అలనాటి అపురూపాలు-5

0
10

ఎ. ఎల్. నారాయణ

ఆయన పూర్తి పేరు అన్నాప్రగడ లక్ష్మీ నారాయణ. ఆయన 1913లో నర్సరావుపేటలో జన్మించారు. అయన తన సొంత ఊరిలోనే ఉన్నత పాఠశాల వరకు చదువుకున్నారు. చదువుకునేటప్పుడు ఆయనకి నటన పట్ల ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లో పేద ప్రజల కోసం నిధులు వసూలు చేయడానికి బెనిఫిట్ షోలుగా నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన వాటిలో ఉచితంగా నటించారు. 1935లో, బెల్లంకొండ సుబ్బారావుతో కలిసి శ్రీ కృష్ణరాయబారం, శ్రీ కృష్ణ తులభారం, కురుక్షేత్రం వంటి నాటకాల్లో పాల్గొన్నారు.

కొంతకాలం జిల్లా బోర్డు కార్యాలయంలో ఉద్యోగం చేశారు. కొంతకాలం మెడికల్ షాపు కూడా నడిపారు. ఆయన పోలీసు శిక్షణ కూడా పొందారు, కాని ఉద్యోగం చేయలేదు. నటన ఆయన అభిరుచిగా మారింది, ఆయన నర్సరావుపేటలో నాటకాలకు సోషల్ అమెచ్యూర్స్ డ్రామా కంపెనీని ప్రారంభించారు. రంగూన్ రౌడీ, ప్రేమ లీల వంటి నాటకాలు ప్రదర్శించారు. నటి లక్ష్మీరాజ్యం కూడా ఈ నాటకాల్లో ఒక భాగం.

ఒక రోజు వారు మద్రాసులో గంగావతరణం నాటకం వేస్తున్నప్పుడు, దర్శకుడు హెచ్‌ఎం రెడ్డి ఆయనను చూడటం జరిగింది. ఎ.ఎల్. నారాయణకు తన తెనాలి రామకృష్ణ చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా ఆయన సినిమాల్లోకి ప్రవేశించారు. తదుపరి సత్యమే జయం, పాదుకా పట్టాభిషేకం, త్యాగయ్య వంటి చిత్రాలు వచ్చాయి. 1948లో బాలరాజు సినిమాలో అంజలీ దేవి తండ్రిగా గాంధర్వ పాత్రలో ఆయనకు మంచి పేరు వచ్చింది, పల్లెటూరి పిల్ల – 1950 లో ధర్మన్నగా, ఆడ బ్రతుకులో శంకరంగా నటించారు. ఆయన సుమారు 150 సినిమాలు చేసారు….

భీష్మ 1962 సినిమాలో దృతరాష్ట్రుడుగా నటించారు. సంసారం, పల్లెటూరి పిల్ల, ఉమా సుందరి, సంకల్పం, అన్న తమ్ముడు, రాణి రత్నప్రభ, జగదేకవీరుని కధ, భీష్మ, రాముడు భీముడు, దేవత, ప్రమీలార్జునీయం, పల్నాటి యుద్ధం, నిండు మనసులు, ఉమా చండీ గౌరీ శంకరుల కధ, లక్ష్మీ కటాక్షం, రైతు బిడ్డ, నిండు దంపతులు, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం – తదితర సినిమాలలో నటించారు.

ఈ దిగువ చిత్రాలు – బాలరాజు సినిమాలో అంజలీ దేవి తండ్రిగా ఎఎల్ నారాయణ.


సుప్రియ

నటి సుప్రియ – విజయవాడకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పి. వీరన్న కుమార్తె. ‘మా నాన్న నిర్దోషి’ చిత్రంలో శ్రీదేవితో పాటు బాలనటిగా ఆమె నటించారు, బేబీ శ్రీదేవితో పాటు ‘ఎంతెంత దూరం’ అనే పాటను పాడే చిన్న పిల్లవాడిగా సుప్రియ నటించారు.

ఆమెకు నృత్యం చేయడం, వీణ వాయించడం కూడా తెలుసు. ఆమె కొన్ని ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు. ఎవిఎం వారి చిత్రం ‘వాడని మల్లి’ – 1981లో హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో నందకుమార్ ఆమె హీరో. ఈ చిత్రంలో ఆమె ఓ కూలీ కూతురు పాత్రను పోషించారు. తరువాత ఆమె అంతగా కనిపించనప్పటికీ…. ఈ చిత్రం కూడా ఆమె లాగే కనుమరుగైంది.

మనం కోల్పోయిన మనోహరమైన తెలుగు నటి సుప్రియ.

‘ఎంతెంత దూరం’ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్‌లో చూడవచ్చు.

 


బి. జయమ్మ

బి. జయమ్మ 1915 నవంబర్ 26 న కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలో జన్మించారు. ఆమె పోలీసు అధికారి టిఎన్ మల్లప్ప మరియు కమలమ్మల కుమార్తె. వారు బెంగళూరులోని బాలేపేటలో నివసించేవారు. కమలమ్మ, ఆమె సోదరీమణులు సుందరమ్మ, రుద్రమ్మ మరియు కిట్టమ్మ కూడా రంగస్థల నటులు. జయమ్మ డాక్టర్ కావాలని ఆమె తండ్రి కోరుకున్నప్పటికీ, ఆమె రంగస్థలం వైపు మొగ్గు చూపారు. ఆమె తండ్రి మరణం తరువాత, ఏడేళ్ల జయమ్మ తన బంధువుల దగ్గర పెరిగింది. ఆమె తండ్రి మరణం తరువాత బేలాపేట పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు జయమ్మ గాన, నటన ప్రతిభకు ప్రోత్సాహం ఇచ్చాడు, సానపెట్టాడు. .  మల్లప్ప మరణం తరువాత, కమలమ్మ ప్రొఫెషనల్ థియేటర్‍లో భాగమైన తన సోదరీమణులతో చేరారు.  రంగస్థల కార్యకలాపాలతో మునిగి ఉన్న జయమ్మ నెమ్మదిగా విద్యపై ఆసక్తిని కోల్పోయారు.  నటన రంగంపై ఆమె ఆసక్తిని గమనించిన శామన్న అనే ఉపాధ్యాయుడు, శరణప్ప యాజమాన్యంలోని ‘రసిక జనానంద సభ’లో చేర్పించి, 1924లో ‘సీతా కల్యాణం’లో  తొలిసారిగా నటిగా జయమ్మ ప్రవేశించడంలో ముఖ్య పాత్ర పోషించారు. తన పిన్ని సుందరమ్మను అనుసరిస్తున్న జయమ్మకు శాంతరాజప్పకి చెందిన శ్రీ చెన్నబసవేశ్వర నాటక మండలిలో కబీర్, రామాయణం వంటి నాటకాల్లో నటించే అవకాశాలు లభించాయి. బాల బసవేగౌడ నాటక కంపెనీలో చేరిన తర్వాత మహిళా కథానాయక పాత్రలు ధరించే  అవకాశం వచ్చింది. ‘సదారమే’లో ‘చంచలకుమారి’ పాత్ర, ‘గులేబాకవళి’లో ‘చిత్రతరే’ పాత్ర, ‘మన్మథ విజయ’లో ‘రతి’ పాత్రల ద్వారా ఆమె ప్రఖ్యాతి పొందారు.

కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీతం రెండింటిలోనూ ప్రావీణ్యం గల ఆమె నాటక రంగంలో ,  సినిమాల్లో గొప్ప స్థాయికి ఎదిగారు.   ఆమె కథక్ కూడా నేర్చుకున్నారు. బాలా బసవే గౌడ సంస్థ నుండి ఆమె స్వాతంత్ర్యానికి పూర్వం ప్రసిద్ధ థియేటర్ గ్రూప్ అయిన, గుబ్బి కంపెనీకి నెలకు రూ.30 వేతనంతో వెళ్లారు. ఆ సమయంలో ఇది చాలా పెద్ద మొత్తం. శిక్షణ పొందిన నటి అయినప్పటికీ, దాదాపు మూడు నెలలు గుబ్బి కంపెనీ డిమాండ్లను తీర్చడానికి జయమ్మ కళాత్మక ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నారు. ఆమె తొలి ప్రదర్శన , వీర నరసింహ చరిత్రెలో ఆమె ప్రదర్శించిన  నటన ఆమెకు పేరు ప్రతిష్ఠలని తెచ్చిపెట్టింది. బృందంలోని సీనియర్ ఆర్టిస్టులు, జి. నాగేషాషరారు, నరసింహయనవరు, రామచంద్రరాయరు ఆమె నటనను మెచ్చుకున్నారు. అప్పటి నుండి ఆమె సంస్థలో ఒక ముఖ్యమైన భాగం అయ్యారు. తరువాత, మూడవ తరగతి చదువుతూండగా నిలిపివేసిన చదువును కొనసాగించి జయమ్మ మెట్రిక్యులేషన్ పాసయ్యారు. ఈ సంస్థతో ఆమె అనుబంధం కారణంగా ఆమెను గుబ్బి జయమ్మ అని పిలిచేవారు. ముప్పైలలో ప్రొఫెషనల్ థియేటర్ రంగంలో ఆమె ఆధిపత్యం చెలాయించారు. వీర నరసింహ చరిత్రే గుబ్బి కంపెనీతో ఆమె చేసిన మొదటి నాటకం. రాజభక్తిలో రాణి మృణాళినిగా జయమ్మ ప్రదర్శించిన నటన ఆమెకు సినీ ప్రపంచం ద్వారాలు తెరిచింది.  సినీ ప్రపంచంలో ఆమెను తారగా నిలిపింది

బెంగళూరులో ఆమె ఇంటి దగ్గర మెజెస్టిక్ థియేటర్ ఉండేది. ఆ థియేటర్‌లో విడుదలయిన ప్రతి మూకీ చిత్రం ఆమె చూసేది. ఈ సినిమాలు చూసి ఆమె సంతృప్తి చెందలేదు. తాను చూసిన సినిమాల్లో నటీనటుల నటనను ఇంట్లో తల్లిముందు ఇతరుల ముందు నటించి చూపేది. మూకీ సినిమాల్లో సంభాషణలు ఉండవు కాబట్టి అత్యంత ప్రతిభావంతమయిన నటనను ప్రదర్శించే వారికే నటనావకాశాలు వచ్చేవి, నాయికలుగా అవకాశం ఇచ్చేవారు. . బెంగుళూరులో ఆ రోజుల్లో మూకీ చిత్రాలను కర్ణాటక చిత్ర సంస్థ, సూర్య చిత్ర సంస్థ నిర్మించేవి. థియేటర్ రంగంలో ఆమె సాధించిన విజయాల కారణంగా ఆమెకు ‘కాలేజ్ గర్ల్’ అనే మూకీ చిత్రంలో నటించడానికి మొదటి అవకాశం లభించింది, ఈ అవకాశాన్ని కర్ణాటక ఫిల్మ్ కార్పొరేషన్ కల్పించింది. ఆమె తన తొలి చిత్రంతోటే విజయం సాధించింది. మూకీ సినీ ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమయిన నటిగా ఉన్నత స్థానంలో నిలిచింది.. అప్పుడు గుబ్బి వీరన్న – నిర్మాత, దర్శకుడు, థెస్పియన్ స్క్రీన్ రైటర్, ఎడిటర్ మరియు నటుడు; వై.వి.రావుగా ప్రసిద్ధుడు అయిన యరగుడిపతి వరదా రావుతో కలిసి కర్ణాటక పిక్చర్స్ అనే సంస్థను స్థాపించారు. ‘హరి మాయ’ ఈ బేనర్ నుంచి వచ్చిన మొదటి సినిమా. ఈ చిత్రంలో నటి ఎం.ఎన్.రాజం సత్యభామగా, జయమ్మ జాంబవతి పాత్రను సమర్థవంతంగా పోషించారు. 1931లో కర్ణాటక పిక్చర్స్ నిర్మించిన ‘హిస్ లవ్ ఎఫైర్’తో జయమ్మ ప్రధాన నటిగా అవతరించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బెల్జియం సాంకేతిక నిపుణుడు రాఫెల్ అలోగెట్ ఈ చిత్ర నిర్మాణంలో గుబ్బి వీరన్న మరియు జయమ్మలకు సహాయం చేశాడు.  సంప్రదాయాన్ని తిరస్కరించే యువ ప్రేమికుల గురించి చెప్పే ఈ సాంఘిక చిత్రం కోసం, జయమ్మ ఈత, సైకిల్ రైడింగ్ మరియు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. ‘హరి మాయ’, ‘హిస్ లవ్ ఎఫైర్’ సినిమాలు చేసేటప్పుడు, వీరన్న జయమ్మ పట్ల ఇష్టాన్ని పెంచుకున్నారు. 1931లో ఆమెను వివాహం చేసుకున్నారు. అప్పట్నించి ప్రజలు ఆమెను గుబ్బి జయమ్మ అని పిలవడం ప్రారంభించారు, అయితే అంతకు ముందు ఆమెను బెంగళూరు జయమ్మ లేదా బి జయమ్మ అని పిలిచేవారు. తరువాత జయమ్మ గుబ్బి కంపెనీని బలోపేతం చేయడంలో వీరన్నకు సహాయం చేయడం ప్రారంభించారు.

ఆమె తమ బృందాన్ని ఉత్తర కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి సంస్థ యొక్క ఘనమైన ప్రదర్శనలను నిర్వహించారు.  ఆమె హిందూస్థానీ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు, దానితో పాటు ఆమె మాలవల్లి సుబ్బన్న వద్ద వయోలిన్ నేర్చుకున్నారు. ఆమె సేలం దొరైస్వామి అయ్యంగార్ వద్ద సంగీతం నేర్చుకున్నారు. రామోత్సవ వంటి కార్యక్రమాలలో కచేరీలు కూడా చేశారు. సినిమాలు, సంగీతంలో చురుకుగా ఉన్నప్పటికీ, జయమ్మ రంగస్థలాన్ని నిర్లక్ష్యం చేయలేదు, అదే ఆమెకు ఖ్యాతి తెచ్చిపెట్టింది. డిసెంబర్ 31, 1934న ప్రదర్శించిన ‘కురుక్షేత్రం’లో ఆమె నటనను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ప్రొఫెషనల్ థియేటర్లలోని అందమైన సెట్లను నిర్మించడానికి డబ్బు భారీగా ఖర్చు చేశారు. దివాన్ మీర్జా ఇస్మాయిల్ ఆ ప్రదర్శనను చూశారు. జయమ్మ ఆ నాటకంలో ద్రౌపది పాత్ర వేశారు, వీరన్న దుర్యోధనుడి పాత్రకు ప్రాణం పోసారు. ఆ సమయంలో ఆమె  గుబ్బి కంపెనీతో కలసి ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి ‘కురుక్షేత్ర’ అనే  నాటకం ప్రదర్శించారు. ఆమె ద్రౌపది పాత్రలో తెలుగు ఉచ్చారణ కొంచెం లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, తెలుగు ప్రేక్షకులు  వినూత్న ప్రదర్శన విధానం కోసం నాటకాన్ని ఇష్టపడ్డారు. గుబ్బి జయమ్మ పేరు తెలుగు ప్రేక్షకులలో బాగా ప్రసిద్ది చెందింది. భక్త ప్రహ్లాద, దేవదాసి మరియు సదారమే వంటి నాటకాలలోని ప్రధాన పాత్రలలో ఆమె నటన శ్రీమతి జయమ్మకు చాలా ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆమె మూకీ ,  టాకీ సినిమాలలో పనిచేయడం ప్రారంభించారు.

ఆమె తన భర్తతో కలిసి ఆమె అనేక నాటకాలలోనూ, సినిమాల్లోను నటించారు. ఆమె సినిమాలతో తన పాటలు తానే పాడుకున్న సమర్థ గాయని. వారి ప్రసిద్ధ నాటకం “సదరమ” కన్నడ టాకీగా రూపొందించబడింది. ఇది 1931లో విడుదలై జయమ్మ గారి మొదటి టాకీ చిత్రం అయ్యింది. ఈ సినిమా అంతగా ఆదరణ పొందకపోవటం ఆమెకు లాభించలేదు.. తరువాత గుబ్బి వీరన్న 1940లో ‘సుభద్ర’ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆమె టైటిల్ రోల్ పోషించారు. అది 1941లో విడుదలైంది. అయితే మరుసటి సంవత్సరం ‘జీవన నాటక – 1941’ తో మాత్రమే ఆమె కన్నడ టాకీ రంగంలో ప్రాచుర్యం పొందారు. ఈ చిత్రంలో, జయమ్మ ఒక డ్రామా కంపెనీలో నటి పాత్రలో నటించారు, ఇది తన జీవితానికి దగ్గరగా ఉంది. ఆ సమయంలో, గొప్ప తెలుగు దర్శకుడు బిఎన్ రెడ్డి ‘స్వర్గ సీమ’ను రూపొందించాలని యోచిస్తున్నారు. స్నేహితుడి సలహా మేరకు అతను ‘జీవన నాటక’ను చూడటానికి వెళ్ళాడు. ఆయనకు జయమ్మ నచ్చడంతో, తన ‘స్వర్గ సీమ’ చిత్రంలో నాగయ్య భార్య పాత్రలో నటింపజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో నటించడానికి జయమ్మ మద్రాసు వెళ్ళింది. ఆ రోజు నుండి, ఆమె నాటకాల్లో నటించడం మానేసి, సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. 1945లో స్వర్గ సీమ విడుదలకు ముందు, 1944లో విడుదలైన భర్తృహరి అనే తమిళ చిత్రంలో జయమ్మ నటించింది.. ఆ చిత్రంలో కన్నడిగులను అవమానించే డైలాగ్‌లు చెప్పేలా చేశారు. అది ఆమె తప్పు కానప్పటికీ, కన్నడిగులు ఆమెను ఒక సంవత్సరంపాటూ క్షమించలేదు. అదృష్టవశాత్తూ ఆమె కన్నడ చిత్రం హేమారెడ్డి మల్లమ్మ 1945 లో విడుదలైంది. మరోసారి కన్నడ ప్రజలు ఆమెని ఆదరించారు. ఇది మల్లమ్మ అనే మహిళ  కథ.  ఆమె జీవితంలో అనేక కష్టాలను ఎలా ఎదుర్కొంటుందో చెప్పింది. ఈ చిత్రంలో జయమ్మ కథానాయికగా నటించారు. స్వర్గ సీమ విడుదలైన తర్వాత ఆమె మొత్తం దక్షిణ భారతదేశంలో  ఆదరణ పొందారు. ఈ చిత్రం ద్వారా ఆమెను తెలుగు, తమిళ ప్రజలు ఆరాధించారు. ఆమెను చూస్తే అందరికీ ప్రశంతంగా అనిపించేది. ఆమె రూప లావణ్యం , పెద్ద పెద్ద కళ్ళు ప్రజలను ఆకర్షించేవి. . స్వర్గ సీమ క్లైమాక్స్‌లో – నాగయ్య ఆమె పాదాల వద్ద పువ్వులు పెట్టినప్పుడు ఆమె అందమైన పాదాలను చూపిస్తారు. తన సాధు వ్యక్తిత్వం కారణంగా ఆమె ‘త్యాగయ్య’ – 1947  సినిమాలో టైటిల్ పాత్రలో నటించిన నాగయ్యకు భార్యగా నటించారు. ఈ చిత్రం మన దేశంలోని పలు ప్రాంతాలలోనే కాదు, విదేశాలలోనూ ప్రఖ్యాతి పొందింది. ప్రజలను అలరించింది.  సంగీత ప్రియులను ఉత్సాహపరిచింది. గుబ్బి వీరన్న నిర్మించిన గుణసాగరి ఆమె కెరీర్‌లో  మైలురాయి చిత్రం. 1947లో  చిత్రపు నారాయణరావు దర్శకత్వం వహించిన  తెలుగు చిత్రం ‘బ్రహ్మ రథం’ లో కూడా ఆమె పని చేశారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన నవల ఆధారంగా అదే పేరుతో రూపొందించిన సినిమా ఇది. ఆమె 1951లో విడుదలైన మంత్రదండం, గుమాస్తా వంటి తెలుగు సినిమాలలో నటించింది. .

‘కాలేజ్ గర్ల్’తో ప్రారంభమైన ఆమె సెల్యులాయిడ్ ప్రయాణం 1971లో ‘ముక్తి’తో ముగిసింది. ఆమె నాలుగు దశాబ్దాలలో 28 చిత్రాలలో నటించారు. చివరికి ఆమె సామాజిక సేవలో లీనమయ్యారు. ఆమె కన్నడ మహిళా రచయితల సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె 1947లో మహాత్మా గాంధీని కలిసినప్పటి నుండి సామాజిక సేవను ప్రారంభించారు. నాటక రంగం, సినిమా, సంగీత రంగాలకు ఆమె చేసిన కృషికి తోడు, కంఠీరవ స్టూడియో వ్యవస్థాపకుడు టి.ఎస్.కరీబసవయ్య నాయకత్వంలో ఆర్థికంగా బలహీనమైన కళాకారుల సంక్షేమం కోసం జయమ్మ పనిచేశారు. 1981లో, జయమ్మ కర్ణాటక రాష్ట్ర శాసనమండలి సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. .. కొంచెం ఆలస్యం అయినప్పటికీ, సినిమా, థియేటర్ మరియు సంగీతానికి జయమ్మ చేసిన సేవను ప్రభుత్వం గుర్తించి 2016లో ఆమె శతజయంతి కార్యక్రమాలను కన్నడ భాషా సాంస్కృతిక విభాగం ద్వారా నిర్వహించడానికి రూ.10 లక్షలు విడుదల చేసింది. 20 డిసెంబర్ 1988నాడు మృతి చెందడంతో ఆమె ఘనమైన జీవితానికి తెరపడింది. అత్యద్భుతము, అనూహ్యంగా విజయవంతమూ అయిన ఆమె జీవిత ప్రయాణం ముగిసింది.

   

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here