అలనాటి అపురూపాలు-91

2
9

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తెర మీద గయ్యాళి – తెర వెనుక చల్లనితల్లి సూర్యకాంతం:

సూర్యకాంతం (అక్టోబర్ 28, 1924 – డిసెంబర్ 17, 1996) – తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు. ఆమె తండ్రి పొన్నాడ అనంత రామయ్య తూర్పు గోదావరి జిల్లా లోని ఉండూరు గ్రామం కరణం. తల్లి వెంకటరత్నమ్మది కోటిపల్లి కోట. అయితే సూర్యకాంతం కృష్ణరాయవరంలో తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. కానీ, ఆమె, మరో ముగ్గురు తోబుట్టువులు మాత్రమే బ్రతికారు. చిన్నప్పుడు చలాకీగా ఉండడంతో బాగా గారం చేశారు. తనని ఎవరైనా పలకరిస్తే, నవ్వుతూ వారి వెంట వెళ్ళిపోయేవారట. మగపిల్లాడి దుస్తులు వేసుకుని, చేతిలో బెత్తం పట్టుకుని వీధుల్లో హుందాగా నడుస్తూ కర్ర పెత్తనం చేసేవారుట. ఆరేళ్ళ వయసులో నాట్యం చేయడం, పాటలు పాడడం నేర్చుకున్నారట. “సూర్యం అటు వెళ్ళకు, అక్కడ బూచి ఉంది” అని అంటే, “బూచీ లేదీ ఏమీ లేదు పో పో” అని ఎడమ చేయి ఆడిస్తూ చెప్తే, అందరూ నవ్వేవారట. అందరూ ఆమెను సూర్యం అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఆమె తండ్రి దైవభీతి కలవారు, అధర్మానికెన్నడూ పాల్పడని వ్యక్తి. తన ముందు చేయి చాచిన వారికి ఏదో ఒకటి ఇచ్చి గాని పంపేవారు కాదు. ఆయన భార్యది కూడా అదే స్వభావం. పిల్లలకి ఏమీ దాచడం లేదని భర్తని ఏమీ అనేవారు కాదామె. పెద్ద పిల్లలను చదువుల కోసం కాకినాడ పంపారు. ఇక్కడ సూర్యం ఒక్కో బడిలో ఒక్కో తరగతి చదివారు. ఎవరూ ఏమనేవారు కాదు. ఈ రకంగా ఆమె మూడవ ఫారం వరకూ చదివారు.

ఒకసారి చుండూరు చంద్రమ్మ అనే ఉపాధ్యాయిని సూర్యకాంతం ఇంటికి వచ్చి పండ్లు, మిఠాయిలు తెచ్చి ఇచ్చారట… ఈ ఆశతోనైనా సూర్యం బడికి వస్తుందని! “ఈసారికి ఇవి కానియ్యి, మళ్ళీసారి అటుకులు తేవాలి” అని అందట చిన్నారి సూర్యం ఆ ఉపాధ్యాయినితో. ఈ సంగతి సూర్యం అక్కకి తెలిసి, “నీ  మొహానికి గురు భక్తి బుర్రు మంటుంది. చదువు లేదు కాని పళ్ళు, అటుకులు కావల్సివచ్చిందా?” అని కోప్పడ్డారుట. కొంతకాలానికి సూర్యం తోబుట్టువులందరికీ పెళ్ళిళ్ళు అయి, వాళ్ళ జీవితాలలో స్థిరపడ్డారు.

సూర్యకాంతానికి ఎనిమిదేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. తల్లీకూతుర్లిద్దరూ ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు. సూర్యం చిన్నప్పటి నుండి చలాకీ పిల్ల అని అమ్మకి తెలుసు. తన ప్రతిభ అడవి గాచిన వెన్నెల వలె వృథా అవకూడదని అనుకున్నారు. ఆ రోజుల్లో కాకినాడలో నాటకాలు విస్తృతంగా ప్రదర్శితమయ్యేవి. అందరూ అమ్మాయిలే ఉన్న ఒక డ్రామా కంపెనీని బాలాంత్రపు ప్రభాకారరావు నిర్వహించేవారు. తమ నాటకాలకు ఆయన హార్మోనియం వాయించేవారు. ఈ డ్రామా కంపెనీ గురించి సూర్యంకి తెలుసు, నాటకాలలో నటించాలనే ఆసక్తీ తనకి ఉండేది. కానీ తనంతట తానుగా వెళ్ళి వాళ్ళని అవకాశాలు అడగలేదు. ఒకరోజు రాజేశ్వరి అనే అమ్మాయి చివరి నిమిషంలో రాలేకపోయింది. ఆమె అందుబాటులో లేకపోతే నాటకం ఆగిపోతుంది. ఆ సమయం వారికి చలాకీగా ఉండే సూర్యం పేరు స్ఫురించింది. సూర్యం అమ్మగారిని సంప్రదించి, కూతురు నాటకాలలో నటించేందుకు ఆమె అనుమతి పొందారు.

సతీ సక్కుబాయి నాటకంలో కాశీపతి అనే మగపిల్లాడి వేషం వేశారు సూర్యం. ఆమెకి రంగస్థలం అంటే భయం లేదు. కానీ ఆరోజు 104 డిగ్రీల జ్వరం. అయినా ధైర్యంగా తన పాత్ర పోషించి, పెద్దల ఆశీర్వాదాలు పొందారు. అదీ సూర్యకాంతమంటే!

అందరూ అమ్మాయిలే ఉన్న ఈ హనుమాన్ డ్రామా కంపెనీలో – ఆ విగ్రహం, నడక, టెక్కు, చూపు, రుపు, హుందా – ఇవన్నీ పలు నాటకాలలో ఆవిడకి మగ వేషాలు సాధించిపెట్టాయి. ఒకరోజు ఓ నాటకంలో సూర్యకాంతం తన కమండంలో నీరు తెచ్చుకోవాలి. ఆరోజు మరిచిపోయారు. “బ్రాహ్మణోత్తమా, జలమేది?” అని ఆమెని ప్రశ్నిస్తే, సూర్యం రెప్పవాల్చకుండా, “దేవతలు పూలవాన కురిపిస్తారు” అని తన డైలాగ్ చెప్పేసారట. అప్పుడు వెంటనే వేదిక మీద పూలవర్షం కురిసిందట. ఈ సంఘటనని ఆమె తన జీవితంలో మరచిపోలేదు. జీవితం చివరిదశలో కూడా ఆ సంఘటనని తలచుకుని, సినిమా రంగంలో గొప్ప కెరీర్ ఉంటుందని బహుశా దేవతలే పూల వాన కురింపించారేమో అని అన్నారు. ఆరోజు ఆ ఘటన ఎలా జరిగిందనేదానికి మరో వివరణ లేనే లేదు.

ధ్యానం, ధ్యాస, శ్రద్ధ, పట్టుదల ఆమెని ఏకసంథాగ్రాహిగా చేశాయి. ఎం. వెంకట్రామయ్య చోడవరానికి చెందిన న్యాయవాది. నాటకాలలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న ఈ బాలనటి గురించి విని, సూర్యం వద్దకు వచ్చి, తాను రాసిన ఓ పద్యాన్ని చదివి వినిపించారట. “అమ్మాయ్, ఈ పద్యాన్ని నాకు చదివి వినిపిస్తావా?” అని అడిగారట. అదొక హాస్యరసమైన పద్యం. ఆ పద్యాన్ని మరో రెండు సార్లు విని, ఆయన ఎలా చదివారో అలాగే అప్పజెప్పారట సూర్యం. ఆయన ఎంతో సంతోషపడి, సూర్యాన్ని ఆశీర్వదించి వెళ్ళారుట. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించాకా, ఆయన మళ్ళీ వస్తారేమోనని చూశారట, కానీ ఆయన రాలేదు. ఆయన దీవెనలతో తనకెంతో కీర్తి ప్రతిష్ఠలు లభించాయని ఆమె భావించారు.

ఒకసారి తోటి నటులొకరు, “ఎప్పుడైనా ముక్కు పొడుం పీల్చావా?” అని అడిగారుట. ఆమె లేదన్నారట. అప్పుడా వ్యక్తి ముక్కు పొడుం అందించారు. ఆమె పీల్చారు. ఆమె ఎంత సహజంగా పీల్చారంటే ఏ మాత్రం దగ్గు రాలేదు, ఊపిరాడకపోవడం జరగలేదు. పొడుంని ఒక చేతి నుంచి మరో చేతిలోని మార్చుకుని, పీల్చాకా, మిగిలిన దాన్ని కిందపడేశారట. అదే సమయంలో తన అంగవస్త్రాన్ని తీసుకుని ముక్కు తుడుచుకున్నారట. ఇదంతా ఎంత సహజంగా జరిగిపోయిందంటే, కాకినాడ పెద్దలు దీన్ని ఎన్నో ఏళ్ళ పాటు గుర్తుంచుకున్నారట.

ఈ హనుమాన్ డ్రామా కంపెనీ వారు నాటకాలు వేయడానికి వేరే ఊర్లకి కూడా వెళ్ళేవారు. కానీ సూర్యం మాత్రం కాకినాడలో ప్రదర్శించే నాటకాల్లోనే పాల్గొనేవారు. ఆ రోజుల్లో వైఎంసిఎలో తన నటనకీ, నృత్యాలకి నటి అంజలికి ఎంతో పేరు వచ్చింది. సూర్యం ఆ కార్యక్రమాలకి వెళ్ళి స్వయంగా వీక్షించేవారు. కేవలం కాకినాడలోనే నటిస్తానంటే ఎలా? ఒక రోజు, తాను సినిమాల్లో చేరవచ్చా అని నెమ్మదిగా అమ్మని అడిగారు. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్ళు. మగ పాత్రలకి నప్పని వయసు. పైగా అందంగా, హుందాగా కనిపించేవారు. ఎవరినీ సంప్రదించకుండానే, వాళ్ళ అమ్మ “నీ ఇష్టమే తల్లీ” అన్నారుట. ఈ విధంగా తల్లీకూతుళ్ళిద్దరూ 1944లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసు చేరారు.

వేషాల కోసం వెతుకుతుండంగా, సూర్యానికి సుశీల అనే యువతి పరిచయమైంది. తను చంద్రలేఖ సినిమాలో ఒక గ్రూప్ డాన్సర్‌గా జెమినీ స్టూడియో కోసం పని చేస్తోంది. దరఖాస్తు చేసుకోమని ఆమె సూర్యానికి చెబితే, తాను ఎవరినీ అలా వేషాలు అడగలేనని తిరస్కరించారు. వాళ్ళిద్దరూ స్టూడియో గేట్ ముందు మాట్లాడుకుంటున్నారు. ఓ మేనేజర్ అటుగా వెళ్తూ, వాళ్ళని చూసి, గ్రూప్ డాన్సర్‍గా పని చేయడానికి సూర్యానికి ఇష్టమేనా అని అడిగి, నెలకి 60/- రూపాయలిస్తామని చెప్పారు. ఆ మాత్రం తనకి కాకినాడలో కూడా వస్తాయని, వద్దన్నారట సూర్యం. చివరికి మరో పది రూపాయలు ఎక్కువ జీతంతో అక్కడ పని చేయడానికి ఒప్పుకున్నారు. రోజూ తన నేస్తంతో కలిసి స్టూడియోకి, వెళ్ళేవారు. రిహార్సల్స్‌లో వీళ్ళ వంతు పది నిమిషాలే అయినా, అక్కడే రోజంతా ఉండాల్సి వచ్చేది. ఆకలి వేసినప్పుడల్లా అక్కడి కేంటిన్‌లో తినేవారు. ఆ కేంటిన్‍లో వీళ్ళకి మొదట్లో అరువిచ్చి, నెలాఖరులో డబ్బులు తీసుకునేవారు. ఈ కోతలన్నీ పోనూ సూర్యం దగ్గర నెలకి పన్నెండు రూపాయలే మిగిలేవి. వాటినే అమ్మకిచ్చేవారు. ఇలా నాలుగు నెలలు గడిచాయి. సంగీతానికి కాళ్ళు కదపడం తప్ప వాళ్ళు అక్కడ చేసిందేమీ లేదు. వాళ్ళకి విసుగెత్తి, అక్కడ నుంచి వచ్చేసారు.

ఆ రోజుల్లో పసుపులేటి కమల (కన్నాంబ కాదు) అనే ఓ నేపథ్య గాయని ఉండేవారు. ఆవిడతో సూర్యానికి స్నేహం కలిసింది. ఆవిడ పి. పుల్లయ్య దర్శకత్వం వహిస్తున్న ‘నారద-నారది’ సినిమాకి పాడుతున్నారు. ఆమెతో కలిసి సూర్యం షూటింగ్‌కి వెళ్ళారు. అక్కడ ఆమెను పుల్లయ్య, తాపీ ధర్మారావు చూశారు. తమ సినిమాలో ఎక్స్‌ట్రాగా ఒక చిన్న పాత్రలో నటించమని అడిగారు. “చిప్ప కర్ర పట్టుకునే వేషాలు నేను చస్తే చేయను” అని బుల్లెట్‍గా జవాబిచ్చారట సూర్యం. తాపీ ధర్మారావు ఆమెను శాంతపరిచి “తల్లీ, చిన్న పాత్రలు చేశాకే పెద్దవి వస్తాయి” అని చెప్పి, సినిమాల్లో పైకొస్తావు అని దీవించారు. ఆమె జీతం నెలకి 75/- రూపాయలుగా నిర్ణయించారు. నారదుడిగా నటిస్తున్న సూరిబాబు ఆమె ప్రతిభను గ్రహించి, ఏదో ఒకరోజు సినీ పరిశ్రమలో గొప్పవారవుతారని తాపీ ధర్మారావుతో అన్నారట.

‘గృహప్రవేశం’ చిత్రంలోనూ, భరణి వారి ‘రత్నమాల’ లోను ఆమెకు చిన్న పాత్రలు లభించాయి. ఆమె జీతం నెలకు 150/- రూపాయలకి పెరిగింది. ఆ తరువాత ఆమెకి ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. ముఖంపై గాయాలయ్యాయి. బెడ్ రెస్ట్ కారణంగా కాస్త బొద్దుగా తయారయ్యారు. హీరోయిన్ పాత్రలపై ఆశలు వదిలేసుకున్నారు. కోలుకున్నాకా, ‘ధర్మాంగద’ చిత్రంలో, మూగ, కుంటి అమ్మాయి పాత్ర లభించించి. డైలాగులు లేకపోవడంతో, అన్నింటినీ ముఖకవళికల ద్వారానే వ్యక్తం చేసె పాత్ర అది. తమ బడిలో చదివిన ఓ బధిర విద్యార్థినిని గుర్తు చేసుకుని, ఆ పాత్ర పోషించేందుకు అంగీకరించారు. ఆ పాత్రలో రాణించి ప్రశంసలు పొందారు. ఒక సన్నివేశంలో ఆమె పాముని పట్టుకోవాల్సి ఉంటుంది. పాముని పట్టుకోవాల్సి ఉంటుందని తెలిస్తే, ఈ సినిమా ఒప్పుకునేదాన్నే కాదు అన్నారుట. అప్పుడు దర్శకుడు “గోదావరి జిల్లాల వాళ్ళు ధైర్యవంతులని విన్నానే” అని ఏడిపించారట. దాంతో ఆమె పాముని పట్టుకుని ఆ సీన్‍ని పూర్తి చేశారట.

తరువాత నెలవారీ జీతాల పద్ధతి పోయి, కాంట్రాక్టుల పద్ధతి వచ్చింది. ‘సంసారం’ (1950) చిత్రంలో ఆమెకు ముఖ్యమైన పాత్ర దొరికింది. ఆ సినిమాకి ఆమెకు 750/- రూపాయల పారితోషికం లభించింది. అదే ఏడాది ఆమె వివాహం హైకోర్టు న్యాయమూర్తి అయిన పెద్దిభొట్ల చలపతి రావు గారితో జరిగింది. పెళ్ళి తరువాత సహయ పాత్రలకి, కాలక్రమంలో అత్తగారి పాత్రలకీ మళ్ళారు. తెరమీద ఆమె గయ్యాళి కావచ్చు, కాని నిజజీవితంలో చల్లనితల్లి. షూటింగుల సమయంలో తన ఇంట్లో వండించి తెచ్చే పదార్థాలకి ఆవిడ ఎంతో ప్రసిద్ధి చెందారు. ఎందరెందరో ఆమె వెంటే తిరిగేవారు.

తరువాతి కాలంలో సూర్యకాంతం పాత కార్లను కొని, రీమోడల్ చేయించి స్వల్ప లాభాలకి అమ్మేవారు. సినిమాలకి ఫైనాన్స్ అందించారు. ఛాయాదేవికి కూడా ఇవి నేర్పారు.

ఆవిడ అత్యంత ప్రతిభాశాలి, విశిష్ట నటి. ఆవిడ మరణం తర్వాత, అంతటి సహజత్వం కల నటి తెలుగు సినీ పరిశ్రమలో జన్మించలేదని అంటారు. దశాబ్దాల పాటు ఆమె ఎన్నో గయ్యాళిగంప పాత్రలు పోషించి, ప్రేక్షకులపై ఎలాంటి ముద్ర వేశారంటే – తెలుగు నాట ఎవ్వరూ తమ పిల్లలకి ‘సూర్యకాంతం’ అనే పేరు పెట్టడానికి కూడా ఇష్టపడనంత! ఆ పేరు పెడితే ఆమె లాగే వేధించే అత్తగారు గానో, లేదా గొడవలు పడే భార్యగానో మారిపోతారేమని భయం!

నిజానికి ‘సూర్యకాంతం’ అంటే కంటికి కనబడే దేవుడు – సూర్యుడి కాంతి అని అర్థం. ఆ పేరు ఓ అందమైన పుష్పానిది కూడా. అయినా తెర మీద క్రూరమైన మహిళ పాత్రలు పోషించిన ఆమె పేరును తమ పిల్లలకి పెట్టేందుకు తెలుగు కుటుంబాలు విముఖత చూపాయి. సమాజంపై సినిమాల, నటీనటుల ప్రభావం ఇది. సూర్యకాంతం సినిమాల్లో నటించటంతో పాటుగా సెకండ్ హాండ్ కార్లను అమ్మేది. ఈ వ్యాపారాన్ని ఛాయాదేవికి కూడా నేర్పింది. కానీ చివరి దశలో నమ్మినవాళ్ళే మోసం చేయటంతో చాలా నష్టపోయింది. ఈ మానసికవేదన కూడా ఆమె మరణానికి ఒక కారణం అంటారు.

సూర్యకాంతం చనిపోయినప్పుడు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవరూ అంత్యక్రియలకి వెళ్ళలేదు. ఆమెకు సంతానం లేదు.  సినిమాల్లో గయ్యళి వేషాల్లో అందరినీ అలరించిన సూర్యకంతం నిజ జీవితంలో మోసపోయి షాక్ కు గురయి మరణించటం మరువలేని విషాదం. … విచారకరం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here