అలనాటి అపురూపాలు-32

1
9

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బహుముఖ ప్రజ్ఞాశాలి ‘రాజశ్రీ’:

సినీరంగంలో రాజశ్రీకి వచ్చిన పేరు ప్రఖ్యాతులు మరే అనువాద రచయితకీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇతర భాషల చిత్రాలు ఎన్నో తెలుగులో విజయవంతమవడానికి తన మాటలు, పాటల ద్వారా రాజశ్రీ కారకులయ్యారు.

రాజశ్రీ (31 ఆగస్టు 1934 – 14 ఆగస్టు 1994) తెలుగు సినీ పరిశ్రమలో మాటల, పాటల రచయిత. సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు ఇందుకూరి రామకృష్ణంరాజు. ఆయన ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ దంపతులకు విజయనగరంలో 31 ఆగస్టు 1934 నాడు జన్మించారు. రాజశ్రీకి మూడేళ్ళ వయసులో ఆయన తండ్రి మరణించారు. పాపం, నారాయణమ్మ తన కొడుకుని అతి కష్టం మీద పోషించారు. పేదరికం కారణంగా, ప్రాథమిక విద్య కూడా కష్టమైంది. పాఠశాల చదువు పూర్తి చేశాక, విజయనగరం మహారాజా వారి స్కాలర్‌షిప్ పొంది, విజయనగరంలోని మహరాజా కాలేజ్ నుంచి బియస్సీ (ఫిజిక్స్) పూర్తి చేశారు. ఆ తరువాత ఆయన టైప్ రైటింగ్ నేర్చుకుని విశాఖపట్టణంలోని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫీసులో టైపిస్ట్-కమ్-పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారు.

చిన్నప్పటి నుంచి ఆయనకి పిల్లలకి కథలు చెప్పడమంటే ఇష్టం. యస్.యస్.యల్.సి. చదువుతున్నప్పటి నుంచీ కవిత్వం వ్రాయడం మొదలుపెట్టారు. మహారాజా కాలేజీలో వుండగా కాలేజ్ మేగజైన్‌కి కవితలు వ్రాశారు. తెలుగు లెక్చరర్ శ్రీ కొత్తపల్లి వీరభద్రరావు గారిచే తప్పులు దిద్దించుకునేవారు. టైపిస్ట్‌గా పని చేస్తూనే, 1953లో ఆయన ‘అభ్యుదయం’ అనే ఖండకావ్యం రచించారు. ఇందులో సగం పాటలు, సగం పద్యాలు ఉన్నాయి. పాటలలో శ్రీశ్రీకి, కవిత్వంలో కరుణశ్రీకి తాను ఏకలవ్య శిష్యుడనని ఆయన చెప్పుకునేవారు. ఆ తర్వాత ఆయన ‘ఆంధ్రశ్రీ’ అనే నాటకం రాయగా, దానిని విశాఖపట్టణంలో ప్రదర్శించారు. అది విశాఖలోని ఉన్నత వర్గాల ప్రజలను ఆకట్టుకుంది, ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా లభించిన ప్రోత్సాహంతో, ఆయన ‘వదిన’ అనే సాంఘిక నాటకం రచించారు. ఆ సమయంలో ఆయన (‘శ్రీ సింహాచల క్షేత్ర మహిమ’ సినిమా దర్శకుడు) బి.వి. ప్రసాద్ గారిని కలిశారు. ఇద్దరి స్నేహం బలపడింది. ప్రసాద్ గారి సలహాల మేరకు తన ప్రతిభకు పదును పెట్టారు రాజశ్రీ.  ‘వదిన’ నాటకంలో ప్రసాద్ హీరోగా నటించారు. 1954లో రాజశ్రీకి విశాఖ నుంచి శ్రీకాకుళానికి బదిలీ అయింది. ఆ సమయంలో ‘వదిన’ నాటకాన్ని పెద్దాపురంలో ప్రదర్శించగా, ఉత్తమ నాటకం అవార్డు గెలుచుకుంది. ‘వదిన’ నాటకాన్ని విజయనగరంలోని రాఘవ నాటక కళా పరిషద్ వారు ప్రదర్శించి, ఉత్తమ నాటకం అవార్డు పొందారు. అదే రోజున ప్రసాద్ ఉత్తమ నటుడిగా పురస్కారం పొందారు. ఆ విధంగా ప్రసాద్‍తో ఆయన స్నేహం దినదినాభివృద్ధి చెందింది. ఆ తరువాత రాజశ్రీ ‘బావ’ అనే నాటకం వ్రాశారు. దాన్ని అనకాపల్లిలో నాటక పోటీలలో ప్రదర్శించగా, స్వర్ణపతకం గెల్చుకుంది. శివ కోటి సత్యం బృందం వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీకాకుళంలో శ్రీ పూసపాటి నారాయణమూర్తిగారు రాజశ్రీని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ప్రోత్సహించారు. 1955లో రాజశ్రీ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రచయితగా మారారు. నాటకాలు, ఆ నాటకాలకి పాటలు రాశారు. ఆయన రచనలు ఆంధ్రపత్రిక, గుండు సూది, శోభ వంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. అదే ఏడాది ఆయన సరోజినిని పెళ్ళి చేసుకుని మకాం మద్రాసుకు మార్చారు.

తెలుగు సినీ రంగంలో ప్రవేశించి రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి గారిని కలవగా, ఆయన ‘ఆడ పెత్తనం’ సినిమాకి ఒక పాట రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమాకి సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకులు. ఎందుకో తెలియదు గానీ, ఆ దిగ్గజ సంగీత దర్శకులంటే రాజశ్రీకి భయం వేసింది. ఆ భయాన్ని ఆయన తన జీవితాంతం వదిలించుకోలేకపోయారు. నవ్వుతూనే అందరికీ చెప్పుకునేవారు. ఆయన వ్రాసిన పాట – ‘ఒకటి రెండు మూడు ప్రేమకు అర్థం తెలియాలంటే పెళ్ళి చేసుకుని చూడు’. వ్యక్తిగత కారణాల వల్ల దర్శకుడు అనిశెట్టి సగం సినిమా పూర్తయ్యాకా మానేస్తే, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సినిమాని పూర్తి చేశారు. ఆ సమయంలో రాజశ్రీ – శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ డైరక్టర్‍గా చేరారు. కడారు నాగభూషణం, ఆయన భార్య నటి కన్నాంబ ఈ బ్యానర్ యజమానులు. సి.యస్. రావు వారి అల్లుడు. ఆ సమయంలో కడారు నాగభూషణం ‘సతీ సావిత్రి’ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, రాజశ్రీ ఆయన వద్ద సహాయ దర్శకుడిగా ఉన్నారు. 1959లో వారి మరో సినిమా ‘వీరభద్రుడు’కి కూడా రాజశ్రీ సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1958లో సి.యస్. రావు దర్శకత్వం వహించిన ‘శ్రీకృష్ణ మాయ’ సినిమాకు కూడా రాజశ్రీ సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. అలాగే, 1959లో ఆయన తిరిగి పినిశెట్టితో కలిసి ‘నిత్య కళ్యాణం పచ్చ తోరణం’ సినిమాకి పనిచేశారు. తర్వాత ఆయన ప్రఖ్యాత దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ గారి వద్ద కథా విభాగంలో చేరి ‘ససురాల్’ (1961) సినిమాకి, మళ్ళీ చాలా కాలానికి ‘ఖిలోనా’ (1970) సినిమాకి పనిచేశారు. ఆయన ఆప్త మిత్రుడు బి.వి. ప్రసాద్ కూడా కథా విభాగంలో చేరారు. ఈ ఇద్దరు మిత్రులు కల్సి ‘నిత్య కళ్యాణం పచ్చ తోరణం’ సినిమా తమిళ వెర్షన్ ‘థిల్లయ్ పిల్లయ్’కి పనిచేశారు. 1960లో జి. భావన్నారాయణ ‘రమా సుందరి’ అనే సినిమాని నిర్మించారు. దానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించగా, ‘అవునమ్మా ఆడబతుకు ఇంతేనమ్మా, యుగ యుగాల మీ కథలు వ్యథలే నమ్మా’ అనే పాట రాసే అవకాశం రాజశ్రీకి లభించింది. ఈ సమయంలో ఆయన హెచ్.ఎం.వి. కొలంబియా కంపెనీ పైవేటు గీతాలు కూడా వ్రాశారు.

శ్రీమతి ఎస్. జానకి పాడిన ఈ ప్రైవేటు గీతాలలో – ‘వన్నె చిన్నెల చిలకుంది, నన్నొకసారి రమ్మంది’, ‘రాధ హృదయం రాగ నిలయం, మాధవుని దేవాలయం’ బాగా పేరు పొందాయి. అలాగే ఎస్. జానకీ, పి.బి.శ్రీనివాస్ పాడిన యుగళ గీతం ‘మన ఆశయే నిరాశై పోయెనా’, పి. సుశీల, పి.బి.శ్రీనివాస్ పాడిన యుగళ గీతం ‘మన కలలు విరిసె’ లకు చక్కని ప్రశంసలు దక్కాయి.

బి.వి. ప్రసాద్ మరింత రాణించి దర్శకులయ్యారు. ‘శ్రీ సింహాచల క్షేత్ర మహిమ’ సినిమా తీస్తూ, ఆ సినిమా రచన, పాటలు అందించమని రాజశ్రీని కోరారు. ఈ అవకాశానికై రాజశ్రీ తమ నిర్మాతలు శ్రీ మాచిరాజు సుబ్బారావు గారికి, ఎస్. డి. కోమలత గారికి ఎంతో ఋణపడి ఉన్నారు. అయితే, దురదృష్టవశాత్తు ఈ సినిమా బాగా ఆలస్యమైంది. అందుకని ‘పరువు ప్రతిష్ఠ’ సినిమాకి అసిస్టెంట్ డైరక్టరుగా వాల్టా ప్రొడక్షన్స్‌లో చేరారు. ఆ సినిమా దర్శకులు మానాపురం అప్పారావు రాజశ్రీచే రెండు పాటలు రాయించారు. ఒకటి తాగుబోతు పాట – ‘ఇలా జీవితం పోతే పోనీ ఈ క్షణం’; రెండవది భక్తి పాట ‘ప్రభూ గిరిధారి శౌరీ’. ఈ రెండు పాటలు ఆయన కెంతో పేరు తెచ్చాయి. రాజశ్రీ ఈ సినిమా వెండి తెర నవల కూడా రచించారు.

‘శ్రీ సింహాచల క్షేత్ర మహిమ’ సినిమాకి గాను సంభాషణలు, పాటల రచనలో తొలి అవకాశం బి.వి. ప్రసాద్ గారి కల్పించినా, అవి రాయడానికి రాజశ్రీని ప్రోత్సహించిన ఘనత మాత్రం పద్మాలయ ఫిల్మ్స్ ఎం.ఎస్. శ్రీ రామ్‌కు దక్కుతుంది. ఈ బ్యానర్ వారు నిర్మించిన డబ్బింగ్ చిత్రం ‘మూఢ నమ్మకాలు’కి మాటలు, పాటలు రాశారు రాజశ్రీ. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సినీరచయితలలో – తెలుగులో సముద్రాల, తమిళంలో కనకదాసన్, హిందీలో భరత్ వ్యాస్ ఆయన అభిమాన రచయితలు. ఆయన దాదాపుగా 1000 సినిమాలకు పని చేశారు. అందులో ఎక్కువ శాతం డబ్బింగ్ సినిమాలే. అందుకే ఆయనను ‘అనువాద బ్రహ్మ’ అని అంటారు. తనకి తీరిక దొరికితే ఆయన తన పిల్లలు – లక్ష్మి, సుధాకర్, శ్రీనివాస్‌లతో ఆడుకోవడానికి ఇష్టపడేవారు. రాజశ్రీ చలంతో కలిసి – సంబరాల రాంబాబు (1970), బుల్లెమ్మ బుల్లోడు, దేవుడమ్మ, తులాభారం (1974) వంటి గొప్ప సినిమాలకు పనిచేశారు. రాజశ్రీ ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో కలిసి – మౌనరాగం (1986), నాయకుడు (1987), ఘర్షణ (1988), అంజలి (1990), దళపతి (1991), రోజా (1992), దొంగ దొంగ (1993) – వంటి హిట్ చిత్రాలకు పనిచేశారు. తన తొలి తెలుగు స్ట్రెయిట్ సినిమా ‘గీతాంజలి’ (1989)కి రాజశ్రీ చే మాటలు రాయించారు మణిరత్నం. రాజశ్రీ కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. వీటిల్లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘మామా కోడలు’ (1993), ‘వెంకన్నబాబు’ (1992) ప్రసిద్ధమైనవి. 14 ఆగస్టు 1994 నాడు చెన్నైలో ‘ప్రేమికుడు’ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఆయన కన్నుమూశారు. ఆయన కుమారుడు రాజశ్రీ సుధాకర్ – క్రిష్, జోధా అక్బర్, క్రిష్-3, ధూమ్-2, దంగల్, దబాంగ్-3 వంటి అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాశారు.

తనకి పేరు ప్రఖ్యాతులు వచ్చినా, రాకపోయినా రాజశ్రీ ఎన్నడూ పట్టించుకోలేదు. అత్యంత నెమ్మదస్తుడైన రచయితగా చరిత్రలో మిగిలిపోయారు.

ఆయన పని చేసిన సినిమాల వివరాల కోసం వికీపీడియాలో చూడవచ్చు.


ఘన చరిత్ర కలిగిన హోటెల్ కన్నెమెరా:

అపురూపమైన ఆతిథ్యపు అనుభవానికి నెలవు అలనాటి హోటెల్ కన్నెమెరా. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన హోటళ్ళలో ఒకటైన ఈ హోటల్ మద్రాసుకే కాదు యావత్ దక్షిణ భారతదేశానికే తలమానికం. తొలుత ఓ ప్రైవేటు భవనమైన దీన్ని నగరంలోని ఆనాటి ప్రముఖ వర్తకులలో ఒకరిన జానీ బిన్నీ 1815లో కొనుగోలు చేశారు. ఈ హోటల్ ఉన్న రోడ్‌ని ఇప్పటికీ ఆయన పేరు మీద ‘బిన్నీ రోడ్’ అనే పిలుస్తున్నారు. 1867లో దీన్ని కొనుగోలు చేసిన వారు హోటల్‌గా మార్చి ‘ది ఇంపీరియల్ హోటల్’ అని పేరు పెట్టారు. 1886లో చేతులు మారి ‘ది అల్బనీ హోటల్’ అయ్యింది. చివరగా, 1891లో అప్పటి ప్రధాన వ్యాపార సంస్థలలో ఒకటైన ‘మెజర్స్ స్పెన్సర్స్ అండ్ కో’ దీనిని కొనుగోలు చేసి ‘హోటెల్ కన్నెమెరా’ గా మార్చిది. ‘మెజర్స్ స్పెన్సర్స్ అండ్ కో’ని అప్పట్లో ఆసియాలోనే దిగ్గజ వ్యాపార సంస్థగా పరిగణించేవారు. అది అప్పట్లో మద్రాసులో ఆసియాలో కెల్లా అతి పెద్ద డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ని నిర్మించింది. ‘మెజర్స్ స్పెన్సర్స్ అండ్ కో’ కన్నెమెరా హోటల్‌ని చేజిక్కించుకున్నాక, దాన్ని అత్యంత వైభవోపేతమైన హోటల్‌గా మార్చింది. 1930 నాటి వినోద శకంలో, ఈ హోటల్ అత్యంత విలాసవంతమైన ఆటలకు, వినోదాలకు నెలవైంది. గ్రేట్ బ్రిటన్ నుంచి పరికరాలను తెప్పించి, ‘మెజర్స్ స్పెన్సర్స్ అండ్ కో’ హోటల్‌లోని బహిరంగ ప్రదేశాలలో కూడా ఎయిర్ కండీషనింగ్ చేయించింది. తొలిసారిగా స్విమ్మింగ్ పూల్‌ని ఏర్పాటు చేసినది కూడా ఈ హోటలే. మద్రాసులోని అత్యంత ఉత్తమమైన కాక్‌టైల్స్ లో కలిపేందుకు కెనడా నుంచి ఐస్ తెప్పించింది. కానీ ఈ సంస్థ అనతికాలంలోనే ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుని, 1974లో ‘హోటల్ కన్నెమెరా’ని తాజ్ గ్రూప్‌కి లీజుకిచ్చింది.

మద్రాసు సంస్కృతిలో భాగమైన ‘తాజ్ కన్నెమెరా’ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన హోటల్‌గా పేరుగాంచింది. 1854లో ఏర్పడిన ఈ హోటల్ మొదట ‘ది ఇంపీరియల్ హోటల్’ అయిన తర్వాత దీని యాజమాన్యం పలు వ్యక్తుల మధ్య- ఆర్కాట్ నవాబ్ నుంచి జాన్ బిన్నీకి, మద్రాస్ షరీఫ్ నుంచి ముదలియార్ సోదరులకీ, వారి నుంచి ‘మెజర్స్ స్పెన్సర్స్ అండ్ కో’ కి, దాన్నుంచి తాజ్ గ్రూప్‌కి మధ్య-  చేతులు మారింది. ఈ హోటల్‌కి సంబంధించి ఉద్రేకాన్ని కలిగించే, నిష్కల్మషమైన ఎన్నో కథలు ప్రతిధ్వనిస్తాయి. ఈ భవనం డిజైన్ లక్షణాలు శుద్ధమైన సామ్రాజ్యవాద నమూనాలతో ఉంటాయి. భవనం లోపల ప్రాంగణాలలో బ్రిటీష్ మ్యూజియం నుంచి సేకరించిన బ్రిటీష్ సైనికుల, అధికారుల పాత ఫోటోలు తగిలించి ఉంటాయి. ఈ హోటల్ – రంగులు, అనుభూతులలో ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ జెఫ్రీ బావా యొక్క ‘ట్రాపికల్ మోడరనిజం’ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. హోటల్‌లో ఎక్కడైనా, ఎప్పుడైనా జాజ్ ఉంటుంది, అందులో మేరీ లౌ విలియమ్స్ తరహా బాణీ వినబడుతూంటుంది. సన్నని నాజూకైన శాండ్‌విచ్‌లను, మాకరూన్స్ అందించే సొగసైన ‘టీ రూమ్’ నుంచి చెట్టినాడు వంటకాలను అందిచే రెస్టారంట్ ‘రెయిన్ ట్రీ’ వరకు ఉన్నాయి. చాలాకాలంగా తాజ్ గ్రూప్‌కి ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్‌గా ఉన్న స్యూ ఫ్రీమాన్ అభిరుచి మేరకు హోటల్ ప్రాక్పశ్చిమాల మేళవింపును కనబరుస్తుంది. కన్నెమెరా హోటల్‌లో – ఐరిష్ విస్కీ, ట్రిచినోపోలీ సిగార్ కలిసి ఉంటాయి; మహాబలిపురంలోని ప్రాచీన ఆలయాలలోని చెక్క మెట్ల లాంటి మెట్లు ఈ హోటల్‌లో కనబడతాయి. మెట్ల మొదట్లో ఓ అందమైన పెద్ద పియానో, మెట్ల పైన సోఫాలతో నిండిన వసరా ఉంటాయి. ఈ హోటల్‌‌కి 1891లో పశ్చిమ ఐర్లాండ్‌లో – కన్నెమెరా అనే సాంస్కృతిక జిల్లాకి ప్రభువు, అప్పటి మద్రాసు గవర్నరు అయిన రాబర్ట్ బౌర్కె గౌరవ సూచకంగా ‘హోటెల్ కన్నెమెరా’ గా  పేరు పెట్టారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మద్రాసు అభివృద్ధికి కృషి చేశారు. అందులో భాగంగా కొన్ని పొరపాట్లూ చేశారు, కొన్ని తీవ్రమైనవీ ఉన్నాయి. ఆయన స్త్రీలోలుడు, అప్పటి భారతీయ నవాబుల అంతఃపురాల నుండి మహిళలను రప్పించుకునేవారు. ఆయన తన భార్య సోదరితోనూ, పనిమనిషితోనూ సన్నిహిత సంబంధాలుండేవని అంటారు. లేడీ కన్నెమెరాకి తన భర్త నుంచే సుఖవ్యాధులు సంక్రమించాయి. ఒకరోజు ఆయన కొందరు యువతులతో ఉండగా, ఆమె స్వయంగా పట్టుకుని, భర్తని, ప్రభుత్వ బంగాళాని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అప్పట్లో  ‘ది అల్బనీ హోటల్’ అని పిలవబడిన ‘హోటెల్ కన్నెమెరా’లో దిగారట. ఐర్లాండ్‌కి వెళ్ళిపోయే ముందుగా ఆ హోటల్‌లో ఆమె మూడు నెలలు బస చేశారు. తర్వాత భర్తకి విడాకులు ఇచ్చేశారు. ఇది పెద్ద వ్యాజ్యమై, లార్డ్ కన్నెమెరా తన పదవి పోగొట్టుకున్నారు. అయితే ఈ హోటల్‌కి ఎన్నో కష్టాలు అనుభవించిన లేడీ కన్నెమెరా పేరిట ఆ పేరు పెట్టారని చాలామంది అంటారు.

 

 

A rare pic of cultural delegates from China who visited Madras , in Hotel Connemara in 1954

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here