అలనాటి అపురూపాలు-95

0
6

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ఆకాశహార్మ్యాల నిర్మాత బి.ఎన్.రెడ్డి:

వాస్తుశిల్పిగా పేరెన్నిక గల శ్రీ బి.ఎన్.రెడ్డి గారి అసలు పేరు బద్దం నరసింహారెడ్డి. హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని వారి గృహం – స్టూడియో కాని స్టూడియో అంటే ఆశ్చర్యం లేదు.

డా. బి.ఎన్. రెడ్డి హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ అకడమిక్ సెనెట్ సభ్యులు. అలాగే డా. ఎంజెఆర్ యూనివర్శిటీ, మద్రాసు సెనెట్ సభ్యులు. ఎన్నో ఆకాశహార్మ్యాల నిర్మాత ఆయన. ఎన్.టి.రామారావు గారి కోసం ఆయన రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఎన్నో కళ్యాణ మండపాలు, కాటేజీలు నిర్మించారు. ఇంకా ఎన్నో వాణిజ్య భవనాలు, సినిమా థియేటర్లకు రూపకల్పన చేశారు. ఆయన స్వంత ఇంట్లో ‘జ్యోతి’, ‘సెక్రటరీ’, ‘ప్రేమ లేఖలు’ వంటి సినిమాల షూటింగ్ జరిగింది. ఆయన ‘పెళ్ళి కాని పెళ్ళి’ అనే సినిమాకి కథ వ్రాసి, దర్శకనిర్మాతగా వ్యవహరించారు.

హైదరాబాదులో పలు నిర్మాణాలతో తీరిక లేకుండా ఉన్న కాలంలో ఆయన ఇక్కడ స్వంతిల్లు కట్టుకున్నారు. అప్పుడే ఆయనను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఆర్కిటెక్ట్‌గా నియమించుకుంది. సుప్రసిద్ధ సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్‍కి ఆయన వైస్-ఛైర్మన్‍గా వ్యవహరించారు.

బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ సంస్కృతికి ఆయన బీజం వేశారు. ఆయన తన నిర్మాణాలలో వాస్తు శాస్త్రాన్ని మేళవించేవారు. నగరంలోని శాంతి శిఖర, కాంతి శిఖర రెసిడెన్షియల్ కాంప్లెక్సులకు రూపకర్త.

ఆయన జనత ప్లాట్ కల్చర్ ప్రవేశపెట్టారు. నగరంలోని కొన్ని కాలనీలకు ఆయన పేరిట బి.ఎన్.రెడ్డి నగర్ అని పేరు పెట్టారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను వాస్తుశిల్పిగా ప్రకటించింది.

 

ఒకప్పటి మిర్యాలగుడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన 1989, 1996, ఇంకా 1998 లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆయన ఓ కవి. ఆయన కవితలు – ‘బి.ఎన్. భస్టితలు’, ‘సామాన్యుని సందేశం’, ‘బి.ఎన్. భావ తరంగిణి’ – అనే పుస్తకాలుగా వెలువడ్డాయి. ‘గ్లింప్స్ ఆఫ్ ప్రాక్టికల్ వాస్తు’ అనే ఆంగ్ల గ్రంథం రచించారు. సంస్కృతీ-సాహిత్య రంగాలలో ప్రసిద్ధులు.

వృత్తిపరమైన సేవలకు గాను ఆయనకు ఉద్యోగ రత్న అవార్డు, భారత రత్న రాజీవ్ గాంధీ అవార్డు 2015లో లభించాయి.

కుమారుడి బలవన్మరణం:

బి.ఎన్.రెడ్డి గారి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి (56), 2015లో తన లైసెన్స్‌డ్ రివాల్వర్‍తో తనని తాను కాల్చుకుని మృతి చెందారు. చంద్రశేఖర్ అమెరికాలో ఆర్కిటెక్చర్ చదివారు. నిర్మాణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించారు. ఈక్రింది ఫొటోలోని గృహంలో మృతి చెందారు. గతంలో ఇదే ఇంట్లో ఆయన తల్లి కూడా మరణించారు.

చంద్రశేఖర్ కాల్చుకున్న మరుక్షణమే మృతి చెందారు, కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకపోయింది.

ఆర్కిటెక్ట్ అయిన చంద్రశేఖర్ గతకొద్ది కాలంగా ఆరోగ్య సమస్యల వల్ల డిప్రెషన్‍తో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం ఏ వివరాలు వెల్లడించలేదు.

ఆయన భార్య, అత్తగారు బయటకు వెళ్ళినప్పుడు, సుమారు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆయన మావగారు, రిటైర్డ్ ఐజి శ్రీకాంత్ రెడ్డి గారు, అదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‍లో ఉన్నారు.

“చంద్రశేఖర్ మొదటి అంతస్తులో ఉన్నారు, తన గదికి లోపల్నించి గడియ పెట్టుకున్నారు. కణత మీద కాల్చుకోగా, తలకి మరో వైపు నుంచి బుల్లెట్ బయటకు వచ్చింది” అని బంజారా హిల్స్ ఎసిపి డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఆయన మావగారికి తుపాకీ పేలిన శబ్దం వినిపించినా, ఆయన పైకి వెళ్ళి చూడలేకపోయారు. “శ్రీకాంత్ రెడ్ది గారి వయసు 80 ఏళ్ళ పై మాటే. ఘటన జరిగిన వెంటనే పైకి వెళ్ళి చూడలేకపోయారు. అరగంట తర్వాత చంద్రశేఖర్ భార్య, అత్తగారు ఇంటికొచ్చారు, ఆయన గది లోపల్నించి గడియ వేసి ఉండడం గమనించారు. బలవంతంగా తలుపు తీసే చూస్తే, ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు” వివరించారో పోలీస్ అధికారి.

పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బంధువు ఒకరు చెప్పిన సమాచారం ప్రకారం చంద్రశేఖర్ రెడ్డి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. “అదే వ్యాధితో ఆ మధ్య వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఎన్నో నెలలుగా అనారోగ్యంగా ఉండడం వల్ల అతను డిప్రెషన్‍కి లోనయ్యాడు” చెప్పారా బంధువు.

కుమారుడి మరణం తర్వాత, అప్పటికే కాన్సర్‌తో బాధపడుతున్న బి.ఎన్.రెడ్డి మరింత క్రుంగిపోయారు. 2017లో మరణించారు.

***

ఆయన గృహంలో చిత్రీకరించిన ‘జ్యోతి’ సినిమాలోని పాటని చూడండి:

https://www.youtube.com/watch?v=_MbCoSrqhbg

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here