అలనాటి అపురూపాలు – 233

0
10

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

టంగుటూరి సూర్యకుమారి ప్రపంచ యాత్ర:

తెలుగు సినిమా స్వర్ణ యుగంలో మొట్టమొదటి ప్రముఖ నటి మరియు గాయని టంగుటూరి సూర్యకుమారి. ‘మా తెలుగు తల్లికి’ పాటను శ్రోతల హృదయాలలో నిలిచిపోయేలా పాడారు. తెలుగు సినీపరిశ్రమ తొలినాటి హిట్‍గా భావించే ‘రైతు బిడ్డ’ (1939) సినిమాలో, 13 ఏళ్ళ వయసులో ఆమె నటించారు. 1952లో ఆమె మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడి కూతురామె. సూర్యకుమారి కొలంబియా విశ్వవిద్యాలయంలో సంగీత పాఠాలు బోధించారు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనే పదానికి ఆమె పూర్తి న్యాయం చేశారు. ‘ఉడాన్ ఖటోలా’ (1955) చిత్రంలో ఆమె నటనను ఉత్తరాది ప్రేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు.

1952 సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో తాము జరిపిన ప్రపంచ పర్యటన గురించి 1953 జనవరిలో టంగుటూరి సూర్యకుమారి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

ఆమె మాటల్లోనే చదవండి –

“గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో, భారతీయ చలనచిత్ర ప్రతినిధులం కొందరు అమెరికా వెళ్ళాం. దక్షిణ భారతదేశం నుండి నేను, దర్శకనిర్మాత కె సుబ్రహ్మణ్యం వెళ్ళాము. నర్గీస్, రాజ్ కపూర్, బీనా రాయ్, ప్రేమనాథ్, అరుంధతీ ముఖర్జీ (యాత్రిక్ ఫేమ్), డేవిడ్, గౌహర్, చందూలాల్ షా మొదలైనవారు మా బృందంలోని ఇతర సభ్యులు.

అమెరికా పర్యటన తర్వాత మేము ప్రపంచ పర్యటనకు బయలుదేరాము. చిన్నప్పుడు బడిలో ఉపాధ్యాయులు మనకు భూమి గుండ్రంగా ఉందని; ఎవరైనా ఒక ప్రదేశం నుండి తూర్పు లేదా పడమర వైపు వెళితే వారు ఎక్కడ నుంచి ప్రారంభించారో అక్కడకు తిరిగి వస్తారని బోధించారు. బొంబాయి నుండి మేము పశ్చిమానికి బయలుదేరాం – తిరిగి వచ్చేటప్పుడు కలకత్తా చేరుకున్నాము. పెద్దలెవరైనా కాశీ యాత్రకు నడకదారిన వెళ్లినప్పుడు, వారంతా కలిసి తమ అనుభవాలను చెప్పేవారు. విమానాలు, కార్లు, రైళ్ళు ఉన్న ఈ రోజుల్లో మేము చాలా దేశాలను చూడగలిగాము, చాలా మందిని కలుసుకున్నాము, చాలా విషయాలు నేర్చుకున్నాము. నేను అవన్నీ వివరించలేను కాని నా యాత్రానుభవాలను సంక్షిప్తంగా చెబుతాను.

1952లో, అమెరికన్ దర్శకుడు ఫ్రాంక్ కాప్రా – తమ దేశం సినీ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు నాకు ఒక లేఖ రాశారు, వారిలో నేను కూడా ఉంటానని ఆయన ఆశించారు. అయితే దాని గురించి నాకు ఎలాంటి సమాచారమూ లేదు. స్పష్టంగా చెప్పాలంటే, మా పొరుగింటావిడ స్క్రీన్ సినిమా పత్రికని చూపిస్తే నాకు తెలిసింది, నేను సినీ ప్రతినిధుల జాబితాలో ఉన్నానని. ఎంతో సంతోషించాను. చాలా కాలం వేచి ఉన్నప్పటికీ, నాకు అధికారిక ఆహ్వానం రాలేదు. పర్యటనలో చేరడానికి అంగీకరించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 10. ఎట్టకేలకు సెప్టెంబర్ 4న USIS [యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్] నాకు ఆహ్వానాన్ని పంపింది. నేను ప్రపంచ పర్యటనకు వెళ్లాలని అనుకున్నందున, ఆరు రోజులే గడువు ఉండడంతో తీరిక లేని పనులయ్యాయి. చివరికి 10వ తేదీన నేను, మా బావ, కె సుబ్రహ్మణ్యం మద్రాసు నుండి ఢిల్లీకి విమానం ఎక్కాం. మేము మరుసటి రోజుంతా అంటే సెప్టెంబర్ 11 వరకు కూడా ఢిల్లీలోనే ఉన్నాము. అమెరికా రాయబారి చెస్టర్ బౌల్స్ మా ప్రతినిధుల కోసం ఫేర్‍వెల్ పార్టీని ఏర్పాటు చేశారు.

తెల్లవారుజామున 3 గంటలకు మేము అమెరికా వెళ్ళేందుకు విమానం ఎక్కాం. రెండున్నర గంటలలో కరాచీ చేరుకున్నాము, అక్కడ పాకిస్తాన్ ప్రతినిధులు ఫ్లైట్ ఎక్కారు. వారిలో చాలామంది దేశవిభజన ముందు వరకు భారతదేశంలోనే ఉన్నారు. వారిలో కొందరు మమ్మల్ని హత్తుకుని దుఃఖించారు. మళ్ళీ ఉదయం 7 గంటలకు మా ప్రయాణం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు బస్రా (ఇరాక్) చేరుకున్నాము, అక్కడ నుండే నేను మద్రాసులోని మా కుటుంబానికి మొదటి ఉత్తరం రాశాను. బస్రా నుండి 5.30కి బయల్దేరి బీరుట్ చేరుకున్నాము. అక్కడ మేము వివిధ దేశాల ప్రజలను చూశాము. అక్కడ నుండి రాత్రి 7.30 గంటలకు బయల్దేరి, 10 గంటలకు ఇస్తాంబుల్ చేరుకున్నాము. మాకు విపరీతమైన ఆకలి వేసింది. ఇస్తాంబుల్‌‌లో అప్పుడు సమయం సాయంత్రం 6 గంటలు అయిందని తెలిసింది. సూర్యునికి వ్యతిరేక దిశలో ప్రయాణించినందువల్ల, సమయం 4 గంటలు వెనక్కి జరిగింది. అక్కడున్న జనం మా చుట్టూ చేరి మా చీరలవైపు చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ నుండి బయల్దేరి రాత్రి 12 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్ చేరుకున్నాము. విమానాశ్రయం విద్యుద్దీపాల కాంతిలో మిరుమిట్లు గొలుపుతోంది. అక్కడి నుండి తెల్లవారుజామున 3.40 గంటలకు లండన్ చేరుకున్నాము. వారాంతంలో [12, 13 సెప్టెంబర్, శని, ఆదివారాలు] మేము లండన్‌లోనే ఉన్నాము. 12వ తేదీ శనివారం తెల్లవారుజామున మేము షాపింగ్‌కి వెళ్ళాము. అక్కడ మధ్యాహ్నానికి దుకాణాన్ని మూసివేస్తారు, అందుకని మేము ఉదయాన్నే షాపింగ్ చేశాము. మధ్యాహ్నం భారతీయ విద్యార్థులు తమ హాస్టల్‌లో మాకు భోజనం ఏర్పాటు చేశారు. అక్కడ కేకే మోదీని, ఆయన భార్య అలెన్ మోదీని కలిశాం. సోహ్రాబ్ మోడీ, వారి భార్య మెహతాబ్ కూడా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారు. ‘ఝాన్సీ కి రాణి’ సినిమా నిర్మాణం కోసం వారప్పుడు లండన్‌లో ఉన్నారు.

ఆదివారం సాయంత్రం 7 గంటలకు మేము లండన్ నుండి బయలుదేరాము. మేము ఐర్లాండ్‌లోని పెనాంగ్ విమానాశ్రయంలో కొద్ది సేపు ఆగాము. అక్కడి నుండి నేరుగా న్యూయార్క్‌కి బయలుదేరాము. హనుమంతుడు లంక చేరడానికి సముద్రాన్ని లంఘించినట్టుగా మేము అట్లాంటిక్ మహాసముద్రం దాటాం. సోమవారం ఉదయం 10 గంటలకు మేము న్యూయార్క్ చేరుకున్నాము. మోషన్ పిక్చర్ అసోసియేషన్ సెక్రటరీ హ్యారీ స్టోన్, ది రివర్ (1951) సినిమా నిర్మాత కెన్నెత్ మెక్‌డౌనీ మాకు స్వాగతం పలికారు. ఈ చిత్రాన్ని ఆయన భారతదేశంలో చిత్రీకరించారు. విమానాశ్రయం నుండి వారు మమ్మల్ని మాన్‌హాటన్‌లోని ప్రసిద్ధ హోటల్ వాల్డోర్ఫ్ ఆస్టోరియాకు తీసుకెళ్లారు. అప్పటికి, 1963 వరకు ఈ భవనం ప్రపంచంలోనే ఎత్తైన హోటల్‌గా ఉంది, తరువాత దీనిని మాస్కోలోని హోటల్ ఉక్రైనా అధిగమించింది. అక్కడ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి భోజనం చేశాం. ఆ తర్వాత హోటల్‌లోనే ప్రెస్ మీట్ పెట్టాం. సాయంత్రం, న్యూయార్క్‌లోని భారత రాయబారి, జి.ఎన్. మెహతా, వారి శ్రీమతి మాకు టీ పార్టీ ఇచ్చారు. రాత్రి 9 గంటలకు మేము రేడియో సిటీ మ్యూజిక్ హాల్ చూడటానికి అతిథులుగా వెళ్ళాము. ఇది చాలా పెద్దది, 125 మంది మహిళలు వేదికపై వరుసగా నిలబడగలరని నాకు నమ్మకంగా అనిపించింది. చిన్న గుసగుసలు కూడా అందరికీ వినబడుతున్నందున మేము ఆశ్చర్యపోయాము. 15 నుండి 19వ తారీఖు వరకు మేము న్యూయార్క్‌లోనే ఉన్నాము.

16న న్యూయార్క్‌ నగర సందర్శనకు వెళ్లాం. అద్భుతమైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, న్యూయార్క్ సిటీ హాల్‌ చూశాము. అక్కడ డిప్యూటీ మేయర్ మాకు ఘనస్వాగతం పలికారు. ఐక్యరాజ్యసమితి భవనాన్ని కూడా చూశాం. అక్కడ మేము భోజనం చేసి కుర్చీలలో విశ్రాంతి తీసుకున్నాము. తరువాత వాల్డోర్ఫ్ ఆస్టోరియాకు తిరిగి వచ్చాము, అక్కడ ప్రెస్ మీట్ జరిగింది. అమెరికా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ [అమెరికా అధ్యక్ష పదవికి దాదాపు సమానం], ఎరిక్ జాన్స్టన్ అదే హోటల్‌లో మాకు రిసెప్షన్ ఇచ్చారు. సాయంత్రం ‘ది కింగ్ అండ్ ఐ’ డ్రామా చూశాము. మరుసటి రోజు మేము IBM  [ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ కార్పొరేషన్] ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ 6000 కొత్త కార్లు ఉన్నాయి, ఈ కార్లు అక్కడ తయారు చేయబడ్డాయని నేను మొదట అనుకున్నాను, కానీ అవి అక్కడ పనిచేసే వ్యక్తుల కార్లు అని తెలిసింది. ప్రతిచోటా వాడకంలో ఉన్న; నాణేలు వేసి, కావల్సిన వాటిని పొందే స్లాట్ మెషీన్లు ఇక్కడే తయారవుతాయి. ఇక్కడి ఉద్యోగులకు సొంత కార్లు, సొంత క్లబ్, సొంత పాఠశాలలు ఉన్నాయి వీరి పని సంస్కృతి గొప్పది. ఒకవేళ తమ తోటి ఉద్యోగి పనికి రాకపోతే, సహచరులు అతని వద్దకు వెళ్లి, అతను బాగున్నాడా లేదా ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకుంటారు. మేం ఇక్కడ భోజనం చేసి, హైడ్ పార్క్ వద్ద మిసెస్ రూజ్‌వెల్ట్‌ని కలవడానికి బయలుదేరాము. ఇక్కడే ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్‌ను ఖననం చేశారు, ఈ ప్రదేశాన్ని ఎవరైనా స్వేచ్ఛగా సందర్శించవచ్చు, రోజంతా గడపవచ్చు, భోజనం చేసి వెళ్లిపోవచ్చు. అన్ని సమయాల్లో పూర్తి నిశ్శబ్దం పాటించబడుతుంది. హైడ్ పార్క్ నుండి మేము సైన్యం శిక్షణ పొందుతున్న వెస్ట్ పాయింట్‌కి వెళ్ళాము. ఆ స్థలంలో వారి కోసం ప్రత్యేక కేథడ్రల్ నిర్మించబడింది. చాలా అందంగా ఉంది. సాయంత్రం గ్రెగరీ పెక్, అవా గార్డనర్ ప్రత్యేక అతిథులుగా వచ్చిన చిత్రం చూడటానికి వెళ్ళాము. కానీ మేం వెళ్ళేసరికి ఆలస్యం కావడంతో వారు వెళ్ళిపోయారు. దాంతో మేము వారిని చూడలేకపోయాము. అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ సినిమా ప్రతినిధులంటూ మమ్మల్ని అందరికీ పరిచయం చేశారు. నేను నిద్ర ఆపుకోలేకపోయాను. మేల్కొని సినిమా చూడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా సార్లు తూలు వచ్చింది.

మరుసటి రోజు మేము నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌ని సందర్శించాము. అక్కడ – టెలివిజన్ ఎలా పనిచేస్తుందో, జూమ్ లెన్స్ ఎలా ఉపయోగించబడుతుందో, ఒక ఇమేజ్‌ని మరొక ఇమేజ్‌తో కలపడం, పిక్చర్ ఛానెల్‌లు ఎలా మిళితం చేయబడతాయో, ఇంకా ఒక ఛానెల్‌పై మరొకటి ఎలా సూపర్ ఇంపోజ్ చేయబడిందో చూశాము. ఇదంతా మాకు అద్భుతంగా తోచింది. తర్వాత అమెరికా రేడియో కార్పొరేషన్ మాకు భోజన సమయంలో కానుక ఇచ్చింది. మేం హోటల్‌కి వెళ్లినప్పుడు, పోర్టబుల్ రేడియో సెట్‌లు మాకు బహుమతిగా పంపారు. ఇంత సామాను వెంట ఎందుకు తీసుకువెళ్లడమని భావించాం, వాటిని మాకంటే చాలా ముందుగా హాలీవుడ్‌కు పంపాము. దురదృష్టవశాత్తు ఆ పాకెట్ నీటిలో పడిపోయి, నా రేడియోతో సహా చాలా రేడియోలు చెడిపోయాయి.

అక్కడి నుంచి న్యూయార్క్‌కి చాలా దూరంలో ఉన్న గ్రీన్‌విచ్‌ గ్రామానికి వెళ్లాం. జాన్ మెక్‌కార్తీ బస చేసిన ప్రదేశం ఇది. అతను అమెరికాలో పెద్ద రాజకీయవేత్త, అమెరికా మోషన్ పిక్చర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కూడా. అతను, ఇంకా ఈ సంస్థ ప్రెసిడెంట్ ఎరిక్ జాన్స్టన్ ఇద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కాదు, అయినప్పటికీ వారి స్థాయి, వారి వల్ల చలనచిత్ర పరిశ్రమకు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ పదవులను పొందారు. జాన్ మెక్‌కార్తీ, అతని భార్య మాకు విందు ఇచ్చారు. మేము వెస్ట్ పోర్ట్‌కి బయలుదేరాము. అక్కడ బ్రిటీష్ నటి లిల్లీ నడిపే ఒక ప్రసిద్ధ నాటక కంపెనీ ఉంది. ఆమె హాస్య స్కిట్‌లకు ప్రసిద్ది చెందింది. ఆ స్కిట్‌లలో కొన్నింటిని మాకు చూపించారు. ఇంటి పనివారిపై స్కిట్ ప్రదర్శించారు. మేమంతా తెగ నవ్వుకున్నాం.

మరుసటి రోజు ఉదయం 10 గంటలకు రైల్లో వాషింగ్టన్‌కి బయలుదేరాము. అమెరికాలో మొదటిసారి రైల్లో ప్రయాణించాము. రైలు మొత్తం ఎయిర్ కండిషన్ చేయబడింది, అన్ని బోగీలకు ఒకే కారిడార్ ఉంది, దాంతో ఒక చివర నుండి మరొక వైపుకు ప్రయాణించవచ్చు. రైల్లో రెండు తరగతులు మాత్రమే ఉన్నాయి. మొదటి తరగతి ప్రయాణికులు బెర్త్‌లపై పడుకోగా, రెండవ తరగతి ప్రయాణికులు తమ సీట్‌లలో మాత్రమే నిద్రించవచ్చు. అన్ని సమయాలలో డైనింగ్ కారు అందుబాటులో ఉంది, అక్కడ కూర్చుని భోజనాన్ని ఆస్వాదించవచ్చు. రైల్లో ఒక అద్దాల క్యాబిన్ ఉంది, దాంట్లో కూర్చుంటే అన్ని సుందరమైన ప్రదేశాల గుండా రైలు వేగంగా వెళుతున్నట్లు గమనించవచ్చు. రైలు చాలా వేగంగా వెళ్తోంది, 100 మైళ్ళు ప్రయాణించిన తర్వాత మాత్రమే ఆగుతుంది. 2.30 తర్వాత మేము వాషింగ్టన్ స్టేషన్‌కి చేరుకున్నాము. వాషింగ్టన్‌లో మోషన్ పిక్చర్ అసోసియేషన్ సభ్యులు, ఇంకా భారత రాయబారి మాకు స్వాగతం పలికారు. మేము మేఫ్లవర్ హోటల్‌లో బస చేశాము. సాయంత్రం 5 గంటలకు మాకు బ్లెయిర్ హౌస్‌లో అమెరికన్ ఫారిన్ ఆఫీస్ బ్రాంచ్ స్టేట్ డిపార్ట్‌మెంట్ వారు రిసెప్షన్ ఇచ్చారు. అమెరికా వైట్‌హౌస్‌ని పునర్నిర్మిస్తున్నప్పుడు, ఈ బ్లెయిర్ హౌస్ అమెరికన్ ప్రభుత్వానికి అదే ప్రయోజనాన్ని అందించిందని మాకు చెప్పారు. ఇక్కడ మేము ప్రముఖ నటి మైర్నా లాయ్‌ను కలిశాము. ఆమె భర్త హౌలాండ్ హెచ్. సార్జెంట్ అక్కడ US అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ అఫైర్స్‌గా పనిచేశారు. సాయంత్రం ఎరిక్ జాన్స్టన్ ట్రీట్ ఇచ్చారు మరియు మేము హిందీ చిత్రం ‘ఆన్’ ప్రత్యేక ప్రదర్శనను చూశాము.

మరుసటి రోజు ఉదయం మేం సైట్ సీయింగ్‍కి వెళ్ళాం. కోలిన్ వుడ్ ఇన్‌లో భోజనం చేసాము. రాత్రి భోజనం గోర్హామ్ హోటల్‌లోని టెర్రస్‌లో తిన్నాము. భోజనం చేస్తూ అక్కడ బ్యాలే చూశాము. మరుసటి రోజు మధ్యాహ్నం మాకు ఆర్మీ – నేవీ కంట్రీ క్లబ్‌లో ఎరిక్ జాన్స్టన్, అతని భార్య లంచ్ ట్రీట్ ఇచ్చారు. ఎరిక్ జాన్‌స్టన్ మమ్మల్ని తమ దేశానికి ఎందుకు ఆహ్వానించారనే దానిపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇది అమెరికన్ మరియు భారతీయ చలనచిత్ర పరిశ్రమలలో అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవడం మరియు వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరచడం. అప్పటి వరకు మమ్మల్ని దేనికి ఆహ్వానించారో మాకు తెలియదు. ఆహ్వానం అందినందుకు మేము సంతోషించాం. అక్కడి నుంచి పాల్ మెల్లన్ – నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌కి వెళ్లి, జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి వెళ్లాం. అక్కడ మేము ఫోటో సెషన్ చేసాము. నేను విద్యార్థుల మధ్య కూర్చున్నాను, మరుసటి రోజు వాషింగ్టన్ టైమ్స్ హెరాల్డ్‌లో ఆ ఫోటో సెంటర్ పేజీగా వచ్చింది, అంటే 22 వ తేదీన. ఆ రాత్రి మాకు భారత ప్రభుత్వ రాయబారి విందు ఇచ్చారు. మరుసటి రోజు చాలా ప్రదేశాలు చూశాం. మేము వైట్‌హౌస్‌ని సందర్శించి అధ్యక్షుడు ట్రూమాన్‌ను కలిశాము. భారీ మీడియా కవరేజీ మధ్య పచ్చికలో, అక్కడ టెలివిజన్ న్యూస్ రీల్స్‌తో పాటు ఫ్యాష్ బల్బులు మరియు కెమెరాలు క్లిక్ చేయబడ్డాయి. ట్రూమాన్ మా వెనుకే వచ్చి ప్రసంగం చేశాడు. ఒక ఫ్లాష్ బల్బు పేలింది. “ఫోటోగ్రాఫర్లలో ఎవరో కమ్యూనిస్ట్ ఉన్నట్టున్నారు” అని ట్రూమాన్ చమత్కరించారు. అందరూ నవ్వుకున్నారు. నర్గీస్ ట్రూమాన్‌కు మహాత్మా గాంధీ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. అక్కడి నుంచి జాతీయ విమానాశ్రయానికి వెళ్లి విమానంలో నాక్స్‌విల్లే చేరుకున్నాం. ఈ ఎయిర్‌పోర్ట్‌లో షోరీల్‌లా కదిలే టేపుల్లో వార్తలు ప్రసారం కావడం చూశాం. వార్తలను చూస్తూనే నేను ముందుకు నడిచాను.

మేము 2.30కి నాక్స్‌విల్లే చేరుకున్నాము. అమెరికా కంటే భారతదేశంలా కనిపించే ఈ ప్రదేశం నాకు బాగా నచ్చింది. పరిసరాలు చాలా చక్కగా, శుభ్రంగా ఉన్నాయి. మరుసటి రోజు 23వ తేదీన, మేము టేనస్సీ వ్యాలీకి ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ బస్సులో వెళ్ళాము. ఒకప్పుడు పేదదైన ఈ ప్రాంతాన్ని అమెరికా ప్రభుత్వం చాలా సంపన్నంగా మార్చింది. అక్కడ 20కి పైగా ఆనకట్టలు నిర్మించారు. అందులో 9 భారీ ఆనకట్టలు కాగా మిగిలినవి చిన్నవి. మేము నోరిస్ డ్యామ్ దగ్గర ఆగి భోజనం చేసాము. ఇక్కడ నుండి మేము ఫోంటానా ఆనకట్టను సందర్శించాము. మన దేశం కూడా ఇంత పెద్ద ఆనకట్టలు నిర్మించి మన ప్రజలను సుభిక్షంగా మార్చాలని నేను ఆకాంక్షించాను. సాయంత్రం మేము రెండు పాటలు పాడే పార్టీ చేసుకున్నాము. ఒకటి వందేమాతరం మరియు మరొకటి హిందీ పాట. డైవ్-ఇన్-థియేటర్‌ సందర్శించడానికి మమ్మల్ని అనుమతించారు. ఆ తర్వాత రాత్రి మేము చికాగోకు చేరాము, అక్కడ మాకు సంఘంలోని ముఖ్యమైన వ్యక్తులు స్వాగతం పలికారు. మేము హోటల్ స్టీవెన్స్‌లో బస చేసి, రాత్రి స్టేజ్ షో చూశాము. మరుసటి రోజు, మేము ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చిత్రాలను చూడటానికి బయలుదేరాము. మేము బటర్‌ఫ్లై షార్ట్ ఫిల్మ్ మెటామార్ఫోసిస్‌ని చూశాము. మేము మైమరచిపోయాము. మధ్యాహ్నం చికాగో మేయర్‌ని కలిశాము. మరుసటి రోజు 26వ తేదీ ఉదయం మేము ది కరోనెట్ చిత్రాలను చూశాము. తరువాత మార్షల్ ఫీల్డ్ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ని సందర్శించాము. ఈ బహుళ అంతస్తుల మాల్ మన అవసరాలన్నింటినీ తీర్చే వస్తువులను కలిగి ఉంది. సాయంత్రం మేము టెలివియన్ రేడియో ప్రసారంలో పాల్గొన్నాము. నేను ‘ఓ పంథా’ పాట పాడాను. మరుసటి రోజు 28 న చికాగో నుండి డెన్వర్ వరకు రైలులో వెళ్ళాము. మేము కొలరాడో స్ప్రింగ్స్‌ను సందర్శించాము. ఆ రోజు, తరువాతి రోజు మాకు పూర్తి విశ్రాంతి. అక్కడ విల్ రోజర్స్ విగ్రహం ఉంది. అతను ప్రసిద్ధ అమెరికన్ వాడెవిల్లే ప్రదర్శనకారుడు, నటుడు. అతని కీర్తి ఘనమైనది. సామాజిక సమస్యలపై అతను వ్యాఖ్యానించిన తీరు గొప్పది, ప్రజలు అతన్ని అమెరికా అధ్యక్షుడిగా చేయాలని కోరుకున్నారు, కానీ అతను నిరాకరించాడు.

సెప్టెంబర్ 30న, మేము కొలరాడో స్ప్రింగ్స్ నుండి బయలుదేరి, అక్టోబర్ 1వ తేదీన, ఉదయం 8.30 గంటలకి సాల్ట్ లేక్ నగరానికి చేరుకున్నాం. దారిలో అద్భుతమైన రాయల్ జార్జ్ సస్పెన్షన్ బ్రిడ్జి కనిపించింది. సాల్ట్ లేట్ సిటీ, ఉటా రాష్ట్ర రాజధాని. ఇది 100 సంవత్సరాల క్రితం మోర్మెన్స్ చేత నిర్మించబడింది. వాటికి అనుసంధానంగా దేవాలయాలు మరియు స్థూపాలు ఉండేవి. ఈ నగరంలో ప్రత్యేకంగా తయారు చేయబడిన టేబర్నాకిల్ ఆర్గాన్ మా సందర్శన యొక్క ముఖ్యాంశాలలో ఒకటి. ఈ ఆర్గాన్ గొట్టాలు పరిమాణంలో పెద్దవి. నిపుణులు మాత్రమే ఈ ఆర్గాన్‌ని వాయించగలరు. ఇక్కడ నేను అందాల రాణి మిస్ ఉటాను కలిశాను. ఈ నగరంలో మహిళలు చాలా అందంగా ఉన్నారు, వారిలో ఎక్కువమంది మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యారు. మేము సాల్ట్ సిటీలో ఉన్నప్పుడు, మాతో పాటు హ్యారీ స్టోన్ మోషన్ పిక్చర్ అసోసియేషన్ కార్యదర్శి కూడా ఉన్నారు. అతను నా దగ్గరకు వచ్చి తనకు హాలీవుడ్ నుండి టెలిగ్రామ్ వచ్చిందని, అక్కడ మన జాతీయ గీతం పాడమని నన్ను అభ్యర్థిస్తున్నారని చెప్పాడు. నేను వెంటనే సరేనన్నాను. మరుసటి రోజు మేము అక్కడి దర్శనీయ స్థలాలు చూశాము. బిగ్ కాటన్ వుడ్ కాన్యన్ గుండా తడుస్తూ వెళ్ళి బ్రైటన్‌ని సందర్శించాము.  సన్‌వాలీని చూశాము. స్కై లిఫ్ట్‌లను ఉపయోగించి మేము అరగంటలో 4k అడుగుల ఎత్తుకు చేరుకున్నాము. ఈ లిఫ్టులు కుర్చీల లాంటివి. ఇది మాకు ఉత్కంఠభరితమైన దృశ్యం.

అక్టోబర్ 3న మేము లాస్ ఏంజెల్స్ చేరుకున్నాము. హాలీవుడ్‌లోని యాక్టర్స్ గిల్డ్, డైరెక్టర్స్ గిల్డ్, రైటర్స్ గిల్డ్, మోషన్ పిక్చర్స్ అసోషియేషన్ గిల్డ్ మొదలైన వివిధ సంఘాల ప్రతినిధులు మమ్మల్ని స్వాగతించారు. దర్శకుడు ఫ్రాంక్ కాప్రా “హలో మిస్ ఇండియా” అంటూ నన్ను పలకరించారు. నేను మిస్ ఇండియాని కాదని తెలియదేమో. అందరం కలిసి లంచ్ చేశాం. ఆ తర్వాత మీడియా సెషన్. ఇదంతా మేము బస చేసిన ది టౌన్ హౌస్ హోటల్‌లో జరిగింది. మరుసటి రోజు ఫ్రాంక్ కాప్రా లాస్ ఏంజిల్స్ హోటల్‌లో మాకు లంచ్ ట్రీట్ ఇచ్చాడు. అనుకోకుండా ఎలిజబెత్ టేలర్, ఆమె భర్త మైఖేల్ వైల్డింగ్ వచ్చారు. వాళ్లతో మాకు పరిచయం ఏర్పడింది. ఆమెను చూసి మేము చాలా థ్రిల్ అయ్యాము. మా హాలీవుడ్ పర్యటన ఈ రోజుతో ముగిసింది.

4వ తేదీన శాంటా బార్బరా బీచ్‌కి వెళ్లాం. మేము ET ఫోలెట్ రాంచ్‌లో ఉన్నాము. దీని తరువాత మేము ఫ్రాన్సిస్కాన్ చర్చి చూశాము. తరువాత లాస్ ఏంజిల్స్‌కి తిరిగి వెళ్ళాము. మరుసటి రోజు ఆదివారం, మేము బస చేసిన ప్రాంతానికి 20 మైళ్ల దూరంలో ఉన్న బెవర్లీ హిల్స్, హాలీవుడ్‌కి వెళ్లాము. సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య, మెర్విన్ లెరోయ్, అతని భార్య మాకు టీ పార్టీ ఇచ్చారు. అతను మెట్రో-గోల్డ్‌విన్-మేయర్‌కి మేనేజర్ మరియు నిర్మాతగా ఉండటంతో, చాలా మంది హాలీవుడ్ పెద్దలు ఆ పార్టీకి వచ్చారు, నేను రెండు తెలుగు పాటలు పాడాను, బాలాంత్రపు రజనీకాంతరావు రచించి, స్వరపరచిన ‘చిన్నదోయి నా హృదయ నావ’, ఇంకా శ్రీశ్రీ రాసిన ‘ఓ మహాత్మా’. నేను పాడటం విన్న నటి గీర్ గార్సన్ మైమరచిపోయినట్లుగా నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

మరుసటి రోజు మేము హాలీవుడ్ స్టూడియోని సందర్శించాము. ఇక్కడ ఎవరినైనా పూలమాలలతో పలకరించే సంప్రదాయ కార్యక్రమం లేదు. కానీ వాళ్ళు మా కోసం మాత్రమే హవాయి నుండి దండలు కొన్నారు, ఇద్దరు మహిళలతో మా అందరికీ పూలమాలలు వేయించారు. వారి ఈ చర్యకి మేము ఎంతగానో సంతోషించాం. ఇతరుల్లాగే నేను స్టూడియో మొత్తం చూడాలనుకోలేదు. వెనక్కి తిరిగి వారి సంగీతం విభాగానికి వెళ్ళాను. అక్కడ నేను ఒక పియానిస్ట్‌తో కలిసి జాతీయ గీతం పాడటం ప్రాక్టీస్ చేసాను. ఆ సాయంత్రం నేను దీన్ని రికార్డ్ చేయవలసి ఉంది. కానీ నేను క్యారీ గ్రాంట్ నటించిన డ్రీమ్ వైఫ్ షూటింగ్ చూశాను. సాయంత్రం, మోషన్ పిక్చర్ అసోసియేషన్ మాకు బెవర్లీ హిల్స్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఆ సాయంత్రం దాదాపు 600 మంది హాలీవుడ్ ప్రముఖులు వచ్చారు. నేను టైరోన్ పవర్‌ని చూసి విస్తుపోయాను. అప్పుడు వారు మమ్మల్ని మొత్తం 600 మందికి పరిచయం చేయడం ప్రారంభించారు. వారు మా పేర్లను తెలుసుకున్నారు, మేము వారి గురించి తెలుసుకున్నాము. దీంతో పాటు వారితో కరచాలనం కూడా చేయాల్సి వచ్చింది. ప్రతి పరిచయం వద్ద – పరిచయం చేయబడుతున్న వ్యక్తిపై స్పాట్‌లైట్ ప్రసరించారు. పరిచయాలు పూర్తయ్యాక అసలు పార్టీ మొదలైంది. కేథరిన్ గ్రేసన్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత నేను మన జాతీయ గీతం పాడాను. మేము పైకి వెళ్లి వేదిక నలంకరించాం. మా ప్రతినిధి బృందం నాయకుడు శ్రీ చందూలాల్ షా మాట్లాడారు. ఆ రోజు అక్కడే ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ కూడా ప్రసంగించారు.

ది గ్రేట్ సెసిల్ బి. డెమిల్‌కి నన్ను ప్రత్యేకంగా పరిచయం చేశారు. టెన్ కమాండ్‌మెంట్స్ చేస్తున్నానని, ఆ సినిమాలో ఓ పాత్ర ఇస్తానని చెప్పారు. అయితే దీనిపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని కూడా చెప్పారు. తన ఆటోగ్రాఫ్ ఇచ్చి నన్ను ఆశీర్వదించారు. మరుసటి రోజు మేము 20th సెంచురీ ఫాక్స్ స్టూడియోకి వెళ్ళాము. అక్కడ స్టూడియో అధిపతి మాకు పార్టీ ఇచ్చారు. టైటానిక్, కాల్ మీ మేడమ్, ప్రెసిడెంట్స్ లేడీ వంటి చిత్రాల షూటింగ్‌లు చూశాం. మన హిందీ చిత్రం ‘ఆన్’ అకాడమీ ఆఫ్ మోషన్ ప్రిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ థియేటర్‌లో ప్రదర్శించబడింది. దాన్ని చూడ్డానికి మాలో కొందరం వెళ్ళాం.

తరువాత మేము యూనివర్సల్ స్టూడియోని సందర్శించాము. అక్కడ మేము ఆన్ షెరిడాన్‌ను కలిశాము. ఆమె మా నుదుటి మీద బిందీలను ఆసక్తిగా చూసింది. నేను ఆమెకు నా బొట్టుబిళ్ళని జ్ఞాపకంగా ఇచ్చాను. సాయంత్రం ఎవరి ఇంట్లోనో స్నాక్స్ ఏర్పాటు చేశారు. రాత్రి, రోమనోఫ్ హోటల్‌లో స్క్రీన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాకు డిన్నర్ పార్టీ ఇచ్చింది. పార్టీలో ఆర్థర్ ఫ్రీడ్ [ప్యారిస్‌లోని అమెరికన్ నిర్మాత] నా పక్కన కూర్చున్నాడు. అతను తన మనసులో వచ్చిన కథ గురించి గబగబా మాట్లాడసాగాడు, అందులో నటించమని నన్ను అడిగాడు! మరుసటి రోజు 9వ తారీఖున పారామౌంట్ స్టూడియోని సందర్శించి అక్కడే భోజనం చేసాము. మేము ఇక్కడికి రాకముందే స్టూడియోలో ఉన్నవారికి నా గురించి చాలా తెలుసు. దర్శకుడు ఎల్లిస్ దుంగన్ [MS సుబ్బులక్ష్మి గారి మీరా, ఇంకా అనేక ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించారు] పారామౌంట్‌లోని అధికారులకు ‘మిస్ మద్రాస్’ – స్టూడియో చూడటానికి వస్తున్నట్లు రాశారు. పారామౌంట్ నుండి మేము RKOకి, అక్కడి నుండి వాల్ట్ డిస్నీ స్టూడియోకి వెళ్ళాము. అక్కడ మాకు డోనాల్డ్ డక్ పరిచయం అయ్యాడు. డోనాల్డ్ డక్‌కి స్వరాన్నించింది క్లారెన్స్ నూష్. డొనాల్డ్ డక్ డైలాగ్స్ అతనే రాసేవాడు. అతను తన కొన్ని డైలాగ్‌లను కూడా వినేలా చేశాడు. అవి సరదాగా ఉన్నాయి.

సాయంత్రం మేము గాబ్రియేల్ పాస్కల్ ఇచ్చిన పార్టీకి వెళ్ళాము. అక్కడ ప్రముఖ రచయిత ఆల్డస్ హక్స్లీని కలిశాం. మిస్ యూనివర్స్ పోటీకి న్యాయనిర్ణేతగా కూడా ఉన్నాడాయన. మరొక న్యాయనిర్ణేత కాన్స్టాన్స్ మూర్. నన్ను తనకి మిస్ యూనివర్స్‌గా ఆమె నన్ను పరిచయం చేసింది. ఈ విషయం విన్న హక్స్లీ – నేను మిస్ ఇండియా కాంటెస్ట్‌లో గెలిచినట్లయితే, ఖచ్చితంగా మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకునేదాన్నని అన్నాడు. ఈ పార్టీలో మేము నటుడు రోనాల్డ్ కోల్మన్‌ను కలిశాము. వారంతా తమ స్థానాలను చేరుకోవడానికి ఎలా కష్టపడ్డారో చెబుతూ అతను పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్‌‍లు ఎంతో వేగంగా దూసుకువస్తున్నారనీ, అంతే వేగంగా తెరమరుగవుతున్నారని అన్నాడు. టార్జాన్ ఫిల్మ్స్ నిర్మాత సోల్ లెస్సర్‌ని కూడా కలిశాను. ఆయన కూడా ఓ కథ చెప్పి తన సినిమాలో నటిస్తావా అని అడిగాడు. వార్నర్ బ్రదర్స్ స్టూడియోని సందర్శించిన 10వ తేదీని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ మేము ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్‌ని కలుసుకున్నాము, ఆయన తన సినిమా కోసం ఉద్దేశించిన సెట్‌ను పర్యవేక్షిస్తున్నాడు. వార్నర్ బ్రదర్స్ నన్ను ప్రేమ్‌నాథ్‌ని చూసి మెచ్చుకున్నారు. మా ఇద్దరినీ వాళ్ళ సినిమాలో నటించమని అడిగారు.

ఆ రాత్రికి బ్లెయిర్స్ కంట్రీ క్లబ్‌లో డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా వారు డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఆ డిన్నర్‌కి ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ నా ఎస్కార్ట్. హోటల్ గది నుండి పార్టీకి, మళ్ళీ పార్టీ నుంచి నా గదికి, ఆయన నా ఎస్కార్ట్. నేను ఆయన కారులో పార్టీకి వెళ్ళాను, అక్కడ మేము ఒక బోగ్ టేబుల్ వద్ద కూర్చున్నాం, మా టేబుల్ వద్దకే ఆహారం తీసుకువచ్చారు. వెంటనే మా చుట్టూ కొందరు మూగారు, వారు నన్ను ఏవేవో అర్ధంలేని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. “మనం ఏదో అవాంఛనీయమైన సాంగత్యాన్ని ఆకర్షించినట్లు అనిపిస్తోంది” అని హిచ్‌కాక్ నాతో చెప్పారు. నేను భారతీయ స్త్రీ కంటే పాశ్చాత్య స్త్రీగా కనిపిస్తానని హిచ్‌కాక్ నాకు చెప్పారు. మేము 12న హాలీవుడ్‌ని వదిలి వెళ్తున్నాము. మేము కోరుకున్నది చేయడానికి మాకు 11వ తేదీ మాత్రమే ఉంది. మేము రిపబ్లిక్, ఇంకా కొలంబియా స్టూడియోలను చూడలేకపోయాము. మేము రెండు బృందాలుగా విడిపోయాము. కొందరు కొలంబియాకు, మరికొందరు రిపబ్లిక్ స్టూడియోకు వెళ్లారు. కె సుబ్రహ్మణ్యం, నేను రిపబ్లిక్ స్టూడియోకి వెళ్ళాము.

మా కోసం సినిమా తీయాలనుకుంటున్నామని, అప్పటికప్పుడే ఒప్పందం కుదుర్చుకుంటామని అక్కడున్నవారు రెచ్చిపోయారు. 12వ తేదీకి మా హాలీవుడ్ సందర్శన ముగిసింది. మేము ఎక్కడికి వెళ్లినా హాలీవుడ్‌లో ఉన్న వారు మాకు ఘన స్వాగతం పలికారు. చాలా మంది భారతీయులు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. మా విమానం హవాయిలోని హోనోలులులో దిగే సమయానికి అర్ధరాత్రి అయింది. మర్నాడు మేము షాపింగ్‌కి వెళ్ళాము, నేను ఒక చీర కొన్నాను. మళ్ళీ 16వ తేదీన బయల్దేరి అర్ధరాత్రి జపాన్‌లోని టోక్యో చేరుకున్నాము [నా గడియారం 5 గంటలు చూపిస్తోంది. ఇక్కడి నుండి వాచీలు వెనక్కు తిప్పుకోవలసి వచ్చింది]. మరునూచి హోటల్‌లో బస చేశాము. మరుసటి రోజు జపాన్‌లోని అతిపెద్ద స్టూడియో సోచికో చూడటానికి వెళ్ళాము. 18వ తేదీన మూర్తి అనే తెలుగు వ్యక్తి మాకు ఘనస్వాగతం పలికారు. జెమినీ స్టూడియోలోని తోటలన్నీ అతని సోదరుడు ఇంద్రసేన్ చూసుకుంటున్నాడని మాకు తర్వాత తెలిసింది. అతను, అతని మరొక సోదరుడు జపాన్ మహిళలను వివాహం చేసుకుని జపాన్‌లో స్థిరపడ్డారు. ఆ సొసైటీలో మూర్తి ముఖ్యమైన వ్యక్తి. అతను మమ్మల్ని ఇంపీరియల్ థియేటర్‌కి తీసుకెళ్లాడు, అక్కడ మేము కొన్ని స్టేజ్ షోలు చూశాము. అవి అమెరికన్ షోలకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ అన్ని భావోద్వేగాలు బాగా ప్రదర్శించబడ్డాయి. నేను అమెరికాలో చూసిన షో ల కంటే జపనీస్ షోలను ఎక్కువగా ఇష్టపడ్డాను. మరుసటి రోజు మేము శ్రీనివాసన్ అనే తమిళ వ్యక్తిని కలుసుకున్నాము, అతను మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించి, మాకు ప్రామాణికమైన దక్షిణ భారత భోజనంతో విందు చేశాడు. అది తిన్నాకా మాకు ప్రాణాలు లేచొచ్చాయి. టోక్యోలో మేము కొంతమంది గీషాలను కలిశాము. వారిలో ఒకరు నా బిందీ లాంటిది ఇవ్వగా, నేను ఆమెకు నా బిందీ ఇచ్చాను. టోక్యోలో కింగ్ ఆఫ్ మ్యాజిక్ అనే డ్రామా చూశాం. ఒక మాంత్రికుడు మరొక అందమైన యువకుడిని ప్రేమించే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి నటన అద్భుతంగా ఉంది. 21వ తేదీ మధ్యాహ్నం మేము టోక్యో విమానాశ్రయానికి బయలుదేరి హాంకాంగ్ చేరుకున్నాము, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హాంకాంగ్ చేరాం. ఇది చాలా అందమైన ప్రదేశం. నేను ఇక్కడ కొంత షాపింగ్ చేసాను. 23వ తేదీ సాయంత్రం 3 గంటలకు మేము హాంకాంగ్ నుండి బయలుదేరి 23వ తేదీ రాత్రి 8.30 గంటలకు కలకత్తా చేరుకున్నాము. అలా మా ప్రపంచ యాత్ర ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here