అలనాటి అపురూపాలు-40

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటి చంద్రకళ:

అందగత్తెలూ, ప్రతిభామూర్తులు అయిన తోటి నటీమణుల మధ్య రాణిస్తూ, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నటీమణుల్లో చంద్రకళ ఒకరు.

చంద్రకళ కుటుంబీకులు కన్నడిగులు. వారి పూర్వీకులు ఉడిపికి చెందినవారు. కానీ ఆమె ఆంధ్రప్రాంతంలో వాల్తేరులో 25 డిసెంబరు 1951 నాడు జన్మించారు. ఎం.ఎస్. నాయక్, వనమాలి నాయక్ ఆమె తల్లిదండ్రులు. ఎం.ఎస్. నాయక కన్నడంలో ప్రసిద్ధ దర్శకనిర్మాత. రెండేళ్ళ వయసులోనే నాట్యం పట్ల అభిరుచి కనబరచడంతో, చంద్రకళను ప్రసిద్ధ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ వద్దకు శిక్షణకు పంపారు ఆమె తల్లిదండ్రులు. ఐదేళ్ళ వయసు నుంచే ఆమె వివిధ సందర్భాలలో వేదికలపై నృత్యాలు చేసి బహుమతులు పొందారు. తనకి ఏడేళ్ళ వయసులో, గుంటూరులో హైకోర్టు ప్రారంభోత్సవ సభలో నృత్యం చేసి అక్కడి హాజరైన అందరి ప్రశంసలు పొందారు. ఆ తర్వాత ఆమె ప్రపంచ ప్రసిద్ధ నర్తకి బాలసరస్వతి వద్ద శిష్యరికం చేసి, 1959లో పన్నెండేళ్ళ వయసులో అరంగేట్రం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత నృత్యకళాకారుడు ఉదయ్ శంకర్ ఆ సభకి ముఖ్య అతిథిగా వచ్చి, చంద్రకళను ఆశీర్వదించారు. ఇలా ఉండగా ఈ యువ నృత్యకళాకారిణికి సినిమా అవకాశాలు రాసాగాయి. ‘రామాంజనేయ యుద్ధం’లో యయాతి కూతురిగా నటించారు. ఆ తర్వాత 1962లో ‘సతీ సుకన్య’ చిత్రంలో బాల యముడిగా నటించారు. 1961లో 10 ఏళ్ళ వయసులో హిందీ సినిమా ‘షోలా అవుర్ షబ్నమ్’లో చిన్నప్పటి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో వాళ్ళ నాన్నగారు భాగస్వామి కావడంతో ఈ హిందీ సినిమాలో నటించారు. ఆమె, చిన్నప్పటి హీరో పాత్రధారి రఫీ, లతా పాడిన నేపథ్య గీతం ‘జీత్ హీ లేంగే హమ్ తుమ్’ అనే పాటలో అభినయిస్తారు. అది సినిమా టైటిల్ సాంగ్. (యూట్యూబ్‌లో ఈ పాట చూడవచ్చు https://www.youtube.com/watch?v=6opsErHSZtY ).

1962లో కన్నడ చిత్రం ‘జేను గూడు’ ద్వారా బేబీ చంద్రకళ కుమారి చంద్రకళగా మారారు. తెలుగు, తమిళం భాషలలో ‘కుల దైవం’ పేరుతో వచ్చిన సినిమాకి అది కన్నడ రీమేక్. తర్వాత 1965లో దోనేపూడి కృష్ణమూర్తి ఆమెకు ‘విశాల హృదయాలు’ చిత్రంలో ద్వితీయ కథానాయిక పాత్రనిచ్చారు. అక్కడ నుంచి చంద్రకళ వెనుదిరిగి చూసుకోలేదు. ఎకనామిక్స్, అడ్వాన్స్‌డ్ ఇంగ్లీష్, హిస్టరీ సబ్జెక్టులతో ఆమె పి.యు.సి. పూర్తి చేశారు. తర్వాత డిగ్రీ కాలేజీలో బి.ఎ.లో చేరారు. కానీ వరుసగా సినిమా అవకాశాలు రావడంతో చదువు కొనసాగించలేకపోయారు. గ్రెగరీ పెక్, ‘కమ్ సెప్టెంబర్’ ద్వారా ప్రసిద్ధులైన శాండ్రా డీ, వైజయంతీమాల, మీనాకుమారీ, సావిత్రి ఆమె అభిమాన నటీనటులు. ట్విస్ట్, రాక్ అండ్ రోల్ వంటి పాశ్చ్యాత్య నృత్యాలు ఆమెకి నచ్చేవి కావు.

ఆమె నటించిన సినిమాల జాబితాని వికీపీడియాలో (https://en.wikipedia.org/wiki/Chandrakala) చూడవచ్చు.

చంద్రకళ హఠాత్తుగా సినిమాల నుంచి విరమించుకున్నారు. హార్స్ బ్రీడర్, ఎన్నో రేసుల విజేత అయిన డా. జావేద్ ఘటాలాని వివాహమాడారు. పెళ్ళి తర్వాత ఆమె సినిమాలో నటించలేదు. ఇంటికే పరిమితమై, ఏ సినీ సభలకి గాని, బహిరంగ సభలకి గాని హాజరు కాలేదు. ఆమె ఈ విధంగా అదృశ్యమవడం ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది.

అయితే చాలా ఏళ్ళ తర్వాత ఆమె కూతురు, ప్రస్తుతం రచయిత్రి, పబ్లిసిస్ట్ అయిన రేష్మా ఘటాలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా చంద్రకళ గురించి మరికొన్ని వివరాలు తెలిసాయి.

తమ తల్లి జావేద్ ఘటాలాని వివాహం చేసుకోవడం వల్ల తమ ఇంటిపేరు ఘటాలా అయిందనీ, తన తండ్రి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అనీ, అందుకని తాము చెన్నైలో నివసించామని ఆమె తెలిపారు. పెళ్ళి తర్వాత అమ్మ సినిమాలు మానేసిందనీ, సినిమా వాళ్ళెవరూ తమ ఇంటికీ రాలేదనీ, అమ్మ కూడా ఏ సినిమా ఫంక్షన్‍కి వెళ్ళేది కాదని చెప్పారు. అయితే ఆమె రోజూ రెండు గంటల పాటు నృత్యం సాధన చేసేదని చెప్పారు. అందువల్లే తనకి కూడా నాట్యమంటే ఆసక్తి కలిగి భరతనాట్యం నేర్చుకున్నానని రేష్మా తెలిపారు. తానంటే అమ్మకి ఎంతో ఇష్టమని, తాను అమ్మ కంటిపాపననీ, రోజూ బడి నుంచి రాగానే అమ్మ తనని హత్తుకునేదని రేష్మా చెప్పారు. అమ్మ నటించిన ‘నోము’, ‘దసరా బుల్లోడు’, ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాలంటే తనకిష్టమని ఆమె అన్నారు. తనకి పుస్తకాలు చదవడమన్నా, వివిధ భాషల చిత్రాలు చూడడమన్నా ఇష్టమని తెలిపారు. రేష్మా చిన్నప్పుడు బడిలో ఉండగా వ్యాసాలు రాసేవారు. పెద్దయ్యాక మాస్ కమ్యూనికేషన్స్ చదివారు. కాలేజ్ మేగజైన్‍లో ప్రపంచ సమస్యలపైనా, పరిష్కారాలపైన వ్యాసాలు రాశారు. అవెంతో ఆదరణ పొందాయి. ఎంబిఎ పూర్తి చేసాకా, సినిమాలలో రచనా విభాగం చేరారు. నాగచైత్యన్య, సమంత నటించిన ‘ఏ మాయ చేశావే’కీ, నాని, సమంత నటించిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’కీ గౌతమ్ మీనన్‍తో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. సినిమాల పబ్లిసిటీకి ఆమెకి ఒక స్వంత సంస్థ ఉంది.

జావేద్ ఘటాలా కుటుంబం సుసంపన్నమైన కుటుంబం. అలానాటి మద్రాసులో వారికి ఎంతో మందితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. డా. జావేది డాక్టొరేట్ పొందారు, అయితే వైద్యంలో కాదు. అయన ప్రఖ్యాత అశ్వ శిక్షకులు. మద్రాస్ లోని జింఖానా క్లబ్ వద్ద, రేస్ క్లబ్ వద్దా తరచూ కనపడేవారు. ఆయన సోదరుడు ఇర్ఫాన్ కూడా ఒక శిక్షకుడే. వారి తండ్రిగారు అడ్వొకేట్. వారిది నుంగంబాక్కంలో మర్యాదస్తుల కుటుంబం. ‘కపిల్ దేవ్’ అనే తెర పేరుతో ఇర్ఫాన్ తమిళ సినిమాలలో నటించారు కూడా. వారికి జునైద్ అనే మరో సోదరుడు ఉన్నారు, ఆయన పీడియాట్రీషియన్. ఈ కుటుంబానికీ, చంద్రకళకీ ఎలా లంకె కుదిరిందో ఎవరికీ తెలియదు. అయితే యూట్యూబ్ ‘గాసిప్ మాంగర్స్’ మాత్రం తమకు తోచినట్టుగా పుకార్లు పుట్టించారు – చంద్రకళ ఓ విదేశీయుడిని పెళ్ళి చేసుకొని జీవితం నాశనం చేసుకుందంటూ రాశారు.

ఇక్కడ చంద్రకళ చిత్రాలతో పాటు మద్రాసులో జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రాలు ఇస్తున్నాను. ఈ ఫెస్టివల్ దక్షిణ భారతదేశంలోని మద్రాసులో తొలిసారిగా జరిగింది.  ఈ అంతర్జాతీయ సినీ ఉత్సవం తొలిసారిగా 1932లో వెనిస్‍లో జరిగింది. 20 ఏళ్ళ తర్వాత 1952లో బాంబేలో జరిగింది. ఈ ఉత్సవాన్నే 1978 లో అప్పటి మద్రాసు నగరంలో తొలిసారిగా సగర్వంగా నిర్వహించారు. నటీమణులు చంద్రకళ, సిమీ గరేవాల్ ఈ వేడుకలకి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. జెమీనీ గణేశన్, చంద్రకళలు విదేశీ ప్రతినిధుల మధ్య కనిపించారు.

చంద్రకళ 48 ఏళ్ళ వయసులో కేన్సర్ వల్ల 21 జూన్ 1999 నాడు అకాల మరణం చెందారు.


తెలుగువారి ‘అప్పు’ స్వరకర్త పుహళేంది:

తెలుగు సంగీతాభిమానులకు చిరపరిచితమైన పుహళేంది (27 సెప్టెంబరు 1929 – 27 ఫిబ్రవరి 2005) అసలు పేరు వేలప్పన్ నాయర్ (కె.వి. మహదేవన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలకు, టైటిల్స్‌లో సహాయ సంగీత దర్శకుడిగా పుహళేంది పేరు ఉంటుంది). మలయాళం, తమిళం, తెలుగు సినిమాలకు స్వరకర్తగా పనిచేశారు. ఆయనకి ఇష్టమైన వారంతా ఆయనను ఆప్యాయంగా ‘అప్పు’ అని పిలుచుకునేవారు. తెలుగులో అప్పు అంటే ఋణం. తెలుగులో అనేక సినిమాలకి పని చేసినందువల్ల, తాను తెలుగువారికెంతో ఋణపడి ఉన్నానని ఆయన చమత్కరించేవారు.

పుహళేంది తిరువనంతపురంలో టి.ఎన్.కేశవ పిళ్ళయ్, జానకీ అమ్మ దంపతులకు 27 సెప్టెంబరు 1929 నాడు జన్మించారు. ఆయన తండ్రి ఆ ఊర్లోని ‘అయ్యప్ప విలాస్ హోటల్’ యజమాని. ఆయన సంగీతప్రియులు, రంగస్థల నటులు కూడా.  తండ్రి నుంచి పుహళేందికి నాటకాలన్నా, సంగీతమన్నా మక్కువ కలిగింది. ఆయన అయిదో తరగతి వరకు వి.ఎం. స్కూల్‍లో చదివారు. అయితే ఆయనకు చదువులపై కన్నా, సంగీతంపైనే ఆసక్తి ఉండేది. కొడుకు ఆసక్తిని గమనించిన వారి తండ్రి చదువు విషయంలో ఒత్తిడి చేయలేదు. బదులుగా కొడుకు ఆసక్తిని గ్రహించి, ఆసక్తి ఉన్న సంగీతంలోనే కొడుకుని ప్రోత్సాహించారు. సుప్రసిద్ధ సంగీత కళాకారిణి కె.బి.సుందరం బాయి వారి ఊరికి వచ్చినప్పుడు ఆయన తన కుమారుడిని తీసుకుని వెళ్ళి ఆవిడని కలిసారు. ఆవిడ పుహళేంది లోని బాలమేధావిని వెంటనే గుర్తించి, సంగీతంలో అద్భుతమైన కెరీర్ ఉంటుందని ఆశీర్వదించారు.

పుహళేంది తన 11వ ఏట రంగస్థలంపై అడుగుపెట్టారు. నాగర్‍కోయిల్‍లో టి. పొన్నుస్వామి పిళ్ళయ్ నడిపే ‘బాల గాన సభ’లో చేరారు. ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకోగా, రంగస్థలంపై ఆసక్తి ఉన్న వ్యక్తులు సంస్థ పేరును ‘మంగళం గాన సభ’గా మార్చి సంస్థ కొనసాగేలా చూశారు. పుహళేంది లవకుశ, రామాయణం, కంది రాజా వంటి నాటకాలలో నటించి తన సంగీతానికీ, గానానికి ప్రశంసలు పొందారు. మరో ఇరవై ఏళ్ళ తర్వాత ఇదే సంస్థ తన పేరును ‘ఎన్.ఎస్.కె. నాటక సభ’గా మార్చుకుని, తమిళ ఆర్టిస్ట్ ఎన్.ఎస్.కృష్ణన్ ప్రాపకం పొందింది. కృష్ణన్ జైలుకి వెళ్ళగా, మళ్ళీ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుని, చివరికి మూతపడింది. అప్పుడు పుహళేంది శ్రీ శక్తి కృష్ణ స్వామి ఆధ్వర్యంలోని ‘శక్తి నాటక సభ’లో చేరారు. ఇది జరిగినది 1945లో. హైదరాబాద్‍లో పర్యటిస్తుండగా, స్వర్గసీమ చిత్రానికి భానుమతి పాడిన ‘ఓ పావురమా’ పాట ఆయన విన్నారు. ఆ పాట ఆయనకి నచ్చి పదే పదే పాడుతుండగా – కృష్ణ స్వామి విని – మెచ్చుకుని – అటువంటి బాణీలోనే తమిళంలో పాట కట్టమని అడిగారు. పుహళేంది కట్టిన బాణీని ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా తమిళ నాటకం ‘కవియిన్ కనవు’లో ఒక సన్నివేశం కూడా కల్పించారట. ఆ విధంగా పుహళేంది ‘ఓహో వాడుదమ్మా’ అనే పాటని స్వరపర్చగా, నాటకంలో బిచ్చగత్తె పాత్ర ఆ పాటని పాడారు. నాటకం, ఆ పాటా రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ పాట కోసమే ఆ సన్నివేశాన్ని మళ్ళీ మళ్ళీ ప్రదర్శించమని కోరేవారుట ప్రేక్షకులు. ఈ పాట గురించి విన్న బెంగుళూరుకి చెందిన గుబ్బి వీరన్న డ్రామా కంపెనీ వారు, బెంగుళూరు వచ్చి ఈ నాటకాన్ని ప్రదర్శించమని పుహళేందిని కోరారు. ఈ నాటకం ఎంత హిట్ అయ్యిందంటే పుహళేంది మూడు నెలల పాటు బెంగుళూరులోనే ఉండిపోయి, ప్రతీ రోజూ ఈ నాటకం ప్రదర్శించవలసి వచ్చేంత! అయితే, పుహళేంది టీనేజ్‌లోకి ప్రవేశించి స్వరంలో మార్పులు రావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటిదాక మధురంగా, మెత్తగా ఉన్న ఆయన స్వరం ముతకగా, కరకుగా మారింది. దాంతో చాలామంది ఆయనను హేళన చేశారు. దాంతో ఆయన పాటలు పాడడం మానేసి కుట్టుపని, మేకప్ నేర్చుకోడంపై దృష్టి సారించారు. అదే సమయంలో హార్మోనియం వాయించటంలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవటం మొదలుపెట్టారు. సుప్రసిద్ధ రచయిత ఎం.పి.శివం (పరమేశ్వరన్ నాయర్) పుహళేందికి దూరపు బంధువు. ఆయన పుహళేందికి హార్మోనియం నేర్పారు. ఆ రోజుల్లో శివం అప్పుడప్పుడూ ‘బాల గాన సభ’లో హార్మోనియం వాయించేవారు. ఆ విధంగా ఆయన పుహళేందికి తొలి గురువు అయ్యారు. ఇక్కడ కూడా పుహళేంది హేళనలను ఎదుర్కోవలసి వచ్చింది. హార్మోనియం నేర్చుకుంటుంటే అసూయాపరులు ఎకసెక్కం చేసేవారు – “భవిష్యత్తు సంగీత దర్శకుడు వచ్చాడ్రోయ్” అంటూ! ఆయన ముఖం మీదే అవహేళన చేసేవారు. చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళలో కొందరు సినీ పరిశ్రమలో ఉద్యోగాలకై వచ్చి, పుహళేందికి క్షమాపణలు చెప్పారట. ఇదంతా విధి ఆడే వింత లీల ఆయన తేలిగ్గా తీసుకున్నారట. ఈ విధంగా హార్మోనియం నేర్చుకుంటూ ఉండగా, ఆయన గురువు ఎం.పి. శివం గారు ‘తోషన్’ అనే తమిళ నాటకానికి సంగీతం సమకూర్చవలసి వచ్చింది. అప్పుడాయనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడంతో, పుహళేందిని సంగీతం కూర్చమన్నారట. ఎంతో సంతోషించిన పుహళేంది మిగతా పనిని పూర్తి చేశారట. ఆర్కెస్ట్రాలోని వయొలనిస్ట్‌కి పుహళేంది అస్సలు నచ్చలేదు. కేవలం అసూయతో, ఆయనకి సమస్యలు సృష్టించాలనుకున్నారు. వాళ్ళతో అప్పటికే తన గురువు స్వరపరిచిన ఒక పాటని పాడిస్తున్నారు పుహళేంది. ఆ పాటలోని రాగం నాటకురంజిలో పంచమం లేదని, అందువల్ల అది రవిచంద్రిక రాగం అవుతుందని వయోలనిస్ట్ వాదించారు. ఆయన చెప్పింది నిజమే, తన తప్పు గ్రహించిన శివం నాలుక కరుచుకున్నారు. అయితే తప్పు తనదేననీ, పంచమం చేర్చడం తాను మరిచిపోయానని చెప్పారు పుహళేంది. ఈ సంఘటనతో రాగాలను మరింత శ్రద్ధగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు పుహళేంది. జరిగినదంతా సంస్థ యజమాని శక్తి కృష్ణ స్వామికి తెలిసింది. ఆయన పుహళేందిని పిలిచి, ఇకపై తమ నాటకాలకు సంగీతం అందించాల్సిందిగా కోరారు. తన గురువు స్థానాన్ని తానెన్నడూ తీసుకోనని, ఆ అవకాశాన్ని తిరస్కరించారు పుహళేంది. ఆయన విలువలకి, సత్ప్రవర్తనకీ యజమాని మెచ్చుకున్నారు. ‘శక్తి నాటక సభ’లో వెళ్ళప్పన్ అనే గుమాస్తా ఉండేవారు. ఆయన ఒక ఆంగ్ల నవల ఆధారంగా, ‘నినైపుక్కల్’ అనే తమిళ క్రైస్తవ నాటకం రాశారు. ఆయన మధ్యలో వెళ్ళిపోగా, ఈ వేలప్పన్ (పుహళేంది) అసంపూర్తిగా ఉన్న నాటకాన్ని పూర్తి చేశారు. వెల్లూరులోని దిల్ కుష్ పార్కులో ఈ నాటకం ప్రదర్శితమవుతుండగా ఆయన ప్రముఖ తమిళ కవి పేరిట తన పేరును పుహళేందిగా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన చేసిన సృజనలన్నింటికీ పుహళేంది అనే చెప్పుకున్నారు. యాదృచ్ఛికమైన మరో విషయం ఏంటంటే, శివం గారి అబ్బాయి పేరు కూడా వెళ్ళప్పనే కావడం! ఈ నాటకానికి సంగీతం సమకూరుస్తుండగా అనుకోకుండా శివం గారు వెళ్ళారట. దాంతో ఒత్తిడికి గురైన పుహళేంది రిహార్సల్స్ రద్దు చేశారు. గురువుగారు తప్పుగా అర్థం చేసుకొని కోపగించారు. వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఓ తమిళ సామెత ఉదహరించారట. ఆ మాటలకి పుహళేంది మనసుకి బాగా గాయమైంది. అంతకుముందు కొన్నాళ్ళ క్రితం గురుపత్ని ఎంతో అభిమానంతో పుహళేందికి బంగారు ఉంగరం చేయించారట. అప్పట్లో దాని విలువ ఎనిమిది రూపాయలు. పుహళేంది ఆ ఉంగరాన్ని 18 రూపాయలకి అమ్మి, ఆవిడకి ఎనిమిది రూపాయలు తిరిగిచ్చేసి, మిగిలిన పది రూపాయలతో ఎవరికీ చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయారు. ఎవరికిందా పనిచేయకూడదని నిర్ణయించుకున్నారట. శాస్త్రీయ సంగీత గాయని సుబ్బలక్ష్మి అమ్మాళ్ గారింట ఆశ్రయం దొరికింది. ఆవిడ ఆయనను గొప్ప కళాకారుడు ఎన్.ఎస్.కృష్ణన్‌కి పరిచయం చేశారు. ఎన్.ఎస్.కె. గారికి పుహళేంది నచ్చడంతో, అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆ రోజుల్లో ట్రావెన్‌కోర్ సిస్టర్స్‌గా పేరు గాంచిన లలిత, పద్మినిల నృత్య ప్రదర్శనలను సి.ఆర్. రామమూర్తి ఆధ్వర్యంలోని ‘కళావర్తిని’ సంస్థ నిర్వహించేది. రామమూర్తికి పుహళేందితో పరిచయమై, ఆయన ప్రతిభ నచ్చింది. క్రమంగా, ఆ సోదరీమణుల నృత్యప్రదర్శనల పర్యవేక్షణకి తాను వెళ్ళలేనప్పుడు – పుహళేందిని పంపసాగారు. ఈక్రమంలో పుహళేందికి వారి తోబుట్టువులు మాది లక్ష్మితోనూ, సచ్చు తోనూ పరిచయం ఏర్పడింది. వాళ్ళే ఓ చక్కని అమ్మాయిని చూసి పుహళేంది వివాహం జరిపించారు. ఆ పెళ్ళి జరిగినది 27 ఆగస్టు 1957. ఆయనకి నలుగురు పిల్లలు. ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు.

‘కళావర్తిని’ ఆర్కెస్ట్రాలో పని చేయడం ద్వారా పుహళేంది గొప్ప అనుభవం సంపాదించారు. ఆయనలో ఆత్మవిశ్వాసం పెరిగి, సినిమాలో ప్రయత్నించదలచారు.

ఆ రోజుల్లో సినిమాలలో వెస్టర్న్ మ్యూజిక్‍ని ఏర్పాటు చేసేది ధన్‌రాజ్ గారు. పుహళేంది వెళ్ళి ఆయనను కలవగా, ఆయనకి పుహళేంది నచ్చి, తమిళ కన్నడ రికార్దింగులలో ఆర్గాన్ వాయించేందుకు గాను కెంపరాజ్ ప్రొడక్షన్స్ వారికి పరిచయం చేశారు. అలా సినీరంగంలోకి ప్రవేశించారు. ఆ తరువాత ఆయన స్వరకర్త సి.ఎన్. పాండురంగం గారికి ఎన్ తంగయ్, గుమాస్తా, మామియార్ వంటి సినిమాలకు సహాయకుడిగా వ్యవహరించారు. దర్శకనిర్మాత శ్రీధర్ రచించిన కథ ఆధారంగా తీసిన సినిమా ‘ఎధిర్ పరాధాతు’ (1954)కి సహాయ సంగీత దర్శకుడిగా ఉండగా ఆయనకు ఆ సినిమా దర్శక నిర్మాత కె.ఎస్. గోపాలకృష్ణన్‍తో పరిచయం ఏర్పడింది. స్నేహం పెరిగింది. ఒకనాడు పుహళేందిగారికి ఆయన తొలి గురువు శివంగారు పానగల్ పార్క్‌లో తారసపడ్డారు. తమ ఇంటికి రావల్సిందిగా ఆయన పుహళేందిని కోరారు. ఆత్మాభిమానం అడ్డొచ్చిన పుహళేంది రానన్నారట. గతం గతః అన్నారట. అయితే గురువు గారు అవన్నీ పట్టించుకోకుండా పుహళేందిని బలవంతంగా కె.వి.మహదేవన్ వద్దకు తీసుకువెళ్ళారట. అప్పట్లో మహదేవన్ ‘మదన మోహిని’ చిత్రానికి పని చేస్తున్నారు. శివం గారు మహదేవన్ వద్ద హార్మోనియం వాయించేందుకు పుహళేందిని చేర్చారు. ఆ రోజు నుంచి పుహళేంది సినీ పరిశ్రమకి సంబంధించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని, మహదేవన్ సృష్టిస్తున్న నవకల్పనలను గ్రహించసాగారు. నిర్మాత ఎం.ఎ వేణు ‘పెన్నరాశి’ (1955) సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకి సంగీత దర్శకుడిగా మహదేవన్‌ని నియమించుకున్నారు. అయితే సెన్సార్ చిక్కులేవో వచ్చి, సినిమా విడుదల ఆలస్యమైంది. సెన్సార్ వారిని ఆకట్టుకోడానికి చక్కని రీ-రికార్డింగ్ కావాలని వేణు పట్టుబట్టారు. అదే సమయంలో పూనాలో మహదేవన్ బావమరిది పెళ్ళి ఉండడం, ఆయన తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉండడంతో – తాను పెళ్ళికి వెళ్ళాలనీ, ఒకవేళ తనకి ఆలస్యమైతే, పుహళేంది రీరికార్డింగ్ చేస్తాడనీ, అతను గొప్ప ప్రతిభాశాలి అని చెప్పారట. అయితే మరునాడే రీరికార్డింగ్ జరుపాల్సి రావడంతో, వేణు అనుమతితో పుహళేంది రీరికార్డింగ్ మొదలుపెట్టారట. అయితే తమ ఆర్కెస్ట్రాలోని చాలామంది మ్యూజిషియన్స్ తమకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని, రాలేమని చెప్పారట. పుహళేంది భయపడలేదు. స్వరకర్త సి.ఎన్. పాండురంగం గారి ఆర్కెస్ట్రాలో తన పరిచయం ఉన్న మ్యూజీషియన్స్‌ని రీరికార్డింగ్‌కి పిలిచారట. రీరికార్డింగ్ బాగా వస్తోందని విన్న ఒరిజినల్ ఆర్కెస్ట్రాలోని సంగీతకారులంతా వచ్చి – తామూ పాల్గొంటామని అడిగితే, గొప్ప మనసుతో అంగీకరించారు పుహళేంది. దాంతో రీ-రికార్దింగ్ మరింత గొప్పగా వచ్చింది. నిర్మాత వేణు మాత్రమే కాకుండా, రీరికార్డింగ్ విన్నవారంతా ఆశ్చర్యపోయారట. పుహళేంది తన ఆర్కెస్ట్రా బృందానికి రెండు విరామాలు ఇచ్చి, సిగరెట్లు, టీ తాగి రమ్మనేవారు. వచ్చాకా వారి నుంచి మరింత మెరుగ్గా పని రాబట్టుకునేవారు. ఇలా ఉండగా, తన సహాయకుడు చేసిన గొప్ప కృషి గురించి మహదేవన్‍కి తెలిసింది. నవ్వుతూ వచ్చి, మనస్ఫూర్తిగా పుహళేందిని హత్తుకున్నారట. ‘అమ్మయ్య, ఇక గురువు గారు చూసుకుంటారు’ అని అనుకున్నారట పుహళేంది. అయితే నిర్మాత వేణు మాత్రం… “మీకు గొప్ప సహాయకుడు లభించాడు. మీ పర్యవేక్షణలో ఆయననే పూర్తి చేయనివ్వండి” అంటే మహదేవన్ ఏ మాత్రం తప్పుగా అనుకోకుండా, సంతోషంగా అంగీకరించారు.

తొలి గురువు వద్ద ఎదురైన చేదు అనుభవాన్ని మరిపించేలా పుహళేందిని ఆదరించారు మహదేవన్. మహదేవన్ గారి వద్ద ఆయన ఆత్మాభిమానం ఎన్నడూ దెబ్బ తినలేదు.

అక్కడ్నించి ప్రతిభామూర్తులైన ఆ గురుశిష్యులిద్దరూ కలిసి తమిళం, తెలుగు, మలయాళం భాషలలో దాదాపు 250 సినిమాలకు పనిచేసారు. స్వతంత్రంగా సంగీతం కూర్చేందుకు అవకాశాలు వస్తే, మహదేవన్ గారికి చెప్పి, ఆయన అనుమతి తీసుకుని చేసేవారు పుహళేంది. అయితే వారిద్దరి మధ్య అనుబంధం మాత్రం చెదరలేదు. తన మొత్తం కెరీర్‍లో పుహళేంది కేవలం 12 మలయాళ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు, కానీ ఆ సినిమాల్లో ఆణిముత్యాల్లాంటి పాటలున్నాయి. ఆయన కొన్ని తమిళం, తెలుగు సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు. నాలుగు దక్షిణాది భాషలలోనూ భక్తి సంగీతం సమకూర్చారు. ఆయన చివరి సినిమా 1995లో వచ్చింది. ఆయన పని చేసిన సినిమాలో జాబితా కొరకు వికీపీడియా (https://en.wikipedia.org/wiki/Pukazhenthi) చూడవచ్చు.

ఆయన 75 ఏళ్ళ వయసులో 27 ఫిబ్రవరి 2005 నాడు తిరువనంతపురంలో ఓ హోటల్ గదిలో గుండెపోటుతో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here