అలనాటి అపురూపాలు-54

3
5

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

దర్శక దిగ్గజం తాతినేని సూర్య ప్రకాశరావు:

తాతినేని ప్రకాశరావుగా సుప్రసిద్ధులైన తాతినేని సూర్య ప్రకాశరావు ఆనాటి దిగ్గజ దర్శకులలో ఒకరు. ఈ వారం ఆయన గురించి తెలుసుకుందాం.

ప్రకాశరావు కృష్ణాజిల్లా కపిలేశ్వరపురానికి చెందినవారు. వారి తల్లిదండ్రులిద్దరిదీ అదే ఊరు. ఆయన కపిలేశ్వరపురంలో 24 నవంబరు 1924 తేదీన జన్మించారు. వారి తండ్రి వీర రాఘవయ్య కాంగ్రెసువాది. 1931లో జైలుకు కూడా వెళ్ళారు. ఆయన ‘దత్తాత్రేయ మోటర్ సర్వీస్’లో పని చేయడంతో ఆయనని అందరూ ‘కారు వీర రాఘవయ్య’ అనేవారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చాకా జిల్లా బోర్డు ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎంతో ఒత్తిడి తీసుకుని ప్రచారం చేశారు. వారి కార్ సర్వీస్ వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయింది. ఆయన క్రుంగుబాటుకి లోనయ్యారు, ఫలితంగా 1934లో చనిపోయారు. అప్పటికే చిన్నారి ప్రకాశరావుని వారి తాతగారి తమ్ముడైన తాతినేని సుబ్బయ్య దత్తత తీసుకున్నారు. ఆయన గొప్ప ధనికుడు. పెద్ద ఇల్లు ఉండేది. ఒకసారి గాంధీజీ వాళ్ళ ఊరు వస్తే సుబ్బయ్య గాంధీజీకి పదివేల రూపాయల రొక్కం విరాళంగా అందజేశారు. అయితే సుబ్బయ్య జస్టిస్ పార్టీ వైపు మొగ్గు చూపడం వీర రాఘవయ్యకి నచ్చలేదు, అలాగే వీర రాఘవయ్య కాంగ్రెస్ అనుకూల వైఖరి వహించడం సుబ్బయ్యకి ఇష్టం లేదు. అందుకని దత్తతని రద్దు చేసుకుని, మరో అబ్బాయిని పెంచుకున్నారు. తండ్రి మరణంతో ఇల్లు బోసిపోయింది, అమ్మ, ప్రకాశరావు మాత్రమే ఇంట్లో ఉండేవారు. ఆయన తల్లి కూడా రాజకీయాలలో చురుగ్గా ఉండేవారు. అమ్మ ప్రోత్సాహంతో రాజకీయ సభలలో ప్రకాశరావు పాటలు పాడేవారు. చిరకాలంలోనే రాజకీయాలపై ఆసక్తి పెరిగి, అవగాహన పెంచుకున్నారు. అదే సమయంలో వారి మేనమామ చిగులూరి శేషయ్య ప్రకాశరావుని కపిలేశ్వరపురంలోనే చదివించారు. మిడిల్ స్కూల్ వరకు చదువుకున్నారు. బడిలో ఉండగా, ప్రకాశరావులో సినిమాల పట్ల ఆసక్తి పెరిగింది.

కపిలేశ్వరపురం నుంచి సుమారు రెండు మైళ్ళ దూరంలో వీరంకి లాకుల వద్ద కాజా వెంకట రామయ్య టూరింగ్ టాకీస్ ఉండేది. బడి సమయం ముగిసాకా, ఆ టాకీస్ వరకు నడిచి వెళ్ళి అక్కడి సినిమా ఆపరేటర్‌కి బీడీలు, సోడాలు తెచ్చిపెట్టి స్నేహం కలిపారు. ఓరోజు ప్రకాశరావు పుస్తకాలతో బడికి వెళ్తుండగా, ఓ సినిమా పోస్టర్ కనిపించింది. దాన్ని చూడడంలో లీనమై పరిసరాలను మరిచిపోయారు. బడిలో చరిత్ర పాఠాలు చెప్పే మాస్టారు తన వైపే రావడం గమనించలేదు. ఆయన పేరు సుంకర చంద్రశేఖర రావు. తనని చూసి ప్రకాశరావు పారిపోకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యపోయారు. పిల్లవాడి ఆసక్తిని గమనించి, “నువ్వు పోస్టర్లపై నీ పేరు చూసుకోవాలనుకుంటున్నావా? అయితే  బాగా చదువుకో, ఏదో ఒక రోజు నీ కల నెరవేరుతుంది” అన్నారు. ఆయన మాటలు తర్వాతి కాలంలో నిజమయ్యాయి. తన స్వంతూరులో మూడో ఫారం వరకూ చదివారు ప్రకాశరావు, హైస్కూలు చదువుల కోసం తాడంకి వెళ్ళారు. అప్పటికే వారి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో హైస్కూలు ఫీజులు కట్టలేకపోయారు. కొందరు కాంగ్రెస్‍వాదులు, వారి నాన్నగారి స్నేహితులు కొందరు ఫీజులు కట్టేందుకు సాయం చేసారు. బడిలో ప్రకాశరావు ఎప్పుడూ – తెలుగులోనూ, చరిత్ర లోనూ ముందుండేవారు. ఫుట్‌బాల్, బాడ్మింటన్ ఇష్టంగా ఆడేవారు. పద్యాలు రాగయుక్తంగా చదువుతుండండంతో, మాస్టర్లు ఆయన చేత తరచుగా పద్యాలు చదివించేవారు. త్వరలోనే ఆయన ప్రసిద్ధులై, విద్యార్థి రాజకీయాలలో పాల్గొనసాగారు. వాళ్ళ ప్రధానోపాధ్యాయులకి ఇదంతా నచ్చలేదు.  చదువులు పాడయి, ఆయన పాఠశాలని విడవాల్సి వచ్చింది. వారి మేనమామ ఆయనను రాజకీయాల వైపు నుంచి మళ్ళించాలని అనుకున్నారు. అందుకని వీరంకి లాకు టూరింగ్ టాకీస్‍లో సినిమా ఆపరేటర్‍గా సహాయకుడిగా తన మేనల్లుడిని చేర్చారు. ఇక్కడ్నించి యువ ప్రకాశరావు తెనాలి తాలూకాలోని కొల్లూరు వెళ్ళారు. కొల్లూరులో మళ్ళీ రాజకీయంగా క్రియాశీలమయ్యారు. 1939లో నిరాహార దీక్ష బూనిన ఓ ఉద్యమం యొక్క కార్యకర్తల ఊరేగింపుకు నేతృత్వం వహించారు. అనుచరులతో కలిసి కొల్లూరు నుంచి తెనాలి దాక పాదయాత్ర చేశారు. తెనాలి చేరగానే ఆయనను అరెస్టు చేశారు. ఫలితంగా సినిమా ఆపరేటర్ అసిస్టెంట్‍గా ఉద్యోగం ఊడింది. ఆ ఉద్యోగం పట్ల ఇక ఆయన ఆసక్తి చూపలేదు. తన అనుచరులతో కలిసి ‘ప్రజా నాట్యమండలి’ స్థాపించారు. ఇది సామాన్యుల జీవితాలలోకి కళలను, రాజకీయాలను ప్రవేశపెట్టింది. పార్టీ కార్యకర్తలు నాటకాలు వేస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, హరికథలు, బుర్రకథలు చెప్పేవారు. బృందగానాలు, జానపద నృత్యాలు కూడా ఉండేవి [వీటన్నింటిని తన తొలి సినిమా ‘పల్లెటూరు’ (1952)లో చూపించారు]. వేసవిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలు వాటిల్లో పాల్గొనేలా చూసేవారు.

సుప్రసిద్ధ నటీనటులు – లక్ష్మీరాజ్యం, చదలవాడ కుటుంబరావు, పెరుమాళ్ళు, మిక్కిలినేని కృష్ణమూర్తి వంటి వాళ్ళు ప్రజా నాట్యమండలి నుంచే వచ్చారు. ఈ రకంగా ప్రకాశరావు ఐదేళ్ళు కాలం గడిపారు. ఆ సమయంలో ఆంధ్రా ప్రాంతపు ప్రోగ్రెస్సివ్ రైటర్స్ అసోసియేషన్ ఏర్పడింది. ప్రజా నాట్యమండలి దానికి అనుబంధ సంస్థగా మారింది. మద్రాసులో పి.వి. రాజమన్నారు ముఖ్య అతిథిగా వారు ఒక సమావేశం పెట్టుకున్నారు. ప్రకాశరావు కూడా ఆ సమావేశానికి వెళ్ళారు. ఆయన అక్కడ దర్శకులు ఎల్. వి. ప్రసాద్‍ని కలిసారు. ఈ కలయిక ఆయన సినీరంగ ప్రవేశానికి నాంది పలికింది.

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా 1947లో చిన ఓగిరాలలో యూత్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ప్రకాశరావు ఈ సమావేశానికి ప్రిసైడింగ్ లీడర్. ఈ సమావేశానికి రష్యా, ఫ్రాన్స్, బెల్జియం, చెకోస్లోవోకియా వంటి దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మీటింగ్ అయ్యాకా ప్రకాశరావు తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సమావేశంలో తగినన్ని రాజకీయ సంబంధిత చర్చలు లేకపోవడంతో ఆయన సినిమాలు చూస్తూ కాలక్షేపం చేశారు. 1947 మే నెలలో పార్టీ పదవికి రాజీనామా చేసి ఎల్.వి. ప్రసాద్‍ని కలిసేందుకు మద్రాసు చేరుకున్నారు.

మద్రాసులో ఎల్.వి.ప్రసాద్ గదిలోకి ప్రవేశిస్తుండగా, ప్రకాశరావుకు ఓ అందగాడు బయటికొస్తూ తారసపడ్డారు. ఆయన అందం ఆకర్షించగా, లోపలికి వెళ్ళి ఆయన ఎవరని ప్రసాద్ గారిని అడిగారట. ఆయన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పని చేస్తున్నారని ప్రసాద్ చెప్పారు. అందమైన ముక్కు, గంభీరమైన స్వరంతో ఆకట్టుకునేలా ఉన్నారని అన్నారు. నాటకాలు వేసిన అనుభవం కూడా ఉందని చెప్పారు. ఆయనకి స్క్రీన్ టెస్ట్ చేయాలని చూస్తున్నాని చెప్పారట. ఇంతకీ ఆయన ఎవరో కాదు – నందమూరి తారక రామారావు! అదీ ఆయన ఆకర్షణ! కాగా ప్రకాశరావుని తన సహాయకుడిగా పెట్టుకునేందుకు ప్రసాద్ అంగీకరించారు. ‘మన దేశం’ సినిమాలో ఎన్.టి.ఆర్‍కి ఇన్‌స్పెక్టర్ పాత్ర ఇస్తున్నానని ప్రసాద్ ప్రకాశరావుకి చెప్పారు.

ఆ పాత్రలో ఎన్.టి.ఆర్. నటిస్తుండగా – ప్రసాద్ కొన్ని అంశాలు గమనించారు. రంగస్థలం మీద నాటకంలా – నాటకీయంగా కనుబొమలు ఎగురవేస్తూ, అనవసరమైన భంగిమలిస్తూ, సంభాషణలను అవసరానికి మించి ఒత్తి పలుకుతూ నటించారట. ఎల్.వి. ప్రసాద్ వాటన్నింటినీ సరి చేసి, సినిమాకి నియంత్రిత నటన అవసరమని వివరించారట. కాగా ఎన్.టి.ఆర్., ప్రకాశరావు, టి.వి. రాజు, ఎస్.వి.రంగారావు ఆప్తమిత్రులయ్యారు. వాళ్ళంతా ఒకే గదిలో ఉండసాగారు. తను వేస్తున్నది ఇన్‍స్పెక్టర్ పాత్ర అయినా, ఎన్.టి.ఆర్. గదిలో కూడా రిహార్సల్స్ చేసేవారట. ప్రకాశరావు, టి.వి. రాజు, ఎస్.వి.రంగారావు రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్తూ, వస్తావా అని అడిగితే – “ఎందుకు బ్రదర్, సమయం వృథా, నిద్ర నష్టం. అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది” అని వెళ్ళేవారు కాదట ఎన్.టి.ఆర్. ఈ ముగ్గురు గది కొచ్చేసరికి బాగా ఆలస్యమయ్యేదట. ఎన్.టి.ఆర్ తెల్లవారు జామునే నిద్ర లేచి, వ్యాయామం చేసేవారు. ఈ అలవాటు ఆయన జీవితాంతం కొనసాగింది. ఉదయాన్నే నోటి దగ్గర చెంబు పెట్టి గట్టిగా దానిలోకి అరిచేవారట. గదిలోని మిగతావారికి అది నిద్రాభంగం కలిగించినా, ఎన్.టి.ఆర్. ఆ అలవాటు మానుకోలేదు. అలా చేయడం వల్ల తన వాయిస్ కల్చర్ మెరుగవుతుందని, నటనలో రాణించడానికి అది తోడ్పడుతుంది అనేవారుట. ఎన్.టి.ఆర్.లో మొదటి నుంచి ఇదే నిబద్ధత, క్రమశిక్షణ ఉండేవి. ఎన్.టి.ఆర్ కెరీర్ అద్భుతంగా ఉంటుందని, గొప్ప ఎత్తుకు ఎదుగుతారని ఎల్.వి. ప్రసాద్ అనేవారు. ఆయన చూపులు, స్వరం – ఆయన్ని గొప్ప స్టార్‍ని చేస్తాయని అన్నారు. ఆయన అంచనాలు ఎంత ఖచ్చితంగా నిజమయ్యాయో!

తాతినేని ప్రకాశ్ – ద్రోహి, మన దేశం, సంసారం – చిత్రాలకు ఎల్.వి. ప్రసాద్‍కి సహాయకుడిగా వ్యవహరించారు. ఆ సమయంలో విజయా ప్రొడక్షన్స్ వారు ‘షావుకారు’ చిత్రం తీయబోతున్నారు. ఎల్.వి. ప్రసాద్ సిఫార్సులో ఎన్.టి.ఆర్, తాతినేని ప్రకాశరావు – విజయా ప్రొడక్షన్స్‌లో పర్మనెంట్ ఆర్టిస్టులుగా చేరారు. ఎన్.టి.ఆర్. హీరో కాగా, తాతినేని ప్రకాశరావు అసిస్టెంట్ డైరక్టర్. తన కెరీర్‍లో ఇదో గొప్ప మలుపని ప్రకాశరావు భావించారు. చక్రపాణి వంటి మేధావి నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించింది. తనని తాను కేవలం సహాయదర్శకుడి పనికి మాత్రమే పరిమితం చేసుకోలేదు. స్టూడియో అంతా కలయతిరుగుతూ, అన్ని విభాగాలను పరిశీలిస్తూ, ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నారు. ఆ రోజుల్లో ఆ బ్యానర్ ఓ పాఠశాల వంటింది, ఆసక్తులకు నేర్చుకునేందుకు అవధులు లేకుండా ఉండేది. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరిగి, ఏదైనా నేర్చుకోవచ్చు. ప్రకాశరావు కుతూహలాన్ని గమనించిన కె.వి.రెడ్డి ‘పాతాళ భైరవి’ చిత్రానికి గాను తనకు సహాయకుడిగా ఉండమని అడిగారు. ఈ సినిమాలోని పోరాటాల సాధనని పర్యవేక్షించే బాధ్యతని ప్రకాశరావుకి అప్పగించారు. ‘పాతాళ భైరవి’ చిత్రం క్లయిమాక్స్ ఫైట్‌కి ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్ చాలా ఎక్కువగా రిహార్సల్స్ చేశారు. స్టంట్స్ ప్రమాదకరంవి అయినా, తానే స్వయంగా చేస్తానని ఎన్.టి.ఆర్ అన్నారట.

ప్రకాశరావు ఎన్‍.టి.ఆర్.లో గమనించిన మరో గొప్ప విషయం ఏంటంటే – ఇతరులు దర్శకత్వం వహిస్తున్నప్పుడు – ఎటువంటి ప్రశ్నలు వేయకుండా దర్శకులు చెప్పినట్టు నటించేవారట. ప్రకాశరావు దర్శకత్వం వహిస్తుండగా – ఆయన తన స్నేహితుడు, రూమ్‍మేట్ అయినప్పటికీ, ఆయన పనిలో ఎన్.టి.ఆర్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదట. దర్శకుడి సూచనలను గుడ్డిగా పాటించేవారట. విజయా ప్రొడక్షన్స్‌లో ప్రకాశరావు చివరి చిత్రం ‘పెళ్ళి చేసి చూడు’. ఆ సినిమాకి ఎల్.వి. ప్రసాద్‍కి సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే ఆయనకి దర్శకత్వం చేసే అవకాశం లభించింది. అది పీపుల్స్ ఆర్ట్స్ బ్యానర్‍పై నిర్మించిన ‘పల్లెటూరు’ చిత్రం. ఆయన అందరి దగ్గరా ఆశీస్సులు తీసుకుని స్వతంత్రంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు విజయా బ్యానర్‍ని వీడారు. తొలి రోజు నుంచి ఆయన గురువులు చక్రపాణి, ఎల్.వి. ప్రసాద్‍లు. ఒక కథని చక్రపాణి గారైతే ఎలా రాస్తారో, ఆ కథకి ఎల్. వి. ప్రసాద్ అయితే ఎలా దర్శకత్వం వహిస్తారో – అదే విధంగా తన కథల పట్ల వ్యవహరించేవారు ప్రకాశరావు. అక్కడ్నించి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. పిచ్చి పుల్లయ్య, నిరుపేదలు, పరివర్తన, చరణ దాసి, జయం మనదే, ఇల్లరికం, మా బాబు, 1975 సంసారం, గాలిపటాలు, మైనర్ బాబు, పొగరుబోతు, చిరంజీవి రాంబాబు మొదలైన సినిమాలు తీశారు. తమిళంలోనూ, హిందీలోను ‘అమరదీపం’ తీశారు. తమిళంలో – ఉత్తమ పుతిరన్,  ఇంకా చరణ దాసి ఆధారంగా మథర్ కుల మాణిక్కం, కన్నిరైంధ కనవన్, నల్ల తీర్పు, ఎల్లోరుమ్ ఇన్నాట్టు మన్నార్, అంబు మగన్, కాథిరుంత కంగల్, పొదొట్టి, ఎంగలలుమ్ ముడియం వంటి చిత్రాలు తీశారు. హిందీలో – ససురాల్, బహు బేటీ, బహురాణీ, సూరజ్, దునియా, ఇజ్జత్, వాస్నా, ఘర్ ఘర్ కీ కహానీ, నన్హా ఫరిస్తా, కాలేజ్ గర్ల్, రివాజ్, హమారా సంసార్, కబ్ తక్ చుప్ రహూంగీ – వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

నటుడిగా ఎన్.టి.ఆర్ ఎంత ఎత్తుకి ఎదిగినా ప్రకాశరావుతో తన స్నేహాన్ని విస్మరించలేదు. ఇద్దరూ ఒకరినొకరు ‘బావగారూ’ అని పిలుచుకునేవారు. తన కుమార్తె వివాహం చేద్దామని ప్రకాశరావు ఆలోచిస్తున్న సమయంలో ఎన్.టి.ఆర్. ఆయన్ని పిలిచి ఏమైనా సాయం కావాలా అని అడిగారట. ఎన్.టి.ఆర్. ఆ వివాహానికి హాజరై, తన ఆధ్వర్యంలో జరిపించారు. రిసెప్షన్‌కి కూడా హాజరై, తన సొంత కుమార్తె పెళ్ళిలా, అతిథులందరికీ స్వయంగా స్వాగతం పలికారట. అవి బంగారు రోజులు!

తాతినేని ప్రకాశరావు కుమారుడు టి.ఎల్.వి. ప్రసాద్ కూడా దర్శకులే. అతి తక్కువ వ్యవధిలో అతి ఎక్కువ సినిమాలు తీసినందుకు ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. అవన్నీ మిథున్ చక్రవర్తితో తీసిన అర్థంపర్థం లేని సినిమాలు! (ఎటువంటి కళాత్మక విలువలు లేకుండా, ఓ యంత్రంలా సినిమాలు తీయడం – గొప్ప దర్శకుడైన ఆయన తండ్రికి ఎంత బాధ కలిగించి ఉంటుందో అనుకుంటూ ఉంటాను). వారి మనవడు తాతినేని సత్య కూడా సినిమాల్లోకి వచ్చారు. ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ప్రకాశరావు 1 జూలై 1992న స్వర్గస్థులయ్యారు.

***


కళానైపుణ్యానికి నిదర్శనం టి.వి.ఎస్. శర్మ:

తొలితరం గొప్ప కళాదర్శకులలో టి.వి.ఎస్. శర్మ ఒకరు. 1909లో ఆయన ఒంగోలు జిల్లాలోని మూగచింతల అనే ఊరిలో జన్మించారు. ఆ రోజుల్లో వారి తండ్రిగారు వెంకటగిరి సంస్థానంలో పనిచేస్తూండేవారట. అందుకని శర్మ నెల్లూరు వచ్చి వెంకయ్య గారి వద్ద సంగీతం నేర్చుకునేవారు. తమది ఆర్థికంగా గొప్ప కుటుంబం కాకపోవడంతో, ఒకే సమయంలో చదువు కొనసాగిస్తూ, సంగీతం కూడా నేర్చుకునేందుకు ప్రయత్నించారు శర్మ. సంగీతం నేర్చుకునేందుకు ఆయన హద్దులు ఏమీ పెట్టుకోలేదు. ఎక్కడ సంగీతం ఉచితంగా నేర్పిస్తారనే తెలిస్తే, అక్కడికి వెళ్ళిపోయేవారు. ఈ ప్రక్రియలో ఆయన విజయనగరం చేరుకుని కట్టు సూర్యనారాయణ గారింట బస చేశారు. వారింట ఏ రుసుము చెల్లించకుండా ఉంటూ, మధుకరం చేస్తూ కీర్తనలు నేర్చుకోసాగారు. అయితే ఆయన స్వభావానికి విజయనగరపు క్రమశిక్షణ నచ్చలేదు. అంతే, అక్కడ్ని పారిపోయి బందరు చేరారు. అక్కడేం చేయాలో తెలీదు, వచ్చి చేరారు అంతే. ఆయనకి పదేళ్ళప్పుడు ఇక్కడే ఓ దారుణమైన సంఘటన జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా, తన మిత్రుడు తయారు చేసిన నాటుబాంబును ఎడమ చేతిలో ఉంచుకున్నారు శర్మ. ఆ బాంబు ఆయన చేతిలోనే పేలిపోయి, చాలా సేపు బాధ పెట్టింది. ఓ మంచి వైద్యుడికి చూపించుకునేందుకు చేతిలో డబ్బు లేదు. ఓ నాటువైద్యుడి వద్దకు వెళ్ళి తీసుకున్న మందు మంచి కన్నా చెడే ఎక్కువ చేసింది. చేతికి సెప్టిక్ అయింది. మరో వైద్యుడి వద్దకు వెళితే, అరచేతి నుంచి ఇన్‍ఫెక్షన్ పైకి బాగా వ్యాపించిందని మరింత నష్టం జరగక ముందే ఎడం చేయి తీసేయ్యాలని చెప్పారు. ఆ రోజు జరిగిన దానికి ఆయన ఎప్పటికీ బాధ పడుతూనే ఉన్నారు. అదే ఆ బాంబుని కనుక ఆయన కుడి చేత్తో పట్టుకుని ఉంటే…. కళాదర్శకులు అయ్యేవారు కారు… ఎన్నో గొప్ప సినిమాలకు కళాదర్శకత్వం వహించి జోవనోపాధి లభించేది కాదు.

ఆ చిన్న వయసులోనే తన దురదృష్టం గురించి ఆలోచించారు. బాగా చదువుకుని, రెండు చేతులు ఉన్న వ్యక్తులకే ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంటే ఒకే చేయి ఉండి, చదువులేని శర్మ బతకడం ఎలా? అప్పుడు ఆయన తన స్వరాన్ని గుర్తు చేసుకున్నారు. పాటలు పాడి పొట్ట పోసుకోవచ్చు అనుకున్నారు. అందుకని పాటలు, హరికథలు నేర్చుకోసాగారు. ఎన్నో చోట్ల పాటలు పాడి, హరికథలు చెప్పి, కథలు చెప్పి, నాటకాలు వేసి డబ్బు సంపాదించారు. 15 ఏళ్ళ వయసులో ఆయన ఒక రోజు పెన్సిల్, పేపర్ తీసుకుని ఓ బొమ్మ వేయడానికి ప్రయత్నించారు. తానెప్పుడో గంటల కొద్దీ జాగ్రత్తగా గమనించిన ఓ శిల్పాన్ని ఆయన బొమ్మలా అద్భుతంగా గీశారు. తాను గీసిన బొమ్మ ఆయనకి బాగా నచ్చింది! ఈ కళలో రాణించడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నారు. బహుశా ఈ ప్రజ్ఞ పుట్టుకతోనే అలవడిందేమో. పాటలు పాడడం ద్వారా ఆయన పెద్దగా ఆదాయం రావడం లేదు. మరి బొమ్మలు గీయడం వలన తినడానికి కావల్సిన, ఉండడానికి కావల్సినంత డబ్బు వస్తుందా అని ఆలోచించారు. తాత్కాలికంగా సాధనని నిలిపివేశారు. బందరులో డి. వి. సుబ్బారావు, పింగళి నాగేంద్రలతో కలిసి పలు నాటకాలలో నటించారు. ఇదిలా ఉండగా, హఠాత్తుగా బందరు వదిలి మద్రాసు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. వేల్ పిక్చర్స్ ఆఫీసులో ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో భాగంగా సెట్టు మీద సామాన్లు ఎత్తడం, అమర్చడం లాంటి పనులు చేయాల్సి వచ్చేది (పాపం ఒంటి చేత్తోనే, ఈ పనులు చేసేవారాయన). కొద్ది కాలానికే ఈ పని అంటే విసుగేసి, తిరిగి బందరు వచ్చేశారు.

బందరులో ఆయన కొయ్యశిల్పాలు చేసే చోట ఉద్యోగంలో చేరారు. ఖాళీ సమయాలలో ఓపికగా బొమ్మలు గీసేవారు. కొంత కాలం గడిచేసరికి బొమ్మలు గీయడంలో గొప్ప ప్రావీణ్యం సాధించారు. ఒకసారి గాంధీజీ బందరు వచ్చారు. ఆ సందర్భంగా – గాంధీజీ ఓ మేకతో ఉన్న బొమ్మని గీయగా, వేలంలో అది యాభై రూపాయలకి అమ్ముడుపోయింది. ఇది ఆయన జీవితంలో పొందిన పెద్ద మొత్తం. ఎంతో సంతోషించారాయన. తన బొమ్మలను పలు పత్రికలకు పంపసాగారు, వాటి ద్వారా నెలకి ఐదు లేదా పది రూపాయలు సంపాదించేవారు. బందరులో తనకి తగిన ఆదాయం రాకపోవడంతో నిరుత్సాహపడి నెల్లూరు వెళ్ళిపోయారు. ఓరోజు నెల్లూరు రోడ్డు పైన పరాకుగా నడుస్తున్నారు. హఠాత్తుగా ఒకాయన కనిపించి “ఏంరోయ్ శర్మా, గుర్తుపట్టావా” అని పలకరించారు. ఎవరని అడిగారట శర్మ. తాను పి. పుల్లయ్యనని, తాము కలిసి చదువుకున్నామని గుర్తుచేశారట. శర్మకి అంతా గురొచ్చి, దిగులుగా ఉండడం వల్ల గుర్తు పట్టలేక పోయానని చెప్పారు. ఇద్దరూ కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. పుల్లయ్య గారు శర్మ గీసిన చిత్రాలు చూసి ఆయన ప్రతిభను గుర్తించారు. సినిమాలో ఆర్ట్ డైరక్టర్‍గా ప్రవేశపెడితే రాణిస్తారని భావించారు. “నాతో కొల్హాపూర్ వస్తావా? నేను అక్కడ ‘హరిశ్చంద్ర’ అనే సినిమా తీస్తున్నాను” అని అడిగారట పుల్లయ్య.

ఎంతో సంతోషంగా అంగీకరించి, పుల్లయ్యతో కొల్హాపూరు వెళ్ళారు. తనకో దారి చూపిన పుల్లయ్యగారిని శర్మ ఎన్నటికీ మరిచిపోలేదు. కొల్హాపూరులో ఆయన దిగ్గజ కళాదర్శకుడైన బాబూరావు పెయింటర్‍కి సహాయకుడిగా ఉన్నారు. పలు రకాల సెట్ ప్రాపర్టీస్, కిరీటాలు, ఎలా గీయాలో నేర్చుకున్నారు. ఇన్‍డోర్, అవుట్‌డోర్‍లలో ఆర్ట్ సెట్స్ ఎలా వేయాలో నేర్చుకున్నారు. 1935లో తనకి 24 ఏళ్ళ వయసొచ్చేసరికి సొంతగా కళాదర్శకత్వం చేయగలనన్న ఆత్మవిశ్వాసం ఆయనలో తలెత్తింది. ‘సతీ తులసి’ సినిమాకి అవకాశం వచ్చింది. ప్రచార చిత్రాలు కూడా గీసే అవకాశాలు వచ్చాయి.

ఆ రోజులలో ఆర్ట్ డైరక్షన్ అంటే… సింహాసనం, రాజరికపు చిహ్నాలు, సీనరీలను తెరలపై చిత్రిస్తే చాలు… కానీ ప్రభాత్ ఫిల్మ్స్ వారు ప్రోత్సహించడంతో 1938లో బాబురావు పెయింటరు ఓ అడుగు ముందుకేసి సెట్ ప్రాపర్టీస్ గా మౌల్డింగ్స్‌ని రూపొంచసాగారు. 1939లో శర్మ ‘మళ్ళీ పెళ్ళి’ అనే చిత్రానికి కళాదర్శకత్వం వహించారు. ఇది ఆయన తొలి సాంఘిక చిత్రం. సెట్స్ అన్నీ ఎంతో సహజంగా, అందంగా ఉండేట్టు తీర్చిదిద్దారు శర్మ. ఆ సెట్స్ వాస్తవానికి దగ్గరగా ఉండి సినీ ప్రేక్షకులను ఎంతో ఆకర్షించాయి. ‘మైరావణ’ చిత్రానికి ఆయన వేసిన పాతాళ లోకం సెట్ ఎందరినో అలరించింది. రామేశ్వరం నుంచి పలురకాల గవ్వలు, శంఖాలు తెప్పించి ఈ సెట్‍లో వాడారు. పైగా వాటితోనే కిరీటాలు, గాజులు, వడ్డాణాలు, చెవి రింగులు తయారు చేసి వాడారు. మొత్తం సెట్ థీమ్ గవ్వలు, శంఖాలే. తరువాత ఆయన ‘చంద్రసేన’ చిత్రానికి కళాదర్శకత్వం వహించారు. ఫ్రభాత్ ఫిల్మ్స్ యాజమాన్యం, అత్యంత సహజంగా సెట్స్ రూపొందించడంలో ఆయన నైపుణ్యాన్ని అభినందించారు. అతి త్వరలోనే చిత్రంలోని నటీనటుల పాత్రలు ఎలా ఉంటాయో ఊహించి, అందుకు తగ్గట్టుగా సెట్ ప్రాపర్టీస్ రూపొందించసాగారు. ‘సత్యభామ’ చిత్రంలో నారదుడి పాత్రకు మొదటిసారిగా కేశాలను పక్కకి ముడి వేసి అలంకరించి, శరీరమంతటా చంద్రాలంకారాలూ, లతలూ అమర్చింది శర్మగారే. ఈ చిత్రంలో నారడుడి పాత్రను స్థానం నరసింహారావు పోషించారు. ఆ పాత్ర ఆహార్యాన్ని ఆయన మెచ్చుకున్నారు.

ఇంతటి ప్రతిభాశాలిని ఎన్.టి.ఆర్. తన సొంత బ్యానర్‍లో తీసిన – శ్రీకృష్ణ పాండవీయం, సీతారామ కళ్యాణం వంటి సినిమాలకు కళాదర్శకత్వం చేసే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. నర్తనశాలలో ‘బృహన్నల’ పాత్రను తీర్చిదిద్దింది శర్మగారే. ఈ పాత్ర ప్రపంచవ్యాప్తంగా పేరు పొంది, ఎందరో విదేశీయులని సైతం ఆకట్టుకుంది. జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్‍లో ‘నర్తనశాల’ ఉత్తమ చిత్రంగా ఎంపికవగా, ఉత్తమ కళాదర్శకుడిగా శర్మ ఎంపికయ్యారు. ‘సీతారామ కళ్యాణం’లో రావణుని పాత్రని, ‘శ్రీకృష్ణ పాండవీయం’లో దుర్యోధనుడి పాత్రను తీర్చిదిద్దింది శర్మగారే. ఈ దుర్యోధనుడి పాత్ర రూపురేఖలు బాగా నచ్చిన ఎన్.టి.ఆర్. ‘దానవీరశూరకర్ణ’లోనూ దుర్యోధనుడి పాత్రను అలాగే రూపొందించారు. ఈ సినిమాలో సింహాసనాలను, సెట్‍లను గమనించండి. దుర్యోధనుడి సింహాసనం నిజంగా ఓ అద్భుతం! చూసిన వారంతా, నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యంతో ఉండిపోతారు. శ్రీకృష్ణపాండవీయం చిత్రంలో సింహాసనం కోసం, మామూలుగా ఉపయోగించే కాగితాన్నే ఉపయోగించి, ఆయన పాలరాతి స్తంభాల ప్రభావం తీసుకొచ్చారు. ఆయన మరణాంతరం కూడా ఆయన ప్రతిభని నిర్మాతలు అభినందిస్తూనే ఉన్నారు.

1970, డిసెంబరు 7వ తేదీన మృతి చెందిన ఈ మహనీయుడికి నా నమస్సులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here