అలనాటి అపురూపాలు-65

0
5

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అన్యాయాన్ని సహించలేని జి. వరలక్ష్మి:

అది శోభనాచల స్టూడియో. 14 ఏళ్ళ ఓ అల్లరి పిల్ల చెట్టెక్కి చిటారు కొమ్మకి చేరుకుంది. కిందకి దిగనంటే దిగనంది. స్టూడియో యజమాని, సుప్రసిద్ధ నిర్మాత మిర్జాపూర్ జమీందారు స్వయంగా వచ్చి కిందకి దిగమని బ్రతిమాలారు. డబ్బులిస్తేనే కిందకి దిగుతానంది ఆ అమ్మాయి. వెంటనే ఆయన తన జేబులో ఉన్న డబ్బంతా బయటకి తీసారుట. ఆ అమ్మాయి చెట్టు దిగి వచ్చి, ఆ డబ్బు తీసుకుని – అప్పుడు ‘దక్షయజ్ఞం’ (1941) షూటింగ్‍లో పాల్గొంది. ఆ చిత్రంలో ఆమె ‘కుముదిని’ పాత్రలో నటించింది.

ఇదే విధంగా ఆ అమ్మాయి జయ ఫిల్మ్స్ నిర్మాతని కూడా ఏడిపించింది. నటీనటులలో కాని సాంకేతిక సిబ్బందిలో గాని ఎవరికైనా అన్నం లేకపోయినా, జీతం ఇవ్వకపోయినా, నిర్మాతలపై ఆ అమ్మాయి తిరుగుబాటు చేసేది. డిమాండ్లు తీరిన తర్వాతే షూటింగులలో పాల్గొనేది. ఈ విధంగానే ‘భక్తప్రహ్లాద’ (1942) చిత్రం షూటింగ్ పూర్తి చేసిందామె.

ఆ అమ్మాయి ఎవరో కాదు, జీవితంలో భయం ఎరుగని నటి జి. వరలక్ష్మి లేదా గరికపాటి వరలక్ష్మి. దైర్యసాహసాలు, ఉత్సాహం, నటనా కౌశలం కలిగి ఉన్న ఆమె 1940-60ల మధ్య తెలుగు, తమిళ చిత్రరంగాలలో విజయవంతమైన, ప్రసిద్ధమైన నటిగా కొనసాగారు. అమాయక యువతిగానైనా, గడుసరి మహిళగానైనా, ఉక్రోషపు అక్కగానైనా, అత్తగారినైనా సులువుగా రాణించి – రెండు భాషలలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆమె వ్యక్తిత్వంలోని కొంత భాగాన్ని ఆయా పాత్రలలోకి జొప్పించి, తన నటనలో మరో కోణాన్ని చూపేవారు.

జి. వరలక్ష్మి 27 సెప్టెంబరు 1926 నాడు ఒంగోలులో జన్మించారు. గుంటూరులో పెరిగారు. ఆమె తండ్రి జి. యస్. నాయుడు. ప్రముఖ సర్కస్ మేనేజర్, వస్తాదు అయిన కోడి రామ్మూర్తి నాయుడి కుడి భుజం, భాగస్వామి. సర్కస్‍ని తొలగించాక, ఆయన గుంటూరులో ఉండి ఆయుర్వేద వైద్యుడిగా వ్యవహరించారు. ఆయనకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. జి. వరలక్ష్మి ఆయన రెండో కూతురు. బాల్యం నుంచే ఆమె, సంగీతానికి, నాట్యానికి, సినిమాలకి ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా స్టంట్ సినిమాలు ఆమెకి బాగా నచ్చేవి. కేవలం చూడడమే కాకుండా – నిజ జీవితంలో బాలురకే మాత్రం తీసిపోని ధైర్యసాహసాలు గల ఆమె సినిమాల్లో నటించాలనుకున్నారు కూడా. ఆ పోరాటాలన్నీ నిజమని భావించి, తాను కూడా వాటిని చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండేవారు. ఈ ప్రక్రియలో భాగంగా పొడవాటి చెట్లెక్కి, పైనుంచి దూకడం వంటివి చేసేవారు. ఈ క్రమంలో చెట్లు ఎక్కడంలోనూ, పై నుంచి దూకడంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. 1937వరకు ఆమె గుంటూరులో తన చదువుని, అల్లరి చేష్టలని, సరదాలని – కొనసాగించారు. ఆ తరువాత జీవితం తారుమారయింది. వాళ్ళ నాన్నగారు నష్టాలలో కూరుకుపోయి, సంసార జీవితం పట్ల ఆసక్తి చంపుకుని, బైరాగుల్లో కలిసిపోయారు. ఆమె సోదరీమణులకి పెళ్ళిళ్ళు జరగాల్సి ఉంది. తండ్రి తమని విడిచిపెట్టాకా, ఒడ్డున పడిన చేపలా గిలగిలలాడిందా కుటుంబం. అప్పుడామె వయసు 11 ఏళ్ళు. ఇంట్లో తన కన్నా పెద్దలున్నప్పటికీ, ఇంటి భారం తన మీద ఉన్నట్టే భావించారు. ఆ సమయంలో ఆమె ఎవరినీ సంప్రదించకుండా, తనంతట తానుగా నిర్ణయం తీసుకుని – నటిగా రాణించి కుటుంబాన్ని ఆదుకోవాలని – బెజవాడ వెళ్ళిపోయారు. ముందు నాటకాలలో నటించి, డబ్బు సంపాదించి, ఇంటికి పంపి అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయాలనుకున్నారు. చివరికి తాను అనుకున్నట్టు చేయగలిగారు కూడా. బెజవాడలో (ఇప్పటి విజయవాడ) ఆమె సుప్రసిద్ధ డ్రామా కంపెనీలయిన తుంగల చలపతి కంపెనీ, దాసరి కోటిరత్నం కంపెనీల నాటకాలలో నటించారు. సక్కుబాయి నాటకంలో రాధగా, వెన్నెల విసినకర్రలో సుభద్రగా, రంగూన్ రౌడీలో పార్వతిగా ఆమె మంచి పేరు సంపాదించారు. నాటకాల్లో ఆమె సంపాదించిన పేరు – గొప్ప దర్శకనిర్మాతలైన ఆర్.ఎస్. ప్రకాశ్, హెచ్.ఎం.రెడ్డి గార్ల దృష్టిలో పడేలా చేసింది. టీనేజ్‌లో ఉన్న వరలక్ష్మిని ఆర్.ఎస్. ప్రకాశ్ తాను తీసిన ‘బారిస్టర్ పార్వతీశం’ (1940) చిత్రంలోనూ, హెచ్.ఎం.రెడ్డి ‘బొండాం పెళ్ళి’ (1940) చిత్రంలోనూ నటింపజేశారు. ఈ రెండు సినిమాలు ‘టు-ఇన్-వన్’లా ఒకేసారి విడుదలయ్యాయి. ఈ చిత్రాలలో నటించేందుకు వరలక్ష్మి మద్రాసు వచ్చారు. అప్పుడు జయ ఫిల్మ్స్ వారు ఆమెను ‘భక్తప్రహ్లాద’ (1942) చిత్రానికి ఎంచుకున్నారు. ‘దక్షయజ్ఞం’ వంటి సినిమాలలో నటించాకా ప్రపంచ యుద్ధం భయం కారణంగా చాలామంది మద్రాసు వీడి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. జి. వరలక్ష్మి బొంబాయి వెళ్ళి, నౌషాద్ బృందంలో కోరస్ గాయనిగా చేరారు. గాయనిగా తన కెరీర్‍లో అభివృద్ధి లేదని గ్రహించి ఆమె, మళ్ళీ నాటకాలలో నటించేందుకు బెజవాడ తిరిగి వచ్చేశారు. వర విక్రయం, బెబ్బులి, కృష్ణ లీలలు వంటి నాటకాలలో నటించారు. ఆ సమయంలో పి. పుల్లయ్య వద్ద రమణారావు సహాయ దర్శకుడిగా వ్యవహరించేవారు. ఆయన ప్రముఖ హిందీ నటుడు/నిర్మాత/దర్శకుడు అయిన మజర్ ఖాన్ భాగస్వామ్యంలో ‘తులసీదాస్’ అనే చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు వరలక్ష్మికి అవకాశం వచ్చింది. దాంతో ఆమె మళ్ళీ బొంబాయి వెళ్లారు. అయితే, అనుకోకుండా ఆ సినిమా చిత్రీకరణ ఆలస్యం అయింది. ఆమె ఖాళీగా ఉండకుండా -స్టంట్ సినిమాలైన – ‘వనరాణి’, ‘డూ ఆర్ డై’, ‘సర్కస్ రింగ్’ లలో నటించారు. 1943 వరకు బొంబాయిలోనే ఉండి, తర్వాత బెజవాడకి తిరిగి వచ్చేసారు. 1946లో ఆమె తన నిజ జీవిత కథానాయకుడు, నిర్మాత, స్టూడియో యజమాని అయిని కె.ఎస్. ప్రకాశరావుని కలవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ‘అపవాదు’ చిత్రంలోను, గూడవల్లి వారి ‘పత్ని’ చిత్రంలోనూ ఆయన హీరోగా నటించారు. అయినా ఆయనకి సినిమాలు నిర్మించాలనే ఉద్దేశం ఉండేది. వరలక్ష్మి ఆయనని పెళ్ళి చేసుకున్నారు. కె.ఎస్. ప్రకాశరావు తన సొంత నిర్మాణ సంస్థని స్థాపించి, తన ఆప్తమిత్రుడు ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో ‘ద్రోహి’ అనే చిత్రం తీశారు. అది 1948లో విడుదలయింది.

‘ద్రోహి’ రాజకీయాలో రాణించాలనుకునే ఓ ధనవంతుడి కథ, ఈ చిత్రంలో అతని పొగరుబోతు కూతురు (వరలక్ష్మి) కథానాయకుడు కె.ఎస్. ప్రకాశరావుని పెళ్ళి చేసుకుంటుంది. ఓ పేద పిల్లగా లక్ష్మీరాజ్యం నటించారు. వైద్యుడైన హీరో పేదవారికి అక్కున జేర్చుకుని, మురికివాడల ప్రజలకి సహాయం చేస్తుంటాడు. వరలక్ష్మి, ప్రకాశరావు, లక్ష్మీరాజ్యం గొప్పగా నటించారు. ఈ సినిమాపై కమ్యూనిస్ట్ సినిమా అని ముద్రపడడంతో వివాదం చెలరేగింది. అప్పటి రివాజులకి భిన్నంగా – రెండు సార్లు సెన్సారుకి గురయ్యింది. అయితే బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.

మళ్ళీ, వరలక్ష్మి విషయానికొస్తే, 1946వరకు బెజవాడలోనే ఉన్నారు. ఆ కాలంలో ఆమె చిత్రాలలో నటించలేదు. 1946లో వింధ్యారాణి చిత్రంలో ‘చంప’గా నటించే అవకాశం వచ్చింది. ఇది ఆమె ‘కమ్ బ్యాక్’ చిత్రం. ఆమెది ముఖ్యమైన పాత్ర కానప్పటిగా, విసుగుగా సాగే కథనం మధ్యలో ప్రేక్షకులకుని నవ్వించే పాత్ర. ఆమెకి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత, పైన చెప్పుకున్నట్టు 1948లో ‘ద్రోహి’ చిత్రంలో నటించారు. 1950లో ఆమె – వాలి సుగ్రీవ, మాయా రంభ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి చిత్రాలలో నటించారు. ఆ సంవత్సరంలోనే ప్రకాశ్ గారి చిత్రం ‘మొదటి రాత్రి’లో నటించారు. ఈ చిత్రం పెద్దగా ఆడనప్పటికీ, మరో సినిమా ‘దీక్ష’ తీసేందుకు అవసరమైనంత డబ్బు సంపాదించిపెట్టింది. ఈలోపు ఆమె 1951లో ‘నిర్దోషి’ చిత్రంలో వ్యాంప్‍గా నటించారు. ఇక 1952లో సూపర్ డూపర్ హిట్ ‘పెళ్ళి చేసి చూడు’ విడుదలయింది. ఆమె చీర కొంగును చుట్టి పట్టుకునే పద్ధతిని, ఆమె బాడీ లాంగ్వేజ్‌ని చాలామంది అనుకరించేవారు. పెద్దలు కోపగించుకున్నా, ఎవరు పట్టించుకునేవారు కాదు. 1952లో ప్రకాశరావు తీసిన ‘దీక్ష’ ఆమెలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించింది. అదే సంవత్సంలో ఆమె ‘మానవతి’ చిత్రంలోనూ, ఆ తరువాత ‘నా చెల్లెలు’, ‘ప్రపంచం’ చిత్రాలలోనూ నటించారు. ఇదే సమయంలో ఆమె భర్త సొంత నిర్మాణ సంస్థని, స్టూడియోని స్థాపించి ‘కన్నతల్లి’ చిత్రాన్ని తీశారు. ఇందులో ఓ అమ్మగా డీ-గ్లామరైజ్డ్ పాత్ర పోషించి ఆల్‌రౌండర్ అనిపించుకున్నారు వరలక్ష్మి.  ప్రకాశరావు ఆమెతో ‘మేలుకొలుపు’ చిత్రం తీయాలని ఆలోచిస్తుండగా – ఆమె బయటి నిర్మాణ సంస్థాలలో పలు చిత్రాలలో నటించారు. నవయుగ ఫిల్మ్స్ వారి జ్యోతి, శోభ ఫిల్మ్స్ వారి పరోపకారం, జంపన ఫిల్మ్స్ వారి మేనరికం, మద్రాస్ ఆర్ట్ వారి రోహిణి మొదలైనవాటిలో నటించారు. 1953లో రాయలసీమ కరువు పీడితుల సహాయార్థం యన్.టి.రామారావు చేసిన యాత్రలో ఆయన వెంట ఉండి నిధులు సేకరించారు. అలాగే తమిళనాడు తుఫాను బాధితుల సహాయార్థం జరిగిన యాత్రలోనూ ఆమె పాల్గొన్నారు. ఎన్.టి.ఆర్‍తో చనువుగా ఉండడం, పేకాట ఆడడం చూసి కొందరు పుకార్లు పుట్టించినా, వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు ఆవిడ. కొన్నాళ్ళు రాజకీయాలలోనూ ఉన్నారు. కొద్ది కాలం ఎం.జి.ఆర్‍.కి మద్దతిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజా నాట్య మండలిలో ఆమె క్రియాశీలక సభ్యురాలు.

ఆమె నటించిన సినిమాల పాక్షిక జాబితాను ఇక్కడ చూడవచ్చు:

https://en.wikipedia.org/wiki/G._Varalakshmi#Filmography

అయితే ఆమె వ్యక్తిగత అలవాట్ల కారణంగా ఆమె పతనం ప్రారంభమైంది. ఆవిడ ఇంటివద్ద రాత్రంతా పేకాడడం, ఆవిడ అద్భుతంగా వండే చేపల కూర తినడం, పెద్ద పెద్దగా నవ్వుకోడం జరిగేదని ఆరుద్ర వ్రాశారు. అప్పటికే ఆమె తన భర్తతో విడిపోయారు. ఒక రోజు మద్రాసులో రెజ్లింగ్ పోటీలు చూడడానికి వెళ్ళి అజిత్ అనే వస్తాదుని కలిసారు. అతనంటే ఇష్టం పెరిగి, అతనితో ఉన్నారు. చివరకు పెళ్ళి చేసుకున్నారు. మెల్లిగా సహాయక పాత్రలకు మళ్ళారు. దర్శకుడు తిలక్ గారితో అభిప్రాయభేదాలు రావడంతో ‘ముద్దుబిడ్డ’ చిత్రంలో అవకాశం పోయింది. తన పాత్రల పట్ల ఆమెకి గట్టి అభిప్రాయాలుండేవి, తన అభిప్రాయాన్ని నెగ్గించుకునేందుకు ఆమె దర్శకులతో వాదనకు దిగేవారు. అందుకని ఆ సినిమా అవకాశం తప్పిపోయింది. జగడాలమారి నటి అని పరిశ్రమలో ముద్ర పడిపోయింది. తన సొంత సంస్థలో ఎన్నో విలక్షణ పాత్రలను అవలీలగా పోషించారన్న సంగతి పరిశ్రమ విస్మరించింది. పరిశ్రమని సరిజేయాలని ఆమె అనుకోలేదు, అందరూ భావించే పోకిరితనంతోనే జీవితాన్ని గడిపారు. ఆమెను ఓ విలక్షణమైన నటిగానే గుర్తుంచుకోవాలి!

ఆమె అత్యంత నిక్కచ్చి మనిషి. తోటి నటీనటులతో తనదైన శైలిలో నడుచుకునేవారు. ఇక్కడో దృష్టాంతాన్ని చెప్పాలి.  ఇది తోటి నటి లక్ష్మీరాజ్యంతో జరిగిన వివాదం. 1940లలో వాళ్ళిద్దరూ కలిసి ఒక చిత్రంలో నటించారు. స్టూడియో నుంచి బయటకొస్తుండగా తనని చూసి లక్ష్మీరాజ్యం నవ్వారని వరలక్ష్మికి అనిపించిందట. ఎందుకు నవ్వావని అడిగితే, తాను నవ్వలేదని లక్ష్మీరాజ్యం అన్నారుట. వరలక్ష్మి నమ్మలేదు. కాలి చెప్పు తీసి, లక్ష్మీరాజ్యాన్ని కొట్టారు.. చూస్తున్న వాళ్ళెవరూ జోక్యం చేసుకోలేదట. అందరూ నిర్ఘాంతపోయారుట. లక్ష్మీరాజ్యం కోర్టులో కేసు వేయడంతో ఈ సంఘటన సంచలనం అయింది. చివరగా ఇద్దరు కోర్టు బయట రాజీ కుదుర్చుకుని, ఒకరినొకరు హత్తుకుని, ఈ వివాదానికి ముగింపు పలికారు.

వరలక్ష్మి అజిత్‌ల వైవాహిక బంధం కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఆమె కొడుకు కె.ఎస్. ప్రకాశరావు సుప్రసిద్ధ కెమెరామ్యాన్ అయ్యారు. కానీ కెరీర్ ఉచ్చదశలో ఉండగా అనారోగ్యంతో మరణించారు. వరలక్ష్మి తన చెల్లెలు కూతురు రత్నని పరిశ్రమకి పరిచయం చేశారు. 1968లో ‘మూగజీవులు’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు.

తనలాంటి చీకటి జీవితం మరెవరూ గడపకోడదని ఆమె కోరుకున్నారు. ఛాయాదేవి, వరలక్ష్మి, సావిత్రి కలిసి మద్యం పార్టీలు చేసుకునేవారు. తమకి కీడు చేసినదెవరనే దానిపై వారికి పెద్దగా పట్టింపు లేదు. తాము దారుణంగా ఉన్నట్టు భావించుకుని మద్యం తీసుకునేవారు. అద్భుతమైన మహిళలైన వారిని విమర్శించడం కష్టం.

పెరుగుతున్న వయసు, అనారోగ్య సమస్యల కారణంగా సినిమాల నుంచి విరమించుకున్నారు. ఒంటరి జీవితం గడిపారు. 80 ఏళ్ళ వయసులో 26 నవంబరు 2006 న మృతి చెందారు.


నలుగురు సినీ ప్రముఖులు – విషాదాంత జీవితాలు:

హిందీ చలనచిత్ర రంగంలో బంగారు కాలం అనదగ్గ దశాబ్దంలో (1950-60) నలుగురు మహిళలు చిత్రసీమని ఏలారు.

ఈ అద్భుతమైన తారల మధ్య ఉమ్మడి అంశం – వృత్తిపరమైన విజయాలే కాక – సాధారణంగా సువిదితం కానిది – వారి జీవితాలను ప్రభావితం చేసింది మరొకటి కూడా ఉంది. అదే – ఎంతో ప్రజ్ఞావంతులు, ప్రసిద్ధులు, స్నేహితురాళ్ళు అయిన ఈ నలుగురి జీవితాలు విషాదాంతమవడం!

ఆ నలుగురు – అత్యంత ప్రతిభాశాలి గీతా బాలి, తన ఖాతాలో 1500కి పైగా పాటలు ఉన్న గీతా దత్, వీనస్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్‌గా ప్రసిద్ధి చెందిన మధుబాల, ట్రాజెడీ క్వీన్ మీనాకుమారి.

ఇందులో గీతా బాలి, గీతా దత్ ఇద్దరూ అత్యంత ఆప్త మిత్రులు. సరదాగా ఉండే సహజ వ్యక్తిత్వానికి తోడు గొప్ప కామిక్ టైమింగ్ ఉన్న గీతా బాలీని విషాదంతో ముడిపెట్టడం కష్టం.. కానీ 12 ఏళ్ళ కెరీర్‌లో దాదాపు 70 చిత్రాలలో నటించిన ఈ నటి జీవితం హఠాత్తుగా ముగిసింది. దేశ విభజనకు ముందు ఆనాటి పంజాబ్ లోని అమృత్‌సర్‌లో జన్మించారు గీతా బాలి. సిక్కు మతాధికారి కూతురైన ఈమె అత్యంత పేదరికం కారణంగా సినిమాల్లోకి వచ్చారు. ‘బడీ బెహెన్’ (1950), ‘బాజీ’ (1951), ‘అల్‌బేలా’ (1951), ‘ఆనంద్ మఠ్’ (1952) వంటి సూపర్ హిట్‍లతో అగ్రస్థానంలోకి దూసుకుపోయారు. 1955లో అప్పటికి ఇంకా అగ్ర కథానాయకుడిగా నిలదొక్కుకోని షమ్మీ కపూర్‌తో హఠాత్తుగా వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు – ఒక బాబు, ఒక పాప – తల్లి అయ్యారు. ఆమె కెరీర్ కొద్దిగా పక్కదారి పట్టినా, కొనసాగింది.

అయితే పంజాబ్‌లో జరిగిన ఒక ఔట్‌డోర్ షూటింగ్ దీనినంతటినీ మార్చివేసింది.  ఆమెకి మశూచి సోకింది. ఆమె కోలుకోలేకపోయారు. ఆ జబ్బు ఎంతగా ప్రభావం చూపిందంటే – చివరి రోజుల్లో తన ఒకనాటి రూపానికి ఛాయారూపంగా మిగిలారట. 1965 సంవత్సరం శీతాకాలంలో 35 ఏళ్ళ వయస్సులో గీతా బాలి మరణించారు.

~

ఆమె సేవలని గణించకుండా ఉంటే, హిందీ సినిమా సంగీతపు చరిత్ర అసంపూర్తిగా మిగిలిపోతుంది. గీతా దత్‍కి ముందు వారికి గాని ఆవిడకి తరువాత వారికి గాని ఆమె గొంతులోని స్పష్టతా, స్వరభేదం రాలేదు. దిగ్గజ సంగీత దర్శకులు ఒ.పి.నయ్యర్ ఆమెది ‘సహజమైన అద్భుతమైన’ స్వరం అని పేర్కొన్నారు. ‘తదబీర్ సే బిగడీ హుయీ తకదీర్ బనా లే’ (బాజీ), ‘బాబూజీ ధీరే చలనా’ (ఆర్ పార్), ‘ఠంఢీ హవా కాలీ ఘటా’ (మిస్టర్ అండ్ మిసెస్ 55), ‘యే దిల్ హై ముష్కిల్ జీనా యహాఁ’ (సిఐడి), ‘హమ్ ఆప్ కీ ఆంఖోం మే’ (ప్యాసా), ‘వక్త్ నే క్యా కియా హసీఁ సితమ్’ (కాగజ్ కే ఫూల్) వంటి గొప్ప పాటలు ఆమె పాడినవే.

1930లో ఫరీద్‌పూర్ (తూర్పు బెంగాల్) జమీందారీ కుటుంబంలో జన్మించిన గీతా దత్ – జీవించడానికి ఇష్టపడనంత క్రుంగుబాటులోకి వెళ్ళడానికి కారణాలేమిటి?

1956లో గీతా దత్ కెరీర్ ఉచ్చస్థాయిలో ఉంది. ఆమె ప్రసిద్ధ నటులు-దర్శకుడు-నిర్మాత అయిన గురుదత్‌ని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత సి.ఐ.డి విడుదలయింది. వారి జీవితంలో వహీదా రెహమాన్ ప్రవేశం!

గీతా, గురుదత్‌ల మధ్య బంధం క్షీణించసాగింది. వారి మధ్య సంబంధాలు మునుపటిలా లేవు. గీతా, గురుదత్‌లు ఎన్నో సినిమాలకు పని చేసారు, దత్ తీసిన గొప్ప చిత్రాలు – ‘ప్యాసా’ (1957), ‘కాగజ్ కే పూల్’ (1959), ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ (1962) వంటి చిత్రాలకు గీతా పాటలు పాడారు. ఈ చిత్రాలు సినిమా హాళ్ళలో ఆడుతుండగానే, వారి వైవాహిక బంధం బీటలు వారింది.

గురుదత్ యొక్క అద్భుతమైన సృష్టిగా భావించబడే ‘కాగజ్ కే పూల్’ వాణిజ్యపరంగా పెద్ద విజయం సాధించలేదు. అది ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. ఇటు సినిమా పోవడం, భార్యతో సత్సంబంధాలు లేకపోవడంతో గురుదత్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. 1964లో నిద్రమాత్రలు అధికంగా తీసుకుని గురుదత్ చనిపోయారు. ఆయన మరణం గీతా దత్‌ని బాగా క్రుంగదీసింది. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో అధికంగా మద్యం తీసుకోడం మొదలుపెట్టారు. 1972లో కాలేయ సంబంధ వ్యాధితో గీతా దత్ మరణించారు. ఆప్పుడామె వయసు 41 సంవత్సరాలు మాత్రమే.

~

భగ్నహృదయం, ప్రేమ లేని వివాహం, అనారోగ్యం – ఈ మూడూ మధుబాల బాధామయ జీవితానికి కారణాలు. సంప్రదాయ పఠాన్ కుటుంబానికి చెందిన ఓ తొమ్మిదేళ్ళ ముస్లిం బాలిక ‘బసంత్’ (1942) చిత్రంతో ‘మధుబాల’గా సినీరంగంలోకి ప్రవేశించింది. నిర్మాత కిదర్ శర్మ ఆమెని ‘నీల్ కమల్’ (1947) చిత్రంలో రాజ్ కపూర్ సరసన నటింపజేసినప్పుడు నాయికగా ఆమెకి మొదటి హిట్ వచ్చింది. కానీ ‘మహల్’ (1949) చిత్రంలో ఆమె సుప్రసిద్ధులయ్యారు. అప్పుడామె వయసు 16 ఏళ్ళు. తన అందంతోనూ, నటనా కౌశలంతోనూ ఆమె అందరినీ కట్టిపడేశారు.

1950వ దశకమంతా మధుబాల గొప్ప నటిగా మన్ననలందుకున్నారు. ఆ కాలంలో నటిగా ఉచ్చస్థాయిలో ఉన్నారు. కానీ తనకి ‘వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్’ అంటే గుండెలో చిల్లు ఉందని అప్పుడే తెలుసుకున్నారు.

అయినప్పటికీ ఎన్నో సినిమాలలో… ఉదాహరణకి ‘అమర్’ (1954), ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ (1955), ‘కాలాపాని’ (1958), ‘హౌరా బ్రిడ్జ్’ (1958), ‘చల్తీ కా నామ్ గాడీ’ (1958) వంటి చిత్రాలలో నాయికగా నటించి కెరీర్‍లో ఉన్నత స్థానానికి చేరారు. ఆ కాలంలో సహ నటుడు దిలీప్ కుమార్‌తో ప్రేమ కారణంగా వ్యక్తిగత జీవితమూ ఉత్సాహంగా ఉండేది. అయితే ఏవో కారణాల వల్ల వారి ప్రేమ విఫలమవడం, క్రుంగిపోయిన మధుబాల – కిశోర్ కుమార్‌ని ప్రేమ లేని వివాహం చేసుకోవడం జరిగింది.

‘మొఘల్ ఎ ఆజం’ (1960)లో అనార్కలిగా మధుబాల అత్యద్భుతంగా నటించి విజయ శిఖరాలను అధిరోహించారు. కాని ఆ చిత్రంలో తన మాజీ ప్రేమికుడు దిలీప్ కుమార్‌తో నటించవలసి రావడం ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. ‘మొఘల్ ఎ ఆజం’, ‘బర్సాత్ కీ రాత్’ వరుస విజయాలు సాధించడంతో, మధుబాల జీవించి ఉండగానే ఓ దిగ్గజం అయ్యారు. కానీ అనారోగ్య సమస్యల కారణంగా ఈ విజయాలను ఆమె ఆస్వాదించలేకపోయారు. మధుబాల 1969 ఫిబ్రవరిలో మృతి చెందారు. అప్పుడామె వయసు కేవలం 36 సంవత్సరాలే.

~

హిందీ సినిమా ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి ప్రస్తావన లేకుండా చిత్రసీమ లోని వ్యథాభరిత కథలు ఉండవు. ‘మీనా కుమారి’గా అందరికీ తెలిసిన మహ‌జబీన్ బానో వ్యక్తిగత జీవితం అత్యంత వ్యథాభరితం. నిర్మాత కమల్ అమ్రోహితో ఆమె వైవాహిక జీవితం పీడకలలా మారింది. వరుసగా ఆమె సినిమాలు హిట్ కావడంతో – పేర్లు చెప్పుకోవాలంటే – ‘బైజు బావరా’ (1952), ‘పరిణీత’ (1953), ‘దేరా’ (1953), ‘ఏక్ హీ రాస్తా’ (1956), ‘శారద’ (1957), ‘దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి’ (1960), ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ (1962) – తదితర చిత్రాలు విజయవంతం కావడంతో – ఆమెకూ అహంభావి అయిన ఆమె భర్తకు మధ్య దూరం పెరిగింది. చివరగా 1964లో వారిద్దరూ విడిపోయారు. ఉద్వేగానికి లోనయిన ఆవిడ సుప్రసిద్ధులైన నటుడు ధర్మేంద్ర, గీత రచయిత గుల్జార్ వంటి వారితో బంధం నెలకొల్పుకోవాలనుకున్నారు. నిజానికి ఈ ఉత్థానపతనాలలో ఆమె వెన్నంటి ఉన్నది మద్యమే.

మధుబాలకి ‘మొఘల్ ఎ ఆజం’ ఎలాగో, మీనా కుమారికి ‘పాకీజా’ (1972) అలాగ. ఈ చిత్రం పూర్తవడానికి 17 ఏళ్ళు పట్టినా, మీనా కుమారి నటనా ప్రావీణ్యం ఏ మాత్రం తగ్గలేదు. మార్చ్ 1972లో ఈ సినిమా విడుదలైన కొద్ది వారాలకే కాలేయ సంబంధ వ్యాధితో మీనా కుమారి కన్ను మూశారు. అప్పటికి ఆవిడ వయసు 39 ఏళ్ళే. అయితే ఇదే అనారోగ్యంతో మీనా కుమారి చనిపోయిన కొద్ది రోజులకే గీతా దత్ కూడా చనిపోతారని ఎవరూ ఊహించలేదు.

వృత్తిపరంగా సమాకాలికులు, స్నేహితులు, బాధామయ జీవితంలో భాగస్వాములు అయిన ఈ నలుగురు దిగ్గజాలు ప్రేక్షకులపై చెరపలేని ముద్ర వేశారు. అర్ధాంతరంగా తమ ప్రయాణాలు ముగించినా – ఇతరులు తమ జీవిత కాలంలో సాధించలేని విజయాలను – వీరు కొద్ది కాలంలోనే అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here