అలనాటి అపురూపాలు-31

1
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటన నుంచి దర్శకత్వానికి – సినీరంగంలో తమ తమ విభాగాల్లోని తొలి మహిళలు:

ఓ చిన్న మాట, అనుకోని ఓ ప్రతిస్పందన కొన్నిసార్లు మనుషుల్ని అద్భుతాలు సాధించే దిశగా ప్రేరేపిస్తాయి. సినీ నటులు, కళాకారులు ఇందుకు మినహాయింపు కాదు. అప్పటిదాక ఒక రంగంలో ప్రఖ్యాతి గాంచిన వారు, అనుకోకుండా మరో రంగంలోకో లేదా అదే రంగంలోని మరో విభాగంలోకో అడుగుపెట్టి అక్కడా రాణించి ప్రశంసలు పొందడం కద్దు. అలాంటి కళాకారుల గురించి తెలుసుకుందాం.

పి. భానుమతి:

భానుమతిగారు తన భర్తతో జరిపిన ఓ మామూలు సంభాషణ – దాదాపు ఆరు దశాబ్దాలు గడిచినా నేటికీ ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు స్థాపించడానికి కారణమైంది. భరణి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘ప్రేమ’ అనే సినిమా విడుదల తర్వాత – రామకృష్ణ భానుమతికి ఒక జానపద కథ వినిపించారు. అది ఆవిడకి బాగా నచ్చింది. భానుమతి ఆశ్చర్యపోయేలా, ఆ సినిమాకి ఆవిడని దర్శకత్వం వహించమని, తాను పర్యవేక్షిస్తానని అన్నారట రామకృష్ణ. కానీ బయటి బ్యానర్‌పై మరో సినిమాకి (బ్రతుకుతెరువు) ఆయన దర్శకత్వం వహిస్తుండడంతో, ఆయన అనుకున్నట్టుగా పర్యవేక్షణ కుదరలేదు. దాంతో భానుమతి దీనిని ఒక సవాలుగా తీసుకుని ప్లాట్‍ని కథగా మలిచి, తను ద్విపాత్రాభినయం చేస్తూ, ఎన్.టి.రామారావును కథానాయకుడిగా ఎంచుకున్నారు. సినిమాని తెలుగు, తమిళ భాషాలలో రూపొందించాలనుకుని నిర్ణయించారు. తరువాత హిందీ వెర్షన్ కూడా తీయాలని అనుకున్నారు. నటీనటులలో ఒకటి రెండు మార్పులతో (రేలంగి స్థానంలో సుప్రసిద్ధ హిందీ హాస్యనటుడు ఆఘా) హిందీ సినిమా తీసారు. హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన అడ్వాన్స్ తోనే రామకృష్ణ భరణి స్టూడియోస్ నిర్మాణం పూర్తి చేశారు. ఈ విధంగా ‘చండీరాణి’తో భానుమతి ఒకేసారి మూడు భాషలలో నిర్మించిన ఓ సినిమాకి దర్శకత్వం వహించిన తొలి మహిళగా, అందులో ద్విపాత్రిభినయం చేసిన నటిగా, కథకురాలిగా, సంగీత దర్శకత్వం పర్యవేక్షకురాలిగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డు నేటికీ బద్దలవ్వలేదు.

దుర్గాబాయి కామత్:

ఎన్నో ఘనతలు సాధించినా దుర్గాబాయి కామత్ పేరు ఎక్కువ మందికి తెలియదు. స్త్రీలు సినిమాలలో నటించడంపై ఆంక్షలున్న ఆ రోజుల్లో ఈ మరాఠీ నటి దుర్గాబాయి సినీరంగంపై ఆసక్తి పెంచుకున్నారు.

తన కుమార్తె కమలాబాయి కామత్‌తో కలిసి నటించి రికార్డు సృష్టించారామె. దాదాసాహెబ్ ఫాల్కే తీసిన రెండవ సినిమా ‘మోహినీ భస్మాసుర’ (1913)లో తాను కథానాయిక పార్వతీదేవి పాత్ర పోషించి, తన కుమార్తెను ‘మోహిని’ పాత్ర ధరింపజేశారు. భారతీయ సినిమాలో నటించిన తొలి మహిళగా, తొలి బాల నటిగా వీరిద్దరూ చరిత్రకెక్కారు.

ఫాతిమా బేగం:

భారతీయ సినిమాలలో తొలి దర్శకురాలైన ఫాతిమా బేగం భారతదేశంలో ఓ ముస్లిం కుటుంబంలో 1892లో జన్మించారు. ఆమెకు నటనలోనూ, స్క్రీన్-రైటింగ్ లోనూ, నిర్మాణంలోనూ ప్రవేశం ఉంది. ఆమె నాటక రంగంలో శిక్షణ పొందారు. తొలుత ఉర్దూ నాటకాలలో నటించి, ఆపై 1922లో సినిమాలలో ప్రవేశించారు. 1922లో ‘వీర్ అభిమన్యు’ అనే మూకీ సినిమా ద్వారా దర్శకురాలిగా తన ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఆవిడ ‘బుల్‌బుల్-ఏ-పరిస్తాన్’ (1926), ‘గాడెస్ ఆఫ్ లవ్’ (1927), ‘హీర్ రాంఝా’ (1928),  ‘చంద్రావళి’ (1928), ‘ శకుంతల’ (1928), ‘మిలన్ దీనార్’ (1929), ‘కనకతార’ (1929), ఇంకా ‘గాడెస్ ఆఫ్ లక్’ (1929) అనే సినిమాలకు దర్శకత్వం వహించారు.

‘బుల్‌బుల్-ఏ-పరిస్తాన్’ ఆమె దర్శకత్వం వహించిన ప్రసిద్ధ చిత్రం. పరిస్తాన్ (అద్భుతలోకం)లో చిత్రీకరించిన ఈ సినిమాని భారీ బడ్జెట్‍తో, టెక్నాలజీ ఉపయోగించి స్పెషల్ ఎఫెక్ట్‌తో తీశారు.

ఫాతిమా – అర్దెషిర్ ఇరానీ, నానూభాయ్ దేశాయ్ వంటి వారితో కలిసి పని చేశారు. ఆ తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ ‘ఫాతిమా ఫిల్మ్స్’ స్థాపించారు. తరువాతి కాలంలో దాని పేరు విక్టోరియా ఫాతిమా ఫిల్మ్స్ గా మారింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ ఆమె.

ఫాతిమా సినీరంగంలో ప్రవేశించినప్పుడు, ఆ రంగం అప్పటికి మగవారికే పరిమితమైంది. మహిళా పాత్రలు కూడా పురుషులే పోషించేవారు. పురుషాధిక్యత గల రంగంలోకి ప్రవేశించి, రాణించి నిలదొక్కుకోవాలనే ఆమె పట్టుదల ఆమెను పథగామిగా నిలిపింది.

ఒక నటిగా ఆమె వీర్ అభిమన్యు (1922), సీతా సర్దాబా (1924), పృథ్వీ వల్లభ్ (1924), కాలనాగ్ (1924), గులే బకావళి (1924), ముంబై ని మోహిని (1925) వంటి చిత్రాలలో నటించారు. ‘బుల్‌బుల్-ఏ-పరిస్తాన్’ (1926) తో సహా పలు సినిమాలకు స్క్రిప్టు అందించారు. కొన్ని సినిమాలలో ఆమె కుమార్తెలు సుల్తానా, షెహజాదీలు నటించారు. తన చిత్రాలలో ఫాంటసీతో పాటు స్పెషల్ ఎఫెక్ట్‌లు ప్రదర్శించేందుకు ట్రిక్ ఫొటోగ్రఫీని ఉపయోగించారు.

సచీన్ రాజ సంస్థానపు చివరి పాలకుడైన మూడవ నవాబ్ సిది ఇబ్రహీమ్ ముహమ్మద్ యాకుత్ ఖాన్‌ని ఫాతిమా వివాహం చేసుకున్నారని పుకార్లు వినబడ్డాయి. కానీ అందుకు ఆధారాలు లేవు. నవాబ్ ఫాతిమాని గాని, ఆవిడ కుమార్తెలను గాను గుర్తించలేదు. వారి మధ్య సంబంధాలను సూచించే వివాదాస్పద ఫొటోలు ఏవీ నేటికీ లేవు.

16 ఏళ్ళ పాటు సినిమాల్లో కొనసాగిన ఫాతిమా చివరి సినిమా ‘దునియా క్యా కహేగీ’. ఈ సినిమా తర్వాత ఆమె స్వచ్ఛందంగా విరమించుకున్నారు. ఆమె కుమార్తెలు జుబేదా, సుల్తానా, షెహజాదీ తమ తల్లి యొక్క ఘనమైన వారసత్వాన్ని కొనసాగించి మూకీ సినిమాల్లో నటించారు. జుబేదా మరికొంత పురోగమించి, భారతదేశపు తొలి టాకీ సినిమా ఆలమ్ ఆరా (1931)లో నటించిన తొలి భారతీయ మహిళ అయ్యారు.

సినీ రంగంలో సాధించిన ఎన్నో ఘనతలను విడిచి, 91 ఏళ్ళ ముదిమిలో 1983లో ఫాతిమా మృతిచెందారు.


‘కలసి వుంటే కలదు సుఖం’ చిత్రం శతోదినోత్సవ వేడుక:

‘కలసి వుంటే కలదు సుఖం’ చిత్రం శతోదినోత్సవ వేడుక విజయవాడలోని అలంకార్ థియేటర్‌లో 15, డిసెంబరు 1961 నాడు జరిగింది.

దర్శకనిర్మాత ఎల్. వి. ప్రసాద్ సభను నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే అభిమానులు రావడంతో జనాల సంఖ్య భారీగా పెరిగింది. నవయుగ నిర్మాతలు కాట్రగడ్డ శ్రీనివాస రావు, నరసయ్యలు మొత్తం యూనిట్‌కి జ్ఞాపికలు అందజేశారు. విజయవాడ మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ గారి భార్య శ్రీమతి అజిత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సినిమాలో నటించిన ఎన్.టి.ఆర్, సావిత్రి, ఎస్.వి.రంగారావు, సూర్యకాంతం, గిరిజ, రేలంగి సభకి హాజరయి, అభిమానులకి అభివాదం చేశారు. సారథి నిర్మాతలు వై రామకృష్ణ ప్రసాద్, సివిఆర్ ప్రసాద్‌, దర్శకులు తాపీ చాణక్య కూడా హాజరై సభకు నిండుదనం తెచ్చారు. ఎన్.టి. రామారావు మాట్లాడుతూ, 13 ఏళ్ళ క్రితం సారథి స్టూడియోస్ నిర్మాతలు తనని సినీ పరిశ్రమకి పరిచయం చేయవలసి ఉందనీ, కానీ ఆ అవకాశం కోల్పోయామనీ (ఎన్.టి.ఆర్ జీవితచరిత్ర వ్రాసినవారికి ఈ విషయం తెలుసో తెలియదో) తెలిపారు. చాలా కాలం తర్వాత ఈ బ్యానర్‌లో నటించగలిగానని చెప్పారు.

రేలంగి హాస్య ధోరణిలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సారథి స్టూడియోస్ నిర్మించడం విశేషమని పేర్కొన్నారు. వారు తీసే అన్ని సినిమాల్లోనూ నటించే అవకాశం తనకు లభిస్తుందని ఆశించారు. ఎల్.వి. ప్రసాద్ గారు తీసిన ‘సంసారం’ చిత్రంలోని పాత్ర తన కెరీర్‌కి ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. ఆ తర్వాత నుంచి తాను దాదాపుగా అన్ని తెలుగు సినిమాలలోనూ కనబడుతున్నానని రేలంగి చెప్పారు. అది తనకెంతో ఉత్సాహాన్నిస్తోందని అన్నారు. అన్ని సినిమాలలోనూ తన పాత్రలను – ఆడుకునే ఫుట్‌బాల్‌తో పోల్చి జనాలను నవ్వించారు రేలంగి. సావిత్రితో సహా మిగతా నటీనటులంతా క్లుప్తంగా ధన్యవాదాలు తెలియజేశారు. సభ ముగిసాకా, చిత్రం నటీనటులకీ, సాంకేతిక బృందానికి టీ పార్టీ ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here