అలనాటి అపురూపాలు-98

0
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తెరపై హాస్యం – తెర వెనుక విషాదం – మెహమూద్:

కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఎందరినో తన హాస్యంతో నవ్వించిన నటుడు మెహమూద్.

మెహమూద్ సినిమాలంటే సరదాగా, ఉల్లాసంగా, నాటకీయంగా, నాట్యాలతో, గొప్ప సంగీతంతో ఉంటాయని ప్రేక్షకులు భావించేవారు. నాట్యం ఆయనకు నటనతో పాటు సహజంగా అబ్బింది. ఆయన తండ్రి ముంతాజ్ అలీ, 1940లలో గొప్ప నటుడు, డాన్సర్. మెహమూద్‍కి ఏదైనా ఇవ్వండి, ఆయన తాను మాత్రమే చేయగలిగేదానిలో మార్చి ఇస్తారు. ఉదాహరణకి 1965 నాటి ‘గుమ్‍నామ్’ చిత్రంలోని ‘హమ్ కాలే హైఁ’ అనే పాటపై మెహమూద్ ముద్రని స్పష్టంగా చూడవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే, –  సినిమాలు ఆయన జీవితంలో రాసి పెట్టి ఉన్నాయి. అశోక్‍ కుమార్ నటించిన ‘కిస్మత్’ (1943) చిత్రంలో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు మెహమూద్. అయితే ఈ బాలనటుడిలోని ప్రతిభని గుర్తించి మంచి అవకాశాలిచ్చింది మాత్రం గురు దత్ గారే. అందుకే మెహమూద్ ఇంట్లో గురు దత్ చిత్రపటం పెద్దది ఒకటి ఉంటుంది.

మెహమూద్ హాస్యంలో తనకంటూ ఒక శైలిని ఏర్పర్చుకున్నారు. కెరీర్ ఉచ్చదశలో ఉండగా, ఆయన హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకునేవారు. భారీగా ఆదాయం ఉండడంతో, ఆయన విలాసవంతమైన జీవితం గడిపేవారు. తన గుర్రాలను ఉంచడానికే ఒక పెద్ద ఫార్మ్ కొన్నారు. అసలా వైభవం ఆయన రక్తంలోనే ఉందనుకుంటా… వారి తండ్రి గారు తమిళనాడులోని ఆర్కాటు నవాబుల యువరాజు. సినిమాల్లో నటించేందుకు ఇంట్లోకి బొంబాయికి పారిపోయి వచ్చేశారు. ‘షెహనాయి’ (1947) చిత్రంలో ‘ఆనా మేరీ జాన్ మేరీ జాన్ సండే కే అండే’ అనే సుప్రసిద్ధమైన పాట ఈయనదే.

తన జీవన శైలి లోనూ, దయాగుణంలోనూ మెహమూద్ రాజులా జీవించారు. 150 మంది ఉన్న పెద్ద కుటుంబానికి అండగా ఉండేవారు. ఆయనకి కార్లంటే బాగా ఇష్టం. ఒక దశలో ఆయన వద్ద స్టింగ్‌రే, డాడ్జ్, ఇంపాలా, ఎంజి, జాగ్వార్ వంటి 24 కార్లు ఉండేవి. అప్పట్లో ఆయన స్నేహితుడైన అమితాబ్ బచ్చన్ – తన మిత్రురాళ్లని ఆకట్టుకునేందుకు – మెహమూద్ కార్లు తీసుకువెళ్ళేవారట.

మెహమూద్ తొలి రోజుల్లో అలనాటి బాలీవుడ్ తారలను సరదాగా అనుకరించేవారు. భారతీయ సినిమాతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. తమ తండ్రి ముంతాజ్ ఆలీ ద్వారా మెహమూద్, ఆయన తోబుట్టువులు భారతీయ సినిమా, కళలు, సంగీతంతో – చిన్ననాటి నుండే సంబంధం ఏర్పర్చుకున్నారు. అయితే మహమూద్‍కి సినీరంగ ప్రవేశం అంత తేలికగా జరగలేదు. తొలుత పౌల్ట్రీ రంగంలో సేల్స్‌మన్‍గా పని చేశారు, ఇంకా చిన్నా చితక పనులు చేశారు. ఎదుగుతున్న రోజుల్లో ప్రముఖ నిర్మాత శ్రీ పి.ఎల్. సంతోషి గారికి డ్రైవరుగా కూడా పని చేశారు. అలా పని చేయడం వల్ల చిత్రసీమ లోపలి వ్యవహారాలను అంచనా వేయగలిగారు. పరిశ్రమలో నిలదొక్కుకున్న దశాబ్దాల తరువాత, పి.ఎల్. సంతోషి గారి అబ్బాయి రాజ్ కుమార్ సంతోషి తన సినిమా ‘అందాజ్ అప్నా అప్నా’ (1994)లో మెహమూద్‍ని నటింపజేశారు.

బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తొలి సినిమా, అలనాటి మెగాస్టార్ అశోక్‍ కుమార్ హీరోగా నటించిన ‘కిస్మత్’ (1943). ఈ చిత్రంలో మెహమూద్ చిన్నప్పటి అశోక్ కుమార్ పాత్ర పోషించారు. తర్వాత సరిగ్గా దశాబ్దానికి 1953లో మెహమూద్ బిమల్ రాయ్ తీసిన ‘దో బీఘా జమీన్’ చిత్రంలో పూర్తి నిడివి పాత్ర పోషించారు. అయితే ఆ పదేళ్ళలో ఈయన్ ‘సన్యాసి’ (1945), ‘నాదాన్’ (1951) అనే చిత్రాలలో బాలనటుడిగా నటించారు.

‘నాదాన్’ సినిమా చిత్రీకరణ సందర్భంగా – ఒక సన్నివేశంలో దిగ్గజ నటి మధుబాల సమక్షంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ పెద్ద డైలాగ్ చెప్పాల్సి ఉంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను సరిగా చెప్పలేకపోయాడు. అప్పుడు మెహమూద్ ఫ్రేమ్ లోకి వచ్చి ఆ పెద్ద డైలాగ్‍ని ఎలాంటి భయమూ, తడబాటు లేకుండా సింగిల్ టేక్‍లో చెప్పేశారట. ఈ చిన్న సన్నివేశం – మెహమూద్ సామర్థ్యాన్ని అలనాటి దిగ్గజ నటులు – మధుబాల, దేవ్ ఆనంద్, మదన్ పురి, హీరా సింగ్, ఇంకా ఆ రోజు చిత్రీకరణలో ఉన్న ఎందరో నటీనటులకు తెలియజేసింది. ఈ సినిమాకి గాను మెహమూద్ గారికి 300 రూపాయల పారితోషికం లభించింది.

ఫుట్టన్, చుట్టన్ – అనే రెండు పాత్రలు పోషించిన ఆయన చిత్రం ‘దో ఫూల్’ బాగా విజయవంతమైంది. దాంతో ఎందరో నటులు ఆయనతో తెరని పంచుకోవాలనుకునేవారు. అందుకే అప్పటి సినిమాల్లో కథానాయకుల కన్నా మెహమూద్‍కి అధిక పారితోషికం లభించేది. 14 రోజుల షూటింగ్‌కి మెహమూద్‍కి దాదాపు ఏడున్నర లక్షల రూపాయలు ముట్టేవి.

సినీపరిశ్రమలో నిలదొక్కుకోక ముందు మెహమూద్ దిగ్గజ నటి మీనా కుమారికి టెన్నిస్ కోచ్‍గా వ్యవహరించారు. ఆమెకు మంచి మిత్రుడయ్యారు (మెహమూద్, మీనా కుమారి, గాయకులు ముకేష్, తలత్ మహమూద్‍ల ఫోటో చూడండి).

మీనా కుమారికి టెన్నిస్ నేర్పేందుకు వెళ్ళిన మెహమూద్‍కి ఆమె సోదరి మధు కుమారి పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ 1953లో పెళ్ళి చేసుకున్నారని వార్తలున్నాయి. అయితే ఈ జోడీ 1967లో విడిపోయింది.

మొదటి భార్య, నటి మధు కుమారితో విడిపోయాకా, ఈ ప్రసిద్ధ హాస్యనటులు తన తోటి నటీమణి ట్రేసీతో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ళ పాటు సంతోషకరమైన వైవాహిక జీవితం గడిపాకా, మెహమూద్, ట్రేసీ – అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.

తన రెండు పెళ్ళిళ్ళ ద్వారా మెహమూద్ ఆరుగురు మగపిల్లలు – పకీ అలీ, లక్కీ అలీ, మాకీ అలీ, మాసూమ్ అలీ, మన్సూర్ అలీ – లకి, గిన్నీ అలీ అనే కూతురుకి జన్మనిచ్చారు. వీరు కాక, కిజ్జీ అనే సవతి కూతురు ఉండేది. ఈ పిల్లలందరికి లోకీ, నేడు సుప్రసిద్ధ గాయకుడిగా పేరు తెచ్చుకున్న లక్కీ అలీని పరిచయం చేయనక్కరలేదు.

తొలి రోజుల్లో తనని ఎంతగానో ప్రోత్సహించినందుకు మెహమూద్ గారి పట్ల తనకి ఉన్న కృతజ్ఞతా భావాన్ని, ప్రేమని అమితాబ్ బచ్చన్ తన ఎన్నో ఇంటర్వ్యూలలో వెల్లడించారు.  పాత ఇంటర్వ్యూలలో మెహమూద్ గారిని అమితాబ్ తన ‘గాడ్ ఫాదర్’గా పేర్కొనడం తెలిసినదే. 23 జూలై 2004న మెహమూద్ మరణించినప్పుడు అమితాబ్ ఆయన గురించి తన బ్లాగులో ఇలా గొప్పగా రాసుకున్నారు:

“నటుడిగా నా కెరీర్ నిలదొక్కుకోవడం ఆయన (మెహమూద్) ఎంతో సాయం చేశారు. నా కెరీర్ తొలినాళ్ళల్లో నా ఎదుగుదలకు తోడ్పడినవాళ్ళలో మెహమూద్ భాయ్ ఒకరు. ‘బాంబే టు గోవా’ చిత్రంలో నాకు ప్రధాన పాత్ర ఇచ్చిన నిర్మాత ఆయన. ఎన్నో వరుస ఫ్లాప్‍ల తరువాత, నేను బొంబాయి విడిచి వెళ్లిపోదామనుకున్న సమయంలో, మెహమూద్ గారి సోదరుడే నన్ను ఆపారు.”

యువ అమితాబ్‍ పట్ల మెహమూద్ గారికి విశ్వాసం అమితంగా ఉండేది. రేడియో ప్రసారకర్త అయిన అమీన్ సయోని ఒకసారి ఆయనను గుర్రాల గురించి అడిగారట. అప్పుడు మెహమూద్ – “బాగా వేగంగా పరిగెత్తే గుర్రం అమితాబ్. ఒకసారి వేగం పుంజుకుంటే, అందరూ వెనుకబడిపోతారు” అన్నారట. ఒక రకంగా అమితాబ్ విజయాలను ఆయన ముందుగానే చూడగలిగారు.

అయితే, వారిద్దరి మధ్య ఉన్న అందమైన బంధానికి బీటలు వారాయి. మెహబూబ్ గారికి బైపాస్ సర్జరీ అయిన సమయంలోనే అమితాబ్ తండ్రి హరివంశ్‌ రాయ్ బచ్చన్ అనారోగ్యం పాలయ్యారు. వారిద్దరూ ఒకే ఆసుపత్రిలో ఉన్నారు. అంటే అమితాబ్ సొంత తండ్రి, గాడ్ ఫాదర్ ఒకే ఆసుపత్రిలో ఉన్నారు. అయితే అమితాబ్ ఆ సమయంలో మెహమూద్ గారిని వెళ్ళి చూడలేదట. అమితాబ్ ఈ చర్య తనని ఎంతో బాధించిందని మెహమూద్ ఒక పాత ఇంటర్వ్యూలో వెల్లడించారు.

“అమిత్ నన్నెంతో గౌరవిస్తాడు, కానీ అతని ఈ చర్య నన్ను విస్తుపోయేలా చేసింది. అతని తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు – నేను ఆయనను చూసేందుకు అమితాబ్ ఇంటికి వెళ్ళాను. కానీ నాకు బైపాస్ సర్జరీ జరిగినప్పుడు – తన తండ్రితో కలిసి అదే బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వచ్చిన అమితాబ్ – నన్ను చూసేందుకు రాలేదు. ఎంతైనా సొంత తండ్రి సొంత తండ్రే, నాన్నలాంటి వారు నాన్నలాంటివారే అని అమితాబ్ నిరూపించాడు. నేను ఆసుపత్రిలో ఉన్నానని తెలిసినా కూడా అమిత్ నన్ను కలవలేదు, పలకరించలేదు, గెట్-వెల్-సూన్ కార్డో లేదా కనీసం పూలో కూడా పంపలేదు. అయినా నేను అతన్ని క్షమించాను. అతనికి చెడు జరగాలని నేను కోరుకోలేదు. అతను వేరేవాళ్ళతో ఇలా ప్రవర్తించడని ఆశిస్తున్నాను.”

అత్యంత వినయ నటులలో ఒకరిగా మాత్రమే కాకుండా గొప్ప దయాళువుగా కూడా మెహమూద్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధులు. ఒకరికి సాయం చేసే అవకాశం వస్తే ఆయన అస్సలు వదుకుకునేవారే కాదు. సినిమా సిబ్బందితో సహా, తన తోటి నటీనటులకు ఎటువంటి సాయం కావల్సి వచ్చినా ముందుండేవారు. కెరీర్‍లో ఎదిగే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆయన తండ్రిలా సాయం చేసేవారు. దిగ్గజ గాయకుడు, స్వరకర్త ఆర్.డి. బర్మన్‍ని కూడా ప్రోత్సహించింది మెహమూద్ గారే. మెహమూద్ గారి ‘చోటే నవాబ్’ చిత్రం ద్వారా స్వరకర్తగా ఆర్.డి. బర్మన్ గారికి తొలి హిట్ లభించింది.

అయితే మెహమూద్ వ్యక్తిగత జీవితం విషాదాలతో నిండి ఉండేంది. తన తండ్రి తాగుడికి బానిస కావడం, తన కొడుకు అంగవైకల్యానికి గురవడం మెహమూద్ గారిని బాధించాయి. పైగా అతి పెద్ద కుటుంబాన్ని పోషించాల్సి రావడం ఆర్థికంగా తలకు మించిన భారమైంది. అయినా ఆయన తన తలరాతను విశ్వసించారు. జీవిక కోసం ప్రజలను నవ్విస్తున్నా, తన సొంత జీవితం ఎందుకు ఇంత విషాదంగా ఉందా అని ఆయన తరచూ ప్రశ్నించుకునేవారు.

“క్లోజప్ నుంచి చూస్తే జీవితం ఒక ట్రాజెడీ, లాంగ్-షాట్ నుంచి చూస్తే కామెడీ” అని చాప్లిన్ చెప్పిన మాటలు ఎంతో నిజం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here