అలనాటి అపురూపాలు-56

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తన తల్లిదండ్రుల గురించి ప్రముఖ నటుడు మోహనీష్ బహల్ మాటల్లో:

తమ తల్లిదండ్రులని, బాల్యాన్ని గుర్తు చేసుకుని ఆనందించడం అందరికీ అనుభవమే. అయితే అలా గుర్తు చేసుకునేది ఓ సినీనటుడైతే, వాళ్ళ అమ్మ కూడా అలనాటి హీరోయిన్ అయితే, ఆ అనుభవాలను తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. మరి చదివేద్దామా!

సుప్రసిద్ధ నటుడు మోహనీష్ బహల్ అలనాటి అందాల తార నూతన్ కుమారుడన్నది అందరికీ తెలిసిందే. 14 ఆగస్టు 1961 నాడు జన్మించిన మోహనీష్ తన బాల్యం గురించి, తల్లిదండ్రుల గురించి ఇలా చెబుతున్నారు:

“మా అమ్మానాన్నలు 1959లో పెళ్ళి చేసుకున్నారు. నేను 1961లో పుట్టాను. అమ్మ అప్పటికే పెద్ద స్టార్! అమ్మతో నాకున్న మొట్టమొదటి జ్ఞాపకం… జంతువుల ఆట ఆడడం! ఉదాహరణకి తను ‘ఎలుగుబంటి’ అంటే – వచ్చి నన్ను ఎలుగుబంటిలా హత్తుకునేది. లేదా ఓ బల్లిలా పాకుతూ వచ్చి నన్ను భయపెట్టేది. మొదట్లో మేము మలబార్ హిల్‌లో వుండేవాళ్లం. 1977లో కొలాబాలోని సాగర్ సంగీత్‍కి మారాము. నటన అమ్మ వృత్తి. కానీ ఇంటి దగ్గర సాధారణ మహారాష్ట్రపు ఇంటి ఇల్లాలుగానే ఉండేది. నాకోసం ఏం చేసినా సంతోషంగా చేసింది. ఏ కారణం చేతనయినా పనివాళ్ళు లేకపోతే, అమ్మే స్వయంగా చేసేది. బట్టలు తీసుకెళ్ళి ఇస్త్రీకి ఇవ్వడంలో తనకెలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అత్యంత నిరాడంబరమైన వ్యక్తి! మా బడిలో స్పోర్స్-ఫంక్షన్‌కి కూడా వచ్చేది. నేను మంచి ఈతగాడిని. పోటీలప్పుడు అమ్మ స్టాండ్స్‌లో నిలుచుని నన్ను ప్రోత్సాహించేది.

నేను అమ్మకూచిని, అమ్మ అవుట్‍డోర్ షూటింగులకి వెళ్ళినప్పుడు తను లేని లోటు బాగా తెలిసేది. ఒకసారి అమ్మని తీసుకురావడానికి నాన్నతో కలిసి ఎయిర్‍పోర్ట్‌కి వెళ్ళాను. అప్పటి అమ్మ రూపం నాకింకా గుర్తుంది. నిమ్మపండు చీరలో, ఎగ్జిట్ గేట్ నుంచి నడచివచ్చింది, ఎంత అందంగా ఉందో! ముంబ్రాలోని మా బంగ్లాలో కాలక్షేపం చేయడం అమ్మకి బాగా ఇష్టం. నేను అమ్మతోటే తిరిగేవాడిని… నన్ను అమ్మ ‘తోక’ అని పిలిచేది. సెలవలొస్తే, నాన్నతోనూ, ఆయన మిత్రులతోనూ కలిసి వేటకి వెళ్ళేవాళ్లం! ఇప్పుడు వేటని నిషేధించారనుకోండి – మంచి కోసమే!  మేం డాక్ బంగ్లాలో ఉండేవాళ్ళం. అప్పుడు అమ్మ మగవాళ్ళలా ఎంతో ధైర్యంగా ఉండేది. రాత్రుళ్ళు బయట తిరిగేవాళ్ళం. ముంబ్రాలోని మా ఫార్మ్‌హౌస్‍లో అప్పట్లో 22 కుక్కలుండేవి. అమ్మకి ‘క్యూపిడ్’ అని పిలిచే వైట్ పూడుల్ బాగా ఇష్టం. నాకేమో ‘స్వీటీ’ అనే డాబర్‍మాన్ పిన్‌షర్ ఇష్టం. మేం వేటకి వెళ్ళినప్పుడు నాన్న ఇష్టపడే నల్లని లాబ్రాడార్ ‘టిప్సీ’ మాతో వచ్చేది. నాన్నకి పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు ఉండేవి.

నేను అమ్మ సినిమాల సెట్లకి తరచూ వెళ్ళేవాడిని. నూతన్ గారి అబ్బాయి అని గౌరవంగా చూసేవారు. ట్రాలీ మీద కూర్చోడం, క్రేన్ మీద పైకి కిందకీ ఎక్కి దిగడం నాకు సరదాగా ఉండేది. ఆ విధంగా సినిమాతో నాకు మొదటి అనుభవం కలిగింది. కాశ్మీర్‍కి, మద్రాస్‌కీ, ఇంకా ఇతర అవుట్‌డోర్ షూటింగులకి అమ్మతో కలిసి రైల్లో వెళ్ళడం నాకింకా జ్ఞాపకం ఉంది. ఓ నటిగా అమ్మది, గొప్ప స్థాయి! లేకపోతే 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు రావు! కానీ చిన్నతనంలో అమ్మ సినిమాలు చూడడం ఎందుకో ఇష్టం ఉండేది కాదు. ఎందుకు అంత కష్టపడేదో అర్థం కాదు. కానీ ఇప్పుడు అమ్మ సినిమాలు చూస్తే, ఓ చక్కని నటిగా గర్వం కలుగుతుంది. కానీ అదే సమయంలో, సంతోషంగా ఉండదు. ఏడుపొచ్చేస్తుంది. తెర మీద నటి కనబడదు, అమ్మే కనబడుతుంది. వరుసగా అమ్మ సినిమాలు చూడలేను. అవి అమ్మని గుర్తుకు తెస్తాయి. ఎందుకు మళ్ళీ చేదు జ్ఞాపకాలను తలచుకోవడం?

నాకు ఆకాశంలో విహరించడం ఇష్టం కాబట్టి ఎయిర్‍ఫోర్స్‌లో చేరాలనుకున్నాను. కానీ నాన్న వద్దన్నారు. దేశానికి సేవలందించడం మంచిదే అయినా, నేను అలాంటి నియమబద్ధ జీవితానికి తగనని అభిప్రాయపడ్డారు. నాన్న వ్యాపారాలు చూసుకోవచ్చు కదా అని అమ్మ అంది. తన వృత్తి లోని అనిశ్చితి తనకు బాగా తెలుసు. “నేను నీకు నటన నేర్పలేను. కానీ చేసేది అత్యంత నిజాయితీతో చెయ్యి” అని సలహా ఇస్తూనే, తన పేరు చెడగొట్టకూడదని చెప్పింది.

1987లో ‘ఇతిహాస్’ చూసినప్పుడు – అమ్మ బాగా చేశావు అని గాని, చెత్తగా చేశావు అని కాని అనలేదు. “నోరు తెరిచి పదాలను గట్టిగా పలకాలి. అది ‘మా’, ‘మ’ కాదు” అని మాత్రమే అంది. హిందీని ఇంగ్లీషు యాసలో మాట్లాడవద్దని హెచ్చరించింది. నన్ను బాగా క్రమశిక్షణతో పెంచారు. నేను ఆరు సినిమాలు చేశాక కూడా అమ్మ ఇవే మాటలు చెప్పేది. ఓ రోజు నాకు ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్ ఉంది. అప్పుడు సమయం ఎనిమిది అవుతోంది. అమ్మ నన్ను చూసి, “ఏం ఇంకా షూటింగ్‌కి వెళ్ళలేదు?” అని అడిగింది. “షేవ్ చేసుకోవాలమ్మా” అన్నాను. “తొందరగా కానిచ్చి, బయల్దేరు. నువ్వు వస్తావా, రావా అని యూనిట్ మొత్తం ఎదురుచూడకూడదు” అంది. ఓసారి అమ్మ నాతో పాటు నిర్మాత నితిన్ మన్‌మోహన్ గారి ఆఫీసుకు వచ్చింది. అక్కడున్న వారంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. దాంతో నాకు అర్థమైంది – పరిశ్రమలో అమ్మకి ఎంత గౌరవం వుందో! ఆ క్షణాలు నాకింకా గుర్తున్నాయి.

16 జూలై 1989 ఓ దుర్దినం. ఆ రోజు నాన్న నన్ను నిద్రలేపి “అమ్మకి ఒంట్లో బాలేదు. నువ్వు ఆసుపత్రికి తీసుకువెళ్ళు” అన్నారు. ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుంటే, తనకి బ్రెస్ట్ కాన్సర్ అని అమ్మ చెప్పింది. మొదటి లంపెక్టమీ జరిగినప్పుడు తను బాగానే ఉంది. కానీ 1990 జూన్ – జూలై నాటికి కాన్సర్ లివర్‌కి కూడా పాకింది. అప్పటి నుండి అమ్మ ఆరోగ్యం వేగంగా క్షీణించింది. 9 ఫిబ్రవరి 1991 నాడు తనని మళ్ళీ ఆసుపత్రిలో చేర్చాము. ఆ సమయంలో అమ్మని అమెరికాలోని Sloane Kettering Institute లో చేరుద్దామా అని కూడా ఆలోచించాము. కానీ అమ్మ వద్దంది. ఏది ఏమైనా తాను దేశం వదలనంది. ఓ రోజు నాకు ఊటీలో ‘షోలా అవుర్ షబ్నమ్’ షూటింగ్‌కి బయల్దేరుతూ, “నీకేం పర్వాలేదు అమ్మా, నేను తిరిగి వచ్చేవరకు, ఆసుపత్రి నుంచి నిన్ను పంపించరులే” అన్నాను. ఆ మాటలు అన్నాకా, నాలిక కరుచుకున్నాను. అలా అనకుండా ఉండాల్సింది అనుకున్నాను. నేనన్న మాటలు నిజమవుతాయేమనని అనిపించింది. అయితే ఊటీ వెళ్ళేముందు, ఉదయం అమ్మని చూడడానికి వెళ్ళాను… అమ్మని చూసి, వీడ్కోలు చెప్పి బయటకి కదిలాను. గుమ్మం దాటాకా, ఆగి, తలుపు తీసి ఇంకోసారి అమ్మని చూశాను. చిరునవ్వుతో నాకేసే చూస్తూ ఉంది. బ్రతికి ఉండగా అమ్మని చూడడం అదే చివరిసారి.

జీవితంలో చివరిదశలో అమ్మ ఆధ్యాత్మికత వైపు మళ్ళింది. కీర్తనలు వ్రాసింది. తన అరచేతుల్లో ఎప్పుడూ గంధపు సువాసన వచ్చేది, “రా, వచ్చి వాసన చూడు” అనేది. నాకు 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు భగవద్గీతను పరిచయం చేసింది. “గీతలో ఏ పేజీ తెరిచినా, నేను వెతుకుతున్న జవాబు దొరుకుతుంది” అనేది. తనకి కాన్సర్ అని తెలిసినప్పుడు, ‘సరే కానీ, ఇందులోనూ ఏదో మంచే జరుగుతుంది’ అన్నట్లుండేది అమ్మ వైఖరి. మన అందరి కన్నా పెద్దది ఏదో ఉందని అమ్మ గ్రహించింది. అమ్మ పోయిన తరువాత అమ్మ ఫొటోని ప్రేమ్ కట్టించి, దానికి గోడకి తగిలించాము. అక్కడో పిల్లర్ ఉండేది. నాన్న దాని మీద దీపం వెలిగించి ఉంచేవారు. ఎలా మొలకెత్తిందో తెలియదు కానీ, దాని కింద ఒక తులసి మొక్క మొలిచింది. ఆ ఇల్లు కాలిపోయేంత వరకూ ఆ తులసి మొక్క ఉండేది (3 ఆగస్టు 2004న సాగర్ సంగీత్ అపార్ట్‌మెంటులో వారి పెంట్ హౌస్ అగ్నికి ఆహుతి కాగా రజనీష్ బహల్ కాలిన గాయాలతో మృతిచెందారు).

20 ఫిబ్రవరి నాడు, నేనింకా ఊటీలో ఉండగానే, అమ్మ పరిస్థితి విషమించిందని కబురు వచ్చింది. 21 ఫిబ్రవరి నాడు నేను ముంబయి చేరేసరికి సాయంత్రం 4.30 అయ్యింది. అప్పటికే అమ్మ చనిపోయింది.

నేను పొగరుగా ఉండేవాడిని, ఏదైనా సాధించి చూపాలనుకునేవాడిని. మదించిన యవ్వనంలో ఉన్న తోటి యువకులకి ఏమీ తీసిపోను. నేను ఏమైనా చేయగలను అని నమ్మేవాడిని. కానీ ఓ రోజు నువ్వు ఇంట్లో కూర్చుని ఉండగా… నీ భవంతికి నిప్పంటుకుని…. నాన్న చనిపోతారు…. అప్పుడర్థమైంది నాకు నేను దేనినీ నియంత్రించలేనని. అలా అనుకుంటే, నేనొక మూర్ఖుడినే అని అర్థమైంది. అప్పటి నుంచి అన్నీ విధికి వదిలేశాను. వీటిని ఎలా తట్టుకున్నాను? నాకు మరో మార్గం ఉందా?మన చుట్టూ ఉండే మనుషులే మనకు ఆధారం అవుతారు. నా భార్య ఆరతి, నా కూతురు ప్రనూతన్ నాకు ఆలంబన అయ్యారు.

ఇక మా అమ్మకీ, అమ్మమ్మకి (మాజీ నటి శోభనా సమర్థ్) మధ్య గొడవ (శోభనా సమర్థ్ – నూతన్ ఆస్తులను సరిగా నిర్వహించలేదని, మోసం జరిగిందని ఆరోపణలున్నాయి. ఫలితంగా ఇరవై ఏళ్ళ పాటు కోర్టులో కేసు నడిచింది) గురించి మా తల్లిదండ్రులిద్దరూ ఎన్నడూ చెడుగా చెప్పలేదు. నాకు తెలిసిందల్లా, అభిప్రాయ భేదాలున్నాయనీ, అవి తరువాత న్యాయస్థానం ద్వారా సర్దుకున్నాయని! మా మధ్య (పిన్నులు – తనుజా, చతుర) ఇప్పటికీ రాకపోకలున్నాయి. వాళ్ళతో సమయం గడపడానికి వీల్లేదని ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు. అమ్మమ్మకి ఉద్రేకం ఎక్కువ, అమ్మకీ అంతే… ఎంతైనా ఆవిడ కూతురే కదా! 1983లో సమస్య పరిష్కారమైనప్పుడు, కుటుంబం మీద ఓ పెద్ద భారం తొలగినట్టయ్యింది. నేను లోనావాలాలో తనూ పిన్ని ఇంటి పక్కనే ఇల్లు కట్టుకున్నాను.

అమ్మ ఎప్పుడూ విచారంగా ఉంటుందని (నూతన్ వైవాహిక జీవితం అస్తవ్యస్తమైందని వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ) అందరూ ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. బహుశా అమ్మ గురించి నాకంటే వాళ్ళకి బాగా తెలుసేమో! వాళ్ళు ఊహించినట్టుగా అమ్మ విచారంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. అమ్మలాంటి వ్యక్తి విచారంగా ఉండే అవకాశం లేదు. జీవనోత్సాహం నిలువెల్లా నిండి ఉన్న వ్యక్తి అమ్మ. అమ్మ గురించి ఏవేవే ఊహించుకునేవాళ్ళ సంగతి వదిలేద్దాం! అవును, అందరూ ఉండేటట్టే అప్పుడప్పుడు కాస్త విచారంగా ఉండేది… అది మామూలే. కానీ అమ్మ తన పని తాను చూసుకునేది. ఇంకొకరి విషయాలలో జోక్యం చేసుకునేది కాదు. నిజాయితీ గల వ్యక్తులు సాధారణంగా అలాగే ఉంటారు. నాన్నని అందరూ తప్పుగా, చెడ్డగా అర్థం చేసుకున్నారు. కానీ ఆయన ఇవన్నీ పట్టించుకునే మనిషి కాదు. నేవీలో ఆఫీసర్. తనకంటూ కొన్ని నియమాలతో జీవించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. మద్యం తాగి, ఆడవాళ్ళతో తిరిగి, రోడ్ల మీద పడిపోయే రకం మనిషి కాదాయన. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. అమ్మ ఆయనని ఆ విషయంలో బాగా గౌరవించేది. 1963లో నేను గర్భంలో ఉన్నానని తెలిసాకా కూడా ‘బందిని’ సినిమా చేసేటట్టు నాన్నే అమ్మని ఒప్పించారట. నా భార్య ఆరతిని ఉద్యోగం మాననివ్వలేదు. నా కూతురు ప్రనూతన్‌ని బాలనటిగా ప్రవేశపెట్టేందుకు ప్రోత్సహించారు. ఆయన నాకన్నా ఉదారంగా ఉండేవారు.

వారిద్దరూ అద్భుతమైన తల్లిదండ్రులు. కానీ నేనే వారికి తగిన కొడుకుని కాలేకపోయాను. నాకు 30 ఏళ్ళ వయసులో అమ్మ చనిపోయింది. 43 ఏళ్ళప్పుడు నాన్న పోయారు… అప్పుడు నాకు బుర్ర లేదు… వాళ్ళకి అవసరమైనప్పుడు నేను ఉంటాను అనుకున్నానే కానీ జీవితంలో చిన్న చిన్న విషయాలే చాలా ముఖ్యమని తోచలేదు. మానసిక పరిపక్వత వస్తే గానీ లేదా వాళ్ళు ఇక లేరంటే గాని ఈ విషయం గ్రహించం! వాళ్ళని గుర్తు చేయడానికి ఏం మిగిలాయి? అగ్నిప్రమాదంలో వాళ్ళ వస్తువులు అన్నీ నాశనమైపోయాయి. అయితే మదిలో జ్ఞాపకాలు మాత్రం నిలిచాయి…”.

***                    


పెద్ద రహస్యాన్ని దాచిన హాలీవుడ్ నటి:

బ్రిటీష్ ఇండియాలోని బొంబాయిలో జన్మించి, సినీ ప్రయోజనాల కోసం తన జన్మస్థలాన్ని రహస్యంగా ఉంచిన హాలీవుడ్ నటి గురించి తెలుసుకుందాం.

Merle Oberon గురించిన నిజానిజాలు ఎక్కువ మందికి తెలియదు. హాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ఆమె ఒక కథానాయిక. The Private Life of Don Juan (1934), The Dark Angel (1935) వంటి భారీ బడ్జెట్ సినిమాలకు నాయికగా సరైన ఎంపిక. ఈ చిత్రాలకు ఆస్కార్ నామినేషన్ అందుకున్నారు.

ఆమెది సూదంటురాయి ఆకర్షణ… అందరినీ ఆకట్టుకునేవారు. పరిశ్రమలోని ఇతర అందగత్తెలు, నీలి-కళ్ళ సుందరాంగుల కంటే అందంగా ఉండేవారు. జనాలు ఆమె అంటే పడి చచ్చేవారు.  ఆమె తన విజయాన్ని ఆస్వాదించేవారు. అయితే ఆమె మరణాంతరం గానీ, ఆమె దాచి ఉంచిన ఓ రహస్యం వెల్లడి కాలేదు.

Oberon సినిమా కెరీర్ ఇంగ్లండ్‌లో మొదలైంది. The Private Life of Henry VIII (1933) అనే చిత్రంలో ‘Anne Boleyn’ అనే పాత్ర పోషించినప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలు. యు.కె.లో కొద్ది రోజులు ప్రయత్నించిన అనంతరం ఆమె మరి కాస్త పెద్దస్థాయికి – లాంస్ ఏంజెలిస్‍కి వెళ్ళాలనుకున్నారు. “నన్ను వాళ్ళు ఇంగ్లండ్ యొక్క మొదటి ‘గ్లామర్ గర్ల్’ గా చూపించాలనుకుంటున్నారు” అన్నారామె 1935లో. “నాకిక్కడ తోటి సినీనటులు నచ్చడం లేదు. అందగత్తెలను మరింత అందంగా తెర మీద చూపించేది కాలిఫోర్నియాలోనే అని నా వ్యక్తిగత నమ్మకం. ఇక్కడి అందగత్తెలు లండన్ పొగమంచు వెనుక వాడిపోతారు…” అన్నారు. అంటే, గమ్యం కాలిఫోర్నియా అన్నమాట. Oberon ఎక్కువగా భారీ కాస్ట్యూమ్స్ ఉన్న సినిమాలలో నటించారు. ఉదాహరణకి 1939 నాటి ‘Wuthering Heights’. ఇందులో లారెన్స్ ఆలీవర్ సరసమ ‘కేథీ’ పాత్ర పోషించారు. 1934 నాటి ‘The Scarlet Pimpernel’లో ఫ్రెంచ్ ఉన్నత కులీన మహిళ పాత్ర.

ఆమె నల్లటి కేశాలు, సొగసైన కనులు – ఇతర వెండితెర అందగత్తెల కంటే ఆమెను భిన్నంగా నిలిపాయి. ఆమె ఓ ప్రొఫెషనల్ మాదిరి ట్రౌషర్స్, టాప్ హేట్స్ ధరించేవారు. 1940 నాటి పురుషులను సులువుగా ఆకట్టుకునేలా ఉండేవారు. తాను టాస్మేనియా నుంచి వచ్చానని, తన తల్లిదండ్రులు బ్రిటీష్ పౌరులని ఆమె ప్రపంచాన్ని నమ్మించారు. ఈ కథనాన్ని వండి వడ్డించింది ఆమె మొదటి భర్త, దర్శకుడు అలెగ్జాండర్ కోర్డా. కానీ వాస్తవం ఏంటంటే Merle Oberon బొంబాయికి చెందిన ఒక ఆంగ్లో-ఇండియన్ వనిత. ఈ రహస్యం వెల్లడయితే, ఆమెకి కథానాయిక పాత్రలు రావని బయల్పరచలేదు. 2011 నాటి ఒక డాక్యుమెంటరీ “ఆ కాలంలో మిశ్రమ జాతి వనితలను సినిమాలలో ఆమోదించలేదు” అని పేర్కొంది. Oberon ది ఆంగ్లో ఇండియన్ నేపథ్యం కావడం ఆమె ఓ స్టార్ కావడంలో పెద్ద అడ్డంకి.  ఆమె గుర్తింపు సంబంధిత అంశాలతో జీవితాంతం బాధపడ్డారు, పైగా 1930లలో జరిగిన ఓ కారు ప్రమాదంలో గాయాలై ముఖంపై మచ్చలు ఏర్పడ్డాయి. కానీ Oberon ధైర్తస్థురాలు. అయినా సరే, Max Factor, Maybelline వంటి అలంకరణ సామాగ్రి సంస్థల ప్రకటనలో (మచ్చలని కనబడనీయకుండా చేస్తూ) నటించారు. ఇక వెండితెర విషయానికొస్తే, సినిమా సిబ్బంది కొత్త లైటింగ్ టెక్నిక్‍లతో ఆమె మచ్చలు కనబడకుండా చేశారు. తన ఖచ్చితమైన మూలాల గురించి ఆమెకే సరిగ్గా తెలియదని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. “జన్మస్థలంగా టాస్మేనియాని ఎందుకు చెప్పుకున్నారంటే – అది అమెరికాకీ, యూరోప్‍కి బాగా దూరం, పైగా అక్కడ ఎక్కువ మంది బ్రిటీష్ జాతీయులే ఉండేవారు. ఆ విధంగా Estelle Thompson (ఆమె జన్మనామం), Merle Oberon అయ్యారు. ఎగువ తరగతి శ్వేత జాతి హోబార్ట్ యువతి టాస్మేనియా నుంచి తన తండ్రి ఓ వేట ప్రమాదంలో మరణించగా – ఇండియాకి వలస వెళ్ళింది, అక్కడ్నించి ఇంగ్లాండ్‌కి వచ్చింది… ఆపై హాలీవుడ్ చేరింది. ఇదంతా ఓ సినిమా కథలానే ఉంది. ఇదే కథనాన్ని ఆమె చివరి వరకూ వినిపించారు. భారతదేశంలో రైల్వేలలో పని చేసిన Arthur Terrence O’Brien Thompson అనే వ్యక్తి ఆమె తండ్రి అని కొందరంటారు. ఆమె తల్లి శ్రీలంక జాతీయురాలైన Constance అనే యువతి… అని కొందరంటారు. Oberon బొంబాయిలో ఎంతో పేదరికంలో పెరిగారు. ఆ పై కలకత్తా వెళ్ళి అక్కడ రంగస్థలంలో శిక్షణ పొందారు. చివరగా లండన్ వెళ్ళారు. 1942లో ఆమె మొదటి భర్తకి నైట్‍హుడ్ గౌరవం లభించగా, ఆమె ‘లేడీ కోర్డా’ అయ్యారు.

1983లో వెలువడిన ఓ జీవిత చరిత్ర Oberon భారతీయ మూలాలను వెల్లడి చేయగా, స్వల్ప వైరుధ్యాలు ఉన్నప్పటికీ, హాలీవుడ్‍లో తోటి దేశీయురాలి ప్రతిభని ప్రశంసించారు. 1935లో ఆమె పొందిన ఆస్కార్ నామినేషన్ మాటేమిటి? సరే! నటనా విభాగంలో ఈ పురస్కారానికి నామినేట్ అయిన ముగ్గురు భారతీయులలో ఒకరవుతారు. అయితే Oberon మాత్రం ఈనాటికీ ‘Best Actress in a Leading Role’ విభాగంలో ఎంపికైన ఏకైక భారతీయ వనిత అని చెప్పుకోవచ్చు.

మరో రకంగా చెప్పాలంటే, అల్పవర్గాల విజయం రెండు వైపుల పదునున్న కత్తి లాంటిదనే ఈ పరిశ్రమలో Oberon కథని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here