అలనాటి అపురూపాలు-34

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

స్వరకర్త టి.వి.రాజు తొలినాటి జీవితం:

స్వరకర్త టి.వి.రాజు గారు పాత తరంవారికి సుపరిచితులే. అయితే ఎక్కువ మందికి పెద్దగా తెలియని ఆయన తొలినాటి జీవితం గురించి ఈ వారం తెలుసుకుందాం.

టి.వి.రాజు (1918 – 20 ఫిబ్రవరి 1973)గా ప్రసిద్ధులైన తోటకూర వెంకట రాజు 1918లో రాజమహేంద్రవరం తాలూకా రఘుదేవపురంలో జన్మించారు. వారి తండ్రి సోమరాజు ఒక భూస్వామి. రాజుగారికి ఆరేళ్ళ వయసులో తండ్రి గతించారు. అతి కష్టం మీద నాలుగవ ఫారం పాసయినా, సంగీతం పట్ల ఇష్టం ఆసక్తి కొనసాగాయి. నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు వారి గురువు. ఆయన వద్ద మూడేళ్ళ పాటు సంగీతం నేర్చుకున్నారు. దీని తరువాత 1934 శివరాత్రి నుంచి ఆయనే స్వయంగా ఇతరులకు సంగీతం నేర్పసాగారు. ఆ రోజు నుంచి ఆయన రంగస్థలంలోనూ చేరారు. కోరుకొండ, రాజమండ్రి వంటి ప్రాంతాలలో పాడి, నాటకాలలో నటించారు. ఆయన పాటలు పాడితే, ప్రేక్షకులు ఉత్సాహంతో ‘వన్స్ మోర్’ అనేవారట! నాటకాలలో లోహితాశ్యుడు, కబీర్, నారద, కృష్ణ, కనకసేన వంటి పాత్రలు పోషించారు. ఆ తరువాత ఆయన సురభి సంస్థతో కలిసి వారి నాటకాలకు హార్మోనియం వాయించడం ప్రారంభించారు.  కొన్నాళ్ళ పాటు తమిళ సీమకి వెళ్ళి తన సోదరుడు సత్యనారాయణ రాజుతో కలిసి పని చేశారు. అక్కడ ఆయన హైస్కూల్‌లో చేరి, మార్కండేయ పాత్రలో రాణించి ప్రసిద్ధులయ్యారు. 1934 నుంచి 1942 వరకు ఎనిమిదేళ్ళ పాటు రంగస్థలంపై ఓ ‘తార’గా, సంగీత దర్శకుడిగా ఓ వెలుగు వెలిగారు.

మళ్ళీ రాజమండ్రి వచ్చేసి అంజనీ కుమారి (తర్వాతి కాలంలో సుప్రసిద్ధి నటి అంజలీదేవి) డాన్స్ ట్రూప్‌లో చేరి అనకాపల్లి, చోడవరం వంటి ప్రాంతాలలో హార్మోనియం వాయించారు. యుద్ధనిధి సేకరణకై ప్రదర్శించిన ‘మిస్ ప్రేమ, బిఎస్‌సి’ అనే నాటకానికి హార్మోనియం వాయించారు. 1946 నుండి, ‘గుత్తి వంకాయ్ కూర’ పాటకి ప్రసిద్ధి చెందిన బి. నరసింహారావు గారి నాట్యబృందానికీ, ఆదర్శ నాట్య బృందానికి హార్మోనియం వాయించారు. వారితో కలిసి ఆంధ్రా, ఒరిస్సాలో పలు ప్రాంతాలు తిరిగారు. ఒకరోజు ఆయనకు శోభనాచల స్టూడియోస్ రామ జోషి నుంచి వారి వద్ద హార్మోనిస్టుగా చేరమని పిలుపు వచ్చింది. కానీ ఆయన అక్కడికి వెళ్ళేసరికి ఆ స్థానంలో మరొకరిని నియమించుకున్నారు. ఆయన బాగా నిరాశ చెందారు. అయితే, అదే సమయంలో నటి కాంచన్ ‘చంద్రవంక’ అనే సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. ఆ యూనిట్‌లో చేరి, సంగీత దర్శకులు నల్లం నరసింహా రావు వద్ద సహాయకుడిగా చేరారు. దీంతో సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తరువాత ఆయన నటి కృష్ణవేణి నిర్మించిన ‘మన దేశం’ సినిమాకి ఆర్గాన్ వాయించారు. ఆపై అంజలీదేవి సహాయంతో పి. ఆదినారాయణ గారి వద్ద సహాయ సంగీత దర్శకుడిగా చేరి ‘పల్లెటూరి పిల్ల’ (1950) సినిమాకి పని చేశారు. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలోనూ నటించారు. ఆ రోజుల్లో ఆయన ఎన్.టి.రామారావు, తాతినేని ప్రకాశరావు లతో పాటుగా మాంబళంలో ఒకే వీధిలో నివసించేవారు. వారు మంచి మిత్రులయ్యారు. స్వతంత్ర్య సంగీత దర్శకుడిగా ఆయన తొలి చిత్రం బి.ఎ. సుబ్బారావు దర్శకత్వం వహించిన ‘టింగు రంగ’ (1952).  ఆయన ఆప్తమిత్రుడు ఎన్.టి.రామారావు 1973 వరకూ తమ స్వంత బ్యానర్‌పై తీసిన అన్ని సినిమాలకు సంగీతం కూర్చే అవకాశం టి.వి. రాజుకే కల్పించారు. గ్లాస్కో దుస్తులలో, చేతి వేళ్ళ మధ్య వెలుగుతున్న సిగరెట్‌తో, ముఖంపై చిరునవ్వుతో కనబడేవారు టి.వి.రాజు. ఆ తర్వాత నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నో హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చారు.

తెలుగు సినిమా స్వర్ణయుగానికి ఆయన సేవలను తెలుసుకోడానికి ఆయన పని చేసిన కొన్ని సినిమాల జాబితా చూడండి:

  • టింగు రంగ (1952)
  • పిచ్చి పుల్లయ్య (1953)
  • తోడు దొంగలు (1954)
  • జయసింహ (1955)
  • చింతామణి (1956)
  • పాండురంగ మహత్యం (1957)
  • రాజ నందిని (1958)
  • శ్రీ కృష్ణ మాయ (1958)
  • బాల నాగమ్మ (1959)
  • టాక్సీ రాముడు (1961)
  • సవతి కొడుకు (1963)
  • శ్రీసింహాచల క్షేత్ర మహిమ (1965)
  • శ్రీ కృష్ణ పాండవీయం (1966)
  • భీమాంజనేయ యుద్ధం (1966)
  • పిడుగు రాముడు (1966)
  • భామా విజయం (1967)
  • చదరంగం (1967)
  • కాంభోజరాజు కథ (1967)
  • శ్రీ కృష్ణావతారం (1967)
  • ఉమ్మడి కుటుంబం (1967)
  • తిక్క శంకరయ్య (1968)
  • బాగ్దాద్ గజదొంగ (1968)
  • కలిసొచ్చిన అదృష్టం (1968)
  • నేనే మొనగాణ్ణి (1968)
  • వరకట్నం (1968)
  • నిండు హృదయాలు (1969)
  • భలే తమ్ముడు (1969)
  • కథానాయకుడు (1969)
  • సప్తస్వరాలు (1969)
  • విచిత్ర కుటుంబం (1969)
  • మారిన మనిషి (1970)
  • తల్లా పెళ్ళామా (1970)
  • చిన్ననాటి స్నేహితులు (1971)
  • శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972)
  • రాజ మహల్ (1972)
  • ధనమా? దైవమా? (1973)

~

వీరి కుమారుడు తోటకూర సోమరాజు (‘రాజ్’గా తెలుగు సినీరంగంలో ప్రసిద్ధి), సాలూరి రాజేశ్వర రావు గారి కుమారుడు సాలూరి కోటేశ్వర రావు (కోటి)తో కలిసి – ‘రాజ్-కోటి’ ద్వయంగా ఏర్పడి ఎన్నో హిట్ సినిమాలకు పాటలు అందించారు.


భానుమతి గురించి శివాజీ గణేశన్ అభిప్రాయాలు:

అలనాటి నటీనటులు ఒకరినొకరు గౌరవించుకోడం, ఒకరిపై ఒకరికి ఉన్నతాభిప్రాయాలు ఉండడం తెలిసినదే. ఈ కోవలోనే తనకి భానుమతిపై ఉన్న అభిప్రాయాలను శివాజీ గణేశన్ 1966లో తామిద్దరకి ‘పద్మశ్రీ’ పురస్కారం లభించిన సందర్భంలో వెల్లడించారు. ఆయనేం చెప్పారో ఆయన మాటలలోనే విందాం:

“అవి 1945 నాటి రోజులు. నేను అప్పట్లో బెంగుళూరులో శక్తి నాటక సమాజంతో ఉన్నాను. మనోహర్, విధి, రామ భక్తి వంటి నాటకాలను ప్రదర్శిస్తున్నాము. ఒకనాడు ఓ గొప్ప నాటకాన్ని ప్రదర్శించగా, ప్రేక్షకుల అభినందనలు మిన్నంటాయి. గొప్ప సంతృప్తితో, అలసిపోయినప్పటికీ, ఎలాగొలా మా బసకి చేరి మేకప్ తీసేశాం. సమయం రాత్రి తొమ్మిదవుతోంది. అందరం గబగబా అన్నాలు తినేశాం. ఎందుకనుకుంటున్నారు? ‘స్వర్గసీమ’ అనే తెలుగు సినిమాని మళ్ళీ ఇంకోసారి చూడడానికి. అప్పట్లో వాహినీ బ్యానర్ పై నిర్మించిన ‘స్వర్గసీమ’ సినిమా బెంగుళూరులో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. భానుమతి ఎంతో గొప్పగా నటించారని మేం విన్నాం. ‘ఓహో పావురమా’ పాటలో ఆమె అద్భుతంగా అభినయించారని చెప్పుకున్నారు. అందుకే నాటకం ముగిసిన వెంటనే చాలాసార్లు, రాత్రి ఆటలో ఆ సినిమా చూశాను. అమాయకురాలైన ‘సుబ్బి’ నుంచి ‘సుబ్బలక్ష్మి’గా మారడం, అక్కడ్నించి వ్యాంప్ ‘సుజాత’ పాత్రలోకి మారడంలో ఆమె ఎంతో మరపురాని నటనని కనబరిచారు. ఆ రోజుల్లో నేను నాటకాలలో ఆడవేషాలు వేస్తుండేవాడిని. ‘స్వర్గసీమ’లో భానుమతి నటన నన్నెంతో ప్రభావితం చేసింది. స్త్రీ పాత్రలు ఎలా పోషించాలో నేను ఆవిడ నుంచే నేర్చుకున్నాను. అందుకే ఆ సినిమాని అంత భక్తి భావంతో చూసేవాడిని. సినిమా చూశాకా, మా బృందమంతా తిరిగి బసకి చేరేవారం. వెంటనే నిద్రపోయేవాళ్ళం కాదు, తెల్లవారే వరకు ఆమె నటన గురించే మాట్లాడుకునేవారం. ఆ సినిమాలో భానుమతి అంటే మాకు ఈ విధమైన ఆరాధన! ‘స్వర్గసీమ’ విజయవంతమవడంలో భానుమతి పాత్ర ఎంతో ఉంది.

ఆమె నటించగా, నేను చూసిన మరో సినిమా 1948లో వచ్చిన ‘రత్నమాల’. ఆ సినిమాలో ఆమె గిలక, చిలక, కోతి బొమ్మలను పట్టుకుని ఓ పాట పాడడం నాకు బాగా గుర్తు. ఆమె అద్భుతంగా పాడతారు. ఆ తర్వాత ఆవిడది నేను చూసిన మరో సినిమా జెమినీ వారి ‘అపూర్వ సహోదరులు’. ఆమె అంటే ఎంతో అభిమానం ఏర్పడి, ఆమె నటించిన ప్రతీ తెలుగు, తమిళ సినిమాలను విడవకుండా చూశాను. ఆమెకి వీరాభిమానిని అయిపోయాను.

నాకు జోడీగా ఆవిడ తొలిసారి నటించిన చిత్రం రేవతి ఫిల్మ్స్ వారి ‘కళ్వనిన్ కాదలి’ (1955). నాకు హీరోయిన్‌గా ఆవిడ నటిస్తున్నారని తెలిసినప్పుడు నాకు వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. సెట్‌లో డైరక్టర్ వి. ఎస్. రాఘవన్ గారు తొలిసారిగా ఆవిడని నాకు పరిచయం చేసినప్పుడు నేను చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా ఆ గొప్ప నటితో ‘వణక్కం’ అని అన్నాను. బదులుగా ఆమె ‘నమస్తే’ అన్నారు. ఒకరినొకరు ఆట పట్టించుకునే సీన్ తీశారా రోజు అని నాకు బాగా గుర్తు. ఆ సీన్ తర్వాత నా కంగారు కాస్త తగ్గి కుదుటపడ్డాను. ఆ తర్వాత మేం ఎన్నో సినిమాలు చేశాం. అప్పటికే ఆవిడ బాగా పేరున్న నటి అయినా, తోటి నటులకి ఎంతో సహకరించేవారు, వాళ్ళని సౌకర్యంగా ఉంచేవారు. ఆవిడతో జరిపిన చర్చలు నా నటనను మెరుగుపరుచుకునేందుకు ఉపకరించాయని చెప్పడంలో అతిశయోక్తి ఏ మాత్రంలేదు. ‘మక్కళై పెట్ర మహరాసి’ (1957) సినిమాలో మేమిద్దరం కోయంబత్తూరు ప్రాంతానికి చెందినవారిలా నటించాలి, అంతేకాదు తమిళంలోని కొంగునాట్టు మాండలికం మాట్లాడాలి. మామూలు తమిళం అయితే ఆవిడ అలవోకగా మాట్లాడేసేవారు, కానీ ఈ మాండలికం ఆవిడకి కొత్త. ఆ కఠినమైన మాండలికాన్ని మాట్లాడడం నేను ఆవిడకి నేర్పాను. అతి తక్కువ సమయంలోనే ఆవిడ నేర్చుకుని, డైలాగ్స్ సులువుగా చెప్పేశారు, మేమంతా అభినందించాం. మేమిద్దరం కలిసి రంగూన్ రాధా 1956, తెనాలి రామన్ 1956, అంబికాపతి 1957, రాణి లలితాంగి 1957, మనమగన్ తేవై 1957, సారంగధర 1958, రాజభక్తి 1960, అరివాళి 1963 – వంటి సినిమాలలో నటించాం. రంగూన్ రాధా సినిమాకి మద్రాస్ ఫిల్మ్ ఫాన్స్ అసోసియేషన్ ఆవిడకి ఉత్తమ నటి పురస్కారం ప్రకటించగా, ఆవిడ షూటింగ్‌లో ఉండడంతో స్వయంగా వచ్చి స్వీకరించలేకపోయారు. ఆమె తరఫున పూలదండనీ, అవార్డునీ నేను తీసుకున్నాను. అక్కడ్నించి నేను నేరుగా ఆమె సినిమా షూటింగ్ జరుగుతున్న వాహినీ స్టూడియోకి వెళ్ళి ఆవిడని కలిసి వాటిని సగౌరవంగా అందజేశాను. ఇప్పుడైతే, మేం కలిసినటిస్తున్న సినిమాలు లేవు. కానీ మేము వేర్వేరు షూటింగులలో కలుస్తూనే ఉంటాం. ‘ఎన్నగో’ (ఎలా ఉన్నారు?) అని ఆమె అడుగుతూంటారు, బావున్నానని చెబుతూంటాను. మాకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించారని తెలిసిన రోజున ఫోన్ చేసి ఆవిడని అభినందించాను, ఆమె కూడా నాకు అభినందనలు తెలిపారు. ఈరోజున నాకు ఆ అవార్డు రావడం కన్నా ఆవిడని ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించడం నాకు ఎక్కువ సంతోషాన్నిస్తోంది…”

(ఈ క్రింది చిత్రాలలో భానుమతి శివాజీ గణేశన్‌తో నటించిన సినిమాలలోవి, ‘పద్మశ్రీ’ పురస్కారం స్వీకరించేందుకు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక పుస్తక ప్రదర్శనలో విజయలక్ష్మి పండిట్‌తో దిగిన ఫోటో ఉన్నాయి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here