అమెరికా డాలర్లు

0
16

[dropcap]ఒ[/dropcap]క చెట్టు మీద రెండు పిచ్చుకలు గూడు కట్టుకున్నాయి. అందులో చక్కగా కాపురం చేసుకుంటున్నాయి. పిల్లల కోసం చక్కగా ఆహారం తెచ్చిపెడతాయి. అలాంటిది ఈ రోజు పొద్దున్నే కొమ్మ మీద ఎడమొహం, పెడమొముగా కూర్చున్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి వ్వెవ్వె అని వెక్కిరించుకుంటున్నాయి. ఇలా ఒకళ్ళనొకళ్ము మూతి విరుపులు ముక్కు విరుపులు చేసుకుంటుండగా ఒక కాకి వచ్చింది.

“ఏంటర్రా అటొకరు ఇటొకరు తిరిగి కూర్చున్నారు, ఏంటి సంగతి? ఏదైనా దెబ్బలాడుకున్నారా” అడిగింది కాకి.

“చూడు కాకి మామా! ఈయన ఎంత చెప్పినా వినటంలేదు. పిల్లల్ని ప్రైవేటు బళ్ళో వేద్దామంటున్నాడు” అన్నది పిచుకమ్మ.

“మంచి ఆలోచనే కదా పిచుకమ్మా! పిల్లల భవిష్యత్తు బాగుంటుంది” అన్నది కాకి పిచుకమ్మతో.

“అది కాదు మామా! చెప్పినా వినకుండా నలుగురు పిల్లల్ని కన్నాడు. ఇంతమందిని ప్రైవేటు బళ్ళో వెయ్యాలంటే మాటలా! అందుకే సర్కారు బడిలో వేద్దామని చెప్పాను. అదీ కాక అక్కడ టెన్షన్ పెడతారంట. మన పిల్లలకు ఇంగ్లీషు మీడియం కూడా కష్టం మామా! నువ్వన్నా చెప్పు” అన్నది పిచుకమ్మ ఆవేదనగా.

వెంటనే పిచుకయ్య వెనకకు తిరిగి “అది కాదు బాబాయి. రేపు అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీషు మీడియం ఉన్న ప్రైవేటు స్కూల్లో చదవాలి కదా! ఇదేమో అన్నిటికీ భయపడుతుంది” అన్నాడు కాకితో.

కాకి వెంటనే పిచుకమ్మతో ఇలా అన్నది. “అవునమ్మా అమెరికా వెళ్లాలంటే ప్రైవేటు బడే మంచిది. టెన్షన్ ఏమీ ఉండదులే. అమెరికా వెళ్ళి డాలర్లు పంపుతారు నీ పిల్లలు..”

“అదీ అట్లా చెప్పు దానికి” కాకికి వంతపాడాడు పిచుకయ్య.

“కాకి మామా! మన పక్కింటి వాళ్ళు చెప్పారు. రాత్రింబగళ్ళు చదివిస్తారంట. అసలు ఖాళీ ఉండదంట ఆటలే ఆడియారంట. చదువు చదువు అని ఒకటే గోస పెడతారట పిల్లలు చదువులు, పరీక్షలు ర్యాంకులు అని వాటి మధ్యలోనే ఉండి నలిగి పోతారట. మనకు చెప్పుకోలేక టీచర్లకు చెప్పినా వినకపోవడంలో వాళ్ళ బాధలు వినేవాళ్ళు లేక నరకం చూస్తారట. అలాంటి చదువులు, అమెరికా డాలర్లు మాకు వద్దు. ప్రభుత్వ బడిలోనే వేస్తాం” అన్నది పిచుకమ్మ నిశ్చయంగా.

పిచుకయ్యకు కళ్ళు తెరుచుకున్నాయి. “ఇన్ని బాధలు పిల్లలకు వద్దు, నేను నీ బాటే” అని పిచుకయ్య పిచుకమ్మతో అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here