అలనాటి అపురూపాలు-79

0
13

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ధ్వనితో అద్భుతాలు చేసిన ఎ.కృష్ణన్:

వాహినీ, విజయ ప్రొడక్షన్స్ వారి సినిమాలలో ధ్వని అద్భుతమైన నాణ్యతతో ఎలా ఉంటుందా అని చాలామంది ఆశ్చర్యం వెలిబుచ్చుతారు. అందుకు కారణం – ది గ్రేట్ సౌండ్ ఇంజనీర్ ఎ. కృష్ణన్.

ఆయన 1905లో మలబార్ ప్రాంతంలోని త్రిస్సూరులో జన్మించారు. ఆయన ఎర్నాకుళం మహారాజా కాలేజీలో చదువుకున్నారు. ఆపై మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత అదే కాలేజీలో లెక్చరర్‌గా చేరి ఎలెక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. 1927 మద్రాసు యూనివర్శిటీ ఈ సబ్జెక్టులను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేర్చింది. దాంతో ఆయనకు లెక్చరర్‍గా అవకాశం లభించింది. అప్పట్లో ఈ సబ్జెక్టులపై పుస్తకాలు తక్కువగా ఉన్నప్పటికీ, కృష్ణన్ అతి కష్టం మీద చదివి, నోట్స్ వ్రాసుకుని, విద్యార్థులకు బోధించేవారు. అదే సమయంలో తనకున్న ఆసక్తి కారణంగా, సౌండ్ ఇంజనీరింగ్ చదవడం ప్రారంభించారు. అదే ఆయన కెరీర్‍కు తరువాతి రోజుల్లో బంగారు బాట వేసింది.

1927 నుంచి 1937 వరకు పదేళ్ల పాటు విద్యాబోధన చేశారు. ఆ తర్వాత ఆయనకి సినీ రంగం నుంచి పిలుపు వచ్చింది. 1937లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శక నిర్మాత అయిన ఎ. రామ్‍నాథ్ గారు మద్రాసులో కార్తికేయ స్టూడియో నిర్మిస్తున్నారు. ఆయన తిరుచిరాపల్లి వచ్చి, కృష్ణన్ గారిని కలవడం జరిగింది. తాను తీస్తున్న తమిళ సినిమా ‘సుందరమూర్తి నయనార్’కి పని చేయవలసిందిగా కృష్ణన్‌ని కోరారు. ఆ సినిమాకి మురుగదాస్ దర్శకులు.  రామ్‌నాథ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. శేఖర్, కృష్ణన్‌లు సౌండ్ ఇంజనీర్లు. చిత్ర నిర్మాణంలో నైపుణ్యానికి గాను ఈ చిత్రం అప్పట్లో ప్రశంసలు పొందింది.

కార్తికేయ స్టూడియోలో చిత్రీకరించిన రెండవ చిత్రం – తెలుగు చిత్రం ‘గృహలక్ష్మి’. ఈ చిత్రం చలన చిత్రసీమకు సుప్రసిద్ధ దర్శకులను, సాంకేతిక నిపుణులను అందించింది [దర్శకులు హెచ్. ఎం. రెడ్డి నిర్మాతగా మారదలచినప్పుడు, బి. ఎన్. రెడ్డి, బి. నాగిరెడ్డి గార్లు ఆయనతో చేతుకు కలిపి రోహిణి పిక్చర్స్ సంస్థను స్థాపించారు. అప్పుడే బి.ఎస్.సి పూర్తి చేసిన కె.వి. రెడ్డి నిర్మాణం బాధ్యతలు స్వీకరించారు. కడారు నాగభూషణం గారు (తర్వాతి కాలం నిర్మాత,దర్శకుడు – నటి కన్నాంబ భర్త) ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరారు. హెచ్.వి. బాబు, డి. ఎల్. రామచందర్ (హెచ్.ఎం. రెడ్డి గారి బావమరిది) అసోసియేట్, అసిస్టెంట్ డైరక్టర్లుగా పనిచేశారు. కమలాకర కామేశ్వరరావు హెచ్.ఎం.రెడ్డికి సహాయకుడిగా వ్యవహరించారు. సముద్రాల రాఘవయ్య రచయితగా పనిచేశారు]. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా, సృజనాత్మక విభేదాల కారణంగా బి.ఎన్. రెడ్డి, హెచ్. ఎం. రెడ్డి విడిపోయారు.  లాభాల్లో తన వాటా తీసుకుని బి.ఎన్. రెడ్డి తన సోదరుడు బి. నాగిరెడ్డి, కె.వి.రెడ్డి, కమలాకర, సముద్రాల గార్లతో కలిసి రోహిణి పిక్చర్స్ లోంచి బయటకు వచ్చేసారు. వాహిని పిక్చర్స్ స్థాపించారు.

కృష్ణన్ న్యూటోన్ స్టూడియో కోసం – తెలుగు సినిమాలు – భాగ్యలక్ష్మి, త్యాగయ్య – లకు సౌండ్ ఇంజనీర్‍గా పని చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ నాగయ్య ప్రధాన పాత్రధారి. ఈ రెండు సినిమాలకే కాకుండా, వాహిని వారు నిర్మించిన – వందేమాతరం, సుమంగళి, దేవత, పోతన, స్వర్గసీమ, యోగి వేమన వంటి చిత్రాలకు సౌండ్ ఇంజనీరుగా పనిచేశారు. ఇవన్నీ బి. ఎన్. రెడ్డి తీసిన వరుస హిట్స్! వీటితో సౌండ్ ఇంజనీరుగా కృష్ణన్‍ గారికి మంచి పేరొచ్చింది. ఆ సమయంలో మద్రాసు యూనివర్శిటీ – ఫిల్మ్ మేకింగ్ – అనే అంశంతో పాలిటెక్నిక్ కోర్సు ప్రవేశపెట్టింది. అక్కడ సౌండ్ ఇంజనీరింగ్‍లో పాఠాలు బోధించే ఉద్యోగం లభించింది కృష్ణన్‌కు. అక్కడ ఆరు నెలల పాటు పనిచేశారు. కానీ సినిమాలంటే ఉన్న ఇష్టం కారణంగా, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, సినీరంగానికి మళ్ళీ వచ్చారు.

1948లో బి. నాగిరెడ్డి, ఆయన భాగస్వామి చక్రపాణి – అప్పుల పాలయిన వాహినీ స్టూడియోని కొన్నారు. దానికి ఒకప్పుడు వారి వ్యాపార భాగస్వామి మూల నారాయణ స్వామి యజమాని [ఈ స్టూడియోని మూల నారాయణ స్వామితో కలిసి బి. నాగిరెడ్డి అన్నగారైన బి. ఎన్. రెడ్డి ఒక్కో ఇటుకా పేర్చి నిర్మించి, పైన చెప్పిన హిట్ సినిమాలు అందిచారన్నది గమనించాల్సిన అంశం. ఈ అభిమానంతోనే వారు ఆ స్టూడియోకి ‘విజయ – వాహిని’ అని పేరు పెట్టారు]. నాగిరెడ్డి, చక్రపాణి గార్లు కృష్ణన్‌కి ఆహ్వానించి తన బ్యానర్‍లో స్వతంత్ర్యంగా సౌండ్ ఇంజనీరింగ్ బాధ్యతలు చూసుకోమన్నారు. గుణసుందరి కథలో హీరోగా నటించిన శివరాం ఆయనకి సహాయకుడయ్యారు.

బి. ఎన్. రెడ్డి గారి వాహిని సంస్థ నిర్మించిన గుణసుందరి కథ, మల్లీశ్వరి, పెద్ద మనుషులు వంటి చిత్రాలకు; విజయా సంస్థ తెలుగు, తమిళంలో నిర్మించిన షావుకారు, పాతాళ భైరవి, చంద్రహారం, మిస్సమ్మ, మాయాబజార్, అప్పు చేసి పప్పుకూడు, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ తదితర చిత్రాలకు కృష్ణన్ సౌండ్ ఇంజనీరుగా పని చేశారు. ఈ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకున్న అన్ని భాషల చిత్రాలకు ఆయన సౌండ్ ఇంజనీరుగా వ్యవహరించారు. ఏ సినిమా నిర్మాణంకైనా ఛాయాగ్రహణం, సౌండ్ ఇంజనీరింగ్ రెండు కళ్ళలాంటివని కృష్ణన్ అనేవారు. ఆ రోజుల్లో ఛాయాగ్రాహకులుగా మార్కస్ బార్ట్లే, సౌండ్ ఇంజినీరుగా కృష్ణన్ ఉంటే సెట్ మీద అత్యంత నిశ్శబ్దం రాజ్యమేలేది. లైట్లను సరిజూసేవారు, మైకులు వాటి స్థానంలో ఉండేవి, దర్శకులు కూడా ఓపికగా ఎదురుచూసేవారు. వాటి ఫలితమే ఈనాటికీ ఆదరణకి నోచుకుంటున్న అనేక క్లాసిక్ సినిమాలు!

ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠల వల్ల కృష్ణన్ – సినీ టెక్నీషియన్స్ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఆయన చాలా కాలం కొనసాగారు.


ప్రముఖ హాస్యనటులు రేలంగి గురించి శ్రీ బి.ఎ. సుబ్బారావు గారి మాటల్లో:

పల్లెటూరి పిల్ల, రాజు పేద, చెంచులక్ష్మి వంటి సినిమాలు తీసిన దర్శకనిర్మాత శ్రీ బి.ఎ. సుబ్బారావు ప్రముఖ హాస్యనటులు రేలంగి వెంకట్రామయ్యకి బాల్యమిత్రులు. 1958లో రేలంగి వంద సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా జరిగిన ఓ వేడుకలో సుబ్బారావుగారు రేలంగి గురించి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే:

“రేలంగి, నేను ఒకే స్కూలులో ఒకే క్లాసులో చదువుకున్నాం. ఇప్పుటి రేలంగికి, అప్పటి రేలంగికి ఎంతో తేడా ఉంది. బడిలో చదివే రోజుల్లో అతనో రౌడీ. తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే, వెళ్ళి గొడవ పెట్టుకుని కొట్టి వచ్చేవాడు.

ఒకసారి కలకత్తాలో ‘తులాభారం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. రేలంగి ప్రొడక్షన్ యూనిట్‌లో పని చేస్తున్నాడు. యూనిట్‍లో ఒక వ్యక్తి తన గురించి చెడుగా మాట్లాడుతున్నాడని అతనికి తెలిసింది. ఆ వ్యక్తికి ఒక చెంప దెబ్బ కొట్టి, కలకత్తా వదిలి మద్రాస్ వచ్చేశాడు. అక్కడ మేం మళ్ళీ కలిసాం. ఆ రోజుల్లో నేను అడయార్ క్లబ్‍కి సెక్రటరీగా ఉన్న మా అన్నయ్య దగ్గర ఉండేవాడిని.

మేమిద్దరం పొద్దునే లేచి క్లబ్ నుంచి జార్జి టౌన్‌లోని మినర్వా థియేటర్ వరకు నడిచేవాళ్ళం. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని – భోజనం చెయ్యడానికి మళ్ళీ క్లబ్‌కి వచ్చేవాళ్ళం. అన్నయ్య అక్కడ సెక్రటరీ కాబట్టి మాకు భోజనం ఫ్రీ. ఆ రోజుల్లో మా ఉచిత భోజనం గురించి ఎన్నిసార్లో తలచుకుని నవ్వుకునేవాళ్ళం. మేము ఏనాడు ఆకలితో లేము. తర్వాత నాకు నటి కృష్ణవేణి, వారి భర్త మీర్జాపురం రాజావారి శోభనాచల స్టూడియోలో ఉద్యోగం దొరికింది. నా సిఫారసుతో రేలంగికి కూడా ఉద్యోగం దొరికింది.

అవి మా తొలి, కఠినమైన రోజులు. ఒకరోజు రేలంగికీ, కృష్ణవేణి గారికి ఏదో విషయంలో వాదన జరిగింది. రేలంగి ఉద్యోగం మానేశాడు. నాకు బాధ అనిపించింది. అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులని, ఉద్యోగాలు అంత సులువుగా దొరకవని చెప్పి నచ్చజెప్పి, అతన్ని మళ్ళీ ఉద్యోగంలో తీసుకునేలా కృష్ణవేణిగారిని ఒప్పించాను. రేలంగి ఆ రోజుల్లో సింహంలా ఉండేవాడు.

తరువాత ‘వింధ్యా రాణి’ చిత్రంలో రేలంగికి ఒక హాస్య పాత్ర దక్కింది. ఆ సినిమా తరువాత అతను హాస్య పాత్రలలో నిలదొక్కుకున్నాడు. ‘గుణసుందరి కథ’లో రేలంగిని తీసుకునేలా నేనే కె.వి.రెడ్డి గారిని ఒప్పించాను. సాధారణంగా ఎవరైనా డబ్బు బాగా సంపాదిస్తుంటే, వారి ప్రవర్తన మారిపోతుంది. కానీ రేలంగి ఇందుకు విరుద్ధం. సినిమా సినిమాకి మరింత వినయంగా మారాడు. అతన్ని చిన్నతనం నుంచి చూస్తున్న నాకే ఈ మార్పు ఆశ్చర్యంగా ఉంది.

ప్రస్తుతానికి కాల్‌షీట్లు అస్సలు ఖాళీ లేని, తీరిక లేని నటుడంటే రేలంగే. రేలంగి ఎప్పటికీ నిర్మాతల నటుడే, తన వల్ల నిర్మాతలకి నష్టం రాకుండా చూస్తాడు. తన పాత్ర చిత్రీకరణ అనుకున్న తేదీకి పూర్తి కాకపోతే నిర్మాతలను కారణాలు కనుక్కుంటాడు. ఇప్పుడలా నిర్మాతలని కనుక్కుని, మళ్ళీ కాల్‌షీట్లు ఇచ్చే నటులెవరూ లేరు. ఎలాంటి వ్యక్తులతో అయినా, ఎలాంటి పరిస్థితులనైనా సర్దుకుపోయే అనుకూలమైన మనిషి రేలంగి.

నా సినిమా ‘చెంచులక్ష్మి’లో రేలంగితో నారద ముని వేషం వేయించాను. తానా వేషం వేయగలగని రేలంగి అస్సలు నమ్మలేదు. “నేనేంటి, నారదుడి వేషం ఏంటి, నన్నొదిలేయ్” అన్నాడు. అతి కష్టం మీద, బలవంతాన సెట్‌కి లాక్కొచ్చి షూటింగ్ చేశాను. బాగా చేశాడు. అలాగే, నా మరో సినిమా ‘రాజు పేద’లో గుర్రం ఎక్కించి, రేలంగితో స్టంట్స్ చేయించాను. తాను ఆ పాత్రకు నప్పనని అంటూనే ఉన్నాడు…”

***

ఈ మాటలని బట్టి వారిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉండేదో తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here