అలనాటి అపురూపాలు-70

0
9

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ది మాన్ విత్ గోల్డెన్ గిటార్:

దేశంలోని తొలి ఎలెక్ట్రిక్ గిటారిస్టుగా ఘనత వహించిన వాన్ షిప్లే గురించి ఈ వారం తెలుసుకుందాం. హిందీ చిత్రసీమలో సుప్రసిద్ధులైన షిప్లే – గిటార్, వయొలిన్‍లు వాయించడం మాత్రమే కాకుండా – సినిమాలకు సంగీతం కూడా అందించారు. హిందీ పాటలను వాయిద్యాలపై పలికించి ఆల్బమ్స్ విడుదల చేసిన మొట్టమొదడి సంగీతకారుడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో – ఓ క్రిస్టియన్, సంగీత ప్రేమికుల కుటుంబంలో 30 ఆగస్టు 1927 నాడు ‘వాలెంటైన్ వాన్ షిప్లే’ పేరుతో జన్మించారు. ఏడేళ్ళ వయసులో తండ్రి సిగార్ బాక్స్ దొంగిలించి, దానితో ఒక తీగ ఉండే గిటార్‌ను రూపొందించగా, అది పని చేసింది. తన చిన్నారి మిత్రురాలు ‘బబుల్స్’ కోసం ‘ఐ యామ్ ఫరెవర్ బ్లోయింగ్ బబుల్స్’ అనే పాటని వాయించారు. ఆయన తల్లి సితార్ వాయిద్యంలో నైపుణ్యం గలవారు. ఆమె ఉస్తాద్ యూసఫ్ అలీ ఖాన్ వద్ద శిష్యరికం చేశారు. ఆయన తోబుట్టువులు – ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు కూడా సంగీతంలో అభినివేశం ఉన్నవారే. సంగీతం పట్ల తల్లి కున్న ఆసక్తిని, నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్నారు. అయితే సంగీతంలో విశేషంగా రాణించి దాన్ని వృత్తిగా చేసుకున్నది మాత్రం వాన్ రిప్లేనే. ఆర్మీలో ఉన్నతాధికారిగా సేవలందించిన వారి తండ్రి, ఆ తరువాత షహరాన్‌పూర్ లోని బొటానికల్ గార్డెన్స్‌లో పని చేశారు. ఇక్కడే చిన్నారి వాన్ షిప్లే తబలా, వయోలిన్, గిటార్‍లలో శిక్షణ పొందారు.

వయొలిన్‍లో తొలినాటి శిక్షణ అలహాబాద్‍కు చెందిన గగన్ ఛటర్జీ అనేవారి వద్ద తీసుకున్నారు షిప్లే. సుప్రసిద్ధ ‘ఖయ్యాల్’ గాయకులైన ఉస్తాద్ బందే హసన్ ఖాన్, వారి కుమారులు ఉస్తాద్ జిందే హసన్ ఖాన్‍ల వద్ద హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఈ చిన్నారి త్వరలోనే వారికి వయొలిన్‍లో సహవాద్యగాడయ్యారు. అదే సమయంలో షిప్లే పాశ్చాత్య సంగీతంలోనూ శిక్షణ పొందారు. బడిలో ఉస్తాద్ విలాయత్ ఖాన్‌తో స్నేహం నెరిపారు. 1941లో కలిసిన పండిట్ రవిశంకర్‍తో వారిది చిరకాల మిత్రత్వం అయింది.

హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉన్న ఆసక్తి కారణంగా ఆయన, 1940లలో ఓ విశిష్టమైన ఎనిమిది తీగల గిటారును తయారుచేసుకున్నారు. దీనివల్ల భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని గిటార్‍పై పలికించడం సాధ్యమైంది. ఆయన ఒక ఎలెక్ట్రిక్ వయొలిన్‌ని కూడా రూపొందించారు, దానికి ‘జిప్సీ వయొలిన్’ అని పేరు పెట్టారు. తన తదుపరి అన్ని రికార్డులలో దానిని ఉపయోగించారు. కొలంబియా రికార్డుల వారి కోసం రాగ్ జోగియా, రాగ్ యమన్ కళ్యాణ్ రాగాలను గిటార్‌పై వాయించడం ఆయన సాధించిన విజయాలు.

1940లో ఆయనకి గాయకుడు తలత్ మహమూద్‍తో పరిచయం అయింది. అప్పట్లో ఆయన లక్నో ఆకాశవాణిలో ఘజల్స్ పాడుతుండేవారు. ఆయన తనతో ఉండాల్సిందిగా షిప్లేని కోరారు. అప్పట్నించి ఆయన జీవితం సంగీతం చుట్టూనే తిరగసాగింది. లక్నోలో ఉండగా షిప్లే ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ వద్ద వయొలిన్‍లో శిక్షణ కొనసాగించారు. అప్పటి ఆకాశవాణి లక్నోలో మ్యూజిక్ డైరక్టర్ అయిన ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ వద్ద సరోద్ పాఠాలు నేర్చుకున్నారు.

సినీ సంగీతం ఆహ్వానించడంతో, ఆయన పూణె వెళ్ళి ప్రభాత్ స్టూడియోలో చేరారు. అక్కడ ఆయన మొదటి పని – ‘చాంద్’ (1944) చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న ‘హుస్న్‌లాల్ – భగత్రం’ గార్లకు సహాయ సంగీత దర్శకుడిగా వ్యవహరించడం. పూణెలో వుండగా ఆయనకి దేవ్ ఆనంద్, గురు దత్‍లతో పరిచయం కలిగి శాశ్వత స్నేహమయ్యింది. అలాగే కారెక్టర్ ఆరిస్టులు రెహ్మాన్, సప్రూలతో స్నేహం కలిసింది. ప్రభాత్ స్టూడియో విడిపోయినప్పుడు – రిప్లే బొంబాయికి వెళ్ళి నిర్మాత బాబూరావ్ పాయ్‍తో చేరారు.

ఆయన తొలి సినిమాలు – ‘నర్గిస్’ (1946), ‘అన్‍మోల్ ఘడీ’ (1946), ‘మేరా సుహాగ్’ (1947). తరువాతి కాలంలో ఆయన ఖేమ్‌చంద్ ప్రకాష్, సి. రామచంద్ర, అనిల్ బిస్వాస్, రోషన్, గులామ్ హైదర్ వంటి సంగీత దర్శకులతో పని చేశారు.

1947 షిప్లే ఆరు నెలల పాటు దక్షిణ అమెరికా, హవాయి దీవులు, దక్షిణాఫ్రికా పర్యటించి అక్కడి సంగీత రీతులను అధ్యయనం చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చాకా సోలోయిస్ట్‌గా సంచలనం సృష్టించారు. గిటారిస్ట్‌గా, వయొలనిస్ట్‌గా ఆయనకి బాగా డిమాండు వచ్చింది.

ఈ సమయంలోనే ఆయనకు అదృష్టం కలిసొచ్చింది. నటి నూతన్ కుటుంబంతో షిప్లేకి పరిచయం ఉంది. తాను చదువుతున్న సెయింట్ జేవియర్ కాలేజ్‍లో ఒక ప్రదర్శన ఇస్తారా అని నూతన్ షిప్లేని అడిగారు. అందుకు అంగీకరించారు షిప్లే. ఆ ప్రదర్శనకి నటుడు, దర్శక-నిర్మాత రాజ్ కపూర్ హజరయ్యారు. ఆయన అంతకు ముందు ఏడాదే దర్శకుడిగా తన తొలి సినిమా విడుదల చేశారు. వయొలిన్‌లో షిప్లే కున్న ప్రావీణ్యం నచ్చిన రాజ్ కపూర్, తన తదుపరి సినిమా ‘బర్సాత్’ (1949)కి పని చేయవలసిందిగా షిప్లేని కోరారు. ఈ సినిమా అంతా రాజ్ కపూర్ వయోలిన్ వాయిస్తూ కనిపిస్తారు, తనకి వయొలిన్ ప్లేబాక్ వాయించమని షిప్లేని కోరారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో షిప్లేకీ మంచి పేరొచ్చింది. ఆయన సోలో వయొలిన్‍కి ఎంత పేరొచ్చిందంటే – చివరికి ఆయన వయొలిన్ వాయిస్తున్న బొమ్మే ఆర్.కె. ఫిల్మ్స్ వారి లోగో అయింది. రాజ్ కపూర్ సంగీతకారుల బృందంలో షిప్లే ఒకరయ్యారు.

1952 నాటి ‘ఆవారా’ చిత్రంలో డ్రీమ్ సీక్వెన్స్‌కి తొలిసారిగా ఎలెక్ట్రిక్ గిటార్ వాడారు షిప్లే. అదొక సంచలనం! షిప్లేని మహామహుల సరసన చేర్చింది. 1975లో ‘శాల్యూట్ టు రాజ్ కపూర్’ కార్యక్రమంలో షిప్లే వాయించిన వయొలిన్ – న భూతో న భవిష్యతి! షిప్లే గొప్ప సంగీతకారుడు! సుమారు 1500 చిత్రాలకు పైగా పని చేశారు. ఫిల్మ్ క్రెడిట్స్‌లో తమ పేరు తెరపై పత్యేకంగా ఒక్కటే కనబడే కొందరు సంగీతకారులలో షిప్లే ఒకరు. సినిమా పాటలను పూర్తిగా వాయిద్యాలపై వినిపించిన సంగీతకారులలో ఆయన మొదటివారు. 1950 నాటి తొలి రోజులలో – ‘బర్సాత్’ ఘన విజయం సాధించిన అనంతరం ఆయన రికార్డింగ్ కంపెనీ హెచ్.ఎం.వి. దృష్టిలో పడ్డారు. ఇండివిడ్యువల్ ఇన్‌స్ట్రుమెంటలిస్ట్‌గా వారు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కంపెనీ కోసం తొలిసారిగా ‘తుమ్ భీ భులా దో’ (జుగ్ను) అనే పాట ఇన్‍స్ట్రుమెంటల్ వెర్షన్‌ని గిటార్‍పై వాయించారు.

18 మార్చ్ 1952 నాడు ఓలివ్‌ని వివాహామాడారు. తరువాతి కాలంలో వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు.

1955లో వాన్ షిప్లే – అకార్డియన్ ప్లేయర్ ఇనాక్ డేనియల్స్‌తో జట కట్టారు. వీరికి గతంలో పూణేలో ప్రభాత్ స్టూడియోలో పని చేసినప్పుడు పరిచయం ఉండేది. వీరి భాగస్వామ్యం అనేక ఏళ్ళ పాటు కొనసాగింది. 1956లో షిప్లే – తలత్ మహమూద్, సి.హెచ్. ఆత్మ, ఇనాక్ డేనియల్స్‌తో కలిసి బ్రిటీష్ ఈస్ట్ ఆఫ్రికా పర్యటించారు. అక్కడ – భారతీయ కళాకారుల కార్యక్రమాలకు ఆద్యులయ్యారు.

వాన్ షిప్లేకి ప్రయాణాలన్నా, ప్రజలని కలుసుకోవడమన్నా, లైవ్ షోల ద్వారా లభించే విశేష అనుభవాలన్నా బాగా ఆసక్తి. ఆయన ప్రపంచంమంతా తిరిగారు. యూరప్, మిడిల్ ఈస్ట్, కరేబియన్ దీవులు, సురినామ్, గయానా… ఇంకా అమెరికాలోని పలు నగరాలు – న్యూ యార్క్, వాషింగ్టన్ డిసి, లాస్ ఏంజిలిస్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, బఫెలో, డెట్రాయిట్…లలో పర్యటించారు, ప్రదర్శనలిచారు. ఇదంతా గమనించిన కాపిటల్ ఇండస్ట్రీస్ సంస్థ మాజీ సిఇవో, అధ్యక్షుడు అయిన భాస్కర్ మీనన్ ఆయనను ‘ది రెస్ట్‌లెస్ గ్లోబ్‌ట్రాటర్’ అని పిలిచారు.

చౌ ఇన్ లై, గమల్ అబ్దెల్ నాసర్, అలెక్సీ కోసిజిన్, ఇందిరా గాంధీ, వివి గిరి వంటి దేశాధినేతల సమక్షంలో షిప్లే ప్రదర్శనలిచ్చారు. ఇరాన్ అధినేత పదవీ స్వీకారం సందర్భంగా, 1957లో నైరోబీలో అగా ఖాన్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా, మరోసారి ప్రధాని జవహర్‍లాల్ నెహ్రూ ఎదుట ప్రదర్శనలిచ్చారు. ఆ ప్రదర్శన అమితంగా నచ్చిన నెహ్రూ షిప్లేకి ఎర్ర గులాబీ కానుకగా ఇచ్చారు.

షిప్లే దాతృత్వ కార్యక్రమాల కోసం కూడా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. తన ప్రతిభని ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అందుబాటులో వుంచేవారు. వరదలు, కరువు, క్షామం వంటి ప్రకృతి వైపరీత్యాల సంభవించినా, రెడ్ క్రాస్ కొరకు, పోలీస్ సంక్షేమం కొరకు, పేద విద్యార్థుల కొరకు, అంధుల కొరకు, రిటైరయిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్ సిబ్బంది సంక్షేమం కొరకు, నిధుల సమీకరణ కోసం ఎన్నో ప్రదర్శనలిచ్చారు. కశ్మీరులో వరదల అనంతరం సహయ నిధి కోసం, ప్రధానమంత్రి సంక్షేమ నిధికి విరాళాల కోసం ప్రదర్శనలిచ్చారు షిప్లే.

షిప్లే స్వచ్ఛమైన ఉర్దూ మాట్లాడేవారు. రాసేందుకు సొంత కాలీగ్రఫీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చక్కని పెయింటర్, అభిరుచి గల ఫోటోగ్రాఫర్ కూడా.

కొన్ని సినిమాలలో ఆయన నటించారన్న విషయం ఎక్కువమందికి తెలియదు. మొదట్లో ‘ఫరేబ్’ (1953), ‘ధరమ్‌పత్ని’, ‘కార్నివాల్ క్వీన్’, ‘చా చా చా’ వంటి చిత్రాలలో అతిథి పాత్రలతో నటించి, కొన్ని చిత్రాలలో హీరోగాను నటించారు. ఆయన అభిప్రాయంలో, అవి అంతగా విజయవంతం కాలేదు.

వాన్ షిప్లే తొలి స్వతంత్ర్య రికార్డు 1952లో విడుదలయింది. దాని పేరు ‘ది మాన్ విత్ గోల్డెన్ గిటార్’. ఆ పేరు ఆయనకు సార్థకమయింది (అప్పటి నుండి 1982 వరకు ప్రతీ ఏడాది ఒక రికార్డు విడుదల చేస్తూనే వున్నారు). వాన్ షిప్లే 8 మార్చ్ 2008 నాడు హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. కానీ ఆయన సంగీతం ఇప్పటికీ అలరిస్తూనే వుంది. అనేకమంది నేటికి కూడా ఇంటర్‌నెట్‍లో ఆయన సంగీతం కోసం వెతుకుతూనే ఉన్నారు.


తనని తాను తెలుసుకునేందుకు ప్రయత్నించిన బేబీ పెగ్గీ:

పసిబిడ్డగా ఉండగానే, 1920ల నాటి మూకీ సినిమాలో శకంలో హాలీవుడ్‍లో చైల్డ్ స్టార్‌గా వెలుగొందారని చాలామందిచే భావించబడిన కళాకారిణి బేబీ పెగ్గీ. బాల్యంలో బేబీ పెగ్గీగా ప్రసిద్ధమైన నటి డయానా సెర్రా కేరీ. 1918లో జాక్, మరియన్ మోంట్‌గోమేరీ దంపతులకు కేరీ జన్మించారు. ఏడాదిన్నర వయసులో మొదటి చిత్రంలో నటించారు.

silentsaregolden.com అనే వెబ్ సైట్‌కి 1996లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హాలీవుడ్‌లో తన జయాపజయాల గురించి ఎన్నో వివరాలు చెప్పారు కేరీ.

***

మా పొరుగింటావిడ సినిమాలలో ఎక్స్‌ట్రాగా నటించేవారు. ఒక రోజు ఆమె తన పారితోషికం తీసుకోవడానికి సెంచురీ స్టూడియోస్‌కి వెడుతూ, అమ్మని తోడుగా రమ్మంది. అప్పటిదాక సినిమా షూటింగ్‌లు చూడని అమ్మ సరేనంది, నన్ను కూడా తీసుకువెళ్ళింది. అక్కడ ఓ దర్శకుడు తన చిత్రాల్లో నటించే ఓ కుక్క పక్కన ఉండేందుకు చిన్న పిల్లల కోసం చూస్తున్నారట. నన్ను చూపి ఎంపిక చేసుకున్నారు. అలా 1921 నాటి ‘ప్లేమేట్స్’లో తొలిసారిగా నటించాను. అందులో నా కోస్టార్ బ్రౌనీ అనే కుక్క. నాకూ, కుక్కకీ సమానమైన పారితోషికం ఇచ్చారు. ఆ సినిమా విజయవంతమవడంతో నాకు కాంట్రాక్టు లభించింది. నా చిన్నప్పటి పేరు పెగ్గీ-జీన్ మోంట్‌గోమేరీ నుంచి బేబీ పెగ్గీ అని పేరు వచ్చింది.

సినిమాలో హార్స్‌మాన్‌గా పని చేసే నాన్న జాక్ ప్రోత్సాహం తోడయ్యింది. నాన్న వెస్ట్రన్ స్టార్ టామ్ మిక్స్‌తో పనిచేసేవారు. యవ్వనంలో ఉన్నప్పటి నుంచి ఆయన గుర్రాలను పెంచేవారు. ‘దేనికైనా శిక్షణ ఇవ్వచ్చు’ అని నమ్మేవారు. అందుకని మాతో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ఈ పద్ధతి మా సోదరి లూయిస్ విషయంలో విఫలమైంది.” చెప్పారామె.

~

బేబీ పెగ్గీని మరో బాల సూపర్ స్టార్ షిర్లే టెంపుల్‍కి అగ్రగామిగా భావిస్తారు. 1924లో రచించబడిన లారా ఇ రిచర్డ్ పుస్తకం ఆధారంగా 12 ఏళ్ళ తరువాత తీసిన ‘Captain January’ చిత్రం షిర్లేకి పేరు తెచ్చింది. 1923లో విడదలైన The Darling of New York అనే చిత్రం బేబీ పెగ్గీకి ఖ్యాతి తెచ్చింది. ఇది ఆమె తొలి ఫీచర్ ఫిల్మ్.

కొద్దిరోజులకే పెగ్గీ ‘మిలియన్ డాలర్ బేబీ’ అయ్యారు. ప్రొమోషన్లు, టూర్లు, బహిరంగ ప్రదర్శనలు, అభిమానులను కలుసుకోవడం!

ఐదేళ్ళ వయసులోపు బేబీ పెగ్గీగా కేరీ 150 సినిమాలు చేశారు. కంపెనీలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం కారణంగా ఆ చిత్రాలన్నీ నాశనమయ్యాయి. అయితే ఈ చిన్నారికి ప్రమాదాలు/సాహసాలు కొత్తేం కాదు! షూటింగ్‌లలో ఆమె భద్రతకి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్న ఆధారాలు లేవు. షాట్ ఓకే అయ్యేంత వరకూ ఓ షూటింగ్‍లో ఆమెను నీటిలో ముంచి ఉంచారు. మరో సినిమాలో ఒక ట్రక్ వెనుక మేకతో పాటు కట్టేసారు. ‘డార్లింగ్ ఆఫ్ న్యూ యార్క్’ అని పేరు పొందిన ఈ పాప – అగ్ని ప్రమాదం జరిగిన ఓ భవంతి నుంచి తప్పించుకోవాలి… అందుకని ఓ భవంతికి నిజంగా నిప్పంటించి, అందులోంచి బేబీ పెగ్గీ బయటపడేలా చిత్రీకరించారు.

తల్లిదండ్రుల విలాసవంతమైన జీవనశైలి వల్ల పెగ్గీ ఆదాయం క్షీణించింది. “సెంచురీ, యూనివర్సల్ స్టూడియో‌లకి కాంట్రాక్ట్ నటిగా ఉన్నప్పుడు వారు పెగ్గీకి ఏడాదికి 1.5 మిలియన్ డాలర్లు చెల్లించారు” అని ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. “జాక్, మరియన్ – తమ కూతురు సంపాదనని చూసుకునేవారు. ఖరీదైన కార్లను, భవంతులను, బట్టలను కొన్నారు. పాప సంక్షేమాన్ని అసలు పట్టించుకోలేదు”. బేబీ పెగ్గీ లాంటి వారు పరిశ్రమలో ఒకరే ఒకరు ఉంటారు. ఆమె బొమ్మలు తయారు చేశారు. అటువంటి బొమ్మని చిన్నారి జూడీ గార్లాండ్ కొనుక్కున్నారు. ఎన్నో ఏళ్ళ తర్వాత, పెగ్గీకి, జూడీకీ స్నేహం కలిసింది.

1925 నుంచి పెగ్గీ ప్రభ మసకబారసాగింది. ఆమె తండ్రి నిర్మాత సోల్ లెస్సెర్‌తో పారితోషికం విషయంలో గొడవపడ్డారు. వెండితెరపై అవకాశాలు తగ్గడంతో, రంగస్థలంపై ప్రయత్నించారు. అయితే 1929 నాటి స్టాక్ మార్కెట్ పతనం పెగ్గీ అవకాశాలని మరింత దెబ్బతీసింది.

~

ప్రశంసలు ఆగిపోయాయి. “అప్పుడు నాకు 16 లేదా 18 ఏళ్ళు ఉంటాయి, నా అందమైన చిత్రాన్ని ఒకటి చిత్రించారు. నేను దాన్ని తీసుకోవాలనుకున్నాను. అక్కడి క్లర్క్ పక్కకి ఒరిగి, హేళనగా మాట్లాడాడు” చెప్పారామె ఇంటర్వ్యూలో.

~

1930లో హాలీవుడ్‍లో మరోసారి ప్రయత్నించారు… కానీ పూర్వ వైభవం పొందలేకపోయారు. మనోస్థైర్యం చెదరని పెగ్గీ రచయిత్రిగా ప్రయత్నించారు, చిన్ననాటి నుంచే రచనలంటే ఆసక్తి అని చెప్పారు. ఒక కెరీర్ నుంచి మరో కెరీర్‍కి మారడం నెమ్మదిగా సాగే ప్రక్రియ. ప్రింట్ రంగంలో రాణించేందుకు పెగ్గీ గట్టిగా కృషి చేశారు.

కానీ సరైన బ్రేక్ రాలేదు. ఏళ్ళు గడుస్తున్నాయి. “30లలో, చాలామంది సైలంట్ ఎరా స్టార్స్ లానే, నాపైనా ఎన్నో పుకార్లు వచ్చాయి, అపవాదాలు వచ్చాయి… మా అమ్మానాన్నలపై వదంతులు చెలరేగాయి… వైఫల్యం అంటే ఏమిటో అర్థమైంది” అన్నారు.

వివాహాలు, విడాకులు:

1938లో పారిపోయి పెళ్ళి చేసుకున్న మొదటి భర్త, నటుడు అయిన Gordon Ayres కి 1948లో విడాకులిచ్చారు. “ఈ విడాకులతో నాకు బంధనాలు తెగినట్టనిపించింది. నేను ఎదుగుతున్నప్పటి నుంచీ నాకు ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి” అని చెప్పారామె. “బేబీ పెగ్గీ మహాశక్తిమంతురాలు. ప్రసిద్ధి చెందినది… కానీ ఈ నేనెవరో ఎవరికీ తెలియదు… ఈ గుర్తింపు సమస్య ప్రపంచమంతా తెలుసు… నేను దీన్ని పరిష్కరించుకోవాలి” అన్నారు.

రెండవ వివాహం మరో నటుడు బాబ్ కేరీ‌తో అయింది. 1954 నుంచి 2001లో ఆయన చనిపోయేవరకు వారు కలిసి జీవించారు. ఆ కాలంలో పెగ్గీ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ దంపతులకి మార్క్ అనే కొడుకు ఉన్నాడు. “ఆమె తనతో తాను, తన బాల్యంతోనూ ఎలా ప్రేమగా ఉండాలో గ్రహించారు… ఎందుకంటే తన కథ ద్వారా ఇతరులకు ఎలా ఉండాలో నేర్పించాలనుకున్నారు” అని ది మెయిల్ పత్రిక రాసింది.

తండ్రితో తనకి సరైన సంబంధాలు లేనప్పటికీ, తన మొదటి పుస్తకం Hollywood Posse (1975) లో తన తండ్రి గురించి, ఆయన కౌబోయ్ స్నేహితుల గురించి రాసినప్పుడు వాళ్ళ మధ్య అపోహలు తొలగాయి. “వీళ్ళది హాలీవుడ్‌లో విశేషమైన బృందం. వీళ్ళ గురించి ఎవరూ రాయరు… వీళ్ళు హాలీవుడ్‍లో ముఖ్యమైన భాగం” అని ఇంటర్వ్యూలో చెప్పారామె.

1996లో రాసిన ‘Whatever Happened to Baby Peggy?’ అనే రచనలో తన చిన్ననాటి అనుభవాలను వెల్లడించారు. 2003లో తన సమకాలికుడు, నటుడు జాకీ కూగన్ జీవిత చరిత్రను రాసి ప్రచురించారు. ఆమె రచనలు ఆమె సినిమాల పట్ల పునరాసక్తిని కలిగించాయి.

‘మిలియన్ డాలర్ బేబీ’గా తన జీవితాన్ని ఒకసారి పునరావలోకనం చేసుకున్నారు. “జీవితం సాగవలసిందే… నాకు చేతనైనట్లుగా నేను దాన్ని దిద్దుకున్నాను. నాకు దేని మీదా, ఎవరి మీదా – హాలీవుడ్ మీదా- పగా, కోపం లాంటివి ఏవీ లేవు. నేను ప్రశాంతంగా ఉన్నాను” అన్నారామె ఇంటర్వ్యూలో.

~

డయానా సెర్రా కేరీ 101 ఏళ్ళ వయసులో కాలిఫోర్నియాలోని తన స్వంత ఇంట్లో చనిపోయారు.

ఈ క్రింది లింక్‌లలో ఆమె వీడియోలు చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=i-vPdI4YJhE

https://www.youtube.com/watch?v=Kz4ovPY_wWM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here