అలనాటి అపురూపాలు – 232

1
11

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

ఇద్దరు కథానాయకుల స్నేహం గురించి, వారి తొలి కలయిక గురించి సైరా బాను జ్ఞాపకాలు:

సినీరంగంలో నటీనటుల మధ్య, సాంకేతిక నిపుణుల మధ్య స్నేహం ఏర్పడడం సాధారణం! అయితే బాల్యం నుంచే స్నేహం ఉండి, తరువాత సినీరంగంలో కలిసి, తమ స్నేహాన్ని బలోపేతం చేసుకున్నవారు దిలీప్ కుమార్, రాజ్ కపూర్‍లు.

దిగ్గజ నటుడు దిలీప్ కుమార్, గ్రేట్ షోమాన్ రాజ్‍ కపూర్‍ల మధ్య స్నేహం వారి బాల్యం నుంచే మొదలయిందని – దిలీప్ కుమార్ భార్య, నటి సైరా బాను తెలిపారు. వారిద్దరి స్నేహానికి నివాళి అర్పిస్తూ, వారి స్నేహం గురించి పలు విషయాలు వెల్లడించారు.

“దిలీప్ కుమార్, రాజ్ కపూర్‍లు ఇద్దరూ పెషావర్‍లో జన్మించారు. బాల్యమిత్రులు. తరువాత బొంబాయిలో ‘ఖల్సా కాలేజీ’లో చదివారు. నటనలో ప్రవేశించిన తొలి రోజులను ‘బాంబే టాకీస్’ వారితో గడిపారు. దేవికా రాణి, శశిధర్ ముఖర్జీ లాంటి దిగ్గజాల పర్యవేక్షణలో, అశోక్ కుమార్ వంటి నాటి సూపర్ స్టార్ సాన్నిహిత్యంలో నటనలో శిక్షణ పొందారు.

రాజ్ కపూర్, దిలీప్ సాహిబ్ – తమ సొంత తోబుట్టువులను ఎంతగా ప్రేమిస్తారో, అదే స్థాయిలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారిద్దరూ తమ కుటుంబాల్లోని వారి కంటే ఎక్కువగా ఒకరితో ఒకరు ఆలోచనలు, భావోద్వేగాలు, రహస్య ఆకాంక్షలను పంచుకున్నారు.

 

రాజ్ గారు లండన్‌లో ఉన్నారనుకోండి, ఏదో ఒక ముఖ్యమైన ఫంక్షన్‌కి బొంబాయిలో ఉండడం అవసరమని దిలీప్ సాహెబ్  ఫోన్ చేస్తే, రాజ్ గారు వెంటనే వెనక్కి రావడానికి ఏమీ అనుకోరు, ఇది ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాలను వెల్లడిస్తుంది. మా పెళ్లిలో, రాజ్ గారు, శశి – దిలీప్ సాహిబ్ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటి వరకు డ్యాన్స్ చేస్తూ వచ్చారు.

వాళ్ళ మధ్య వృత్తిపరమైన పోటీ ఉండేది. సినీరంగపు నిపుణులుగా వాళ్ళు పోటీ పడకపోతే అది అసాధారణంగా ఉండేది. కానీ దాని అందం ఏమిటంటే తాము లేదా తమ మిత్రుడు విఫలమవడం లేదా ‘సూపర్ స్టార్స్’గా తమ స్థానాల నుండి పడిపోవడాన్ని అస్సలు ఇష్టపడేవారు కాదు. ఒకరినొకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమతో బాటు గర్వం కూడా ఉండేది. ఉదాహరణకు, ‘శక్తి’ విడుదల సందర్భంగా రాజ్ గారు – దిలీప్ సాహెబ్‌కు ‘లాంగ్ లైవ్ ది కింగ్’ అనే ప్రత్యేక సందేశంతో గులాబీల భారీ గుచ్ఛాన్ని పంపారు.

దిలీప్ గారు – రాష్ట్రపతి సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాలలో ఉన్నప్పుడు ఓరోజు రాజ్ గారికి హఠాత్తుగా కార్డియాక్ స్ట్రోక్ వచ్చి ఢిల్లీలోని ‘అపోలో హాస్పిటల్’లో చేరారు. దిలీప్ సాహెబ్ భారతదేశానికి తిరిగి వచ్చిన రోజునే, విమానంలో ఢిల్లీకి వెళ్లి ఆసుపత్రిలో రాజ్‍ గారిని కలిశారు. మంచం మీద స్పృహ లేకుండా ఉన్న రాజ్ గారితో ‘మిత్రమా, నేను పెషావర్ నుండి తిరిగి వచ్చాను’ అని చెప్పి, ‘నిన్ను టెంప్ట్ చేయడానికి చప్లీ కబాబ్‌ల ‘సువాసన’ని తిరిగి తీసుకువచ్చాను. మనం కలిసి వెళ్లి ఒకప్పటిలాగే ఆ బజార్‌లో నడుద్దాం, కబాబ్‌లు, రొట్టెలను ఆస్వాదిస్తాము. రాజ్, లే, నువ్వు గొప్ప నటుడని నాకు తెలుసు, నిన్ను నాతో పాటు పెషావర్‌లోని ఇంటి ప్రాంగణానికి తీసుకువెళ్లాలి” అని అంటుంటే దిలీప్ సాహెబ్ స్వరం ఉక్కిరిబిక్కిరి అయింది.

రాజ్ కపూర్ జూన్ 1988లో కన్నుమూశారు. నేటికీ, ఆయన ‘గ్రేటెస్ట్ షో మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ గా కీర్తించబడుతున్నారు” అంటూ ఇద్దరు దిగ్గజ నటుల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు సైరా బాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here