అలనాటి అపురూపాలు-99

0
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ముత్యాల ముగ్గు ఫేమ్ శ్రీధర్:

సూరపనేని శ్రీధర్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ, ముత్యాల ముగ్గు శ్రీధర్ అనగానే ఎందరికో గుర్తొచ్చే నటుడాయన.

ఆయన సూరపనేని రామయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు 21 డిసెంబర్ 1938 నాడు జన్మించారు. వారిది గన్నవరం తాలూకా కుమ్మమూరు గ్రామం. ఆయన తల్లిదండ్రులకు రెండవ కుమారుడు. ఆయన బాల్యమంతా స్వేచ్ఛగా, సరదాగా ఏ బాధ్యతలూ లేకుండా గడిచింది. కాలేజీలో చేరినప్పుడు ఆయన కాలేజీ యూనియన్ కార్యకలాపాలలో పాల్గొంటూ బి.ఎ. పూర్తి చేశారు. 1961లో ఆయన హైదరాబాద్‌కి వచ్చి సెక్రటేరియట్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటులో ఉద్యోగంలో చేరారు. ఇక్కడ ఆయనకి ఎందరో మిత్రులయ్యారు. వారి ప్రోత్సాహంతో నాటకాలలోకి ప్రవేశించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వారి నాటకాలు, సెక్రటేరియట్ సాంస్కృతిక కార్యక్రమాల్లోనే కాకుండా – అంతరాష్ట్రీయ పోటీ నాటకాలలోనూ ఆయన నటించారు. 1966లో ఆయన నటించిన ‘ఆంధ్ర శ్రీ’ నాటకానికి ఆంధ్ర ప్రదేశ్ తరఫున బహుమతి లభించింది. ఈ నాటకాన్ని మైసూర్, కేరళ, బెజవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్టణం వంటి ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ నాటకాన్ని చూసిన శ్రీ పడాల రామారావు గారు 1967లో శ్రీధర్‍ని రాజమండ్రి పుర ప్రముఖుల సమక్షంలో సత్కరించారు. శ్రీధర్ శ్రేయోభిలాషి జి.వి. సుబ్బారావు గారు – శ్రీధర్ నవభారత కళానిలయం అనే నాటక సంస్థని స్థాపించేలా ప్రోత్సహించారు. ఈ సంస్థ ప్రదర్శించిన ఎన్నో నాటకాలలో శ్రీధర్ నటించారు. మద్రాసులో ఇంజనీరుగా పని చేస్తున్న ఆయన తమ్ముడు శేషగిరిరావు గారు శ్రీధర్‍ని 1968లో మద్రాసు వచ్చేయమని అడిగారు.

శ్రీధర్ 1969లో ఎన్.టి.ఆర్. ‘తల్లా? పెళ్ళమా?’ సినిమాలో మొదటిసారిగా నటించారు. ఈ సినిమాలో శ్రీధర్ ‘తెలుగు జాతి మనది’ అనే పాటలో విద్యార్థిగా కనిపిస్తారు. ఆ తరువాత ఆయన బి. విఠలాచార్య గారి ‘సిఐడి రాజు’, ఎన్. సాంబశివరావు గారి ‘విజయం మనదే’, పింజల సుబ్బారావు గారి ‘రౌడీలకు రౌడీ’, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి ‘ధర్మదాత’ (బిడిఓ పాత్ర), బిఎ సుబ్బారావు గారి ‘రైతుబిడ్డ’ తదితర సినిమాలలో నటించారు.

కానీ ఆయనకి అద్భుతమైన పేరు తెచ్చిన సినిమాలు – ‘ముత్యాల ముగ్గు’, ‘గోరంత దీపం’, ‘అమెరికా అమ్మాయి’. తనకి వేషాలు ఇమ్మని శ్రీధర్ ఎవరినీ అడిగేవారు కాదు. వచ్చిన సినిమాలలో మాత్రమే నటించేవారు. నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గాయి. శ్రీధర్ అంటే ఎన్.టి.ఆర్.కి అభిమానం కలిగి, ఆ సమయంలో తన సినిమాలలో శ్రీధర్‍కి అవకాశాలిచ్చారు. ‘శ్రీరామ పట్టాభిషేకం’లో గుహుడు వేషం ఇచ్చారు. అలాగే బాగా హిట్ అయిన ‘డ్రైవర్ రాముడు’ చిత్రంలో సెకండ్ హీరో పాత్రనిచ్చారు. ఆ సినిమా హిట్ అయినా శ్రీధర్‍కి హీరో పాత్రలు లభించలేదు.

అడవి రాముడు, జస్టిస్ చౌదరి, ఈనాడు, కరుణామయుడు, బొమ్మరిల్లు, సీతామహలక్ష్మి, యశోదకృష్ణ తదితర సినిమాలలో సహాయక పాత్రలలో నటించారు. కాలక్రమంలో అటువంటి పాత్రలు కూడా తగ్గాయి. కెరీర్ చివరి దశలో ఆయనకు టివి సీరియళ్లలో అనేక అవకాశాలు వచ్చినా, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అని వాటిల్లో నటించడానికి ఇష్టపడలేదు. శోభన్‍బాబుని ఆదర్శంగా తీసుకుని, శ్రీధర్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రవేశించారు. రిటైర్‍మెంట్ అనంతరం శ్రీధర్ తోటపనితో కాలక్షేపం చేశారు. శ్రీధర్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ, గుండెపోటుతో జూలై 11, 2007 న మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.

విజయ వాహిని స్టూడియో – పుట్టు పుర్వోత్తరాలు:

ఎన్నో గొప్ప చలనచిత్రాలను అందించిన విజయ వాహిని స్టూడియో నిర్మాణం వెనుక ఉన్న సంగతులను ఈ రచనలో తెలుసుకుందాం.

~

అవి 1979 రోజులు. సంక్రాంతి పండగ వచ్చిందంటే దాదాపు 4000 మంది ఉద్యోగులు – స్టూడియోలోని పెద్దా, చిన్నా పరికరాలను, యంత్రాలను ఉత్సాహంగా శుభ్రపరుస్తారు. ఆరోజు వారికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి, కొత్త బట్టలు ఇస్తారు.

అది ఒకప్పుడు జనావాసం ఏ మాత్రం లేని ఖాళీ స్థలం, నిజానికి ఆ స్టూడియోని ఒక స్మశానం పక్కనే నిర్మించారు కూడా. అసలు యజమానుల ధైర్యం ఏమిటి? అసలు దాని నిర్మాణం ఎలా జరిగింది? తెలుసుకుందాం. ఆ స్థలం ఆర్కాట్ రోడ్ నుంచి లీలగా గోచరమయ్యేది. నాగిరెడ్డి గారి సోదరుడు బి.ఎన్.రెడ్డి, ఆయన వ్యాపార భాగస్వామి మూలా నారాయణస్వామి అక్కడో స్టూడియో కట్టాలనుకున్నారు. అప్పట్లో నాగిరెడ్డి ఉల్లిపాయల ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు. స్టూడియో నిర్మాణంలో ఆయన కూడా భాగం పంచుకోవాలనుకున్నారు. ఆ పనికిరాని స్థలం మధ్యలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ స్థలం ఆయనదే. మూలా నారాయణస్వామి ఆ స్థలాన్ని తమకి అమ్మమని ఆయనని అడిగారట. ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించారట. అప్పుడు నాగిరెడ్డి తనకో అవకాశం ఇవ్వమన్నారట. ఓ మంచి ముహూర్తం ఉన్న రోజున పూలూ, పళ్ళు తీసుకుని వెళ్ళి ఆ స్థలం యజమానిని కలిసి, ఆయన పాదాల వద్ద వాటిని ఉంచారట. వినయంగా నిల్చుని – ఆ స్థలంలో స్టూడియోని నిర్మించి ఎందరికీ మేలు చేస్తామని చెప్పారట. ఆయన నోరు తెరిచి ఓ మాట మాట్లాడేముందే ఆయన చేతుల్లో అడ్వాన్సుగా వెయ్యి రూపాయలు పెట్టి, ‘దయచేసి ఇంకేం చెప్పొద్దు’ అన్నారట. ముహూర్తబలమో, లేక నాగిరెడ్డి గారి ప్రవర్తనో – ఆ స్థలం యజమాని అమ్మేందుకు అంగీకరించారు. ఈ విధంగా బి.ఎన్.రెడ్డి, మూలా నారాయణస్వామి అ బ్రాహ్మణుడి నుంచి ఆ స్థలం కొని, వాహిని స్టూడియోని నిర్మించసాగారు. అప్పట్లో వారు రెండు ఫ్లోర్‍లు నిర్మించారు.

1949లో మూలా కుటుంబంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. వారి ఆస్తులన్నీ వేలానికి వచ్చాయి. మూలా బిఎన్ రెడ్దిని కొంత డబ్బు సర్దమని అడిగారట. బదులుగా బిఎన్ రెడ్డి – వ్యాపారవేత్త అయిన తన తమ్ముడు నాగిరెడ్డిని డబ్బు అడగమన్నారట. అప్పటికే ఆ స్థలంపై ఆసక్తి పెంచుకున్న నాగిరెడ్డి, ఆ సంస్థలోని సగం షేర్లు తనకి బదలాయిస్తే డబ్బు సర్దుతానని అన్నారట. కానీ 1950 నాటికి అన్ని రకాలుగా నష్టపోయిన మూలా నారాయణ స్వామి ఆ మొత్తం స్థలాన్ని అమ్మేసారు. ఆ తరువాత ఆయన మరణించారు.

అప్పట్నించి నాగిరెడ్డి వాహిని స్టూడియోలో కనిపించని భాగస్వామి అయ్యారు. వారిద్దరూ చక్రపాణితో కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి – తెలుగు తమిళంలో సినిమాలు తీయసాగారు. 1951లో తీసిన పాతాళభైరవి సూపర్ హిట్ కావడంతో నాగిరెడ్డి స్టూడియోని మరింత అభివృద్ధి చేయాలనుకున్నారు. కానీ ఆయన ఆలోచనలను మరో భాగస్వామి, దర్శకుడు కెవి రెడ్డి వ్యతిరేకించారు. అందుకని ఆయనకి ఏమీ నష్టం కలగకుండా – నాగిరెడ్డి చక్రపాణితో కలిసి – లాభాలతో మరిన్ని ఫ్లోర్‍లు నిర్మించారు. తన స్టూడియోలు లాభాలబాటలో సాగడానికి ఆయన వద్ద తగిన సూత్రాలుండేవి.

ఆ రోజుల్లో ప్రతి స్టూడియో ఒక కాల్‌షీట్‌కి వెయ్యి రూపాయలు వసూలు చేసేది. నాగిరెడ్డి తన ఖర్చులను లెక్కవేయగా, 750 రూపాయలని తేలింది. అందులో స్వల్ప మొత్తం 250/- రూపాయలని తాను ఉంచుకుని మిగతా డబ్బుని నిర్మాతలకి తిరిగి ఇచ్చేసేవారట. దీనివల్ల ఎందరెందరో నిర్మాతలు తమ సినిమాలను వాహిని స్టూడియోలో తీయడానికి ముందుకొచ్చేవారు. ఇతర స్టూడియోల వాళ్ళు ఒక్క రూపాయి కూడా తగ్గించేవారు కాదు. వాహిని స్టూడియోలో పని చేసే రాఘవన్ అనే వ్యక్తి, ఉద్యోగం మానేసి, వాహిని స్టూడియో పక్కనే – రేవతి స్టూడియో- నిర్మించారు. కానీ ఆ స్టూడియోని సమర్థవంతంగా నిర్వహించలేక, అమ్మేయాలనుకున్నారు.

ఇదిలా ఉండగా, కొందరు ధూర్తులు మూలా నారాయణస్వామి కుటుంబంలోని కొందరిని – లీజుని రద్దు చేసుకుని నాగిరెడ్డి నుంచి స్టూడియోని చేజిక్కించుకోమని ఒత్తిడి చేశారు.

ఒకరోజు నాగిరెడ్డి రేవతి స్టూడియో పక్క నుండి వాహిని స్టూడియోకి వస్తూ, రెండు స్టూడియోలకి మధ్య ఉన్న ఖాళీ స్థలం లోంచి నడుస్తున్నారు. ఈ స్థలం కూడా నాగిరెడ్డి కొనేస్తారని – దారినపోతున్నవారేవరో అన్నారట. ఆ ఆలోచన బావుందని గ్రహించిన నాగిరెడ్డి – అప్పటి మద్రాసు రాష్ట్రం రెవెన్యూ మంత్రి బెజవాడ గోపాలరెడ్డిగారితో తనకున్న పరిచయం ఆధారంగా – అక్కడున్న శ్మశానాన్ని మరో చోటుకు తరలించడంలో సఫలమయ్యారు. ఆ స్థలాన్నీ, రేవతి స్టూడియోని కొని వాహిని స్టూడియోని – విజయ వాహినిగా మార్చారు. తర్వాత స్టూడియో కోసం మరింత స్థలం కావాలని ఆయనకు అనిపించింది.

అక్కడ తెలుగు హాస్య నటుడు రేలంగి కొనుగోలు చేసిన 25 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఆయన కూరగాయలు, పప్పుధాన్యాలు పండించి – రోజూ తనని చూడడానికి వచ్చేవారికి – వారు ధనవంతులైనా/పేదలైనా – భోజనం పెట్టేవారు. రేలంగి పెద్దగా చదువుకోలేదు. ఆయన ఆ స్థలాన్ని ఆర్కాట్ నవాబుల కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశారు. ఆ స్థలం అమ్మడంలో రేలంగి కుమారుడు నారాయణ బాబు ప్రమేయం ఉంది. రేలంగి ఆ స్థలాన్ని అమ్మడానికి అంగీకరించలేదు. తెలివైన వ్యాపారవేత్త అయిన నాగిరెడ్డి – నారాయణబాబుని అడిగారట. తాను ఆ స్థలాన్ని సంవత్సరానికి 1100/- రూపాయలకి 25 ఏళ్ళ పాటు లీజుకి ఇస్తానని నారాయణబాబు ఒప్పుకున్నారు. నారాయణబాబు ఆ స్థలానికీ, స్టూడియోకి కూడా యజమాని అవుతారని  భావించారు. ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ స్థలంలో నాగిరెడ్డి సుప్రసిద్ధ విజయ గార్డెన్స్ నిర్మించారు. అక్కడ ఎన్నో అవుట్‍డోర్ షూటింగులు జరిగాయి, ఎన్నో సినిమా కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు జరిగాయి. కానీ ప్రస్తుతం రేలంగి వారసులు, నాగిరెడ్డి వారసుల మధ్య  ఆ స్థలం గురించి వివాదం చెలరేగి, కోర్టులో కేసు నడుస్తోంది. విజయ గార్డెన్స్‌ని రేలంగి స్థలంలో నిర్మించారని అందరికీ తెలుసు. అది రేలంగి కుటుంబీకులకు చెందుతుంది, కానీ నాగిరెడ్డి కుటుంబీకులు మాత్రం వివాదం రేకెత్తించారు. స్వర్ణయుగం నాటి కాలంలో రెండు కుటుంబాల మధ్య చక్కని స్నేహం ఉండేది. కానీ తరాలు మారేసరికి అది కాస్తా శత్రుత్వంగా మారింది.

ఆసక్తి ఉన్నవారు రేలంగి మనవరాలి భర్త యూట్యూబ్‌లో ఇచ్చిన ముఖాముఖిని చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=k23ApsEZe64

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here