అలనాటి అపురూపాలు-84

0
6

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

హాలీవుడ్‍లో అసామాన్య ప్రతిభ – జీన్ కెల్లీ:

జీన్ కెల్లీ అమెరికన్ డాన్సర్, నటుడు, ఇంకా కొరియోగ్రాఫర్. 1940 దశకంలో హాలీవుడ్ మ్యూజికల్స్‌లో దాదాపు పదేళ్ళ పాటు తన ప్రభావాన్ని కనబరిచారు. ఆయన అత్యంత స్పష్టత ఉన్న సృజనాత్మక కళాకారుడు. హాలీవుడ్ స్వర్ణయుగం అనబడే కాలంలో నాట్యంతో గొప్ప ప్రదర్శనలిస్తూ, కొరియోగ్రఫీతో హాలీవుడ్ మ్యూజికల్స్‌ని సమూలంగా మార్చివేసి, నృత్యరీతులు కూడా వాణిజ్యపరంగా విజయవంతం కాగలవని నిరూపించారు. హాలీవుడ్‌లో ఎన్నో పేరుపొందిన మ్యూజికల్స్‌ని సృష్టించి, నృత్య దర్శకత్వం వహించి నటించారు. ఇందుకు ఉదాహరణ 1952 నాటి ‘Singin’ in the Rain’. ఇది ఆ సంవత్సరపు ఉత్తమ సినీ సంగీతంగా ఎంపికయింది. ఆల్ టైమ్ హిట్ కూడా.

జీన్ 23 ఆగస్టు 1912 న పెన్‌సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు Eugene Curran Kelly. వారిది సుసంపన్నమైన పెద్ద ఐరిష్ కుటుంబం. ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు సంతానంగా ఉన్నవారిలో ఆయన ఒకరు. ఆయన తన ఎనిమిదవ ఏట నృత్యం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన అన్నయ్య జేమ్స్ నృత్యం నేర్చుకుంటున్నారు. కానీ మొదట్లో సోదరులిద్దరికీ నాట్యం నచ్చలేదు. బాలుడిగా కెల్లీ నాట్యం కంటే క్రీడలపై ఆసక్తి కనబరిచేవారు. పీబోడీ హైస్కూలు నుంచి 1929లో పాఠశాల చదువు పూర్తి చేశారు. పెన్‌సిల్వేనియా స్టేట్ కాలేజిలో జర్నలిజంలో చేరారు. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా చదువు విరమించుకుని, కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడానికి మార్గాలు అన్వేషించారు.

ఆయనా, ఆయన తమ్ముడు ఫ్రెడ్ కల్సి నృత్య ప్రతిభ పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకుంటూ కుటుంబానికి సాయం చేశారు. అదే సమయంలో స్థానిక నైట్‍క్లబ్‍లలో నటించడం మొదలుపెట్టారు కెల్లీ. ఆయనకు 18 ఏళ్ళు వచ్చినప్పటికి, ఆయన తండ్రి పూర్తిగా తాగుడికి బానిసైపోయారు. కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి పిట్స్‌బర్గ్‌లో స్థాపించిన డాన్స్ స్టూడియోలో చేరారు కెల్లీ, ఫ్రెడ్ లిద్దరూ.

కుటుంబపు డాన్స్ స్టూడియోలో పాఠాలు చెబుతూనే, కెల్లీ 1933లో యూనివర్శిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ నుంచి ఆర్థికశాస్త్రంలో బి.ఎ. పట్టా పొందారు.  కొన్నాళ్ళు ‘లా’ చదివి, నృత్య బోధన, నటన మీదున్న ఆసక్తితో మానేశారు. సినీరంగంలోనే పూర్తిస్థాయి కెరీర్ వెతుక్కోవాని నిర్ణయించుకున్నారు. 1938లో న్యూ యార్క్ చేరి, డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ప్రయత్నించసాగారు. ఒక ఏడాదిలోపే ఆయన తన తొలి బ్రాడ్‌వే షో ‘Leave It to Me’ లో కోరస్‌గా చేరగలిగారు. 1939లో ‘One for the Money’ లో మరింత ఎక్కువ సేపు నృత్యం చేసే అవకాశం లభించింది. ఆయన ప్రతిభ అందరికీ తెలియసాగింది. 1939లో పులిట్జర్ ప్రైజ్ గెల్చుకున్న ‘The Time of Your Life’ లో అవకాశం దొరికింది.

1940లో మరో పెద్ద అవకాశం, తానే ప్రధాన పాత్రగా ‘Pal Joey’ లో Joey Evans  పాత్ర లభించింది. ఇది గొప్ప విజయం సాధించడంతో కెల్లీ ఎదుగుతున్న వర్ధమాన తార అయ్యారు.

హాలీవుడ్ కెరీర్:

తొలుతగా నిర్మాత David O Selznick కెల్లీతో ఏడేళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు. హాలీవుడ్‌కి తీసుకువచ్చి, 1942లో Judy Garland  సరసన ‘For Me and My Gal’ అనే చిత్రంలో అవకాశమిచ్చారు. తర్వాత 1943లో Lucille Ball సరసన ‘Du Barry Was a Lady’ లో నటించారు. అదే ఏడాది ‘Thousands Cheer’ చిత్రంలో మాప్ స్టిక్‌తో అద్భుతమైన నృత్యం చేశారు.

1944లో Rita Hayworth తో నటించిన ‘Cover Girl’  చిత్రంలో ఆయన ఓ అద్భుతం చేశారు. తన సొంత ప్రతిబింబంతో నృత్యం చేశారు. ఆ మరుసటి సంవత్సరం మరో అద్భుతం సృష్టించారు. ‘Anchors Aweigh’ చిత్రంలో టామ్ అండ్ జెర్రీ కార్టూన్ లోని జెర్రీతో కలిసి నృత్యం చేశారు. ఈ సినిమాకిగాను ఆయన ఆ ఏడాది ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యారు.

కెల్లీ Fred Astaire తో కలిసి ‘The Babbitt and the Bromide’ చిత్రంలో Ziegfeld Follies అనే నృత్యం చేసి అబ్బురపరిచారు. 1944లో చిత్రీకరించబడిన ఈ చిత్రం 1946లో విడుదలయింది. యుద్ధ సమయంలో కెల్లీ నౌకాదళానికి సేవలందించారు. అనకోస్టియా డిసి నుంచి నౌకాదళం కోసం పలు చిత్రాలలో నటించి – అనేక డాక్యుమెంటరీలకు రచన దర్శకత్వం వహించారు. 1946లో తిరిగి హాలీవుడ్‌లో ప్రవేశించి, పలు ‘బి’ గ్రేడ్ సినిమాలు చేశారు. కానీ తర్వాతి కాలంలో చేసిన సినిమాలు హాలీవుడ్‌నే మార్చివేశాయి. 1948లో Vincente Minnelli దర్శకత్వంలో Judy Garland తో కలిసి ‘The Pirate’ అనే సినిమా చేశారు. ఆ సినిమా బాగా ఆడలేదు. తన కాలానికంటే ముందుగా వచ్చిందని అనుకున్నారు. ఇప్పుడది హాలీవుడ్‌లో ఒక క్లాసిక్ అయింది. కెల్లీ నృత్యంలోనూ, నటనలోనూ తన సొంత శైలిని ఏర్పచుకున్నారు.

1949లో Stanley Donen తో సహదర్శకత్వం వహిస్తూ – Frank Sinatra తో తన మూడవ సినిమాగా అత్యంత సృజనాత్మకంగా ‘On The Town’ సినిమా తీశారు. ఇది లొకేషన్‌లో చిత్రీకరించిన తొలి మ్యూజికల్. కెల్లీ కొరియోగ్రఫీ బాధ్యతలు తీసుకుని ఒక అద్భుతమైన ballet sequence చిత్రీకరించగా, Donen సాంప్రదాయక దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.

ఈ సినిమా విజయం అనంతరం, 1949లోనే కెల్లీ ‘The Black Hand’ చిత్రంలో నటించారు. అనంతరం Judy Garland తో కలిసి ‘Summer Stock’ చిత్రం చేశారు. ఈ సినిమాలో న్యూస్ పేపర్‌తో కెల్లీ చేసిన నృత్యం, కిర్రుకిర్రులాడే floorboard పై చేసిన నాట్యం అత్యంత ప్రజాదరణ పొందాయి.

దీని తరువాత కెల్లీవి రెండు – మాస్టర్‌పీస్‌లు వచ్చాయి. అవి ‘An American in Paris’, ఇంకా ‘Singin’ in the Rain’. ‘An American in Paris’ లో అత్యంత సాహసోపేతంగా 17 నిమిషాల పాటు సాగే ballet sequence ని చిత్రీకరించారు. దీనికి 7 అకాడమీ అవార్డులు వచ్చాయి, బెస్ట్ పిక్చర్‍తో సహా. ఈ చిత్రానికి గాను కెల్లీకి వ్యక్తిగత ఆస్కార్ కూడా లభించింది. ఆ మరుసటి సంవత్సరం కెల్లీ తన ప్రతిభని మరింత మెరుగుపరుచుకుని ‘Singin’ in the Rain’ తీశారు. సున్నితమైన హాస్యంతో ఆ చిత్రం అంతకుముందెన్నడూ ఎరుగని ఘన విజయాన్ని సాధించింది. ధ్వని, నృత్యాలు, పాటలు, నటన అన్నీ సమపాళ్ళలో కలిసాయి ఈ చిత్రంలో. సున్నితమైన హాస్యం, సొగసైన రొమాన్స్‌లతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. టైటిల్ సాంగ్‌లో కెల్లీ చేసిన ప్రదర్శన అసమాన్యం, మరపురానిది కూడా. రెండు నామినేషన్లు పొందినప్పటికీ, ఈ చిత్రం ఆస్కార్ అవార్డును మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. అయితే ప్ర్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు బోలెడు దక్కించుకుంది. ఓ అద్భుతమైన మ్యూజికల్‌గా పరిగణింపబడుతోంది.

పదేళ్లలో కెల్లీ హాలీవుడ్‍లో శిఖరాలు అధిరోహించారు… కానీ తర్వాత మళ్ళీ ఆ స్థాయికి చేరుకోలేకపోయారు. ఆయన కెరీర్‍లో ద్వితీయార్ధం పరాజయాలతోనూ, సాగదీతలతోనూ సాగుతుంది. హాలీవుడ్‍లో మ్యూజికల్స్ శకం ముగిసింది. ఎంజిఎం లోని ఫ్రీడ్ యూనిట్ మూతపడింది. తరువాత కెల్లీ 1954లో ‘Brigadoon’, 1955లో ‘It’s Always Fair Weather’ అనే మ్యూజికల్స్‌లో నటించినా, అవి ఆయన పాత సినిమాల ఛాయలకు కూడా రాలేదు.

1956లో అన్నీ తానై… అంటే రచయితగా, నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా బాధ్యతలు నిర్వహించి తీసిన ‘Invitation to the Dance’ అంతగా ఆడలేదు. ఈ చిత్రంలోని పాత్రలన్నీ నృత్యం, మైమ్ చేసేవే. ఇప్పుడు ఈ సినిమాని ఒక మైలురాయి సినిమాలా భావిస్తారు.

1960లో కెల్లీ నాన్-మ్యూజికల్స్ వైపు మళ్ళి ‘Inherit the Wind’ చిత్రంలో నటించారు. తన ప్రతిభని దర్శకత్వం వైపు మళ్ళించి 1967లో ‘A Guide for the Married Man’, 1969లో ‘Hello, Dolly!’ చిత్రాలు తీశారు. ఆ తర్వాత వెండితెరపై కనబడడం తగ్గించి టీవీ సీరియళ్ళ వ్యాఖ్యాత లేదా 1974, 1976 ఇంకా 1994లలో సాగిన ‘That’s Entertainment!’  వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే 1985లో ‘That’s Dancing!’‍కి కూడా!

వ్యక్తిగత జీవితం:

కెల్లీ మూడు సార్లు పెళ్ళి చేసుకున్నారు. మొదటి రెండు వివాహాలు డాన్సర్స్‌లతో. ఆయన Betsy Blair ని ‘Diamond Horseshoe’ అనే షో లో కలిసారు. 1941లో వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళకి ఒక కూతురు ఉండేది. 1957లో వారు విడాకులు తీసుకున్నారు. రెండోసారి 1960లో ఎన్నో ఏళ్ళుగా తనకు డాన్సింగ్ అసిస్టెంట్‌గా ఉన్న Jeanne Coyne ని పెళ్ళి చేసుకున్నారు. అంతకు ముందు ఆమె దర్శకుడు Stanley Donen పెళ్ళాడి, విడాకులు ఇచ్చింది. కెల్లీకి, ఈవిడకి ఇద్దరు పిల్లలు – Bridget, Tim  ఉన్నారు. 1973లో లుకేమియాతో Jeanne చనిపోయేంతవరకు వీరి బంధం కొనసాగింది. తన పిల్లల్ని కెల్లీ ఒంటరిగానే పెంచారు. వాళ్ళకి దూరంగా ఉండాల్సి వస్తుందని – లాస్ ఏంజిలిస్‍కి దూరంగా చేయాల్సి వచ్చే ఏ పనిని అంగీకరించలేదు. 1985లో ఒక టెలివిజన్ స్పెషల్‌లో రచయిత్రి Patricia Ward  పరిచయం అయ్యారు. ఐదేళ్ళ తరువాత ఆమెను పెళ్ళి చేసుకున్నారు. కెల్లీ మరణంతో ఆ బంధం ముగిసింది.

జీన్ కెల్లీ 83 ఏళ్ళ వయసులో, కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్‌లో 2 ఫిబ్రవరి 1996న నిద్రలో మృతి చెందారు. అప్పటికే ఆయనకి గుండెపోటు వచ్చింది. తన భౌతిక కాయానికి అంత్యక్రియలు గానీ, స్మారక సేవలు గాని చేయవద్దని ఆయన ఆదేశాలు ఇచ్చారు.

అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ వారి గ్రేటెస్ట్ మేల్ స్టార్స్ జాబితాలో కెల్లీ 15వ స్థానంలో ఉన్నారు. నటుడిగా, గాయకుడిగా, డాన్సర్‌గా, దర్శకుడి అసమాన్య ప్రతిభ కనబరిచినందుకు 1951లో అకాడమీ ఆయనకి ‘An American in Paris’  చిత్రానికి ప్రత్యేక ఆస్కార్ అవార్డు ప్రదానం చేసింది. ముఖ్యంగా కొరియోగ్రఫీలో ఆయన సాధించిన అద్భుతాలకీ అవార్డు అని పేర్కొంది.

***

1952 నాటి ‘Singin’ in the Rain’ చిత్రంలో ఆయన నృత్యం చూడండి:

https://www.youtube.com/watch?v=swloMVFALXw


సంచలనాల సరోజ్ ఖాన్:

ఏక్ దో తీన్… ఒక కొత్త శకానికి… ఒక కొత్త సూపర్ స్టార్‍కి చమక్కుతో కూడిన కౌంట్‌డౌన్…

కాటే నహీ కటే యే దిన్ యే రాత్… అదృశ్య ప్రేమికుడితో వాంఛా ప్రదర్శన…

నా జానే కహాఁ సే ఆయీ హై… వర్షంలా కురిసే ప్రేమ…

చోలీ కే పీచే క్యా హై… ఓ తెగింపు… అయినా దూసుకుపోయింది…

ధక్ ధక్ కర్నే లగా… ఎందరివో హార్మోన్లులను పెంచేలా చేసిన గుండె చప్పుడు…

నింబోడా నింబోడా… చిక్కని జానపద గేయ గాథ…

డోలా రే డోలా… సొగసరి యువతుల అందమైన పోటీ…

వీటన్నిటి వెనుక ఉన్నది కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్. ఆమె భారతీయ సంస్కృతిలోనూ, జానపద రీతులలోనూ నిగూఢంగా భోగాసక్తిని జొప్పించడంలో సఫలమయ్యారు. వెండితెర మీద కవిత్వాన్ని ఆవిష్కరించారు. పాశ్చాత్య నాట్య రీతులైన హిప్-హాప్, సల్సా, బాల్‌రూం, ఫ్యూజన్, ఫోక్… వంటి వాటిని సాంప్రదాయ ముద్రలు, కదలికలలో మేళవించి ఆమె ‘బాలీవుడ్ ఘరానా’ అనే  ఓ కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారు.

కిషన్ సాధు సింగ్ అనే పంజాబీ, నోని అనే సింధీని వివాహం చేసుకున్నారు. 1947లో దేశ విభజన కారణంగా, ఆ కుటుంబం పాకిస్తాన్‌లో లాభాలలో నడుస్తున్న వ్యాపారాన్ని వదిలేసి బొంబాయికి వచ్చేసింది.

వారి కూతురు నిర్మలా సాధు సింగ్ (సరోజ్) భారతదేశంలో 22 నవంబర్ 1948 నాడు జన్మించింది. మూడేళ్ళ నిర్మల తన నీడతో నాట్యం చేయడం చూసిన తల్లి బెదిరిపోయారు. ఏదైనా మానసిక లోపమేమోనని పాపని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళారు. ఆయన వారి భయాలను తొలగించి, పాపకి నాట్యం అంటే ఆసక్తి అని వెల్లడించి, సినిమాలకి బాగా నప్పుతుందని తెలిపారు.

ఫలితంగా, మూడేళ్ళ నిర్మల ‘నజ్‌రానా’ చిత్రంలో బాలనటిగా నటించింది. ఆ సినిమాలో ఓ పాటలో ‘చంద్రుడి’పై కూర్చుని పాడవలసి ఉంటుంది. సులువుగా నటించిందా పాప. సాంప్రదాయవాదులైన బంధువుల నుంచి ఆక్షేపణలు తప్పించుకోడానికి, ఆ పాపకి ‘సరోజ్’ అని పేరు పెట్టారు.

పదేళ్ళ వయసులో సరోజ్ డాన్సింగ్ ట్రూప్‌లో చేరారు. 1958లో బిమల్ రాయ్ తీసిన ‘మధుమతి’లో గ్రూప్ డాన్సర్లలో ఒకరిగా చేశారు. 1958లో వచ్చిన ‘హౌరా బ్రిడ్జ్’ సినిమాలో మధుబాల పక్కన బాలుడిగా ‘ఆయీయే మెహెర్బాన్’ పాటలో నటించారు.

తండ్రికి కాన్సర్ సోకడంలో కుటుంబ పోషణాభారం సరోజ్ పై పడింది. అప్పట్లో శశి కపూర్ తనకెలా సాయం చేశారో చెప్పారు సరోజ్. తాను ఆయన సినిమాల్లో డాన్స్ చేస్తుండేదాన్నని చెప్పారు. “దీపావళి పండగ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేదు. నాకు రావల్సిన డబ్బు మరో వారం తర్వాత వస్తుంది” అని ఆయనతో చెప్పారట. శశి కపూర్ జేబులోంచి పర్స్ తీసి, రెండు వందల రూపాయలు ఉదారంగా ఇచ్చారట. ఆ చిన్నారి ఎంతో సంతోషించింది – తన తోబుట్టువులు దీపావళి పండుగ చేసుకోగలిగినందుకు!

సరోజ్ తనని తాను ఆంగ్లో ఇండియన్ అని చెప్పుకునేవారు. పొట్టి జుట్టుతో పలు రకాల పాశ్చాత్య నృత్యాలు చేసేవారు. కొద్దికాలానికి సరోజ్ సుప్రసిద్ధ నాట్యకారుడు బి. సోహన్ లాల్ దృష్టిలో పడ్డారు. ఆయన బృందంలో చేరేందుకు జడ వేసుకుని, బొట్టు పెట్టుకున్నారు.

13 ఏళ్ళ వయసులో సరోజ్ సోహన్‌లాల్ వద్ద సహాయకురాలిగా చేరారు. సరోజ్ – వైజయంతి మాల, హెలెన్ తదితర నటీమణులకు రిహార్సల్స్‌లో సాయం చేశారు. ‘డా.విద్య’ చిత్రంలోని ‘పవన్ దీవానీ’ పాట రిహార్సల్స్ అప్పుడు సరోజ్ ప్రతిభాపాటవాలను మెచ్చిన వైజయంతిమాల చిరుకానుకగా 21 రూపాయలు అందించారట.

14 ఏళ్ళ వయసులో సోహన్ లాల్ అందుబాటులో లేని కారణంగా, స్వంతంగా నృత్య దర్శకత్వం చేసే తొలి అవకాశం సరోజ్‍కి లభించింది. ఆ పాట నూతన్ నటించిన ‘దిల్ తో హై’ (1963) చిత్రంలోని ‘నిగాహేం మిల్నే కో జీ చాహ్‌తా హై’.

స్వతంత్ర కొరియోగ్రాఫర్‍గా మొదటి అవకాశం 26 ఏళ్ళ వయసులో దక్కింది. సాధన దర్శకత్వం వహించిన ‘గీతా మేరా నామ్’ (1974) చిత్రానికి సరోజ్ కొరియోగ్రఫీ చేశారు. 70వ దశకంలో ఆమె ధర్మేంద్ర-హేమ మాలినిల ప్రతిజ్ఞ (జట్ యమ్లా పగ్లా దీవానా), దోస్త్, మా తదితర చిత్రాలకు పని చేశారు. కొద్ది కాలం విరామం తరువాత ఆమె సుభాష్ ఘాయ్ చిత్రం ‘విధాత’ (1982)లో ‘ప్యార్ కా ఇంతిహాన్’ పాటకి కొరియోగ్రఫీ చేశారు. ఆ తరువాత 1983లో ఘాయ్ తీసిన ‘హీరో’ చిత్రానికి నృత్య దర్శకత్వం వహించారు. 1986-2005 మధ్య కర్మ, రామ్ లఖన్, ఖల్‍నాయక్, పరదేశ్, తాళ్, యాదేం, కిస్నా చిత్రాలకు నృత్యాలు సమకూర్చారు.

నటి శ్రీదేవితో సరోజ్ సంబంధం ప్రముఖమైనది. ‘నగీనా’ (1986) చిత్రంలోని ‘మై తేరీ దుష్మన్’ పాట శ్రీదేవి జనాదరణని ఎంతగానో పెంచింది. ‘మిస్టర్ ఇండియా’ (1987)లో కనబడని ప్రియుడితో రొమాన్స్ చేస్తూ అభినయించిన ‘కాటే నహీ కటే యే దిన్ యే రాత్’ పాట శ్రీదేవికి ఎంతో పేరు తెచ్చింది. “ఓ అదృశ్య ప్రేమికుడు తనను ముద్దాడుతున్నట్లు అభినయించగల ఒకే ఒక నటి శ్రీదేవి” అని సరోజ్ తరువాత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తరువాతి వారిద్దరి కలయిలో 1989 – 1997 మధ్య చాందిని, చాల్‍బాజ్, లమ్హే, జుదాయి చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో ఉర్మిళా మతోంద్కర్‌‌కి ‘రంగీలా’ లోను, రవీనా టాండన్‍కి ‘మోహ్రా’ లోను, జుహీ చావ్లాకి ‘డర్’ లోనూ, కాజోల్‍కి ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’ లోను గొప్ప పాటలు ఇచ్చారు సరోజ్.

‘తేజాబ్’ (1988) లోని ‘ఏక్ దో తీన్…’ మాధురీ దీక్షిత్‍ని తారాపథంలోకి తీసుకుపోయింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో తొలిసారిగా కొరియోగ్రాఫర్‍కి అవార్డు ప్రవేశపెట్టినప్పుడు 1989లో అది సరోజ్‌కే దక్కింది. 1990-94 మధ్య తమ్మా తమ్మా లోగే (థానేదార్), హమ్ కో ఆజ్ కల్ హై (సైలాబ్), ధక్ ధక్ కర్నే లగా (బేటా), చనే కే ఖేత్ మే (అంజామ్) వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.

మాధురీ నృత్య ప్రతిభకి గొప్ప ఉదాహరణ ‘దేవ్‌దాస్’ లోని ‘మార్ డాలా’ పాట. ఈ పాటలో ‘మార్ డాలా’ నాలుగు చరణాలలో నాలుగు సార్లు వస్తుంది. నాలుగు సార్లు విభిన్నమైన స్టెప్పులు వేయించారు సరోజ్. సుప్రసిద్ధమైన ‘డోలా రే డోలా’ పాటకి – అనారోగ్యంతో ఉండి స్టూడియో ఫ్లోర్ మీద పడుకుని – మాధురీ, ఐశ్వర్య లచే నాట్యం చేయించారు సరోజ్.

“మాధురితో నేను సులువుగా ప్రయోగాలు చేయగలిగేదానిని. నేనెంత వింత భంగిమలు ఇచ్చినా, మాధురి అలవోకగా చేసి చూపించేది” అన్నారొక సారి సరోజ్. ‘కళంక్’ (2019) లో ‘తబహ్ హో గయే’ పాటే ఆమె మాధురితో చేసిన చివరి పాట.

సహస్రాబ్దిలో ఆమె చేసిన ఇతర చిత్రాలు సాథియా, చమేలీ, గురు, లవ్ ఆజ్ కల్, ఢిల్లీ-6, మిషన్ కాశ్మీర్, ఫిజా. అమీర్ ఖాన్ లగాన్ చిత్రానికి ఆమెకు అమెరికన్ కొరియోగ్రాఫి అవార్డు లభించింది. 2012లో గున్ గునా (అగ్నిపథ్), దిల్ మేరా ముఫ్త్ కా (ఏజంట్ వినోద్) ఆమెకి పేరు తెచ్చిపెట్టాయి.

బాస్కీ-సీజర్, శ్యామక్ దావర్, రెమో ఫెర్నాండెజ్, ఫరా ఖాన్, వైభవి మర్చంట్ వంటి యువ కొరియోగ్రాఫర్లు దూసుకురావడంతో, సరోజ్ అవకాశాలు సన్నగిల్లాయి. “ఒకప్పుడు నటీమణులు నేనే కావాలని కోరుకునేవారు, కాలం మారింది, ఇప్పుడు వారికి నేను అక్కర్లేదు. నా డాన్స్‌లో పదునైన కదలికలు ఉంటాయి. అవి ఇప్పటి వాళ్ళకి కష్టం… అందుకని నన్ను వద్దంటారు” చెప్పారు సరోజ్ ఒక ఇంటర్వ్యూలో.

నాచ్ బాలియే, బూగీ వూగీ, చక్ ధూమ్ ధూమ్, ఝలక్ దికలాజా వంటి డాన్స్ షో లలో న్యాయనిర్ణేత ఉండి వాటి టిఆర్‍పిలు పెరగడంలో తోడ్పడ్డారు సరోజ్. 2019లో తనకి పని లేదని ఆమె ఒప్పుకున్నారు. “నేను సల్మాన్ ఖాన్‌తో చెప్పాను, నాకేం పని లేదని. యువ నటీమణులు (అనన్య పాండే, సరా అలీ ఖాన్, సయీ మంజ్రేకర్) లకు నాట్య పాఠాలు నేర్పిస్తున్నాని చెప్పాను. సరే, ఇప్పుడు నాతో పని చేద్దురు గాని అన్నాడతను” చెప్పారు సరోజ్.

వ్యక్తిగత జీవితం:

సరోజ్ వ్యక్తిగత జీవితం ఎన్నో తుఫానులను ఎదుర్కొంది. మాస్టర్‌జీ సోహన్ లాల్ కళ పట్ల ముగ్ధురాలై, ఆయన తోనూ, ఆయన పని తోనూ ప్రేమలో పడ్దారామె. “నేను గురూజీ అంటే ఎంతో ఇష్టపడ్డాను. వేరే డాన్సర్‍తో ఆయనను చూస్తే, నాలో చెప్పలేనంత అసూయ రగిలేది” అన్నారామె నిధి తుల్లి డాక్యుమెంటరీ – సరోజ్ ఖాన్ స్టోరీలో.

“నేను మాస్టర్‌జీని పెళ్ళి చేసుకున్నప్పుడు నాకు 13 ఏళ్ళ వయసు, చదువుకునే బాలికగా ఉండాల్సింది. ఓరోజు ఆయన నా మెడలో ఓ నల్లని తాడు కట్టారు… అంతే… కానీ అప్పటికే ఆయనకి పెళ్ళయిందని, నలుగురు పిల్లలున్నారని తర్వాత తెలిసింది. 1963లో నేను మా అబ్బాయి రాజు (హమీద్ ఖాన్) కి జన్మనిచ్చేదాక, ఆయన మొదటి భార్య గురించి నాకు తెలియదు” చెప్పారామె.

1965లో ఆమె ఒక పాపకి జన్మనిచ్చారు. కానీ ఆ పాప పూర్తిగా ఏడాది కూడా జీవించలేదు. ఆ ఎనిమిది నెలల పాపని సమాధి చేసి, సరోజ్ ‘దమ్ మారో దమ్’ (హరే రామ హరే కృష్ణ) పాట చిత్రీకరణలో పాల్గొన్నారట. ఆ పాప చనిపోవడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. ఈ సమయంలోనే ఆమె ఇస్లాం వైపు మళ్లారు. ఇస్లాం మతం తనకి ప్రేరణనిచ్చిందని, తనంతట తానుగా మతం మారానని ఆమె ఒక టివి ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ సమయంలోనే సరోజ్, సోహన్ లాల్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ సంతానానికి తమ ఇంటి పేరు ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు. 1969లో ఆయన తిరిగి తన అసిస్టెంట్‌గా పని చేయవలసిందిగా సరోజ్‌ని కోరారు. “నేను తిరస్కరించగా, ఆయన నాపై సినీ డాన్సర్స్ అసోసియేషన్‍లో ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఆయనతో కలిసి పని చేశాను. ఆ సమయంలోనే ఆయనకి గుండె పోటు వచ్చింది. ఆయన చూడడానికి వెళ్ళాను. ఆ సమయంలో ఒక రాత్రి ఆయనతో గడిపినందుకు నా కూతురు కుకు (హీనా ఖాన్) పుట్టింది” చెప్పారామె.

తరువాత ఆమెకు (స్వర్గీయ) సర్దార్ రోషన్ ఖాన్ అనే పఠాన్ వ్యాపారవేత్తతో పరిచయమైంది. ఆయనకి అప్పటికే పెళ్ళయి పిల్లలు ఉన్నా కూడా సరోజ్ అంటే ఎంతో ప్రేమ కనబరిచారు. ఆమెని పిల్లలతో సహా స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళు 1975లో పెళ్ళి చేసుకున్నారు. “ఆయన నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు. ఆయన మొదటి భార్య నేను అక్క చెల్లెళ్ళుగా మసలుకున్నాము. ప్రేమించే మనిషి లభిస్తే, మీరు దేన్నయినా వదులుకుంటారు” అన్నారామె. ఈ దంపతులకి సుకైనా ఖాన్ అనే కూతురు ఉంది. ప్రస్తుతం ఆమె దుబాయ్‍లో ఒక డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు.

1977లో సరోజ్ తన సోదరులను, సోదరీమణులును, రోషన్ ఖాన్ మొదటి భార్య బిడ్డలను స్థిరపరచడానికి దుబాయ్ వెళ్ళి మూడేళ్ళు ఉన్నారు. 1980లో తిరిగి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

2011లో 42 ఏళ్ళ వయసులో ఆమె కూతురు కుకు (హీనా ఖాన్) లివర్ కాన్సర్‌తో మరణించడం సరోజ్‍కి పెద్ద దెబ్బ అయింది. తట్టుకోలేకపోయారు. అదే సమయంలో వృత్తి లోనూ, ఆరోగ్యంలోనూ సమస్యలు తలెత్తాయి.

శ్వాస సమస్యలు ఎదురవడంతో ఆమెను 17 జూన్ 2020 నాడు బాంద్రా లోని గురు నానక్ ఆసుపత్రిలో చేర్చారు. 71 ఏళ్ల వయసులో ఆమె 3 జూలై 2020న గుండెపోటుతో మృతి చెందారు.

హిందీ చిత్రసీమకు నాట్యాలు నేర్పిన ఆమె పాదాలు శాశ్వతంగా అచేతనమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here