అలనాటి అపురూపాలు – 226

0
13

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

హేమంత్ కుమార్‍కి సలీల్ చౌదరి నివాళి:

ప్రముఖ స్వరకర్త హేమంత్ కుమార్‍ మృతిచెందిన తర్వాత, మరో సంగీత దర్శకుడు సలీల్ చౌదరి వారికి నివాళి అర్పిస్తూ వారితో తనకున్న అనుబంధాన్ని ఓ బెంగాలీ పత్రిక ద్వారా వెల్లడించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చదువుదాం.

~

హేమంత ముఖర్జీ గురించి నాకు 40వ దశకం మధ్యలో తెలిసింది. మేము అప్పుడప్పుడు కలుసుకున్నా, ఆయనని సన్నిహితంగా తెలుసుకునే అవకాశం ఎప్పుడూ కలగలేదు. నేను హేమంత ముఖర్జీని మొదటిసారి జార్జ్-దా (దేబబ్రత బిస్వాస్) ఇంట్లో కలిశాను. అప్పుడు మేము మర్యాదపూర్వకంగా పలకరించుకున్నాం, అంతే. ఆ తర్వాత 1948లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) పై నిషేధం విధించబడింది. నేను 1946 నుండి సిపిఐ కార్యాకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాను. కలకత్తాలో, గోల్‌పార్క్‌కు సమీపంలో ఉన్న ‘జశోదా భవన్’ మేము తరచూ వెళ్ళే రహస్య స్థావరం; రాజకీయ సమావేశాలకు కేంద్రంగా ఉండేది. అలాంటి ఒక సమావేశంలో, భీష్మదేవ్ ఛటోపాధ్యాయ శిష్యుడు మరియు మా చర్చా బృందం సభ్యుడు కృష్ణ బంద్యోపాధ్యాయ నా పాటలు పాడేందుకు హేమంత ముఖర్జీని పిలవమని సూచించారు.

అప్పట్లో హేమంత ముఖర్జీ, సుచిత్రా మిత్ర IPTA కోసం పాడటం ప్రారంభించారు. బినయ్ రాయ్ నాయకత్వంలో, జార్జి-దా ప్రభావంతో వారు ప్రజా ఉద్యమంలో పాలుపంచుకున్నారు.

అలా 1948-49లో ఒకరోజు, నేను దక్షిణ కలకత్తాలోని ఇంద్రరాయ్ రోడ్‌లోని హేమంత ముఖర్జీ ఇంటికి వెళ్ళి, ఆయనని కలిశాను, పరిచయం చేసుకున్నాను. స్వల్పకాలంలోనే ఆయన నా హేమంత-దా అయ్యాడు. అప్పటికి IPTA కోసం నేను వ్రాసిన కొన్ని పాటలు ప్రాచుర్యం పొందాయి. నేను వాటిలో కొన్నింటిని పాడి హేమంత-దాకు వినిపిస్తే, వాటిని చాలా మెచ్చుకున్నారు. కానీ కొంత సందేహించి, “ఈ రోజుల్లో ఈ పాటలు రికార్డ్ అవ్వవు. మీ దగ్గర ఇంకేమైనా పాటలు ఉంటే నేను అవి పాడతాను” అన్నారు. ఆ సమయంలో నా దగ్గర వేరే పాటలేవీ లేవు. కాబట్టి మేము మరొకసారి కలుసుకోవాలని నిర్ణయించుకున్నాం, పాటల కోసం కొత్త థీమ్స్ మొదలైనవాటి గురించి ఆలోచించాలనుకున్నాం. నేను మెట్లు దిగి సగం కిందకి వచ్చాక, ఇటీవలే స్వరపరుస్తున్న కొత్త పాట నాకు గుర్తుకు వచ్చింది. వెంటనే వెళ్ళి ఆయనకు చెప్పాను. ఆ సగం పాటను విని ఆనందించారు. అలా పుట్టిన ఆ పాటే ‘కోనో ఏక్ గేయర్ బోధు’. నేను ఇంటికి తిరిగి వచ్చి, పాట రెండవ భాగాన్ని వ్రాసి, బాణీ కట్టాను. రెండు రోజుల్లో నేను పూర్తి పాటతో హేమంత-దాకు వద్దకు వెళ్ళగా, ఆయన దానిని తీసుకున్నారు. ఆ రోజు రాత్రి ‘జశోదా భవన్’పై దాడి జరిగింది, దాంతో నేను మరోసారి సందేశ్‌ఖాలీకి పారిపోవాల్సి వచ్చింది. ఇంకోసారి అజ్ఞాతంలోకి వెళ్ళాల్సొచ్చింది.

ఆ సంవత్సరం, ఆగస్ట్ 1949లో అనుకుంటా, హేమంత-దా ‘గేయర్ బోధు’ను పూజాగీతంగా రికార్డ్ చేశారని విన్నాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయనే స్వయంగా ఆర్కెస్ట్రేషన్ ఏర్పాటు చేయడం. ఈ పాట విడుదలైన వెంటనే సంచలన విజయం సాధించింది. ఈ రోజుల్లో మనం సూపర్-డూపర్ హిట్ అని పిలుస్తాము – బహుశా అంతకంటే ఎక్కువ.

అప్పుడు నా వయస్సు ఎంత అనుకుంటున్నారు? సుమారు ఇరవై లేదా ఇరవై ఒకటి. నా చిన్న ఆకారం నన్ను నా వయసు కన్నా చిన్నగా కనిపించేలా చేసింది. హేమంత-దా సూపర్ హిట్ పాటకు నేనే బాణీ కట్టి, స్వరపరిచానంటే ఎవరూ నమ్మలేదు. ఆ సమయంలో జరిగిన ఒక వినోదభరితమైన సంఘటన నాకు గుర్తుంది.

హేమంత-దా, సుచిత్ర మిత్ర, నేను IPTA బృందంతో కలిసి గౌహతిలో పర్యటిస్తున్నాము. ఒక కార్యక్రమంలో, కాటన్ కాలేజీ ప్రిన్సిపాల్ – హేమంత ముఖర్జీ పాడిన ఆ గొప్ప పాటకు స్వరకర్త సలీల్ చౌదరి నేనేనని నమ్మడానికి నిరాకరించాడు. అప్పుడు హేమంత-దా అసలు విషయం చెప్పి నన్ను ఇబ్బందికరమైన పరిస్థితి నుండి రక్షించారు.

హేమంత-దా ‘రన్నర్’ కోసం ఆర్కెస్ట్రేషన్ కూడా ఏర్పాటు చేశారు. నేను హేమంత-దాకు పాట పాడినప్పుడు, నేను ఆర్కెస్ట్రేషన్ గురించి కొన్ని సూచనలు ఇచ్చాను. మిగిలినదంతా ఆయన సృష్టి. మళ్లీ అదే కథ – నేను అజ్ఞాతంలో ఉన్నాను, నా గైర్హాజరీలో పాట రికార్డ్‌ చేసి విడుదల చేసి మరోసారి సూపర్‌ హిట్‌ కొట్టారు. హేమంత-దా ఆ సంవత్సరం (1950), నేను స్వరపరిచిన మరో రెండు పాటలు ‘అబక్ పృథిబి’, ఇంకా ‘బిద్రహా ఆజ్’ లను రికార్డ్ చేశారు. గతంలో జార్జ్-దా, ప్రీతి సర్కార్ ఈ పాటలు పాడేవారు. జార్జ్-దా ఒక రోజు వాటిని హేమంత-దాకు పాడి వినిపించి, “హేమంత, ఈ పాటలను ఎందుకు రికార్డ్ చేయకూడదు? వారు (గ్రామోఫోన్ కంపెనీ.) వీటిని పాడటానికి నన్ను అనుమతించరు” అన్నారు. ఆ రోజే హేమంత-దా పాటలు రికార్డ్ చేశారు.

1950-52 మధ్య హేమంత-దాకూ నాకూ మధ్య కాస్త ఎడం వచ్చింది. ఆయన బొంబాయి వెళ్లిపోయారు. అప్పట్లో నేను సత్యేంద్రనాథ్ దత్తా ‘పల్కీర్‌ గాన్‌’కి పని చేస్తున్నాను. బాణీలు కట్టడాడానికి మూడు నెలలకు పైగా పట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే మా నాన్నగారు చనిపోయారు.

ఈ వార్త విన్న హేమంత-దా తన సంతాపాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, బొంబాయిలో తనకి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉద్యోగం కూడా ఇచ్చారు. కానీ అప్పటికి నేను బెంగాలీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడంలో బిజీగా ఉండడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించాను.

బెంగాల్‌లో నా సినిమా సంగీతానికి మంచి ఆదరణ లభించింది. తన బిజీ షెడ్యూల్ మధ్య, హేమంత-దా ఒక రోజు కలకత్తా వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికి ‘పల్కీర్ గాన్’ సిద్ధమయింది. పాట విని హేమంత-దా చాలా సంతోషించారు. కొత్త పోకడలను అంగీకరించడంలోనూ, గుర్తించడంలోనూ హేమంత-దా గుణాన్ని నేను ఇక్కడ ప్రస్తావించాలి. కొద్ది మంది మాత్రమే ఈ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నా ఉద్దేశంలో, ఆయనకి ఒక కొత్త ప్రయత్నాన్ని సవాలుగా స్వీకరించే ధైర్యం ఉంది. ‘పల్కీర్ గాన్’ విని చాలా సంతోషించారు – ఒక కొత్త ప్రయోగమని, అభినందించారు. ‘పల్కీర్ గాన్’ 1952లో రికార్డ్ చేయబడింది. ఇది బెంగాలీ ఆధునిక పాటలలో కొత్త పోకడలకు ఆహ్వానం పలికింది.

మరుసటి సంవత్సరం నా కథ ‘దో బిఘా జమీన్’ ఆధారంగా సినిమా తీయమని బిమల్ రాయ్ చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా నేను బొంబాయికి బయలుదేరాను. ఆ సినిమాకు నేనే సంగీత దర్శకుడిని. ఆ చిత్రానికి పాటలు మన్నాడే, రఫీ, లతా మంగేష్కర్ పాడారు. ఈ పాటలు హేమంత-దా స్వరానికి సరిగ్గా సరిపోలేదు, ఆయన కూడా అర్థం చేసుకున్నారు, తప్పుగా భావించలేదు. నా తర్వాతి సినిమా బిమల్ రాయ్ ‘బిరాజ్ బహు’లో హీరో కోసం హేమంత-దా నాలుగు పాటలు పాడారు. ఆ తర్వాత మేమిద్దరం మా మా పనుల్లో తీరిక లేకుండా ఉండిపోయాం. కానీ మేము ఎప్పుడు కలిసినా, హేమంత-దా “సలీల్, పూజల కోసం ఒక పాట స్వరపర్చండి” అని తొందరపెట్టేవారు. ఆ తర్వాత రెండేళ్ళ తర్వాత హేమంత-దా మరోసారి నా రెండు పాటలు – ‘పాతే ఎబర్ నామో సాథీ’, ‘ధితంగ్ ధితాంగ్ బోలే’ రికార్డ్ చేసారు. బెంగాలీ పూజాగీతాల కోసం మా కలయిక కొన్ని సంవత్సరాల పాటు అసమానంగా కొనసాగింది.

కానీ మా స్నేహం – కొంతమందికి కన్నుకుట్టింది. మా మధ్య చీలికకు కారణమయ్యే వ్యక్తుల సమూహాన్ని ప్రేరేపించింది. దాంట్లో వారు విజయం సాధించారు. వారు హేమంత-దా వద్దకు వెళ్లి “నా పాటలు పాడకుంటే – ‘హేమంత ముఖర్జీ పాపులర్ అయ్యేవాడు కాదు’ అని సలీల్ చౌదరి అంటున్నాడు” అని ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తులే నా దగ్గరకు వచ్చి “హేమంత-దా ఏమన్నారో తెలుసా? ‘నేను సలీల్ పాటలు పాడకపోతే ఈ రోజు అతని గురించి ఎవరికి ఎవరు తెలిసేది?’ అని అన్నారు” చెప్పారు. దాంతో మా మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయి, కొన్ని సంవత్సరాలుగా నా పాటలు పాడడం మానేసారు. నేను స్వరపరిచిన కొన్నిబెంగాలి పాటలు పాడి లత పేరు తెచ్చుకున్నారు. అవి హేమంత-దాకి కూడా నచ్చాయి. ఓసారి మేమిద్దరం కలుసుకున్నాం. “హేమంత-దా, ‘నేను లేకపోతే సలీల్ చౌదరి ఎవరు?’ అని మీరు వ్యాఖ్యానించారని విన్నాను” అని అన్నాను. హేమంత-దాకు కోపం వచ్చింది. “ఏం చెప్తున్నారు? ‘హేమంత ఎవరు..’ అని మీరన్నట్లు నేను విన్నాను” అన్నారు. వెంటనే మాకు నిజం స్ఫురించింది. అపార్థాలు తొలగిపోయాయి. హేమంత-దా ‘అమే ప్రోష్నో కరే’, ‘షోనో కోనో ఏక్ దిన్’ అనే రెండు కొత్త పాటలను రికార్డ్ చేసారు. రికార్డింగ్ సెషన్ తర్వాత హేమంత-దా, “సలీల్, మీరు నా హృదయ వ్యక్తీకరణలకు పదాలు ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు ఆ తర్వాత హేమంత-దా నాతో రికార్డింగ్ కొనసాగించారు.

‘మధుమతి’ విజయం తర్వాత బొంబాయికి తిరిగి వచ్చిన నేను చాలా బిజీ అయిపోయాను. బెంగాలీ సంగీతానికి తగినంత సమయం కేటాయించలేకపోయాను. ఆ సమయంలోనే నేను ‘బాంబే యూత్‌ కోయిర్‌’లో కూడా చేరాను. హేమంత-దా, నేనూ సన్నిహితంగా ఉన్నప్పటికీ, మా సంగీత సంబంధం దాదాపుగా తెగిపోయింది. ఆ తర్వాత, దాదాపు ఎనిమిదేళ్ల క్రితం హేమంత-దా ఎల్‌పిలో మా పాత హిట్‌లలో పదిని రీ-రికార్డింగ్ చేశారు. నేను బొంబాయిలో బిజీగా ఉన్నాను, సమీర్ సీల్ కొన్ని పాటలకు ఆర్కెరేషన్ చేశారు. కోపం రాలేదు, కానీ నేను కొద్దిగా బాధపడ్డాను. నేను లేనప్పుడు మొత్తం ప్రాజెక్ట్ పూర్తయింది. ఏదేమైనా, నేను హేమంత-దా వద్దకు వెళ్లినప్పుడు – ఆయన “సలీల్, నేను మీ పాటలను రీ-రికార్డింగ్ చేశానని మీరు విని ఉంటారు. మీకు తెలుసా? మీ పాటల అర్థం తెలుసుకోకుండానే నేను మీ పాటలను పాడుతున్నాను. ఇప్పుడు వయస్సుతో నేను ఒకదాన్ని కనుగొన్నాను. కానీ నా స్వరం నాకు ద్రోహం చేసే అవకాశం ఉంది, కాబట్టి నేను వాటిని వీలైనంత త్వరగా రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నాను. మీకు అభ్యంతరం ఉండదని ఆశిస్తున్నాను” అన్నారు.

రీ-రికార్డింగ్ చేసిన పాటలు ఒరిజినల్ వెర్షన్‌ల కంటే కొంచెం తక్కువ శోభాయమానంగా ఉన్నాయని నాకనిపించింది. కొన్ని సందర్భాల్లో ఆర్కెస్ట్రేషన్‌లు కూడా మార్చారు. ఈ సంఘటనకు కొన్ని సంవత్సరాల ముందు హేమంత-దా బొంబాయిలో ‘ఠికానా’ రికార్డ్ చేశారు. అది 1970 సంవత్సరం. ఆ తర్వాత హేమంత-దా కలకత్తాలో స్థిరపడ్డారు. నేను బొంబాయిలోనే ఉండిపోయాను. ఈ మధ్యకాలంలో మేము బెంగాలీ చిత్రం ‘రాయ్ బహదూర్’ (1964)లో కలిసి పనిచేశాము- ఆయన పాటలు అద్భుతంగా ఉన్నాయి. కాలం గడిచిపోయింది, మేము ఎక్కువ కాలం కలిసి పనిచేయలేదు. ఆ తర్వాత 1980లో నా ఆరు బాణీలతో కూడిన ఎల్‍పి ‘అనేక్ గానేర్ పాఖీ’లో మేము మళ్లీ కలిశాం.

ఇది అత్యుత్తమ ఆల్బమ్ అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. దురదృష్టవశాత్తు, రికార్డింగ్‌కు ముందే హేమంత-దా అనారోగ్యం పాలయ్యారు. దీంతో పాటలు పెద్దగా ఆదరణ పొందలేదు. అయితే కేవలం మూడు నెలల క్రితమే, మేము మళ్లీ – మరో బెంగాలీ చిత్రం ‘హరనేర్ నాట్-జమై’ లో ఒక పాట కోసం జతకట్టాము. “ఓ ఆయ్ రే, ఓ ఆయ్ రే” అంటూ సాగుతుంది పాట. నిజానికి ఇది నా పాత కంపోజిషన్ – ‘ధన్ కతర్ గాన్’. హేమంత-దా అనారోగ్యంతో ఉన్నారు, ఆయన గొంతు పాడైంది. కానీ మేము రికార్డింగ్‌ కొనసాగించాము – ట్రాక్-రికార్డింగ్‌లో డబ్బింగ్ చేశాం. పాట పూర్తి కావడానికి ఆరు రికార్డింగ్ సెషన్‌లు పట్టింది. ఈ పాట ఇప్పుడు నా ఆస్తులలో ఒకటి.

హేమంత-దా నన్ను అతిగా పొగడని ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదని ఈరోజు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు గొప్ప ప్రోత్సాహాన్ని అందించింది. ఇటీవల హేమంత-దా నా స్నేహితులతో “ఈ రోజుల్లో సలీల్ ఏం చేస్తున్నారు? రికార్డింగ్ స్టూడియోలు అతనికి ఉద్దేశించబడలేదు (హేమంత ముఖర్జీ సలీల్ చౌదరి ప్రారంభించిన రికార్డింగ్ స్టూడియో గురించి ప్రస్తావించారు). ఆయనకి వ్యాపారం సరిపోదు. సంగీతంపై దృష్టి పెట్టమని చెప్పండి. అదే ఆయన నిజమైన పని” అని అన్నారట. నా విషయంలో అవే హేమంత-దా చివరి మాటలు – అది అన్నయ్య సలహా మాత్రమే కాదు, దైవానుగ్రహం లాంటిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here