అలనాటి అపురూపాలు-53

1
6

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సినిమాటోగ్రాఫరు, దర్శకులు హెచ్. ఎస్. వేణు:

సినీరంగంలో ప్రవేశించడానికి నటీనటులే కాదు, సాంకేతిక సిబ్బంది కూడా కష్టాలు పడతారు, ఇబ్బందులెదుర్కుంటారు. అటువంటి వారిలో తొలుత కెమెరామాన్‌గా ప్రవేశించి తరువాత దర్శకులైన హెచ్.ఎస్. వేణు గురించి ఈ వారం తెలుసుకుందాం.

వేణు మద్రాసులో జన్మించినా, ఎలెక్ట్రికల్ ఇంజనీరు అయిన తండ్రిగారి ఉద్యోగ రీత్యా కేరళలోని ఎర్నాకుళంలో చదువుకున్నారు. ఆయనది ఎంతో స్వేచ్ఛతో కూడిన బాల్యం. నాటకాలు వేస్తూ, ఫుట్‍బాల్ ఆడుతూ, బొమ్మలు గీస్తూ గడిపారు. ఆయన బొమ్మలు ఎంత బాగా గీసేవారంటే, చూసిన వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయేవారు. 16 ఏళ్ళ వయసులో వేణు నౌకాదళంలో చేరారు. నౌకాదళంలో రెండేళ్ళు పని చేశారు. తన తండ్రి మరణించారని తెలుసుకున్న వేణు నౌకాదళాన్ని వీడారు.

18 ఏళ్ళ వయసులో వేణు మద్రాసు వచ్చి తన అక్క ఎం. ఎల్. వసంతకుమారితో నివసించసాగారు (ఈవిడ సొంత అక్కో, కజిన్ సిస్టరో నాకు తెలియదు. వసంతకుమారి గారి జీవిత చరిత్రలో ఈ వివరాలు లేవు. అందుకని కజిన్ సిస్టర్ అనే అనుకుంటున్నాను). బొమ్మలు బాగా గీస్తారు కాబట్టి ఏదైనా స్టూడియోలో ఆర్ట్ డిపార్టుమెంట్‍లో చేరమని మిత్రులు సలహా యిచ్చారు. వాళ్ళ మాటలు విని వేణు ఎటువంటి జీతమూ లేకుండా న్యూ టోన్ స్టూడియోలో ఆర్ట్ విభాగంలో చేరారు. స్టూడియోలో పని చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని, అవగాహన పెంపొందించుకోవచ్చని ఆయన భావించారు. కాని త్వరలోనే ఆయనకి వాస్తవం అర్థమైంది. అలా పని చేయడం వల్ల తనకేమీ ఉపయోగం లేదని గ్రహించారు. అక్కడివారు ఆయన చేత రంగు బక్కెట్లు మోయించారు తప్పితే, కనీసం నేపథ్యపు రంగులు వేయడానికి బ్రష్ కూడా ఇవ్వలేదు. ఆయనకా ఉద్యోగం నచ్చలేదు. కెమెరా డిపార్ట్‌మెంట్‍లో మంచి అవకాశాలుంటాయని ఆయన శ్రేయోభిలాషులు సూచించారు. అప్పుడు వేణు కెమెరా డిపార్ట్‌మెంట్‍లో చేరారు. తన గది నుంచి జేబులో యాభై పైసలతో వేణు బయలుదేరేవారు. ఆరు మైళ్ళు నడిచి స్టూడియో చేరేవారు. స్టూడియోలో భోజనం పెట్టేవారు. సాయంత్రం మళ్ళీ ఆరు మైళ్ళూ నడిచి గదికి చేరేవారు. ఈ రకంగా రెండేళ్ళ పాటు న్యూ టోన్ స్టూడియోలో పని చేశారు.

1949లో నెలకి యాభై రూపాయల జీతంతో ఆయన వాహినీ స్టూడియోలో చేరారు. అక్కడ అసిస్టెంట్ కెమెరామాన్‍గా పని చేస్తున్నందుకు ఆయన ఎంతో సంతోషించారు. ఇక్కడ ఆయన 1962 వరకు పని చేశారు. జీత్ బెనర్జీ, ఎం. సెల్వరాజ్, మార్కస్ బార్ల్‌లే, పి.ఎల్. రాయ్ వంటి ఉద్ధండులైన సినిమాటోగ్రాఫర్లకు సహాయకుడిగా వ్యవహరించారు. వాహిని స్టూడియోలో పని చేస్తుండగా, దర్శకులు బి. విఠలాచార్యతో పరిచయం కలిగి, స్నేహంగా మారింది. 1959లో తన సినిమా ‘జయ విజయ’కు కెమెరా బాధ్యతలు నిర్వర్తించవలసిందిగా విఠలాచార్య వేణుని కోరారు. అప్పటికి వాహినిలో ఉండడంతో, వీలైనంత త్వరగా ఈ బయటి సినిమాని పూర్తి చేశారట వేణు. ఈ సినిమాతో ఆయనకి బాగా గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి విఠలాచార్య అన్ని సినిమాలకు వేణునే కెమెరామాన్. 1962లో ‘అండమాన్ ఖైదీ’ అనే తమిళ చిత్రానికి కెమెరామాన్‍గా వ్యవహరించే అవకాశం వచ్చింది. అయితే, ఆయన మాత్రం బి. విఠలాచార్య సినిమాలపైనే దృష్టి పెట్టారు. 1960లో అన్నా చెల్లెళ్ళు, కనకదుర్గ పూజా మహిమ; 1961లో వరలక్ష్మి వ్రతం; 1962లో ఖైదీ కన్నయ్య, మదన కామరాజు కథ; 1963లో బందిపోటు, గురువుని మించిన శిష్యుడు, వీర కేసరి, నవగ్రహ పూజా మహిమ; 1964లో అగ్గి పిడుగు, తోటలో పిల్ల కోటలో రాణి, బంగారు తిమ్మరాజు; 1965లో జ్వాలా ద్వీప రహస్యం, విజయసింహ, మంగమ్మ శపథం;  1966లో ఇద్దరు మొనగాళ్ళు, భూలోకంలో యమలోకం; 1967లో చిక్కడు దొరకడు, పిడుగు రాముడు, గోపాలుడు భూపాలుడు, అగ్గి దొర; 1968లో భలే మొనగాడు, కదలడు వదలడు, నిన్నే పెళ్ళాడుతా; 1969లో అగ్గి వీరుడు, గండికోట రహస్యం; 1970లో ఆలీబాబా 40 దొంగలు, లక్ష్మీ కటాక్షం, విజయం మనదే; 1971 లో రాజకోట రహస్యం, సిఐడి రాజు – తదితర సినిమాలకు పని చేశారు.

‘చిక్కడు దొరకడు’లో డబుల్ యాక్షన్ కెమెరా వర్క్, ‘ఆలీబాబా 40 దొంగలు’లో ఫైటింగ్ సీన్లు వేణుగారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. వేణు తమిళ, కన్నడ, మలయాళం చిత్రాలకు కూడా పనిచేశారు. ఒక సింహళ చిత్రానికి కూడా పని చేశారు. నిర్మాత పింజల సుబ్బారావు వేణుకి ఒక సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. కెమెరామాన్ దర్శకుడయితే సినిమా తీయడం ఎంత సులభమో వేణుకి అప్పుడే తెలిసింది. రెండు బాధ్యతలు ఒక్కరే నిర్వర్తిస్తే దర్శకుడి దృష్టికోణాన్ని కెమెరామాన్ సరిగ్గా పట్టుకోగలరని గ్రహించారు. ఆ సినిమా 1970లో వచ్చిన సుగుణ సుందరి కథ. వేణు తర్వాత 1971లో ‘గెట్టికారెన్’, 1972లో ‘సవాలుక్కు సవాల్’, 1978లో ‘ఉరవుగల్ ఎండ్రుమ్ వాళ్గ’, 1983లో ‘కామన్ పండిగై’ అనే తమిళ సినిమాలకు (నాకు తెలిసినవి ఇవే) దర్శకత్వం వహించారు.

తక్కువ సినిమాలే చేసిన, తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు వేణు.

***

కూతురు లతాంగితో వేణుగారు

విజ్ఞులు చదివిన విద్యాలయం:

సినిమాల గురించే కాకుండా, సినీ నటులు, రాజకీయ నేతలు, ఇతర పెద్దలు, విజ్ఞులు చదువుకున్న ఓ విద్యాలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాఠశాలకి 133 ఏళ్ళకి పైగా చరిత్ర ఉంది.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని జీవగ్రామ్‍లో ఉన్న ఈ విద్యాసంస్థ పేరు ఫీఫర్ మెమోరియల్ హైస్కూల్ (Pfeiffer Memorial School).

పి.ఎం. హైస్కూలుగా పేరు పొందిన ఈ పాఠశాల 1888లో తిరుపతిలోని ఈస్ట్ మిషన్ కాంపౌండ్‍లో జర్మనీ మిషనరీస్ మద్దతుతో ప్రారంభమయింది. 1930లో దీనిని జీవగ్రామ్‌లోకి మార్చారు. అప్పట్లో ఈ విద్యాలయం పేరెన్నికగన్నది.

మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ పాఠశాలలో చదివారు. ఆయన పేరిట ఉపాధ్యాయ దినం జరుపుతారు, కానీ ఆయన చదివిన పాఠశాల స్థితిగతులను ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయం (ఆయన బ్యాచ్ విద్యార్థుల గ్రూప్ ఫోటో చూడవచ్చు).

ఈ విద్యాలయం ప్రస్తుతం శిథిలమవుతోంది. ఎయిడెడ్ పాఠశాల కాబట్టి ప్రభుత్వం విద్యార్థులకు భోజనం, పుస్తకాలు సమకూరుస్తోంది. ఒకప్పుడు వెయ్యిమందికి పైగా విద్యార్థులున్న ఈ బడిలో నేడు కనీసం వందమంది విద్యార్థులు కూడా లేరు.

ఈ పాఠశాల వైభవం ఉజ్జ్వలంగా ఉన్న రోజుల్లో ఈ బడి రజతోత్సవ (1930-1955) వేడుకకు డిసెంబరు 1955లో భారత ప్రధాని శ్రీ జవహర్‍లాల్ నెహ్రూ స్వయంగా విచ్చేశారు. అదే రోజున విద్యాలయం ప్రాంగణంలో ఓపెన్ ఎయిర్ థియేటర్‌ని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఈ సభలో బెజవాడ గోపాలరెడ్డి కూడా పాల్గొన్నారు.

సుప్రసిద్ధ సినీనటులు టి.ఎస్. రంగనాథ్ ఈ పాఠశాలలోనే ఎస్.ఎస్.ఎల్.సి. వరకూ చదివారు. ఆయన ఇక్కడే నటన పై ఆసక్తి పెంచుకున్నారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా నాటకం పోటీలలో పాల్గొని ఉత్తమ నటుడిగా రాధాకృష్ణన్ నుంచి బహుమతి అందుకున్నారు. అప్పడాయన వయసు ఎనిమిదేళ్ళు. పెద్దయ్యాకా, 1979లో ఆయన తన పూర్వ విద్యాసంస్థని దర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి, సామాజిక కార్యకర్త కుంచాల రాజారత్నం కూడా ఈ పాఠశాల మాజీ విద్యార్థులే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here