అలనాటి అపురూపాలు-36

0
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మరవలేని దర్శకులు బసు చటర్జీ:

1970-80 దశకాలలో మధ్య తరగతి కుటుంబాల కథలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులలో ఒకరు బసు చటర్జీ. ఛోటీ సీ బాత్, రజనీగంధ, బాతోం బాతోం మె, స్వామి, ఏక్ రూకా హువా ఫైస్‌లా, ఛమేలీ కీ షాదీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాలతో ఈ ఏడాది జూన్ 4వ తేదీన ముంబయిలో మృతి చెందారు. వారి వయసు 90 ఏళ్ళు.

బసుదా అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే బసు చటర్జీ 10 జనవరి 1930 నాడు అజ్మీరులో జన్మించారు. సినిమాలలోకి రాకముందు ఆయన ఓ వార్తాపత్రికలో ఇల్లస్ట్రేటర్‌గా పనిచేశారు. బసు భట్టాచార్య అనే పేరుతో ఆయన రాజ్‌ కపూర్, వహీదా రెహ్మాన్ నటించిన ‘తీస్రీ కసమ్’ (1966) చిత్రానికి సహాయకుడిగా పని చేశారు. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘సారా ఆకాశ్’ (1969). ఇది రాజేంద్ర యాదవ్ రచించిన ‘సారా ఆకాశ్’ అనే పుస్తకం ఆధారంగా నిర్మించిన సినిమా. రాకేష్ పాండే, మధు చక్రవర్తి, జలాల్ ఆఘా నటించిన ఈ చిత్రం – తమ మధ్య బంధం పొసగని ఓ జంట కథ. ఈ సినిమాని ఆగ్రాలోని రాజేంద్ర యాదవ్ స్వంత ఇంటిలో చిత్రీకరించారు. ఈ సినిమాకి నలుపు-తెలుగు ఛాయాగ్రహణం అందించిన కె.కె. మహాజన్ జాతీయ ఉత్తమ సినీమాటోగ్రాఫర్‌‌గా ఈ సినిమాకి గాను అవార్డు గెల్చుకున్నారు. సామాన్యులు, వారి సమస్యల చుట్టూ తిరిగే బసుదా భవిష్యత్తు చిత్రాలకు ఇది మార్గం వేసింది. నిర్మాణ వ్యయంలో పొదుపుగా ఉంటూనే (ఈ సినిమాకి కె.కె. మహాజన్, ఎ.కె.బీర్ ఛాయాగ్రహణం అందించారు) నాణ్యతలో రాజీపడేవారు కాదు. కాస్టింగ్ డైరక్టర్‍ల ట్రెండ్ ఏర్పడక ముందే, ఆసక్తి ఉన్న నటులతో తన సినిమాలలో చక్కని పాత్రలు పోషింపజేశారు బసు చటర్జీ. ఆయన తన కెరీర్‌ని కార్టూనిస్ట్‌గా ప్రారంభించినందున (బాల్ థాకరే, ఆర్.కె. లక్ష్మణ్ ఆయన సమకాలికులు) ఆయనకు హాస్యం, క్లుప్తత అలవోకగా అలవడ్డాయి. ఆయన బాల్యమంతా మధురలో గడవడం వల్ల హిందీ భాషపై చక్కని పట్టు ఉంది. ఆయన తీసిన చాలా సినిమాలు ‘పెళ్ళి’ అనే అంశం చుట్టూ తిరుగుతాయి. రాజా ఠాకూరు మరాఠీలో తీసిన ‘ముంబయిచా జవాయ్’ అనే సినిమాని 1972లో జయా బాదురి, అనిల్ ధావన్‌లతో ‘పియా కా ఘర్’ పేరిట తీశారు. ముంబయిలో వ్యక్తిగత స్థలం కొరత, ఏకాంతానికి లోటు ఎలా ఉంటుందో ఓ యువ జంట దృష్టికోణం నుంచి వివరించారు. షబనా ఆజ్మీ, గిరీష్ కర్నాడ్, విక్రమ్ నటించిన ‘స్వామి’ (1977) చాలా సీరియస్ సినిమా. తనకి వేరొకరితో వివాహమైనా, ఇంకా ప్రియుడిని కోరుకునే మహిళ కథ ఇది. వివాహంలోని రొమాన్స్‌ని కఠిన వాస్తవాలు ఎలా చంపేస్తాయో తెలిపిన సినిమా – జితేంద్ర, నీతూ సింగ్, రాకేష్ రోషన్, ఉత్పల్ దత్ నటించిన ‘ప్రియతమ’ (1977). భార్య లేని ఓ నడివయసు వ్యక్తి (అశోక్ కుమార్), భర్త పోయిన ఓ మధ్య వయసు స్త్రీని (పెరల్ పదంసీ) మళ్ళీ పెళ్ళి చేసుకుంటే – వారి పిల్లలు ఒకరితో ఒకరు ఎలా సర్దుకోలేకపోయారో చెప్పే చిత్రం – ‘ఖట్టా మీటా’ (1978). ఆయన కొన్ని రొమాంటిక్ కామెడీలు తీసినా, ఇక్కడ కూడా ప్రాధాన్యత మధ్య తరగతికే ఇచ్చారు.  మన్ను భండారీ రచించిన ఓ కథ ఆధారంగా 1974లో తీసిన ‘రజనీగంధ’లో అమోల్ పాలేకర్, విద్యా సిన్హా, దినేష్ ఠాకూరు నటించారు. తన జీవిత భాగస్వామిని ఎంచుకోడంలో ఓ యువతి ఎదుర్కునే సందిగ్ధావస్థ ఈ సినిమా కథాంశం. అమోల్ పాలేకర్, జరీనా వహాబ్, విజయేంద్ర ఘాట్గే నటించిన ‘చిత్‌చోర్’ (1976) ఓ రొమాంటిక్ కామెడీ. ఇందులో పాత్రలు ఒకరినొకరుగా పొరపడడం నవ్విస్తుంది. ‘ఛోటీ సీ బాత్’ (1976)లో అమోల్ పాలేకర్, ఆస్రానీ, అశోక్ కుమార్, విద్యా సిన్హా నటించారు. ఇందులో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండే వ్యక్తి పాత్రలో నటించారు అమోల్ పాలేకర్. ఒక లైఫ్-కోచ్‌ని పెట్టుకుని ఓ యువతికి ఎలా ప్రపోజ్ చేయాలో నేర్చుకుంటారు. ‘బాతోం బాతోం మె’ (1979) ఓ క్రైస్తవ కుటుంబ కథగా, అమోల్ పాలేకర్, టీనా మునీమ్‌ల మధ్య నడిచే ప్రేమ కథగా తీశారు బసుదా. టీనాకి సహకరించే బంధువుగా డేవిడ్ నటించారు. జార్జ్ బెర్నాడ్ షా వ్రాసిన ‘పిగ్మాలియన్’ ఆధారంగా తీసిన ‘మన్ పసంద్’ (1980) చిత్రంలో దేవ్ ఆనంద్, టీనా మునీమ్, గిరీష్ కర్నాడ్, మహబూబ్ నటించారు. ‘షౌకీన్’ (1980) బోల్డ్ కామెడీ తరహా చిత్రం. అశోక్ కుమార్, ఉత్పల్ దత్, ఎ.కె. హంగల్, రతీ అగ్నిహోత్రి, మిథున్ చక్రవర్తి నటించిన ఈ చిత్రం – గోవాలో సరదాగా గడపాలనుకునే ముగ్గురు వృద్ధుల దుస్సాహసాల కథ. అనిల్ కపూర్, అమృతా సింగ్ నటించిన ‘ఛమేలీ కీ షాదీ’ (1986) లో కుల రాజకీయాలు విలన్ పాత్ర పోషిస్తాయి. ఒక మాజీ వస్తాదు ఓ అందగత్తెను పెళ్ళి చేసుకోవాలనుకోవడం కథాంశం.

సాధారణంగా అయన తన స్క్రిప్ట్‌లు తానే రాసుకుంటారు. ఆయన సినిమాలలో డైలాగులు సాధారణ జనజీవనంలో మాట్లాడుకునే మాటల్లా ఉంటాయి, అదే సమయంలో అత్యంత ప్రభావితంగానూ ఉంటాయి. ఫిల్మ్ సొసైటీలంటే బాగా ఆసక్తి ఉన్న ఆయన ప్రపంచంలోని ఉత్తమ సినిమాల నాణ్యతని అందుకోడానికి ప్రయత్నించారు, అదే సమయంలో కథని నిరాడంబరంగా చెప్పే తనదైన శైలిని నిలుపుకున్నారు. ఆయన తీసిన చాలా సినిమాలో అద్భుతమైన సంగీతం ఉంటుంది. యస్.డి. బర్మన్, సలీల్ చౌధురీ, ఆర్.డి. బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, రాజేష్ రోషన్, బప్పి లహరి వంటి  గొప్ప సంగీత దర్శకులతో పని చేసి తనకి కావల్సినట్టుగా సంగీతం రాబట్టుకున్నారు. ఆయన తీసిన చాలా సినిమాలలో మహిళల పాత్రలు గొప్పగా ఉంటాయి – స్వామి, చిత్‍చోర్, జీనా యహా, అప్నే పరాయే, పసంద్ అప్నీ అప్నీ వంటివి ఇందుకు ఉదాహరణ. హంగూ ఆర్భాటం లేకుండా సూక్షంగా ప్రదర్శించే హాస్యం ఆయన మరో గుణం.

బసుదా థ్రిల్లర్స్ కూడా తీశారు. 1978లో తీసిన ‘తుమ్హారే లియే’ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుంది. సంజీవ్ కుమార్, విద్యా సిన్హా, నీలమ్ మెహ్రా ఈ సినిమాలో నటించారు. గిరీష్ కర్నాడ్, హేమ మాలిని నటించిన ‘రత్నదీప్’ (1979)లో హేమ మాలిని ఆస్తులను దోచుకునేందుకు ప్రయత్నించే చనిపోయాడనుకునే ఆమె భర్త పాత్రలో కర్నాడ్ నటించారు. రాజేష్ ఖన్నా, వినోద్ మెహ్రా, నీతూ సింగ్ నటించిన 1978 నాటి ‘చక్రవ్యూహ’ సినిమా – ఎవరు దోషి అనేది కనుక్కునే జేమ్స్‌బాండ్ తరహా గూఢచారి కథలా సాగుతుంది. ‘షీషా’ (1986) రేప్ నేపథ్యంగా సాగే ఓ థ్రిల్లర్. ఇందులో మిథున్ చక్రవర్తి, మూన్ మూన్ సేన్, మల్లికా సారాభాయ్ నటించారు.

అమితాబ్ బచ్చన్, మౌసమీ చటర్జీ నటించిన ‘మంజిల్’ (1979)కి 1965 తీసిన బెంగాలీ సినిమా ‘ఆకాశ్ కుసుమ్’ ఆధారం. మౌసమీని ఆకట్టుకోడానికి అమితాబ్ సంపన్నుడిగా నటిస్తూంటారు ఈ సినిమాలో. షబానా అజ్మీ, అమోల్ పాలేకర్, జరీనా వహాబ్ నటించిన ‘జీనా యహా’ (1979) మహిళా సాధికారతకి సంబంధించిన సినిమా. 12 Angry Men (1957) అనే అమెరికన్ చిత్రం ఆధారంగా తీసిన సినిమా ‘ఏక్ రూకా హువా ఫైస్‌లా’ (1986). భావోద్వేగాలను కలిగించే కోర్టు దృశ్యాలతో సాగే సినిమా ఇది. ‘కమలా కీ మౌత్’ (1989) పెళ్ళి కాకుండానే గర్భం దాల్చి ఆత్మహత్య చేసుకున్న యువతి కథ ఇది. పంకజ్ కపూర్, సుప్రియా పాఠక్, రూపా గంగూలీ నటించిన ఈ సినిమా ఇరుగు పొరుగు వారందరినీ తమ తమ జీవితాలను పరిశీలించుకోమంటుంది.

తక్కువ బడ్జెట్ సినిమాలో పెద్ద పెద్ద తారలను నటింపజేసే చాకచక్యం బసుదాకి ఉంది. మిథున్ చక్రవర్తితో ‘షౌకీన్’; వినోద్ మెహ్రాతో ‘ఉస్ పార్’; జితేంద్ర, నీతూ సింగ్‌లతో ‘ప్రియతమ’; ధర్మేంద్ర, హేమమాలినిలతో ‘దిల్లగీ’; అమితాబ్ బచ్చన్‌తో ‘మంజిల్’ వంటివి ఇందుకు ఉదాహరణలు. ఆయన దూరదర్శన్ కోసం ‘వ్యోమకేష్ బక్షి’, ‘రజనీగంధ’ వంటి సీరియల్స్ తీశారు. అవి బాగా విజయవంతమయ్యాయి. ఆయనకి ‘రూపాలి గుహా’ అనే కూతురు ఉన్నారు. ఆమె కూడా సినీ దర్శకురాలు కావడం విశేషం!


హీరో దేవ్ ఆనంద్ పెళ్ళి కథ:

దేవ్ ఆనంద్ సురయ్యాను విపరీతంగా ప్రేమించారని అందరికీ తెలిసినదే. ఆమె కోసం ఓ అందమైన వజ్రపుటుంగరం కూడా కొన్నారు. అయితే ఒక కథనం ప్రకారం ఆ ఉంగరాన్ని సురయ్యా అమ్మమ్మ సముద్రంలో విసిరేశారు, మరో కథనం ప్రకారం స్వయంగా సురయ్యాయే దాన్ని సముద్రంలో పారేశారు. తాము భిన్నమైన మతాలకు చెందినవారమని కాబోలు, సురయ్యా పెళ్ళికి కాదనేసరికి దేవ్ హృదయం భగ్నమైంది. అప్పట్లో ఆమె ఆయనకంటే పెద్ద స్టార్ అని కూడా కొందరంటారు. పైగా కుటుంబ పోషణకి ఆమే ఆధారమనీ, అందుకే కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని అంటారు. వారిద్దరూ చివరిసారిగా కలుసుకుని గుండె మంట చల్లబడేంత వరకూ దుఃఖించారట. దేవ్ ఆనంద్ సన్నిహితులు మోహన్ చురీవాలా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం – సురయ్యా తల్లి ఓ రాత్రి పూట పది గంటల సమయానికి తమ ఇంటి మేడపైకి రమ్మని, చివరిసారిగా సురయ్యాని కలుసుకోమని దేవ్ ఆనంద్‌కి కబురుపంపారట, ఒంటరిగా వెళ్తే ఏదైనా సమస్య రావచ్చని రాజ్ ఖోస్లా, గురు దత్ వద్దన్నారట. దేవ్ ఒక ఇన్‍స్పెక్టర్ మిత్రుడిని వెంట తీసుకుని వెళ్ళారట. ఆ ఇన్‌స్పెక్టర్ రెండు టార్చీ లైట్‍లు, తూటాలతో నింపిన తుపాకీ తీసుకుని వెళ్ళారట. ఏదైనా ప్రమాదాన్ని ఊహిస్తే, టార్చ్ లైట్ వెలిగించి సంజ్ఞ చేయమని చెప్పి, ఆయన పిట్టగోడపై కూర్చున్నారట. ఆ ప్రేమికులిద్దరి వ్యథ మాటల్లో కన్నా కన్నీటి రూపంలోనే ఎక్కువగా వ్యక్తమైంది. దీని తర్వాత సురయ్యా పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతే, దేవ్ ఆనంద్ జీవితంలో ముందుకు సాగారు. కల్పనా కార్తీక్ అనే పేరుతో నటించే మోనా సింఘా దేవ్ ఆనంద్‌ని ఆ వ్యథ నుంచి బయటకు లాగారు. ఈ అందమైన యువతి మొదట దేవ్ ఆనంద్ అన్నయ్య చేతన్ ఆనంద్‌కి సిమ్లాలో తటస్థపడ్డారు. అప్పట్లో ఆమె సిమ్లా లోని ఓ ప్రముఖ కాలేజీలో చదువుతూ, మిస్ సిమ్లాగా ఎంపికయ్యారు. చిన్నపాటి సెలెబ్రిటీ కూడా. మోనా పంజాబీ క్రిస్టియన్ కుటుంబానికి చెందినవారు, దేశ విభజన తర్వాత వారి కుటుంబం లాహోర్ నుంచి వచ్చి సిమ్లాలో స్థిరపడింది. చేతన్ ఆనంద్ కొత్త ముఖాలకై అన్వేషిస్తూ, మోనాని చూడడం జరిగింది. ఆమెని సినిమాలో నటించమని అడిగారు. ఆమెకి తొలి అవకాశం నవకేతన్ ఫిల్మ్స్ వారి ‘బాజీ’ (1951)తో వచ్చింది. ఆ సినిమాలో ఆమె ఒక డాక్టరుగా నటించారు. అది నవకేతన్ వారి రెండవ సినిమా, గురు దత్ దర్శకత్వం వహించారు. అమెరికన్ చిత్రాల స్ఫూర్తితో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆమె తరువాత వరుసగా ఆంధియా (1952), హమ్‍సఫర్ (1953), టాక్సీ డ్రైవర్ (1954), హౌస్ నెంబర్ 44 (1954), నౌ దో గ్యారాహ్ (1957) అనే చిత్రాలలో దేవ్ ఆనంద్ సరసన నటించారు. నిజానికి ‘బాజీ’ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పడే దేవ్ ఆనంద్ ఆమె పట్ల ఆకర్షితులయ్యారని అంటారు. సంశయాలు వీడి ఆమె ఒప్పుకున్న వెంటనే పెళ్ళి చేసుకోవాలని దేవ్ ఆనంద్ అనుకున్నారు. అయితే దేవ్ ఆనంద్ విభిన్నంగా ఆలోచించారు. టాక్సీ డ్రైవర్ (1954) సినిమా షూటింగ్ జరుగుతుండగా, షూటింగ్ విరామంలో ఆమెను పెళ్ళి చేసుకున్నారు. తదుపరి సిమి గరెవాల్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి, పెళ్ళి గురించి చెప్పారాయన. “ఆమె అందంగా ఉండేది, ఉత్సాహంగా ఉండేది, అల్లరి పిల్ల, పైగా బాగా చదువుకున్నది. ‘బాజీ’ సెట్స్‌పై ఒకరంటే ఒకరికి ప్రేమ కలిగింది. రహస్యంగా పెళ్ళి చేసుకోవాలనుకున్నాం… ఎందుకా? పెళ్ళి అనేది వ్యక్తిగతమైన విషయం కదా? పెళ్ళి చేసుకుందామని, ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేద్దామనుకున్నాం.” అన్నారు. ఇంకా మాట్లాడుతూ, “టాక్సీ డ్రైవర్ సెట్‍లో షూటింగ్ అవుతోంది. నా జేబులో ఉంగరం ఉంది. రిజిస్ట్రార్ గారిని సెట్‍కి రమ్మన్నాను. విరామం మధ్యలో సెట్లకి దీపాలంకరణ చేస్తుండగా నేను తనకి సంజ్ఞ చేశాను. మేమిద్దరం ఓ గదిలోకి వెళ్ళి పెళ్ళి చేసుకుని బయటకు వచ్చేశాం. అయితే తన చేతికి ఉంగరం ఉండడం గమనించిన కెమెరామాన్ సీన్ కంటిన్యుటీ దెబ్బ తింటుందని నాతో అన్నాడు…. అతన్ని గద్దించి, ఎవరితోనూ చెప్పవద్దని చెప్పి, షాట్ తీయమని చెప్పాను. అంతా సరదాగా గడిచిపోయింది” అన్నారు.

1956లో వాళ్ళు తల్లిదండ్రులయ్యారు, వారికి సునీల్ ఆనంద్ జన్మించాడు. ఆ తరువాత దేవిన అనే పాప కూడా పుట్టింది.

దేవ్ ఆనంద్‌కి ఎంతో మంది మహిళలతో సంబంధాలున్నాయని పుకార్లు వినిపించినా, ఆయన మోనాతోనే దాదాపు 50 దశాబ్దాలు కలిసున్నారు. 3 డిసెంబరు 2011 ఆయన గుండెపోటుతో మరణించారు. ‘నౌ దో గ్యారాహ్’ (1957) చిత్రం తర్వాత కల్పనా కార్తీక్ సినిమాలు విరమించుకున్నారు. క్రమంగా చిత్రపరిశ్రమకి దూరం అయ్యారు. తన భర్త, నటుడు దేవ్ ఆనంద్‌తో కలిసి ఉన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ… ఓ క్షణం ఆగి… “దేవ్ బాగా సరదా వ్యక్తి. ఓ నటుడిగా ఆయనది విశిష్టమైన శైలి. అద్భుతంగా నటిస్తూ, తన అంతరంగాన్ని ఆవిష్కరించేవారు. దేవ్‍వి ‘నవ్వే కళ్ళు’ అని చేతన్ గారు చెప్పిన మాటలు ఎంతో నిజం.” అన్నారు. తనని ఆర్క్ లైట్లు ఇక ఏమాత్రం ఆకర్షించడం లేదు, అయినా జీవితంలో ముందుకుసాగుతూనే ఉన్నారు కల్పనా. “ఏ బాధా, బెంగా లేకుండా జీవితాన్ని గడపడం అనుభవాల ద్వారా నేర్చుకున్నాను. దైవం నాకు ప్రసాదించిన వాటితో నేను చాలా తృప్తిగా ఉన్నాను.” అన్నారామె.

ఓ తల్లిగా, నానమ్మగా కల్పనకి తన బిడ్డలు సునీల్, దేవిన అన్నా; మనుమరాలు ‘గీనా’ అన్నా ప్రాణం.  “వాళ్ళే నా ప్రాణం! నాకు మా బావాగారి పెద్దబ్బాయి కుంకీ అన్నా చాలా ఇష్టం.” అన్నారు.

దేవ్ ఆనంద్ గతించిన తర్వాత జీవితం ఎలా ఉందనే ప్రశ్నకి జవాబిస్తూ – “ఆయన మంచి భర్త, గొప్ప తండ్రి. ఆయన పోయాకా, మాకు ఎడబాటు కలిగిందని జనాలు భావిస్తారు. కానీ అది నిజం కాదు. దేవ్ ఈనాటికీ నా హృదయంలో ఉన్నారు. చిరునవ్వు నవ్వుతూ నన్ను నడిపిస్తున్నారు. ఆయన లేరంటే నేను నమ్మలేను. నాకైతే ఆయన ఎప్పటికీ మావారే! టాక్సీ డ్రైవర్ (1954) సినిమా సెట్స్‌పై అర్ధరాత్రి నన్ను పెళ్ళి చేసుకున్న దేవ్ ఆనందే.” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here