ఎలైవ్ ఆర్ డెడ్

0
11

[ఆంగ్లంలో శ్రీ నిరంజన్ సిన్హా రచించిన ‘Alive or Dead’ అనే సైన్స్ ఫిక్షన్ కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

[dropcap]ఉ[/dropcap]న్నదున్నట్లుగా, నేనో విచిత్రానుభూతికి లోనయ్యాను, అతి ముఖ్యమైనదేదో పోగొట్టుకున్నట్లు. అయితే అదేదో ఖచ్చితంగా తెలీదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, అదేంటంటే, నేనెక్కడో బందీనయ్యాను. అదీ వెలుతురు, ధ్వని, వాసన – ఏదీ చొచ్చుకురావటానికి వీల్లేని చోట. ఇదో విలక్షణమైన ప్రపంచం. రంగు, ధ్వని, వాసనారహితమైన చోట; ఏ కారణం చేత, ఎవరు నన్ను బంధించి వుంటారు? నా ఊహకి అందనిది. నా స్నేహితులా? శత్రువులా? ఎవరు వాళ్ళు? ఈ నా ఆలోచనలకి అంతు లేకుండా పోతూ వుంది. ఎంత ఆలోచించినా నిర్దిష్టమైన సమాధానం దొరకక, ఏ నిర్ణయానికి రాలేక పోతున్నాను.

నా బయట ప్రపంచం గుఱించి ఆలోచించటానికి ప్రయత్నించాను. ఒక్కటొక్కటే నెమరు వేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. నా బంధువుల్ని నా స్నేహితుల్ని.. అయితే.. అయితే – ఏ ఒక్కరూ గుర్తుకు రావటం లేదు. అంతా శూన్యం. శత విధాలుగా ప్రయత్నించినా, నా పేరు గుర్తుకు రావటం లేదు. ఒక్కోసారి, తళుక్కుమని నాలో ఏదో మెరుస్తుంది. అంతే, మరుక్షణంలో అంతా శూన్యం. నా వయస్సును గుఱించిన ఆలోచన వచ్చింది. ఇరవైనాలుగు లేదా అంతకంటే తక్కువ లేదా ఎక్కువై వుండవచ్చు. ఈ విషయాలన్నీ నాకెందుకు వస్తున్నాయో తెలియడం లేదు. బహుశా నేనున్న ఈ వాతావరణం, ఈ ఒంటరితనం కావచ్చు. అసలింతకీ నేనెందుకు బంధింపబడ్డాను? నన్నెక్కడ బంధించారు? లేదా అంతరిక్షంలోకి విసిరివేయబడ్డానా? ఏమో ఏదీ తెలీకుండా ఉంది. అయితే నా ఉనికి నాకు తెలియాలి. అన్ని విషయాలు తెలిసే తీరాలి. లేకుంటే పిచ్చివాణ్ణయి పోతాను. నిజంగా నా స్థితి అతి బీభత్సంగా ఉంది.

గతం గుర్తుకు రావటం లేదు. అది మసకబారింది. ఓ పెద్ద భయంకరమైన ప్రేలుడు శబ్దమే గుర్తుకొస్తున్నది నాకు. అది, ఓ ప్రమాదానికి గురికావటం వల్ల కావచ్చు. అయితే ఇదమిత్థమని చెప్పలేను. ఆ విచిత్రమైన క్షణాన్ని గుర్తు తెచ్చుకోటానికి నా శక్తి నంతటినీ కేంద్రీకరించాను. ఊహుఁ. ఈ ప్రయత్నం నా ఆలోచనా స్రవంతికి అవరోధాన్ని కలిగిస్తున్నది. అడుగే లేని ఓ అగాధంలోకి కూరుకు పోతున్నట్టనిపించింది. ఆ ప్రేలుడు తర్వాత నేను, నా దృష్టిని కోల్పోయి చీకటి ప్రపంచంలోకి విసరి వేయబడినట్టుగా అనిపిస్తోంది. నేను మరణించానా!? అయితే మరణించిన వాడెలా ఆలోచించగలడు? మరి నే ఆలోచిస్తున్నా కదా? చాలా నీరసించి పోతున్నట్టుగా అనుభూతి. అయితే మరణించిన వాడికి ఏ అనుభూతీ ఉండదు కదా!

అవును.. ఏదో విషయం నాలో మెరుస్తున్నది. ఆ భయంకరమైన ప్రేలుడు శబ్దానికి పూర్వం నేనూ, నా ప్రియురాలు రూనా ఇద్దరం కలసి, సౌరశక్తితో నడిచే నా అందమైన కారులో ప్రయాణం చేస్తున్నాం. చాలా మొరటుగా నడిపే స్వభావం నాది. దాన్ని గుఱించే రూనా ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూవుంటుంది. అయినా ఆ మొరటు డ్రైవింగ్ తనకీ ఇష్టమే. ప్రత్యేకమైన ఆ రోజున రూనా నన్ను మరీ మరీ హెచ్చరించింది ప్రమాద పూరితమైన నా డైవింగ్ గుఱించి. అయితే ఆమె మాటల్ని ఖాతరు చేయలేదు నేను. ఆ ప్రమాదం నా డ్రైవింగ్ వల్ల కాదనేది నా నమ్మకం. కాకపోతే ఆక్సిడెంట్స్‌ని ఎవరూ ఆపలేరు. అవునా. ఒకవేళ ప్రమాదమే జరిగి వుండినట్లయితే ఖచ్చితంగా రూనా కూడా గాయపడి వుండాలి కదా. అయితే తమాషా ఏంటంటే రూనా పరిస్థితి ఏ ఒక్కరూ నాతో ప్రస్తావించలేదు. నా గుఱించి కాని, నా ఆరోగ్యం గురించి గాని కనీసం ఒక్కడయినా పట్టించుకోలేదు; నాకెవరూ బంధువులు గాని, స్నేహితులు గాని లేరన్నట్టు. అయితే ఇది సత్యం.. కాదు. నాకేదో అయ్యింది, చాలా గంభీరంగానే, అయితే అదేదో నా ఊహకి అందటం లేదు.

నేనిప్పుడు ఎక్కడ ఉన్నాను? హాస్పిటల్ బెడ్ పైనా? నా తలకు ప్లాస్టర్ వేయబడిందా, నా కళ్లు, ముఖం, చెవులు ప్లాస్టర్‍లో మూసుకుపోయాయా! లేదు అలాగ అయివుండటానికి వీల్లేదు. ప్లాస్టర్‍ని ఆ విధంగా ఎవ్వరూ చేయరు. చాలా అలసిపోతున్నాననే భావన నాకు, యాంగ్జయిటీ వల్ల, టెన్షన్ వల్ల కావచ్చు. కొన్ని సమయాల్లో ఈ లౌకిక సంబంధమైన ఆలోచనలన్నీ గతించి, నా మనోఫలకంపై అలౌకికమైన ఆలోచనలు ప్రతిఫలిస్తుంటాయి. అని నా సబ్ కాన్షస్‌మైండ్ నుంచో కాక, ఇంకో ప్రపంచం నుంచో. వాటిని నేను సరిగా గుర్తించలేకపోతున్నా.

ఓ కీకారణ్యం గుండా నడచిపోతున్నాట్లు, ఈ ప్రాచీన కాలపు కీకారణ్యంలో అడుగుపెట్టిన తొలి మానవుడిగా నాకో అనుభూతి. దట్టమైన అరణ్యం, వీటిగుండా చొచ్చుకు రావటానికి సూర్యరణాలు కూడా జంకుతాయి. చీకటి.. కటిక చీకటి. అయినా ఈ కీకారణ్యంలో, భయంకరమైన అనూహ్య క్రూరమృగమొకటేదో, చీకటి గుయ్యారంలోని ఏదో మూల నుంచి నాపైకి లంఘించబోతున్నదనే భయం నాకు.

రూపరహితమైన ఏదో ఆత్మ నా ఊహకందని విచిత్ర స్వరూపం, నా అంతరాత్మపై తన ప్రభావాన్ని చూపిస్తున్నతున్నట్లు నాకనిపిస్తూంది. నిస్సహాయత ఆవరించింది నన్ను. మరుక్షణంలోనే ఓ భయాంకరమైన తుఫాను తాకిడికి, ఈ కీకారణ్యం గురైనట్లు, అయితే ఆ పెను తుఫాను నన్ను తాకనైనా తాకలేదనే అనుభూతి తళుక్కున మెరసి, ఒకానొక మెరుపులో ఆ భయానక ఆకృతి దృశ్యమైనట్టు అనుభూతి. ఆ ఆకృతి నావెంట పడుతూంది. ఇంతలో ఆ భయానక అంధకార బంధురమైన ఆ కీకారణ్యం మటుమాయమయింది ఉన్నదున్నట్టుగా మంత్రించినట్లు.

అటు తర్వాత, మానవుడెవ్వరూ, ఇది వరకూ అడుగుపెట్టని మరుభూమి మధ్యలో నేను నిల్చొని ఉన్నట్టుగా అనుభూతి. ఆ మరుభూములలో జలపాతమై, రుధిరపూరితమైన ఓ ఇరుకైన కాలువ. జలదరించింది దేహం. అంతే. ఆ దృశ్యం మారిపోయింది. తెల్లటి మంచులో కప్పబడిపోయిన ఓ కొండపై నిల్చొని వున్నాను. జీవమున్న ప్రాణి అంటే నేనొక్కణ్ణే అక్కడ. ఆహ్లాదకరమైన ఆ వాతావరణం నన్నెంతగానో ఆకట్టుకుంది.

కనిపించినంత మేర మంచు.. తెల్లటి పాలనురగల్లే మంచు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, ఊదా మొదలైన వివిధ పుష్పాల రంగులు ఆ తెల్లటి మంచు తెరపై ప్రతిఫలిస్తున్నాయి. అయితే ఓ మొక్కయినా లేకపోవటం విచిత్రం. ఆ తెల్లటి మంచులోంచి పొడుచుకు వచ్చిన ఓ పొడుగాటి కర్ర పైన ఒదిగిన ఓ పూవు. ఏదో తెలియని గమ్మత్తయిన సువాసన వస్తోంది ఆ పూవు నుంచి. ఆ సుగంధం మత్తెక్కిస్తున్నది. నందనోద్యానం గుండా నడచి వెళ్తున్నట్టుంది నాకు.

నా అంతరాళంలో ఏదో తీవ్రమైన మార్పు క్రమంగా చోటు చేసుకుంటున్నదనేది మాత్రం నిజం. అయితే మంచో? చెడో? తెలియటం లేదు. మార్పు మాత్రం నిజం. కొంత శక్తి, కొంత సామర్థ్యం తిరిగి వస్తూన్నదని గ్రహించగలిగాను. నెమ్మదిగా.. నెమ్మదిగా నాకు నా గుర్తింపు వస్తోంది. అయితే ఈ నెర్వస్‌నెస్ ఏమిటి? ఇంత భయం దేనికి? నేనెందుకిలా వణికిపోతున్నా?

తన్ను తాను తెల్సుకోవటం అనేదే మహోన్నతమైన, పరిపూర్ణమైన జ్ఞానం. ప్రతి మానవునికీ కావల్సిందదే. దాని తర్వాత తెలుసుకోవడానికి ఏదీ వుండదు. ఆ గురిని చేరిన తర్వాత దీనికి భయపడాలి నేను?

ఇంతగా జ్ఞానోదయ మయినప్పటికీ, నేను నిస్సహాయుణ్ణే.. అనే భావనే నాది.

ఎందుకంటే.. నేను మానవుణ్ణి గనుక.

మానవులలో నేనో అంగాన్ని మాత్రమే; కనిపించే దేహమే లేదు. శరీర అంగాల్లో ప్రధానమైన అంగాన్ని నేను. అందులో సందేహం లేదు. నేను ఏడుస్తాను. కాని నా కన్నీళ్ళు భూమాతను తాకవు. నా శోకం మరో మానవుని వీనులకి చేరదు. ఇవి, నాకు, నాకు మాత్రమే పరిమితమైనవి: ఎందుకంటే.. నాజూకైన అద్దాలలో ఉంచబడిన బతికున్న మస్తిష్కాన్ని గనుక.

నేను మరణించలేదు. నన్ను వాళ్ళు పోషిస్తున్నారు కృత్రిమంగా. కారు ప్రమాదానికి గురైన తర్వాత ఇప్పటి వరకూ జీవంతో ఉన్న నా మెదడును మాత్రమే వాళ్ళు పోషిస్తున్నారు.

బ్రతికి ఉన్నానా!? ఏమో మరి.

నేను మరణించానా? అమరుడనైనానా. సరిగా తెలీదు.

ఆంగ్ల మూలం: నిరంజన్ సిన్హా

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here