అలనాటి అపురూపాలు-75

0
6

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

చిన్న వయసులో తనువు చాలించిన గీతా బాలీ:

తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న గీతా బాలీ అసలు పేరు హరికీర్తన్. ఆమె సినీ రంగ ప్రవేశం అంత సులువుగా జరగలేదు. లాహోర్‍లో మత ఛాందసుల తీవ్ర వ్యతిరేకత నెదుర్కున్నారు. ఆమె తండ్రి పండిత్ కర్తార్‍ సింగ్‌ని చంపేస్తామన్నారు. మరొకరు అయితే భయపడిపోయేవారేమో కానీ తొమ్మిదేళ్ళ హరికీర్తన్ మాత్రం వెనుకంజ వేయలేదు. ఎనాటికైనా నటినవుతానని తనకు తాను చెప్పుకున్నారు. అలాగే గీతా బాలీ పేరుతో నటి అయ్యారు. 1948లో ఆమె ‘పర్సనాలిటీ ఆఫ్ ది యియర్’ గా ఎంపికయ్యారు. సంగీతం, నృత్యాలలో ఆమె తన అక్క హర్‌దర్శన్, అన్న దిగ్విజయ్ నుంచి శిక్షణ పొందారు. 1940లో ఆకాశవాణిలో పాడేందుకు స్టేషన్ డైరక్టర్ నుంచి కాంట్రాక్టు పొందారు.

తదుపరి పంజాబీ సినిమాల సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ పండిత్ జ్ఞాన్ శంకర్‌ని పరిచయం చేసుకుని – షోరే పిక్చర్స్ వారి డాక్యుమెంటరీ – ది కాబ్లర్‌లో – కోరస్ గర్ల్స్‌లో ఒకరిగా అవకాశం పొందారు. ఆమె మెదటి జీతం – 30 రూపాయలు స్టూడియో సిబ్బందికి మిఠాయిలకి సరిపోయింది. రూప్ షోరే తదుపరి ప్రాజెక్టు – బద్‌నామీ అనే సినిమాలో సోలో డాన్స్ చేసే అవకాశం దొరికింది. డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకొన్నప్పటికీ, ఆమెకి అది సరిపోలేదు. ఆమెకి రీటా హేవర్త్, డొరోతీ లామోర్ వలె గొప్ప నటి అవ్వాలని కోరిక. ఎట్టకేలకు ఆమె అదృష్టం ఫలించింది. లాహోర్‌లో ఒక స్టూడియోలో ఆమెని మజర్ ఖాన్ చూశారు. బొంబాయి రమ్మని చెప్పారు.

మజర్ ఖాన్ అట్టహాసంగా తీద్దామనుకున్న ‘గెస్ట్ హౌస్’ చిత్రం తీయలేకపోయినా, ఇంకా ఆమెకి ఆశలున్నాయి. ఆమె త్వరలో స్టార్-మేకర్ కిదర్ శర్మని కలిసారు. “నేను రంజిత్ స్టూడియోలో నా ఆఫీసులో బిజీగా ఉన్నాను. అప్పుడే పండిత్ జ్ఞాన్ శంకర్ వచ్చారు. ‘శర్మగారూ, మీరు నా శిష్యురాలిని ఆశీర్వదిస్తే పెద్ద నటి అవుతుంది’ అని బ్రతిమాలారు. కాదనలేకపోయాను. అమ్మాయిని తీసుకురమ్మన్నాను. “అప్పటికి గీత మజర్ ఖాన్‌తో మూడేళ్ళ ఒప్పందం కుదుర్చుకుని వారి కాంపౌండ్‌లోనే ఉంటోంది” గుర్తు చేసుకున్నారు శర్మ. శర్మ తానే వెళ్ళి గీతని కలుస్తానన్నారు. అలాగే వెళ్ళారు. గీత కుటుంబం ఆ ఇంట్లో ఒక పెద్ద, ఉపయోగించని బాత్ రూమ్‌లో ఉంటోంది. పైగా అందులో పగిలిన ఒక పెద్ద బాత్ టబ్ కూడా ఉంది. ఆ కుటుంబం అంతా అక్కడే ఇరుక్కొని ఉంది. నన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్లకి అర్థం కాలేదు. తలుపు చాటునుంచి గీత కిసుక్కున నవ్వారు. తర్వాత శర్మ గారి ముందు ఓ పాటకి నాట్యం చేశారు. తన తర్వాతి సినిమాకి హీరోయిన్‌గా తీసుకొన్నారు కిదర్ శర్మ.

“మజర్ ఖాన్ ఆమెకి బాగా తక్కువ మొత్తం ఇస్తుండడంతో నేనిస్తానన్న 13,000 రూపాయలు ఆమెకి చాలా ఎక్కువగా తోచాయి. ఒప్పందంలో ఉన్న క్లాజు ప్రకారం అంతే మొత్తాన్ని మజర్ ఖాన్‌కి కూడా ఇవ్వాల్సి వచ్చింది” చెప్పారు కిదర్ శర్మ. మొత్తానికి లాంఛనాలన్నీ పూర్తయి ‘సుహాగ్ రాత్’ షూటింగ్ మొదలైంది. అయితే కొత్త నటితో సమస్య ఎదురైంది. యూనిట్ సభ్యులంతా ఆమె పనికిరాదు తీసెయమని శర్మకి చెప్పారు. “ఆమె వాక్సరణి సరిగా లేదు. మతలబ్ అనడానికి మత్‌బిల్ అని కానీ మల్‌బత్ అని కానీ అనేది. చివరికి తానొచ్చి డబ్బింగ్ చెబుతానని వాళ్ళమ్మ గారు చెప్పారు” అన్నారు శర్మ. అయినా గీతని కొనసాగించారు. ఆయన శ్రమ ఫలించింది. సినిమా సూపర్ హిట్ అయింది, కొత్త తార జన్మించింది. శర్మతో గీత తదుపరి సినిమా – ఆయన హీరోగా, మధుబాల నాయికగా – వచ్చిన ‘నేకీ ఔర్ బదీ’. ఇందులో తొలిసారి, చివరిసారిగా వ్యాంప్ పాత్ర పోషించారు గీత. “చిన్న పాత్రే అయినా, డబ్బు కోసం తను అంగీకరించింది”. ఆ తరువాత – బవ్రే నైన్, బేదర్ది, గునాహ్, చోరా చోరీ వంటి చిత్రాలలో ఆమె హీరోయిన్‍గా నటించారు. “ఎక్కడ షూటింగ్ చేస్తున్నా, ప్యాకప్ అయిపోగానే, శ్రీ సౌండ్ స్టూడియోస్‌కి వచ్చి నాకు గుడీవినింగ్ చెప్పి గాని ఇంటికి వెళ్ళేది కాదు” గుర్తు చేసుకున్నారు శర్మ. ఒకసారి గీత ఒక పేద పిల్లని దత్తత తీసుకుని ఆ అమ్మాయికి శర్మ గారితో శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు. అమ్మాయి తెలివైనదని ఒప్పించడానికి చూశారు. “ఆ అమ్మాయి పరిస్థితి ఏమీ బాలేదు. చిరిగిన దుస్తుల్లో ఉంది. కానీ వినయంగా, ఒద్దికగా ఉంది”. ఓ వారం తర్వాత – “నీ అమ్మాయిని చూడు, ఎలా ఆడుతుందో” అన్నారు శర్మ. ఆమె ప్రదర్శన అద్భుతం. కళ్ళ నిండా నీళ్ళతో గది నుండి బయటకి వచ్చిన గీత, “అమ్మాయికి శిక్షణ ఇవ్వమన్నాను, మీరు నాకంటే మంచి నటిని తయారు చేశారు” అన్నారు. ఆ ఆశ్రితురాలు శర్మ గారి దగ్గర వీడ్కోలు తీసుకుని షమ్మీ కపూర్ వద్దకు చేరింది. శర్మ తదుపరి సినిమా ‘రంగీన్ రాతేఁ’లో హీరో షమ్మీ కపూర్. హీరోయిన్ – గీత ఆశ్రితురాలు – మాలా సిన్హా. ఇంకా చాంద్ ఉస్మాన్ కూడా ఉన్నారు తారాగణంలో. చిన్న పాత్రే అయినా షమ్మీకి దగ్గరగా ఉండేందుకు గాను ‘గొల్లు’ అనే పిచ్చి గ్రామీణ యువకుడి పాత్ర పోషించారు గీత అని చెప్పారు శర్మ. ఈ సినిమా లొకేషన్స్‌లో గీత – షమ్మీల మధ్య మొదలైన ప్రేమకి శిఖరాలకి చేరింది.

“మేం 2 ఏప్రిల్ 1955 నాడు రాణిఖేత్ వెళ్ళాం. 21 ఏప్రిల్ 1955 నాడు తిరిగి వచ్చేసరికి నేను ప్రేమలో పడ్దాను. ఆగస్టు 24న మా పెళ్ళి అయింది” చెప్పారు షమ్మీ కపూర్. వాళ్లది సుడిగాలి ప్రేమ. మొదటగా వాళ్ళిద్దరూ ‘మిస్ కోకో కోలా’ చిత్రం సెట్స్ మీద కలిసారు. తమ ప్రేమ నిజమని షమ్మీ గ్రహించారు. “ఆమె లేకపోతే నాకేం తోచేది కాదు. తను లేకుంటే నాకు ఏడుపొచ్చేది. నాకప్పుడు 23 ఏళ్ళు, తను నాకన్నా ఒక ఏడాది పెద్దది. రొమాన్స్‌కి చక్కని వయసు మాది” అంటూ నిట్టూర్చారు షమ్మీ. ఖాళీ సమయమంతా వాళ్ళిద్దరూ కలిసి గడిపారు. గంట గంటకీ షమ్మీ ప్రొపోజ్ చేస్తూనే ఉన్నారు, ఆమె తిరస్కరిస్తూనే ఉన్నారు. “వేర్వేరు కార్లలో ఉన్నప్పుడు పక్కపక్కనే నడిపేవాళ్ళం…. ఎవరూ లేని సమయం చూసి ఒకే కారులోకి మారిపోయేవాళ్ళం” చెప్పారాయన. గీత అప్పటికే షమ్మీ తండ్రిగారైన పృథ్వీరాజ్ కపూర్‌తో ‘ఆనంద్‍మఠ్’లో, ఆయన సోదరుడు రాజ్ కపూర్‌తో ‘బవ్రే నైనా’లోనూ నటించారు. వారి సాంప్రదాయక కుటుంబం ఆమెను స్వీకరిస్తుందా? పైగా షమ్మీ కంటే ఆమె ఒక ఏడాది పెద్ద. కానీ షమ్మీ పట్టు వీడలేదు. జుహు హోటల్‍లో దేవేంద్ర గోయల్ గారి చిత్రం షూటింగ్ జరుగుతుండగా మళ్ళీ అడిగారు. ఈసారి గీత సరేనన్నారు. “కానీ షమ్మీ, మన పెళ్ళి ఇప్పుడే జరిగిపోవాలి” అన్నారు.

వెంటనే వాళ్ళిద్దరూ జానీ వాకర్ ఇంటికి వెళ్ళారు. విషయం తెలుసుకుని ఆయన నవ్వారట. “నేను ముస్లింని. మా పద్ధతులు వేరు, హిందువుల పద్ధతులు వేరు. ఏదైనా గుడికి వెళ్ళండి” అన్నారట. వెంటనే వాళ్ళిద్దరూ తామిద్దరూ కలిసి నటించిన రెండవ సినిమా నిర్మాత హరి వాలియా వద్దకు వెళ్ళారు. ఆయన వాళ్ళిదర్ని బన్‌గంగా తీసుకువెళ్లారు. “మేం వెళ్ళేసరికి దాదాపు రాత్రి 10 గంటలయింది. చుట్టూ చిమ్మచీకటి. గుడి మూసేసి ఉంది” గుర్తు చేసుకున్నారు షమ్మీ. నిరాశతో వాళ్ళు మాతుంగా లోని షమ్మీ ఇంటికి చేరారు. ఆయన తల్లిదండ్రులు భోపాల్‍లో ఉన్నారు. ఇంట్లో నౌకరు మాత్రమే ఉన్నాడు. అతనే హడావిడిగా వాళ్ళిద్దరికీ అన్నం వడ్డించాడు. ఆ రాత్రంతా అసహనంగా, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తునే ఉన్నారు. సూర్యోదయం కాగానే, వారిద్దరూ మళ్ళీ గుడికి వెళ్లారు. షమ్మీ కుర్తా పైజమా ధరించారు. గీత నలిగిన సల్వార్ కమీజ్‌లో ఉన్నారు. షమ్మీ ఆమె నుదుటున సిందూరంలా లిప్‌స్టిక్‌తో అద్దారు. వాళ్ళ వివాహం జరిగిపోయింది. అప్పటికి సమయం ఉదయం ఆరున్నర. షమ్మీ గీతని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ఉన్న తాతగారికి పరిచయం చేసి “నా భార్యని ఆశీర్వదించండి” అని అడిగారు. తర్వాత ఆయన తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సాయంత్రం వాళ్ళు రాజ్ కపూర్ ఇంటికి వెళ్ళారు. “కృష్ణ వదిన కొత్త కోడలిని సాంప్రదాయబద్ధంగా కుటుంబంలోకి ఆహ్వానించింది” చెప్పారు షమ్మీ.

అయితే ఆమె నిర్మాతలు, దర్శకులు ఈ హఠాత్పరిమాణాన్ని జీర్ణించుకోలేకపోయారు. కపూర్ ఇంటి కోడలుగా ఆమె ఇక సినిమాలు విరమించుకోవాల్సిందే. తన సినిమాలో ఆడిపాడి హిట్ చేసిన గీతా దూరమవుతున్నదని భగవాన్ ఎంతో విలపించారు. “మరో గీతాని నాకు చూపించు” అన్నారట. ఆయన సినిమా ‘అల్‌బేలా’లో గీత నటించడం వెనుక ఓ కథ ఉంది. ఆ సినిమాలో నాయిక పాత్రకి నృత్యం బాగా వచ్చి ఉండాలి. అందంగా ఉండాలి. ఆయన గీతని అడిగితే, “నా కన్నా బాగా డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారుగా” అన్నారట. కానీ గీతే కావాలని ఆయన పట్టుబట్టారట. చివరికి గీత అంగీకారం తెలిపారట. ఆమె కుటుంబ సభ్యులు, మిత్రులు విస్తుపోయారట. ఒక స్టంట్‌మాన్ తీసే సినిమాలో నటిస్తావా అని చాలా మంది అభ్యంతరం తెలిపారట. అయితే మొదటి రోజు షూటింగ్‌కి వెళ్ళినప్పుడు గీత నిరాశకి గురయ్యారు. కట్టుకోవడానికి సాధారణమైన చీరలు ఉంచారట. ఆ చీరలలో తానేం అందంగా కనబడతానని అనుకున్నారట. పైగా, భగవాన్ గారు రోజంతా కేవలం నాలుగు షాట్లే తీసి, ఒప్పందం ప్రకారం ఆమెని పంపేసేవారట. తరువాత రషెస్ చూస్తే తానెంతో అందంగా ఉన్నానని ఆమె గ్రహించారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమాకి నిధులు సేకరించేందుకు భగవాన్ వేరే సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. అంటే అల్‌బేలా చిత్రం షూటింగ్ రాత్రి పూట మాత్రమే చేయగలరు. గీత మొదట్లో సందేహించినా, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పేకప్ చెప్తానని భగవాన్ చెప్పారు. “మొదటి రోజు 10.30కి, రెండవ రోజు 11 గంటలకి పేకప్ చెప్పాం. మర్నాడు అర్ధరాత్రి అయింది. చివరి నాలుగు రోజులు గీత రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు పని చేసింది. ఏ మాత్రం అహంకారం లేని గొప్ప నటి” గుర్తు చేసుకున్నారు భగవాన్. ఆ చిత్రంలో తాను భారతీయ పాశ్చాత్య నృత్యరీతులను మేళవించి నృత్యం రూపొందించానని, మొదట్లో సరిగా చేయలేకపోయిన గీత, మళ్ళీ రిహార్సల్స్ గదిలోకి వెళ్ళి ఎంతో సాధన చేసి వచ్చి నర్తించారని చెప్పారు భగవాన్. ‘బల్మా బడా నాదాన్’ పాట చిత్రీకరిస్తున్నారు అప్పుడు. అప్పటికీ గీత మనస్ఫూర్తిగా ప్రదర్శన చేయడం లేదని ఆయన భావించారు. ఆయన కొన్ని సూచనలు చేసినా, గీత అంగీకరించలేదు. “సినిమా విడుదల అయ్యాక ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లలో ఈలలు మారుమోగుతాయి” అని ఆయన గీతతో చెప్పారు. ఎలాగో చిత్రీకరణ పూర్తయ్యింది. “ఈ పాటకి థియేటర్‍లో స్పందన చూసిన గీత నా దగ్గరకు వచ్చి, ‘దాదా నన్ను క్షమించండి. ఈసారి నుంచి మీరు ఎలా చెప్తే అలా చేసేస్తాను’ అంది” అన్నారు భగవాన్. ఆయన తీసిన తర్వాతి సినిమా ఝమేలాలో కూడా గీత నటించారు. కొన్నేళ్ళ తరువాత తన సోదరుడు రచించి, దర్శకత్వం వహిస్తున్న సినిమాకి పనిచేయమని గీత ఆయనను కోరారు. అప్పడామె శ్రీమతి షమ్మీ కపూర్. “మీకు ఎప్పుడు కావాలో రెండు రోజుల ముందు ఫోన్‌లో చెప్పండి చాలు… నేను వచ్చి పని చేస్తాను” అన్నారు భగవాన్. అలా ఉందేది వాళ్ళిద్దరి అనుబంధం.

ఒక నటిగా గీత ఎంతో పరిపక్వతతో, చక్కని టైమింగ్‍తో ఉండేవారని షమ్మీ అన్నారు. ఆగస్టు 1955లో ఫిల్మ్‌ఫేర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో – పెళ్ళయ్యాకా, సినిమాలు మానుకోవాలో వద్దో అని ఆలోచించే స్థితికి తానింకా చేరుకోలేదని గీత అన్నారు. సినీతారల ప్రేమలు పెళ్ళి దాకా రావడం, అ పెళ్ళి కూడా కలకాలం నిలవడం ఆ రోజుల్లో కఠినమైన విషయమేనని షమ్మీ అన్నారు. అప్పటికి వారిద్దరూ కలిసి మొహర్, కాఫీ హౌస్ చిత్రాలలో నటించి ఉన్నారు. అందరి సంసారాల్లానే వారూ గొడవలు పడ్డారు, రాజీలు చేసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకుసాగారు.

గడ్డు కాలం సమీపించింది. షమ్మీ సినిమాలు వరుసగా 19 పరాజయం పాలయ్యాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. గీత పేరిట కొంత ఆస్తి ఉన్నా, వాటిని కుటుంబ సభ్యులు చేజిక్కించుకున్నారు. “గీత నాకు మద్దతుగా ఉంది. రోజు సాయంత్రం ఇంటికొచ్చి పని గురించి మాట్లాడేవాడిని. ఒకే రంగంలో ఉన్న వాళ్ళం కాబట్టి సాధకబాధకాలు బాగా తెలుసు” చెప్పారు షమ్మీ. ఆమె ఒకప్పుడు టాప్ స్టార్. కానీ పెళ్ళయ్యాక భర్త విజయాన్ని కోరుకున్నారు. “నేను రాణించాలని తను కోరుకుంది” ఆయన గుర్తు చేసుకున్నారు. ఎట్టకేలకు ‘తుమ్‌సా నహీ దేఖా’లో అవకాశం వచ్చింది. అది కూడా దేవ్ ఆనంద్, సునీల్ దత్‌ల డేట్లు లేవన్నాకా. నిర్మాత తొలారామ్ జలన్ షమ్మీకి పాతికవేల రూపాయాలు పారితోషికంగా ఇస్తానన్నారు. కానీ దర్శకుడు నాసిర్ హుస్సేన్ – హీరోగా షమ్మీ వద్దనుకున్నారు. ‘అతనిలో స్టయిల్ లేదు’ అని అన్నారట. దేవ్ ఆనంద్ ఈ సినిమా చేయడం లేదని తెలిసి గీత రచయిత సాహిర్ లుధియాన్వీ కూడా తప్పుకున్నారు. హీరోయిన్‌గా తోలారామ్ మిత్రురాలు అమీతా చేశారు. ఎలాగైనా ఈ సినిమాకి విజయం చేకూర్చాలని షమ్మీ తన స్నేహితుల సాయంతో మేకోవర్ సాధించారు. “ప్రీమియర్ షో కోసం ఢిల్లీ వెళ్ళాలి. గీతని నాతో పాటు రమ్మన్నాను. నాసిర్, ఆయన భార్య కూడా వస్తున్నారు. కానీ ఆశ్చర్యకరంగా గీత రానంది. ఇంట్లో ఏవో పనులున్నాయని అంది. మేం ఏసీ కూపేలో కూర్చున్నాం. నాకు దిగులుగా ఉంది. ఇదేనా ప్రేమంటే? ఇదేనా జీవితమంటే? అని అనిపించింది. నాకు ముఖ్యమైన సంఘటనలలో భాగం పంచుకోకపోతే ఎలా? ఇక తనతో మాట్లాడనని నాసిర్‍కి చెప్పాను. బండి కదులుతుండగా, నాసిర్‍కి స్టేషన్ మాస్టరు కబురు పెట్టారు. బరోడా స్టేషన్‍లో నాసిర్ దిగి, బురఖా ధరించిన ఓ మహిళను వెంటబెట్టుకొచ్చారు. ఆశ్చర్యం… తను గీత! అదే రైలులో స్త్రీల బోగీలో ప్రయాణించిందట… అది నా జీవితంలో బెస్ట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్” చెప్పుకొచ్చారు షమ్మీ.

ఆ తర్వాతి సినిమా ‘దిల్ దేకే దేఖో’. కొత్త నాయిక ఆశా పరేఖ్. ఈ సినిమా చిత్రీకరణలో గీత తనకెంతో సాయం చేసారని ఆశా గుర్తుచేసుకున్నారు. షూటింగ్ అంతా సరదాగా గడిచిపోయింది, విడుదల అయ్యేటప్పుడు అందరికీ టెన్షన్. మొదటి రెండు ఆటలు అయ్యాకా, షమ్మీ ఇంటికి ఫోన్ చేసి – ‘సాధించాం’ అన్నారట గీతతో. ఆ సాయంత్రం గీత, షమ్మీ, నాసిర్ హుస్సేన్, ఆశా, మజ్రూహ్ సుల్తాన్ పురీ తదితరులందరూ కలిసి థియేటర్‌లో సందడి చేశారు. తరువాత ఆ రాత్రి చెంబూరులో షమ్మీ ఇంట్లో పార్టీ చేసుకున్నారు.

ఆ తరువాత జంగ్లీ, చైనా టౌన్, దిల్ తేరా దీవానా, ప్రొఫెసర్, బ్లఫ్ మాస్టర్, కశ్మీర్ కీ కలీ…. వరుసగా విజయాలు సాధించడంతో షమ్మీకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

‘తుమ్‌సా నహీ దేఖా’ విజయం ఆస్వాదిస్తున్న సమయంలోనే వారికి కొడుకు పుట్టాడు. ఆదిత్య రాజ్ కపూర్ 1 జూలై 1956 న జన్మించాడు. ఐదేళ్ళ తర్వాత గీత మళ్ళీ గర్భవతి అయ్యారు. “ఈసారి పాప పుడుతుందని నాకు అనిపించింది. అప్పుడు నేను షూటింగ్ కోసం లండన్‌లో ఉన్నాను” గుర్తు చేసుకున్నారు షమ్మీ.  8 ఆగస్ట్ 1961 నాడు కంచన్ పుట్టింది. షమ్మీ పాపకి కంచన్ అని పేరు పెట్టలి అనుకోగా, కాజల్ అని గీత అనుకున్నారు. చివరికి టాస్ వేయగా షమ్మీ గెలిచారు. అలిగిన గీత తన గది నిండా కాజల్ అనే పేరు రాసేసారట. పాప పుట్టిన కొన్ని నెలలకే యూరప్‌ ప్రయాణించారు గీత. బెర్లిన్‌తో తమ పెళ్ళి రోజు జరుపుకున్నారు. అత్తగారు, మామగారు గీతని ఎంతో అభిమానించేవారు. మిసెస్ కపూర్ పాత్రను గీత పరిపూర్ణంగా పోషిస్తున్నారు అప్పుడు.

తమ పిల్లలకి ఉత్తమ విద్యని అందించాలని అనుకునేవారు. తను చిన్నప్పుడు చదువుకు దూరమయ్యానని, తండ్రి వెంట దేశాలు తిరగడంతో తనకి సరిగా చదువబ్బలేదని బాధపడేవారు. అందుకని కొడుకుని బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. పిల్లాడు వెళ్ళిపోయాకా, గీతకి బోలెడు తీరిక దొరికింది. షమ్మీ ఎంతో  బిజీగా ఉండేవారు. తాను మళ్ళీ నటిస్తానని అన్నారు గీత. ఆయన అంగీకరించారు. ప్రదీప్ కుమార్‌తో ‘జబ్‌సే తుమ్హే దేఖా హై’ చేశారు. తరువాత ‘రానో’. ఒకసారి ఓ థియేటర్‍లో షమ్మీతో కలిసి ‘పథేర్ పాంచాలి’ చూశారు గీత. రోషోమన్, ద వే ఆఫ్ ఆల్ ఫ్లెష్, గాన్ విత్ ద విండ్ వంటి సినిమాల వలె ఈ చిత్రం ఆమెను కదిలించింది. రాజేందర్ సింగ్ బేడీ రచించిన ‘ఏక్ చాదర్ మైలీ సీ’ నవలని సినిమాగా తీయాలనుకున్నారు గీత. అందుకు అవసరమైన నిధులని తాను సమకూరుస్తానని షమ్మీ చెప్పారు. కథానాయికా పాత్ర తానే పోషిద్దామనుకున్నారు. ధర్మేంద్ర హీరో. పిల్లల్ని తీసుకుని పంజాబ్‍లోని మోగా అనే మారుమూల గ్రామానికి వెళ్ళిపోయారు గీత. షమ్మీ విస్తుపోయారు. “నవంబరు -డిసెంబరు నెలల్లో అక్కడ బాగా చలిగా ఉంటుంది. మార్చి నెలలో వెళ్ళొచ్చుగా” అని అన్నారు. అయితే ఈ సినిమాని గీత బాగా ఆస్వాదించారు. సినిమా కూడా బాగా వస్తోంది. జనవరి 9న ఆమె చిత్ర సిబ్బందికి పార్టీ కూడా ఇచ్చారు. ఆ మర్నాడు ఆమెకి విపరీతమైన తలనొప్పి వచ్చింది, తర్వాత జ్వరం. గీతకి ‘తట్టు’ అని తెలిసినప్పుడు షమ్మీ తీస్రీ మంజిల్ షూటింగ్‍లో ఉన్నారు. వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని, గీతని ఇంటికి వచ్చేసారు. రెండు రోజుల తర్వాత అది మశూచి అని తెలిసింది. 17వ తేదీ నాటికి మశూచి ఆమె రూపాన్ని వికృతం చేయడమే కాకుండా, కళ్ళకి ఇన్‌ఫెక్షన్ కలిగించింది. జ్వరం పెరిగిపోయి 107 డిగ్రీలకు చేరింది. రెండు రోజుల పాటు ఐస్ మీద ఉంచారు. ఒక పదిహేను రోజుల పాటు ఆమె పరిస్థితి తీవ్రంగా ఉంది. జనవరి 21న ఆమె జ్వరం తగ్గింది. “కుటుంబం అంతా ఎంతో సంతోషించారు. తను కోమా లోంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచింది. మత్తుగా చుట్టూ చూసింది. తన తలని నా చేతులలో ఉంచుకుని ‘ఏం పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది. నిన్ను స్విట్జర్లాండ్ తీసుకువెళ్తాను. అక్కడి డాక్టర్లు ఈ మచ్చలని పోగొడుతారు, బెంగ పడకు. ఇదివరకు లానే అందంగా ఉంటావు’ అని ధైర్యం చెప్పాను. కానీ మరో ఐదు నిమిషాలకే తను కన్నుమూసింది” గుర్తు చేసుకున్నారు షమ్మీ. ఆ రోజు జనవరి 21, 1965. అప్పుడామె వయసు 34 ఏళ్ళే. ఆమెకి చికిత్స చేస్తున్న వైద్యుడు ఆమె గుండెకి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, కానీ ఉపయోగం లేకపోయింది. ఆమెని ఎవరూ వెనక్కి తేలేకపోయారు. ఆ డాక్టర్ లివింగ్ రూమ్ లోకి రాగానే ఆయన దృష్టి అక్కడున్న ఓ అందమైన యువతి ఫోటోపై పడిందట. ఎవరామె అని అడిగితే, “తనే మీరు చికిత్స చేసిన పేషంటు” అని చెప్పేసరికి దుఃఖం ఆపుకోలేకపోయారట ఆ డాక్టరు.

ఆ సాయంత్రం ఐదు గంటలకి ఆమె దేహాన్ని – తాము వివాహం చేసుకున్న చోటుకు – షమ్మీ బన్‍గంగా వద్దకు తెచ్చారు. అక్కడికి పదేళ్ళ తర్వాత మళ్ళీ ఆమెతో కలిసి వచ్చారు. కానీ విధి విలాసం ఈసారి ఆమె జీవించి లేరు. తన పయనం ఒంటరిగానే సాగించాల్సి ఉందాయనకు.

భార్య గీతా బాలి మరణం అనంతరం మళ్ళీ షూటింగ్‍లో పాల్గొన్న షమ్మీ కపూర్‍ని చూస్తే ఆశా పరేఖ్‌కి దుఃఖం ఆగలేదట. ‘తుమ్ నే ముఝే దేఖా హో కె మెహెర్బాన్’ పాట చిత్రీకరణలో సందర్భంగా తాను నిజంగా కన్నీరు కార్చానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

***

గీతా బాలి నటించిన పాటలకి యూట్యూబ్‌లో చూడండి:

అల్‌బేలా చిత్రంలోని షోలా జో భడ్కే దిల్ మేరా పాట:

https://www.youtube.com/watch?v=xPBp45fKado

బాజి చిత్రంలోని తద్‌బీర్ సే బిగడీ హుయీ తక్‍దీర్ పాట:

https://www.youtube.com/watch?v=L9EOHv93enE


జయలలితను కలిసిన రూపా ఉన్నికృష్ణన్:

రూపా ఉన్నికృష్ణన్ కామన్‌వెల్త్ క్రీడలలో స్వర్ణ పతక విజేత. అర్జున పురస్కార గ్రహీత. రోడ్స్ స్కాలర్. న్యూ యార్క్ నగరంలో స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ కన్సల్టంట్‍గా వ్యవహరిస్తున్నారు.

తనని జయలలిత ఎందుకు కలవమన్నారో చెప్తూ, ఆ సమావేశం గురించి వివరిస్తున్నారు రూప.

***

“మీరు అలా చేయనక్కర్లేదు…” అన్నారు ఆవిడ, కళ్లలో చిరునవ్వుతో. అప్పుడు నేను ఆమె పాదాల కేసి సందేహంగా చూస్తున్నాను. ఆవిడని కలవడం అదే మొదటిసారి. చుట్టూ ఉన్న జనాలు ఆమె పాదాలను తాకి నమస్కరిస్తున్నారు.

పెద్దలకు పాద నమస్కారం చేయడం మన సాంప్రదాయం. ఇప్పటికీ పెళ్ళిళ్ళలో దంపతులు పెద్దలందరి పాదాలకి నమస్కరించడం మనం చూస్తూ ఉంటాం.

‘అమ్మ’ని నేను కలవడానికి చాలా ఏళ్ళ ముందే ఒక ఆచారం ఏర్పడిపోయింది. రాజకీయ నాయకులందరూ అమ్మ లేదా జె. జయలలిత… అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి పాదాలపై పడడం ఒక ఆనవాయితీ అయింది. అలాంటి ఫోటోలు పత్రికల్లో చూసినప్పుడల్లా నాకేదో వింతగా ఉండేది.

అలాంటి మరో ఫోటో కూడా నా మనసులో ముద్రితమై ఉంది. అదే రాజకీయ నాయకులు ఆమె ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు – చీర లాగేయడానికి ప్రయత్నించిన ఫొటో.

చెన్నైలో సౌత్ ఏసియన్ ఫెడరేషన్ గేమ్స్ నిర్వహించాలని జయలలిత భావిస్తున్న రోజులలో నేను ఆవిడను కలిసాను. క్రికెట్ లోనూ, టెన్నిస్ లోనూ తప్ప మిగతా క్రీడలలో తమిళనాడుకు పేరు తెచ్చిన క్రీడాకారులు ఎక్కువ లేరని ఆవిడ అనుకున్నారట.

అప్పుడు, మా కుటుంబ మిత్రులు, రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ ఎన్. హరిభాస్కర్ గారు ఆవిడ వద్ద నా పేరు ప్రస్తావించారట.

అప్పటికి నేను రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ కప్ లలో, ఏసియన్ గేమ్స్‌లో, కామన్‍వెల్త్ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఉన్నాను. అంతకు ముందు జరిగిన పోటీలలో ఎన్నో స్వర్ణ, రజత పతకాలు, రికార్డులు సాధించి ఉన్నాను.

అప్పుడే నేను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రోడ్స్ స్కాలర్‌షిప్‍కి ఎంపికయ్యాను. నేను చెన్నైవాసినని ఆవిడ తెలుసుకున్నారు. వచ్చి కలవమని కబురు పంపారు. హరిభాస్కర్ అంకుల్ మా ఇంటికి ఫోన్ చేసి మర్నాడు సెక్రటేరియట్‍కి రమ్మన్నారు. అమ్మా, నాన్నా, నేనూ ఓ క్షణం విస్తుపోయి కూర్చున్నాం. నేను తేరుకుని, రాబోయ్ ఏడాది ఉన్న స్పోర్ట్-షూటింగ్ గురించి ఆలోచించాను.

ఢిల్లీలో జరిగే షూటింగ్ క్యాంపులలో పాల్గొనడానికి రానూ పోనూ ప్రయాణపు  రైల్లో థర్డ్ క్లాసులో చేశాను. పరికరాలకి, క్రీడా వస్తువుల ఖర్చులకి నాన్న డబ్బులు ఎన్నో వాడేశాను. అందుకని ఒక సంవత్సరానికి కావల్సిన బడ్జెట్ తయారు చేసుకొన్నాను.

మర్నాడు నాన్న నన్నూ, అమ్మని సెక్రటేరియట్ గేట్ ముందు దింపి వెళ్ళిపోయారు. హరిభాస్కర్ అంకుల్ మమ్మల్ని లోపలికి పిలిపించారు. ఎన్నో గేట్లు, కారిడార్లు దాటిన తరువాత – నిరాడంబరంగా, అందంగా ఉన్న ఆ గదిలోకి ప్రవేశించాము. నా పాదాలు మంచుముక్కల్లా మారుతుండగా ఆవిడ సమక్షంలోకి అడుగుపెట్టాం. నిన్న రాత్రి స్నేహితులు, బంధువులందరూ ఇచ్చిన ఒకే సలహా – ఆవిడకి పాద నమస్కారం చేయమని!

ఆ పని చేయకుండా ఉండడానికే ప్రయత్నించాను. నా సంశయం గమనించిన ఆవిడ, తన సుమధుర కంఠంతో, చక్కని ఇంగ్లీషులో “You don’t need to do that” అని, నన్ను హత్తుకున్నారు. ఎదురెదురుగా కూర్చున్నాము. మొదట్లో తడబడినా, తరువాత నా రైఫిల్ షూటింగ్ గురించి అంతా ఆవిడకి ఉత్సాహంగా వివరించాను.

అన్నీ ఓక్‌లే సినిమా కన్నా, ఓ యోగా లాగా అనిపించింది మా సమావేశం. కానీ ఉల్లాసంగా సాగింది.

తరువాత మా సంభాషణ భారతదేశంలో క్రీడలలో రాణించడం ఎంత కష్టమో అనే అంశంపైకి మళ్ళింది.  క్రీడాకారులకి ఉద్యోగావకాశాలు తక్కువ, ఒక వేళ అర్హత సాధించినా అడ్డుపుల్లలేసే అధికార గణం… పైగా అవినీతి… ఇవన్నీ క్రీడల్లో దేశం పురోగమించకుండా అడ్డుకుంటున్నాయి.

ఆవిడ ముందుకు వంగి నాకేం కావాలని అడిగారు. “మీ దీవెనలు” అన్నాను.

“అవి ఇప్పటికే ఉన్నాయి” అంటూ, “కానీ ఇంకేం కావాలి?” అడిగారు

నేను టైప్ చేసుకొచ్చిన కాగితం ఆవిడ ముందుంచాను. “నేను మరింత మెరుగవడంలో సాయం చేయండి. తమిళనాడు గర్వపడేలా చేస్తాను” అన్నాను. ఆవిడ తన సెక్రటరీకేసి చేయి ఊపి – “కొత్త పరికరాలకి, రైఫిల్, మందుగుండుకి, జాకెట్‌కి నిధులు ఉండేలా చూడండి. షూటింగ్ ఈవెంట్‌కి వెళ్ళేడప్పుడూ, తనకీ, వాళ్ళ అమ్మగారికి విమానం టికెట్లు ఏర్పాటు చేయండి” అని చెప్పారు.

తరువాత ఆమె నన్ను Magalir Magal – ప్రజల కూతురుగా పేర్కొంటూ ఒక పత్రం అందజేశారు. నేను విస్తుపోయాను. ఆ తర్వాత ఆ రోజుని ఎన్నో సార్లు తలచుకున్నాను. ఏవేవో కావాలనో, లేదా చాలామంది అడిగేడట్టు – ఓ ఇల్లు కావాలనీ ఎందుకు అడగలేకపోయానా అని అనుకునేదాన్ని. కానీ నేనా రోజు సంభ్రమంలో మునిగిపోయి ఉన్నాను.

నగరంలో, రాష్ట్రంలో, దేశంలో – ప్రతీ రోజు ఎందరూ స్త్రీలను కించపరుస్తుంటారు. అటువంటిది ఇక్కడ ఘనత వహించిన ఓ మహిళా నేత అధికారం చేజిక్కించుకుని ఎందరో అపవాదకులను ఎదుర్కుని, హుందాగా ఎదుర్కున్నారు. ఆరోపణలు ఎదురైనా, తన బలాలేమిటో నిరూపించుకున్నారు. ఆవిడని ప్రేరణగా తీసుకోకుండా ఉండలేకపోయాను.

అటువంటి స్త్రీమూర్తిని మగ నాయకులు చీర లాగి అసెంబ్లీలోనే అవమానం జరపడం – నాకు బస్సుల్లోనూ, బహిరంగ ప్రదేశాలలోను ఆడవాళ్ళని తాకి ఇబ్బంది పెట్టేవాళ్లని, లేదా బీచ్‌లో పరుగు తీస్తున్నప్పుడు రకరకాల వ్యాఖ్యలు చేసే అనేకమంది ధూర్తులను గుర్తు చేసింది.

మీరెక్కడా క్షేమంగా ఉండలేరు. అయినా – మహిళలు పుంజుకోవచ్చని చాటిన ఈ వెలుగు మనకుంది.

ఆవిడని బాగా మిస్ అవుతున్నాము. ఆవిడ లాంటి వారు మరొకరు రారు, రాలేరు.

భావి తరాల భారతీయులకు ఆవిడ ఒక ధ్రువతార!

***

తనని జయలలిత ఎంతలా ప్రభావితం చేశారో వివరించారు రూప.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here