అమెరికా అల్లుడు

0
11

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘అమెరికా అల్లుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]వరంగపట్నం లోని గాంధీ హైస్కూలులో కృష్ణారావుగారు సైన్సు మాస్టారు. ఆయనలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన తెలుగు సాహిత్యంలో కొన్ని అడుగులు ముందుకు వేసేరు. కర్ణాటక సంగీతంలో ఓ న మాలు తెలుసు. ధరించే దుస్తులపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మడతలు పడని లేత వర్ణం చొక్కాని, తెల్లని పాలను మురిపిస్తున్న మల్లు పంచెలో చక్కగా దోపి, పాదములను తాకుచూ పంచె కట్టుకొని, ఒకమారు నిలువుటద్దంలో పరీక్షగా చూసి, గోధుమ రంగు, లేదా గులాబీ రంగు కోటును జాగ్రత్తగా ధరిస్తారు. ఏవయినా ఫినిషింగ్ టచెస్ అవసరమయితే, మాస్టారి భార్య అనూరాధ, వాటి లోటు లేకుండా చూసుకొంటారు. ఇంక ఆయన ప్రత్యేకత ఏమిటంటారా. ఇంగ్లాండు మాజీ ప్రధానమంత్రి చేంబర్లీన్ దొరగారి లాగ, వీధిలోనికి వెళ్ళినప్పుడు మాస్టారి చేతిలో ఎల్లప్పుడూ ఒక నల్లని గొడుగు ఉంటుంది. అందులో ఏమిటుందయ్యా ప్రత్యేకత అంటారా. ఆగండి చెప్తాను. ఛత్రాన్ని చేతితో పట్టుకొని దాని చివరి భాగాన్ని పెక్కుమంది వలె భూమికి తగిలిస్తూ నడిస్తే అది మలినమయిపోతుందేమో అని భావన ఏమో మనకి తెలియదు. గొడుగును చంకను ధరిస్తే హుందాగా ఉండదని ఆయని అభిప్రాయమేమో. అదీ మనకు తెలీదు. ఆయన ఆ గొడుగు పట్టుకోడంలోనే ప్రత్యేకత మాత్రం మనకు క్షుణ్ణంగా కనిపిస్తుంది. కుడిచేతితో గొడుగును పట్టుకొని, దానిని తలక్రిందులు చేసి, వెన్నెముకకు దగ్గరగా దాన్ని చేర్చి, గొడుగు చివర భాగానికి ఆకాశదర్శనం చేయిస్తారు.. అది ప్రత్యేకత కాదంటారా. అవ్విధంబున తయారయిన మాస్టారు, బాటా వారి తోలుచెప్పులు ధరించి, అతి మెల్లగా కూనిరాగాలు తీసుకొంటూ బడి దిక్కున నడక ప్రారంభిస్తారు.

కృష్ణారావు మాస్టారును బడిలోని పిల్లలే గాక, ఊళ్ళో అందరూ గౌరవిస్తారు. ఆయన ఎల్లప్పుడూ సమయానికి పది నిమిషాలు ముందుగానే బడికి వచ్చి, హాజరు పట్టీలో సంతకం చేస్తారు. బోర్డు మీద రాస్తున్నప్పుడు, ఆయనకు అతి మెల్లగా కూనిరాగాలు తీయడం అలవాటు. పిల్లలు కూడా దాన్ని ఆస్వాదిస్తారు. అవసరమయినప్పుడు నిర్ణీతమయిన క్లాసురూములో గాక, పద్ధతిగా సైన్సు లేబ్‌లో ఎక్సపరిమెంటు చేసి విద్యార్థుల మదిలో హత్తుకుపోయినట్లు ఆయన సైన్సు పాఠాలు బోధపరుస్తారు. ఆయన ట్యూషన్ పిల్లలకు సైన్సే కాక లెక్కలు కూడా బోధపరుస్తారు. ఊళ్లోని మరొక హైస్కూలు పిల్లలు కూడా ఆయన దగ్గరకు ట్యూషన్లకు వస్తారు. గత సంవత్సరమే ఆయన ఒక కొత్తగా నిర్మించిన త్రీ బెడ్రూమ్ ఎపార్టుమెంటులో గృహప్రవేశమయ్యేరు.

కృష్ణారావు మాస్టారు తనకంటూ ఒక హోదా కల్పించుకొంటారు. ఉన్న ఇద్దరి సైన్సు మాస్టార్లలోనూ కృష్ణారావు మాస్టారే సీనియరు. అందుచేత మన మాస్టారు సైన్సు లేబ్‌ను తన అధీనంలో ఉంచుకొన్నారు. రెండో సైన్సు మాస్టారు మన మాస్టారి స్టూడెంటే. ఆ గౌరవం మూలాన్న ఆయన అది పట్టించుకోలేదు. సైన్సు లేబ్ ఎటెండెంటు అప్పారావు, రోజూ మన మాస్టారి రాక కోసం ఎదురు చూస్తూ, ఆయన స్కూలు మెయిన్ గేటు చేరగానే అది గమనించి, ఆయన చేతిలోని ఛత్రాన్ని నమ్రతతో రెండు చేతులతో అందుకొని లేబ్‌లో భద్రపరుస్తాడు. మాష్టారు నేరుగా లేబ్‌కు వెళతారు. ఆలోగా అప్పారావు వాటరు ఫిల్టరులోని నీళ్లు ఒక గ్లాసులో సేకరించి మాస్టారి టేబిలు మీద ఉంచి మూత పెడతాడు. సేద తీర్చుకొని మాస్టారు మంచినీళ్ల గ్లాసు పరిశుభ్రత పరిశీలించి నీళ్లు తాగుతారు. ఆ తరువాత అప్పారావుకు ఆ రోజు బాధ్యతలు తెలియజేస్తారు.

మాస్టారి పరిశుభ్రత విద్యార్థులకు బాగా తెలుసు. ఆయన రాకకు ముందే, క్లాస్ మోనిటర్, బోర్డు, టేబిలు, ఆయన కుర్చీ, గుడ్డతో శుభ్రపరుస్తాడు. కృష్ణారావు మాష్టారు క్లాసులోనికి పెదవులు విప్పని చిన్న చిరునవ్వుతో విద్యార్థులందరిని చూస్తూ ప్రవేశిస్తారు. ఏ విద్యార్థి అయినా జుత్తు దువ్వుకోకుండా కనిపిస్తే, “బాలాజీ, పడుకొన్న మంచం మీదనుండి లేచి నేరుగా బడికి వచ్చేవా. జుత్తు దువ్వుకోడానికి కూడా నీకు సమయం దొరకలేదా.” అని సున్నితంగా చీవాట్లు పెడతారు. కుర్రాడు సిగ్గుతో తల దించుకొని నిలబడి ఉంటే, “సరే; కూర్చో; జుత్తు దువ్వుకోకుండా ఎప్పుడూ బడికి రాకు.” అని హితవు పలుకుతారు. పిన్నా పెద్దా అందరితోను ఏ విషయమయినా సున్నితంగా మాట్లాడడం ఆయన మరో ప్రత్యేకత.

కృష్ణారావు మాస్టారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి దయానిధి, ఖర్గపూరు ఐ.ఐ.టి.లో ఇంజినీరింగు చేసి జంషెడ్పూరులో టాటా వారి ఉక్కు కర్మాగారంలో మూడు సంవత్సరాల క్రితం నెలకు ఆరంకెల జీతం మీద చేరేడు. అమ్మాయి కరుణ M.Sc. పాసయింది. ఢిల్లీలో Ph.D. చేస్తున్న పవనకుమారుతో రెండు సంవత్సరముల క్రితం వివాహమయింది. అమ్మాయి అత్తవారిది విజయవాడ. మామగారు ఆ ఊళ్ళోనే ఒక ప్రయివేటు కాలేజీ ప్రిన్సిపాలు.

దయానిధికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అతగాడికి ఇంజినీరింగు చదివిన అమ్మాయిని చేసుకోవాలని ఉంది. అది దృష్టిలో ఉంచుకొని, మాస్టారు వచ్చిన సంబంధాలను పరీక్షిస్తున్నారు. ఆస్తిపాస్తులకు గాక కుటుంబ సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చినవాటిలో ఒక సంబంధం – అమ్మాయి, ఢిల్లీలో ఇంజినీరింగు చేస్తోంది. తండ్రి ఇన్‌కమ్ టాక్సు కమీషనరు. ఆయన, అమ్మాయి వివరాలలో; ఆమె అతి గారాబంగా పెరిగిందన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాసేడు. వంట, ఇంటిపనులకు ఎల్లప్పుడూ దూరంగా ఉంచి పెంచేమని సగర్వంగా రాసేడు. మాస్టారు దంపతులకు ఆయన రాసిన పధ్ధతి నచ్చలేదు. మాస్టారు కమీషనరు గారికి మర్యాదగా సున్నితమయిన భాషలో తన అభిప్రాయం తెలియబరిచేరు. వచ్చిన మరికొన్ని సంబంధాలు కూడా మాస్టారి దంపతుల సమ్మతిని పొందలేదు.

హైదరాబాదులో వామనరావుగారని ఒక పేరున్న లాయరు ఉన్నారు. ఆయన ఎక్కువగా హై కోర్టు, సుప్రీమ్ కోర్టులలో కేసులు వాదిస్తూ ఉంటారు. ఆస్తి గణనీయంగా ఉంది. అతని భార్య కల్యాణి హైదరాబాదులోనే ఒక ప్రయివేటు కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరరు. ఆవిడ నెమ్మదస్థురాలు. లాయరుగారితో అభిప్రాయభేదాలున్నా ఎప్పుడూ వాదోపవాదాలు చేయరు. ఆ దంపతుల ఏకైక సంతానం సుగుణ. వామనరావుగారికి, కూతురి మీద అమితమయిన ప్రేమ. బాల్యంలో తండ్రి భుజాల మీదే పెరిగింది సుగుణ. అది గమనించినప్పుడు, “దాన్ని అంత ముద్దు చేస్తున్నారు; దాని పెళ్ళయితే దానితోబాటు వెళిపోతారా ఏమిటి.” అని చమత్కరించేవారు, రావుగారి శ్రీమతి కల్యాణి. ప్రస్తుతం సుగుణ హైదరాబాదులో ఇంజినీరింగు చేస్తోంది. వామనరావు దంపతులు అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ విషయంలో, వామనరావు గారిది చాలామంది తల్లిదండ్రులకన్నా భిన్నాభిప్రాయం ఉంది. ఆయన కేవలం ఇండియాలోనే పని చేస్తూ ఇండియాలోనే స్థిరపడే వరుల కోసం చూస్తున్నారు. అమెరికాలో పనిచేస్తున్న పెళ్లికొడుకుల వేటలో లేరు. నిజానికి అది ఆయన ఎజండాలో లేదు. కారణం; పిల్ల ఇండియాలో ఎక్కడ ఉన్నా, తమకు చూడాలనిపించినపుడు వీసాలు, రోజుల తరబడి ప్రయాణాలు లేకుండా వెళ్లి చూడగలరని ఆయన అభిప్రాయం. అదే కాక వామనరావుగారి తీరికలేని కార్యక్రమాలకు సుదీర్ఘమయిన విదేశీ యానాలు సరిపడవు.

అమ్మాయి సుగుణకు వామనరావుగారు సంబంధాలు చూస్తున్నారు. మూడు సంబంధాలు పెళ్లిచూపులు వరకు వచ్చేయి. పెళ్లికొడుకుల ఉద్యోగాల విషయాలలో వామనరావుగారు తన నిశ్చితాభిప్రాయాన్ని వివరంగా చెప్పడంతో ఆ సంబంధాలు ముందుకు వెళ్ళలేదు. దానితో సంబంధాలు చూస్తున్న శేషాచారిగారు మళ్ళీ ఆ పనిలో నిమగ్నులయ్యేరు. ఆయన దృష్టిలోకి కృష్ణారావు మాస్టారి అబ్బాయి దయానిధి వచ్చేడు. వివరాలు సేకరించేరు. వామనరావుగారికి తెలియజేసేరు. ఆయనకు ఆ సంబంధం బాగా నచ్చింది. అబ్బాయి పేరున్న టాటా కంపెనీలో ఇంజినీరుగా ఉన్నాడు. విదేశాలకు ట్రాన్స్‌ఫరు అయ్యే అవకాశం లేదు. తండ్రి బడిపంతులు. ఇంతటి సంబంధాన్ని కాదనరు. అందుచేత తన షరతు తప్పక అంగీకరిస్తారు. భార్య కళ్యాణితో చర్చించేరు. ఆ సందర్భంలో ఆవిడ ఇలా స్పందించేరు.

“వచ్చిన మూడు సంబంధాలను మీరు మీ కోర్టు భాషలో మాట్లాడి చెడగొట్టేరు. అంచేత దీని మీద ఆశలు పెట్టుకోకండి.” అని భర్త ఆశల మీద చన్నీళ్ళు జల్లేరు.

“నాన్సెన్స్. నేనేమిటి చేసేను చెడగొట్టడానికి.” లాయరుగారు సూటిగా అడిగేరు.

“వచ్చిన వాళ్ళతో మీ షరతులు కోర్టులో వాదించినట్లు చెబితే ఎవరు ఒప్పుకొంటారు, చెప్పండి.”

“కల్యాణీ, మన ఉద్దేశాలు ముందుగా చెప్పకపోతే, అది ఛీటింగ్ కేసవుతుంది.”

“అదిగో, మళ్ళీ మీ కోర్టు భాషలోకి వెళిపోయేరు. ఇలా అయితే పిల్ల పెళ్లి ఎప్పటికీ జరగదు.”

“మహాతల్లీ వాళ్లకు ఏ భాషలో చెప్పాలో దయచేసి చెప్పు.”

“వచ్చిన సంబంధం కుదరాలంటే మీరు ఆ షరతుల విషయం మాట్లాడకూడదు. పెళ్ళిచూపుల సమయంలో పిల్ల, అబ్బాయి, ఏకాంతంగా మాట్లాడుకొంటారు గదా. ఆ సమయంలో మన పిల్ల ఆ విషయం నచ్చచెప్పి ఒప్పించగలదు. మనం ఆ విషయం ఎత్తొద్దు.”

“ఓకే. కాని మనం వాళ్ళను మోసం చేయకూడదు. Wish her success and good luck.” అని తుదకు లాయరుగారు భార్యామణి ఆలోచనతో ఏకీభవించేరు.

కృష్ణారావు మాస్టారుకు, ఆయన తనయుడు దయానిధికి తమ అమ్మాయి సుగుణను ఆఫరు చేస్తూ వామనరావుగారు వివరంగా ఉత్తరం రాసేరు. అమ్మాయి ఫోటోను అందులో జతబరిచేరు. మాస్టారు, ఆయన శ్రీమతి అనూరాధ ఉత్తరంలోని వివరాలు క్షుణ్ణంగా చదువుకున్నారు. సంతృప్తి చెందేరు. ఫోటోలో అమ్మాయి చూడడానికి బాగుందనుకొన్నారు. దయానిధికి ఫోనులో వివరాలు తెలియజేసేరు. అంతర్జాలంలో వామనరావుగారు రాసిన ఉత్తరం, అమ్మాయి ఫోటో పంపించేరు. దయానిధి సీరియస్‌గా ఆలోచించేడు. అమ్మాయి ఇంజినీరింగు చేస్తోంది. తల్లిదండ్రులిద్దరూ బాగా చదువుకొన్నవాళ్ళు. పిల్ల ఎబోవ్ ఏవరేజ్ అని ఫోటో చూసి రేటింగ్ ఇచ్చేడు. ముందుకు వెళ్ళవచ్చనుకొన్నాడు. తల్లిదండ్రులకు తన అభిప్రాయం తెలియజేసేడు.

కథ పెళ్ళిచూపులువరకు ముందుకు సాగింది. భార్య కల్యాణిగారి సలహా మేరకు వామనరావుగారు పెళ్లిచూపులు సమయంలో తన కోరిక విషయాన్ని ప్రస్తావించలేదు. సుగుణ, దయానిధి ఏకాంతంగా వేరే గదిలో గంటకు పైగా తమ ఇష్టాయిష్టాలు చర్చించుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకొన్నారు. దేశంలోని రాజకీయాలు ఎంత దిగజారుడుగా ఉన్నాయో పెద్దలు మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో కల్యాణిగారు దేశంలో స్త్రీజాతికి జరుగుతున్న అన్యాయాలకు ఆవేదన వ్యక్తం చేసేరు. ఆ రోజు లాయరుగారికి హైకోర్టులో ఒక ఇంపార్టెంటు కేసు వాదించడానికి కోర్టులో హాజరు కావలసి ఉంది. దానికి టైము అయిపోతున్నాదని ఆయన పదే పదే వాచీ చూసుకొంటున్నారు. అల్పాహారాలు సేవించడంతో ఆ సీనుకు తెరపడింది. అతిథులు గృహోన్ముఖులయ్యేరు. దయానిధితో ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు, తన కోరిక విషయం చర్చించిందో లేదో, వామనరావుగారు సుగుణను అడిగేరు. ఆ విషయం చర్చించినట్లు, అందులో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సుగుణ చెప్పడం లాయరుగారు విని తొందరగా హైకోర్టుకు వెళ్ళేరు.

కాలచక్రం ముందుకు సాగుతోంది. వామనరావుగారి అమ్మాయి సుగుణ ఇంజినీరింగు పాసయింది. దయానిధితో జంషెడ్పూరులో దాంపత్య జీవితం ప్రారంభించింది. కొత్త కాపురానికి అవసరమయిన సాయం చేయడానికి వామనరావుగారు భార్యాసమేతంగా జంషెడ్పూరు చేరుకొన్నారు. తల్లి రాకతో వంటిల్లు ఏర్పాటుకు సుగుణకు సదుపాయమయింది. కూతురు ఇంటనున్న సదుపాయాలు చూసి దంపతులిద్దరూ సంతోషించేరు. ఏ అవసరమున్నా వెంటనే తెలియజేయమని సలహా ఇచ్చి శలవు తీసుకొన్నారు. సుగుణ ఉద్యోగ ప్రయత్నాలలో ఉంది. నూతన దంపతుల యోగక్షేమాలు తెలుసుకొంటూ నవరంగపట్నం నుండి కృష్ణారావు మాస్టారు, అనూరాధ తరచూ ఫోను చేస్తున్నారు.

ఒకమారు కృష్ణారావు మాస్టారి అమ్మాయి కరుణ సంగతి చూద్దాం. ఆమె భర్త పవనకుమార్ Ph.D. పూర్తి అయింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గైడు సహకారంతో అమెరికాలో ఉద్యోగం సంపాదించేడు. ముందుగా పవనకుమార్ అమెరికా చేరి స్థిరపడ్డాక స్వయంగా వచ్చి కరుణను అమెరికా తీసుకెళ్ళేడు. బడిపంతులు కూతురు అమెరికావాసి అయింది. మాస్టారు దంపతులు అల్లుని అభివృద్ధికి పొంగిపోయేరు. ఆ సందర్భంలో మాస్టారి భార్య అనూరాధ,

“ఏమండి, మన దయానిధి కూడా తెలివయినవాడు. వాడు కూడా అమెరికాలో ఉద్యోగం చూసుకొంటే బాగుండును.” అని మనసులోని కోరిక తెలియజేసింది.

“వాడికేమిటి తక్కువయింది. వాడూ పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. లక్షల మీద ఆర్జిస్తున్నాడు.” అని మాస్టారు తన సంతృప్తి తెలియజేసేరు.

“ఇక్కడ ఎంత పెద్ద జీతమయినా రూపాయల్లోనే ఇస్తారు కదండి. అమెరికాలో అయితే డాలర్లు ఇస్తారు. మన కోకిలమ్మగారి మనవడు చూడండి. వాడు అమెరికానుండి ఎప్పుడు వచ్చినా అక్కడనుండి రకరకాల సామాన్లు తెస్తూ ఉంటాడు. అవేవీ ఇక్కడ దొరకవుట.” అని అమాయకంగా అంది.

అంతలో పనిమనిషి బెల్లు వేయడంతో సంభాషణ ముగిసింది.

అటు మాస్టారి కొడుకు దయానిధి ఉద్యోగంలో మార్పు వచ్చింది. పూణేలోని పేరున్న ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉన్నతాధికారిగా సెలెక్ట్ అయ్యేడు. ప్రస్తుతం వస్తున్న జీతం మీద మరో లక్ష , అది కాక మరిన్ని సదుపాయాలతో కొత్త ఉద్యోగంలో జాయిను అయ్యేడు.

ఆ వార్త మాస్టారి దంపతుల ఆనందాన్ని మరికొన్ని మెట్లు మీదకు తీసుకెళ్లింది. వామనరావుగారికి అది అంత రుచించలేదు.

“డబ్బుకాశపడి నిక్షేపంలాంటి టాటా కంపెనీ ఉద్యోగం మానుకొని నిలకడలేని కంపెనీలో చేరేడు. టాటా కంపెనీలో ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. వీళ్లు ఎప్పుడు పొమ్మంటారో తెలీదు.” అని తన అభిప్రాయం భార్యకు చెప్పేరు, వామనరావుగారు.

నిజానికి ఆ ఉద్యోగంలో అల్లుడు అమెరికా వెళ్లిపోతాడేమో అన్న నిగూఢమైన ఆలోచన లాయరుగారి మదిలో ప్రవేశించింది. ఆయన భార్య కల్యాణికి అది అవగాహన అయింది.

“అలాగేమీ జరగదండి. ఒకవేళ అదే జరిగితే, పెద్ద క్వాలిఫికేషను ఉంది. ఎక్స్‌పీరియన్సు ఉంది. ఎవరయినా కళ్ళకద్దుకొని తీసుకొంటారు.” అని కళ్యాణి ధైర్యం చెప్పేరు.

“తెలివితక్కువ పని చేసేడు. ఒక్క మారు నాకు ఫోను చేసి ఉంటే సరైన సలహా ఇచ్చి ఉందును.” అని చెబుతూ తన ఆఫీసు రూములోనికి దారి తీసేరు లాయరుగారు.

స్కూళ్లకు ఎండాకాలం శలవులిచ్చేరు. కొడుకు, కోడలు ఆహ్వానం అందుకొని కృష్ణారావు మాస్టారు భార్యాసమేతంగా పూణే వెళ్ళేరు. నగరంలోని వింతలూ విశేషాలు వాళ్ళను బాగా ఆకట్టుకొన్నాయి. ముంబాయి పట్నం రెండు మూడు సార్లు సందర్శించేరు. ఆ రోజుల్లో కోర్టులకు శలవులుండడం మూలాన్న వామనరావుగారికి అమ్మాయిని చూడాలనిపించింది. తండ్రి మనసులోని ఉద్దేశం తల్లిద్వారా సుగుణకు తెలిసింది. వామనరావుగారికి అల్లుని ఆహ్వానం అందింది. పూణేలో అల్లుని ఉద్యోగ విషయంలో తన అభిప్రాయం ఎంతమాత్రం చర్చించవద్దని వామనరావుగారికి కల్యాణిగారు గట్టిగా చెప్పేరు. ముఖ్యంగా అమ్మాయి అత్తగారు, మామగారు అక్కడ ఉండడం మూలాన్న గొడవలు పడడం బాగుండదని సలహా ఇచ్చేరు. లాయరుగారికి భార్య పాఠాలు బోధపడ్డాయి. భార్యాసమేతంగా పూణే వెళ్ళేరు. ఉన్న వారం రోజులు సరదాగా గడిపేరు.

కేలెండరులో 12 పేజీలు తిరిగేయి. పవన కుమార్ రెండు వారాల శలవు మీద జన్మభూమికి బయలుదేరేడు. వారి రాకకై అటు విజయవాడలో గోవిందరాజుగారు, కోకిలమ్మ; ఇటు నవరంగపట్నంలో కృష్ణారావు గారు, అనూరాధ వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. పరిస్థితిని ఆ నలుగురు ఆలోచించుకొన్నారు. పవన కుమార్ రెండు వారాల శలవు మీద వస్తున్నాడు. అందులో నాలుగు రోజులు ప్రయాణానికే పోతాయి. అందుచేత ఏ ఊళ్ళోను నాలుగు రోజులు కన్నా వాళ్ళు ఉండలేరు. అందుచేత వాళ్ళు విజయవాడలో ఉన్న రోజుల్లో మాస్టారు, భార్య, వారితో ఉండడానికి; వాళ్ళు నవరంగపట్నంలో ఉన్న రోజుల్లో గోవిందరాజు గారు, కోకిలమ్మ వారితో ఉండడానికి నిశ్చయించుకొన్నారు. ఆ రోజుల్లో మూడు రోజులు వారందరితో కలసి గడపడానికి దయానిధి సుగుణ కూడా నిశ్చయించుకొన్నారు. వస్తున్నవారికి కూడా అది నచ్చింది. అమెరికా నుండి రకరకాల గిఫ్టులు వచ్చేయి. మాస్టారి భార్య అనూరాధకు చిరకాలపు కోరిక తీరింది. ఉన్న ఎనిమిది రోజులు అందరు కలసి సరదాగా గడిపేరు. కరుణ కోరికగా రోజుకో సినీమా చూసేరు.

నవరంగపట్నంలో ఉన్న రోజుల్లో ఒక రోజు అనూరాధ కూతురుతో మాట్లాడుతూ.

“అమ్మా, కరుణా, మీకక్కడ దొరకనివి ఏమిటో చెబితే, మీ నాన్నగారు బజారునుండి తెచ్చి అమెరికా పేకింగు చేయిస్తారు.” అని సలహా ఇచ్చేరు.

“అమ్మా, మాకు అక్కడ మనకు కావలిసినవన్నీ దొరుకుతాయి. నాన్నగారిని ఇంట్లో ఉండనీ. బజారుకు పంపించీకు.” అని చమత్కరించింది.

“అత్తగారూ, అక్కడ ఒకే స్టోరులో మనకు కావలసినవన్నీ దొరుకుతాయి. నాలుగు దుకాణాలికి వెళ్ళక్కరలేదు.” అని తాము ఎంత సుఖపడుతున్నారో అత్తగారికి చెప్పేడు, అల్లుడు.

“అమ్మా, మీకు ఇక్కడ ఎండాకాలంలో చాలా కూరలు దొరకవు. మాకు 12 నెలలు అన్ని కూరలు దొరుకుతాయి.” అని సగర్వంగా తల్లికి చెప్పింది, కూతురు.

“అందుకేనమ్మా అందరూ అమెరికా వెళ్లిపోతున్నారు.” అని కూరల కోసమే అమెరికా అందరూ వెళుతున్నట్లు అమాయకంగా అన్నారు, అనూరాధ.

అలా వారంతా సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఉంటే రోజులు దొర్లేయి.

అమెరికా దంపతులు వారి గూటికి చేరుకొన్నారు.

విధులలో దయానిధి కనబరుస్తున్న ప్రత్యేకత; అమెరికాలో ఉన్న ఆ కంపెనీ హెడ్ ఆఫీసు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించింది. అట్టి విశేష నైపుణ్యం గల ఉద్యోగి సేవలు, హెడ్ ఆఫీసులో అవసరమని అభిప్రాయపడ్డారు. దయానిధిని మేనేజరుగా ప్రొమోట్ చేసి, అమెరికాలో గల ఆస్టిన్ నగరంలోని హెడ్ ఆఫీసుకు బదిలీ చేసేరు. దయానిధి, సుగుణ ఎగిరి గంతులేసేరు. ఆ శుభవార్త నవరంగపట్నం చేరింది. మాస్టారి దంపతుల సంతోషానికి అంతు లేకపోయింది. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకు పోయేరు. పుత్రరత్నం అభివృద్ధిని కొనియాడుతూ మాస్టారు దంపతులు దయానిధికి సంతోషం నిండిన అభినందనలు అందజేసేరు. మాస్టారు, భార్యామణి ముఖానికి తన ముఖం చేరువజేసి, “అనూ, ఇప్పుడు నీ కొడుకు రూపాయలు కాదు; డాలర్లు ఆర్జిస్తాడు.” అని చమత్కరించేరు. మరునాడు పనిమనిషి ద్వారా ఎదురింటి నరసమ్మగారి కుటుంబానికి ఆ వార్త తెలిసింది. ఆవిడ తల్లి సీతమ్మ పైటకొంగును నడుముకు గట్టిగా బిగిస్తూ రోడ్డు దాటి, ఇటు వచ్చి, వంటింట్లో హుషారుగా కూనిరాగాలు తీస్తున్న అనురాధగారిని సమీపించి, “అమ్మడూ, మన దయా అమెరికా వెళిపోయేట్ట. చాలా సంతోషమమ్మా.” అని దయానిధిని కొనియాడింది. “పిన్నిగారూ, అంతా దేముడి దయ. మీ ఆశీర్వచనాలు.” అని వినయంగా స్పందించేరు అనూరాధ. “మీరు కూడా అమెరికా వెళిపోతారా.” అని అమాయకంగా అడిగిందావిడ. “ఇప్పట్లో ఆ ఆలోచనలేవీ లేవండీ.” అని పిన్నిగారికి చెప్పడంతో ఆవిడ రోడ్డు అటు దాటేరు.

దయానిధి ఉద్యోగంలో వచ్చిన శుభ పరిణామం సుగుణ తల్లికి తెలియబరుస్తూ, “మమ్మీ, ఇది తెలిస్తే డేడీ ఎలా రియాక్ట్ అవుతారో భయంగా ఉంది. నువ్వే డేడీకి చెప్పమ్మా.” అని బ్రతిమాలాడింది.

“నువ్వేమీ భయపడకు. నేనా సంగతి చూసుకొంటాను.” అని కూతురుకు ధైర్యం చెప్పేరు, కల్యాణిగారు. సుగుణ భయానికి కారణం లేకపోలేదు. పెళ్ళిచూపుల సమయంలో దయానిధితో ఏకాంతంగా మాట్లాడినప్పుడు, అల్లుని ఉద్యోగవిషయంలో లాయరుగారి కోరిక చెప్పింది. ఆ సంబంధం కూడా చెడిపోతుందేమోనన్న భయంతో, తండ్రి ఆలోచనలతో తను ఏకీభవించనని, అమెరికాలో ఉద్యోగం దొరికినా అతనితో తప్పక వస్తానని హామీ ఇచ్చింది. పెళ్ళిచూపులయ్యేక తండ్రి ‘ఆ విషయం మాట్లాడేవా’ అని అడిగితే డొంకతిరుగుడు సమాధానమిచ్చింది. లాయరుగారు పని తొందరలో దానిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయలేదు.

లాయరుగారి తీరిక సమయంలో కల్యాణిగారు నెమ్మదిగా అల్లుని ఉద్యోగపరిణామం చెప్పేరు. తోకతొక్కిన త్రాచుపాములాగ వామనరావుగారు పట్టరాని కోపంతో ఒక్కమారుగా నిలబడి, “ఏదీ నా సెల్ ఫోను. వాడు అమెరికా ఎలా వెళ్తాడో చూస్తాను.” అని గట్టిగా హుంకరించేరు. కల్యాణిగారు ఆయన రెండు భుజాలు పట్టుకొని, “Cool down. Cool down.” అని సోఫాలో కూర్చోబెట్టేరు. ఆయన చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. కల్యాణిగారు ఆయన ఎదురుగా వంగి నిలబడి, ఆయన ముఖంలోనికి చూస్తూ, “మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. Please don’t forget you are a B.P. patient. మొన్న ఆదివారంనాడే మీ B.P. కంట్రోల్ కాక హాస్పిటల్లో ఒక రోజు ఎడ్మిట్ అయ్యేరు. మీకు డాక్టరు ఇచ్చిన సలహాలు మరచిపోకండి.” అని ఆయన్ని శాంతింపజేసేరు. ఆయన ఇంకా ఆ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

“కల్యాణీ, వాడు అమెరికా వెళ్లనని అమ్మాయిదగ్గర ఒప్పుకొని, ఇప్పుడు వెళిపోతానంటే, How can I tolerate his cheating.” అని దమాయించి అడిగేరు లాయరుగారు.

“అమెరికా వెళ్లనని దయానిధి మన అమ్మాయికి ప్రామిస్ చెయ్యలేదు.” అని కల్యాణిగారు నొక్కి చెప్పేరు.

“కల్యాణీ.. మన అమ్మాయి నాకు చెప్పింది.” అని అంతకన్నా నొక్కి చెప్పేరు లాయరుగారు.

“అల్లుడి మీద కేసు పెడతారా. మీ తరఫున మన అమ్మాయి కోర్టులో సాక్ష్యం చెబుతుందనుకొంటున్నారా. లాయరుని కదా అని ఇటువంటి కేసులు పెడితే, అందరు నవ్వుకొంటారు.”

“But it is a case of cheating.”

“జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు, ‘దయానిధితో ఆ విషయం చర్చించేవా.’ అని అడిగితే అమ్మాయి మీకు ఏమిటి చెప్పింది. Try to remember.” అని లాయరుగారికి క్రాస్ క్వశ్చన్ వేసేరు, ఇంగ్లీష్ లెక్చరరుగారు.

లాయరుగారు – “ఏమిటి చెప్పింది. ఒప్పుకొన్నాడనేగా చెప్పింది.”

“Distorting the facts. ఆ విషయంలో వాళ్లిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చేమని చెప్పింది. అందులో దయానిధి ఒప్పుకున్నాడని ఎక్కడ ఉంది.”

“మీరందరూ కలసి నన్ను ఛీట్ చేసేరన్నమాట.”

 “మేమెవ్వరం మిమ్మల్ని ఛీట్ చెయ్యలేదు, మహానుభావా. ఆ సంభంధం కూడా తప్పి, పిల్ల శాశ్వతంగా మన ఇంట్లో పడి ఉంటే, మీకు సంతోషమా. చెప్పండి. పిల్లలు తప్పు చేస్తే తప్పక మందలించాలి. కాని వారి భవిషత్తు విషయంలో వాళ్ళు తీసుకొన్న సరైన నిర్ణయాన్ని మనం సమర్థించాలి. అమ్మాయి మీద మీకున్న గాఢమైన ప్రేమ, I can understand. Let us be practical in our life.” అని భర్తకు సలహా ఇచ్చేరు, శ్రీమతి.

కల్యాణిగారు సమస్యను సరైన రీతిలో పరిష్కరించేరు.

“ఇదిగో మీ సెల్ ఫోను.” అని మందహాసంతో సోఫా క్రిందనుండి తీసి రావుగారికి ఇచ్చేరు, కల్యాణిగారు.

“అంతా Pre-planned అన్నమాట. నువ్వు లాయరువయ్యుంటే, జడ్జీలనే తికమక పెట్టుందువు.” అని చమత్కరించేరు, లాయరుగారు.

వామనరావుగారు పూణే ఫోన్ చేసి, అల్లునికి అభినందనలు తెలియజేసేరు. “నువ్వు తెలివయిన దానివమ్మా, నీ ప్రాబ్లెమ్ నువ్వే సాల్వ్ చేసుకున్నావు.” అని అమ్మాయిని కొనియాడేరు. తండ్రికి క్షమాపణలు, తల్లికి అభివందనములు చెప్పుకొంది, కుమార్తె.

అమెరికా బయలుదేరే ముందు, దయానిధి, సుగుణ నాలుగు రోజులు హైదరాబాదులోను, నాలుగు రోజులు నవరంగపట్నంలోను గడిపేరు. వామనరావుగారు శ్రీమతితోబాటు అమెరికా రాడానికి వీసా ఏర్పాట్లు చేస్తానని అల్లునికి చెప్పేరు. గొల్లుమని నవ్వులు పుట్టేయి.

అమెరికా అల్లునికి వీడ్కోలు చెప్పడానికి, వామనరావుగారు శ్రీమతితో బాటు బెంగళూరు చేరుకొన్నారు. ఆ సందర్భంగా నవరంగపట్నంనుండి, కృష్ణారావు మాస్టారు కూడా శ్రీమతితోబాటు బెంగళూరు వచ్చేరు. పెద్దలు నలుగురకు పాదాభివందనం చేసి, దయానిధి, సుగుణ సెక్యూరిటీ దిశగా పయనమయ్యేరు.

అదండి, అమెరికా అల్లుడు కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here