అల్చి – విహారం

2
10

[box type=’note’ fontsize=’16’] “ఓ అందమైన అనుభూతి కోసమో, అపూర్వమైన సౌందర్యాన్వేషణ కోసమో ప్రాకులాడే వారికి, భావుకులకు ఇటువంటి మారుమూల క్షేత్రాలు ఎంతో శాంతినిస్తాయి. అల్చి – ఇక్కడ మనల్ని మనం కనీసం ఓ క్షణమైనా కోల్పోతాము. తథ్యం. అలా కోలుపోయిన క్షణాలే కదా జీవితానికి సార్థకత!” అని అంటున్నారు రవి ఇ.ఎన్.వి. ఈ వ్యాసంలో. [/box]

[dropcap]న[/dropcap]ల్లని తారు రోడ్డుకు రెండువైపులా చాలా దూరం వరకూ కనిపిస్తున్న మైదానాలు. అటుపై దూరాన మట్టితో కూడిన గుట్టలు. వాటివెనుక ఎత్తైన శిఖరాలు. ఆ శిఖరాలపై వెండితో కప్పెట్టినట్టు మంచుపూత! కనుచూపు మేరలో గడ్డిమొక్క కూడా లేదు. పైగా నిర్మానుష్యంగా ఉంది. కారు మెత్తగా సాగిపోతోంది. ఎండ ఉంది కానీ,హిమాలయాలపై నుండి వచ్చే చల్లని గాలి ఎండను తొక్కిపెడుతూ చల్లగా వీస్తోంది. జమ్ము, కాశ్మీర్ రాష్ట్రంలో లడఖ్ జిల్లా, ముఖ్యపట్టణమైన లేహ్ నుంచి శ్రీనగర్ కు వెళుతున్న NH1 ప్రధాన రహదారి అది.

దూరాన ఓ లడఖీ గ్రామం. లడఖ్ శైలి కట్టడాలు, ఏదో బౌద్ధారామంలా కనిపిస్తోంది. ఆ గ్రామానికి వెళ్ళే కాలిదారి. ఆ దారిలో వెళుతున్న ఓ అవ్వ. ముదురు ఎఱుపు రంగు బట్టలు ధరించింది. వయసైపోయినా, ఆమె నడకలోనే ఓ ధృఢత్వం కనిపిస్తోంది. కాసేపటి ప్రయాణం తర్వాత దూరాన ఓ హిమాలయపర్వత ప్రాంతపు గేదె (Himalayan Yak) గుట్ట దిగుతూన్నది. రోడ్డు క్రమంగా మారిపోయింది. ఇప్పుడు రకరకాల రంగుల్లో హిమాలయపు గుట్టలు. మంచు పర్వతాలు కూడా రోడ్డు పక్కనే కనిపిస్తున్నాయి. అక్కడక్కడా చోర్టెన్ అనబడే టిబెటన్ స్థూపాలు. ఏ కాలం నాటివో?

Chortens

నదీనదాలు, గ్రామాలు దాటుకుంటూ కారు వెళుతోంది. సంగమస్థలి దాటి, సస్పోల్ అనే ఓ పట్టణానికి వచ్చింది కారు. ఈ పట్టణంలో కాస్త పట్టణపు హడావుడి కనిపిస్తోంది. కొంతమంది విదేశీయులు తిరుగుతున్నారు. రోడ్డుపక్కన రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. పూరీలు, పంజాబీ సమోసాలు, కాశ్మీరీ కవా టీలు, మీగడ కలిపిన లడఖ్ చాయ్ లు, యాక్ (హిమాలయన్ గేదె) పాలతో చేసిన టీలు…ఇంకా లడఖీ థుక్ పా కూరలు, ఏప్రికాట్ రసాలు, గులాబీ రేకుల ఊరగాయలు…

సస్పోల్ కూడా దాటి కాసేపటికి కారు, రహదారికి యెడమవైపున తిరిగి ఓ గుట్టపైని దారిలో ప్రయాణించసాగింది. అలా వెళుతుంటే ఓ వంతెన.

అప్పుడు కనిపించింది! ఓ అప్సరస తళుక్కున మెరిసినట్టు!

తేరిపార చూసేలోపుల ఆ అప్సరస కనుమరుగయింది.

ఆ అప్సరస పేరు – సింధునది. మరకత మణులు (పచ్చలు) కరిగి భూమిపై ప్రవహిస్తున్నట్టు ఆకుపచ్చరంగులో హిమాలయాల మధ్య ప్రవహిస్తోంది ఆ నది. వర్ణనాతీతమైన సౌందర్యం!

సింధునది

ఈ నది కాశీలో గంగలా విశాలంగా కానీ, పాపికొండల వద్ద గోదావరిలా కానీ గంభీరంగా లేదు. నిజానికి ఓ కాలువకంటే కాస్త వెడల్పుగా ఉందంతే!

కానీ ఆ సౌందర్యం! చలాకీతనం! ఏమని వర్ణించాలి? మాటలు కూడా మోగవోజేసేంత అందం ఆవిడది! ఈ నదినే కదా, వేలసంవత్సరాల క్రితం మన ప్రాచీన ఋగ్వేద మహర్షులు ఒడలు మరచి పదే పదే కీర్తించింది!

అదబ్ధా సింధురపసామపస్తమాశ్వా న చిత్రావపుషీవ దర్శతా|

సవశ్వా సిన్ధుః సురథా సువాసా హిరణ్యయీ సుకృతావాగినీవతీ || (ఋగ్వేదం 10.75.7)

తన యొక్క మహత్వంతో మెరుస్తూ, నురగలు క్రక్కుతూ ఆమె తన దారిని పరుగులు తీస్తోంది. చాలా చలాకీగా, ఒరవడితో, అదుపే లేక ఆమె గొప్ప సౌందర్యంతో, అద్భుతంగా పారుతోంది.

పర సు వ ఆపో మహిమానముత్తమం కారుర్వోచాతి సదనే వివస్వతః |

పరసప్త సప్త తరేధా హి చక్రముః పరస్రత్వరీణమతి సింధురోజసా || (ఋగ్వేదం 10.75.1)

ఓ గాయకుడా! వివస్వంతుని నివాసస్థానంలోని ఈ సింధు నది ప్రవాహపు మహత్తు సాటి లేనిదోయి. ఈ చిన్ని నదియే క్రమంగా మూడుపాయలు, ఏడు ఏడేడు నదులుగా మారుతోంది. ఈ నదీ ప్రవాహం నిశ్చయంగా మిగిలిన అన్ని నదుల ప్రవాహాన్ని జయించినది.

ఆ మహర్షి సింధువును వర్షాకాలంలోనో లేదా ప్రవాహం తీవ్రంగా ఉన్నప్పుడో చూచి ఉంటాడేమో! కానీ సహజమైన సింధు ప్రవాహం హిమాలయాల మధ్య ఆకుపచ్చ రంగులో మరకతమణులను కరగించినట్టుగా ఉంటుంది.

ఇక ఋగ్వేదర్షులు తమను నది దాటించమని చేసిన ప్రార్థనలోని సింధువు – సింధు నదియే కాదా?

ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతే నిదహాతి వేదః |

స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః || (1.99)

జాతవేదసుడైన అగ్ని కొరకు హవిస్సుగా సోమలతను అర్పిస్తున్నాము. ఆ అగ్ని శత్రువులను నశింపజేయును. సింధువును దాటించు తెప్ప వలే మా ఆపదలను, పాపములను దహించుగాక!

నది! ఎన్నెన్ని కల్పాల నుండి ఈ సింధువు మానవుల ఆర్తిని తీరుస్తోంది! ఇదే కదా మన పుట్టుకకు మనుగడకు కారణం. ఈ సింధువే కదా భరతవర్షానికి మూలం!

******

“ఆ నది దగ్గరకు వెళ్ళటానికి, దిగడానికి సదుపాయం ఉందా?” మత్తునుంచి తేరుకొని, జిగ్మిత్ ను అడిగాను. “కుదర”దన్నాడు జిగ్మిత్. జిగ్మిత్ మా డ్రయివరు. కొంచెం కలుక్కుమంది. అయితే ఆశ కోలుపోలేదు. కారు అలా వెళుతూ ఓ చిన్న గ్రామం లోనికి వచ్చింది. ఆ గ్రామంలో విడిది సౌకర్యం కూడా ఉంది. హిమాలయాల మధ్య గ్రామాలు చాలా చిన్నచిన్నవి. విడిది దొరకడం అరుదే. అయితే సాధారణ గృహస్తులు మాత్రం అతిథులను ఆదరిస్తారు. ఈ చిన్ని గ్రామం క్రీ. శ 9 వశతాబ్దంలో ప్రాభవంగా వెలిగి, టిబెటన్ బౌద్ధమతానికి ఆకరమైన ప్రాంతం.

అదే “అల్చి”. Alchi Choskhor& Alchi Gompa.

శ్యామతార (అల్చి)

అల్చి :

– భారతదేశంలోని అత్యద్భుతమైన మ్యూరల్స్ (Paintings) కలిగిన ఓ చిన్ని కుగ్రామం, బౌద్ధారామం. హిమాలయాల మధ్య ఉండటం, చాలా చిన్న కుగ్రామం, బౌద్ధ క్షేత్రం అవటం మూలాన బయట సాధారణ యాత్రాప్రపంచానికి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు కానీ, ఇదొక అద్భుతమైన, దర్శనీయమైన ప్రదేశం. సాధారణంగా బౌద్ధారామాలన్నీ కొండగుట్టలపైన ఉంటాయి. ఆల్చి మాత్రం అందుకు భిన్నంగా నది ఒడ్డున ఉంది.

అల్చి! ఇది ఒక బౌద్ధారామం, బౌద్ధుల పవిత్రదేవాలయాలు కలిగిన తీర్థస్థలి కూడా. ఇక్కడ వజ్రయాన బౌద్ధానికి చెందిన ఐదు దేవాలయాలు ఉన్నాయి.

౧. లఖంగ్ సోమ

౨. సమ్ట్ సెక్ (మూడంతస్థుల మైత్రేయ బుద్ధుని మందిరం)

౩. వైరోచనుని మందిరం

౪. లోత్సవ లఖంగ్ (అనువాదకుని మందిరం)

౫. జమ్యంగ్ లఖంగ్ (అవలోకితేశ్వరుని మందిరం)

టికెట్ ధర ఒకరికి నూరు రూపాయలు. ఫోటోలు నిషిద్ధం. టికెట్ తీసుకున్న తర్వాత మూడడుగుల యెత్తు ఉన్న తలుపు తీసి అక్కడి బౌద్ధభిక్కువు ఒకాయన లోపలికి అనుమతించినాడు. తలుపు తీసి లోపల అడుగుపెట్టగానే మరొక అపూర్వ ఆవిష్కరణ! ఇది మరొక సౌందర్యానుభూతి!

******

పాతకాలపు ఓ చిన్ని జెన్ కథ.

ఒకానొక జెన్ గురుకులంలో గురువు – చిత్రలేఖనంలో నిష్ణాతులైన శిష్యులకు పరీక్ష నిర్వహిస్తున్నాడు. ప్రశ్నకు సమాధానంగా విద్యార్థులు బొమ్మ గీయాలి. గురువు ప్రశ్న చెప్పాడు.

“ప్రశ్న (క్వోన్) మౌనం. మౌనాన్ని చిత్రించండి. అయితే మౌనం కదా అని సమాధానపత్రం ఖాళీగా ఉంచరాదు.”

విద్యార్థులలో కొందరు బుద్ధుని బొమ్మ గీశారు. ఇంకొందరు సెలయేరును, మరి కొంతమంది కనులు మూసి ఉన్న మనిషిని, దీపాన్ని – ఇలా రకరకాలుగా చిత్రించినారు. ఒక్క విద్యార్థి మాత్రం కొంచెం భిన్నమైన చిత్రాన్ని గీశాడు.

చాలా యెత్తునుంచి క్రిందికి దూకుతూన్న జలపాతం. ఆ జలపాతం దూకే దారిన కొండచరియలో ఓ చిన్న కలుగులోంచి పుట్టిన గడ్డిమొక్క. ఆ గడ్డిమొక్క చివరన పూసిన చిన్న గడ్డిపువ్వు! ఉధృతమైన హోరును వింటూ నిశ్చలంగా, ప్రశాంతంగా, చివురిస్తూన్న గడ్డిపూవు!

ఈ చిత్రమే ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది.

******

మానవుని మెదడు ఓ వాగుడుకాయ. A ChatterBox. పొద్దస్తమానం యెడతెరిపి లేకుండా ఆలోచనలతో క్రిక్కిరిసిన ఓ మార్కెట్ వీథి. అట్లాంటి మెదడుకు ఓ శూన్యస్థితి యొక్క ఓ స్పర్శ, ఓ చిన్ని Glimpse తెలియాలంటే ఏదైనా బలమైన ఉధృతమైన సౌందర్యానుభూతి అనుకోకుండా తాకాలి. ఆ సౌందర్యానుభూతి ప్రాకృతికమైనదైనా కావచ్చు, లేదా మానవకృతమైనదయినా కావచ్చును. అలాంటి బలీయమైన అనుభూతిని కలిగించటానికిన్నీ, ధ్యానానికి బలీయమైన ప్రేరణ ఏర్పడడానికిన్నీ టిబెటన్ బౌద్ధులు ఈ అల్చి దేవాలయ సముదాయంలో ప్రయత్నం చేశారనిపిస్తుంది.

మొదటి దేవాలయం లో దాదాపు 15 అడుగుల కంటే ఎత్తైన అవలోకితేశ్వరుని మట్టి విగ్రహం! విగ్రహానికి నాలుగు చేతులు, అందమైన ముఖమండలం.

బోధిసత్వ అవలోకితేశ్వరుడు.

అంతకన్నా ముఖ్యంగా, మందిరం గోడలపైన మొత్తం, ఓ అంగుళం సందు లేకుండా, దట్టమైన రంగులతో చిత్రించిన బౌద్ధచిత్రాలు. ఈ చిత్రాలు అవలోకితేశ్వరుడు, మంజుశ్రీ, మైత్రేయుల ధోవతి (పంచె) పై కూడా చిక్కగా చిత్రించి ఉన్నాయి.

ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం ఇటువంటి దట్టమైన రంగుల్లో చిత్రించిన ఆ బొమ్మలలో రకరకాల బోధిసత్వులు, అప్సరసలు, దేవతామూర్తులు, అశ్వాలు, ఏనుగులు, చిత్రవిచిత్రమైన మూసలు (patterns), గాలిలో తేలిపోయే గంధర్వులు, అందమైన ముద్రలు, మండలాలు, శాక్యముని బుద్ధుని జీవితఘట్టాలు, టిబెటన్ లామాలు, గురువులు – ఇలా వజ్రయానానికి చెందిన విస్తారమైన ప్రపంచం కనిపిస్తుంది. హిందూ దేవతలూ అక్కడక్కడా ఈ చిత్రాలలో కనిపించడం కద్దు. చారిత్రక పురుషులు, ఘట్టాలు కూడానూ ఈ చిత్రాల్లో లేకపోలేదు.

బోధిసత్వుల మండలము

అల్చి మందిరంలో అడుగుపెట్టినంతనే, హిమాలయాల తాలూకు మంచు వంటి నిశ్శబ్దపు నేపథ్యానికి అద్భుతమైన శిల్పాలు, దట్టమైన రంగులతో గోడల నిండా పరుచుకున్న వజ్రయాన చిత్రాలు కలిసి ఓ క్షణం ప్రేక్షకుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అంత అపూర్వమైన సౌందర్యం అనుకోకుండా ఆవిష్కృతమై కొన్ని క్షణాలు మాటలు రావు.

ఆ మందిరాలలో అవలోకితేశ్వరుడే కాక, ఆర్య మంజుశ్రీ, మైత్రేయబుద్ధుడు,వైరోచనుడు వంటి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ టిబెటన్ భాషలో లిఖించిన కొన్ని శాసనాలు కూడా గుర్తించబడినాయి. మందిరాలలో ఓ ప్రక్కన ప్రాచీన తాళపత్ర గ్రంథాలను కూడా భద్రపరిచారు. మందిరాల్లో ఫోటోగ్రఫీ నిషిద్ధం.

శూన్యాన్ని కానీ, శూన్యస్థితిని కానీ చిత్రాల ద్వారా చిత్రించటం మామూలు విషయం కాదు నిజానికి. ఇలా సాంద్రమైన చిత్రాల సముదాయంతో మనస్సును ఒక్కపెట్టున ఆకర్షించి శూన్యస్థితిని పరిచయం చేయటమే కాకుండా, ధ్యానానికి భిక్కువులను ప్రేరేపించటమే లక్ష్యంగా ఈ మందిరాలను నెలకొల్పినట్టు తోస్తుంది.

సింధునది సౌందర్యం ప్రాకృతికమైతే, మందిరాల సౌందర్యం మానవకృతం.

******

స్థూలంగా వజ్రయానం/తాంత్రిక బౌద్ధం:

గౌతమబుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన పిదప కొంతకాలానికి బుద్ధుని బోధలు అనేక రకాలుగా Interpret చేయబడినై. దరిమిలా ఆయన బోధలు పలుసిద్ధాంతాలుగా రూపు దిద్దుకున్నవి. తదనంతర కాలంలో బుద్ధుని మూల సూత్రాలను యథాతథంగా అనుసరించటాన్ని హీనయానంగా పేర్కొన్నారు. ప్రతి మనిషి తన పుట్టుకకు పరమార్థాన్ని అన్వేషించాలి. ఆ పరమార్థాన్ని కనుక్కోవడమే పరమ సత్యం. అదే నిర్వాణ పథం. ఇది పూర్తిగా వ్యక్తినిష్టం. అందుకే ఇది హీనయానం. దీనికే థేరవాదం (స్థవిరవాదం) అని కూడా పేరు.

ప్రతి వ్యక్తి తనకు తాను ముక్తుడవటం – హీనయానమైతే, వ్యక్తులు నిర్వాణాన్ని తెలియటమే కాక, స్వార్థాన్ని విడనాడి, సమాజంలో తమ తోటి వారికి తోడ్పడి వారి ఔన్నత్యానికి కూడా పాటుపడాలనే భావన మహాయానం. మహాయానంలో బుద్ధుడు బోధిసత్వుడుగా అనేక జన్మలు ఎత్తుతాడు. సమాజపు ఔన్నత్యానికి దోహదపడతాడు. మహాయానం కేవలం భిక్కువులకే కాక, కుటుంబీకులకూ కొంత ప్రతిపత్తిని ఇచ్చింది. మహాయాన బౌద్ధులు బుద్ధుడి బోధలైన చతురార్యసత్యాలను, ప్రతీత్య సముత్పాదాన్ని, ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తూనే, సంవృతి సత్యాన్ని, (Facts of the world), నిర్వాణ సత్యాన్ని (Truth inherent to an individual) సమన్వయించి, వ్యక్తిగత ముక్తినే కాక, సమాజ శ్రేయస్సుకూ దోహదపడగలరు.

ఈ మహాయానం బీజాల నుంచి వజ్రయానం ఏర్పడింది. వజ్రయానం లో బుద్ధుడు అలౌకిక వ్యక్తిగా మార్పు చెందాడు. దరిమిలా వజ్రయానం మార్మికతను సంతరించుకొన్నది. వజ్రయానాన్నే తాంత్రిక బౌద్ధం అంటారు. బోధి సత్వుడు ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తీ శాంతిని,నిర్వాణాన్ని అందుకొనే వరకూ వివిధ రూపాలలో జన్మిస్తూనే ఉంటాడు. అంతే కాక, మార్మిక రూపంతో కొనసాగుతుంటాడు. బోధిసత్వుని కరుణకు రూపమే అవలోకితేశ్వరుడు. బోధి సత్వుని ప్రజ్ఞకు రూపం – మంజుశ్రీ. అలానే బోధి సత్వునికి అనేక రూపాలు. అమితాభుడు, అక్షోభ్యుడు, రత్నసంభవుడు, అమోఘసిద్ధి వగైరా వగైరా.

అందులో అవలోకితేశ్వరుని ప్రస్తావన మహాయన కాలం నాటి గ్రంథాల్లోనే కనిపిస్తుంది. అందులో ప్రధానమైనది సద్ధర్మపుండరీకం. ఇందులో అవలోకితేశ్వరుని ప్రస్తావన ఉంది. మరొక గ్రంథం కరండవ్యూహం లో అవలోకితేశ్వరునికి చెందిన “ఓమ్ మణి పద్మే హుమ్” అన్న మంత్రం మొదటి సారి కనిపిస్తుంది. ఇవి క్రీ.శ 2 వశతాబ్దం మొదలు 4 వ శతాబ్దం నాటికే ప్రాచుర్యంలోకి వచ్చి ఉండడం గమనార్హం.

గమనార్హమైన విషయమేమంటే బౌద్ధం హీనయాన మహాయాన, వజ్రయానాలుగా మూడు రూపాలు సంతరించుకొన్నప్పటికీ బౌద్ధులకు అందరికీ త్రిపిటకాలు పూజనీయాలు, ఆచరణీయాలూను. హీనయానంలో బుద్ధుని సూత్రాలను అనుసరించటం పట్ల ఆసక్తి చూపితే మహాయానంలో అభిమానించటమూ, వజ్రయానంలో అర్చించటమూ ప్రధానంగా ఏర్పడిన పరిణామాలు.

వజ్రయాన బౌద్ధంలో బుద్ధుడు – అలౌకిక శక్తి. బుద్ధుని బోధలను, అనేక చిహ్నాల ద్వారా, అలౌకిక మూర్తుల ద్వారా ధ్యానించి, ఆ ధ్యానానుభవంతో బుద్ధుని బోధనలను అనుభవానికి తెచ్చుకోవటం లక్ష్యంగా వజ్రయానం ఏర్పడింది. ఈ వజ్రయానంలో మూర్తుల చిహ్నాలకు హిందూమతం నేపథ్యం చాలానే ఉంది. అవలోకితేశ్వరుడు – బోధిసత్వుని కరుణకు సాకారం. ఈయన రెండు కళ్ళ నుంచి సూర్యచంద్రులు, కనుబొమల నుండి ఈశ్వరుడు, భుజాల నుంచి బ్రహ్మ,   పాదాల నుంచి భూదేవి, బొడ్డు నుండి ఆకాశం, వాక్కు నుంచి సరస్వతి పుడతారు. ఇది విష్ణువు/శివుడి వర్ణనకు ఛాయ.

భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చన్ద్ర సూర్యౌ చ నేత్రే|

కర్ణావాశాః శిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః || (విష్ణుసహస్రనామం)

వజ్రయానపు తొలినాళ్ళలో ఈ అవలోకితేశ్వరుడు పద్మపాణి. అంటే చేత పద్మాన్ని ధరించిన మూర్తి.

పద్మపాణి – అజంతా

తదనంతరం టిబెటన్ బౌద్ధంలో అవలోకితేశ్వరుడు నాలుగు చేతులతో మొదలు వేయి చేతులతో దర్శనమిస్తాడు.

1000 Hands, 11 heads Avalokitesvara

అంతే కాదు, “ఓమ్ మణి పద్మే హుమ్” అన్న మంత్రం కూడానూ స్కాంధపురాణాంతర్గతమైన “ఓమ్ నమః శివాయ” అన్న షడక్షరికి ఛాయగా కొందరు పేర్కొంటారు.

టిబెట్, లడఖ్ లలో ఈ వజ్రయాన బౌద్ధాన్ని – పద్మసంభవుడనే బౌద్ధ భిక్కువు (Guru Rimpoche) వ్యాప్తి చెందించాడని ప్రతీతి. అల్చి లో నెలకొన్నది హిందూమత ఛాయలు కలిగిన బౌద్ధమతం. అల్చి లో చిత్రకారులు కూడానూ హిందూ కాశ్మీరీ చిత్రకారులని చారిత్రకులు పేర్కొన్నారు.

బౌద్ధం కూడా హిందూ మతమంత విస్తారమైనది. అందులో వజ్రయానం కూడా చాలా చాలా విస్తారమైనదే. ఒక్క సద్ధర్మపుండరీకానికే వందల కొలది అనువాదాలు, వివరణలు ఉన్నాయట. దాదాపు ముప్పై ఏళ్ళపాటూ టిబెటన్ బౌద్ధులు బౌద్ధాన్ని అధ్యయనం చేస్తారట. ఇంత విస్తారమైన బౌద్ధవాజ్ఙ్మయాన్ని గురించి చెప్పుకోలేం. కేవలం వ్యాసానికనుగుణంగా కొంత ముచ్చటించుకున్నాం.

బోధిసత్వుని అవతారాలు.

అవలోకితేశ్వరుడు:

అవలోకితేశ్వరుడు – పంచబౌద్ధావతారాలలో ఒకడు. తూర్పుదిక్కుకు అధిపతి. ఈయన అమితాభ బుద్ధుడి అవతారంగా, ఓ తెల్లని వెలుగు నుండి ఉద్భవించి, ఆ వెలుగును తన కుడి కన్ను ద్వారా భూమిపై ప్రసరింపజేస్తాడు. ఈయన కిరీటంలో అమితాభుని, ఎడమ చేత తామరపువ్వును కలిగి ఉంటాడు. అవలోకితేశ్వర బోధిసత్వుని రెండు చేతులు, నాలుగు చేతులు, వేయి చేతులు, వేయి శిరస్సులు – ఇలా రకరకాల రూపాలలో వజ్రయానంలో అర్చిస్తారు. రెండు చేతుల ఈ బోధిసత్వ అవతారానికి పద్మపాణి అని మరొకపేరు.

వజ్రయానం కాలం నాటికి అవలోకితేశ్వరునికి ఎన్నో రూపాలు ఏర్పడినాయి. దరిమిలా ఎన్నో ధ్యాన పద్ధతులు ఆయా రూపాలకనుగుణంగా ఏర్పడినాయి. అవలోకితేశ్వర బుద్ధుడు – గౌతమబుద్ధుడికి, భవిష్యత్కాలపు బుద్ధుడైన మైత్రేయుడికి మధ్యకాలపు అవతారంగా బౌద్ధులు పూజిస్తారు. ప్రముఖంగా ఈ అవతారంలో అవలోకితేశ్వరుడు నిర్వాణం పొందినప్పటికీ మానవాళిపై అపారకరుణను ప్రసరింపజేస్తూ వారిని నిర్వాణాభిముఖులను చేస్తాడు.

అవలోకితేశ్వరుడే మొట్టమొదటి సారి ప్రముఖ షడక్షరి – “ఓమ్ మణి పద్మే హుమ్”   మంత్రాన్ని మానవాళికి ఉపదేశించాడు. ఈ మంత్రం టిబెట్ లోనూ, లడఖ్ లోనూ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. లడఖ్ లో లెక్కలేనన్ని చోట్ల ఈ మంత్రాన్ని రాళ్ళపై చెక్కి ఉండడం గమనించవచ్చు. (ཨོཾ་མ་ཎི་པ་དྨེ་ཧཱུྃ) ఈ మంత్రాక్షరాలను ద్వారతోరణాలుగానూ,ఇళ్ళలో కనబడేట్టుగానూ అలంకరించుకోవటం చాలా సహజం.

లడఖ్ లో ఈ “మణి పద్మే హుమ్” ధ్వజాలు అడుగడుగునా కనిపిస్తాయి. అనేక స్థూపాలలోనూ, చాలా మారుమూల ప్రాంతాలలో కూడా ఈ “మణి పద్మే హుమ్” ధ్వజాలు పేపర్లలో వ్రాసి తోరణాలుగా కట్టటం కనిపిస్తుంది. యాత్రికులకు, పర్వతప్రాంత నివాసులకు ఈ తోరణాలు ఆపదలను నివారిస్తాయని స్థానికుల విశ్వాసం.

ఈ “మణి పద్మే హుమ్” మంత్రాన్ని మందిరాలలో పెద్ద పెద్ద చక్రాలపై చిత్రించడం ఉంది. మందిరాల బయట నెలకొల్పబడిన వీటిని ప్రదక్షిణ మార్గంలో తిప్పితే శుభమని నమ్మిక.

Prayer Wheels – Alchi

బౌద్ధుల గురువు అయిన దలైలామా ను టిబెటన్ వాసులు అవలోకితేశ్వరుని అవతారంగా భావిస్తారు. అల్చి లో అవలోకితేశ్వరుని ప్రతిమ తాలూకు చిత్రం, ఆ చిత్రం విశేషాలు ఇదివరకే తెలుసుకున్నాం.

మంజుశ్రీ.

ఆర్య మంజుశ్రీ – మహాయాన బౌద్ధంలో ఆ పై వచ్చిన వజ్రయానంలోనూ ప్రజ్ఞకు చిహ్నం. పిటకాలను స్మరించడం, గుర్తు పెట్టుకోవడం కోసం ఈ బోధిసత్వ రూపాన్ని ప్రార్థిస్తారు. ఈ మంజుశ్రీ రూపానికే మంజుఘోష అని కూడా పేరు. మంజుఘోషుడంటే మధురమైన నాదాన్ని కలిగిన బుద్ధుడు అని అర్థం. ఆర్య మంజుశ్రీ – అఖోభ్య బుద్ధుని నుండి ఉద్భవించాడు. తన కుడి చేత నీలి వెలుగులు వెదజల్లుతున్న ఖడ్గాన్ని ధరిస్తాడు. ఆ ఖడ్గం తిమిరాన్ని ఛేదించే జ్ఞానానికి చిహ్నం. ఎడమ చేత పుస్తకాన్ని ధరిస్తాడు. స్వయంభూపురాణం అనే ఓ గ్రంథానుసారం ఆర్య మంజుశ్రీ ఓ మారు నేపాల్ రాజ్యంలో ఓ పెద్ద సరస్సు అంతర్భాగాన నీలికలువ మధ్యన ఉదయించిన ఆదిబుద్ధుని బయటకు తీసుకు వచ్చాడు. టిబెట్ లో కొంతమంది లామాలను ఆర్య మంజుశ్రీ అవతారాలుగా పూజించటం ఉంది.

ఆర్య మంజుశ్రీమూలకల్ప – ఐదవశతాబ్దపు సంస్కృత గ్రంథం. ఈ గ్రంథంలో మంజుశ్రీ – ఓ మార్మిక మూర్తి. ఈయన హిందూ దేవతలను శాసిస్తాడు. ఆకాశమార్గాన ప్రయాణిస్తుంటాడు. ఆర్య మంజుశ్రీకి చెందిన మంత్రం “ఓం అ ర ప చ న ధీః”.

అల్చి లో మంజుశ్రీ విగ్రహం.

అల్చి లో మంజుశ్రీ, అవలోకితేశ్వరుడే కాక మైత్రేయబోధిసత్వ, మహాకాల, తార ఇత్యాది విగ్రహాలు ఉన్నాయి.

మైత్రేయ బోధిసత్వుడు – అల్చి. (Photo courtesy – Aditya Arya)
Mahakala Mural – Alchi

చరిత్ర:

విరులలో మకరందంలా స్వభావసిద్ధమైన మహనీయల పుణ్యవచనాలను ఆతడు ఓ తుమ్మెదలా సేకరించాడు” ఓ గోడపై నెలకొల్పిన శాసనపాఠం తాలూకు భావం, దుఖాంగ్, అల్చి.

ఈ దేవాలయాల సముదాయాలలో వైరోచన, అవలోకితేశ్వర మందిరాలను నిర్మించినది రింగ్‍చెన్ జాంగ్‍పో (Rin-chen bzang-po) అనే ఓ బౌద్ధ గురువు,

రింగ్చెన్ జాంగ్ పో (లోత్సవ)

ఈయన కాలం క్రీ.శ. 958-1055. ఈ మహనీయుడు అల్చి లోనే కాక, హిమాలయ పర్వతసానువులలో, టిబెట్ లో, కాశ్మీర్ లో కలిపి మొత్తంగా 108 బౌద్ధమందిరాలను కట్టించినట్టు ఐతిహ్యం. అందులో ప్రస్తుతం భారతదేశంలోని లడఖ్ జిల్లాలో అల్చి, మన్‍గ్యు, సుండా అన్న మూడు మందిరాలు ప్రస్తుతం ప్రసిద్ధి పొందినవి.

రింగ్ చెన్ జాంగ్ పో జన్మస్థలం పశ్చిమ టిబెట్ లో పురాంగ్ జిల్లాలోని క్యువాంగ్ అనే గ్రామం. గు-గె రాజుల ప్రోద్బలంతో ఈయన భారతదేశానికి వచ్చాడు. ఈయన గుణమిత్రుడు, ధర్మశాంతి, శైలేంద్రబోధి అనే కాశ్మీరపండితుల వద్ద సంస్కృతాన్ని, త్రిపిటకాలను క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు. ఈ అధ్యయనం 17 ఏళ్ళు సాగింది.

రింగ్‍చెన్ జాంగ్‍పో మహనీయుడు అల్చి లోని మందిరాలను నిర్మించటమే కాక ఆయా మందిరాలలో వజ్రయానానికి చెందిన చిత్రాలను చిత్రింపజెయ్యటానికి కాశ్మీరం నుండి 32 మంది భారతదేశ కళాకారులను పిలిపించాడు. వారితో కలిసి మందిరాలలో అపూర్వమైన చిత్రకళ సంపద సృజన చేయించి మందిరాలలో నెలకొల్పినాడు.

అంతే కాదు, ఆయన బౌద్ధానికి చెందిన వినయ, సూత్రపిటకాలను, తంత్ర, ప్రాతిమోక్ష విభాగాలకు చెందిన గ్రంథాలను కూడా టిబెటన్ భాషలో తర్జుమా చేశాడు. దరిమిలా ఆయనకు “లోత్సవ” (అనువాదకుడు) అన్న బిరుదు స్థిరపడింది. ఈ మహనీయుడు 98 సంవత్సరాలు జీవించి టిబెట్ బౌద్ధానికి ఎనలేని సేవ చేసి ముక్తుడైనాడు.

అయితే అల్చి లో నిర్మించిన మందిరాల్లో పురాతనమైనవి మాత్రమే జాంగ్ పో గురువు నిర్మించాడని, మందిర సముదాయంలో మిగిలిన దేవాలయాలు ఆ తర్వాతి కాలంలో నిర్మించబడినవని చారిత్రకులు అంటున్నారు. అంతే కాక, అక్కడ చిత్రించిన చిత్రాలలో తదనంతర కాలపు చిత్రాలు కూడా కలిసిపోయి ఉన్నాయి. వాటిలో మహమ్మదీయుల శిల్పాలు కూడా కనిపిస్తున్నాయి. వీటిపై రకరకాల వాదాలు, ప్రతివాదాలు ఉన్నాయి.

అల్చి – వర్తమానం:

అయితే అల్చి – ఒక పెద్ద ప్రమాదంలో ఉంది. శతాబ్దాల తరబడి ముష్కర మూకల దురాక్రమణలను తట్టుకున్న ఈ చిన్న దేవాలయ సముదాయం ఇప్పుడు నెమ్మదిగా శిథిలమవుతోంది. మంచు ఈ మందిరాలలోనికి కురవడంతో కొన్ని చిత్రాలు మెల్లగా శిథిలమవుతున్నాయి. విగ్రహాలు మట్టితో చేసినవి కావడంతో అక్కడక్కడా చీలికలు కలుగుతున్నాయి. ఇక్కడికి సమీపంలో సింధు నది పై ఆనకట్ట కడుతున్నారట. ఆ ప్రభావమూ ఈ దేవాలయంపై పడుతున్నది. ఇక్కడకు వస్తున్న ప్రేక్షకులు విడుస్తున్న కార్బన్ డయాక్సయిడ్ వల్ల కూడా మందిరానికి ఇబ్బందులు ఏర్పడతాయని అంటున్నారు. ఏదైనా ఒక్క భూకంపం వస్తే ఈ మందిరాలు మిగలవట!

ఆదిత్య ఆర్య అన్న ఓ ఫోటోగ్రాఫర్ అల్చి ని సంరక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతర్జాతీయ సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. కానీ అవి ఇప్పటికి ఫలవంతమైన రూపు దాల్చలేదు. హిమాలయాల మధ్య ఉన్న ఈ చిన్ని బౌద్ధారామంపై ఎన్నో పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎంతో మంది యాత్రికులు ఈ బౌద్ధారామాన్ని దర్శించి తమ అనుభవాలను వ్రాశారు. ఈ దేవాలయపు చిత్రాలపై ఎందరో ఎన్నో విధాలుగా ఆసక్తి చూపుతూ, రకరకాలుగా అనుశీలిస్తున్నారు. అల్చి ఒక కోల్పోయిన ప్రపంచం. ఇదొక మార్మిక స్థలం.

******

తుది:

པིད་ཉིན་རིང་མོ་ལ་གྲང་གསུམ་དང་གྲོ་གསུམ། མི་ཚོ་རིང་མོ་ལ་སྐྱིད་གསུམ་དང་སྡུག་གསུམ།

spid’ nyin ring’moa drang’ sumdang dro’ sum

mi’tshe ring’moa skyid’ sum dang dug’ sum.

ఒక వసంతోదయంలో – మూడు మూడు పూటలు చలి, మూడు పూటలు ఎండానూ!

ఇది ఒక ప్రముఖ టిబెటన్ సామెత. జీవితంలో కష్టాలు, సుఖాలు కలగలిసి ఉంటాయని భావం.

లడఖ్ – హిమాలయాల నడుమ ఉన్న ప్రదేశం. అక్కడికి వెళ్ళదలుచుకున్న వారు మొదటి రెండు రోజులు అక్కడి వాతావరణానికి, ప్రాణవాయువు లేమికి అలవాటు పడాలి. చలికి తట్టుకోగలగాలి. ఆపై హిమాలయాలను, ప్రాంతాలను దర్శించవచ్చు.

అల్చి – మందిరాల వెనుక ఓ తలుపు గుండా వెళితే మొదట కనబడిన అప్సరస, సింధునది మళ్ళీ కనిపించింది. అయితే ఇదీ దూరంగానే ఉంది. నింపాదిగా చూచి ఆనందించవచ్చు కానీ ….

అక్కడ యెడమవైపున ఉన్న మరో దారి దూరంగా కనిపించే సింధునదికి సమాంతరంగా వెళ్ళి, నదికి వ్యతిరేక దిశలో మలుపు తిరుగుతోంది. ఆ దారిని వెళ్ళిన తర్వాత ఓ చోట రాతిగుట్టల మధ్య, ముళ్ళపొదలమధ్య, నదిని చేరుకుందుకు ఓ చిన్న దారి కనిపించింది. నిజానికి దారి కాదు కానీ, తడుముకుంటూ వెళ్ళవచ్చు. ఆ దారిని వెళ్ళి ఎలాగైతేనేం అప్సరసను చేరుకున్నాను……… నేను సైతం, ఆ పునీతమైన జలాన్ని గ్రోలి, ఆ జలాన్ని తలపై చల్లుకుని, ముఖప్రక్షాళణం చేసుకుని, ఆ ప్రాచీన మహర్షులకు వారసుణ్ణి కాగలిగినాను.

సింధునది సమీపంగా.

సాధారణంగా యాత్ర అంటే – విహారయాత్ర లేదా సాహసయాత్ర ప్రధానంగా అగుపిస్తాయి. అధ్యాత్మిక యాత్రలు, తీర్థయాత్రలు అంటూ ఉన్నాయి కానీ, అవి ముఖ్యంగా కర్మాచరణలకు ప్రాముఖ్యతనిస్తూనో, భక్తివిశ్వాసాల మయంగానో ఉండటం కద్దు. అలా కాక ఓ అందమైన అనుభూతి కోసమో, అపూర్వమైన సౌందర్యాన్వేషణ కోసమో ప్రాకులాడే వారికి, భావుకులకు ఇటువంటి మారుమూల క్షేత్రాలు ఎంతో శాంతినిస్తాయి. అల్చి – ఇక్కడ మనల్ని మనం కనీసం ఓ క్షణమైనా కోల్పోతాము. తథ్యం. అలా కోలుపోయిన క్షణాలే కదా జీవితానికి సార్థకత!

అసతో మా సద్గమయ,

తమసో మా జ్యోతిర్గమయ,

మృత్యోర్మా అమృతం గమయ.

*******

కొన్ని టిబెటన్ భాష శబ్దాలకు అనువాదాలు.

Gompa (གོམཔ) = బౌద్ధ విహారం

Chorten (ཆོརྟེན) = టిబెటన్ స్థూపం

Choskhor (ཆོསཁོར) = దేవాలయం

Lotsava (ལོཙབ༹) = అనువాదకుడు

Alchi (ཨལྕི)

Lakhang (ལཁང) = మందిరం

Dukhang (དུཁམག) = సభామంటపం

Rinpoche (རིན་པོ་ཆེ) = పద్మసంభవుడు, టిబెటన్ గురువు.

*******

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here