అలనాటి అపురూపాలు-80

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ప్రేక్షకులని అలరించిన అలనాటి నటి శ్యామా:

శ్యామాగా ప్రసిద్ధురాలైన కుర్షీద్ అఖ్తర్ 1935లో లాహోర్‌లో జన్మించారు. తొమ్మిదేళ్ళ ప్రాయంలో నూర్జహాన్ నటించిన ‘జీనత్’ (1945) చిత్రంలో ఖవ్వాలి గాయనిగా కెరీర్ ప్రారంభించారు శ్యామా.

“దాదర్‌లో నూర్జహన్ గారి చిత్రం షూటింగ్ జరుగుతుంటే, స్నేహితులతో కలిసి చూడడానికి వెళ్ళాను. ఆ సినిమా దర్శకులు షౌకత్ హుస్సేన్ (నూర్జహాన్ భర్త) ‘మీలో ఎవరికైనా నటించాలని ఆసక్తి ఉందా?’ అని అడిగారు. వెంటనే నేను ‘నాకు ఆసక్తి ఉంది’ అనేశాను” – అంటూ తన నటనా జీవితం ఎలా మొదలైందో గుర్తు చేసుకున్నారు శ్యామా.

సాంప్రదాయవాది అయిన ఆమె తండ్రి – శ్యామా సినిమాల్లో నటించేందుకు అంగీకరించలేదు. ‘తప్పేంటి నాన్నా’ అని అడిగారు శ్యామా. తనకి చాలా రోజులుగా నటన మీద ఆసక్తి ఉందని చెప్పారు. బడిలో భోజన విరామ సమయంలో బల్ల ఎక్కి నృత్యం చేసేదానినని చెప్పారు. వచ్చిన ప్రతీ సినిమా చూసేదాన్నని అన్నారు. ఆ తర్వాత తానే ఓ నటి అయి, కథానాయికగా, ద్వితీయ కథానాయికగా, వ్యాంప్‍గా దాదాపు 250 సినిమాలలో నటించారు.

శ్యామాకి ఆ పేరు పెట్టింది దర్శకులు విజయ్ భట్. శ్యామా ప్రభావం చూపిన తొలి పాట ఎ.ఆర్. కర్దార్ గారి దిల్లగీ సినిమాలోని ప్రేమ గీతం – ‘తూ మేరా చాంద్, మై తేరీ చాందినీ’ అనేది. శ్యామాపై చిత్రీకరించిన ఈ పాటని గీతా దత్ పాడారు. 1951లో వచ్చిన ముక్కోణ ప్రేమ చిత్రాలు –  ఫాలీ మిస్త్రీ (భవిష్యత్తులో శ్యామా భర్త) తీసిన ‘సజా’; రామ్ దర్యానీ తీసిన ‘తరానా’ లలో – శ్యామా – దేవానంద్, దిలీప్ కుమార్‍లను నిమ్మీ, మధుబాలలకు కోల్పోతారు.

గురు దత్ తీసిన థ్రిల్లర్ ‘ఆర్‌పార్’ ఆమెకి పేరు తెచ్చింది, ఆ సినిమాలో గారేజ్ ఓనర్ కూతురు నిక్కీగా నటించారామె. టాక్సీ డ్రైవర్‌గా మారిన మాజీ నేరస్థుడు కులు (గురు దత్)ని ప్రేమిస్తారు. నిజానికి ఆ పాత్ర ఒకప్పుడు గురు దత్ ప్రేమించిన యువతిని పోలి ఉంటుందని అంటారు. ఈ పాత్రని పోషించవలసిందిగా స్వయంగా గీతా దత్ శ్యామాను కోరారుట. ఒక గారేజ్‍లో చిత్రీకరించిన ‘సున్ సున్ సున్ జాలిమా’ పాట అప్పట్లో సూపర్ హిట్. శ్యామా అందమైన రూపానికి, గీతా దత్ గాత్రం అద్భుతంగా నప్పింది. అలాగే శ్యామా కోసం గీతా పాడిన మరో హిట్ గీతం – ఎం.వి. రామన్ తీసిన ‘భాయ్-భాయ్’ (1956)లోని ‘ఏ దిల్ ముఝే బతా దే’. ఈ సినిమాలో మోసగాడైన ఓం ప్రకాశ్ భార్యగా శ్యామా నటించారు. డబ్బు కోసం వివాహితుడైన అశోక్ కుమార్‌కి వలపన్నుతారు. 1955-57 మధ్య దర్శకులు ఎం. సాదిక్, కమేడియన్ జానీ వాకర్, సంగీత దర్శకులు ఓ.పి. నయ్యర్‍తో జతకట్టి శ్యామా చేసిన సినిమాలు గొప్ప హిట్లు. ‘ముసాఫిర్ ఖానా’, ‘ఛూ మంతర్’, ‘మాయ్ బాప్’, ‘దునియా రంగ్ రంగేలీ’, ‘జానీ వాకర్’ ఇందుకు ఉదాహరణలు.

జియా సర్హాదీ ‘హమ్ లోగ్’ (1951), బిమల్ రాయ్ ‘మా’ (1952), ఎల్. వి. ప్రసాద్ ‘శారద’ (1957) వంటివి ఆమె అందించిన మరికొన్ని హిట్ చిత్రాలు. వీటిల్లో ‘శారద’ చిత్రానికి ఆమెకి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌పేర్ అవార్డు లభించింది. ఆ చిత్రంలో రాజ్ కపూర్‌కు భార్యగా నటించారు. ఇప్పుడు తన భర్తకి సవతి తల్లి అయిన మహిళని (మీనాకుమారి) ఒకప్పుడు తన భర్త ప్రేమించాడని తెలిసి గొడవపడే పాత్ర ఆమెది. “నాకన్నీ మంచి పాత్రలు రావడం నా అదృష్టం. కుటుంబ కథా చిత్రాలు – దో బెహెనే, చోటీ బెహన్, భాయ్ భాయ్, భాభీ అండ్ దో భాయ్ వంటి చిత్రాలు (మలి 50లలో) బాగా ఇష్టంగా చేశాను. నాకు ఒకరు నటన నేర్పవలసిన అవసరం రాలేదు. నేనెంతో విశ్వాసంతో ఉండేదాన్ని. స్టార్స్ పుడతారు, తయారు కారు” అన్నారామె ఒక ఇంటర్వ్యూలో.

“నాది ఫొటోజనిక్ ఫేస్. ఏ దిశ నుండి నా మీద లైట్ పడినా, నా ఫోటో బాగా వచ్చేది. నేను ఆ రూపాన్ని శ్రద్ధగా కాపాడుకున్నాను. నా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను.  స్లిమ్‌గా ఉండడం కోసం కొన్ని రోజుల పాటు కేవలం గ్లూకోజ్ నీళ్ళే తాగాను. అన్ని రకాల దుస్తులు – ఘరారా, సల్వార్లు, చీరలు, పాంట్లు – ధరించేదాన్ని” చెప్పారు ఒకనాటి తన వైభవాన్ని తలచుకుంటూ.

తరువాతి కాలంలో ఆమె రాజేష్ ఖన్నా ‘అజ్‌నబీ’ (1974) లోనూ, ‘మాస్టర్‌జీ’ (1985) లోనూ, జెపి దత్తా ‘హత్యార్’ (1989) లోనూ కన్పించారు. ఈ అందమైన నటిని పెళ్ళి చేసుకుంటామని ఎందరో సహనటులు ముందుకొచ్చారట. “నా తోటి నటుల నుంచి ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. వాళ్ళ పేర్లు చెప్పను. వాళ్ళలో కొందరు ఇప్పుడు జీవించి లేరు. మరికొందరికి కుటుంబాలున్నాయి. అప్పుడప్పుడు ఫోన్ చేసి ‘ఎలా ఉన్నారు’ అని పలకరించుకుంటాం” అని చెప్పారు శ్యామా సిగ్గుతో.

ఫాలీ మిస్త్రీ దర్శకత్వంలో 1951లో ‘సజా’ చిత్రం షూటింగ్ సందర్భంగా 16-ఏళ్ళ శ్యామా ఆయనతో ప్రేమలో పడ్డారు. “నీది ఫోటోజనిక్ రూపం. నీకు స్పెషల్ లైటింగ్ అక్కర్లేదు” అని ఒక ఫోటోషూట్‌లో మిస్త్రీ శ్యామాని ప్రశంసించారట.

“మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాం. కానీ నాకు సిగ్గుగా ఉండేది. చెప్పలేకపోయాను” అన్నారు ఆనాటి తొలిప్రేమను గుర్తుచేసుకుంటూ. వారిద్దరూ 1953లో పెళ్ళి చేసుకున్నారు. అయితే వార్త వెల్లడి అయితే శ్యామా కెరీర్‌కి ఇబ్బంది అవుతుందని పెళ్ళి విషయాన్ని రహస్యంగా ఉంచారు. వారి మొదటి సంతానం ఫారూక్ పుట్టే ముందే ఈ రహస్యం బహిర్గతం అయింది. మరో కుమారుడు రోహింటన్, కుమార్తె శిరీన్ తరువాత జన్మించారు.

“పెళ్ళి తరువాత సినిమాలు మానేయమని మా ఆయన అడిగారు. నేను కుదరదని అన్నాను. ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాను.” అన్నారామె తన ఉనికిని కాపాడుకున్నందుకు గర్వపడుతూ. కుటుంబంలో తమ సమన్యయాన్ని అర్థం చేసుకున్నందుకు ఆ ఘనత తన భర్తదేనని చెప్పారు. “మా వైవాహిక జీవితం ఎంతో సంతృప్తిగా గడిచింది. పెద్దబ్బాయి పుట్టాకా కూడా నేను నటన మానేయలేదు. ఫాలీకి నా మీద ఎంతో నమ్మకం ఉండేది. ఎప్పుడైనా నాకు ఆలస్యంతో, ఫోన్ చేసి, ‘నాకు ఆలస్యం అవుతుంది, కానీ ఇద్దరం కలిసి భోం చేద్దాం’ అని చెప్పేదాన్ని” అన్నారు. ఫాలీ మిస్త్రీ 1979లో చనిపోయారు. ఆయన లేని లోటును శ్యామా ఎంతగానో అనుభవించారు. “నాకున్న పెద్ద బలహీనత ఫాలీయే” అన్నారామె ఒక ఇంటర్వ్యూలో.

కాలంతో పాటు, పిల్లలు తమ సొంత జీవితాలను ఏర్పర్చుకున్నారు. ఫారూక్ మిస్త్రీ పేరుపొందిన సినెమాటోగ్రాఫర్, డాక్యుమెంటరీల నిర్మాత అయ్యారు. రోహింటన్ మిస్త్రీ లండన్‍లో వ్యాపారవేత్త అయ్యారు. కుమార్తె శిరీన్ వివాహం చేసుకుని వేరే కుటుంబానికి కోడలిగా వెళ్ళారు. తన సొంతింట్లో స్వతంత్రంగా ఉండడానికి శ్యామా పట్టుపట్టారు. కూతురు శిరీన్ వీలైనంత తరచూ వచ్చి తల్లిని చూసి వెడుతుండేవారు.

వయసుతో పాటు శ్యామాని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కాళ్ళు రెండూ విరిగాయి, వాకర్ సాయంతో నడవాల్సి వచ్చింది. శ్వాసకోశ సమస్య కారణం ఆక్సీజన్ సిలిండర్ వాడాల్సి వచ్చింది. ఈ కారణాలతో ఆమె ఆసుపత్రులలో చేరాల్సి వచ్చింది. ఇవన్నీ ఆమె ఒంటరితనం కాకుండా మరికొన్ని ఇబ్బందులుగా మారాయి. భర్త పోవడం, కొంతమంది సహనటులు చనిపోవడం, ఒకనాటి స్టార్‌డం జ్ఞాపకాలు ఆమెపై ప్రభావం చూపాయి. తన ఆప్తమిత్రులు, నిరుపా రాయ్, షకీలా, నాదిరా లేని లోటు బాగా తెలుస్తోందని శ్యామా ఒకసారి చెప్పారు. “మేం ఒకళ్ల రహస్యాలు ఒకళ్ళం కాపాడేవాళ్ళం… నేడు అవన్నీ బహిర్గతమయిపోయాయి” అన్నారు.

తన తల్లి దృఢసంకల్పం గలిగిన మహిళ అని శ్యామా కూతురు శిరీన్ అన్నారు. “తనేం చేయాలో ఆమెకి ఎవరూ చెప్పలేరు” అన్నారామె. “అమ్మ తన ఇష్టప్రకారమే నడుచుకునేది. అందుకే ఒంటరిగా జీవించింది. జీవితాన్ని, పరిశ్రమని ఎంతో ప్రేమించింది… అయితే ఒకసారి నిర్ణయించుకున్నాకా, సినిమాలు మానేసింది. తన సొంత షరతులపైనే జీవితాన్ని గడిపింది” అన్నారు శిరీన్.

తన తోటి నటీనటుల వలె కాకుండా శ్యామా ఆర్థికంగా స్వతంత్రంగా జీవించారు. “అమ్మది ఎంతో భద్రమైన జీవితం. పరిశ్రమకి చెందిన చాలామంది చివర్లో ఆర్థికంగా క్రుంగిపోయారు. అమ్మ ముందుచూపుతో నడుచుకుంది” చెప్పారు శిరీన్.

అయితే శ్యామా లోని శూన్యతని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. “నా కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్నారు. మా అమ్మానాన్నలకి తొమ్మిది మంది పిల్లలం. ఇప్పుడు నేను తప్ప వాళ్లెవరూ లేరు. జనాలు వచ్చారు, వెళ్ళిపోయారు” అని ఫిల్మ్‌పేర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

శ్యామాకి 2017లో ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ సోకింది. కానీ ఆ ధీర ఈసారి పోరాడలేకపోయారు. 14 నవంబరు 2017 నాడు 82 ఏళ్ళ వయసులో శ్యామా తనువు చాలించారు. ఆకాశంలోని తారలలో ఒక తార అయిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here