అలనాటి అపురూపాలు-87

1
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

జ్ఞాన సముద్రుడు రాండార్ గై:

‘రాండార్ గై’ అనే కలం పేరుతో సుప్రసిద్ధులైన మాడభూషి రంగాదొరై (జననం 8 జననం 1937), భారతీయ న్యాయవాది, కాలమిస్ట్, సినీ, న్యాయ చరిత్రకారులు. ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’కి చెందినవారు (ది హిందూలో వచ్చిన ‘బ్లాస్ట్ ఫ్రం ది పాస్ట్’ అనే కాలమ్‌కి ఆయన అధికారిక సంపాదకులు). ఆయన ప్రసిద్ధ సినీ, న్యాయ, సాంస్కృతిక చరిత్రకారులు. విస్తృతమైన అంశాలలో ఆయన చేసిన రచనలు దేశంలోని వివిధ పత్రికలలో – ఇంగ్లీషు, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రచురితమయ్యాయి.

రంగాదొరై వారి అసలు పేరు అయినప్పటికీ, రాండార్ గై గానే సుప్రసిద్ధులు. మద్రాసు యూనివర్శిటీ నుంది బిఎస్‌సి, బి.ఎల్. లలో డిగ్రీ పొందారు. న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించారు. న్యాయవాదిగా కొద్దిరోజులు ప్రాక్టీసు చేసి, ఆ పై ‘పాటర్‌సన్ అండ్ కో’ అనే సంస్థలో చేరారు. అక్కడ ఐదేళ్ళు పని చేశారు. 1976 అక్కడ రాజీనామా చేసి తన సమయాన్ని రచనలకు కేటాయించారు. రంగాదొరై అనే తన అసలు పేరు తమ సాంప్రదాయ అయ్యంగార్ బ్రాహ్మల కుటుంబ నేపథ్యాన్ని బహిర్గతం చేస్తుందని, తన రచనల కోసం ‘రాండార్ గై’ అనే కలం పేరు పెట్టుకున్నారు. కొంత కాలానికి అదే ఆయన అసలు పేరు అయ్యింది (“పూర్తిగా న్యాయసమ్మతమైనది, నా పాస్‌పోర్ట్‌లో కూడా ఆ పేరే ఉంది” అని చెప్పారాయన ఒకసారి). న్యాయవాదిగా శిక్షణ పొందినందున కొన్నాళ్ళ పాటు ప్రముఖ న్యాయవాది వి. సి. గోపాలరత్నం గారి వద్ద సహాయకులుగా పనిచేశారు. తనను గోపాలరత్నం గారు ప్రతి క్లయింట్ మీటింగులోనూ కూర్చోబెట్టేవారనీ, క్లయింట్లకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాల్సిందే అని గోపాలరత్నం గారు నమ్మేవారనీ, ఆ సమావేశాలలో జరిగిన విషయాలు తానెన్నడూ మరువలేనని గై అన్నారు.

అయితే ‘లా’ ఒక్కటే అయన ఆసక్తి కాదు. ఆయన మంచి క్రికెటర్, రచయత, సినిమాల పట్ల ఆసక్తి ఉన్నవారు. ‘మై మేగజైన్’ అనే ఆంగ్ల పత్రికలో సుప్రసిద్ధ క్రిమినల్ కేసుల శీర్షిక నిర్వహించడం ద్వారా గై తన రచనా ప్రస్థానం ప్రారంభించారు. మగతనాన్ని కాపాడుకోడం ఎలా అనే అంశంపై పూర్తి పేజీ ప్రకటనలు ద్వారా ఈ పత్రిక లాభసాటిగా నడిచేదట! ఆయన శీర్శిక బాగా జనాదరణ పొందింది. ‘గేల్’ అనే మరో ఆంగ్ల పత్రికలో మరో శీర్షిక నిర్వహించారు. పత్రికలలో ప్రకటనలను సన్నిహితంగా చూసిన ఆయన ఓ యాడ్ ఏజన్సీ‍లో చేరారు. అక్కడ సాధించిన అనుభవంతో సొంతంగా ‘బీకాన్ క్రియేషన్స్’ అనే ప్రకటన సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ ఎన్నో ప్రకటనలనూ, డాక్యుమెంటరీలను విడుదల చేసింది. గై తమిళం, తెలుగు భాషలలో కథలు వ్రాశారు. ‘ఇండియన్ రిచర్డ్ లీ’ అనే మరో కలం పేరుతో ఆయన రాసిన కథలు భారతదేశంలో, అమెరికాలో, జపాన్‍లో ప్రచురితమయ్యాయి. తమిళ, తెలుగు చిత్రాల్లో ఆయన ఇంగ్లీషు పాటలు రాశారు. ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రంలో ఒక ఇంగ్లీషు పాట రాశారు. అలాగే, ‘సూర్యకాంతి’ అనే తమిళ చిత్రంలో ‘Love is Fine My Darling’ అనే ఇంగ్లీషు పాట రాశారు. ఈ పాటని జయలలితపై చిత్రీకరించారు. ‘పాతు మాద బంధం’ చిత్రంలో ఒక ఇంగ్లీషు పాట రాయగా, దానిని భానుమతిపై చిత్రీకరించారు.  తెన్‍మలయ్ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. రేడియోలో కూడా పని చేసి ఎన్నో నాటకాలు వ్రాశారు, పలు నాటకాలకు వాయిస్-ఓవర్ చెప్పారు.

అయితే తమిళ సినీ రంగంలో వస్తున్న మార్పులు ఆయనని విశేషంగా ఆకర్షించాయి. వాటిని గమనిస్తూ, వాటి గురించి వ్రాయసాగారు. షూటింగులలో నటీనటులు, దర్శకులతో కలిసి ఉండడమే కాకుండా, రాండార్ గై తనకు జీవితాంతంగా ఇష్టమైన అంశంగా మిగిలిన – తమిళ సినీ ఆరంభాలు అనే అంశంపై పరిశోధనలు గావించారు. పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమైనప్పుడు – ఆ సంస్థ ఆర్కైవ్స్ కోసం దక్షిణ భారత చిత్రసీమపై సమాచారాన్ని ఇవ్వమని వీరినే అడిగారు.

రాండార్ గై రచనలతో సమస్య ఏంటంటే, వాటికి ఉండే సమాచారపు విలువ కారణంగా అవి లెక్క లేనన్ని పత్రికలలోనూ, దినపత్రికల్లోనూ పునర్ముద్రితమవుతూ ఉండేవి. వీరాభిమానులు మాత్రం ఆయన కాలమ్‌ని వెంటనే చదివేస్తే, సాధారణ పాఠకులు బొమ్మలు, అవీ ఇవీ చూసి తరువాత తాపీగా ఆయన కాలమ్ చదివేవారు.

ఈ కాలమ్స్‌ని ‘మెమోరీస్ ఆఫ్ మద్రాస్’ అనే పుస్తకం కోసం సంకలనం చేస్తూ, సంపాదకులు టి.ఎస్. గోపాల్ గారు – ఈ వ్యాసాలు 1897లో ఆరంభం నుంచి దాదాపు 1960ల వరకూ తమిళ సినిమా చరిత్రను వివరిస్తాయని వెల్లడించారు. ఈ వ్యాసాలన్నీ ఎంతో వివరంగా, వర్ణనాత్మకంగా, హాస్యంగా ఉన్నాయన్నారు. ఎంతో సమాచారాన్ని వెల్లడించాలనే తపన రచయితలో కనబడేడట. పాఠకుడు – ఇంకా ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అనుకునేవాడట. మళ్ళీ మళ్ళీ చదివేవాడట.

‘మెమోరీస్ ఆఫ్ మద్రాస్’ 1885లో దేశంలోకి, 1897లో మద్రాసు ప్రెసిడెన్సీలోకి సినిమాలు రావడంతో మొదలవుతుంది. మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని విక్టోరియా పబ్లిక్ హాల్‍లో ఒక యూరోపియన్ ప్రదర్శకుడు కొన్ని చిన్న మూకీ సినిమాలను ప్రదర్శించాడు. తరువాత ‘ది ఎలెక్ట్రిక్ థియేటర్’ (ప్రసుతం – ది ఫిలాటెలిక్ బ్యూరో, అన్నా సలై), ‘లిరిక్ థియేటర్’ (తదుపరి ఎల్ఫిన్‌స్టోన్) నిర్మితమయ్యాయి. ఇక్కడ లఘుచిత్రాలను ప్రదర్శించేవారు, వాటిని బ్రిటీషు వారు, వారి కుటుంబాలు ఎక్కువగా చూసేవారు. అప్పట్లో చాలామంది భారతీయులకు సినిమా అంటే నీతిబాహ్యమైన పాశ్చాత్య రంగం, అందుకని దూరంగా ఉండేవారు. తన కాలమ్‌లో గై ఈ సామాజిక అంశాలను సున్నితంగా స్పృశించేవారు. ఆయన వెల్లడించిన ప్రకారం – చాలామంది మధ్యతరగతి వారు, సాంప్రదాయక కుటుంబాల వారు సినిమా చూడడటమంటే – పాపం అని భావించేవారు. అయితే ఈ కుటుంబాలలోని బాలురు సినిమా అంటే ఆసక్తి కలిగి ఉండి, రహస్యంగా చూసేవారుట. అసలు ఏ రకంగా సినిమాతో సంబంధం పెట్టుకోవడం అనైతికమనీ భావించేవారు. అదే సమయంలో భారతీయ దర్శకులు సినిమాలు తీస్తూ – తమ సినిమాల్లో నటీమణుల కోసం ఆసక్తి ఉన్న మహిళల కోసం ప్రయత్నిస్తే – సినిమాల్లో నటించేందుకు ఆనాటి సుప్రసిద్ధ వేశ్యలు కూడా తిరస్కరించారట!

అయితే, ఇటువంటి అతి బిడియపు ధోరణులున్నా, సినిమాలకు మాస్ లోనూ, క్లాస్ లోనూ ప్రేక్షకులుండేవారు. వారికి సినిమా ఓ కొత్త – భావప్రసార మాధ్యమం! సినీరంగంలోని పథగాములంతా బాగా చదువుకున్న ఉన్నత వర్గాలకు చెందినవారే. వారు దర్శకులు, నిర్మాతలు, గీత రచయితలు, నటులలా స్థిరపడ్డారు.

తొలినాటి దిగుమతి చేసుకున్న సినిమాలను ప్రదర్శించే ‘టెంట్ సినిమాలు’ (చిన్న ఊర్లలో పొలాల్లో గడ్డి కప్పు నేసిన థియేటర్లు) నుంచి ప్రారంభమైన పయనాన్ని వివరిస్తూ – గై కథనం దక్షిణ భారతంలోని సినిమా థియేటర్ల చరిత్రను, పథగాముల గురించి వివరిస్తుంది. దక్షిణాదిలో తొలి ప్రొడక్షన్ కంపెనీ అయిన ‘ది ఇండియన్ ఫిల్మ్ కంపెనీ’ అధినేత ఆర్. నటరాజ్ ముదలియర్ (ఈ సంస్థ స్థానికంగా, కీచక వధమ్ అనే చిత్రం తీసింది),  తొలి తమిళ టాకీ శ్రీనివాస కళ్యాణం తీసిన ఎ. నారాయణన్, నటుడు నిర్మాతగా మారిన బాడీ బిల్డర్  రాజా శాండో; తమిళ సినిమాలలు చక్కని సంగీతం, పాటలు అందించిన పాపనాశం శివన్, గాయక-నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్, తమిళ తొలి స్టార్ నటి టి. ఆర్. రాజకుమారి, డాషింగ్ ఎం.కె. రాధ, ఇంకా, ఎం.ఎస్. లక్ష్మి, ఆనంద్ వికటన్ పత్రికని స్థాపించి, పూర్తి ఆసక్తి లేకుండానే జెమిని ఫిల్మ్స్ స్థాపించిన ఎస్. ఎస్. వాసన్, ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసి, ఎందరో నటీనటులను పరిచయం చేసిన కె. సుబ్రహ్మణ్యం; చెట్టినాడులో చిన్న వ్యాపార నేపథ్యం నుంచి తొలుత సరస్వతి స్టోర్ స్థాపించి, ఆపై ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన ఎంవిఎం సంస్థను స్థాపించిన ఎ.వి.మెయ్యప్పన్ తదితరుల గురించి వ్రాశారు.

ఇంకా ఈ జాబితాలో తమిళనాడులో 13 ఏళ్ళు నివసించి,తనకి తెలియని భాష తమిళంలో సినిమాలు తీసిన అమెరికన్ ఎల్లిస్. ఆర్. దుంగన్ ఉన్నారు,

రాండార్ గై వ్రాసిన ఈ పుస్తకంలో ఎన్నో బ్లాస్‍బస్టర్స్ ప్రస్తావన ఉంది, ఆ కాలంలో విఫలమయి పరాజయం పాలయిన చిత్రాల గురించి కూడా రాశారు, ఎందుకంటే వాటి వైఫల్యాల నుంచి కొందరైనా పాఠాలు నేర్చుకుంటారని.

ఈ పుస్తకం – రచయితలుగా సినీవినిలాకాశంలో దూసుకుపోయిన సి.ఎస్. అన్నాదురై, ఎం.కె. కరుణానిధిలు తమ ప్రతిభ కారణంగా తమిళ సినిమాలలో ద్రవిడ రాజకీయాలను ఆదర్శాలను ఎలా చొప్పించగలిగారో తెలిపి, తమిళ సినిమాలపై ద్రావిడ ఉద్యమం ప్రభావం గురించి చర్చిస్తుంది. సినీరంగంలో వారి విజయాలు వారి రాజకీయ ప్రస్థానాన్ని మలుపుతిప్పాయని అంటారు. ఇద్దరూ తమిళనాడుకు ముఖ్యమంత్రులయ్యారు. ఈ పుస్తకం – ఎంజిఆర్ – తొలి ప్రయత్నాలను, పోరాటాలను, పరాజయాలను, తుదకు ఆయన సాధించిన ఘన విజయాన్ని ప్రస్తావిస్తుంది. మొదట్లో ఆయన డి.ఎం.కె. పార్టీలో ఎందుకు ఉన్నారో, ఆ తర్వాత ఎందుకు బయటకొచ్చి, సొంతంగా పార్టీ పెట్టారో ఈ పుస్తకం చెబుతుంది. రాష్ట్రంలో అంత అభిమాన ముఖ్యమంత్రిగా ఎలా అయ్యారో తెలుపుతుంది. అసలు సినీరంగంలో రాణించలేడని భావించిన మరో నటుడు శివాజీ గణేశన్ సూపర్ స్టార్, దిగ్గజం ఎలా అయ్యారో చెబుతుంది. తరువాత కాలంలో గొప్పవారయిన ఈ నటులందరి తొలినాటి కష్టాలను ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది. ఆసక్తిగా చదివిస్తుంది.

ఈ పుస్తకంలోని రెండవ భాగంలో ఆనాటి దిగ్గజాలని సినీ, సంగీత పరిశ్రమకు చెందిన వ్యక్తుల జీవనరేఖలు… ఎం.ఎస్. సుబ్బులక్ష్మి నుంచి కె. బాలచందర్ వరకు ఉన్నాయి. తమ పొరపాట్లు, తమ బలాలు అన్నీ నిజాయితీగా చెప్పిన ఆయా వ్యక్తుల సన్నిహిత కథనాలివి.

మూడవ భాగంలో రాండార్ గై మద్రాసు లోని గొప్ప న్యాయ నిపుణులలో ఒకరైన వి.ఎల్.యతిరాజ్ గురించి వివరిస్తారు. ఇది కేవలం యతిరాజ్ గారి చరిత్రే కాకుండా మద్రాసు న్యాయవాద ప్రపంచపు చరిత్ర, ఒకనాటి మద్రాసు చరిత్ర కూడా. ‘నగరం ఇప్పటికంటే అప్పుడే ఎంతో బావుండేది’ అన్నారు గై.

అయితే రాండార్ గై కాలమ్స్ అంతకు మునుపే చదివిన వారికి – ఈ పుస్తకం – చదివేసిన పుస్తకంలా అనిపించే అవకాశం ఉంది. పైగా ఇందులో కొన్ని అంశాల పునరుక్తి ఉంది. కానీ నోస్టాల్జియా పాఠకులని చుట్టేస్తుంది, మళ్ళీ చదివిస్తుంది.

సుప్రసిద్ధ నిర్మాత ఫ్రాంక్ కాప్రా పై ఆయన వ్రాసిన వ్యాసాన్ని అమెరికాలోని వాషింగ్టన్ డిసికి చెందిన USIA కొనుగోలు చేసింది, ఎన్నో దేశాలలో ఫ్రాంక్ కాప్రా రెట్రోస్పెక్టివ్‍కి రిసోర్స్ మెటీరియల్‌గా ఉపయోగిస్తోంది. అమెరికా ప్రభుత్వం తన రచనలను చేజిక్కించుకున్న అమెరికా పౌరుడు గాని రచయిత రాండార్ గై మాత్రమే. USIS, India వారు ఆయన చేత మద్రాసు, బెంగుళూరు, త్రివేండ్రమ్, హైదరాబాద్ వంటి నగరాలలో ఫ్రాంక్ కాప్రాపై ఉపన్యాసాలు ఇప్పించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు గై.

ఆయన ఎన్నో రేడియో నాటకాలు వ్రాశారు. డాక్యుమెంటరీలు రాశారు. అంతే కాదు, ఓ హాలీవుడ్ కంపెనీ కోసం వంద నిమిషాల నిడివి ఉన్న ‘Perfumed Garden’ అనే ఫీచర్ ఫిల్మ్ తీశారు. ఆ సినిమా 1999లో విడుదలైంది. ఆ సినిమా హిందీ, తమిళ, తెలుగు భాషలలో ‘బ్రహ్మచారి’ పేరుతో డబ్ అయింది.

2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన “నాది ఫోటోగ్రాఫిక్ మెమొరీ” అన్నారు. అది అతిశయం కాదు. మద్రాసు గురించి, తమిళనాడు గురించి ఇన్ని విషయాలు ఎలా గుర్తుపెట్టుకున్నారన్న ప్రశ్నకు జవాబుగా ఆయన అలా చెప్పారు. అప్పటికి 82 ఏళ్ళ వయసు ఆయనకి. అయినా ప్రతి సంఘటనా, ప్రతి సంభాషణా, ప్రతి సన్నివేశం అన్నీ జ్ఞాపకమే ఆయనకు. వ్యక్తిగత జీవితంలో మరిచిపోవలసిన మూడు, నాలుగు కుటుంబ దుర్ఘటనలున్నా, అవీ ఆయనను వీడలేదు.

కళ, సంస్కృతుల కోసం పని చేసే ‘సముద్ర’ అనే పత్రిక ఐదవ వార్షికోత్సవంలో 12 నవంబర్ 2007 నాడు – కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు ‘జ్ఞాన సముద్ర’ అనే అవార్డునిచ్చారు.


భయం లేని నటి, ప్రతిభావంతురాలైన గాయని – శాంతా ఆప్టే:

సామాజిక కట్టుబాట్లకు తలవంచని – తొలి తరం భారతీయ నటీమణులలో ముందువరుసలో ఉంటారు శాంతా ఆప్టే. ఆమె 1916లో మహారాష్ట్రలోని దూధ్‌నిలో సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక స్టేషన్ మాస్టర్. ఆమె అసలు పేరు నీరా. పూనాలో వినాయక చవితి సందర్భంగా మండపాలలో భజనాలు పాడడంతో శాంత సంగీత ప్రస్థానం మొదలయింది. అమ్మ, పెద్దన్నయ్య, ఇంకా ఇతర తోబుట్టువులు ప్రోత్సహించడంతో ఆమె గానంతో తన ప్రతిభని విస్తరించుకోవాలనుకున్నారు. పంధర్‍పూర్‍లోని మహారాష్ట్ర సంగీత్ విద్యాలయంలో సంగీతం నేర్చుకున్నారు. సినిమాలలో ధ్వని ప్రవేశించాకా, కేవలం నటించగలిగే కళాకారులకు కాకుండా, పాటలు కూడా పాడగలిగే నటీనటులకు డిమాండు పెరిగింది. ఈ విధంగా ఆమె 1932 నాటి పౌరాణిక చిత్రం ‘శ్యామ్‌సుందర్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాని సుప్రసిద్ధ దర్శకనిర్మాత భాల్జీ పెంధార్కర్ నిర్మించారు. ఈ సినిమాలో ఆమె రాధగా నటించగా, కృష్ణుడిగా సాహు మోదక్, రాధ భర్త పాత్రలో ఆమె అన్నగారు బాబూరావ్ ఆప్టే నటించారు. హిందీ వెర్షన్ బాగా ఆడకపోయినా, మరాఠీ వెర్షన్ అద్భుతమైన విజయం సాధించింది. బొంబాయిలో ఒకే థియేటర్‍లో 25 వారాలు ఆడిన తొలి టాకీ సినిమా అది. విషాదం ఒలికే స్వరాలు గల సైగల్, కానన్‍ దేవిల గాత్రంలో పోలిస్తే, విభిన్నంగా ఉన్న శాంత గాత్రం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం విజయం సాధించినప్పటికీ, శాంతకి వెంటనే ఇతర చిత్రాలలో అవకాశాలు రాలేదు. పత్రికలలో కూడా ఆమె గురించి గొప్పగా ఏమీ రాయలేదు. 1947లో ‘సినిమా నటిగా ఎలా అయ్యారు’ అని ఎవరో అడిగిన ప్రశ్నకు బదులుగా, “నిజం చెప్పాలంటే, నేను కెమెరా ముందుకు వెళ్ళేదాకా, నాకు సినిమాలు అంటే తెలియదు. నేను అప్పట్లో చిన్నదాన్ని, కేవలం సంగీతం అంటేనే ఆసక్తి ఉండేది. స్టూడియోలో సంగీతం నేర్పిస్తారంటే వెళ్లాను. కానీ నటనలో నా మొదటి అనుభవం తరువాత – నేను సరిగా నటించలేదని చెప్పకపోయి ఉంటే – నటనని కెరీర్‌గా ఎంచుకునేదాన్ని కాదు. నేను సరిగా చేయలేదని డైరక్టర్ గారు అన్నారు. దాంతో సవాలుగా తీసుకుని ఆ పాత్ర పోషించాను. అందుకే మూడేళ్ళ తరువాత ప్రభాత్ స్టూడియోకి మారాను” చెప్పారామె. 1934లో ప్రభాత్ స్టూడియో కొల్హాపూర్ నుంచి పూనాకి మారిన తర్వాత, ఆమెకి సినిమా అవకాశాలు అధికంగా వచ్చాయి. ఈ స్టూడియోతో శాంత తొలి సినిమా 1934 నాటి ‘అమృత్ మంథన్’. పూనా లోని స్టూడియో కొత్త ప్రాంగణంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి సినిమా ఇది (ఇప్పుడు ఈ స్టూడియో ప్రాంగణంలో – ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా – కొలువై ఉన్నాయి). ఈ సినిమా గొప్ప హిట్ అయి, శాంతకి పేరు తెచ్చింది. ఇందులో ఆమె హీరో సోదరిగా నటించారు. అది భావోద్వేగాలతో కూడిన పాత్ర. పిచ్చిపట్టిన మహిళగా ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాలు చూశాకా, ఆమె చక్కగా నటించగలరని విశ్వాసం కలిగిందట. ఆమె పాటలు (ముఖ్యంగా ‘రాత్ ఆయీ హై నయా రంగ్ జమానే కే లియే’) సూపర్ హిట్ అయ్యాయి. బొంబాయిలో సిల్వర్ జుబిలీ జరుపుకున్న తొలి హిందీ చిత్రం ‘అమృత్ మంథన్’. ఈ సినిమా వెనిస్‍లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‍లో ప్రదర్శితమయింది. సురేష్ బాబు, నళిని తార్కడ్‌లవి ప్రధాన పాత్రలయినా, ప్రశంసలు పొందింది మాత్రం – శాంతా ఆప్టే, చంద్రమోహన్. బుద్ధుని కాలం నాటి కథావస్తువుతో, ఈ సినిమా పురాతన మత ఆచారాలను పరిశీలిస్తుంది ఈ చిత్రం. దేవతలకు మానవులను బలి ఇచ్చే పూజారి పాత్ర ఉంది ఈ చిత్రంలో. పాటలు సూపర్ హిట్ కావడంతో, స్టూడియో నట-గాయని శాంతా ఆప్టేకు – దుర్గా ఖోటే, శాంతా హుబ్లికర్‍లతో సహా- మరిన్ని అవకాశాలు వచ్చాయి. కేశవ్‍రావ్ భోలే సంగీత దర్శకత్వంలో శాంతా ఆప్టే నాలుగు సోలో పాటలు పాడారు. వాటిలో ఆమె పాడిన తొలి ఘజల్ ‘Kamsini Mein Dil Pe Gham Ka’ కూడా ఉంది.

1936లో శాంత వి.శాంతారామ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమర్ జ్యోతి’ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో శాంతా ఆప్టే పాడిన ‘సునో సునో బన్ కే ప్రాణీ’ పాట అలనాటి మధురగీతాలలో ఒకటిగా నిలిచింది. ఆమె స్వరంలోని సహజత్వాన్ని అందరూ మెచ్చుకున్నారు.  ఆమె 1937లో వి.శాంతారామ్ దర్శకత్వంలో వచ్చిన ‘దునియా నా మానే’ చిత్రంలో నిర్మల అనే యువతి పాత్ర పోషించారు. నిర్మలను ఓ ధనవంతుడైన భార్య చనిపోయిన ముసలతనికిచ్చి పెళ్ళి చేస్తారు. ఆమె ఎదురుతిరిగి, అతన్ని తన భర్తగా పరిగణించదు. చివర్లో ఆ భర్త తన తప్పు తెలుసుకుని, నిర్మలని మళ్ళీ పెళ్ళి చేసుకోమని రాసి, తను ఆత్మహత్య చేసుకుంటాడు (ఈ సినిమాని నేను దూరదర్శన్‍లో చూశాను. నాకప్పుడు ఐదేళ్ళు. ఆ వయసులోనే నేను ఆమె నటనకి, గానానికి అబ్బురపడ్డాను. ముసలివాడిని పెళ్ళి చేసుకుని మోసపోయి, భర్తని కాదనే ఆమె ధైర్యాన్ని అభినందించాను). ఈ సినిమాలో ఆమె ఒక ఇంగ్లీషు పాట కూడా పాడారు. అది H. W. Longfellow గారి Psalm of Life మరో వెర్షన్. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నిర్మల తన సవతి కొడుకుని కర్రతో కొడుతుంది. సినీ విమర్శకుడు, చరిత్రకారుడు బాపు వాట్వే ప్రభాత్ స్టూడియోస్ గురించి తాను వ్రాసిన Ek Hoti Prabhatnagari (Such Was the World of Prabhat) అనే పుస్తకంలో ఆ సన్నివేశం గురించి – “కుంకూ (దునియా నా మానే) చిత్రంలో ఒక సన్నివేశంలో హీరోయిన్ సవతి కొడుకుని కర్రతో కొట్టాలి.  ఈ షాట్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కార్డ్‌బోర్డ్ కర్రలు మాటి మాటికీ విరిగిపోతుంటే – శాంతా ఆప్టే – ‘రాజా నెనె’ని నిజమైన కర్రతో కొట్టసాగింది. ఈ సినిమాని మరాఠీ, హిందీలో ఒకేసారి తీయడం వల్ల – పాపం రాజా చాలా దెబ్బలు తినవలసి వచ్చింది” అని రాశారు. శాంత షూటింగ్ లోనే కాక, నిజ జీవితంలో కర్రతో మోత మోగించారు. ఫిల్మ్ ఇండియా ఎడిటర్ బాబూరావు పటేల్ ఆమె గురించి ఏదో చెడుగా రాస్తే, వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి కర్రతో వాయించారట! ఆ ఏడాదే ఆమె ఆ సినిమా మరాఠీ వెర్షన్‌లో నటించారు. ఆ సినిమా బాగా విజయవంతమయింది. ఆమె తారాపథంలోకి వెళ్ళిపోయారు. 1939లో ప్రభాత్ స్టూడియో వారు తీసిన మరాఠీ, హిందీ ద్విభాషా చిత్రం ‘గోపాల్ కిషన్’లో నటించి, 7 పాటలు పాడారు. ఈ సినిమా అదే పేరుతో ఈ సంస్థే 1929లో తీసిన మూకీ సినిమాకి రీమేక్. 1941లో ఆమె ‘సావిత్రి’ అనే తమిళ సినిమాలో నటించారు. ఈ సినిమాలో డైలాగులు చెప్పేందుకు, పాటలు పాడేండుకు గాను శాంత సుప్రసిద్ధ తమిళ సంభాషణల రచయిత టి.సి. వడివేలు నాయకర్ వద్ద, అలాగే పూనాలో స్థిరపడిన ఓ మైలాపూర్ తమిళ మహిళ వద్ద తమిళం నేర్చుకున్నారు. ఓ పనిమనిషిలా వేషం ధరించి, పెరటి గుమ్మం నుంచి ఆ మహిళ ఇంటిలోకి వెళ్ళేవారుట. అదీ ఆమె నిబద్ధత! ఆ సినిమాలో శాంత, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి చాలా పాటలు పాడారు. మద్రాసు నుంచి శాంత పంచోలి గారి ‘జమీందార్’ చిత్రంలో ఎస్.డి. నారంగ్ సరసన నటించేందుకు లాహోర్ వెళ్ళారు. అక్కడ ఆమె ప్రవర్తన తుఫాను సృష్టించిందట. అయినా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. గులామ్ హైదర్ సంగీత దర్శకత్వంలో శాంత పాడిన ‘ఛోటాసా సంసార్’ అనే పాట ప్రేక్షకులని ఆకట్టుకుంది.

బొంబాయి తిరిగొచ్చిన శాంత దేబకీ బోస్ గారి ‘అప్నా ఘర్’ చిత్రంలో మీరా అనే మహిళ పాత్ర పోషించారు. ఆమె భర్త ఫారెస్ట్ ఆఫీసర్‌గా చంద్రమోహన్ నటించారు. స్త్రీ ఇంటి నాలుగు గోడలకి పరిమితం కాకూడదని, అడవికి వెళ్ళి ఆటవికులకు సేవలందించే పాత్ర శాంతది. తిరుగుబాటు స్వభావం కల ఈ పాత్రను ఆమె అద్భుతంగా పోషించారు. భర్త పాత్ర పాలకవర్గాలకు సూచిక కాగా, మీరా పాత్ర అన్యాయాల్ని ఎదిరించేవారికి ప్రతీక. శాంత నటించిన మరో అద్భుత చిత్రం – అనార్కలి, నాగిన్ వంటి చిత్రాలు తీసిన నందలాల్ జశ్వంత్‍లాల్ దర్శకత్వంలో – సంస్కృత నాటకం కాదంబరి ఆధారంగా తీసిన ‘కాదంబరి’ సినిమా. ఇందులో మహాశ్వేతాదేవిగా శాంత నటన అపూర్వం. యుద్ధ కాలంలో కూడా శాంత పలు చిత్రాలలో నటించారు. మొహబ్బత్, భాగ్యలక్ష్మి, సావన్, పనిహారి, సుభద్ర, ఉత్తర అభిమన్యు, వాల్మీకి వాటిల్లో ముఖ్యమైనవి. దేశ స్వాతంత్ర్యానంతరం ఆమె స్టార్ స్టేటస్ కొంత సన్నగిల్లింది. కేవలం – కొన్ని హిందీ సినిమాల్లోనే – మందిర్, మై అబ్లా నహీ హూఁ, స్వయం సిద్ధ – వంటి హిందీ చిత్రాల్లోనూ – ‘Jaga Bhadyane Dene Aahe’, ‘Shilanganache Sone’, ‘Jara Japoon’, ‘Bhagyawan’ వంటి మరాఠీ చిత్రాలలో నటించారు.

‘స్వయం సిద్ధ’ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఆ సినిమాలో ఆ పాత్ర ఆమె కోసమే సృష్టించారు. ఆ చిత్రంలో ఆమె భర్త పాత్ర – బలహీనుడు, దాదాపుగా పిచ్చివాడు. ఆమె మరిది ఇంటిపై, కుటుంబంపై అజమాయిషీ చలాయిస్తాడు. ఈ అన్యాయం సహించలేక ఆమె తిరగబడుతుంది. భర్తకి నయం చేయించి, మరిదికి గుణపాఠం చెబుతుంది. ఈ సినిమాని కలకత్తాలో చిత్రీకరించారు. అయితే ఈ సినిమాకి అమ్మడానికి నిర్మాతలు 1949లో బొంబాయి వస్తే డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి ఆసక్తి చూపారు. ఆయనే తారాచంద్ బర్జాత్యా.  ఆయన బొంబాయిలోని సెంట్రల్, ఎక్సెల్సియర్ థియేటర్లలో సినిమాని విడుదల చేశారు. అప్పటికే శాంత తన స్టార్ హోదాని కోల్పోవడంతో, ఓపెనింగ్స్ బాగా తక్కువగా వచ్చాయి. కాని విమర్శకులు ఈ చిత్రాన్ని మెచ్చారు. వారిలో ఒకరైన ఎం.డి. జఫేత్‌కి (ఈయన అప్పట్లో ‘భారత్ జ్యోతి’ వంటి చిత్రాలను సమీక్షించారు) ఈ సినిమా నచ్చి, వెంటనే శాంతా ఆప్టేతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ సానుకూలంగా స్పందించడంతో, ఈ సినిమా వసూళ్ళు పుంజుకున్నాయి. ఈ చిత్రంలో మామగారి పాత్ర పోషించిన బిపిన్ గుప్తాకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాని పి. పుల్లయ్య గారు సావిత్రి, అక్కినేని నాయికానాయకులుగా తెలుగులో 1955లో ‘అర్ధాంగి’ పేరుతో తీశారు. వీనస్ ఫిల్మ్స్ వారి ఇదే సినిమాని ‘బహురాణీ’ పేరుతో మరో వెర్షన్ తీశారు. శాంత పాత్రను మాలా సిన్హా, భర్త పాత్ర లో గురు దత్, మరిది పాత్రలో ఫిరోజ్ ఖాన్ నటించారు.

1943లో శాంత – నూర్ జెహాన్ తో కలిసి దుహాయ్ అనే చిత్రంలో నటించారు. అదొక సోషల్ మెలోడ్రామా. రఫీక్ ఘజ్నవి సంగీతం అందించిన ఈ చిత్రానికి విష్ణు వ్యాస్ దర్శకత్వం వహించారు. 1946లో ఆమె నాలుగు సినిమాలలో నటించారు. వాటిల్లో ‘సుభద్ర’ పౌరాణిక హాస్య చిత్రం. దీన్ని మాస్టర్ వినాయక్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో యాకుబ్, ఈశ్వర్ లాల్, లతా మంగేష్కర్ నటించారు. ‘సుభద్ర’ చిత్రంలో వసంత్ దేశాయ్ సంగీత దర్శకత్వంలో శాంత, లతా కలిసి ‘మై ఖిలీ ఖిలీ ఫుల్వారీ’ అనే పాట పాడారు. ఆ తరువాత సినిమా పరాస్ పిక్సర్స్ వారి కోసం సర్వోత్తమ్ బదామి దర్శకత్వంలో సాహు మోదక్ సరనన శాంత నటించారు. పనిహారి చిత్రానికి వి.ఎం. గుంజాల్ దర్శకత్వం వహించగా, సురేంద్ర, యాకుబ్ సహనటులు. ‘వాల్మికి’ చిత్రానికి భాల్‍జీ పెంధార్కర్ దర్శకత్వం వహించగా, పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ లిద్దరూ నటించారు. ఈవిధంగా శాంతా ఆప్టే – దేశంలోని ముగ్గురు దిగ్గజ గాయనీమణులతో నటించి పాటలు పాడారు. ‘సావిత్రి’లో (1941) ఎం.ఎస్. సుబ్బులక్ష్మితోనూ, ‘దుహాయ్’ (1943)  చిత్రంలో నూర్ జెహాన్ తోనూ, ‘సుభద్ర’ (1946) చిత్రంలో లతా మంగేష్కర్ తోనూ నటించి పాటలు పాడారు.

శాంతది తిరుగుబాటు స్వభావం. అన్యాయాన్ని సహించేవారు కాదు. ప్రభాత్ స్టూడియో యజమానులతో ఎన్నో వివాదాలు రేగి, చివరికి స్టూడియో గేటు ముందు నిరాహార దీక్ష చేసి కాంట్రాక్టును రద్దు చేయించుకున్నారు. ఈ ఉదంతాన్ని అక్షరబద్ధం చేసిన సరాహ్ నియాజి “ఆమె ఉద్యమాన్ని ‘పాశ్చాత్య చిట్కాగా’ తీసిపారేసి, సినిమా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతోందని కొందరు విమర్శకులు పేర్కొన్నారు” అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వార్తా పత్రికలు కూడా స్టూడియోకే మద్దతునిచ్చాయి. దేశంలో తొలి ప్రీలాన్స్ నటి శాంతా ఆప్టేనే. శాంతా, ఆమె అన్నయ్య బాబూరావు కలిసి ఆప్టే కన్సర్న్స్ అనే సంస్థను స్థాపించారు. ప్రభాత్ స్టూడియోతో కాంట్రాక్టు రద్దయ్యాకా, ఆమె దాదాపు ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నారు. క్రమంగా ఆమె ప్రజాదరణ తగ్గుముఖం పట్టింది. 1950ల వరకు ఆమె నటించినప్పటికీ, ఆమెది గుర్తుంచుకోవలసిన చివరి చిత్రం మాత్రం ‘స్వయం సిద్ధ’ (1949).

తొలినాటి నటీమణులపై తాను వ్రాసిన వ్యాసంలో మృణాల్ పాండే – తెర మీద, తెర వెనుక ఆప్టే తిరుగుబాటు ధోరణి గురించి వ్రాశారు. ఆమె జీవన శైలిని, బహిరంగంగా మద్యం సేవించడాన్ని, తన ప్రవర్తన పట్ల క్షమాపణలు కోరని ఆమె వైఖరిని ప్రస్తావించారు. Jau Mi Cinemat (Should I Join the Movies) అనే పేరుతో శాంతా ఆప్టే ఆత్మకథ వ్రాశారు. అందులో సినీ పరిశ్రమ నిర్మాణం గురించి, నటుల స్థానం గురించి ప్రస్తావించారు. ఆమె సమకాలికురాలు దుర్గా ఖోటే కూడా ఆత్మకథ వ్రాసినా – రెండింటి మధ్యా ఎంతో తేడా ఉంది. ఆప్టే పుస్తకం సినీ పరిశ్రమలోని అధికార వర్గాల గురించి, నటీనటుల పతనావకాశాల గురించి చర్చించింది. తాను ప్రసిద్ధ గాయని కావడం వల్ల – నేపథ్య గానాన్ని ఆమె వ్యతిరేకించారు. సినిమా అనే కళ పట్ల నిజాయితీగా ఉండాలంటే నేపధ్య గానాన్ని ఆపాలని ఆమె అన్నారు. పాడుకోగలిగే నటీనటులకే అవకాశాలివ్వాలనీ, అద్దెకు తెచ్చిన గొంతులతో ప్రేక్షకులను మోసం చేయకూడదని ఆమె అన్నారు.

1950లలో ఆమెవి అతి తక్కువ సినిమాలు వచ్చాయి. రాజా పరాంజపే గారి ‘జరా జపూన్’ (1950) లో కేశవ్ రావ్ దాతే, లీలా చిట్నీస్ లతో కలిసి నటించారు. దత్త ధర్మాధికారి దర్శకత్వంలో ‘కున్వాచ ధని’ (1951) లో నటించారు. కె. పి. భావే దర్శకత్వంలో ‘తాయ్ తలీన్’ (1953); మనహర్ రంగ్లీదాస్ రాస్కకపుర్ దర్శకత్వంలో ‘ములు మానెక్’ (1955) చిత్రాలలో నటించారు.

రామన్ బి దేశాయ్ దర్శకత్వంలో నిరుపా రాయ్, మన్‍హర్ దేశాయ్, ప్రేమ్ అదీబ్ లతో నటించిన ‘చండీ పూజ’; ఇదే సినిమాలోని నటీనటులతో 1958లో సమర్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘రామ భక్త్ విభీషణ్’ ఆమె చివరి రెండు హిందీ సినిమాలు. ఆమె జీవితంలోని చివరి దశకంలో ఆమె రంగస్థలానికి అంకితమయ్యారు. మరాఠీ, గుజరాతీ నాటకాలలో నటిస్తూ, పాటలు పాడారు. ఆచార్య ఆత్రే గారి ‘లగ్నాచీ బేడీ’ నాటకంలో ఆధునిక యువతిగా నటించారు. ‘మానాపమాన్’, ‘సౌభద్ర’, ‘ఏకాచ్ ప్యాలా’ వంటి నాటకాలలో నటించారు. రంగస్థలం మీద పాత పాటలను కొత్త శైలిలో పాడడం ద్వారా ఆమె వివాదాన్ని సృష్టించారు. అలాంటి ఒక ప్రదర్శనలో, ఆమె తరచూ ‘ఆలాప్’లను మార్చడంతో విసిగిపోయిన వాయిద్యకారులు అక్కడ్నించి వెళ్ళిపోయారట. కానీ ఆమె పట్టుదలతో, ఎటువంటి వాయిద్యాలు లేకుండానే చివరి అంకం వరకు నడిపించారట.

ఆమె మద్యం అలవాటు, లెక్కజేయనితనం వల్ల, ఆమెకి అవకాశాలు క్షీణించాయి. దాంతో మద్యానికి బానిస అయ్యారు. పెద్దన్నయ్య పెళ్ళి చేసుకుని, ఆమెని పట్టించుకోకపోవడంతో, ఆమె దుఃఖం మరింత పెరిగింది. ఓ పుస్తకం రాసిన తొలి నటి బహుశా ఈమె కావచ్చు. Jau Mi Cinemat (Should I Join the Movies) పుస్తకం యువ ఔత్సాహికులకు ఒక హెచ్చరిక లాంటిది, మార్గదర్శని లాంటిది.

ఆమె మరణానికి కొన్నేళ్ళ ముందు ఎస్. ముఖర్జీ – దిలీప్ కుమార్ హీరోగా ఫిల్మాలయా వారి తొలి సినిమాలో శాంతాని నటింపజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ సినిమా మొదలుకాలేదు. ఒక పరిపక్వ పాత్రలో శాంతా ఆప్టేని చూసే అవకాశాన్ని కోల్పోయాం. ఆమె జీవితంలోని చివరి మూడు/నాలుగేళ్ళు ఆమెకు పని లేదు. విషాదంగా గడిచాయి రోజులు. కుటుంబం ఆమెకి దూరమవటంతో, ఆమె ఒంటరిగానే జీవించారు. జబ్బు చేసిన ఆరు నెలలకు, 24 ఫిబ్రవరి 1964 నాడు గుండెపోటుతో మరణించారు. అప్పటికి ఆమెకి 46 ఏళ్ళు. ఆమె అన్నయ్య బాబూరావ్ మరో ఏడాదికి కన్నుమూశారు.

ఆమె మరణించిన పదేళ్ళకి 1974లో మరో సంచలం రేగింది. ఒక మరాఠీ పత్రిక దీపావళి సంచికలో, రంగస్థలి నటి ‘నయన ఆప్టే’ తాను శాంతా ఆప్టే కూతురునని ప్రకటించారు. అప్పటి వరకు శాంతా ఆప్టేకు పెళ్ళయిందని గానీ, కూతురు ఉందన్న సంగతి గాని ఎవరికీ తెలియదు.

“1946-47 మధ్య శాంతా ఆప్టే సినిమాలు ఆపేసిన కాలంలో, ఆమె శ్రీమతి శాంతా ఆప్టే అయ్యారు. ఆమె భర్త ఓ గొప్ప భూస్వామి, ఆమె బంధువర్గంలో వారే. ఆయన ఇంటిపేరు కూడా ఆప్టేనే. ఆయన ఆమె లోని నటిని గుర్తించలేదు. పెళ్ళయ్యాక నటించాలన్న ఆమె కోరికని ఆయన అంగీకరించలేదు. ఆయనని ఎలాగైనా ఒప్పించగలనని శాంత భావించారు. కానీ విఫలమయ్యారు. అది బహుశా ఆప్టేల స్వభావమేమో! పెళ్ళయిన మూడు నెలలకే శాంతా బాయి భర్త నుంచి విడిపోయారు. అప్పటికే ఆమె గర్భవతి. నేను అంధేరీలో జన్మించాను. నా పేరు నయన అని పెట్టారు” అని వ్రాశారు నయనా ఆప్టే. తాను తన తండ్రిని చూడలేదని చెప్పారు.

~

‘దునియా నా మానే’ చిత్రంలో శాంతా ఆప్టే ఇంగ్లీషు పాట:

https://www.youtube.com/watch?v=2wqhfKNMPTs

తమిళ సినిమా ‘సావిత్రి’లో పాట:

https://www.youtube.com/watch?v=fk7weIP6ddo

‘అమర్ జ్యోతి’ సినిమాలో పాట:

https://www.youtube.com/watch?v=b_6NQ7GyTqs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here