అలనాటి అపురూపాలు-8

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నట గురువు దేవదాస్ కనకాల

కొందరి గొప్పతనం వారి వల్ల కాకుండా, వారి శిష్యుల వల్ల ప్రపంచానికి తెలుస్తుంది. అంటువంటి గొప్ప గురువులలో శ్రీ దేవదాస్ కనకాల ఒకరు.

నటుడిగా రాణిస్తూనే, ఎందరో వర్ధమాన నటులకు శిక్షణ ఇచ్చి సినీపరిశ్రమకి అందించిన విశిష్ట శిక్షకులు దేవదాస్ కనకాల.

30 జూలై 1945 న పుదుచ్చేరి జిల్లాలోని యానాం లోని కనకాలపేటలో జన్మించారు. విశాఖపట్నంలోని ఎవిఎన్ కాలేజ్ నుంచి బి.ఎ. పట్టా పొందారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి నటనలో డిప్లొమా పొందారు. ఆపై పూనె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కూడా డిప్లొమా పాసయ్యారు. తరువాత హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ వారి థియేటర్ ఆర్ట్స్ విభాగంలోని సాంగ్ అండ్ డ్రామా డివిజన్‌‌కి అధిపతిగా మూడేళ్ళ పాటు పనిచేశారు. అటు పిమ్మట మద్రాస్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి అనుబంధంగా ఉన్న అడయార్ ఫిల్మ్ ఇన్‍స్టిట్యూట్‌లో లెక్చరర్‌గా పనిచేశారు. తరువాత అసిస్టెంట్ ఫ్రొఫెసర్ అయ్యారు.

‘అభిమానవంతులు’ నటుడిగా ఆయన తొలి చిత్రం. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘ఓ సీత కథ’ లోనూ, ‘మాంగల్యానికి మరో ముడి’ అనే చిత్రంలోనూ నెగటివ్ పాత్రలు సైతం పోషించారు. ఆయన పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. హైదరాబాదులో నట శిక్షణా సంస్థను ప్రారంభించి నటీనటులకు శిక్షణనిచ్చారు. ఈ కాలేజీకి వారి సతీమణి లక్ష్మీ కనకాల ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఆవిడ సుప్రసిద్ధ నర్తకి. ఆవిడ కూడా మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షకురాలిగా వ్యవహరించారు. చిరంజీవి, అల్లరి నరేష్, శుభలేఖ సుధాకర్, సుహాసిని వంటి వారికి శిక్షణనిచ్చారు. చిరంజీవి ఆవిడని ‘సరస్వతీ దేవి’ అనేవారు. ఇక్కడే ఆవిడ దేవదాస్ కనకాల గారిని కలుసుకుని, తర్వాత వివాహమాడారు. 1980లలో లక్ష్మి గారు ప్రసిద్ధులైన నటి. ‘ప్రేమ బంధం’, ‘పోలీస్ లాకప్’ వంటివి ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు. ఆవిడ చివరి సినిమా ‘బాహుబలి’. వీరి పుత్రుడు రాజీవ్ కనకాల కూడా ప్రసిద్ధి చెందిన నటుడు. కాగా కోడలు సుమ కనకాల జగమెరిగన టీవీ యాంకర్.

మద్రాస్‌లో ఉండగా దేవదాస్ తమిళ నటుడు రఘువరన్‌కి, తెలుగు నటులు రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్ వంటివారికి శిక్షణనిచ్చారు. శ్రీమతి లక్ష్మి కనకాల 2018లో మరణించారు. “ఆవిడ నాకు వినయం నేర్పారు, భోజనం పెట్టారు, ఆర్టిస్టుగా ఎలా రాణించాలో నేర్పారు. ఆవిడ మృతి చెందిన రోజున కూడా నేను ఆవిడ నాకు నేర్పిందే చేస్తున్నాను. వారికి నా శాల్యుట్. వారి ఆత్మకి శాంతి కలుగుగాక! నా మొదటి గురువు లక్ష్మి గారు గతించడం నాకు తీర్చలేని లోటు” అన్నారు అల్లరి నరేష్. తరువాత దేవదాస్ కనకాల గారు 2 ఆగస్టు 2019న మృతి చెందారు. వారి కూతురు శ్రీలక్ష్మి ఇటీవలే 7 ఏప్రిల్ 2020 నాడు స్వర్గస్థులవడం విషాదం!

గురువుల విశిష్టత శిష్యుల ప్రతిభలో అజరామరంగా నిలిచి ఉంటుంది.


మరువరాని ఛాయాగ్రహకులు వి.వి.ఆర్. చౌదరి/వి. వెంకట్రామ చౌదరి

సినిమా చిత్రీకరణకి దర్శకుడు, నటీనటులు ఎంత అవసరమో, ఛాయాగ్రహకుడు కూడా అంతే కీలకం. ఛాయాగ్రహకుడి ప్రతిభ వల్ల సొబగులద్దుకున్న సినిమాలు ఎన్నో. అలాంటి మరువరాని సినీమాటోగ్రాఫర్‌లలో వి.వి.ఆర్. చౌదరి ఒకరు.

సెట్స్‌లో కాకుండా నిజమైన ఇళ్ళలో షూటింగ్ చేసేందుకు గాను ‘బౌన్స్ లైటింగ్’ అనే పద్ధతికి ఆద్యులు వీరేనని అంటారు. చిన్న ప్రదేశాలకు బౌన్డ్ లైట్ అత్యుత్తమం. కాంతిని సీలింగ్ మీదకి ప్రసారం చేసి లేదా పక్కన ఉన్న తెల్ల గోడ మీదకి ప్రసరింపజేసి, దానిని కాంతి వనరులా ఉపయోగించుకుని ఆ గదిని అందమైన, మెత్తని బౌన్డ్ లైట్‌‌తో నింపడమే ఈ ప్రక్రియ. ఇది చాలా సులువైన ప్రక్రియ అయినప్పటికీ, అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఈ ప్రక్రియను ఆయన కె.బి. తిలక్ గారి ‘ఈడూ – జోడూ’ సినిమా నుంచి ఉపయోగించారు.

వి.వి.ఆర్. చౌదరి గుంటూరు జిల్లాలోని వెనిగళ్ళవారి పాలెంలో జన్మించారు. గుంటూరులోని హిందూ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాకా, మద్రాస్ వెళ్ళి సౌండ్ ఇంజనీరు కోటేశ్వరరావు గారి వద్ద అప్రెంటిస్‌గా చేరారు

తరువాత చౌదరి గారు కె.బి. తిలక్ గారిని కలిసి ‘బౌన్స్ లైటింగ్’ అనే పద్ధతి గురించి వివరించగా, వారికి ఈ ప్రక్రియ నచ్చి, తన సినిమా ‘ఈడూ – జోడూ’కి ఛాయాగ్రహణం వహించమని కోరారు. వి.వి.ఆర్. చౌదరి గారు ‘ఉయ్యాల జంపాల’ సినిమాకి కూడా అద్భుతమైన ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రాన్ని గోదావరి తీరంలో, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో అవుట్‌డోర్ లోకేషన్స్‌లో చిత్రీకరించారు. ‘గౌరి’ చిత్రానికి కూర్చిన ఛాయాగ్రహణానికి గాను ఆయనకి గొప్ప పేరు వచ్చింది. తరువాత దాసరి నారాయణరావు గారి ‘బలిపీఠం’ సినిమాతో కలర్ ఫొటోగ్రఫీకి మళ్ళారు.

ఇలాంటి గొప్పవారు కేవలం సినీ చరిత్ర పుటలలో మిగిలిపోవడం బాధ కలిగిస్తుంది.


తొలినాటి అద్భుత కళాకారిణి గోహర్ మామాజీవాలా

‘మిస్ గోహర్’ గా ప్రసిద్ధికెక్కిన గోహర్ మామాజీవాలా (19 నవంబరు 1910 – 28 సెప్టెంబరు 1985) భారతీయ గాయని, నటి, నిర్మాత, స్టూడియో అధినేత్రి. బొంబాయికి చెందిన సుసంపన్న బోహ్రీ కుటుంబంలో జన్మించిన గోహర్ భౌతికమైన సంపదలను చిన్ననాటే అనుభవించారు. చదువంటే అమితమైన ఆసక్తి కలిగిన గోహర్ టీనేజ్‌లో ధైర్యశాలియైన యువతిగా మారారు. కానీ ప్రశాంతదినాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, తండ్రిగారి వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చి ఆస్తులు కరిగిపోయాయి. ఆ సమయంలో కోహినూర్ ఫిల్మ్స్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్న వారి కుటుంబ మిత్రుడు శ్రీ హోమీ మాస్టర్, గోహర్ నటనను వృత్తిగా ఎంచుకోవచ్చు అని సూచించారు. ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. అప్పుడామె వయసు 16 ఏళ్ళు, సాధారణంగా అమ్మాయిలు ఆ వయసులో చాలా అందంగా ఉంటారు.

గోహర్ ఒక అందాల బొమ్మ: గుండ్రటి మొహం, స్థిరమైన దవడలు, కొద్దిగా ముందుకు వచ్చిన గడ్డం, ఎత్తైన నుదురు, అందంగా ఉన్న కనుబొమలకు దూరంగా ఉన్న కేశాలు, పెద్ద పెద్ద కళ్ళు, చెక్కినట్లున్న ముక్కు, కుదురైన నోటితో చూడచక్కని రూపం ఆమెది. కోహినూర్ ఫిల్మ్స్ వారితో ఆమె మొదటి సినిమా ‘ఫార్చ్యూన్ అండ్ ఫూల్స్’. ఇది హిట్ అయింది. ఓ ధనవంతుడి కొడుకు వారసత్వంగా వచ్చినా ఆస్తిని పొగొట్టుకుని, తెలివైన, స్థిరమతి అయిన భార్య సహాయంతో తిరిగి తన కాళ్ళపై తాను నిలబడడం ఈ సినిమా కథ. ఈ సినిమాలో ఆ యువకుడి భార్యగా గోహర్ తన పాత్రని అత్యద్భుతంగా పోషించారు. ‘ఫార్చ్యూన్ అండ్ ఫూల్స్’కి కంజీభాయ్ రాథోడ్ దర్శకత్వం వహించగా, ఖలీల్ కథానాయకుడి పాత్ర పోషించారు. అది మూకీ సినిమాల కాలం, ప్రేక్షకులు స్టంట్ సినిమాలు, సాహస కృత్యాల సినిమాలు, పౌరాణిక సినిమాలను ఆదరించేవారు. ఒక సాంఘిక చిత్రం, అందునా కొత్త హీరోయిన్‌తో వారిని ఆకట్టుకోగలిగిందంటే – అది గోహర్ నటనా ప్రతిభకి నిదర్శనం.

మొదటి సినిమాతో లభించిన విజయం – కోహినూర్ ఫిల్మ్స్ వారితో తీసిన రెండవ చిత్రానికీ దక్కింది. ‘ఫెయిరీ ఆఫ్ సిలోన్’ విజయవంతమైన యువ నటికీ, నిర్మాణ సంస్థకీ కూడా పేరు తెచ్చింది. వినోదాత్మక ఫాంటసీతో కూడిన ఈ సాహస చిత్రానికి హోమీ మాస్టర్ దర్శకత్వం వహించారు, ద్వారకాదాస్ సంపత్ నిర్మాతగా వ్యవహరించారు. హీరో ఖలీల్. కోహినూర్ ఫిల్మ్స్‌లో నటించిన ఎన్నో చిత్రాలలో గోహర్‌కి బాగా నచ్చినది ఖలీల్‌తో కలసి నటించిన ‘షిరీన్ ఫర్హాద్’. అలాగే ఖలీల్ హీరోగా నటించిన చారిత్రక కథా చిత్రం – ‘జస్మా ఓడెన్’.

‘ఎడ్యుకేటెడ్ వైఫ్’ అనే సినిమాలో గోహర్ టైటిల్ పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆమె ఓ యువ వైద్యురాలిగా నటించారు, ఆమె భర్తకి సిఫిలిస్ రోగం ఉంటుంది. అతనికి నయం చేసి ఆరోగ్యవంతుడిగా చేసే క్రమంలో వారిద్దరి మధ్యా అనురాగం నెలకొంటుంది ఈ కథలో. సాధారణంగా విలన్ పాత్రలు వేసే ‘వైద్య’ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ పాత్రలో ఆమె ప్రదర్శించిన సున్నితమైన నటన, భావోద్వేగాలను ప్రదర్శించిన తీరు చందూలాల్ షా గారి దృష్టిలో పడింది. ఆయన అప్పుడే కోహినూర్ ఫిల్మ్స్ కోసం ‘టైపిస్ట్ గర్ల్’ అనే సినిమా తీస్తున్నారు. తన సినిమాలో గోహర్ కథానాయికగా ఉండాలని ఆయన పట్టుపట్టారు. ఒక తాగుబోతు భార్యగా గోహర్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఆమె నటన – తనకీ, సినిమాకీ, ఇంకా ఆ సినిమాతో సంబంధం ఉన్న అందరికీ మేలు చేసింది. దీని తర్వాత కోహినూర్ ఫిల్మ్స్ కోసం ఆమె ఎన్నో సినిమాలలో నటించారు, చాలా సినిమాలలో ఖలీల్ లేదా రాజా శాండో హీరోలు. కోహినూర్ ఫిల్మ్స్‌తో  ఉన్న రెండేళ్ళ కాంట్రాక్టులో ఆమె తారగా వెలిగిపోయారు. 1927లో ఆమెకి మరో చక్కని అవకాశం వచ్చింది. గోహర్, చందూలాల్ షా గారికి ఉమ్మడి మిత్రుడైన జగదీష్ పాస్తా సొంతంగా ఒక చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయదలచి వారి సహకారాన్ని, సాంకేతిక సహాయాన్ని అర్థించారు.

తమ సొంతంగా ఏదైనా సాధించాలనే తపనతో ఉన్న యువబృందం – జగ్దీష్ పాస్తా, గోహర్, చందూలాల్ షా, రాజా శాండో, ఇంకా కెమెరామాన్ పాండురంగ నాయక్ – కలిసి ‘శ్రీ సౌండ్ స్టూడియోస్’ స్థాపించారు. దాన్ని పాస్తా గారి స్థలంలో షా గారు నిర్మించారు. వారా స్టూడియోలో ‘విశ్వ మోహిని’ (మూకీ, టాకీ రెండూ), ‘చంద్రముఖి’తో సహా దాదాపు పది చిత్రాలు నిర్మించారు. 1929లో జగ్దీష్ మూవీటోన్ నుంచి చందూలాల్ షా, గోహర్ బయడకు వచ్చి సొంతంగా రంజిత్ ఫిల్మ్ కంపెనీ అనే నిర్మాణ సంస్థని స్థాపించారు. అది పెరిగి పెద్ద నాలుగు సౌండ్ స్టేజ్‌లున్న ఒక స్టూడియోని చేజిక్కించుకుంది. రంజిత్ ఫిల్మ్ కంపెనీ వారి మొదటి సినిమాని క్రిష్ణా స్టూడియోస్‌లో చిత్రీకరించారు. ఆ సాంఘిక చిత్రం పేరు ‘పతీ పత్నీ’. ఈ మోషన్ పిక్చర్‌తోనే సుప్రసిద్ధ నటుడు, అందాల జెంటిల్‌మాన్ ముబారక్ సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం చందూలాల్ షా, గోహర్ సొంతంగా రంజిత్ స్టూడియోస్ అనే స్టూడియోని నిర్మించారు. వీరిద్దరి సంయుక్త మార్గదర్శకత్వంలో ఆ స్టూడియోలో సుమారు ఇరవై చిత్రాలు నిర్మించబడ్డాయి. అప్పటికి ఇంకా మూకీలదే రాజ్యం! ‘అవన్నీ అందమైన రోజులని, నటీనటులు, నిర్మాణ సిబ్బంది, దర్శకులు స్టూడియోతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేసేవార’ని గోహర్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సినిమాలను పదహరు, ఇరవై రోజులలో పూర్తి చేసేవారట. ఫిల్మ్ దాదాపు ఆరువేల అడుగుల మేరకు ఉండేదట. ఇతర స్టార్ స్టూడియోల వలె రంజిత్ స్టూడియో కూడా ‘స్టంట్’ సినిమాలు, పౌరాణికాలు, రొమాంటిక్ డ్రామాలు, సాంఘికాలకు మొగ్గు చూపింది. ‘స్టంట్’ సినిమాలకు ప్రత్యేకించి డూప్‍లు లేదా స్టంట్ ఆర్టిస్ట్స్ ఉండేవారు కాదు. “కిందపడినప్పుడు ఎన్నో దెబ్బలు తగిలాయి. మోషన్ కెమెరాకి ఎదురుగా – ఆ ప్రమాదకరమైన గెంతులు, దూకుళ్ళు, పడిపోవడాలకు గుర్తుగా కొన్ని నొప్పులు, గాయాలు అయితే ఇంకా ఉన్నాయి” అని ఆమె చెప్పారు. గోహర్ స్వయంగా ఈ స్టూడియోస్‍లో భాగస్వామి, నిర్మాత, నటి. తన సామర్థ్యంతో ఈ మూడు విభాగాలలోనూ మెరుగైన ప్రతిభ కనబరిచి సంస్థకి పేరు తేవడమే కాకుండా ఇంటా బయట చక్కని సౌహార్ద్రత కలిగించారు. తన స్టంట్స్‌లో తానే నటించడం కాకుండా, తన పాటలు తానే పాడుకునేవారు. అప్పటి ఇతర నటులలానే తన నృత్యాలు తానే రూపొందించుకుని, తన మేకప్ తానే వేసుకునేవారు గోహర్. ఆమె 1970లలో నటన నుంచి విరమించుకున్నారు. 28 సెప్టెంబరు 1985 నాడు మహారాష్ట్రలోని బొంబాయిలో మరణించారు.

ఒక గొప్ప కళాకారిణి చరిత్రలో కలిసిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here