అలనాటి అపురూపాలు – 245

0
12

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

తబలా వాద్యకారుడు మారుతీరావు:

సినీ సంగీతంలో తబాలాకు ప్రసిద్ధులు మారుతీరావు.

ఆయన తన కెరీర్‍ని ఓ తబలా వాద్యకారుడిగా ప్రారంభించారు. శ్రీ భానుదాస్ మంకామే, శ్రీ భైరవ ప్రసాద్, శ్రీ సుందర్ ప్రసాద్, ఉస్తాద్ గమేఖాన్ సాహబ్‍లు ఆయన గురువులు.

మారుతీరావు దాదాపు అందరు సంగీత దర్శకులకు (ఆయనే వెల్లడించిన సమాచారం ప్రకారం, శంకర్ జైకిషన్‍కు మినహా) పనిచేశారు. మరాఠీ సినిమా పాటలు, నాన్-ఫిల్మీ పాటల్లో వినిపించే దాదాపు అన్ని తబలాలు ఆయన వాయించినవే. ఆయన మొదట దాదా బర్మన్ (ఎస్. డి. బర్మన్) కోసం వాయించారు. తర్వాత పంచమ్‌ (ఆర్. డి. బర్మన్)కి వాయించారు. వారిద్దరూ దాదా బర్మన్‌కు సహకరించిన సందర్భాలు ఉన్నాయి.

‘గైడ్’ సినిమాలోని ‘పియా తోసే నైనా లగే రే’ పాటలో వారి తబలా నైపుణ్యం తెలుస్తుంది. ఆ రోజుల్లో దాదా గారి జేఈటీ బంగ్లాలో రిహార్సల్స్ చేస్తున్నప్పుడు మారుతీరావు, పంచమ్ స్నేహితులుగా మారారు. పంచమ్, మారుతీరావు ఎంతో గొప్ప అవగాహన కలిగి ఉండేవారు, పంచమ్ గారి కంటి చూపు చాలు, ఆయనేం కోరుకుంటున్నారో అర్థం చేసుకోడానికి; మారుతీరావు వెంటనే అలా వాయించేవారు. పంచమ్ మొదటి చిత్రం ‘ఛోటే నవాబ్’ నుండి మారుతీరావు – ఆయనకు రిథమ్ అసిస్టెంట్‌గా, సన్నిహితుడుగా ఉన్నారు.

తర్వాతి రోజుల్లో పంచమ్ – ఇతర సంగీత దర్శకులందరిలో అత్యధిక అభిమానులను పొందారు. పంచమ్ కొత్త లయలను సృష్టించినందుకు, ఎందరో ఆయనకు అభిమానులుగా మారారు. ఇందులో సగం ఘనత మారుతీరావుకీ దక్కుతుంది. పంచమ్, మారుతీరావు లయలో ఎప్పుడూ కొత్తదనం, సృజనాత్మకత కోసం వెతుకుతూ ఉండేవారు. ఇది వాయించే శైలి కావచ్చు లేదా కొత్త వాయిద్యపు పరిచయం కావచ్చు.

మారుతీరావు ఒకసారి తుంబ గురించి చెప్పారు. పంచమ్, ఆయన బృందం ఆఫ్రికాలో కొన్ని ప్రదర్శనలకు వెళ్ళారు. అక్కడ వారు తుంబా అనే ఈ ఆఫ్రికన్ వాయిద్యాన్ని చూశారు. ఆ వాద్యకారుడు ఎలా వాయిస్తున్నాడో, అతని శైలి, అతని విసురు, అన్నీ గమనించమని పంచమ్ మారుతీరావుకు చెప్పారు. కొంతసేపటికి మారుతీరావు లేచి నిలబడి తుంబా వాయించడం ప్రారంభించారు. ఆ కళాకారుడు, మిగతా ప్రేక్షకులందరితో పాటు మరో గంట వరకు మారుతీరావు తుంబాను వాయించడం చూస్తూనే ఉన్నాడు.

ఇది పంచమ్‌కి ప్రేరణ కల్పించించింది. దాంతో ఆయన తుంబాని భారతదేశానికి తెచ్చారు. ‘మనోరంజన్’ సినిమాలోని ‘ఆయా హూఁ మై తుజ్కో లే జావూంగా’ పాటలో వాయించిన తుంబ – మారుతీరావు రిథమిక్ ప్లేకి ఒక అద్భుతమైన ఉదాహరణ.  రికార్డింగ్ పూర్తవగానే, చిత్ర దర్శకుడు షమ్మీకపూర్ వచ్చి మారుతీరావును కౌగిలించుకున్నారు.

 

పంచమ్ మరణం తర్వాత మారుతీరావు రికార్డింగ్ కోసం తబలా వాయించకూడదని నిర్ణయించుకున్నారు. అయితే ఆ తర్వాత ఒక నెలలోనే భార్య మరణించడంతో ఇకపై తబలాను తాకకూడదని నిర్ణయించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here