అలనాటి అపురూపాలు-74

0
5

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటి షమ్మీ జీవితం – ఆవిడ మాటల్లో:

ఒకనాటి కథానాయిక, తరువాత సహాయక పాత్రలలో సినీ ప్రేక్షుకులను, పలు సీరియల్స్‌ ద్వారా టీవీ వీక్షకులను ఆకట్టుకున్న నటి షమ్మీ. 2013లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి విపులంగా వివరించారు.

ఆవిడేం చెప్పారో… ఇక్కడ చదువుదాం.

***

“నా జీవితమంతా ముంబయిలోనే గడిచింది. నా అసలు పేరు నర్గిస్ రబాదీ. నాకో అక్క ఉంది నీనా/మణి రబాదీ, తను ఫ్యాషన్ డిజైనర్. మా నాన్నాగారు పార్శీ గుడిలో పూజారి. నాకు మూడేళ్ళ వయసులో ఆయన చనిపోయారు. మా బాధ్యతంతా అమ్మే చూసుకొనేది. అన్ని మతపరమైన వేడుకలకూ అమ్మే వంట చేసేది. పార్శీలలో వేడుకలప్పుడు పూజారి సోదరి లేదా భార్య వంట చేయడం ఆనవాయితీ. మా పిన్ని, అంటే అమ్మ చెల్లెలు మాతోనే ఉండేది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు (సెంట్రల్ ముంబయి లోని) పరేల్‍లో టాటా బ్లాక్స్ (టాటాల చౌక రకం ఇళ్ళు) లో ఉండేవాళ్ళం. ఆరవ తరగతిలో ఉన్నప్పుడు నేను, అక్క స్కూల్‍కి 11 రూపాయలు ఫీజు కట్టి వెళ్ళేవాళ్ళం. మా కాలనీ టాటా వాళ్ళ చెక్క బొమ్మల ఫ్యాక్టరీ ఉండేది. నేనూ, అక్క వెళ్ళి అక్కడ ఉద్యోగాలు అడిగాము. వాళ్ళివ్వలేదు. కానీ స్కూలు అయిపోయాక వచ్చి రెండు మూడు గంటలు పనిచేస్తే స్కూలు ఫీజు కడతామన్నారు. స్కూలు చదువు అయిపోయాక అక్క జాన్సన్ అండ్ జాన్సన్‍లో సెక్రటరీగా చేరింది. నా మెట్రిక్యులేషన్ పూర్తయ్యాకా, నేను కూడా అక్కడ పని చేశాను. నాది ప్యాకింగ్ డిపార్ట్‌మెంట్. మెషీన్ నుంచి కింద పడిన మాత్రలను తీసి పెద్ద సీసాలలో వేయడం నా పని. వాటిని రోగులకు ఉచితంగా ఇచ్చేందుకు ఆసుపత్రులకు పంపుతారు. ఇక్కడ నా జీతం నెలకి 100 రూపాయలు.

నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. మేం చిన్నూ మామా అని పిలుచుకునే ఓ కుటుంబ స్నేహితుడు మహబూబ్ గారి వద్ద పని చేసేవారు. దర్శకనిర్మాత షేక్ ముఖ్తార్ గారితో మామకి స్నేహం ఉండేది. ముఖ్తార్ గారు అప్పట్లో బేగం పారాతో కొత్త సినిమా తీస్తున్నారు. రెండో కథానాయిక పాత్ర కోసం మరో నటి కోసం చూస్తున్నారు. సినిమాల్లో నటిస్తావా అని మామ అడిగారు. ఒప్పుకున్నాను. నేను హిందీ మాట్లాడగలనో లేదో పరీక్షించేందుకు మర్నాడు స్టూడియోకి రమ్మన్నారు. నాకు నటించడం వచ్చా అని ముఖ్తార్ గారు అడిగారు.  రాదన్నాను, కానీ నటన అంటే ఆసక్తి ఉందని చెప్పాను. ‘నువ్వు పార్శీవి కదా, నీ హిందీ మాటేమిటి?’ అన్నారాయన. ‘ఇప్పుడు నేను మీతో హిందీలోనే మాట్లాడుతున్నానుగా… నాది సరైనా హిందీనో కాదో మీకు తెలుస్తుందిగా’ అన్నాను. ముఖ్తార్ గారు విస్తుపోయారు.

‘ఆయన యజమాని, అలా దురుసుగా మాట్లాడచ్చా’ అన్నారు మామ. ముఖ్తార్ గారి నా ఉత్సాహం నచ్చింది. నాకు అవకాశమిచ్చారు.

మర్నాడు షూటింగ్ కోసం మహాలక్ష్మి స్టూడియోకి వెళ్ళాను. మెహబూబ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘ఔరత్’ సినిమాలో నటించిన హరీష్ ఈ సినిమాకి దర్శకుడు. బాలీవుడ్‍లో అప్పటికే ఒక నర్గిస్ ఉన్నందున, నా పేరు మార్చాలని ఆయన అన్నారు. షమ్మీగా మార్చారు. అప్పుడు నా నెల జీతం 500 రూపాయలు. వాళ్ళతో మూడేళ్ళ పాటు పనిచేసేలా ఒప్పందంపై సంతకం చేశాను. ఆ కాలంలో వాళ్ళ అనుమతి లేకుండా వేరే సినిమాలు చేయకూడదు. సంతకం చేసాకా, నేను ప్రతిరోజూ స్టూడియోకి వెళ్ళాలి. నాకు షూటింగ్ లేకపోతే, నటన సాధన చేయాలి. ఇతర సినిమాల డైలాగులు చదవాలి. ఆయన స్వయంగా నటుడు కాబట్టి హరీష్ నాకెన్నో నేర్పారు. ‘నువ్వు చక్కని నటివి కావాలంటే, గ్లిజరిన్ లేకుండా స్వయంగా ఏడవగలగాలి’ అన్నారు.

ఆ సమయంలో ఆయన గాయకుడు ముకేశ్ నిర్మాతగా మల్హర్ అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో నాకు ప్రధాన పాత్ర లభించింది. నేను చాలా కొత్త, నా నటన అంత గొప్పగా లేదు. అయినా మల్హర్‍లో నా పాత్రకి మంచి సమీక్షలే వచ్చాయి. మల్హర్ పాటలు గొప్ప హిట్ అయ్యాయి. కొన్ని సినిమాల్లో నటించాకా, ఇప్పుడు నాకు ఆదాయం ఉంది కనుక టాటా బ్లాక్సు నుంచి ఇల్లు మారదామని, అర్హులకు ఇల్లు లభిస్తుందని అమ్మతో అన్నాను. తరువాత మేం బాంద్రాకి మారిపోయాం.

మల్హర్ షూటింగ్‍లో నర్గిస్ పరిచయం అయింది. మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఆమె తల్లి జద్దన్‌బాయి చాలా నిష్కర్షగా ఉంటారు. అందరూ ఆమె అంటే భయపడేవారు. ఒకరోజు ఆవిడ సెట్‌కి వచ్చారు. ‘వీళ్ళంతా వెధవలు.. నువ్వు మంచిదానివి. జాగ్రత్తగా ఉండు’ అన్నారు నాతో. ‘నీకు సంగీతం అంటే ఇష్టమా’ అని అడిగారు. అవునన్నాను. ఓ కార్యక్రమం కోసం నన్ను ఇంటికి రమ్మన్నారు. అక్కడే నర్గిస్‌ని మొదటిసారి చూశాను. ఆవిడ నర్గిస్‌తో  ‘ఈ అమ్మాయి కొత్త. జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పారు. మరైన్ డ్రైవ్‍లో వాళ్ళింటికి నర్గిస్ నన్ను తరచూ ఆహ్వానించేవారు. ఆమె నాకు ఆప్తురాలు.

మేం ప్రాణ స్నేహితుల్లా ఉండేవాళ్ళం. కూచుని గంటల కొద్దీ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నేనేం అనుకుంటున్నానో కూడా తను చెప్పగలిగేది, మేం అంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. లక్ష రూపాయల పారితోషికం అందుకున్న మొదటి నటి నర్గిస్. అప్పటికి దిలీప్ కుమార్‌కి కూడా అంత మొత్తం అందలేదు. దాని గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. సహాయక పాత్రలు పోషించే నాలాంటి నటీనటులకు పది – పదిహేనువేలు దొరికేవి.

పరిశ్రమలో నాకెందరో స్నేహితులు దొరికారు. దిలీప్ కుమార్‌తో కూడా స్నేహంగా ఉండేదానిని. నా మూడో సినిమా దిలీప్, మధుబాల గార్లతో – ‘సంగ్‌దిల్’. ఆయన అప్పటికే టాప్ హీరో. నేనేమో కొత్తదాన్ని. అందరూ ఆయన్ని అబ్బురంగా చూసేవారు. దిలీప్ కుమార్ సెట్ లోకి ప్రవేశించిన ప్రతీసారి అందరూ చిన్నగొంతుతో మాట్లాడేవారు. కొన్నాళ్ళు గమనించాకా, ఓ రోజు ఆయన్ని ‘ప్రతీ రోజూ మీరు సెట్ లోకి రాగానే అందరూ లోగొంతుకతో మాట్లాడుతారు. మీరేమైనా దేవుడా’ అని అడిగాను. ఆయన నవ్వేసారు. ‘నువ్వు ఎక్కువగా మాట్లాడితే దెబ్బలు పడతాయి’ అన్నారు సరదాగా. ఈ సంఘటన తర్వాత మా మధ్య స్నేహం పెరిగింది. ఆయన్ని సరదాగా ఏడిపించేదాన్ని. ఆయన్ని మరీ వేధిస్తే, ఏదో ఒక రోజు నీ మీద కోపం వస్తుందాయనకి అనేవారు చుట్టూ వున్నవాళ్ళు. కానీ ఆయన నన్నెప్పుడూ కోపగించుకోలేదు. ఆయన డైలాగులు చాలా నెమ్మదిగా చెప్పేవారు. ఒక్కోసారి ఆయనేం చెప్పారో వినబడేది కాదు. బాగా దగ్గరికి వెళ్ళి ఆయనేమంటున్నారో వినేదాన్ని.

ఆయన చిరాకు పడేవారు… ‘ఇప్పుడు డైలాగ్ చెప్పాల్సింది నువ్వే, ఎందుకు చెప్పలేదు’ అనేవారు. ‘అసలు మీరేమన్నారో వినిపిస్తేగా, నేను నా డైలాగులు చెప్పడానికి’ అనేదాన్ని. ఆయన క్లోజప్ షాట్లు చేస్తూ, ఏకాగ్రత చూపించలేకపోతుంటే -నేను కెమెరా వెనక నిలబడి గట్టిగా నవ్వేదాన్ని. అలాగే, నేనేదయినా ముఖ్యమైన ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు ఆయన కెమెరా వెనుక నిలబడి రకరకాల భంగిమలు చేసేవారు. ఇప్పటికీ మేం మంచి స్నేహితులమే. అప్పుడప్పుడూ వెళ్ళి ఆయన్ను కలుస్తూంటాను, నన్ను సరదాగా తిడుతూనే ఉంటారు.

‘సంగ్‌దిల్’ పరాజయం పాలయ్యింది. నాకు ఏడు నెలల పాటు పని లేకుండా పోయింది. అప్పట్లో నేను ప్రధాన కథానాయిక లేదా ద్వితీయ కథానాయిక పాత్రలు ధరిస్తుండేడాన్ని. అయితే పని లేకుండా పోవడంతో… ఆ తర్వాత వచ్చిన అన్ని అవకాశాలు ఒప్పేసుకున్నాను. కొన్ని సినిమాల్లో వ్యాంప్ పాత్రలు కూడా వేశాను. చాలామంది తిట్టారు, కానీ పని చేయాలి. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఏం లాభం? ఇంటికి నా సంపాదన ఎంతో అవసరం. నా అమాయకత్వంలో వల్లే నేను పరిశ్రమలో నెగ్గుకురాగలిగాను అని అనుకుంటాను. పెద్ద వేషాల కోసం చూడకుండా, దొరికిన వేషాలాన్నీ వేశాను.”

[మహిపాల్, మన్‌హర్ దేశాయ్, కరణ్ దేవన్ వంటి హీరోల సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు. కె. అసిఫ్ ఖాన్ హిట్ సినిమా ‘ముసాఫిర్‌ఖానా’ తరువాత, ఆవిడకన్నీ అలాంటే పాత్రలే వచ్చాయి. ఈ సినిమాలో జానీ వాకర్ సరసన ఆమె పోషించిన ప్రాత్రకి చక్కని ప్రశంసలు దక్కాయి. ఈ కాలంలో ఆమె – ఇల్జామ్ (1954), పెహ్లీ ఝలక్ (1955), బందిష్ (1955), ఆజాద్ (1955), హలకు (1956), సన్ ఆఫ్ సింద్‌బాద్ (1955), రాజ్ తిలక్ (1958), ఖజాంచీ (1958), ఘర్ సంసార్ (1958), ఆఖిరీ దావ్ (1958), కంగన్ (1959), భాయ్ – బెహెన్ (1959) ఇంకా దిల్ అప్నా ప్రీత్ పరాయ్ (1960) వంటి హిట్ చిత్రాలలో సహాయక పాత్రలలో నటించారు. 1952-60 మధ్య కాలంలో ఆమె నటించిన మిగతా చిత్రాలు ఆర్థికంగా పరాజయం పాలయ్యాయి. అయితే 1962-70 మధ్య – హాఫ్ టికెట్, ఇషారా, జబ్ జబ్ ఫూల్ ఖిలే, ప్రీత్ నా జానే రీత్, ఆమ్నే సామ్నే, ఉప్‌కార్, ఇత్తెఫాక్, సాజన్, డోలీ, రాజా సాబ్, ది ట్రెయిన్ వంటి చిత్రాలు విజయవంతం కావడంలో ఆమె నటించిన హాస్య/వ్యాంప్ పాత్రలు తోడ్పడ్డాయి. 1970ల తొలినాళ్ళ నుంచి ప్రధానంగా తల్లి పాత్రలు రాసాగాయి, పూరబ్ ఔర్ పశ్చిమ్, అధికార్ తదితర చిత్రాలలో. 1971లో వచ్చిన ‘సమాజ్‌ కో బదల్ డాలో’ చిత్రంలోని పాత్రకు ఆమెకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‍గా  బిఎఫ్‌జెఎ అవార్డు లభించింది]

“మరిన్ని అవకాశాలు వచ్చాయి. చక్కగా పనిచేసుకుంటున్న సమయంలో ఒక పొరపాటు చేశాను – పెళ్ళి చేసుకున్నాను. అప్పట్లో నేను 30లలో ఉన్నాను. కానీ వివాహం విఫలమైంది.

నేను సుల్తాన్ అహ్మద్‍ని పెళ్ళి చేసుకున్నాను. అప్పటికి ఆయన ఏమీ చేయడం లేదు. తరువాతి కాలంలో దర్శకుడయ్యారు. పరిశ్రమలో నాకున్న స్నేహితుల కారణంగా ఆయన తొందరగానే అవకాశాలు దక్కించుకున్నారు.

ఆయన నా భర్త కాబట్టి ఎవరూ ఏమీ ప్రశ్నించకుండా అతనితో పని చేశారు. ఆయన మొదటి సినిమా (హీరా)లో సునీల్ దత్, ఆశా పరేఖ్ హీరో హీరోయిన్‍లు. రెండో సినిమా ‘గంగా కీ సౌగంధ్’లో అమితాబ్ బచ్చన్ హీరో.”

[ఆమె స్నేహితులు – రాజేష్ ఖన్నా, సునీల్ దత్, ఆశా పరేఖ్ వంటి వారు సుల్తాన్ అహ్మద్ దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించారు. ఆవిడ భర్త తీసిన హీరా (1973), ధరమ్ కాంత, దాత… మొదలైనవి విజయవంతమయ్యాయి. ఈ సమయంలో షమ్మీ బయటి దర్శకుల సినిమాలు ఒప్పుకోకపోవడంతో, ఆమెకు అవకాశాలు తగ్గాయి. తర్వాత అది పొరపాటేనని ఆమె అంగీకరించారు. షమ్మీకి రెండు సార్లు గర్భస్రావం కావడం వల్ల ఆ తరువాత ఎన్నడూ గర్భం దాల్చలేదు. అందుకని సుల్తాన్ అహ్మద్‌కీ, ఆమెకి పిల్లలు పుట్టలేదు. వారి మధ్య విభేదాలకి ఇది కారణమయింది]

“ఆయన్ని పెళ్ళి చేసుకున్నాకా, నేనిక నటించనేమోనని అనుకున్నారు చాలామంది. అవకాశాలు తగ్గాయి. నేనూ కూడా తప్పు చేశాను, పెళ్ళి తరువాత వెంటనే వచ్చిన కొన్ని అవకాశాలను వదులుకున్నాను. మాకు పిల్లల్లేరు. మా బంధం ఏడేళ్ళు కొనసాగింది. మేమొక ఇల్లు కొనుక్కున్నాం. మా ఆయన దాన్ని నా పేరు మీద ఉంచాలనుకున్నారు. కానీ ఆయన సోదరికి ఏ ఆధారమూ లేకపోవడంతో, ఆమె పేరు మీద పెట్టమన్నాను, ఆమెకి కాస్తయినా భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో. నేనప్పటికి పని చేస్తున్నా కాబట్టి నేను పెద్దగా ఆలోచించలేదు. ఆయన సోదరుడి భార్య పెద్దగా చదువుకోలేదు. అందుకని వాళ్ళబ్బాయి బాధ్యత నేను తీసుకుని సిమ్లాలో ఒక స్కూల్లో చేర్పించాను. మా ఆయన నుంచి విడిపోయినా, ఆ అబ్బాయి నాతోనే ఉన్నాడు. నా జీవితంలో నేను చేసిన మరో పొరపాటు – ఆ ఇంట్లోంచి డబ్బూ, నగలు ఏమీ తీసుకోకుండా వచ్చేయడం! కారు కూడా వదిలేశాను. వెళ్ళి అమ్మ ఉంటున్న పాత ఇంట్లో ఉన్నాను. నర్గిస్‌కి బాగా కోపం వచ్చింది,  పెద్ద లెక్చర్ ఇచ్చింది. ‘నీకు డబ్బెలా వస్తుందనుకుంటున్నావు’ అని అడిగింది. ‘నాకేం అక్కర్లేదు, అన్నీ ఆయన్నే ఉంచుకోనీ’ అన్నాను. ఆ తర్వాత ఎనిమిది రోజుల్లో, హేమ మాలిని, ధర్మేంద్ర నటిస్తున్న సినిమాలో నాకు అవకాశం దొరికింది. ఇప్పుడు ఆయన (సుల్తాన్ అహ్మద్) సజీవంగా లేరు కాబట్టి, మా వివాహం ఎందుకు విఫలమైందో చెప్పడం సబబు కాదు. నేను స్వతంత్రురాలిని, ఎవరి నుంచి చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో లేను. మా మధ్య ఏం జరిగిందో ఆయన ఎన్నో పత్రికలకు చెప్పారు, కానీ నేను మౌనంగా ఉన్నాను. నా గురించి తెలిసిన వారికి – నేనేంటో బాగా తెలుసు. కాబట్టి నేను పట్టించుకోలేదు.

నాకన్నా 16 ఏళ్ళు చిన్నదైన ఆశా (పరేఖ్)తో నాకు బాగా స్నేహం కలిసింది. నిజానికి నేనూ వాళ్ళమ్మ స్నేహితులం. వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు – తన బయటకి వెళ్ళాలన్నా, షూటింగులకి నన్ను తీసుకెళ్ళేది ఆశా. ఒకవేళ మేమిద్దరం ఒకే సినిమాకి పని చేస్తుంటే – షూటింగ్‌కి కలిసే వెళ్ళేవాళ్ళం. వాళ్ళమ్మ జబ్బు ముదిరాకా, కూతురుకి పెళ్ళి కాలేదని, తను పోతే ఒంటరి అయిపోతుందని బాధపడింది. నేను బతికున్నంత కాలం నేను ఆశాకి తోడుగా ఉంటానని చెప్పాను. తల్లి పోయాకా, ఆశా ఒక్కర్తే అయిపోయింది, భయం భయంగా ఉండేది. పాపం అంతకు ముందు తనెప్పుడూ ఒంటరిగా ఉండేది కాదు, ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. చిన్న పిల్ల లాంటిది. ప్రపంచాన్ని పూర్తిగా చూడలేదు, ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. నేను రోజూ ఆశాని కలిసేదాన్ని. మా స్వభావాలు బాగా కలిసాయి. తన కంటే నేనే పెద్దదాన్ని అయినా, నేనేదో మూర్ఖపు పని చేసినప్పుడల్లా తను నన్ను తిట్టేది. వహీదాగారితోనూ, నందాతోనూ నాకు మంచి స్నేహం ఉండేది. నందాతో కలిసి కొన్ని సినిమాలు చేశాను. అవుట్ డోర్ షూటింగులలో మేం బాగా కలిసిపోయాం. నందా అవివాహిత. మన్‌మోహన్ (దేశాయ్) గారితో నిశ్చితార్థం జరిగింది కానీ, పెళ్ళి లోపే ఆయన చనిపోయారు. ఆయన చనిపోయి చాలా ఏళ్ళయినా, ఇప్పటికీ నందా తెల్లబట్టలే ధరిస్తుంది. హెలెన్ తోనూ, సల్మా (సల్మాన్ ఖాన్ తల్లి) తోనూ నేను బాగా స్నేహంగా ఉంటాను.

నేనో సినిమా నిర్మించాను, ‘పిఘల్‌తా ఆసమాన్’. హీరోగా నటించేందుకు రాజేష్ ఖన్నా అంగీకరించారు. దర్శకుడిగా ఒకరిని (ఇస్మాయిల్ ష్రాఫ్)ని ఆయన సూచించారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. ఒక విందులో వాళ్ళ మధ్య గొడవ జరిగింది, రాజేష్ ఖన్నా నా సినిమాలో నటించనన్నారు. అప్పటికింకా షూటింగ్ మొదలవలేదు. రాజేష్ ఖన్నా హీరో కదా అని పెద్ద హీరోయిన్ కావాలని రాఖీని తీసుకున్నాను. అయితే ఇప్పుడు హీరో లేడు. రాజేష్ ఖన్నా హీరో అన్నారుగా అంటూ డిస్ట్రిబ్యూటర్లు నా వెంట పడ్డారు. శశి కపూర్ వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాను. ‘మీ సినిమా అయితే తప్పకుండా చేస్తాను’ అన్నారు. తన పారితోషికం ఎంతిస్తారు అని కూడా అడగలేదు. అన్నీ సిద్ధమయ్యాయి. కానీ దర్శకుడు నన్ను పీడించాడు. సెట్‍లో ప్రతి ఒక్కరితోనూ గొడవపడేవాడు. చివరికి డబ్బింగ్ కూడా పూర్తి కాకుండానే అతన్ని వదిలించుకున్నాం. ఓ రోజు అవుట్ డోర్ షూటింగ్ జరుగుతుంటే టీ తెచ్చివ్వమని నన్ను అడిగాడు. శశికి బాగా కోపం వచ్చింది, కానీ నా కోసం తమాయించుకున్నారు. బాక్సాఫీసు వద్ద సినిమా పరాజయం పాలయ్యింది. ఫ్లాప్ అని తెలిసిపోయింది. ఆర్థికంగా కుదేలయ్యాను. నష్టాలను తట్టుకునేందుకు నా మిత్రుడు రాజేష్ ఖన్నా… అప్పట్లో తను టివీ సీరియల్స్ నిరిస్తున్నారు… దూరదర్శన్ కోసం కొన్ని షోలు నిర్మించడంలో సాయం చేశారు. టివీలో పని ఎప్పటికీ పూర్తి అవదు, అదే సినిమా షూటింగ్ అయితే కనీసం ఒక ఏడాదిలో పూర్తి అవుతుంది. అందుకని సినిమాల్లో పనిచేయడానికి ఇష్టపడేదాన్ని. అయితే నేను టీవీకి పని చేస్తున్నప్పుడు, నేనిక టీవీకి మాత్రమే పని చేస్తానేమో అనుకునేవారు సినిమావాళ్ళు. అందుకని అవకాశాలు తగ్గాయి. అయినా ఒక సినిమా ఆఫర్ వచ్చినా, చేస్తున్న సీరియల్ ఆపి, అక్కడికి వెళ్ళడం భావ్యం కాదు. నాకు పారితోషికం బాగానే ఉండేది. నేను డబ్బు దాచగలిగాను. నేను ఎప్పుడూ నిరాడంబర జీవితమే గడిపాను.

నా మొదటి సినిమా నుంచీ, వేషాలు కావాలని నేనెవరినీ అడగలేదు. అవకాశాలు వాటంతటే అవే వచ్చాయి. కానీ మధ్య మధ్యలో గ్యాప్ వచ్చేది. ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. ఈ మధ్య ‘షిరీన్ ఫర్‌హాద్ కీ తో నికల్ పడీ’ సినిమాలో నటించమని దర్శకుడు బేలా (సెహగల్) గట్టిగా అడగడంతో అంగీకరించాను. పైగా అది ఓ పార్శీ మహిళ పాత్ర. కానీ నాకివ్వాల్సిన పారితోషికం రాలేదు.

అయినా ఆ సినిమా చేయడాన్ని ఆస్వాదించాను. ఎందుకంటే బొమన్ (ఇరానీ)తో పని చేసాను కనుక. మేమిద్దరం బాగా నవ్వుకుంటూ, సందడి చేశాం. ఒక్కోసారి దేవుడితో గొడవపడతాను… ‘చాలా అయింది… ఇంకా చాలు… నన్ను పైకి పిలు’ అంటాను.”

***

6 మార్చి 2018 నాడు, 88 ఏళ్ళ వయసులో షమ్మీ సహజ మరణం పొందారు.


బి.ఎన్.రెడ్డి, దేబకీ బోస్‌ల స్నేహం:

తన కాలంలో దేశంలోని అత్యుత్తమ దర్శకులలో దేబకీ బోస్‌ ఒకరు. ఆయన ఎన్నో బెంగాలీ, హిందీ సినిమాలకు దర్శకనిర్మాతగా వ్యవహరించారు. ఆ కాలంలో ఆయన తీసిన ఎన్నో బెంగాలీ సినిమాలు హిందీలోనూ, మరాఠీలోనూ ఇంకా తమిళంలోనూ విడుదలయ్యేవి. ఆయన దర్శకత్వం వహించిన ‘చండీదాస్’ (1932) చిత్రం – భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా నేపథ్య సంగీతం ఉన్న సినిమా అయ్యింది. ఆ చిత్రానికి ఆర్. సి. బోరల్‌గా ప్రసిద్ధికెక్కిన రాయ్ చంద్ బోరల్ సంగీత దర్శకత్వం వహించారు.

ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై నిర్మించిన ‘సీత’ (1934) అనే సినిమా ఒక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ సినిమా. దానిని వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆ సినిమాకి ‘ఆనరరీ డిప్లొమా’ అవార్డు దక్కింది. ఒక అంతర్జాతీయ అవార్డు పొందిన తొలి భారతీయ దర్శకుడు దేబకీ బోస్.

‘సీత’ (1934) నిర్మాణ సమయలో ప్రముఖ తెలుగు దర్శకులు బి.ఎన్.రెడ్డి – బోస్‌ని మొదటిసారి కలిసారు. ఆ పరిచయం స్నేహంగా మారింది.

“ఈ రోజు నేను తీసే సినిమాలు అవార్డులు తెచ్చుకుంటున్నాయంటే, అది దేబకీ బోస్ ఘనతే. బాక్సాఫీసు డిమాండ్లను పట్టించుకోకుండా సినిమాలు ఎలా తీయాలో నేను ‘సీత’ సినిమా షూటింగులో తెలుసుకున్నాను” అన్నారు బి.ఎన్. రెడ్డి.

1951లో వాహిని స్టూడియో మద్రాసులో ఆల్ ఇండియా సినీ టెక్నీషియన్స్ సభని నిర్వహించింది. దేబకీ బోస్ ఆ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సమయంలో ఆయన బి.ఎన్. రెడ్డికి మరింత సన్నిహితులయ్యారు. ప్రభుత్వం తన పంచవర్ష ఫ్రణాళికలలో సినీరంగాన్ని పరిశ్రమగా గుర్తించలేదని బోస తన ఉపన్యాసంలో వాపోయారు. “కొన్ని డిమాండ్లను తీర్చకపోతే పరిశ్రమ ఇబ్బందులలో పడుతుందన్న ఆయన మాటలు వాస్తవం! ఆయన గొప్ప దార్శనికుడు.  ఆయన మాటలు నిజమయ్యాయి” అన్నారు రెడ్డి.

“ఆయన మద్రాసు వచ్చినప్పుడల్లా కలిసేవాడిని. ఓ మంచి దర్శకనిర్మాతగా, ఓ గొప్ప వ్యక్తిగా ఆయన్నుంచి నేను ఎన్నో నేర్చుకునేవాడిని. నేను చివరిసారి ఆయనను కలిసింది 1966లో నా సినిమా ‘రంగులరాట్నం’ షూటింగులో. నాకేదైనా సలహా ఇస్తారా అని అడిగితే, ఆయన నవ్వేసి ‘అందరినీ ప్రేమించండి. ప్రేమలో గొప్పదనముంది. అది మిమ్మల్ని భగవంతునికి దగ్గరగా తీసుకువెళ్తుంది’ అన్నారు. ఆయనకి నా సినిమాలు ‘మల్లీశ్వరి’ (1951), ‘బంగారు పాప’ (1954) బాగా ఇష్టం. ‘బంగారు పాప’ కథకి నా జీవితంలోని ఏదైనా సంఘటన ప్రేరణా అని అడిగారు. అలాంటిదేమీ నాకు గుర్తు లేదు అన్నాను. ఆయన నవ్వి, జగ్గయ్య నుండి పాప వెళ్ళిపోయే సన్నివేశం గురించి మాట్లాడారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది… మా పాప లండన్ వెళ్ళినప్పుడు నేను అలానే బాధపడ్డాను. అదే మాట బోస్‍కి చెప్పాను. ‘చూశారా, మీరు మీ అమ్మాయిని మిస్ అయ్యారు. ఆ బాధ ఉంది. అందుకే ఆ సన్నివేశం సినిమాలో అంత బాగా వచ్చింది’ అన్నారాయన. దేబకీ బోస్ ఈ సినిమాని 1958లో ‘సోనార్ కాతి’ పేరుతో తీయడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.” అన్నారు బి.ఎన్.రెడ్డి.

బి.ఎన్. రెడ్డి, దేబకీ బోస్ గార్లు మహాబలిపురం వద్ద

బి.ఎన్.రెడ్డి స్వర్గస్థులైన ఆరేళ్ళకు బోస్ 1971లో చనిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here