అలనాటి అపురూపాలు-39

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాaల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అద్భుతమైన కళా దర్శకుడు ఎస్. కృష్ణారావు:

ప్రసిద్ధ కళా దర్శకుడు ఎస్. కృష్ణారావు గారిది స్ఫూర్తిదాయక జీవితం. కళ పట్ల చిన్నతనం నుంచి ఆసక్తి పెంచుకుని, ఆ రంగంలో ఉన్నత స్థానానికి చేరిన ఆయన కృషి ఆదర్శప్రాయం.

ఎస్. కృష్ణారావు ఆంధ్రప్రదేశ్‍ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు. ప్రముఖ సినీనటులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఈయనకు బాల్య స్నేహితుడు. నిమ్మకూరులో రెండవ తరగతి వరకూ చదువుకుని, ఆ పైన స్కూల్ ఫైనల్ వరకు చదివేందుకు పామర్రులో చేరారు. కానీ అది మధ్యలో వదిలేసి, బందరు వెళ్ళి స్కూల్ ఫైనల్ పూర్తి చేశారు. ఆయనకి మంచి మార్కులు వచ్చి పాసవుతారంటే ఆ రోజుల్లో ఎవరూ నమ్మేవారు కాదు. ఎందుకంటే తరచుగా బడి ఎగ్గొట్టి తన ఇష్టం వచ్చినట్టు నడుచుకునేవారట ఆయన! అయినప్పటికీ మంచి మార్కులు సాధించి, పాసయ్యారు. భవిష్యత్తులో ఆయన సినీరంగంలో ఓ గొప్ప కళా దర్శకుడు అవుతారని ఎవరూ ఊహించలేదు ఆనాడు. ఇది ఆయన జీవనయానం కథ.

బాల్యంలో ఈ చిన్నారి ఓ కల కన్నారట. ఆ కలలో ఓ అందమైన దృశ్యాన్ని చూశారు. తీరా మేల్కొన్నాక అదొక కల అని గ్రహించారు. ఓ పేపర్, పెన్సిల్ తీసుకుని తనకి కనిపించిన ఆ అందమైన దృశ్యాన్ని చిత్రీకరించాలనుకున్నారు. ఆయన గీసిన చిత్రం కలలో కనిపించిన దృశ్యంలా రాలేదట. ఆ కాగితాన్ని నలిపి పడేసారట. చిత్రలేఖనంలో తనకి శిక్షణ అవసరమని ఆయన గ్రహించారు. ఆ సమయంలోనే ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణా పత్రిక ముఖచిత్రంగా చిత్రించిన బొమ్మ ఆయనను ఆకట్టుకుంది. కూర్చుని దాన్ని మరింత పెద్ద పరిమాణంలో చిత్రించడానికి ప్రయత్నించి సఫలమయ్యారు. బడిలో ఆయనకి మునిమాణిక్యం నరసింహారావు గారు ఉపాధ్యాయులు. ఈ చిత్రాన్ని ఆయన చూసి మెచ్చుకుని, మరింత పెద్ద పరిమాణంలో గీసి ఇస్తే, తన ఇంట్లో వేలాడదీసుకుంటానని అన్నారు. సరేనని మరో పెద్ద చిత్రం గీసిచ్చారు కృష్ణారావు. ఆశ్చర్యకరంగా ఆ చిత్రానికి స్థానిక కళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి లభించింది. దానితో తాను చక్కని బొమ్మలు గీయగలననే ఆత్మవిశ్వాసం ఆయనలో కలిగింది. అందుకని స్కూల్ ఫైనల్ పూర్తయిన తర్వాత ఏదైనా ఆర్ట్ స్కూల్‌లో చేరాలనుకున్నారు. మంచి ఆర్ట్ స్కూళ్ళ గురించి విచారణ జరుపుతుండగా, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ నిర్వహించే శాంతినికేతన్ గురించి తెలిసింది. తర్వాత జరిపిన భోగట్టాల వలన గతంలో శాంతినికేతన్‍లో ఎనిమిదేళ్ళు పని చేసిన నర్రా వెంకటరత్నం గారితో పరిచయం కలిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వచ్చేవారికి శాంతినికేతన్‍లో రెండే సీట్లు కేటాయించారని, అక్కడ సీటు సంపాదించడం కష్టమని వెంకటరత్నం చెప్పినా, కృష్ణారావు పట్టు సడలించలేదు. ఎలాగైనా అక్కడ చేరాలని నిర్ణయించుకున్నారు. చివరగా, మద్రాసు వెళ్ళి మంత్రి బెజవాడ గోపాలరెడ్డి గారిని కలిసి రికమండేషన్ లెటర్ తీసుకుంటే ఏమైనా అవకాశం ఉండచ్చని వెంకటరత్నం అన్నారట. వెంటనే ఇంట్లో పెద్దల నుంచి 15 రూపాయలు అడిగి తీసుకుని, మద్రాసు బయల్దేరారట. ట్రామ్‌లు, కార్లతో హడావిడిగా ఉన్న మద్రాసు నగరం ఆయనకి భీతి కల్గించలేకపోయింది. పట్టుదలతో మంత్రిగారిని కలిసేందుకు ప్రయత్నించారు. చివరకు మంత్రిగారు కాస్మోపాలిటన్ క్లబ్‍లో ఉన్నారని తెలుసుకుని, వెళ్ళి కలిసి తన కోరికని వెల్లడించారట. ఆ యువకుడి ధైర్యానికి, పట్టుదలకి ముచ్చటపడిన మంత్రిగారు – ముందుగా కలకత్తాలో ఏదైనా కాలేజీలో చేరి, ఆ తరువాత శాంతినికేతన్‍లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు.

తన కుటుంబంలోని వారికి ఈ సలహా నచ్చకపోయినా, కృష్ణారావు కలకత్తా వెళ్ళి అక్కడ ఒక కాలేజీలో చేరారు. ఆ తర్వాత ఏడాదిన్నరలో ఆయనకి శాంతినికేతన్‍లో సీటు దొరికింది. అక్కడ ఆయన ఆరున్నర ఏళ్ళ పాటు శిక్షణ కొనసాగించి డిప్లొమా పొందారు. పెయింటింగ్ ఆయన ప్రధాన సబ్జెక్ట్ అయినా, శిల్పాలు చెక్కడం, కొయ్య శిల్పాలు చెక్కడం, స్కెచింగ్ వంటి వాటిలో కూడా శిక్షణ పొందారు. ఆ తరువాత ఈ రంగంలో మలిదశ శిక్షణ జపాన్ దేశంలో పొందేందుకు ఆయనకు స్కాలర్‌షిప్ కూడా లభించింది. అయితే ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. ఆయనకీ ఆసక్తి లేక, స్కాలర్‍షిప్ వదిలేసుకున్నారు. ఇక ఉద్యోగం చేయాలనుకున్నారు. ఆయన చదివిన డిప్లోమా వల్ల ఊటీలో ఓ డ్రాయింగ్ టీచర్ ఉద్యోగం దొరికింది. కానీ ఆయన తన మనసు మార్చుకుని సినిమాలలో చేరాలనుకున్నారు. రైల్లో మద్రాసు చేరి, నేరుగా తన బాల్య స్నేహితుడు ఎన్.టి.ఆర్ వద్దకు వెళ్ళారు. సినిమాలలో కళా దర్శకత్వం అంటే ఏమిటో ఆయనకి ఏమాత్రం తెలియదు, అయినా ఆ విభాగంలో పని చేయాలనుకున్నారు. ఎన్.టి.ఆర్.కి తన కోరిక వెల్లడించారు. మిత్రునికి వీలైనంత సాయం చేస్తానన్నారు ఎన్.టి.ఆర్. ఆయనని కళా దర్శకుడు శేఖర్ వద్దకు తీసుకెళ్ళారు. కృష్ణారావు చిత్రాలు చూసి మెచ్చిన శేఖర్ – విజయ వారి బి. నాగిరెడ్డి గారిని కలవమని, తానెవరినీ ఎవరికీ రికమెండ్ చేయనని చెప్పడంతో, ఎన్.టి.ఆర్ ఆయనను బి. నాగిరెడ్డి గారి వద్దకు తీసుకువెళ్ళారు. నాగిరెడ్డి గారికి కృష్ణారావు నచ్చారు, కానీ కళా దర్శకత్వం సంగతి తనకేం తెలియదని చెప్పారు (నేను చాలా మందికి చెబుతుంటాను – బి. నాగిరెడ్డి గారు ఓ చక్కని వ్యాపారవేత్త. ఆయనకి సినిమాల గురించి, ముఖ్యంగా కళ గురించి చాలా తక్కువగా తెలుసు. విజయ బ్యానర్‌కి సృజనాత్మక వెన్నెముక చక్రపాణిగారు. ఆయన లేకపోతే, విజయ బ్యానర్ లేదు. విచారకరమైన విషయం ఏంటంటే చక్రపాణికి ఏ ప్రతిష్ఠాత్మకమైన గుర్తింపు రాలేదు, నాగిరెడ్డికి మాత్రం ఫాల్కే అవార్డు లభించింది. ఇదే జీవితం). తనకి జీతం అక్కర్లేదని, స్టూడియోలో ఉంటూ అన్నీ గమనిస్తాననీ నాగిరెడ్డిని కోరారు కృష్ణారావు. అందుకు అంగీకరించారు నాగిరెడ్డి. ఆ సమయంలో వాహినీ స్టూడియోలో ‘మల్లీశ్వరి’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అక్కడ వేసిన నర్తనశాల సెట్టింగ్స్ చూసి కృష్ణారావు అబ్బురపడ్డారు. అత్యంత సజీవంగా ఉన్నట్టు తోచిన బొమ్మలు ‘క్లే కాత్’ తో గాని, పేపర్‍తో గాని చేసినవి! ఆ రోజు నుంచి ఆయన కళా దర్శకుడు గోఖలేతో కూర్చుని ఆయన పనిని గమనిస్తూ ఉండేవారు. ఇలా రోజూ స్టూడియోకి వెళ్ళడం, అన్నిటినీ గమనించడం పది నెలల పాటు సాగింది (అటువంటి బహిరంగ వాతావరణం ఇప్పుడు ఉంటే ఎంత బాగుండు? పైరసీకి భయపడి బాహుబలి నిర్మాతల వంటి వారు అన్నిటినీ రహస్యంగా ఉంచి, బయటివారికి ప్రవేశం లేకుండా చేశారు).

అప్పట్లో తాతినేని ప్రకాశ రావు, ఎన్.టి.ఆర్ కలిసి ఉండేవారు. అప్పట్లో ఆయన సహాయ దర్శకుడిగా పనిచేస్తుండేవారు. ఆయనకి కృష్ణారావు నచ్చారు. తనకి దర్శకుడిగా అవకాశం లభిస్తే, తన సినిమాలకి ఆర్ట్ డైరక్టర్‍గా పని చేయమని కృష్ణారావుని కోరారు. వెంటనే అంగీకరించారు కృష్ణారావు. ఆ విధంగా ఆర్ట్ డైరక్టర్‍గా తొలిసారి ‘పల్లెటూరు’ (1952) సినిమాకి పనిచేశారు. తాతినేని ప్రకాశ రావుకి దర్శకుడిగా తొలి చిత్రం అది. ఆ చిత్రాన్ని నరసు స్టూడియోలో చిత్రీకరించారు. అక్కడ సుప్రసిద్ధ బెంగాలీ ఆర్ట్ డైరక్టర్ బీరేన్ నాగ్ ఉండేవారు. ఆయన తనకింద ఎక్కువగా బెంగాలీలనే పెట్టుకునేవారు. తన చక్కని నడవడికతో కృష్ణారావు బీరేన్ నాగ్‍కి దగ్గరై, కళా దర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. ‘పల్లెటూరు’ తర్వాత, ఆయన కళా దర్శకుడిగా ‘పిచ్చి పుల్లయ్య’, ‘నిరుపేదలు’ సినిమాలకు పనిచేశారు. ‘దొంగరాముడు’ చిత్రానికి కళా దర్శకుడిగా ఎంపికయ్యాక, ఆయన జీవితం మలుపు తిరిగింది. ఆయన సృజనాత్మకతని అందరూ గుర్తించారు. ఆయన కళా దర్శకత్వం నచ్చిన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు – ‘తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగు నీడలు’, సినిమాలకి అవకాశం ఇచ్చారు. ఎన్.టి.ఆర్. సొంత బ్యానర్ లోని ‘ఉమ్మడి కుటుంబం’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘వరకట్నం’, ‘తల్లా పెళ్ళామా’ వంటి చిత్రాలకు పనిచేశారు. ఇవి కాక, హిందీ చిత్రం ‘రామ్ అవుర్ శ్యామ్’కి కళా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. పైన చెప్పుకున్న సినిమాలలో ఏ పాటనైనా చూడండి, ఆయన కళా దర్శకత్వం అంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది.

సొంతంగా ఎదిగిన వ్యక్తిగా ఈయన జీవితం నలుగురికీ స్ఫూర్తిదాయకం. ఇటువంటి విజయగాథలను నేటి యువతరం చదవాలి, కష్టపడి పనిచేయడం, పట్టుదల విజయానికి ఎలా చేరుస్తాయో తెలుస్తుంది. ఈ వ్యాసం రాయడాన్ని నేనెంతగానో ఆస్వాదించాను.


స్టిల్ ఫోటోగ్రఫీలో ఘనాపాటి ‘మన’ సత్యం:

‘1/4, ఎల్డామ్స్ రోడ్, మద్రాస్’ అనే తన ఇంటి చిరునామాతో సినీరంగంలోని ఎందరికో చిరపరిచితులైన ముసునూరు సత్యనారాయణ మూర్తి అలియాస్ ‘మన’ సత్యం అలియాస్ ‘జై హింద్’ సత్యం గురించి తెలుసుకుందాం. సినిమా ప్రచారం కోసం ఆయన తీసిన స్టిల్స్ అందరినీ ఆకట్టుకునేవి. ఎప్పుడూ తెల్లగా ధగధగలాడే ఖద్దరు బట్టలలో ఉండేవారు. సినీరంగంలో నటులు అవ్వాలని వచ్చే ఔత్సాహికులందరూ – ఆయనతో ఫోటోలు తీయించుకోడానికి జైహింద్ స్టూడియోకి వరుస కట్టేవారు. ఆయన తీసిన ఫోటోలను నిర్మాణంలో ఉన్న చిత్రాల సాంకేతిక సిబ్బంది పరిశీలించి, ఔత్సాహికులను ఎంపిక చేసుకునేవారు. జైహింద్ సత్యం స్టిల్స్ ఉంటే, సినీరంగంలో దాదాపుగా ప్రవేశం దొరికినట్టే. ఆయన తీసిన నలుపు తెలుపు ఫోటోలు అసంఖ్యామైన కళాకారులను అందంగా చూపించాయి.

ఆయన 1922లో కృష్ణా జిల్లాలోని గన్నవరం తాలూకా ఆత్మకూరు గ్రామంలో జన్మించారు. ఆర్థిక సమస్యల కారణంగా 1936లో చదువు ఆపేసి, బెజవాడలో తన బాబాయి అడుసుమిల్లి బసవయ్య చౌదరి నడిపే ఫోటో స్టూడియోలో చేరారు. పారుపల్లి శేషయ్యగారు వీరి బంధువు. బెజవాడలో ఆయనకి సినిమా పంపిణీ ఆఫీసు ఉంది. సుప్రసిద్ధ దర్శకనిర్మాత గూడవల్లి రామబ్రహ్మంగారు బెజవాడ వచ్చినప్పుడల్లా శేషయ్యగారి వద్ద బస చేసేవారు. ఇంటి వద్ద నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుకి భోజనం క్యారియర్ తీసుకువెళ్ళడం సత్యం విధి.

ఒకనాడు గూడవల్లి సత్యంని పిలిచి, “ఒరే సత్యం, నిన్ను చూస్తుంటే అందంగా, చురుకుగా ఉన్నావు. నాతో మద్రాస్ వస్తావా రా?” అని అన్నారట. అది 1938. అప్పుడు ఆయనకి 16 ఏళ్ళు. ఉత్సాహంతో వెంటనే సరేనన్నారు. ఆయనకి అప్పుడు అయిదు రూపాయలు ఇచ్చారు. రెండున్నర రూపాయలు పెట్టి మద్రాస్ వెళ్ళే పూరి ప్యాసింజర్‌లో టికెట్ కొన్నారు. ప్రయాణంలో మరో అర్ధ రూపాయి ఖర్చు చేశారు. మిగిలిన రెండు రూపాయలతో మద్రాసులో లాయడ్స్ రోడ్‌లోని సారథి ఫిల్మ్స్ ఆఫీస్‌కి వెళ్ళారు.  అప్పట్లో ఆయన అమాయకత్వం అది. మద్రాసులో ట్రామ్‍లు ఎక్కడ ఆగుతాయో సరిగా తెలియక, వాటి వెనుక పరిగెత్తేవారుట. అక్కడ ఆయన ఆఫీస్ బోయ్‌గా చేరి, తరువాత ఫోటోగ్రఫీ డిపార్ట్‌మెంటులో అసిస్టెంట్ అయ్యారు. ఆ రోజుల్లో అక్కడ అహ్మద్ గారు స్టిల్ ఫోటోగ్రాఫర్‍గా ఉండేవారు. ఒకరోజు ఆయన రాలేదు. గూడవల్లి గారు నటి కాంచనమాల స్టిల్స్‌ని తీయమని సత్యంకి చెప్పారు. సత్యం తీసిన స్టిల్స్ నచ్చి, ఆమె అన్ని స్టిల్స్ సత్యం చేతే తీయించారు. ఆరోజు నుంచి ఆయనని అందరూ ‘స్టిల్స్’ సత్యం అని పిలవసాగారు. సారథి ఫిల్మ్స్ వారి – మాలపిల్ల, రైతు బిడ్డ, ఇల్లాలు, అపవాదు, పత్ని – చిత్రాలకు వరుసగా స్టిల్ ఫోటోగ్రాఫర్‍గా పనిచేశారు. అప్పట్లో ఆయనకు భోజనం పెట్టి, నెలకు ఇరవై రూపాయలు జీతంగా ఇచ్చేవారు. ఇలా వారి వద్ద 1942 వరకు పని చేశారు. తర్వాత నెలకు నలభై రూపాయల జీతానికి నటుడి నాగయ్య బృందంలో చేరారు. ఆయన ఫోటోగ్రఫీలో ఎటువంటి శిక్షణా తీసుకోకపోయినా, అద్భుతమైన సహజ నైపుణ్యంతో చౌకైన తన 60 రూపాయల కెమెరాతో గొప్ప స్టిల్స్ తీసేవారు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో అసంఖ్యాకమైన ఔత్సాహిక నటీనటుల ఫోటోలు తీశారాయన! చిరకాలం నిలిచే ఓ ఫోటో లైబ్రరీ రూపొందించడానికి సరిపోయేన్ని ఫోటోలవి! ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల తొలి స్టిల్ ఫోటోలు తీసింది సత్యమే. ఘంటసాల బలరామయ్యతో పని చేస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు మొదటి మేకప్ స్టిల్ తీశారాయన. ‘ఈ యువకుడు ఏనాటికైనా తనకంటూ గొప్ప పేరు సంపాదిస్తాడు’ అని అనుకున్నారట. ఆ రోజుల్లో ఆయన తన స్టిల్స్‌కి 20 రూపాయలు వసూలు చేసేవారు. ఎన్.టి.ఆర్‌కి తొలిసారిగా మేకప్ వేసినప్పటి స్టిల్స్ తీసిన సత్యం, వాటిని చూసి ముగ్ధులై, ఆ స్టిల్స్ తీయడం తన అదృష్టమని భావించి 20 రూపాయలు వెనక్కిచ్చేసారట. ఎన్.టి.ఆర్‌. సినీరంగంలో అసామాన్యమైన కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారని ఆయన మనసుకి తోచింది. మేకప్ స్టిల్స్‌తో అద్భుతాలు చేసేడప్పుడు ఆయన మనసులో భావన ఎన్నడూ తప్పు పోయేది కాదు. ఒకరోజు తనతో ఫోటోలు తీయించుకోడానికి వచ్చిన ఓ యువతి సినీరంగంలో రాణిస్తుందని ఆయనకి అనిపించింది. కానీ ప్రసిద్ధ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు – తెలుగు సరిగా మాట్లాడలేకపోతోందని ఆమెని తీసుకోలేదు. కానీ తర్వాతి కాలంలో ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో తనకంటూ గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆమే జయలలిత!

అలాగే భానుమతి, అంజలీదేవిలను మేకప్‌తో తొలి స్టిల్స్ తీస్తూ, వాళ్ళిద్దరూ అద్భుతంగా రాణిస్తారని అనుకున్నారు. నటుడు రేలంగి ఆయనకు ఆప్తమిత్రుడు. ఒక రోజు తన స్టిల్స్ తీయవల్సిందిగా రేలంగి అడిగారు. “నువ్వు హీరోలకు మాత్రమే స్టిల్స్ తీస్తావా? నాది కూడా తియ్” అన్నారట. రేలంగి ముఖం హాస్యానికే బావుంటుందని చెప్పారట సత్యం. తానెంతో ఒత్తిడి చేసి, తీయించుకున్న స్టిల్స్ చూసి,  తను హీరోగా నప్పను అని రేలంగి అంగీకరించారట. అయినా ఆయనలో 20% హీరో లక్షణాలు ఉన్నాయని అన్నారట సత్యం. నాగభూషణం తొలిసారి మేకప్ వేసుకుని స్టిల్ కోసం వస్తే, సినీరంగానికి చక్కని విలన్ దొరికాడని అనుకున్నారట సత్యం. ఎందుకంటే నాగభూషణంలో ప్రతినాయకుని ఛాయలు అధికంగా ఉన్నాయట. తాను స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా మారాకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదాయనకి.  సినీరంగంలో ఆయన ఐదు దశాబ్దాలు పనిచేశారు… అనంతమైన కీర్తి ప్రతిష్ఠలు సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here