని సందర్శించే భారతీయులకు పలకరింపుగా మారడమే కాకుండా, అధికారిక విందులలో కూడా వాయించబడేది. మాజీ అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్, మాస్కో మాజీ మేయర్ యూరీ లుజ్‌కోవ్ ఈ పాటని హమ్ చేసేవారని వదంతులు ఉన్నాయి. రష్యాలో విజయవంతమైన తొలి హిందీ సినిమగా ‘ఆవారా’ కాగా, ‘శ్రీ 420’తో రాజ్ కపూర్ తన కీర్తిని సుస్థిరం చేసుకున్నారు. ఈ రెండు సినిమాల్లోని – ఆశావాదం, ఇంకా అంతర్లీనంగా ఉన్న సామ్యవాద నేపథ్యం – రెండో ప్రపంచ యుద్ధం తాలూకు విధ్వంసం నుండి కోలుకుంటున్న ఆ దేశానికి ఉపశమనకారి లాగా అయ్యాయి.

కథానాయకుడు రాజ్ కపూర్‌ కమ్యూనిస్టు కానప్పటికీ, ఆయనకి అక్కడ దిగ్గజ స్థానం లభించింది. ఆయన మన దేశంలో అప్పటి భావనల దృష్ట్యా, ఇంకా తన స్క్రిప్ట్ రైటర్ క్వాజా అహ్మద్ అబ్బాస్ సూచించిన విధంగా నడుచుకున్నారు. అబ్బాస్ భావ వామపక్షవాది, సోవియట్ నమూనా పట్ల ఆకర్షితులయ్యారు అబ్బాస్, ఆయన మిత్రులు సినిమాలు వినోదాత్మకంగా కాకుండా సందేశాత్మకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు, అయితే మాస్టర్ స్టోరీ-టెల్లర్ రాజ్ కపూర్ సినిమాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండేవి. ఆవారా సినిమాకి రష్యాలో 63 మిలియన్ల టికెట్లు అమ్మారు. 29 బిలియన్ రూబుల్స్ వసూలు చేసి, సోవియట్ శకంలో తొలి, అతి పెద్ద బాలీవుడ్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాలో బాలీవుడ్‌లోని గొప్ప నటుడు, ‘సోవియట్ హార్ట్‌థ్రాబ్’ రాజ్ కపూర్ నటించి దర్శకత్వం వహించారు. ప్రివిలెజ్డ్ రీటా పాత్రలో నర్గిస్ నటించగా – అవసరం, పేదరికం కారణంగా నేరాలు చేసే వ్యక్తిగా రాజ్ కపూర్ వర్గపోరాటాన్ని చాటే ఈ సినిమాలో నటించారు.

కిడ్నాప్, మోసం, కుటుంబ ద్రోహం కథాంశాలుగా సాగిన ప్రేమకథ ‘ఆవారా’ని ఒక క్లాసిక్ స్థాయికి తీసుకెళ్ళింది. “1950లు, 1960లలో అత్యున్నత స్థాయిలో ఉన్న రాజ్ కపూర్ ప్రతిష్ఠ – పశ్చిమ దేశాలలో లివర్‍పూల్ బాయ్స్, ది బీటిల్స్ వంటివారికి మాత్రమే సాధ్యమైన అభిమానుల్ని సాధించింది” అని The Calvert Journal పేర్కొంది.

***

ఈ అరుదైన ఫొటోలో రష్యాలో పర్యటిస్తున్న రాజ్ కపూర్, నర్గిస్, దేవ్ ఆనంద్, బాల్‌రాజ్ సహాని, నిరుపా రాయ్ లను చూడవచ్చు.

రాజ్ కపూర్, నర్గిస్ రెండు రోజుల రష్యా పర్యటనని ఈ వీడియోలో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here