అంబేద్కర్ జీవితంలో స్త్రీ మూర్తులు

1
12

[box type=’note’ fontsize=’16’] “బాబాసాహెబ్ విద్యార్థి దశ నుండి తాను చనిపోయే వరకు ఆయా దశలలో ఈ ఇద్దరు స్త్రీలు  అందించిన సహకారం మరువలేనిది” అంటూ అంబేద్కర్ జీవితంలో స్త్రీ మూర్తుల గురించి వివరిస్తున్నారు అరుణ గోగులమండ, గుమ్మడి ప్రభాకర్. [/box]

[dropcap]ప్ర[/dropcap]తీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. స్త్రీలు వెనుక ఉండిపోతూ సమాజానికి ఇరుసులై ముందుకు నడిపిస్తున్న విషయం ఎంత నిజమో, భారత దేశ కులవ్యవస్థపై రాజీలేని పోరాటం సలిపిన మార్గదర్శి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం “ముందు” మాత్రం ఒకరు కాదు, ఇద్దరు స్త్రీలు వున్నారు అన్న విషయం కూడా అంతే నిజం.  బాబాసాహెబ్ ను తనంతట తాను ఎదిగిన యుగ పురుషుడిగానే ఆయన్ని ఆరాధించే ప్రజలు ఎక్కువగా భావిస్తారు. ఆయన అసాధారణ జ్ఞాన సంపత్తి వల్ల ఆయన అనుకున్నవన్నీ సాధించగలిగారని నమ్ముతారు. కానీ అది పూర్తిగా నిజం కాదని చెప్పాలి. స్వతహాగా బాబాసాహెబ్ అనుకున్నది సాధించేవరకూ నిద్రపోని మానసిక స్థైర్యం ఉన్నవాడే ఐనా, ఆయన అనేకానేక విజయాల వెనుక ఆయన తండ్రి, అక్కలు, స్వదేశీ విదేశీ స్నేహితులు, ఆయన ఇద్దరు భార్యల యొక్క నిస్వార్ధ సేవ, త్యాగమూ ఉన్నాయన్నది ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన సత్యం. ఫిబ్రవరి 7 వ తేదీ బాబాసాహెబ్ మొదటి భార్య రమాబాయి అంబేద్కర్ జన్మదినం సందర్భంగా, ఆయన ఒక మహా సంస్కర్తగా ఎదగుతున్న ప్రస్థానంలో,ఇల్లూ పిల్లలూ పట్టకుండా పనుల్లో తలమునకలైన స్థితిలోనూ, రోజుకు ఒక్క పూట కూడా తినడానికి ఏమీలేని కడుబీదరికంలోనూ  ఆయనను పల్లెత్తు మాట అనకుండా ఆయన వెన్నంటి నిలిచిన ఆ సహనశీలి గురించీ, ఆయన జీవిత చరమాంకంలో ఆయన ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాచుకున్న సవితా గురించీ తెలుసుకోవడం అత్యవసరం.

బాబాసాహెబ్ విద్యార్థి దశ నుండి తాను చనిపోయే వరకు ఆయా దశలలో ఈ ఇద్దరు స్త్రీలు  అందించిన సహకారం మరువలేనిది. ఒకరు దాదాపు మూడు దశాబ్దాలు తన జీవితంలోని ఎత్తు-పల్లాలు, కష్ట-సుఖాలలో పాలుపంచుకొంటే మరొకరు తన జీవిత చరమాంకంలో ఒక దశాబ్దం పాటు తోడుగా ఉండి ఆయన జీవితాన్నిమరొక దశాబ్దం పాటు పొడిగించిన మహిళ. ఒకరు తన కష్టాలను, కన్నీళ్లను కొంగుచాటునే దాచుకుని దళిత-బానిస విముక్తికి  బాటలు వేయడంలో అసమాన సహకారం అందిస్తే, మరొకరు ఆ బాటలు మరింత గట్టిగా వేయడానికి తోడ్పడిన వారు. ఒకరు భారత సమాజంలోని అట్టడుగు దళిత కులానికి చెందిన వారైతే మరొకరు సవర్ణ సరస్వతి బ్రాహ్మణ కులంలో పుట్టిన వారు.వీళ్ళే ఒకరు రాము మరొకరు షారు. వీరు లేకుండా బాబాసాహెబ్ జీవితాన్ని నిర్వచించటం నేరమే అవుతుంది.

1906 లో బాబాసాహెబ్‌కు రమాబాయ్ తో వివాహం జరిగేనాటికి ఆయనకు 14 సంవత్సరాలు, రమాబాయ్ కు 9 సంవత్సరాల వయసు. వాళ్లకు వివాహం అయ్యేనాటికి బాబాసాహెబ్‌కు మెట్రిక్యులేషన్ కూడా పూర్తి కాలేదు. అంటే బాబాసాహెబ్ రమాబాయిల సాన్నిహిత్యం చిన్నవయసులోనే మొదలైందని చెప్పాలి. తండ్రి వైపు నుండి 7 తరాలు సైన్యంలో పనిచేసినప్పటికీ రమాబాయి ఇంటిలో అడుగు పెట్టేనాటికి ఆ కుటుంబం అనేక ఆర్థిక ఇబ్బందులలో ఉంది. అప్పటికే ఇద్దరు కొడుకులను చదివించే స్థోమత లేక సక్పాల్ పెద్దవాడైన బలరాంను అప్పుడే పారిశ్రామిక పునాదులు వేసుకుంటున్న బాంబేలోని ఓ మిల్లులో రోజు కూలీకి కుదిర్చాడు. అటువంటి పరిస్థితులలో బాబాసాహెబ్ 1913 లో ఎల్ఫిన్స్టోన్ కాలేజీ నుండి బిఎ పాసై బరోడా మహారాజ్ సహాయంతో ప్రపంచ ప్రసిద్ధ ఉన్నత విద్యాభ్యాస కేంద్రమైన న్యూయార్క్ నగరానికి పయనమయ్యాడు.ఒక ప్రక్క పది పన్నెండు మంది ఉన్న కుటుంబం మంది ఉన్న కుటుంబం బలరాం సంపాదనతోనే నడవాలంటే కష్టమయ్యేది. అటువంటి పరిస్థితులలో రమాబాయి స్థానంలో వేరొకరువుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ ఆమె ఆ కుటుంబాన్ని నడపడానికి తీసుకున్న బాధ్యత చరిత్ర పుటలలో లిఖించదగ్గది. బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్య అభ్యసించాడంటే అది రమాబాయి పుణ్యమే.

రమాబాయి  వీధుల్లో పేడను సేకరించి పిడకలు చేసి వాటిని అమ్మి కొంత కుటుంబ ఖర్చులకు వాడుకుని కొంత బాబాసాహెబ్‌కు పంపేదట.చూడటానికి వకీలు గారి ధర్మపత్ని, పరిస్థితి చూస్తే ఇల్లుగడవక పేడ సేకరించాల్సిన దుస్థితి అని ఇరుగుపొరుగు స్త్రీలు మాటలతో హింసించినా కిమ్మనకుండా తనపని తాను చేసుకుపొయేదట. మహాత్మ జ్యోతిబా పూలే చదువురాని భార్యకు చదువు చెప్పి విద్యావంతురాలిని చేస్తే, ఇక్కడ చదువురాని రమాబాయి భర్త ఉన్నత విద్యనభ్యసించడంలో ఎంతో తోడ్పాటునందించడం చరిత్రలో లిఖించదగ్గ పరిణామం అని చెప్పక తప్పదు. ఒక రకంగా పూలే తన భార్యకు చదువు చెప్పినట్టు రమాబాయి తన భర్తను చదివించుకుంది. ఏనాడు ఇంటి బాధలు, ఇబ్బందులు భర్తకు తెలియనీయలేదు. ఉన్న డబ్బును అతిజాగ్రత్తగా విడివిడి పొట్లాలలో దాచి, ఎంత అవసరం వచ్చినా భర్త చదువుకోసం దాచిన డబ్బును ఖర్చుకానీయకుండా ఆయనకు పంపుతూ ఆయన ఉన్నత విద్యావంతుడు కావడం వెనుక వెన్నెముకగా నిలిచింది. కన్నబిడ్డ అనారొగ్యం పాలై ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాసరే భర్తకు తెలిస్తే చదువు పూర్తికాకుండా తిరిగి వచ్చేస్తాడేమో అని ఆయనకు తెలియకుండా జాగ్రత్త పడేది.  స్త్రీ జాతి విముక్తికి పూలే ఏవిదంగా తన భార్యకు చదువు చెప్పి సావిత్రిబాయి ద్వారా సాదించుకున్నాడో అదే విధంగా రమాబాయి తన భర్త ఉన్నత విద్యనభ్యసించడంలో సహకరించి ఈ జాతి బానిస సంకెళ్లను తెంచడంలో త్రానుకూడా ఎంతో ప్రముఖమైన పాత్ర పోషించింది. ఆ తర్వాత ఉన్నత విద్య ముగించుకుని అంబేద్కర్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా రమాబాయి కష్టాలు మాత్రం తీరలేదు. బాబాసాహెబ్ అద్దె రూంలో ప్లీడరుగా వృత్తి చేపట్టినప్పటికీ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం తీరలేదు. రమాబాయి ఆరోగ్యం సరైన తిండి, వైద్యం లేక క్షీణిస్తూ ఉండేది. నలుగురు బిడ్డలు, వాళ్ళ ఆలనాపాలనా చూసుకోవడమే కష్టమైన స్థితిలో వారిద్దరి జీవితాలూ గడుస్తుండేవి. అటువంటి అతి కఠినమైన బాబాసాహెబ్ జీవిత ఎత్తు పల్లాలలో రమాబాయి జీవితం గడచిపోయింది. రమాబాయి త్యాగం ఆ తర్వాత ‘ఒక దేశ ప్రగతి ఆ దేశంలో మహిళలు సాధించిన  ప్రగతితో లెక్కిస్తానన అంబేద్కర్ మాటలకు’ పునాది అయ్యింది. దళిత కులాలలో ఈ రోజుకు చాలా మంది పురుషులు విద్యావంతులై ఉన్నత స్థానాలు అధిరోహిస్తున్నారంటే ఎక్కువ శాతం  ఆయా కుటుంబాలలోని తల్లులు, స్త్రీలు తమను తాము విస్మరించుకొని కొడుకుల అభ్యున్నతికి బాటలు వేయడమే అసలు కారణం అన్న నిజాన్ని ఈ సందర్భంగానైనా గుర్తించాలి.

బాబాసాహెబ్ అంబేద్కర్ మూడవ కొడుకు రాజారత్నం చనిపోయినప్పుడు ఆయన బాధతో అన్న మాటలివి.’మా కొడుకు మరణించాక కలిగిన దిగ్బ్రాంతి నుంచి నేను నా భార్య కోలుకున్నామని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఆ దిగ్బ్రాంతి నుంచి కోలుకోవడం అసాధ్యం. ముగ్గురు కొడుకులు ఒక కూతురితో సహా మేం మొత్తం నలుగురు పిల్లల్ని కోల్పోయాం. వారంతా ఉల్లాసంగా, అందంగా ఉండేవారు. మా ఆఖరి సంతానం రాజరత్న చాలా అద్భుతమైనవాడు. అలాంటి అద్భుతమైన పిల్లాడ్ని నేనెప్పుడూ చూడలేదు. అతను పోయిన తర్వాత నా జీవితం కలుపు మొక్కలతో నిండిపోయిన తోటలా తయారైంది’ నిజానికి బాబాసాహెబ్ తన చదువులు, ఉద్యమాలలో పడి ఇల్లు, పిల్లలను పట్టించుకునే వాడు కాదు. ఇలా ఒక తల్లి నలుగురు పిల్లలను పోగొట్టుకుని కడుపుకోతను దిగమింగింది కానీ, ఎన్నడూ బాబాసాహెబ్‌ను విమర్శించలేదు. ఒక్కొక్కసారి గంటల తరబడి గదిలో గడియ పెట్టుకుని రమాబాయి భోజనానికి పిలిచినా వచ్చేవాడు కాదు. పని ఒత్తిడిలో పడి ఆమె పదే పదే పిలుస్తుంటే, కోపమంతా ఆమెపై తిట్ల రూపంలో ప్రదర్శించేవాడు. సమాజానికి ఎంతో గొప్పవాడైన తన భర్త తనతో కాస్సేపైనా గడపట్లేదని మథనపడ్డా, నాలాంటి ఎంతో మంది దళిత తల్లుల కడుపుకోత చల్లార్చడానికే నా భర్త పోరాటం చేస్తున్నాడని సర్దిచెప్పుకుంది తప్ప,  ఎన్నడూ బాబాసాహెబ్‌ను నిందించలేదు. బాబాసాహెబ్ సైతం ఆమెపై పురుషాధిపత్యం ప్రదర్శించలేదు. భార్యను తక్కువగా చూడలేదు. ఆమెను చదివించాలని ఎంతో ప్రయత్నించేవాడు. బాబాసాహెబ్‌కు స్త్రీల పట్ల ఉన్న గౌరవ ప్రపత్తులు ఎలాంటివో ఈ సంఘటనలు తెలియజేస్తాయి. బాబాసాహెబ్ నిజానికి ‘రాము’ని (బాబాసాహెబ్ రమాబాయి ని పిలుచుకున్న ముద్దు పేరు) పట్టించుకోలేదని బాధపడ్డాడు. ఆమె మరణం తర్వాత బాబాసాహెబ్ కృంగిపోయాడనీ, చాలారోజులు వేదనతో తనగదిలోనే ఒంటరిగా గడిపేవాడని, చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి.

రమాబాయి జీవితం కేవలం కుటుంబ నిర్వాహణకు పరిమితం అయ్యిందనుకుంటే పొరపాటే.జనవరి 1928 లో, రమాబాయి అధ్యక్షతన బాంబేలో మహిళల సంఘం ఒకటి స్థాపించబడింది. 1930 లో నాసిక్‌లో జరిగిన కాలారాం టెంపుల్ ఎంట్రీ సత్యాగ్రహంలో ఐదు వందల మంది మహిళలు పాల్గొన్నారు, వీరిలో చాలామంది పురుషులతోపాటు అరెస్టయ్యి జైళ్లలో ఎన్నో అవమానాలు, బాధలు భరించిన వాళ్ళే. 1931 లో రమాబాయి ఒక విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఇలా అన్నారు “అవమానకరమైన జీవితాన్ని 100 ఏళ్ళు గడిపడం కన్నా 100 సార్లు చనిపోయినా మంచిదే. మనం మన జీవితాలను త్యాగం చేస్తే వాటి హక్కులను మన పిల్లలు అనుభవిస్తారు”. ఇలా మహిళలను స్వీయ గౌరవ పోరాటాలలో భాగస్వాములను చేసిన ఘనత రమాబాయిది.

ఫిబ్రవరి 7 వ తేదీ రమాబాయి జయంతి అయినప్పటికీ ఇక్కడ అంబేద్కర్ జీవితంలో చెరగని ముద్రవేసిన అనేక ముఖ్య ఘట్టాలకు సాక్ష్యమైన శారదా మాయ్ గురించి ప్రస్తావించటం చాలా అవసరం. ఎందుకంటే చరిత్ర చీకట్లు చెరిపేసి వాస్తవాలను దళిత సమాజానికి చెప్పాల్సిన అవసరం చాలా వుంది. 1935 లో రమాబాయి చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ దాదాపు 13 సంవత్సరాలు ఒంటరిగానే బ్రతికాడు. రమాబాయి మరణంతో  చాలా కుంగిపోయిన బాబాసాహెబ్ ఆరోగ్యం కలుపు మొక్కలు పెరిగిన తోటల తయారయ్యింది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు లాంటి అనేక వ్యాధులతో బాబాసాహెబ్ బాధపడుతుండేవాడు.వైస్రాయ్ కౌన్సిల్‌లో లేబర్ మినిస్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో  తన వ్యక్తిగత డాక్టర్ శం రావ్ ద్వారా పరిచయమైన సవిత తన జీవితంలో ఒక చెరగని ముద్రవేస్తుందని అప్పుడు అనుకోలేదు. సబిత, అంబేడ్కర్ నాయకత్వ లక్షణాలు, అతను దళిత జాతుల కోసం చేస్తున్న పోరాటాలకు ముగ్డురాలయ్యింది. అప్పటికే బుద్ధిస్టుగా ఉన్న ఆమెను వివాహమాడటానికి అంబేద్కర్ సుముఖత వ్యక్తం చేసారు. సామాజిక కొలమానాలను కాదని, ఏప్రిల్ 15, 1948 లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి బాబాసాహెబ్ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన తలపెట్టిన అనేక పోరాటాలలో శారదా కబీర్ తన తోడ్పాటునందించారు. భారత్, శ్రీలంక, బర్మా, నేపాల్ ఇలా అనేక దేశాలలో జరిగిన అనేక బౌద్ధ సమావేశాలకు, సమ్మేళనాలలో ఆయనకు తోడుగా వున్నారు. భారత రాజ్యాంగం రచనా కాలంలో, హిందూ స్త్రీలకు సమాన హక్కుల కోసం తయారుచేసిన హిందూ కోడ్ బిల్ డ్రాఫ్టింగ్‌లో అనేక సలహాలు సూచనలు చేశారు.”హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను” అని నాగపూర్‌లో బాబాసాహెబ్  బౌద్ధ ధర్మంలోకి మారినప్పుడు కూడా తాను పక్కనే వుండి ఒక ఊత కర్రలా బాబాసాహెబ్ వెంట  నడిచింది.బాబాసాహెబ్ తన జీవితంలో చేసిన మైల్ స్టోన్ వర్కంతా తన చివరి 10 సంవత్సరాలలో జరిగింది. ఈ విషయాన్నే బాబాసాహెబ్ త‌న ‘బుధ్ద అండ్ హిజ్ ధ‌మ్మా’ అన్న పుస్త‌కం ముందు మాట‌లో శార‌దా క‌బీర్ గురించి మాట్లాడుతూ ‘నేను 8-10 సంవ‌త్స‌రాలు ఎక్కువ కాలం బ్ర‌తికానంటే అది షారు పుణ్య‌మేన‌ని’ అన్నారు. శారదా మాయ్‌ను బాబాసాహెబ్ ముద్దుగా ‘షారు’ అని పిలుచుకునే వాడు.

కానీ, బాబాసాహెబ్ చనిపోయిన తర్వాత శారదా మాయ్‌ను అవమానించి, “బాబాసాహెబ్ ను చంపటానికి కాంగ్రెస్ నియమించిన కుట్రదారే శారద కబీర్” అని కొన్ని దుష్టశక్తులు చేసిన కుట్రలలో దళితులూ పావులుగా మారారు. దానిపై నెహ్రూ చేత కమీషన్ వేయించి తల్లి శారదా మాయ్ ను అవమానించారు. ఒకవేళ బాబాసాహెబ్ ను శారదా కబీర్ చంపాలనుకుంటే పెళ్లి చేసుకున్న 8 సంవత్సరాల వరకు వేచిచూడాల్సి అవసరం లేదు. ఎం.బి.బి.ఎస్. చదివి ఆనాటి లెక్కల ప్రకారం ఉన్నత కుటుంబంగా పరిగణించబడ్డ కుటుంబంలో జన్మించిన ఒక యువతి ను ఇష్టపడి పెళ్లి చేసుకుని వయసులో తన కంటే పెద్దవాడై, అనారోగ్యంతో బాధపడుతున్న బాబాసాహెబ్‌కు సేవలు చేసింది. అటువంటి గొప్ప వ్యక్తిని  చంపింది అని నెహ్రు స్టూజ్ అని అవమానించటం ఎంత వరకు సమంజసం? 2003 లో ఆమె చనిపోయే వరకు ఆమెను అతి ఘోరంగా అవమానించి అంబేడ్కర్ ఉద్యమానికి దూరం చేశారు. బాబాసాహెబ్ బ్రతికి ఉంటే వీళ్ళు చేస్తున్న పనులు చూసి నిజంగా చాలా మనోవేదనకు గురయ్యేవాడేమో. ఇలా ఒక అభ్యుదయ భావాలు గల స్త్రీ బాబాసాహెబ్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడినందుకు దక్కాల్సిన గౌరవం ఇదేనా? శారదా కబీర్ కుటుంబంలో  8 మంది తోబుట్టువుల్లో 6 గురు కులాంతర వివాహాలు చేసుకున్నారు. అంతటి అభ్యుదయభావాలున్న కుటుంబం అది.

అందువల్లనే, ఇకనైనా సవితా అంబేద్కర్‌కు గౌరవం ఇవ్వాలి. మాతా రమాబాయిని గుర్తు పెట్టుకుని దళితజాతి ఎలా తన జయంతులు వర్ధంతులు చేస్తుందో శారదా మాయ్‌కు అటువంటి గౌరవం ఇచ్చి  కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. స్త్రీల పట్ల మనుస్మృతి దుర్మార్గంగా ఉటంకించిన పోకడలను నిరసిస్తూనే, స్త్రీల బుద్ధి ప్రళయాంతకమనీ, స్త్రీలు నీచమైన ఆలోచనలు కలిగి ఉంటారనీ, కుట్రపూరితంగా వ్యవహరిస్తారనీ..ఆధారాలను బట్టి కాక, కేవలం వాళ్ళు “స్త్రీలు” కాబట్టి, ఫలానా కులంలో పుట్టారు కాబట్టి, ముద్రవేసేసే పద్ధతులు మారాలి. స్త్రీల పట్ల సమాజం అవలంబించే ద్వంద్వ విలువల ధోరణి మారనంతవరకూ,స్త్రీల సేవలనూ త్యాగాన్నీ గుర్తించి ప్రశంసించడం పురుష సమాజం నేర్చుకోనంతవరకూ, స్త్రీల అభివృద్ధి ప్రాతిపదికగా సమాజం యొక్క ప్రగతిని అంచనా వేస్తానని నొక్కి వక్కాణించిన బాబాసాహెబ్ ఆశయ సాధన అసంపూర్తిగానే మిగిలిపోతుంది అనడం అతిశయోక్తి కాదు.

(మాతా రమాబాయి జన్మదినం పురస్కరించుకొని..)

అరుణ గోగులమండ, గుమ్మడి ప్రభాకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here