అలనాటి అపురూపాలు-66

0
9

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

జంగిల్ హీరోయిన్ చిత్ర:

50,60వ దశాకాల్లో వచ్చిన భారతీయ బి-గ్రేడ్ చిత్రాల నాయిక, తొలి కలర్ జంగిల్ ఫిల్మ్ – ‘జింబో’ (1958) చిత్రం కథానాయిక అయిన చిత్ర గురించి తెలుసుకుందాం.

ఆరేళ్ళ చిన్నారి అఫ్సరున్నీసా తమ సొంతూరు హైదరాబాదులో, తండ్రి వెనుకగా రైలు పట్టాలు దాటుతోంది. నాన్న వెనకే గెంతుతూ, త్రుళ్ళుతూ నడుస్తోంది. ఉన్నట్టుంది కాలు అదుపుతప్పి, రైలుపట్టాలకి దగ్గరగా ఉన్న చిన్న గోతిలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు… చేతి వేళ్ళతో పట్టాలను గట్టిగా పట్టుకుంది. ‘అబ్బా… అబ్బా’ అంటూ నాన్నని పిలవసాగింది. ఆయన కొన్ని అడుగుల ముందున్నారు. ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే చిన్నారి కూతురు కనబడలేదు… కేకలు వినబడుతున్నాయి… ఆ స్వరం వినబడుతున్నవైపు నడిచి, కూతురుని పైకి లేపి రక్షించారాయన. కొన్ని నిమిషాల తర్వాత అవే పట్టాల పైనుంచి ఒక రైలు దూసుకువెళ్ళిందట. సకాలంలో ఆమెను రక్షించకపోయింటే, చేతి వేళ్ళు తెగిపోయేవి. ఆ సంఘటనను చాలా కాలం వరకు మరిచిపోలేకపోయారు.

ఆ ప్రమాదం జరిగి ఉన్నట్లయితే – టార్జాన్ సిరీస్‍లో హాలీవుడ్‌లో జేన్ పాత్ర పోషించిన మౌరీన్ ఓ’సుల్లివన్ స్థాయిలో – భారతీయ టార్జాన్ చిత్రాలలో నటించే చిత్ర అనే గొప్ప నటిని పోగొట్టుకుని ఉండేవాళ్ళం. మనదేశంలో తొలి కలర్ జంగిల్ ఫిల్మ్ – ‘జింబో’ (1958) చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా డబ్ చేశారు. హిందీ చిత్రంలో చిత్ర కోసం ఆశా భోస్లే పాడిన పాట, తెలుగులో పి. సుశీల, పి. బి. శ్రీనివాస్ పాడిన పాటలు హిట్ అయ్యాయి.

ఈ సినిమాకి మరో ఆకర్షణ, విదేశీ నటుడు – పెడ్రో అనే చింపాంజీ. ఈ చిత్రం కోసమే ఆ చింపాజీని భారత్‍కు తీసుకువచ్చారు. ఈ చిత్రంలో ఆజాద్ హీరో. ఆయన భారతీయ జానీ వీస్‌ముల్లర్ లాంటి వారు. చిత్రకీ, పెడ్రోకి మధ్య మంచి బంధం ఏర్పడింది. షూటింగ్ లేనప్పుడు అది చిత్ర కాళ్ళ దగ్గరే కూర్చుని, పాదాలను నాకుతూ ఉండేదిట. చిత్ర దగ్గరకీ ఎవరినీ రానిచ్చేది కాదుట, ఎవరైనా రావాలని చూసినా గోల గోల చేసేదిట.

చిన్న వయసులోనే చిత్ర ఎన్నో బాక్సాఫీస్ హిట్లు అందుకున్నారు. జింబో వాటిల్లో ఒకటి. ఏడేళ్ళ వయసు నుంచి ఆమె సంపాదనే కుటుంబానికి ఆధారమంటే నమ్మశక్యం కాదు. హైదరాబాద్‍లో జన్మించిన చిత్రను వాళ్ళ నాన్న సెలవల్లో బొంబాయి తీసుకువచ్చేవారు. బొంబాయిలో ఆమె పి.ఎన్. అరోరా గారిని కలిసారు. ఆయన తాను తీస్తున్న ‘చోర్ బాజార్’ చిత్రంలో షమ్మీ కపూర్ సరసన నటించే అవకాశం ఇచ్చారు. ఆమె తొలి చిత్రం ‘మా’ (1952)లో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.

చిత్ర పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పుడు బడిలో చదువుకునేప్పుడు కూడా ఎక్కవ సమయం, డ్రెస్సింగ్, మేకప్, పాటలు, డాన్సులతోనే గడిచిపోయింది. “అప్పట్నించే నాకు సినిమాలు అంటే ఇష్టం. చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు. సాయంత్రం సినిమాకి తీసుకెళ్తానని నాన్న బతిమాలితే ఏదో చదివేదాన్ని… కానీ అదీ నా మీద ఎక్కువ ప్రభావం చూపలేదు… చాలా కాలం తర్వాత ఉర్దూలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను” చెప్పారామె.

‘చోర్ బాజార్’ తరువాత, ‘తిలోత్తమ’, ‘పాక్ దామన్’, మహిపాల్ సరసన నటించిన ‘ఆలం ఆరా’ వంటి హిట్ చిత్రాలు అందించారు. తరువాత మద్రాసులో ఎ.వి.ఎం వారి ‘బాప్ బేటీ’, అనంతరం ‘హాతిం తాయ్ కీ బేటీ’, ‘మదారీ’, ఫిరోజ్ ఖాన్ సరసన ‘రిపోర్టర్ రాజు’, ప్రేమ్‌నాథ్‌తో ‘కాతిల్’, రాజేంద్రకుమార్‍తో ‘ఖజాంచీ’ మొదలైన చిత్రాలలో నటించారు. పాత తరం నటుడు దల్జీత్, ప్రదీప్ కుమార్, అజిత్, మహిపాల్, ఫిరోజ్ ఖాన్, ధీరజ్ వంటివారు ఆమె పక్కన హీరోలుగా నటించారు. పి.ఎన్.అరోరా, హోమీ వాడియా, నానాభాయ్ వకీల్ వంటివారి దర్శకత్వంలో 19 సినిమాల్లో నటించారు.

1952లో మొదలుపెట్టి 50కి పైగా సినిమాల్లో నటించారు. వాటిల్లో ఎక్కువ భాగం హిట్లే. 1967-68 మధ్యన ‘బహురూపి’ చిత్రంతో ఆమె కెరీర్ దాదాపుగా ముగిసిపోయింది. ఈ చిత్రంలో ఆమె కొత్త హీరో ధీరజ్ కుమార్ సరసన నటించారు. శ్రీరామ్ బోహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయం సాధించలేదు.

“కానీ నా పతనం కాస్త ముందే మొదలయింది. మా అమ్మానాన్నలు ఇద్దరూ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. నేను మానసికంగా చాలా దెబ్బతిన్నాను. కొద్ది కాలానికి వారిద్దరూ చనిపోయారు. దాంతో నా కెరీర్ కూడా అంతమయింది. నా డేట్స్‌ని సరిగా చూసేవారెవరూ లేకపోయారు. ఫలితంగా నిర్మాతలు నాకు దూరమయ్యారు. అప్పట్లో నేను నా పనిని తప్ప ఇంకేమీ పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది” చెప్పారామె.

చిన్నతనం నుంచే… అంటే కెరీర్ ప్రారంభం నుంచే చిత్ర ఒంటరిగా ఉండేవారు. ఆమెకి స్నేహితులు లేరు. కుటుంబంలో పెద్ద పిల్ల కావడంతో ఆమె పై మోయలేని భారం పడింది. అతి కష్టం మీద మోసారు. తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు సుఖంగా జీవించేలా చూశారామె. వాళ్లంతా జీవితంలో స్థిరపడేట్టు చూశారు. “చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడూ ఒంటరినే. ఒక్కర్తినీ బతుకుతున్నాను, అన్నీ నేనే చేసుకున్నాను. అమ్మానాన్నలు పోయారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. నాకిక అల్లాయే దిక్కు. అల్లాయే నన్ను చూసుకుంటారు…  నాకు అల్లాపై విశ్వాసం ఉంది” చెప్పారామె.

15 ఏళ్ళ పాటు టాప్ హీరోయిన్‌గా ఉన్న కాలంలో, దాదాపు అయిదు-ఆరేళ్ళ పాటు తాను సరిగా తినలేదని, నిద్ర పోలేదని చెప్పారు. ఒకే సమయంలో నాలుగు చిత్రాలకి పని చేస్తూ, రోజుకి నాలుగు షిఫ్ట్‌లలో నటిస్తూ, ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తూ కారులోనే తినడం నిద్రపోవడం చేశారు. “ప్రతీ రోజు అయిదింటికే లేచేదాన్ని, నటిగా బిజీగా లేకపోయినా, ఇప్పుడూ కూడా” అన్నారామె. చిత్ర ఎవరి సహాయం లేకుండా రాణించారు. అందుకామె చింతించరు. ఒక కళాకారిణిగా పూర్తిస్థాయిలో రాణించలేకపోయానన్నదే ఆమె బాధ.

చిత్ర వివాదాలకీ, పుకార్లకీ దూరంగా ఉన్నప్పటికీ, ఆమెని కలవరపరిచిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఒక హీరో (పేరు చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు, అప్పటికే ఆయన వివాహితుడు) చిత్రను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె తండ్రితో మాట్లాడాలనుకున్నాడట. కానీ అప్పట్లో ఆమెకి పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదట. బాగా బిజీగా ఉండేవారు, పెళ్ళాడితే, మొత్తమన్నీ దూరమవుతాయని సంశయించారు. పెళ్ళి విషయాన్ని పక్కనబెట్టి, నటిగా కొనసాగాలానుకున్నారు.

కార్లు పోయాయి, అభిమానుల ఉత్తరాలు ఆగిపోయాయి, ఫోన్ కాల్స్ ఆగిపోయాయి. ఉన్నవారంతా వ్యాజ్యగాళ్ళూ, ఆశ్రితులే.

మౌంట్ మేరీ రోడ్‍లోని ఒక చిన్న, సౌకర్యవంతమైన ఫ్లాట్‍లో ఉండేవారు, తర్వాతి సూర్యోదయం ఆశల్ని, అవకాశాల్ని మోసుకోస్తుందని, నేటి కంటే రేపు బాగుంటుందని విశ్వసించారు. డబ్బుకి కొరతగా ఉన్నా, నెట్టుకొచ్చారు. “కార్లు అమ్మేసాను. బస్సులో వెళ్ళలేను. టాక్సీలు ఖరీదెక్కువ” అన్నారు. “డబ్బు ఏమీ దాచుకోలేదా?” అని అడిగితే, “కష్టకాలంలో ఖర్చయిపోయాయి” అని చెప్పారు

రెండో దఫా అవకాశాల విషయంలో ఆమె ఆశలు వదిలేసుకోలేదు. అల్లాపై విశ్వాసం ఉంచేవారు, ప్రతిరోజు ప్రార్థించేవారు. ఆ సమయంలో ‘ఆప్ బీతీ’ చిత్రంలో ఓ చిన్న పాత్ర దొరికింది. తర్వాత, ధర్మేంద్ర, హేమమాలిని నటించే ‘రజియా సుల్తనా’ చిత్రంలో పాత్ర ఒకటి ఇచ్చారు దర్శకులు కమల్ అమ్రోహి.

“నాకు ఉర్దూలో చక్కని ప్రావీణ్యం ఉందని కమల్ అమ్రోహి నన్ను ఎంచుకున్నారు” అన్నారామె. ఆ తర్వాత ఏవో కొన్ని చిత్రాల్లో చిన్నా చితక పాత్రలు ధరించారు. ఒకనాటి హీరోయిన్‍కి, ఆమె స్థాయికీ, వయసుకీ తగ్గ పాత్రలు ఎవరూ ఇవ్వలేదు. సాధారణంగా సినిమాల్లో ఉండే పాత్రలు – హీరో హీరోయిన్లు, విలన్, వ్యామ్ప్, ఓ తండ్రీ, తల్లీ… అంతే! ఇలాంటి పాత్రలు ఒకనాటి హీరోయిన్‌కి ఇస్తే ఏమవుతుంది?

తనని ఒకరు మోసం చేశారు. అయినా ఆమె అతని పేరు బయటపెట్టలేదు. ఆమె వ్యాపారాలను చూసే నెపంతో, ఆమెను దారుణంగా మోసం చేశారు. ఆమె అతనిని ఎంతగానో నమ్మారు. అతను తప్ప ఆధారపడడానికి మరెవరూ లేకపోయారు. ఈ బంధంలో డబ్బు పోయినా, బంధం నిలిస్తే చాలనుకున్నారు, కానీ అదీ నిలవలేదు. “నా కష్ట కాలంలో, నా వెంట ఎవరూ లేరు, ఒంటరిగానే గుణపాఠం నేర్చుకున్నా, అప్పటికే ఆలస్యం అయిపోయింది” అన్నారు. మతం మారి అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నా, సాధ్యం కాలేదు. అతనితో ఎంత మంచిగా ఉన్నా, ఘోరంగా వంచించాడు. ఆస్తులు పోయి, సినిమాల్లో అవకాశాలు పోయాకా, ఆమెని విడిచి వెళ్ళిపోయాడతను. వేరే స్త్రీని వివాహం చేసుకున్నాడు.

అఫ్ఘనిస్థాన్‌లో ఆమెకో అభిమాని ఉండేవారు. చిత్ర కెరీర్‌లో ఉచ్చస్థాయిలో ఉండగా, ఆమెని చూడ్డానికి వచ్చాడు. ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. ఆమె నటించిన అన్ని చిత్రాలలోని ఫోటోలు ఉన్నాయి అతని దగ్గర. “అఫ్ఘనిస్థాన్‌లో ఒక రెస్టారెంట్‌లో నాది ఒకటి పెద్ద ఫోటో ఉందని, ఆ ఫోటో తనకెంతో ఇష్టమని చెప్పాడు. పదివేల రూపాయలిస్తాను అన్నా ఆ హోటల్ యజమాని దాన్ని అమ్మలేదని చెప్పాడు. ఇప్పటికీ ఆ ఫోటో ఉందో లేదో నాకు తెలియదు” అన్నారు చిత్ర.

ఆర్థికంగా చితికిపోయి, అవకాశాలు క్షీణించి, కాల్‌షీట్లు అడిగే టెలిఫోన్‌ల కోసం నిరీక్షించారు… చివరికి సుదీర్ఘమైన అనారోగ్యంతో 11 జనవరి 2006 నాడు మృతి చెందారు.

https://www.youtube.com/watch?v=xkLWbbi7pyQ

https://www.youtube.com/watch?v=VwmJFpp4vm8


‘మూన్ ఆఫ్ బరోడా’ వజ్రం చేతులు మారిన వైనం:

‘మూన్ ఆఫ్ బరోడా’ అనే పేరుగల వజ్రం ఓ అరుదైన వజ్రం. సుప్రసిద్ధ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో ఈ వజ్రాన్ని హారంలో ధరించారు. ఈ చారిత్రక వజ్రం భారతదేశంలోని గోల్కొండ గనికి చెందినదని ది జెమోలజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నిర్ధారించింది. 20వ శతాబ్దం వరకు ఈ గని అనేక అద్భుతమైన, ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాలను అందించింది.

ఈ వజ్రానికి యజమానులెవరు అనే అంశంపై స్పష్టత లేదు. ఈ వజ్రం గోల్కొండ గనులలో 15 – 17 శతాబ్దాల మధ్య ఎప్పుడైనా లభించి ఉండవచ్చు. ఈ వ్రజం యొక్క తొలి ప్రసిద్ధమైన యజమానులు భారతదేశానికి చెందిన గైక్వాడ్ రాజవంశస్థులు అయి ఉంటారని అంచనా. ఎందుకంటే వాళ్ళు వజ్రాలు లభించే బరోడా ప్రాంతానికి అధిపతులు. ఈ రాచకుటుంబం ఈ వ్రజాన్ని ఆస్ట్రియాకి చెందిన మరియా తెరెసా తల్లి మేరీ ఆంటోనెట్‌కు కానుకగా ఇచ్చారని భావిస్తున్నారు. 1780లో ఆమె మరణానంతరం ఈ వ్రజం తిరిగి గైక్వాడ్ రాజకుటుంబాన్ని చేరింది. 1860 నాటికి దాన్ని అక్రమంగా తరలించి, ఒక హారంలో అమర్చి అమ్మేశారని అంటారు. 1926 నాటికి ఈ వజ్రం, హారం ప్రిన్స్ రామచంద్ర చేతుల్లోకి వచ్చింది. ఆయన దాన్ని అమెరికా తీసుకురాగా, అక్కడ దాన్ని కొత్త యజమానులు సొంతం చేసుకున్నారు. 1953లో ఈ వజ్రాన్ని క్లీవ్‌లాండ్‌లో ఓ వజ్రాల సంస్థ యజమాని శామ్యూల్ హెచ్.డాయిష్ ఆస్తిగా నిర్ధారించారు. ఆయన దాన్ని మిచిగాన్‍లోని డెట్రాయిట్‌కి చెందిన మేయర్ జ్యూయలరీ కంపెనీ అధ్యక్షులు మేయర్ రోసెన్‌బామ్‌కి అమ్మారు.

ఎలా తెచ్చారో తెలియదు కాని రోసెన్‌బామ్‌ ఆ వజ్రాన్ని హాలీవుడ్‍కి తెచ్చి, మార్లిన్ మన్రోకి చూపించారు. ఈ తార ఆ వజ్రపు హారాన్ని ధరించి మార్లిన్ మన్రో కనబడే ప్రకటనలో కొన్ని వివరాలు అందించారు. “జ్యూయలరీ అకాడమీకి ప్రాతినిధ్యం వహిస్తున్న శాంటా మోనికాకి చెందిన మానీ లిప్పెట్ – ‘Gentlemen Prefer Blondes’ అనే 20th సెంచురీ ఫాక్స్ టెక్నికలర్ చిత్రంలో వజ్రాలంటే అమితాసక్తి గల Lorelei Lee పాత్ర ధరించిన మార్లిన్ మన్రోతో ఓ ప్రకటన రూపొందిస్తూ – ఈ ‘మూన్ ఆఫ్ బరోడా’ వజ్రాన్ని పరిచయం చేసి –  ఓ వజ్రానికి ఆప్త మిత్రురాలు” అని అన్నారు. Lorelei Lee నుంచి ఆ వజ్రాన్ని కాపాడడానికి గార్డ్ ఫ్రాన్సిస్ శీషామ్ ఆ వజ్రం పక్కనే నిలుచుని ఉంటాడా ప్రకటనలో.

మార్లిన్ మన్రో ఆ వజ్రపు హారాన్ని ధరించాకా, ఆ వజ్రం సుప్రసిద్ధమయింది. ఆ తరువాత అది ప్రైవేటు కలెక్షన్ లోకి వెళ్ళిపోయింది. 1990లో క్రిస్టీ వారి వేలం పాటలో అది మళ్ళీ ప్రజల దృష్టిలో పడింది. ఆ వేలంలో దాన్ని 297,000 డాలర్లు అమ్మారు. మళ్ళీ రెండు దశాబ్దాల పాటు ప్రైవేటు కలెక్షన్‌లో ఉండిన ఆ వజ్రాన్ని తిరిగి క్రిస్టీ సంస్థ వారే కొనుగోలు చేశారు. గోల్కొండ రత్నాల వైభవాన్ని పుణికి పుచ్చుకున్న బేరీ పండు ఆకారంలోని పసుపురంగు ఈ వజ్రం ఎన్నో అద్భుతమైన స్వర్ణాభరణాల వేలంపాటలలో దర్శనమిచ్చింది. మార్లిన్ మన్రో దీన్ని ధరించడం నిస్సందేహంగా దీని విలువను పెంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here