ఆల్గోరిథమ్

2
5

[dropcap]లి[/dropcap]ఫ్ట్ తిన్నగా కారు పార్కింగ్ లోకే దిగుతుంది.

“మీరు బేస్‌మెంట్‌లో వున్నారు” లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. రావ్ బయటకి వచ్చాడు.

పెద్ద కారు గ్యారేజీ, కార్లు ఎవరెవరివో గుర్తు పట్టడం కష్టం. డజన్ల కొద్దీ కార్లు. A B C బ్లాక్ లలోపార్క్ చేసి వున్నాయి. C-block వైపు నడిచాడు.

“హలో మిష్టర్ రావ్! నేనిక్కడ!” దూరంగా, బూడిదరంగు వున్న పెద్ద సెలూన్ కారు లైట్లు వెలిగి ఆరుతున్నాయి.

“గుడ్ ఈవినింగ్, సార్” అంటోంది కారు లోంచి వచ్చే యాంత్రిక స్వరం.

“పుష్పక్ 2050” TS 9999 నంబరు కారు తనదే!

దగ్గరకి వెళ్ళి డోర్ ప్యానెల్ మీద బొటనవేలు పెట్టాడు.

టక్ మనే చప్పుడుతో కారు డోర్ తెరుచుకుంది. లోపల లైటు వెలిగింది.

“వెల్‌కమ్! ఈ రోజు ఎనిమిది గంటలకే దక్కన్ క్లబ్‌లో డిన్నర్ వుంది మీకు. షల్ ఐ టేక్ యూ? లేక మీ ప్రోగ్రాం మారిందా?” పుష్పక్ ప్రశ్నించింది.

“దక్కన్ క్లబ్, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్. ఆటోనావిగేషన్. స్పీడ్ గంటకి అరవై కిలోమీటర్లు దాటద్దు!” అని డాష్ బోర్డ్ లోని మైక్‌లో మాట్లాడాడు.

మళ్లీ ఫింగర్ ప్రింట్ బొటన వేలి ముద్ర ఇగ్నిషన్ ప్యానెల్ మీద వేశాడు.

“ఓ.కె. మాస్టర్. 30 నిముషాలు పడుతుంది. ETA అక్కడికి చేరుకునే సమయం ఏడు ఏభై అయిదు నిముషాలు.”

ఇప్పుడు కారు స్టార్ట్ అయింది. ఏ.సి ఆన్ అయింది. దానితో బాటే డాష్ బోర్డ్ లోని కంప్యూటర్ వెలిగి మ్యాప్ కనబడసాగింది. సన్నటి సితార్ సంగీతం స్పీకర్లలో.

“బయలుదేరుతున్నాం మాస్టర్! మ్యూజిక్ మార్చాలా.”

“వద్దు! ఆటోమాటిక్ రివర్స్ అండ్ గో!”

ఒళ్ళంతా వజ్రాలు ధరించి మెరిసిపోయే, నాట్యకత్తెలా కారు, దాని బయట అంతా మెరిసి ఆరే దీపాలు.

అది తనంతట తానే మెల్లగా రివర్స్ చేసుకుని పార్కింగ్ లాట్ ర్యాంప్ దగ్గర గేర్ మార్చుకొని బయటకు వెళ్ళే దారి గేటు దగ్గర ఒక నిముషం ఆగి, అక్కడ వాచ్‌మాన్ చెకింగ్ పూర్తియ్యాక, రోడ్డు మీద లాఘవంగా ముందు సాగింది.

స్టీరింగ్ వుంది. కాని ఈ రోజు రావ్ దానిని వాడటం లేదు. అలసటగా వుంది. తన బిజినెస్‌లో తీవ్రమైన ఆర్థిక నష్టాలు చవి చూసిన రోజు! సుమారు పది కోట్లు! తను బిజినెస్ చేసే గ్రానైట్ ధర తగ్గింది. దానితో నష్టం. ఆ బాధలో వున్నాడు.

ఇవాళ కాకపోతే డబ్బు మళ్ళీ రేపు వస్తుంది. కాని నష్టం నష్టమే. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర తగ్గితే హఠాత్తుగా, తను ఏం చేయగలడు! కస్టమర్‌లు ఇళ్ళు కట్టడం లేదు. ఎందుకంటే ఎక్కడో యుద్ధం, మరెక్కడో మహమ్మారి ప్రబలం. దాంతో డిమాండ్ తగ్గింది.

ఈరోజు కొంచెం క్లబ్‌లో రిలాక్స్ అవాలని వుంది.

ఆటోమాటిక్, డ్రైవర్ లేని కారు అది. పుష్పక్ అని మోడల్, రోడ్డు మీద తనే వెళ్ళిపోతుంది. అన్నీ తానే గుర్తు పడుతుంది. రూట్ కంప్యూటర్‌లో నోటితో చెబితే GPS అనుసంధానం చేసుకుని వెళ్ళిపోతుంది.

కారు ముందు సీట్ తెరలో చుట్టూ వున్న దృశ్యాలు, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపిస్తున్నాయి. ఆ మెరిసే లైట్లు అది డ్రైవర్ లేని కారు, అని అందరికీ తెలిసేందుకే వుద్దేశించినవి.

జాగ్రత్తగానే వెళుతుంది. తిరిగి వచ్చేటప్పుడు తీసుకువస్తుంది. ఎవరైనా అడ్డు వస్తే ఆగుతుంది. చుట్టు పక్కల ప్రాంతాలని కూడా గుర్తు పడుతుంది.

‘పుష్పక్’ అమెరికా ‘ఫ్యూచర్ విజన్ కంపెనీ’ ఇండియాలో కూడా తయారు చేస్తున్న తెలివైన కారు.

***

కొన్ని దశాబ్దాల క్రితం నుంచే ఫ్యూచర్ విజన్ కంపెనీ, ఎలక్ట్రిక్ కార్లు, డైవర్ లేని కార్లు తయారు చేయడం మొదలు పెట్టింది. ఒక ఐదేళ్ళుగా అవి ఇండియాకీ వచ్చాయి.

ఇది విచిత్రమైన మానవ నిర్మిత వాహనం, దీని ఒంటినిండా ‘సెన్సార్లు’ ఇంజన్ అంతా కంప్యూటర్, దాని లోని కృత్రిమమేథకీ అనుసంధానం అయివుంటుంది. మనం ఎలా కావాలంటే అలాంటిది ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసి డెలివరీ ఇస్తారు. ఆ ప్రోగ్రాం అంతా, ఆల్గోరిథమ్‌లో వుంటుంది. అది గూగుల్ GPS వ్యవస్థకి అనుసంధానం అయివుంటుంది. బేటరీ కార్లు ఎక్కవ స్పీడ్ వెళ్ళకపోయినా సిటీ ప్రయాణానికి సరిపోతాయి. ఇంధనం, అంటే పెట్రోల్‌తో నడిచేవీ వున్నాయి. అయితే ఇవి ప్రయాణించడానికి మంచి రోడ్లు, మంచి ట్రాఫిక్ సిగ్నల్స్ వుండాలి. డ్రైవర్‌కి తెలీకుండానే కారు సెన్సార్‌లతో రోడ్డు మీద గీతలు లైట్ల రంగును బట్టి వేగం, దిశ మారుస్తుంది. అల్లంత దూరాన వున్న కార్లనీ, వెనకాల ఓవర్ టేక్ చేసే కార్ల వేగాన్నీ అంచనా వేసి తప్పిస్తుంది. ఎవరైనా అడ్డం వస్తే తనని ఆపుకుంటుంది. ఆ అవరోధం దూరం నుంచే పసిగడుతుంది. అయితే డ్రైవర్ స్వంతంగా కూడా డ్రైవింగ్ చేసుకునే సదుపాయం కూడా వుంది. డ్రైవర్, లేక యజమాని మవస్తత్వం బట్టి అతను ఎక్కడకి వెళ్తున్నాడో, అతని ఆరోగ్యం, బి.పి, పల్స్, శరీర ఉష్ణోగ్రతని కూడా మానిటర్ చేస్తుంది.

తాగి వున్నప్పుడు, మనసు బాలేనప్పుడు ఆటో ఆల్గోరిథమ్‌లో డ్రైవింగ్ అని స్విచ్ నొక్కుతాడు రావ్.

ఈ రోజు ‘మూడ్’ లోనే లేడు. అందుకనే పుష్పక్ ని ‘ఆటోమాటిక్’ మోడ్ లో వుంచాడు.

***

క్లబ్ గేట్ కారుని దూరం నుంచి చూస్తూనే ఆటోమెటిక్‌గా తెరుచుకుంది. కారు కంప్యుటర్ నుంచి గేట్ కీపర్ కంప్యూటర్‌కి సందేశం ముందే వచ్చింది.

అతి నేర్పుగా కొండ మీదికి చుట్టు తిరిగి వెళ్ళే దారిలో లాఘవంగా తిరిగి దక్కన్ క్లబ్ సింహద్వారం ముందు ఆగింది కారు.

“మాస్టర్, వచ్చేసాం!” యాంత్రిక స్వరం చెప్పింది.

“ఓ.కే. గో పార్క్ యువర్‌సెల్ఫ్!” రావు దిగి లోపలికి నడిచాడు. కారు తనంట తానే వెళ్ళి క్రిందకి దిగి పార్కింగ్ స్లాట్‌లో ఖాళీది చూసుకుంది. ముందుకి వెళ్ళి రివర్స్ చేసుకుని, వార్నింగ్ సంగీతం ఇస్తూ ఆటోపార్క్ చేసుకుంది.

ఆ తర్వాత దాని లైట్లు ఆరిపోయాయి.

కాని దాని మెదడు ‘ఆల్గోరిథమ్’ పని చేస్తూనేవుంది.

***

క్లబ్‍లో కొంతమంది అతన్ని చూసి “హలో రావ్, గుడ్ ఈవెనింగ్!” అని పలకరించారు. “రా కూర్చుందాం” అన్నారు.

రావ్ పేకాడడు. అతనికి క్లబ్‌కి వచ్చి ఒంటరిగా కూర్చుని తాగటం ఇష్టం. ఒక్కొసారి ఎవరన్నా క్లోజ్ ఫ్రైండ్స్ వుంటే రాజకీయాలు, సినిమాలు గురించి కాసేపు మాట్లాడుతాడు. రెండు డ్రింక్స్ అయ్యాక మంచి బిరియానీ, పాయా లాంటివి తిని, చాక్‌లెట్ ఐస్ క్రీమ్ తింటాడు.

ఇంట్లో భార్య, తన కిట్టీ పార్టీలతో, సీరియల్స్ చూడటంలో మునిగివుంటుంది. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళే, ఎం.బి.ఏ చదువుతున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళి చదువుతున్నారు. జూబిలీహిల్స్‌లో 31వ స్ట్రీట్‌లో లోపలికి వుంది అతని బంగళా. బయటకి మామూలుగా కనిపించినా లోపల అన్ని సౌకర్యాలు వుంటాయి.

ఈ రోజు డబ్బు పోయిన విచారంలో వున్నాడు. రెండు కాదు నాలుగు దాకా సింగిల్ మాల్ట్ విస్కీ పెగ్‌లు తాగేశాడు. చాలా చికెన్, మటన్, ఫిష్, స్నాక్స్ తినేశాడు. పదకొండు గంటలకి లేచాడు. డబ్బు కోసం డబ్బు సంపాదిస్తాడతను. అదో వ్యసనం. అన్నిట్లో లాభాలు రావాలి. ఆస్తి వంద కోట్లుంటే అప్పు తొంభై కోట్లుంది. ప్రస్తుతం పది కోట్లు నష్టం అయితే, జీరో వాల్యూ తనది.

‘లేదులే, మళ్ళీ సంపాదించుకోవచ్చు’. తనకి తానే చెప్పుకుని బయటకి నడవసాగాడు.

బేరర్ ఇచ్చిన బిల్ చూసి తల పంకించి సంతకం పెట్టాడు. క్లబ్ మెంబర్‌గా ఆ ప్రివిలేజ్ వుంది. దక్కన్ క్లబ్ కొండ లాంటి ఎత్తైన ప్రదేశంలో వుంది.

క్లబ్ సింహద్వారం బయట నిలబడి, సెల్ ఫోన్‌లో నంబర్ నొక్కాడు.

“కమింగ్ మాస్టర్!” మెసేజ్ వచ్చింది.

మళ్ళీ మెరిసే నగలతో అలంకరించిన అస్పరసలా లైట్లు వెలుగుతూ ఆరుతూ, పుష్పక్ అతని ఎదురుగా వచ్చి ఆగింది.

“హలో! మాస్టర్!” అతన్ని గుర్తు పట్టింది.

రావ్ ఫింగర్ ప్రింట్ వెనక డోర్ మీద ప్యానెల్ లో వేసి నిలబడ్డాడు.

తలుపు తెరచుకుంది. “మీరు తాగివున్నారు మాస్టర్! ఆల్కహాల్ లెవెల్ 60% వుంది. బి.పి. పెరిగింది. 170/110 విశ్రాంతి తీసుకోండి. లేదా ఆటో డ్రైవ్ లోనే వెళ్ళాలి. మీరు కారు నడపలేరు.”

అతనికి కోపం వచ్చింది. ఈ కారు అనేది ఓ యంత్రం. అయినా తనకి చెబుతోంది.

“అందుకేగా నిన్ను కొన్నది! బుద్ధున్నవాడెవడూ ఇప్పుడు డ్రైవు చేయడు!” అని ముందుకు వంగి ఫింగర్ ప్రింట్ ఫ్రంట్ ప్యానెల్ మీద వేసి అరిచాడు “గో! హోమ్! ఆటో పైలట్! ఎక్కువ స్పీడ్. రాత్రేగా! 80 KM దాకా పో! ”

“మోడ్?”

మోడ్ అంటే, ఎమర్జన్సీ వచ్చినప్పడు ఏం చేయాలి, ఎలా డ్రైవ్ చేయాలి అని.

కొన్ని నెలల క్రితం కారు కొన్నప్పుడు ఈ వివరాలన్నీ వాళ్ళకి చెప్పాడు. అమ్మే షోరూం వాడు ఆప్షన్లు అడిగాడు. అనుకోని అవాంతరం వస్తే ఎలా డ్రైవ్ చేయాలి. ఆగాలా వద్దా?

ఆగాలి!

దొంగలు, దోపిడిదారులు అడ్డు వస్తే? పోలీస్‌కి మెసేజ్‌ ఇవ్వాలి.

వృద్ధులు కాని, పిల్లలు కాని అడ్డం వస్తే… ముఖ్యంగా ఎవర్ని రక్షించాలి. ఆప్షన్ అడిగారు. ఇది చాలా చిక్కు ప్రశ్న. చాలా మంది వృద్ధులు అయితే పట్టించుకోవద్దని అంటారు. కారులో వున్న ప్రయాణికుడి భద్రతే ముఖ్యం.

చాలా తక్కువ మంది మాత్రమే కారులోని వారి కంటే బయట అడ్డం వచ్చిన పిల్లల ప్రాణాలు ముఖ్యం అనే ప్రాధాన్యతని ఇస్తారు.

వారిలో కొంతమంది, ఎట్టి పరిస్థితులలో కారులోని ప్రయాణికుల భద్రతే ముఖ్యం అనే ప్రాధాన్యతని ఎన్నుకుంటారు.

“యూ ఫూల్! నేనే ముఖ్యం, నా రక్షణే ముఖ్యం.” మోడ్ సి నే సెలక్ట్ చేయి. ఏం ప్రమాదం జరిగినా సరే జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి, అండ్ నా వైఫ్ మిసెస్ రావ్‌కి కాల్ చేయి.”

 “ఓ.కే మాస్టర్. బెల్ట్ పెట్టుకోండి! నిద్రపొండి!”

“బెల్టెందుకు?” విసుక్కున్నాడు రావ్.

“అది లేకపోతే ఎయిర్ బ్యాగ్‌లు రావు. మీకు రక్షణ వుండదు. నేను కూడా ప్రయాణం మొదలు పెట్టను. YOUR SAFETY FIRST.”

బెల్ట్ క్లిక్ మంది.

ఆ తర్వాత పుష్పక్ బయలుదేరింది. జి.పి.ఎస్‌లో జూబిలీహిల్స్ రోడ్ నెంబర్ 31లో 149/A నెంబర్ బంగళాకి రూట్ ప్రత్యక్షమయింది. మ్యాప్ మాట్లాడుతోంది.

“స్టార్టింగ్. డిసెండింగ్ హిల్. కొండ దిగుతున్నాం. కుడివైపుకి, ఎడమవైపుకి. గేట్ .ఇప్పుడు SD రోడ్ .” ఇలా… చెబుతూనే వుంది.

రావ్ నిద్రలోకి జారుకున్నాడు.

***

ఆల్గోరిథమ్ మాత్రం నిద్రపోలేదు. అది గూగుల్ మ్యాప్ చూస్తూ నిర్ణయాలు తీసుకుంటూనే వుంది. దానికి కారు బయట శరీరానికి వున్నLIDAR అనే సెన్సార్ నుంచి సమాచారం వస్తోంది. LIDAR అంటే కాంతిని, ధ్వనిని 360 డిగ్రీల చుట్టూ ప్రసరింపచేసి, అవి తిరిగి పరావర్తనం చెంది వచ్చే సమయాన్ని బట్టి చుట్టూ వున్న కదిలే, కదలని, జీవ నిర్జీవ వస్తువులని కనిపెట్టి హెచ్చరిక చేసే వ్యవస్థ. కారు ముందున్న కెమెరా ట్రాఫిక్ లైట్లు బట్టి కారుని ఆపడం పోనీయడం చేస్తుంది. రోడ్డు పరిస్థితుల బట్టి కారు వేగం హెచ్చుతూ,తగ్గుతూ ఆగుతూ 31 స్ట్రీట్ జూబ్లిహిల్స్ రోడ్ లోని అతని బంగళాకి ప్రయాణిస్తోంది.

అదృష్టం. అంత ట్రాఫిక్ లేదు.

రావ్, మద్యం మత్తులో నిద్ర పట్టి ఇంకా గాఢనిద్ర లో విహరిస్తున్నాడు.

కారు జూబ్లీహిల్స్ ప్లై ఓవర్ నుంచి అలవోకగా దిగింది. జూబిలీహిల్స్ రోడ్‌లో ‘క్రూయిజ్’ వేగంతో నడుస్తోంది. దాని వెలిగి ఆరే లైట్లు, టాప్ మీద వున్న డిష్ ఏంటెన్నా చూసి అందరూ ఇది డ్రైవర్ లేని కారు అని గుర్తు పట్టగలరు. తప్పించుకుని వెళ్ళే వాహనాలు వెళ్తున్నాయి. కొన్ని దానిని వెళ్ళనిస్తున్నాయి.

***

పరంధామయ్యగారు అంత అర్ధరాత్రివేళ నిద్రపట్టక నడుస్తూ వస్తున్నారు. వయస్సు డెభ్భై సంవత్సరాల
పైనే వుంటాయి. అపర్ణ కాంప్లెక్స్ జూబిలిహిల్స్ రోడ్ 29లో ఒక చిన్న ఎపార్ట్మెంట్‌లో వుంటారు. ఆయన ఒక్కడే!

ఆయన సంతానం ముగ్గురూ విదేశాల్లోనే వున్నారు. ఒకరు ఆస్ట్రేలియా, మరొకడు అమెరికాలో, మూడోవాడు ఇంగ్లండ్‌లో. భార్య పోయింది. కొడుకుల దగ్గరకు వెళ్ళడు.

వెళ్ళినా నెల రోజులుండి తిరిగి వచ్చేస్తాడు.

సాయంత్రం ఇద్దరు ముగ్గురు స్నేహితులతో నడకా, లేదా చదరంగం ఆడుతాడు. ఆయనకి షుగర్, బీపీ, రెండూ వున్నా గుండె జబ్బు మాత్రం లేదు. తన షుగర్ తానే చూసుకుని మందులు వేసుకుంటాడు.

ఆయన ఈ రోజు ఎందుకు బయటకి వచ్చాడో ఆయనకే తెలియదు.

ఏమిటో తోచడం లేదు. ఈ మధ్య జ్ఞాపకశక్తి మందగిస్తోంది. కంటి శుక్లాలు ఆపరేషన్ చేశారు. అయినా రాత్రి వేళల కొంచెం చూపు తక్కువే.

ఏవేవో జ్ఞాపకాలు. చిన్నప్పటివీ, భార్యవీ, చనిపోయిన స్నేహితులవీ.

కొడుకుల పోరు భరించలేక న్యూరోడాక్టరుని చూశాడు. ఆయన బ్రెయిన్ స్కానింగ్ లాంటి అన్ని పరీక్షలు చేసి “ఏమీ లేదు, కాని జ్ఞాపకశక్తి పోతోంది. ఇది ఆల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి కావచ్చు. మీ అబ్బాయితో మాట్లాడతాను. డోంట్ వర్రీ! కాని ఎవరినైనా తోడు పెట్టుకోండి. మీ పేరూ, నెంబరు వివరాలు, ఫోన్ నెంబర్ లాంటివి ఎడ్రస్ రాసి జేబులో పెట్టుకోండి” అని ఆల్జీమర్స్‌కి మందులు రాసిచ్చాడు.

“నిద్ర పట్టదు డాక్టర్!”

“సరే! నిద్రమందు లైట్ డోస్ వేసుకోండి” అని రాసి ఇచ్చాడు.!”

వాటి వల్ల మత్తు వస్తోందికాని నిద్ర సరిగా పట్టడం లేదు. జ్ఞాపకశక్తి మాత్రం అలా తగ్గిపోతోంది. తగ్గిపోతూనే వుంది.

మనిషి బ్రెయిన్ మరొక కంప్యూటర్!

‘నేనెందుకు వచ్చాను?’ అనుకున్నాడు పరంధామయ్య. అసలు రాత్రి పదకొండు గంటల తర్వాత బయటకు వెళ్ళకండి! అని కొడుకు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.

“కొడుకా? అంటే ఎవరు? అతని పేరు?”

“నాకు బుద్ధి మందగించింది. ఇది జబ్బే. అల్జీమర్స్ లాంటిదే ఏమో. సుడోకు అనే పజిల్ చేయమని ఒక వృద్ధ మిత్రుడు చెప్పాడు.”

ఆయన రోడ్డు మీదకి ఎందుకు వచ్చాడో ఆయనకే తెలియని స్థితి. దానికి ఏదైనా కారణం కావచ్చు. రక్తంలో చక్కెర ప్రమాణం తగ్గిపోయి కాని, నిద్ర మందుల వల్ల కానీ, అయోమయం వచ్చి వుండవచ్చు.

రోడ్డు మధ్యగా నడవసాగాడు. ‘సూపర్ మార్కెట్ … (దాని పేరు ఏమిటి?) అక్కడికి వెళ్ళి ఏదైనా కొని తినాలి’ అనుకున్నాడు.

అదే సమయంలో పెద్ద ఆరు చక్రాల ట్రక్ హఠాత్తుగా డివైడర్ అవతలి నుంచి, వూగుతూ మితిమీరిన వేగంగా ఇటు వైపు రాసాగింది.

కంగారుగా ఆయన ఎడం వైపు పరిగెత్తాడు.

హఠాత్తుగా టైరు పేలి ఆ ట్రక్ రోడ్డు ఇవతలి వైపు వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయలేక డ్రైవర్ అవస్థ పడుతున్నాడు.

పరంధామయ్యగారు వెనక్కి పరిగెత్తి ఇంకా ఎడమవైపుకి ఆయాసపడుతూ పరుగెత్తసాగాడు.

***

ఆల్గోరిధమ్‌కి దూరాన ట్రక్ కనిపించింది. “రాంగ్ సైడ్ లో సిక్స్ వీలర్ ట్రక్ ” అని అంది. స్పీడ్ 80KM. మూడు నిమిషాల్లో “హెడ్ ఆన్ కొలిజన్” – “ఢీకొట్టడం ఖాయం” అని లెక్క వేస్తోంది.

దాని కంప్యూటర్ మెదడు అనబడే హార్డ్ డిస్క్‌లో ముడు ఆప్షన్‌లు కనిపించసాగాయి. కారుకి ఎదురుగా ట్రక్. తప్పించకపోతే ఢీ! యజమాని మరణిస్తాడు 100%. కుడి వైపు తిప్పితే డివైడర్. అవతల నుంచి రెండు కార్లు వస్తున్నాయి. అటు వెళితే ఆ కార్లు ధ్వంసమై, వాటిలో మనుషులు కనీసం ఇద్దరు. చనిపోతారు. యజమాని బతకవచ్చు. కాని 80% ఛాన్స్ మాత్రమే.

ఎడమ వైపే తిప్పి మట్టి నేల వైపు వెళితే…

దూరాన ట్రక్ పక్కనుంచి ఒక మనిషి ఆకారం పరుగెత్తుతోంది. సెన్సర్‌లు అతను వృద్ధుడు, వయస్సు 60 నుంచి 70 అంటున్నాయి. ఈ పక్క ఓల్టేజ్ హోమ్ నివాసి అయివుండచ్చు. వృద్ధుడు.అతని మరణం నష్టం లేదు. కారు అటు తిప్పితే ఆ ముసలాయన్ని ఢీ కొట్టాలి.

అతని మరణం 90% కాని తన యజమాని (మాస్టర్) బతకడానికి 80% ఛాన్స్. కేవలం రిస్క్ 20% మాత్రమే. అది కూడా తగ్గుతోంది.

ఆ మనిషిని ఢీకొని, ముదుకు వెళ్ళి ట్రక్కు వచ్చే లోపల దాన్ని దాటి ఆగచ్చు.

సెకన్లు నిమిషాలలో నిర్ణయం తీసుకోవాలి.

“మాస్టర్ స్లీపింగ్. అతని రక్షణ ముఖ్యం”

మోడ్ సి.

అర్జంట్! లెఫ్ట్‌కి తిరుగు! కారుని స్టీరింగ్‌ని ఆజ్ఞాపించింది ఆల్గోరిథమ్. అలారం మోగసాగింది. “వార్నింగ్! ఏక్సిడెంట్, ముందు మనిషి వున్నాడు!”

వెనుక సీట్లో రావ్ తృళ్ళిపడి లేచాడు. అతనికి ఏమీ తెలియడం లేదు.

మరో నిముషంలో పుష్పక్ కారు పరంధామయ్యని కనీసం అరవై కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది.

పరంధామయ్య ఎగిరి పక్కన వున్న కంకర రాళ్ళ గుట్ట మీద పడ్డాడు.

ట్రక్ వూగుతూ వూగుతూ పుష్పక్ కుడి వైపున కొంత దూరం వెళ్ళి ఆగింది.

పుష్పక్ కొంత దూరం వెళ్ళి బ్రేక్ వేసి రోడ్డు పక్క మట్టిలో ఆగింది.

రావ్ ఎగిరి పడ్డాడు. ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకుని సీటుకి అతనికి మధ్య నిండిపోయాయి.

కారు అలారం మోగి మైక్ లోంచి “మాస్టర్! మాస్టర్! ఆర్ యూ ఓ.కే? ఏక్సిడెంట్! మనిషిని కొట్టాల్సి వచ్చింది! అతన్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు అది నీ డ్యూటీ చట్టప్రకారం.”

రావ్ “ఐ యామ్ సేఫ్” అని అరిచాడు. అతికష్టం మీద బెల్ట్ తీసుకుని బయట పడటానికి ప్రయత్నం చేస్తున్నాడు.

మరో పది నిముషాల్లో ట్రక్ దగ్గర, కారు దగ్గర, పరంధామయ్య దగ్గర జనాలు గుంపులుగా జేరి చోద్యం చూడసాగారు.

కొందరు తలుపుని బలవంతాన తీసి రావ్‌ని బయటకి తీయడానికి ప్రయత్నం చేశారు. కొందరు సెల్ ఫోన్ లలో ఫోటోలు తీస్తున్నారు. మరో గంటకి గాని, ఏంబులెన్స్, పోలీసులు, జర్నలిస్టులు టి.వి కెమెరాలు అక్కడికి రాలేదు.

రావ్ ఎట్టకేలకి బయటకి వచ్చాడు.

తొలుత నిలబడి చుట్టూ జనం వంక చూశాడు.

కారు లైట్లు ఇంకా ఎర్రగా వెలిగి ఆరుతున్నాయి. ‘ఏక్సిడెంట్! మోడ్ సి. మోడ్‌ సి’ అని అరూస్తూ పుష్పక్ యాంత్రిక కారు మోగుతూనే వుంది.

జనం కొంతమంది కోపంగా రావ్‌ని తిడుతూ కొట్టబోతుంటే కొంతమంది ఆపసాగారు.

పరంధామయ్య ‘స్పాట్ డెడ్’. అంటే అక్కడే చనిపోయాడు.

***

ఇది జరిగిన చాలా నెలల తర్వాత… సికింద్రాబాద్ సెషన్ కోర్టు జడ్జి మెహతా రాత్రల్లా తల పట్టుకుని ఆలోచిస్తునే వున్నాడు.

రేపు తీర్పు ఇవ్వాలి.

ఫ్యూచర్ విజన్ కంపెనీ వెర్సస్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణా కేసులో జడ్జిమెంటు ఇవ్వాలి.

ఈ విషయం మీద మూడు కేసులు పడ్డాయి.

పుష్పక్ కారు ఢీకొని మరణించిన పరంధామయ్య కుమారులు, రావ్ మీద నష్టపరిహరం కోటి రూపాయలకి వేసిన దావా.

గవర్నమెంటు – డ్రైవర్ లేని కారు తయారు చేసిన ఫ్యూచర్ విజన్ కంపెనీ మీద వేసిన దావా. దాంట్లో మరొక ముద్దాయి రావు కూడా.

రావ్, ఫ్యూచర్ విజన్ మీద వేసిన దావా.

కేసులో వాదోపవాదాలు ఉత్కంఠభరితంగా సాగాయి.

రావ్ తరపున లాయర్ అతని తప్పేమి లేదని, అది తయారు చేసిన కంపెనీ నష్టపరిహారం చెల్లించాలి అని వాదించింది.

ప్రభుత్వం ఫ్యూచర్ విజన్ కంపెనీ మీద నిర్లక్ష్యం హత్య కేసులు, నష్టపరిహారం లాంటి అనేక కేసులు బనాయించింది.

పరంధామయ్య సంతానం, బతికున్నప్పుడు అతన్ని చూసినా, చూడకపోయినా అతన్ని చంపిన కారు యజమాని రావ్ కోటి రూపాయలు కట్టాలని వాదించారు.

కంపెనీ తరపు లాయర్ ట్రాలీ ఎఫెక్ట్ గురించి ఎంతో ఉపన్యసించాడు. ఒక అనూహ్యమైన పరిస్థితిలో కారు యజమానిని రక్షించడానికి తన ఆల్గోరిథమ్ ప్రోగ్రాం ప్రకారం పని చేసిందనీ, అది ప్రోగ్రాం చేసిన యజమానే బాధ్యుడని అన్నాడు.

మామూలుగా కూడా ప్రమాదాలు జరుగుతాయి. డ్రైవర్ లేని కంప్యూటర్ ఆల్గోరిథమ్‌తో నడిచే కార్లు నిజానికి తక్కువ ప్రమాదాలని కలగజేస్తాయి. ఇది ఒక ఊహించని ప్రమాదం. మద్యం మత్తులో ఆయన బాధ్యతగా తను డ్రైవ్ చేయకుండా ప్రోగ్రాం చేశారు. మోడ్ సి లో యజమానిని రక్షించడం ప్రాముఖ్యం. అందుకనే అది అలా చేసింది. తప్పు ఏదైనా వుంటే అది ప్రోగ్రాం చేసిన వ్యక్తిది.

ట్రాలీ ప్రాబ్లం అంటే 1950లో జుడిత్ థామస్ అనే శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించిన సిద్ధాంతం. ఇది నైతిక చర్చ. అప్పటి నుంచి నడుస్తోంది.

ఒక ట్రాలీ బ్రేకులు లేకుండా స్పీడుగా పట్టాల మీద వస్తూంటుంది. దానికి ఎదురుగా ఐదుగురు పని వాళ్ళు చూడకుండా పని చేసుకుంటున్నారు.

నీ చేతిలో ట్రాక్ మార్చే లీవర్ వుంది. అవతలి ట్రాక్ మీద ఒక మనిషే పని చేస్తున్నాడు.

ఏం చేస్తావ్? ట్రాక్ మార్చి ఒకడే చనిపోయేటట్లు చేస్తావా?

మార్చకుండా ఐదుగురు చనిపోయేటట్లు చేస్తావా?

ఈ కార్లు తయారు చేసినప్పుడు, ఇదే సిద్ధాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. తక్కువ డ్యామేజీ జరిగేటట్లుగా తయారు చేస్తున్నాము.

మోరల్ మెషిన్ అనే సర్వేలో చాలా మంది ఈ కార్లని కారులో వున్నవారి రక్షణకే ప్రాధాన్యత ఇచ్చేటట్లు చెయ్యమని చెప్పారు. ఎవరైనా అంతే.

ఏక్సిడెంట్! ఏక్సిడెంటే! అది అనుకోని సంఘటన.

చాలా అరుదైనది.

ఆ క్షణంలో ఆ ముసలాయన అక్కడ వుండటం అతని తప్పే. ఒక మానవ డ్రైవర్ నడుపుతున్నా అలాగే చేసేవాడు.

కాబట్టి కంపెనీది కానీ, ‘ఆల్గోరిథమ్’ది కాని తప్పు లేదు! ఇలా వాదన లు నడుస్తున్నాయి.

ఈ కేసు ప్రపంచం దృష్టినంతటినీ ఆకర్షిస్తోంది.

జడ్జి మోహతాకి తెల్లవారింతర్వాత కాని తీర్పు ఏం యివ్వాలో తోచలేదు.

చాలా సేపు అనేక పుస్తకాలు చదివి చదివి చివరికి రాశాడు.

“ప్రమాదం ప్రమాదమే. ఇది ఆటోమెటిక్ కారు చేసిన తప్పు కానీ, అది యజమానిని కాపాడడమనే ప్రోగ్రామ్‌లో వుంది.”

యజమాని రావ్ తప్పు కాదు. ఆయన కారుని తనని రక్షించే ప్రోగ్రాంలో పెట్టారు. డ్రైవర్ లేని కారు చేసిన కంపెనీని నమ్మాడు.

పరంధామయ్య అనే వ్యక్తి ఆ సమయంలో రోడ్డు మధ్య వుండటం అతని మతి స్థిమితం లేకనో, లేక కావాలనో కావచ్చు. అది అతని తప్పు కాదు కూడా.

ట్రక్ డ్రైవర్ టైరు పేలడం అనూహ్యమైన ప్రమాదం. దానికి ఏం చేయలేం.

పరంధామయ్యగారి కుమారులు ఆయనని ఒంటరిగా వదిలి వెళ్ళడం విదేశాల్లో వుండటం ఆయన ఆరోగ్య స్థితిని కాపాడుకోకపోవడం. వారి తప్పు. పరంధామయ్యకి మతిమరుపు, ఆల్జీమర్స్ మరియు, షుగర్ వ్యాధి వుంది కూడా. ఆ రిపోర్టులు …. చూడటమైంది.

కాబట్టి కార్లకంపెనీ, యజమాని రావ్ బాధ్యులు కారు.

వారి కుమారులకి పరిహారం మానవతా ధోరణితో కంపెనీ ఇవ్వవలసిందే. అది వారి ఇష్టం.

ప్రభుత్వం డ్రైవర్ లేని కార్లని మరింత నియంత్రణ చేసేట్లు తయారు చేయాలి. ఎందుకంటే, వీటి వల్ల ప్రమాదాలు తగ్గాయి. మద్యపానం చేసి నడిపే డ్రైవర్లు చేసే ఏక్సిడెంట్‌లు తగ్గాయి. అవి ట్రాఫిక్ నియమాలు పాటిస్తాయి. ఈ విషయం గణాంకాల ద్వారా నిరూపించబడింది.

అయితే వాటిని మన దేశ పరిస్థితుల కనుగుణంగా తయారు చేయాలి,

అంతే.

“అన్యాయం..” అరిచారు, పరంధామయ్యగారి పుత్రులు.

“ఘోరం…” అన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్.

“న్యాయం గెలిచింది” అన్నాడు రావ్.

“మేం చేసింది తప్పు కాదని తేలింది. ఒక లక్ష పరిహారం, మావనత్వ దృష్టితో … ఇస్తాం” అంది కంపెనీ.

“నో!నో! హైకోర్టుకి ఎపీల్ చేస్తాం” అన్నది ప్రభుత్వం.

“మేము కూడా…” అన్నారు పరంధామయ్య కుమారులు.

కేసు ఇంకా నడుస్తూనే వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here