అమాయకపు అమ్మే కావాలి!

11
9

[dropcap]అ[/dropcap]మ్మలందరిదీ ఒకటే కడుపుతీపి, అదే రక్ష..రక్ష
బిడ్డలుగా మనమంతా సుఖంగా బతికేద్దాం
ఆమె తిండి కోరదు, పిల్లలు తినడం తల్లి సంతోషం
మన కల్మషాన్నికక్కిపోసినా నవ్వేసి
మౌనంగా కడిగి డెట్టాల్‌తో శుభ్రపరుస్తుంది

ఫోన్లో ఎప్పుడైనా తియ్యని నాలుగు మాటలు
రెండు చీరలూ, డజన్ యాపిల్స్..ఆమెకింకేం కావాలి?
నోరుజారి మాట తూలినా, వాదించక వదిలేస్తుంది
తప్పులేకున్నా, లాపాయింట్లు తెలిసినా తలొంచుకునే
అమ్మ, మనిషికి అప్పనంగా దేవుడిచ్చిన వరం

మన స్వార్ధపు చేతల్నీ,అహంకారపు కూతల్నీ
చూసీ చూడనట్టొదిలేస్తుంది,రికార్డ్ చెయ్యదు
చదువుకున్నా నిరక్షరపక్షిలా, కల్లాకపటం లేని అమ్మ
మనందరికీ ఎప్పుడూ ఇష్ట దేవతే! ఎన్నో కవితలు రాశాం
‘ప్యారీ మా’ ప్రేమ చిత్రాలు గీసి ప్రైజ్‌లూ పొందాం

బిడ్డల కట్రాడుకు కట్టిన గోవులా, ఆర్తి చూపుల్తో
అక్కడే తిరుగుతూ,అమ్మ మనల్ని ఒదిలిపోదు
మదర్స్ డే కేక్ మిత్రులతో పంచుకుంటే, ప్లేట్లు కడిగే
ఆమె కళ్ళ ప్రేమవాహినిలో తడవడం అదృష్టం
దేవుడిచ్చిన దాసి అమ్మే! వాడుకుంటే తప్పేంలేదు

భాగస్వామితో లా అగ్రిమెంట్ల బాధ అమ్మతో లేదు
ఫ్యామిలీతో సహా నెత్తిన పడినా నొచ్చుకోదు
ఎన్ని నెప్పులున్నా నోరు విప్పి చెప్పదు
మనవల్తో ఉండాలన్నఆవిడ కోరిక తీరుద్దాం
సెలవుల్లో విశ్రాంతి విహారయాత్ర మనం చేద్దాం

తన లోక జ్ఞానమంతా మరిచిపోయి,అమ్మ
కట్టుబానిసలా మన చుట్టూనే ఉండాలి
మనం చేసే మోసవేషాలన్నీమూగమొద్దులా
గంగిగోవులా భరిస్తుంటే గొప్ప సుఖం కదూ
మనకెప్పటికీ అమాయకపు అమ్మే కావాలి

దయతో ఆమె కడుపున పుట్టినందుకు
పెద్ద చదువుల బిజీ ఉద్యోగస్తులైనందుకు
ఆమె మనకెప్పటికీ రుణపడి ఉండాలి
మనకి మర్యాద తెలుసు,తీరినప్పుడు చెబుదాం
అమ్మకి జేజేలు! అమ్మకి వందనాలు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here