అలనాటి అపురూపాలు-71

0
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సోహ్రాబ్ మోడీ తీసిన ‘ఝాన్సీ కీ రాణీ’ చిత్రం వెనుక కథ:

మెహతాబ్ వీరనారి ఝాన్సీ రాణి పాత్రలో నటించగా, అత్యంత భారీగా వ్యయంతో సోహ్రాబ్ మోడీ దర్శకత్వంలో 1953లో విడుదలయిన చిత్రం ‘ఝాన్సీ కీ రాణీ’.

మనం కనుక కెమెరాని అశ్వారూఢయై ఉన్న రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహంపై స్థిరంగా ఉంచి చూస్తే, ఆమె కత్తి, నడుం వెనుక ఉన్న బిడ్డ ఉన్న ఫ్రేమ్ – సజీవంగా ఉన్నట్టు అనిపించి భావోద్వేగాలతో శరీరం వణుకుతుంది. బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించి 1858లో యుద్ధరంగంలో 29 ఏళ్ళకే వీరమరణం పొందిన లక్ష్మీబాయి ఘనత అంతటి గొప్పది. కాబట్టి ఈ స్వాతంత్ర్య సమరయోధురాలిపై తీసిన సినిమాలు సైతం గొప్పగానే ఉండడం అసహజం కాదు.

ఈ దిగ్గజంపై తీసిన ఈ గొప్ప సినిమాలో నాటకీయత విశిష్టమైనది. దాదాపు 68 ఏళ్ళ క్రితం తీసిన ఈ హిందీ చిత్ర నిర్మాణం ఘనమైనది. రాణి వైభవాన్ని కళ్ళకు కట్టేలా చిత్రీకరించిన చిత్రం. సోహ్రాబ్ మోడీ గారి ‘ఝాన్సీ కీ రాణీ’ టెక్నికలర్‌లో తీసిన మొదటి భారతీయ చిత్రం. కొందరు అంతర్జాతీయ నిపుణులతో, అత్యాధునిక సాంకేతికతతో హిందీ, ఇంగ్లీషు భాషలలో ఈ చిత్రాన్ని తీశారు.

“మా నాన్నగారు తీసిన ‘ఝాన్సీ కీ రాణీ’ ఒక మాగ్నం ఓపస్. ఎన్నో ఏళ్ళ పాటు మాట్లాడుకునే చిత్రంగా దానిని తీయాలనుకున్నారు” చెప్పారు దర్శకుడి కుమారుడు మెహెల్లీ మోడీ. ఆయన లండన్‍లో సినీ డివిడిల వ్యాపారంలో ఉన్నారు. వీరనారి ఝాన్సీ రాణి పాత్రలో అప్పటి సుప్రసిద్ధ నటి మెహతాబ్ నటించారు, సంగీతం వసంత్ దేశాయ్ అందించారు. ఈ ప్రాజెక్టు దర్శకుడికి చిరకాలవాంఛ.

సోహ్రాబ్ మోడీ అప్పటికే ప్రసిద్ధ దర్శకులు. ఎన్నో సాంఘిక, చారిత్రక చిత్రాలు తీశారు. పుకార్ (1939), సికందర్ (1941), పృథ్వీ వల్లబ్ (1943), ఏక్ దిన్ కా సుల్తాన్ (1945) ఇంకా శీష్ మహల్ (1950) వీటిల్లో ముఖ్యమైనవి. 1942 నుంచే ఆయన ‘ఝాన్సీ కీ రాణీ’ తీయాలని ప్రయత్నిస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్నందున, చాలా వ్యయం అవుతుందన్న కారణంతో కాస్త ఆలస్యం చేశారు. అయితే సినిమాని నిర్మించి, 24 జనవరి 1953న విడుదల చేసాకా, అది ఫ్లాప్ అయింది.

“ఆ రోజుల్లో కోటి రూపాయల దాకా ఖర్చయింది. అంటే, దేశంలోని ప్రతి ఒక్కరూ ఆ సినిమాని చూసినా, మేం పెట్టిన డబ్బు వెనక్కి వచ్చేది కాదు” చెప్పారు మెహెల్లీ మోడీ. ఈ చిత్రం ఆర్థికంగా పరాజయం పాలవడంతో సోహ్రాబ్ మోడీ, వారి మినర్వా మూవీ టోన్ బానర్‌తో సహా అప్పుల పాలయ్యారు.

నిర్మాణ వ్యయం అధికమవడానికి ఒక కారణం – టెక్నికలర్‍లో ఉన్న త్రీ-స్ట్రిప్ టెక్నాలజీ. అంటే ఒక బొమ్మని చూపించడానికి ఒకే కెమెరా ద్వారా మూడు వేర్వేరు స్ట్రిప్‌లను నడిపి వాటిని చివర్లో కలిపి ప్రాసెస్ చేయడం! “గాన్ విత్ ది విండ్, ఎ మాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ వంటి సినిమాలను ఈ టెక్నాలజీతో తీశారు” చెప్పారు మెహెల్లీ మోడీ. అప్పట్లో టెక్నికలర్‍ని భారతీయ లేబొరేటరీలు ప్రాసెస్ చేయలేకపోవడంతో, మోడీ సినిమాని పూర్తి చేయడానికి 1952లో ఎన్నో వారాల పాటు లండన్‍లో బస చేయాల్సి వచ్చింది. ఈ చిత్రం The Tiger and the Flame అనే పేరుతో 1956లో ఇంగ్లీషులోనూ విడుదలయింది.

“రెండు వేర్వేరు గోళార్ధాలకు, వేర్వేరు అభిరుచులున్న ప్రేక్షకులకు చిత్రాన్ని అందించేందుకు రెండు వెర్షన్స్ రూపొందించడం అంత సులభం కాదు” అని మెహెల్లీ మోడీ ఆధీనంలో ఈ చిత్ర సమాచార కరదీపికలో పేర్కొన్నారు. “12 ఛానెల్స్‌లో సౌండ్‌ని రీరికార్డింగ్ చేసి, మిక్స్ చేశారు”.

ప్రీప్రొడక్షన్ పనులు, దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947లోనే మొదలయ్యాయి. ఈ స్వాతంత్ర పోరాటంలోనే లక్ష్మీబాయి బ్రిటీషు వారిని ఎదిరించి ప్రాణత్యాగం చేసింది. ప్రామాణికత కోసం ఆర్ట్ డైరక్టర్లు రూసీ బ్యాంకర్, పండిట్ దూబే లను ఝాన్సీ, గ్వాలియర్, సాగర్, కల్పి, చందేరీ, మీరట్ వంటి నగరాలలో పర్యటింపజేశారు. “వేలాది ఫోటోలు తీశారు, వేలాది నోట్సులు తయారు చేశారు. పైగా 67మంది చరిత్రకారుల రచనలను సంప్రదించారు” అని ఈ చిత్ర సమాచార చేపుస్తకంలో పేర్కొన్నారు.

ఈ చిత్రం షూటింగ్‍ 18 జనవరి 1951 నాడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భపు ప్రాముఖ్యతని అనుసరించి, దేశపు తొలి సైన్యాధికారి కె.ఎం. కరియప్ప గారిచే ఈ చిత్రం ముహూర్తం క్లాప్‍ కొట్టించారు.

తొలుత ఈ చిత్రాన్ని దాదాపు 5,000 అడుగుల వరకు మోడీ బ్లాక్ అండ్ వైట్‍లో చిత్రీకరించారు. “కానీ రాణి జీవించిన కాలంలోని వైభవాన్ని, ఆనాటి ఆడంబరాన్ని, రంగు రంగుల దుస్తులను దృష్టిలో ఉంచుకుని ఆయన టెక్నికలర్‌కి మళ్ళారు” అని ఈ చిత్ర సమాచార చేపుస్తకం తెలిపింది.

చిత్రాన్ని కలర్‌తో తీయడానికి అవసరమయ్యే పరికరాలు 1951 సెప్టెంబరులో లండన్ నుంచి బొంబాయి చేరాయి. ఇందులో 275-కిలోవాట్ జనరేటర్, తాజా ఆర్క్ లైట్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, కేబుల్స్, సౌండ్ ఎక్విప్‍మెంట్, ఇంకా వెయ్యినొక్కటి విడిభాగాలు ఉన్నాయి. హాలీవుడ్ కలర్ కన్సల్టంట్ జార్జ్ జెన్‍కిన్స్‌నీ, ఆస్కార్ అవార్డు గెలిచిన అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఎర్నెస్ట్ హాలర్‌ని సోహ్రాబ్ ఈ సినిమా కోసం నియమించుకున్నారు. ఈయనే ‘గాన్ విత్ ది విండ్’ (1939), ‘ది ఫ్లేమ్ ఆఫ్ ది యారో’ (1950) చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.

ఏ ఖర్చునైనా భరించేందుకు సోహ్రాబ్ సిద్ధమయ్యారు. 22 ముఖ్యమైన సెట్లు ఉండేవి. అందులో ప్రధానమైన రాజమహల్, విశాలమైన గ్రంథాలయాలు ఉన్నాయి. మెహతాబ్ కనీసం 60 కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చింది. ముంబయి శివార్లలో అయిదున్నర ఎకరాల స్థలంలో ఝాన్సీ రాజ్యం సెట్ వేశారు. “ఆ సెట్‍లో గ్రానైట్ రాళ్ళతో రూపొందించిన భారీ ఝాన్సీ కోట ఉంది. ప్రతి బురుజు నిజమైన బురుజు ఎంత ఎత్తు ఉండేదో అంత ఎత్తులో నిర్మించారు” అని ఈ చిత్ర సమాచార చేపుస్తకం తెలిపింది.

లక్ష్మీబాయికి, బ్రిటీష్ ఆఫీసర్  హ్యుజ్ రోజ్‍కి మధ్య వచ్చే యుద్ధ సన్నివేశల కోసం – రక్షణ శాఖ నుంచి గుర్రాలను, బికనేర్ కామెల్ కార్ప్ నుంచి ఎక్స్‌ట్రాలను – తీసుకున్నారు. లక్ష్మీబాయి తాను స్వయంగా యుద్ధరంగంలో పోరాడడమే కాకుండా మహిళలను కూడా యుద్ధానికి ప్రోత్సహించిన కారణంగా – చిత్రం సహజంగా ఉండేందుకు – “బనస్థలి స్కూల్‍కి చెందిన శిక్షణ పొందిన గర్ల్-కాడెట్స్ కూడా ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలలో పాల్గొన్నారు” అని ఈ చేపుస్తకం పేర్కొంది.

ప్రధాన తార మెహతాబ్, 1946లో సోహ్రాబ్‍ని వివాహం చేసుకున్నారు. ఆమె మరింత శ్రమించారు. “రైడింగ్, షూటింగ్, కత్తి యుద్ధ సాధన, బరువు తగ్గే వ్యాయామాలతో, టెక్నికలర్ కెమెరాలకు అనువుగా ఉండేందుకు ముందు – మెహతాబ్ దాదాపుగా రెండేళ్ళ పాటు క్యాంప్ జీవితం గడిపారు” తెలిపింది చేపుస్తకం.

“మా అమ్మ ఇంటికొచ్చేసరికి ఆమె నుదుటన, గడ్దం మీద రక్తం చారికలు ఉండేవి. నేనెంతో భయపడేవాడిని” చెప్పారు మెహెల్లీ మోడీ.

సోహ్రాబ్ మోడీ స్వచ్ఛమైన ఉర్దూ ఉచ్చారణ (పార్సీ అయినప్పటికీ, ఈనాటి ఉత్తర ప్రదేశ్ లోని రామ్‍పూర్‌లో పెరిగారాయన), రాచఠీవి, మంద్ర స్వరానికి ఉచ్చ స్వరానికీ మధ్యనుండే స్వరం – ఆయనను ఆకర్షణీయమైన నటుడిగా చేశాయి. అందుకని ఆయన తన సొంత సినిమాలలో నటించేవారు. ‘ఝాన్సీ కీ రాణీ’ చిత్రంలో ఆయన లక్ష్మీబాయి గురువుగా రాజగురువు పాత్ర పోషించారు. ఝాన్సీ రాజు గంగాధర్ రావు (ముబారక్) వివాహం చేసుకోవల్సిన కన్యగా ఆయన మణికర్ణికను ఎంపిక చేస్తారు.

మణికర్ణిక ధైర్యవంతురాలు. ఏ భయం లేకుండా తొండం మీద నుంచి ఏనుగునెక్కుతుంది. “నా విధి నాకు 10 ఏనుగులనిచ్చింది” అంటుందా బాలిక మెరుస్తున్న కళ్లతో. అప్పటికే కాబోయే గొప్ప యోధురాలిగా పేరుపొందింది ఆ బాలిక. రాజగురువుని కలిసినప్పుడు “అదృష్టంలో లక్ష్మి, జ్ఞానంలో సరస్వతి, శక్తిలో దుర్గ” అని ఆమెని వర్ణిస్తారు.

తన విశ్వాసాలతో రాణికి సమస్య వచ్చినప్పుడు “నీ జీవితం విలువైనది. ఒకవేళ నీవు మరణించాలనుకుంటే, ఎలా మరణించాలో నేను నేర్పుతాను” అంటారు రాజగురువు.

అనాటి స్క్రిప్ట్ రైటర్ల సామర్థ్యానికి నిదర్శనం ఈ చిత్రంలోని మరో డైలాగ్. లక్ష్మీబాయికి సలహానిస్తూ… “వరదలోకి దూకు… కానీ ముందుగా ఈత నేర్చుకో… అవసరమైతే పులిలా పోరాడి మరణించు” అంటారు.

భర్తని పోగొట్టుకున్న రాణి “నేను ఝాన్సీని విడవను” అని గర్జిస్తుంది. బ్రిటీషు వారు తన రాజ్యంపైకి దండెత్తగానే ఆమె యుద్ధరంగంలోకి దూకుతుంది. ‘స్వాతంత్ర్యం’ అనే పదాన్ని పలుకుతూ ఆమె కన్ను మూస్తుంది. ఆమె త్యాగాన్ని ఎన్నడూ మరువని జాతి చైతన్యాన్ని ఉత్తేజితం చేస్తుంది.

బాక్సాఫీసు వద్ద ఆర్థికంగా పరాజయం పాలయినప్పటికీ, ఈ చిత్రం యొక్క సాంకేతిక విలువల ముందు ఆ పరాజయం వెలవెలబోతుంది. సోహ్రాబ్ మోడీ జీవిత చరిత్ర రాసిన అమృత్ గంగార్ “ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన మాంటేజ్ సీక్వెన్సులు ఉన్నాయి… వాటిని ‘విజువల్ – సౌండ్ కాటపుల్టింగ్ కట్స్’ ఉపయోగించి తీశారు. యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో మోడీ తన సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఓ సాహసి అయిన బాలికని, ఝాన్సీ రాణిని చేసి, ఆమెలోని మానవతని ప్రదర్శించారు… సులభంగా కన్నీళ్లు వచ్చే మెలోడ్రామాని ఎంచుకోకుండా, కెమెరా పనితనంతో, సౌండ్స్ సహాయంతో, తానత తోనూ శోకరసాన్నీ, అమితోత్సాహాన్నీ సాధించారు” అని పేర్కొన్నారు.

యాష్ చౌదరీ తీసిన ఒక ఫిల్మ్స్ డివిజన్ వారి డాక్యుమెంటరీలో historical genre అంటే తనకి ఎందుకు ఆసక్తో చెబుతూ “నేను బడిలో ఉన్నప్పుడు చరిత్ర క్లాసంటే రోతగా ఉండేది. కానీ సినిమాల కోసం చరిత్ర పుస్తకాలు చదవడం ప్రారంభించాక మన చరిత్ర ఎంతో గొప్పదని అర్థమైంది. భవిష్యత్తు తరాలకు మన చరిత్ర తెలియజెప్పి, గతకాలపు మహానుభావుల గురించి వివరించి, భవితని నిర్మించాలని గ్రహించాను” అని చెప్పారు సోహ్రాబ్ మోడీ.

సోహ్రాబ్ మోడీకి మరీ ముఖ్యంగా లక్ష్మీబాయి ధీరోదాత్తత నచ్చేసింది. “ఇరవైలలో ఉన్న ఒంటరి యువతి… బ్రిటీష్ వారిని ఎదిరించి… నేను ఝాన్సీని వదులుకోను… అని ప్రకటించింది.. ఏమి సాహసం… వాహ్, వాహ్” అన్నారు.

‘ఝాన్సీ కీ రాణీ’ చిత్రం పరాజయం పాలయి, తన స్టూడియోని తాకట్టు పెట్టినప్పటికీ, ఆయన వెనుకంజ వేయలేదు. మరుసటి సంవత్సరం తీసిన మరో చారిత్రక చిత్రం – మీర్జా గాలీబ్ గొప్ప హిట్ అయింది. ఆయన 1969 వరకూ సినిమాలు తీస్తూనే ఉన్నారు. 28 జనవరి 1984 నాడు బొంబాయిలో మృతి చెందారు.

అయితే సోహ్రాబ్ మోడీని ఆర్థికంగా క్రుంగదీసిన ఈ సినిమా ఇప్పుడు ‘ఒరిజినల్ ఫార్మ్’లో లభించడం లేదు. “కత్తిరింపులకు గురికాని అసలైన టెక్నికలర్ వెర్షన్ ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు” చెప్పారు మెహెల్లీ మోడీ. “ఒరిజినల్ నెగటివ్ ఎక్కడో పోయింది” అన్నారు.

ఇంటర్‌నెట్‍లో లభించే హిందీ వెర్షన్, ఆంగ్ల వెర్షన్‍లు పైరసీవయినా, అవి సోహ్రాబ్ మోడి దూరదృష్టిని తెలుపుతాయి. “ఇంగ్లీషు సినిమా నిడివి హిందీ సినిమా కన్నా గంట తక్కువగా ఉంటుంది” చెప్పారు మెహెల్లీ.

ఇంటర్నెట్ ఉనికిలోకి వచ్చాకా, టెక్నికలర్ ప్రింట్స్ గురించిన సమాచారం కోసం మెహెల్లీ ఎంతో ప్రయత్నించారు. యుగోస్లేవియా, ఆస్ట్రేలియా వంటి చోట్ల నుంచి సమాచారం దొరికినా అవి వాస్తవాలు కాదు. “నా చిన్నప్పుడు నేను ఆ సినిమాని కనీసం 50-60 సార్లు చూశాను. ఆ సినిమా ఎలా ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తులలో నేను ఒకడ్ని. ఆ బొమ్మలన్నీ నా మెదడులో ముద్రించుకుపోయాయి.  ఏదో ఒకరోజున నెగటివ్ దొరికి, సినిమాని మళ్ళీ చూడగలుగుతాం. ఆ సినిమాని ఇప్పుడు చూసినా బావుంటుంది – కూర్పు, సంగీతం, ప్రతీదీ కళాత్మకంగానే ఉంటాయి. 10000 వరుస ఉన్న సైన్యాన్ని చూస్తే… వాళ్ళు నిజంగా 10000 మంది ఎక్స్‌ట్రాలే… అటువంటి సినిమాని మళ్ళీ చూడలేం” అన్నారు మెహెల్లీ.

ఏదో ఒక రోజున ఒరిజినల్ నెగటివ్ దొరికితే, భారతదేశపు అత్యంత వైభవోపేతమైన దృశ్యకావ్యాన్ని, అది చూపే ఓ దిగ్గజపు సాహసాన్ని కనులారా కాంచవచ్చు.


బాబ్ డిలాన్ – అమెరికా దేశపు గొప్ప గీతరచయిత:

అమెరికా సంగీత దిగ్గజం, జానపద గాయకుడు, గీత రచయిత బాబ్ డిలాన్‌కు సాహిత్య విభాగంలో 2016 సంవత్సరపు నోబెల్ ప్రైజ్ ప్రకటించడం వివాదాలకు దారితీసింది. 1993లో టొనీ మారిసన్‌కి నోబెల్ లభించిన తరువాత, మళ్ళీ అమెరికాకి నోబెల్ సాహిత్య బహుమతి రావడం ఇదే మొదటిసారి. డిలాన్ ఈ పురస్కారాన్ని పొందిన తొలి పాటల రచయిత.

డిలాన్‍కి నోబెల్ దక్కడంపై జనాభిప్రాయం సానుకూలంగానే ఉంది. యూనివర్శిటీలలో తరగతి గదుల్లో ఆయన పాటలను బోధించే అధ్యాపకుల మద్దతు డిలాన్‍కి ఉంది. అయితే, మరి ఫిలిప్ రోత్ మాటేమిటి? డాన్ డెలిల్లో సంగతేంటి? మిగతావారి మాటేమిటి…? నవలాకారుడు ఇర్విన్ వెల్ష్ డిలాన్‍కి ఈ పురస్కారం ప్రకటించడం – ‘ఇల్-కన్సీవ్‌డ్ నోస్టాల్జియా’ అన్నారు.  ‘స్వర్గీయ బాబ్ మార్లేని ఎన్నడూ ఈ పురస్కారానికి ఎందుకు పరిగణించలేదు’ అని కవయిత్రి నటాలీ డియాజ్ ప్రశ్నించారు. కొంతమంది రచయితలు చిన్న చిన్న విషయాలు పట్టించుకున్నారు: “డిలాన్ ఇప్పటికే ధనవంతుడు, ప్రసిద్ధుడు! అతనికీ అవార్డు అవసరం లేదు!” లేదా “పాటలు అసలు సాహిత్యమే కాదు” అని. 1964లో నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించిగా జీన్-పాల్ సార్ట్రే తిరస్కరించినట్లే, డిలాన్ కూడా తిరస్కరించి ఉండాల్సిందని చాలామంది అన్నారు.

అయినప్పటికీ, ప్రజా వ్యాఖ్యాతలతో చాలామంది ఈ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు రెండు కారణాలు – అనేక ఏళ్ళుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని మార్చేందుకు కమిటీ అంగీకరించడం ఒకటి; రెండు – సంస్థాగత పక్షపాతం ఏమైనా ఉంటుందేమోనని పరీక్షించడం! బడాయిగా ఉండే స్వీడిష్ అకాడమీలో కాలం మారుతోంది. 2016లో బ్రిటన్‍కి చెందిన గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ “సాహిత్యపు సరిహద్దులు విస్తరిస్తున్నాయి” అన్నారు సాల్మన్ రష్దీ. “నోబెల్ బహుమతి ఈ సంగతి గుర్తించడం హర్షణీయం” అన్నారు. డిలాన్‌ తనకు వ్యక్తిగత ప్రేరణ అని అన్నారు. నోబెల్ సాహిత్య పురస్కారం పొందినందుకు అమెరికాకి చెందిన సుప్రసిద్ధ కవి బిల్లీ కోలిన్స్ డిలాన్‍ను ఆశీర్వదించారు. తమలో ఒకడికి ఈ పురస్కారం దక్కినందుకు గీత రచయితలు ఆనందించారు. బరాక్ ఒబామా ట్వీట్ రూపంలో అభినందనలు తెలిపారు.

అయితే డిలాన్ భావరహితంగా ఉండిపోయారు. వాదప్రతివాదాలన్నీ గాలిలో కలిసిపోయాయి. తమ ఎంపికని తెలియజేస్తూ అకాడమీ వారు చేసన కబురుకి ఆయన స్పందించలేదు (దీనిని ‘అమర్యాద, పొగరు’ అని కమిటీ సభ్యుడొకరన్నారు). టుల్సా, లాస్ వెగాస్, ఫీనిక్స్, అల్బూకెర్కీ, ఎల్ పాసో వంటి నగరాలలో కచేరీలు చేస్తున్నారు. ఇప్పటికీ, వయసు ఎనభై దాటినప్పటికీ, ఆయన పర్యటనలు మానుకోలేదు. తనకు నోబెల్ బహుమతి వచ్చిందని చాటుకోలేదు. ఆయనకి ఆ పురస్కారం లభించిందని ఆయన వెబ్ సైట్‍లో చిన్న నోట్ పెట్టిన కొద్ది సేపటికే దాన్ని తీసేశారు. పురస్కారం ప్రకటించి వారాలు గడిచినప్పటికీ, ఆయన బహిరంగంగా దాన్ని వెల్లడించలేదు. “అవార్డ్ తీసుకోడానికి వెళ్తారా?” అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఎట్టకేలకు స్పందిస్తూ, “అవకాశం ఉంటే చూద్దాం” అన్నారు. తాను వెళ్ళలేనని తర్వాత ప్రకటించారు. ఎంతైనా డిలాన్ డిలానే.

అధికారిక ప్రకటన ప్రకారం – సాహిత్యంలో 113వ నోబెల్ బహుమతి విజేతగా డిలాన్‍ని ప్రకటించారు. అమెరికా దేశపు పాటల సంప్రదాయంలోనే, సరికొత్త కవిత్వపు అభివ్యక్తి సృష్టించినందుకు గాను ఈ పురస్కారం అందిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్వీడిష్ అకాడమీ అప్పటి శాశ్వత కార్యదర్శి సారా డానియస్ – డిలాన్ ని హోమర్, శాఫోల కోవకి చెందిన కవిగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోడానికి తామేమీ కష్టపడలేదని ఆమె అన్నారు. ‘బాబ్ డిలాన్ గొప్ప కవి, అందుకే ఈ పురస్కారం’ అన్నారామె. అంతేకాదు, ‘మిల్టన్, బ్లేక్‌ల నుంచి కొనసాగుతున్న మహత్తర ఆంగ్ల సంప్రదాయంలో, ఆయన ఓ గొప్ప కవి. తనదైన శుద్ధమైన పద్ధతిలో ఆయన సాంప్రదాయవాది. లిఖిత సంప్రదాయమే కాదు, మౌఖిక సంప్రదాయం కూడా. దానిని ఉన్నతమైన సాహిత్యం అనుకోండి, నీచ సాహిత్యం అనుకోండి’ అని అన్నారు. ఆవిడ 2019లో మరణించారు.

ఉన్నతమైనదైనా/నీచమైనదైనా – ఎలా అయినా అనుకోనివ్వండి… సాహిత్యాన్ని నిర్వచించడం కష్టం. “written works . . . that are considered to be very good and to have lasting importance,” అని మెర్రియం-వెబ్‌స్టర్ నిఘంటువు పేర్కొంది. ఈ నిర్వచనం ప్రకారం బాల్ డిలాన్ రచనలు, విలియమ్ ఫాల్క్‌నర్, అలైస్ మన్రో, ఇంకా ఇతర రచయితల రచనలన్నీ సాహిత్యమే అవుతాయి. ఈ నిర్వచనం ప్రకారం – ఇతర పుస్తకాలు – గిన్నిస్ బుక్, మాడ్ మేగజైన్, 2020 చెవీ ఇంపాలా ఓనర్ మాన్యువల్ కూడా సాహిత్యమే అవ్వాలి. కాబట్టి, సాహిత్యమంటే మరొక వివరణ ఉండాలి. సాహిత్యమంటే – అస్పష్టంగానూ, స్పష్టంగానూ భావప్రసారం చేసే గ్రంథాలు – చెప్పరాని విషయాలని నేర్పుగా చెప్పే రచనలు – తమలో సదసద్వివేకం ఉన్నవి! నోబెల్ బహుమతులకు నిధులు సమకూర్చిన దాత ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం ‘ఆదర్శనీయమైన దిశలో సాగిన అత్యుత్తమ రచన’కు ఈ పురస్కారం ఇవ్వాలి. నోబెల్ ఫౌండేషన్ ప్రకారం ఈ పురస్కారానికి పరిగణించాలనుకునే రచనలు ఎలా ఉండాలంటే, “not only belles lettres but also other writings which, by virtue of their form and style, possess literary value.” అని పేర్కొంది. పాటలా విన్నా, గీతాన్ని కాగితం మీద చదివినా డిలాన్ రచన – గొప్ప కవిత్వాల, నవలల – విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఆకట్టుకునేలా మలిచిన గీతాలవి. అవి తరచూ రూపకంగా వుంటాయి, అధిక భావోద్వేగాలను కలిగి ఉంటాయి. దృఢంగా విశ్లేషించినప్పుడు (అందుకే తరగతి గదుల్లో బోధిస్తారు) ఈ గీతాలు తమని తాము వెల్లడించుకుంటాయి. డిలాన్ రచనలు రాజకీయాలతో ముడిపడి ఉంటాయి, కానీ అవి కఠినంగా ఉండవు. డిలాన్ గీతాలను శ్రద్ధగా వినే ఏ ఆంగ్ల రచయిత అయినా భాష వల్ల, నిర్మాణం వల్ల, సారం వల్ల ప్రభావితం కాకుండా ఉండలేరు. ఆయన గీతాలలోని పదాలు కాలం పరీక్షలో నెగ్గుతాయి.

నోబెల్ సాహిత్యం పురస్కార గ్రహీతల జాబితా మరీ విశేషంగా ఉండదు (తోల్‌స్తోయ్‌కి రాలేదు. పెరల్ ఎస్. బక్‍కి వచ్చింది). అయితే ఎందరో దిగ్గజాలు ఉన్నారు. ఈ పురస్కారానికి  గ్రహీతల సాధికార అమోదం అవసరం. ఈ పురస్కారాన్ని తిరస్కరిస్తూ సార్ట్రే దాని ప్రభావం ఎలా ఉంటుందో వెల్లడించారు. “నేను జీన్-పాల్ సార్ట్రే అని సంతకం పెట్టినా, జీన్-పాల్ సార్ట్రే, నోబెల్ బహుమతి గ్రహీత అని సంతకం పెట్టినా పెద్ద తేడా ఉండదు” అన్నారు. “రచయిత, వ్యవస్థగా మారడానికి అంగీకరించకూడదు, అది ఎంత గౌరవప్రదమైన సందర్భంలోనైనా” అని అన్నారు. పాలకులకు వ్యతిరేకంగా ఉండి ప్రజల మద్దతు పొందిన డిలాన్ – వ్యవస్థలో భాగమైపోవడం వల్ల, సార్ట్రే ఇక్కడ అప్రస్తుతమయ్యారు.

నగదు రూపంలో ఎంతో విలువైన ఈ బహుమతి డిలాన్ నిజమైన ఘనతలకు సరిపోదు. ఆయన శక్తివంతమైన, సుందరమైన, మార్పు చెందించెడి, మరపురాని పాటలు – పౌరహక్కుల ఉద్యమాన్ని ఉత్తేజితం చేశాయి. సెల్మా నుండి మోంట్‌గోమేరీ వరకు జరిగిన ప్రజల ర్యాలీలో డిలాన్ పాటలను పాడుకున్నారు. అలాగే వాషింగ్టన్ డిసిలో మార్టిన్ లూథర్ కింగ్ సుప్రసిద్ధ ‘ఐ హావ్ ఎ డ్రీమ్’ ప్రసంగానికి ముందు కూడా డిలాన్ పాటలు పాడారు. ఇవి డిలాన్ ఘనతని తెలియజేస్తాయి. సాహిత్య విభాగంలో 2016 సంవత్సరపు నోబెల్ ప్రైజ్ ఆయనకు దక్కడం ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయి వంటింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here